కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మారుతున్న పరిస్థితులను చక్కగా వినియోగించుకోండి

మారుతున్న పరిస్థితులను చక్కగా వినియోగించుకోండి

మారుతున్న పరిస్థితులను చక్కగా వినియోగించుకోండి

నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న పమ్‌, యాన్‌, డ్రీస్‌, ఒటో అనే నలుగురు క్రైస్తవ పెద్దలకు అనేక విషయాల్లో పోలిక ఉంది. నలుగురూ వివాహితులు, నలుగురికీ పిల్లలున్నారు. అంతేగాక, కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు ఉండేవి, సౌకర్యవంతమైన ఇండ్లలో నివసిస్తుండేవారు. అయితే, వాళ్ళందరూ ఉద్యోగం చేయడం మానేసి, రాజ్యసంబంధ విషయాలకు మద్దతునివ్వడానికి తమ సమయాన్నంతటినీ శక్తినంతటినీ వెచ్చించడం మొదలుపెట్టారు. ఈ మార్పు చేసుకోవడానికి వారికేమి సహాయం చేసింది? నలుగురూ మారుతున్న పరిస్థితులను చక్కగా వినియోగించుకున్నారు.

మనలో దాదాపు అందరికీ ఎప్పుడో ఒకసారి పరిస్థితులు మారుతుంటాయి. వివాహం చేసుకోవడం, పిల్లలు పుట్టడం, వృద్ధ తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకోవడం వంటివి అదనపు బాధ్యతలను తెస్తాయి. అయితే కొన్ని మార్పులు మనం మన క్రైస్తవ పరిచర్యను విస్తరింపజేసుకోవడానికి మరింత స్వేచ్ఛనిస్తాయి. (మత్తయి 9:​37, 38) ఉదాహరణకు, ఎదిగిన మన పిల్లలు తమ సొంత కుటుంబాలతో విడిగా ఉండడానికి వెళ్ళిపోవచ్చు లేదా మనం ఉద్యోగ విరమణ పొందవచ్చు.

అంతేగాక, మనం కావాలనుకున్నా వద్దనుకున్నా మన పరిస్థితులు మారతాయన్నది నిజమే అయినా కొంతమంది క్రైస్తవులు మార్పులను సృష్టించుకోవడంలో సఫలులయ్యారు, ఆ మార్పులు పరిచర్యలో తమ వంతును అధికం చేసుకోవడానికి వారికి అవకాశాలను కల్పించాయి. పమ్‌, యాన్‌, డ్రీస్‌, ఒటో చేసింది సరిగ్గా అదే. ఎలా?

పిల్లల బాధ్యత తీరిపోయినప్పుడు

పమ్‌ ఒక మందుల కంపెనీలో జమాఖర్చులు వ్రాసే పని చేసేవాడు. ఆయనా, ఆయన భార్య ఆనీ తమ ఇద్దరు కూతుర్లతో కలిసి తరచుగా సహాయ పయినీర్లుగా సేవ చేసేవారు. పయినీరు పరిచర్య చేస్తున్న ఇతరులతో కలిసి ఆహ్లాదంగా సమయం గడపడానికి కూడా పమ్‌, అనీ ఏర్పాట్లు చేసేవారు. “ఇది, ఇతర రకాలైన సహవాసాలు తీసుకురాగల సమస్యల నుండి కాపుదలనిచ్చింది” అని వారు చెబుతున్నారు. తమ తల్లిదండ్రుల మాదిరితో పురికొల్పబడిన వారి కుమార్తెలిద్దరూ ఉన్నత పాఠశాల విద్య ముగించి క్రమ పయినీర్లుగా సేవ చేయడం ప్రారంభించారు.

పిల్లలు విడిగా ఉండడానికి వెళ్ళిపోవడంతో, పరిస్థితుల్లో ఏర్పడిన ఈ మార్పు వల్ల తాము ఆసక్తికరమైన ప్రదేశాలను సందర్శించడానికి లేదా ఇతర విధాలుగా సమయాన్ని గడపడానికి వీలుగా తమకు అదనపు స్వేచ్ఛ, డబ్బు అందుబాటులో ఉన్నాయని పమ్‌, ఆనీ గ్రహించారు. అయితే, ఆ దంపతులు మారిన తమ పరిస్థితులను, క్రైస్తవ పరిచర్యలో ఎక్కువగా పాల్గొనడానికి వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి పమ్‌ తాను వారంలో పనిచేస్తున్న రోజుల్లో ఒక రోజును తగ్గించమని తన యజమానిని అడిగాడు. ఆ తర్వాత, పమ్‌ తాను ఉదయం ఏడు గంటలకు పని ప్రారంభించి మధ్యాహ్నం రెండు గంటలకు పని ఆపేసేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే తక్కువ పని చేయడమంటే తక్కువ డబ్బుతో సరిపెట్టుకోవడమే. అయినా వారు సఫలులయ్యారు, 1991లో పమ్‌ తన భార్యలాగే తాను క్రమ పయినీరు సేవ చేయడం ప్రారంభించాడు.

