కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి!’

‘నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి!’

‘నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి!’

“ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నా[ను].”​—⁠యోహాను 16:​33.

ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించబోతుండగా, మోషే వారితో ఇలా అన్నాడు: “నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుడి. భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే.” ఆ తర్వాత మోషే, ఇశ్రాయేలీయులను కనానులోకి నడిపించవలసిన యెహోషువను పిలిచి, ధైర్యంగా ఉండమంటూ ఆయనకు నేరుగా ఉపదేశించాడు. (ద్వితీయోపదేశకాండము 31:​5-7) ఆ తర్వాత, యెహోవాయే స్వయంగా యెహోషువను ఇలా ప్రోత్సహించాడు: ‘నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరముగలిగి, బహు ధైర్యముగానుండుము.’ (యెహోషువ 1:​6, 7, 9) అవి సమయోచితమైన మాటలు. యొర్దానుకు ఆవలి వైపునున్న శక్తివంతులైన శత్రువులను ఎదుర్కోవడానికి ఇశ్రాయేలీయులకు ధైర్యం అవసరం.

2 నేడు, నిజ క్రైస్తవులు వాగ్దానం చేయబడిన నూతన లోకంలోకి త్వరలోనే ప్రవేశించబోతున్నారు, యెహోషువలాగే వారు ధైర్యంగా ఉండాలి. (2 పేతురు 3:13; ప్రకటన 7:​14) అయితే మన పరిస్థితికి, యెహోషువ పరిస్థితికి తేడా ఉంది. యెహోషువ కత్తులతో ఈటెలతో యుద్ధం చేశాడు. మనం ఆధ్యాత్మిక యుద్ధం చేస్తాము, అక్షరార్థమైన ఆయుధాలను ఎన్నడూ చేపట్టము. (యెషయా 2:2-4; ఎఫెసీయులు 6:​11-17) అంతేగాక, యెహోషువ వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఎన్నో భయంకరమైన యుద్ధాలు చేయవలసి వచ్చింది. కానీ మనం అత్యంత భయంకరమైన యుద్ధాలను ఇప్పుడే అంటే నూతన లోకంలోకి ప్రవేశించక ముందే చేస్తాము. ధైర్యం అవసరమయ్యే కొన్ని పరిస్థితులను మనం పరిశీలిద్దాం.

మనమెందుకు పోరాడాలి?

3 అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.” (1 యోహాను 5:​19) ఆ మాటలు, క్రైస్తవులు తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎందుకు పోరాడవలసి ఉందనేదానికి ఒక ప్రాథమిక కారణాన్ని చూపిస్తాయి. ఒక క్రైస్తవుడు తన యథార్థతను కాపాడుకుంటే అది అపవాదియైన సాతానుకు కొంతమేరకు పరాజయం లాంటిదే. కాబట్టి, సాతాను విశ్వసనీయులైన క్రైస్తవులను భయపెడుతూ వారిని మ్రింగడానికి ప్రయత్నిస్తూ “గర్జించు సింహమువలె” ప్రవర్తిస్తాడు. (1 పేతురు 5:⁠8) వాస్తవానికి, అతడు అభిషిక్త క్రైస్తవులతో, వారి సహవాసులతో యుద్ధం చేస్తాడు. (ప్రకటన 12:​17) ఈ యుద్ధంలో, తెలిసో తెలియకో తన లక్ష్యాలను నెరవేర్చే వారిని సాతాను ఉపయోగించుకుంటాడు. సాతానుకూ అతని ప్రతినిధులందరికీ వ్యతిరేకంగా స్థిరంగా నిలబడడానికి ధైర్యం అవసరం.

4 సాతాను, అతని ప్రతినిధులు సువార్తను తీవ్రంగా వ్యతిరేకిస్తారని యేసుకు తెలుసు గనుకనే ఆయన తన అనుచరులను ఇలా హెచ్చరించాడు: “జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.” (మత్తయి 24:⁠9) ఆ మాటలు మొదటి శతాబ్దంలో నిజమని నిరూపించబడ్డాయి, నేడు కూడా నిజమని నిరూపించబడుతున్నాయి. వాస్తవానికి, ఆధునిక దిన యెహోవాసాక్షుల్లో కొంతమంది అనుభవించిన హింస చరిత్రలో మునుపెన్నడూ సంభవించనంతటి తీవ్రమైనది. అయినప్పటికీ అలాంటి ఒత్తిడి సమయంలో నిజ క్రైస్తవులు ధైర్యంగా ఉన్నారు. “భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును” అని వాళ్ళకు తెలుసు, వాళ్ళు ఉరిలో చిక్కుకోవడానికి ఇష్టపడరు.​—⁠సామెతలు 29:​25.

5 హింసించబడుతున్నప్పుడు మాత్రమే కాక మనకు ధైర్యం అవసరమయ్యే ఇతర సవాళ్ళు కూడా ఉన్నాయి. కొంతమందికి, అపరిచితులతో సువార్త గురించి మాట్లాడడమే ఒక సవాలు. దేశానికి లేదా పతాకానికి తమ భక్తిని సూచిస్తూ ప్రతిజ్ఞ చేయమని పిలువబడినప్పుడు కొంతమంది స్కూలుకువెళ్ళే పిల్లల ధైర్యం పరీక్షించబడుతుంది. అలాంటి ప్రతిజ్ఞ వాస్తవానికి మతసంబంధమైనది కాబట్టి క్రైస్తవ పిల్లలు దేవునికి సంతోషం కలిగించే విధంగా చర్యతీసుకునేందుకు ధైర్యంగా తీర్మానించుకున్నారు, వారి చక్కని ప్రవర్తన ఎంతో ఆనందానికి కారణమైంది.

6 వ్యతిరేకులు దేవుని సేవకుల గురించి చెడు వార్తలు వ్యాప్తి చేసేలా ప్రసార మాధ్యమాలను ప్రభావితం చేసినప్పుడు లేదా “కట్టడవలన కీడు” కల్పిస్తూ సత్యారాధనను నిర్బంధించడానికి ప్రయత్నించినప్పుడు కూడా మనకు ధైర్యం అవసరం. (కీర్తన 94:​20) ఉదాహరణకు వార్తాపత్రికలు, రేడియోలు, టీవీలు యెహోవాసాక్షుల గురించి తప్పుడు సమాచారాన్ని లేదా పచ్చి అబద్ధాలను ప్రచారం చేసినప్పుడు మనమెలా భావించాలి? మనం దిగ్భ్రాంతి చెందాలా? అవసరం లేదు. అలాంటివి జరుగుతాయని మనకు తెలుసు. (కీర్తన 109:⁠2) ప్రచురించబడిన అబద్ధాలను, తప్పుడు సమాచారాన్ని కొంతమంది విశ్వసించినప్పుడు మనం ఆశ్చర్యపోము ఎందుకంటే, “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును.” (సామెతలు 14:​15) అయినప్పటికీ విశ్వసనీయులైన క్రైస్తవులు తమ సహోదరుల గురించి చేయబడే ప్రతి వ్యాఖ్యానాన్ని విశ్వసించరు, చెడు ప్రచారం తాము క్రైస్తవ కూటాలకు వెళ్ళకుండా ఉండేలా, పరిచర్యలో మందగించేలా, లేదా విశ్వాసంలో బలహీనమయ్యేలా చేసేందుకు వారెంతమాత్రం అనుమతించరు. అందుకు భిన్నంగా, వారు ‘ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులైయుండి అన్ని స్థితులలో తమ్మును తామే మెప్పించుకొంటారు, [వ్యతిరేకుల అభిప్రాయం ప్రకారం] మోసగాండ్రైనట్లుండియు [వాస్తవానికి] సత్యవంతులు.’​—⁠2 కొరింథీయులు 6:​4, 8-10.