ఇక ఆ తర్వాత, యెహోవాసాక్షుల సమావేశ హాలుకు అసిస్టెంట్‌ కేర్‌టేకర్‌గా పని చేయమని పమ్‌ను కోరడం జరిగింది. ఆ పనిని చేపట్టడమంటే ఆ జంట అప్పటికి 30 సంవత్సరాలుగా తాము నివసిస్తున్న ఇంటిని వదిలి సమావేశ హాలున్న ప్రాంతంలోని ఒక ఇంట్లోకి మారాలి. వాళ్ళు అలాగే మారారు. అది కష్టమయ్యిందా? ఆనీ తన ధ్యాస ఇంటివైపు మళ్ళినప్పుడల్లా తనను తాను, ‘నేను లోతు భార్యనా?’ అని ప్రశ్నించుకునేదాన్నని చెబుతోంది. ‘వెనుకకు తిరిగి చూడడానికి’ ఆనీ నిరాకరించింది.​—⁠ఆదికాండము 19:26; లూకా 17:​32.

తాము తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు లభించాయని పమ్‌, ఆనీ భావిస్తున్నారు. మిగతా ఎన్నో విషయాలతోపాటు, సమావేశ హాలులో తాము చేసే సేవను, జిల్లా సమావేశాల కోసం సిద్ధపాటు కార్యక్రమాలను, ఆ హాలులో ప్రసంగాలిచ్చే ప్రాంతీయ పైవిచారణకర్తలతో (ప్రయాణ పరిచారకులు) సహచర్యాన్ని వారు ఆనందిస్తున్నారు. అప్పుడప్పుడూ పమ్‌ సహాయ ప్రాంతీయ పైవిచారణకర్తగా సేవ చేస్తున్నప్పుడు వారు వివిధ సంఘాలను దర్శిస్తారు.

ఈ జంట తమ సేవను విస్తృతపరచుకోవడంలో సాఫల్యం పొందడానికి వారికేమి సహాయం చేసింది? “మీ జీవితంలో పెద్ద మార్పు సంభవించినప్పుడు, ఆ కొత్త పరిస్థితులను మీకు సాధ్యమైనంత చక్కగా వినియోగించుకోవడానికి దృఢ నిశ్చయం చేసుకోవాలి” అని పమ్‌ అంటున్నాడు.

నిరాడంబరమైన జీవితాన్ని ప్రారంభించడం

యాన్‌ భార్య పేరు వోత్‌, వారికి ముగ్గురు పిల్లలు. పమ్‌, ఆయన కుటుంబంలాగే యాన్‌ కూడా మారిన తన పరిస్థితులను జ్ఞానవంతంగా ఉపయోగించుకున్నాడు. ఎన్నో సంవత్సరాల పాటు బ్యాంకులో మంచి ఉద్యోగం చేసిన యాన్‌, తన కుటుంబానికి సౌకర్యవంతమైన జీవన శైలిని ఏర్పాటు చేశాడు. అయితే, తన పరిచర్యను విస్తృతపరచుకోవాలనే కోరిక ఆయనలో అంతకంతకు అధికమవుతుండేది. “నా జీవిత గమనంలో సత్యంపట్ల నా కృతజ్ఞత, యెహోవాపట్ల నా ప్రేమ అధికమయ్యాయి” అని ఆయన వివరిస్తున్నాడు. కాబట్టి 1986లో, యాన్‌ తన పరిస్థితుల్లో మార్పు చేసుకున్నాడు. “ఆఫీసులో జరుగుతున్న పునర్‌వ్యవస్థీకరణను ఉపయోగించుకొని నేను తక్కువ గంటలు పనిచేయడం మొదలుపెట్టాను. ఆశ్చర్యపోయిన నా తోటి ఉద్యోగులు నాకు డీవోడొ అని పేరు పెట్టారు, ఎందుకంటే నేను డీన్స్‌డాగ్‌ [మంగళవారం], వోన్స్‌డాగ్‌ [బుధవారం], డొన్డర్‌డాగ్‌ [గురువారం] మాత్రమే పనిచేసేవాడిని. నా జీతం 40 శాతం తగ్గిపోయింది. నేను మా ఇల్లు అమ్మేసి, రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్న స్థలంలో సేవ చేయగలిగేలా ఒక హౌస్‌బోట్‌ కొన్నాను. ఆ తర్వాత, నేను స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నాను; నా ఆదాయం మరో 20 శాతం తగ్గిపోయింది, కానీ 1993లో నేను క్రమ పయినీరుగా సేవ చేయడం ప్రారంభించగలిగాను” అని ఆయన చెప్తున్నాడు.