7 తిమోతికి వ్రాస్తూ పౌలు ఇలా చెప్పాడు: ‘దేవుడు మనకు శక్తిగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు. కాబట్టి మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి సిగ్గుపడవద్దు.’ (2 తిమోతి 1:7, 8; మార్కు 8:​38) ఆ మాటలను చదివిన మనం, వ్యక్తిగతంగా ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను నా విశ్వాసాన్ని బట్టి సిగ్గుపడుతున్నానా, లేక ధైర్యంగా ఉన్నానా? నేను ఉద్యోగం చేసే స్థలంలో (లేదా నేను చదువుకునే స్కూల్లో) నేనొక యెహోవాసాక్షినని నా చుట్టూ ఉన్నవారికి తెలియనిస్తానా, లేక ఆ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తానా? ఇతరుల నుండి భిన్నంగా ఉండడానికి నేను సిగ్గుపడుతున్నానా, లేక యెహోవాతో నాకున్న సంబంధం కారణంగా అందరికంటే భిన్నంగా ఉండడానికి నేను గర్విస్తున్నానా?’ ఒక వ్యక్తి సువార్త ప్రకటించడం గురించి గానీ లేక అందరికి భిన్నమైన స్థానాన్ని వహించడం గురించి గానీ ప్రతికూల భావాలతో బాధపడుతుంటే, “నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుడి” అని యెహోవా యెహోషువకిచ్చిన ఉపదేశాన్ని ఆయన గుర్తుంచుకోవాలి. మన తోటి ఉద్యోగుల లేక మన తోటి విద్యార్థుల అభిప్రాయం కాదుగానీ, యెహోవా యేసుక్రీస్తుల దృక్కోణం ప్రాముఖ్యమైనదని మనమెన్నడూ మరచిపోకూడదు.​—⁠గలతీయులు 1:​10.

ధైర్యాన్నెలా పెంపొందించుకోవచ్చు?

8 ఈ కష్టకాలాల్లో మన యథార్థతను కాపాడుకోవడానికి మనకు సహాయం చేసే ధైర్యాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు? తొలి క్రైస్తవులు ధైర్యాన్ని ఎలా పెంపొందించుకున్నారు? యేసు నామమున ప్రకటించవద్దని యెరూషలేములోని ప్రధాన యాజకులు పెద్దలు, పేతురుకు యోహానుకు చెప్పినప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. శిష్యులు దానికి నిరాకరించడంతో వారిని బెదిరించి విడుదల చేశారు. ఆ తర్వాత వారు సహోదరులను తిరిగి కలుసుకొని, అందరూ కలిసి ఇలా ప్రార్థన చేశారు: “ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి, . . . నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.” (అపొస్తలుల కార్యములు 4:​13-30) దానికి జవాబుగా యెహోవా వారిని పరిశుద్ధాత్మతో బలపరిచాడు, ఆ తర్వాత యూదామత నాయకులు ఒక వాస్తవమని అంగీకరించినట్లుగా, వారు తమ బోధతో ‘యెరూషలేమును నింపారు.’​—⁠అపొస్తలుల కార్యములు 5:​28.

9 ఆ సందర్భంలో ఏమి జరిగిందో మనం విశ్లేషించుకుందాము. యూదామత నాయకులు శిష్యులను బెదిరించినప్పుడు, వారు ఒత్తిడిని బట్టి ప్రకటించడం మానేయాలని ఆలోచించలేదు. బదులుగా ప్రకటిస్తూ ఉండడానికి కావలసిన ధైర్యం కోసం వారు ప్రార్థించారు. ఆ తర్వాత వారు తమ ప్రార్థనకు అనుగుణంగా చర్య తీసుకున్నారు, యెహోవా వారిని తన ఆత్మతో బలపరిచాడు. వారి అనుభవం, కొన్ని సంవత్సరాల తర్వాత మరో సందర్భంలో, “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని పౌలు వ్రాసిన మాటలు, క్రైస్తవులు హింసించబడినప్పుడు వారికి వర్తిస్తాయని చూపిస్తోంది.​—⁠ఫిలిప్పీయులు 4:​13.