నేడు యాన్‌ ఆసుపత్రి అనుసంధాన కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు, సమావేశ పైవిచారణకర్తగా చాలాసార్లు పనిచేశాడు. వోత్‌ తన ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ అప్పుడప్పుడూ సహాయ పయినీరు సేవ చేస్తుంది. ముగ్గురు పిల్లలకు ఇప్పుడు వివాహాలయ్యాయి, వారు తమ జీవిత సహచరులతో కలిసి అత్యంత ఆసక్తిగల రాజ్య ప్రచారకులుగా సేవ చేస్తున్నారు.

యాన్‌, వోత్‌ తక్కువ డబ్బుతో సర్దుకుపోవడం ఎలా నేర్చుకున్నారు? “మాకు అన్నీ సమృద్ధిగా ఉన్న కాలంలో మేము వస్తు సంపదలపై ఎక్కువ మక్కువ పెంచుకోకుండా జాగ్రత్తపడ్డాము. ఈ రోజుల్లో ఏదైనా పొందే ముందు కాస్త ఆగవలసి రావడంతో కొంత అసౌకర్యం ఏర్పడుతుండవచ్చు, కానీ మేము పొందిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, ఆధిక్యతలు ఆ లోటును తీరుస్తాయి” అని యాన్‌ సమాధానమిస్తున్నాడు.

యాన్‌, వోత్‌ చేసినట్లుగానే డ్రీస్‌ ఆయన భార్య యెనీ కూడా రాజ్య సంబంధమైన విషయాలకు ఎక్కువ సమయాన్ని వెచ్చించగలిగేలా తమ జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. డ్రీస్‌, యెనీ తమకు పిల్లలు పుట్టే వరకు పయినీర్లుగా సేవ చేశారు. తర్వాత, తన కుటుంబం గురించి శ్రద్ధ తీసుకోవడానికి డ్రీస్‌ ఒక పెద్ద కంపెనీలో మేనేజరుగా పనిచేశాడు. ఆయన యజమానులు ఆయన పనిని మెచ్చుకొని ఆయనకు పదోన్నతి ఇస్తామన్నారు. అయితే దాన్ని అంగీకరిస్తే క్రైస్తవ కార్యకలాపాలకు సమయం సరిపోదు కాబట్టి డ్రీస్‌ దాన్ని తిరస్కరించాడు.

కుటుంబాన్ని పోషించడానికి, అలాగే అనారోగ్యంతో ఉన్న యెనీ తల్లి గురించి శ్రద్ధ తీసుకోవడానికి ఆ జంటకు ఎంతో సమయం, శక్తి అవసరమయ్యాయి. అయినా వారు పయినీరు స్ఫూర్తిని వదులుకోలేదు. అలా చేయడానికి వారికేమి సహాయం చేసింది? “పయినీర్లు మాతోపాటు ఉండేవారు, మేము వారిని భోజనాలకు పిలుస్తుండేవాళ్ళము, ప్రాంతీయ పైవిచారణకర్తలకు వసతి ఏర్పాటు చేసేవాళ్ళము” అని యెనీ వివరిస్తోంది. “మేము జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకొని అప్పులు కాకుండా చూసుకున్నాము. పెద్ద పెద్ద వ్యాపారాలు మొదలుపెట్టాలని గానీ ఇల్లు కొనుక్కోవాలని గానీ ఎన్నడూ ఆలోచించకూడదని మేము నిర్ణయించుకున్నాము, అలాగైతే భవిష్యత్తులో అవే ఒక అవరోధంగా తయారయ్యే అవకాశం ఉండదు” అని డ్రీస్‌ అంటున్నాడు.

రాజ్య సంబంధమైన విషయాలకు ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి అనుమతించే పరిస్థితులను సృష్టించుకోవాలని డ్రీస్‌, యెనీ తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలదాయకమైన ఫలితాలు వచ్చాయి. వారి కుమారులిద్దరూ ఇప్పుడు పెద్దలుగా ఉన్నారు, వారిలో ఒకరు తన భార్యతో కలిసి పయినీరు సేవ చేస్తున్నారు. డ్రీస్‌, యెనీ ప్రత్యేక పయినీర్లుగా సేవ చేశారు, ఆ తర్వాత యెనీ ప్రాంతీయ పనిలో డ్రీస్‌కు తోడుగావుంది. ఇప్పుడు వారు బేతేలులో స్వచ్ఛంద సేవకులుగా ఉన్నారు, అక్కడ డ్రీస్‌ బ్రాంచి కమిటీ సభ్యుడిగా సేవ చేస్తున్నాడు.