10 అయితే ఒక వ్యక్తి స్వతహాగా చాలా బిడియస్థుడనుకోండి అప్పుడెలా? అయినప్పటికీ ఆయన హింసల సమయంలో ధైర్యంగా యెహోవా సేవ చేయగలడా? తప్పకుండా! యెహోవా యిర్మీయాను ప్రవక్తగా నియమించినప్పుడు ఆయనెలా ప్రతిస్పందించాడో గుర్తు తెచ్చుకోండి. ఆ యౌవనస్థుడు, “అయ్యో నేను బాలుడనే” అన్నాడు. ఆయన తాను అసమర్థుడనని భావించాడని స్పష్టమవుతోంది. అయినప్పటికీ యెహోవా, “నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను” అని ఆయనను ప్రోత్సహించాడు. (యిర్మీయా 1:​6-10) యిర్మీయాకు యెహోవాపై నమ్మకముంది ఫలితంగా, యెహోవా ఇచ్చిన బలంతో ఆయన సంకోచాన్ని వదిలించుకొని ఇశ్రాయేలులో అసాధారణ ధైర్యంగల సాక్షి అయ్యాడు.

11 నేడు అభిషిక్త క్రైస్తవులకు యిర్మీయాకున్నటువంటి నియామకమే ఉంది, వారు “వేరే గొఱ్ఱెల”కు చెందిన “గొప్పసమూహము” ఇచ్చే మద్దతుతో, ఉదాసీనత, అపహాస్యం, హింస ఎదురవుతున్నప్పటికీ యెహోవా సంకల్పాలను ప్రకటించడంలో కొనసాగుతున్నారు. (యోహాను 10:​16; ప్రకటన 7:9) “భయపడకుము,” అని యెహోవా యిర్మీయాకు చెప్పిన మాటల నుండి వారు ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. తమకు ఈ నియామకాన్ని దేవుడిచ్చాడని, తాము ఆయన సందేశాన్ని ప్రకటిస్తున్నామని వారు ఎన్నడూ మరచిపోరు.​—⁠2 కొరింథీయులు 2:​17.

అనుకరించదగిన ధైర్యవంతుల మాదిరి

12 యిర్మీయాలాగే ధైర్యంగా ప్రవర్తించిన ఇతరుల మాదిరి గురించి ధ్యానించడం, ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి మనం చేసే ప్రయత్నాల్లో మనకు సహాయపడగలదు. (కీర్తన 77:​12) ఉదాహరణకు, మనం యేసు పరిచర్యను పరిశీలిస్తుండగా ఆయన సాతానుచే శోధించబడినప్పుడు, యూదామత నాయకుల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పుడు ఆయన చూపించిన ధైర్యాన్ని మనం ప్రశంసిస్తాము. (లూకా 4:1-13; 20:​19-47) యెహోవా ఇచ్చిన బలంతో యేసు నిశ్చలంగా ఉన్నాడు, ఆయన తన మరణానికి కొంత సమయం ముందు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నా[ను].” (యోహాను 16:33; 17:​16) యేసు శిష్యులు ఆయన మాదిరిని అనుకరిస్తే వారు కూడా విజయం సాధిస్తారు. (1 యోహాను 2:​5, 6; ప్రకటన 2:7, 11, 17, 26, 27) కానీ వారు ‘ధైర్యము తెచ్చుకోవాలి.’

13 యేసు మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాత పౌలు, సీల ఫిలిప్పీలోని చెరసాలలో వేయబడ్డారు. ఆ తర్వాత పౌలు, “మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచి” ఉండమని ఫిలిప్పీయుల సంఘాన్ని ప్రోత్సహించాడు. ఈ విషయంలో వారిని బలపర్చడానికి పౌలు, ‘అట్లు [క్రైస్తవులు హింసించబడడం, వారిని హింసించువారికి] నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయైయున్నది. ఇది దేవునివలన కలుగునదే. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను’ అని చెప్పాడు.​—⁠ఫిలిప్పీయులు 1:​27-30.

14 పౌలు ఫిలిప్పీలోని సంఘానికి వ్రాసే సమయానికి ఆయన మళ్ళీ చెరసాలలో ఉన్నాడు, అయితే ఈసారి రోములో ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఇతరులకు ధైర్యంగా ప్రకటించడం కొనసాగించాడు. దాని ఫలితం? ఆయనిలా వ్రాశాడు: “నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారి కందరికిని తక్కినవారి కందరికిని స్పష్టమాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి.”​—⁠ఫిలిప్పీయులు 1:​13, 14.

15 పౌలు మాదిరి మనల్ని ప్రోత్సహిస్తుంది. నిరంకుశ లేదా మతనాయక పరిపాలనల క్రిందనున్న దేశాల్లో హింసను సహించిన ఆధునిక దిన క్రైస్తవుల చక్కని మాదిరులు కూడా మనల్ని ప్రోత్సహిస్తాయి. వీరిలో అనేకుల జీవిత కథలు కావలికోట, తేజరిల్లు!, యెహోవాసాక్షుల వార్షిక పుస్తకములు (ఆంగ్లం) మొదలైనవాటిలో నివేదించబడ్డాయి. మీరు ఆ వృత్తాంతాలను చదువుతుండగా, అక్కడ చెప్పబడుతున్న వ్యక్తులు మనవంటి సామాన్య మానవులేనని గుర్తుంచుకోండి; కానీ వారు కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యెహోవా వారికి బలాధిక్యమును అనుగ్రహించడంతో వారు సహించగలిగారు. పరిస్థితులను బట్టి అవసరమైతే ఆయన మనకు కూడా అలాగే అనుగ్రహిస్తాడని మనం నిశ్చయతతో ఉండవచ్చు.

మనం ధైర్యంగా నిలబడడం యెహోవాకు సంతోషాన్నిస్తుంది, ఘనతను తెస్తుంది

16 ఒక వ్యక్తి సత్యం కోసం, నీతి కోసం స్థిరంగా నిలబడితే, అది ధైర్యవంతమైన చర్యే. లోలోపల భయపడుతూ కూడా అలా చేస్తే, అది మరింత ధైర్యవంతమైన చర్య అవుతుంది. వాస్తవానికి, ఏ క్రైస్తవుడైనా తాను నిజంగా యెహోవా చిత్తాన్ని చేయాలనుకుంటే, నమ్మకంగా ఉండాలని నిశ్చయించుకుంటే, ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడుతుంటే, తన వంటి అసంఖ్యాకమైన వ్యక్తులను యెహోవా గతంలో బలపరిచాడని ఎప్పుడూ గుర్తుంచుకుంటే ఆయన ధైర్యంగా ఉండగలడు. అంతేగాక, మనం ధైర్యంగా ఉండడం, యెహోవాకు సంతోషాన్ని కలిగిస్తుందనీ ఆయనకు ఘనతను తెస్తుందనీ గ్రహించినప్పుడు, మనం బలహీనం కాకూడదని మరింతగా నిశ్చయించుకుంటాము. మనం ఆయనను ప్రగాఢంగా ప్రేమిస్తాము కాబట్టి అపహాస్యాన్ని లేదా అంతకంటే ఘోరమైనదాన్ని సహించడానికి సిద్ధపడతాము.​—⁠1 యోహాను 2:​5, 6; 4:18.

17 మనం మన విశ్వాసం కోసం బాధలు అనుభవిస్తున్నప్పుడు, మనమేదో తప్పు చేశామని దాని భావం కాదని ఎన్నడూ మరచిపోకూడదు. (1 పేతురు 3:​17) మనం యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని సమర్థిస్తున్నందుకు, మంచి చేస్తున్నందుకు, లోకంలో భాగమై ఉండనందుకు బాధలు అనుభవిస్తున్నాము. ఈ విషయంలో, అపొస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు: “మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును.” పేతురు ఇంకా ఇలా అన్నాడు: “దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.” (1 పేతురు 2:20; 4:​19) అవును మన విశ్వాసం, ప్రేమగల మన దేవుడైన యెహోవాకు సంతోషాన్ని కలిగిస్తుంది, అది ఆయనకు ఘనతను తెస్తుంది. ధైర్యంగా ఉండడానికి ఎంత శక్తివంతమైన కారణమో కదా!

అధికారులతో మాట్లాడడం

18 యేసు తన అనుచరులు హింసించబడతారని వారికి చెప్పినప్పుడు ఆయన ఇలా కూడా చెప్పాడు: ‘మనుష్యులు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.’ (మత్తయి 10:​17, 18) అబద్ధ ఆరోపణల మూలంగా న్యాయమూర్తి ఎదుటో ఒక పరిపాలకుడి ఎదుటో నిలబడడానికి ధైర్యం అవసరం. అయినప్పటికీ అలాంటి సందర్భాలను మనం ఆ వ్యక్తులకు సాక్ష్యమివ్వడానికి ఉపయోగించుకున్నప్పుడు, మనం ఒక కష్టతరమైన పరిస్థితిని, ప్రాముఖ్యమైనదొకటి సాధించడానికి అవకాశంగా మార్చుకుంటున్నాము. తత్ఫలితంగా, మనం మనకు తీర్పు తీరుస్తున్న వారికి రెండవ కీర్తనలో వ్రాయబడివున్న యెహోవా యొక్క ఈ మాటలను చెబుతాము: “కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి.” (కీర్తన 2:​10, 11) కోర్టుల్లో యెహోవాసాక్షులపై అబద్ధ ఆరోపణలు చేయబడినప్పుడు, తరచూ న్యాయమూర్తులు ఆరాధనా స్వేచ్ఛకు మద్దతునిచ్చారు, దానికి మనం కృతజ్ఞులం. అయితే, కొంతమంది న్యాయమూర్తులు వ్యతిరేకులచేత ప్రభావితులయ్యారు. అలాంటి వారికి, “బోధనొందుడి” అని లేఖనం చెపుతోంది.

19 అత్యున్నతమైన న్యాయం యెహోవా దేవునిదేనని న్యాయమూర్తులు తెలుసుకోవాలి. న్యాయమూర్తులతో సహా మానవులందరూ యెహోవా దేవునికి, యేసుక్రీస్తుకు జవాబుదారులని వారు గుర్తుంచుకోవాలి. (రోమీయులు 14:​10) ఇక మన విషయానికొస్తే, మానవ న్యాయమూర్తుల చేతుల్లో మనకు న్యాయం జరిగినా జరగకపోయినా, యెహోవా మనకు మద్దతునిస్తాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండడానికి ప్రతి కారణం ఉంది. “ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు” అని బైబిలు చెబుతోంది.​—⁠కీర్తన 2:12.

20 కొండమీది ప్రసంగంలో యేసు ఇలా అన్నాడు: “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.” (మత్తయి 5:​11, 12) నిజమే హింస ఆహ్లాదకరమైనదేమీ కాదు గానీ ప్రచార మాధ్యమాలు వేసే అపనిందలతో సహా హింస ఉన్నప్పటికీ మనం స్థిరంగా నిలబడడం, ఆనందించడానికి కారణం. మనం స్థిరంగా నిలబడడమంటే, మనం యెహోవాకు సంతోషం కలిగిస్తున్నట్లే, మనం ప్రతిఫలాన్ని పొందుతాము. మనం ధైర్యంగా నిలబడడం, మనకు నిజమైన విశ్వాసం ఉందని చూపిస్తుంది, దేవుని ఆమోదాన్ని మనకు హామీ ఇస్తుంది. వాస్తవానికి, మనకు యెహోవాపై సంపూర్ణ నమ్మకం ఉందని అది చూపిస్తుంది. తర్వాతి ఆర్టికల్‌ చూపిస్తున్నట్లుగా, అలాంటి నమ్మకం ఒక క్రైస్తవుడికి ప్రాముఖ్యం.

మీరేమి నేర్చుకున్నారు?

• నేడు ఏ పరిస్థితుల్లో మనకు ధైర్యం అవసరం?

• మనం ధైర్యాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?

• ధైర్యం విషయంలో చక్కని మాదిరి ఉంచినవారిలో కొందరు ఎవరు?

• మనం ధైర్యంతో చర్య తీసుకోవాలని ఎందుకు కోరుకుంటాము?

[అధ్యయన ప్రశ్నలు]

1. కనానులో ఇశ్రాయేలీయుల కోసం వేచివున్నదాని దృష్ట్యా, వారు ఏ ప్రోత్సాహాన్ని అందుకున్నారు?

2. నేడు మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, మనకేమి అవసరం?

3. మన ముఖ్య వ్యతిరేకి గురించి బైబిలు ఏమి వెల్లడిచేస్తోంది?

4. యేసు ఏ హెచ్చరికనిచ్చాడు, అయితే నిజ క్రైస్తవులు ఏ లక్షణాన్ని చూపించారు?

5, 6. (ఎ) ఏ పరిస్థితుల్లో మనకు ధైర్యం అవసరం? (బి) విశ్వసనీయులైన క్రైస్తవులు తమ ధైర్యం పరీక్షించబడినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తారు?

7. చొచ్చుకుపోయే ఏ ప్రశ్నలు వ్యక్తిగతంగా వేసుకోవాలి?

8, 9. (ఎ) ఒక సందర్భంలో, తొలి క్రైస్తవుల ధైర్యం ఎలా పరీక్షించబడింది? (బి) బెదిరించబడినప్పుడు పేతురు, యోహాను ఎలా ప్రతిస్పందించారు, వారు, వారి సహోదరులు ఏమి అనుభవించారు?

10. స్వతహాగా బిడియస్థులైన వారికి యిర్మీయా అనుభవం ఎలా సహాయం చేస్తుంది?

11. యిర్మీయా వలే ఉండడానికి క్రైస్తవులకు నేడు ఏమి సహాయం చేస్తుంది?

12. యేసు ధైర్యం విషయంలో ఏ చక్కని మాదిరిని ఉంచాడు, ఆయన తన అనుచరులను ఎలా ప్రోత్సహించాడు?

13. పౌలు ఫిలిప్పీయులను ఏమని ప్రోత్సహించాడు.?

14. పౌలు ధైర్యం మూలంగా రోములో ఏమి జరిగింది?

15. ధైర్యంగా ఉండాలనే మన నిశ్చయతను బలపరిచే విశ్వాస సంబంధమైన చక్కని మాదిరులను మనమెక్కడ కనుగొనవచ్చు?

16, 17. నేడు మనం ధైర్యంగల వైఖరిని ఎలా పెంపొందించుకోవచ్చు?

18, 19. న్యాయమూర్తి ఎదుట మనం ధైర్యంగా ఉంటే, తద్వారా మనం ఏ సందేశాన్ని అందజేస్తున్నాము?

20. మనం హింసను, అపనిందను సహించవలసి వస్తే మనమెందుకు ఆనందంగా ఉండవచ్చు?

[9వ పేజీలోని చిత్రాలు]

జర్మనీకి చెందిన సీమోన్‌ అర్నాల్డ్‌ (ఇప్పుడు లీబ్స్‌టర్‌), మలావీకి చెందిన విడ్డాస్‌ మడోనా, యుక్రెయిన్‌కు చెందిన లీడియా కుర్డాస్‌, ఒలెక్సీ కుర్డాస్‌ ధైర్యాన్ని ప్రదర్శించి, దుష్టుని ఎదిరించారు

[10వ పేజీలోని చిత్రాలు]

మనం సువార్తను బట్టి సిగ్గుపడము

[11వ పేజీలోని చిత్రం]

చెరసాలలో పౌలు చూపించిన ధైర్యం, సువార్తకు సంబంధించి ఎంతో మంచి చేసింది

[12వ పేజీలోని చిత్రం]

మనమొక న్యాయమూర్తికి మన లేఖనాధారిత స్థానాన్ని ధైర్యంగా వివరిస్తే, మనం ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని అందజేస్తున్నట్లే