స్వచ్ఛంద ఉద్యోగ విరమణ

డ్రీస్‌, యెనీ చేసినట్లే ఒటో ఆయన భార్య జూడీ తమ ఇద్దరు కుమార్తెలు పుట్టక ముందు పయినీరు సేవ చేశారు. జూడీ తొలిసారి గర్భవతి అయినప్పుడు ఒటో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించుకున్నాడు.

పిల్లలు ఎదుగుతుండగా వారు క్రైస్తవ పూర్తికాల ప్రచారకుల ఆనందాన్ని చూడగలిగేలా ఒటో, జూడీ పయినీర్లను తమ ఇంటికి ఆహ్వానించేవారు. కొంతకాలానికి, వారి పెద్ద కుమార్తె పయినీరు సేవ ప్రారంభించింది. ఆ తర్వాత, ఆమె గిలియడ్‌ పాఠశాలకు హాజరై, ఇప్పుడు తన భర్తతోపాటు ఒక ఆఫ్రికా దేశంలో మిషనరీగా సేవచేస్తోంది. వారి చిన్న కుమార్తె 1987లో పయినీరు సేవ ప్రారంభించింది, జూడీ కూడా ఆమెతో పాటు పయినీరు సేవ మొదలుపెట్టింది.

మారిన పరిస్థితుల కారణంగా ఒటో పాఠశాలలో తక్కువ గంటలు పనిచేసే అవకాశం ఏర్పడినప్పుడు ఆయన మిగిలిన సమయాన్ని పయినీరు సేవ కోసం ఉపయోగించుకున్నాడు. చివరికి ఆయన ఉద్యోగం పూర్తిగా మానేశాడు. నేడు ఒటో ఉపాధ్యాయుడిగా తన సామర్థ్యాన్ని, ప్రయాణపనిలో సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరిచేందుకు ఉపయోగిస్తున్నాడు.

స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొందేవారికి ఒటో ఇస్తున్న ఉపదేశమేమిటి? “మీరు ఉద్యోగ విరమణ పొందాక ఒక సంవత్సరంపాటు లేదా కొంతకాలంపాటు విశ్రాంతిగా ఉండాలని నిశ్చయించుకోకండి. ఇక అలాగే ‘విశ్రాంతి’ తీసుకుంటూ ఉండడానికి అలవాటుపడడం కష్టమేమీ కాదు. మీరు గ్రహించే లోపలే, మీరిక పయినీరు సేవ గురించి మరచిపోతారు. కాబట్టి ఉద్యోగ విరమణ తీసుకున్న వెంటనే సంఘంలో, పరిచర్యలో మీ కార్యకలాపాలను అధికం చేసుకోండి.”

జీవితంలో మీకున్న అనుభవాన్ని చక్కగా వినియోగించుకోవడం

పమ్‌, యాన్‌, డ్రీస్‌, ఒటో వంటి సహోదరులకు వాళ్ళు యౌవనంలో ఉన్నప్పుడున్న శక్తి, సత్తువ ఇప్పుడు లేవన్నది నిజమే. కానీ వాళ్ళకు ఎంతో పరిణతి, అనుభవం, జ్ఞానం ఉన్నాయి. (సామెతలు 20:​29) తండ్రులుగా ఉండడమంటే ఏమిటో వాళ్ళకు తెలుసు, తమ భార్యలతో కలిసి పనిచేసినందుకు, ఒక తల్లిగా ఉండడంలో ఎన్ని విషయాలు ఇమిడి ఉంటాయనేదాని గురించి వాళ్ళకు కొంత అవగాహన ఉంది. వాళ్ళు తమ భార్యలతో కలిసి, కుటుంబ సమస్యలతో వ్యవహరించారు, తమ పిల్లలకు ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పరిచారు. “నేను ఒక ప్రాంతీయ పైవిచారణకర్తగా కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో సలహా ఇచ్చేటప్పుడు, కుటుంబాన్ని పోషించడంలో నాకున్న అనుభవం నాకు తోడ్పడుతుంది” అని ఒటో చెబుతున్నాడు. అలాగే, తండ్రిగా డ్రీస్‌కున్న అనుభవం వల్ల ఆయన ఎంతోమంది యౌవనస్థులుండే బేతేలు కుటుంబానికి విలువైన వ్యక్తిగా ఉన్నాడు.

అవును, అలాంటి సహోదరులకున్న సొంత జ్ఞానం సంఘంలో ఉండే విభిన్న అవసరాల గురించి శ్రద్ధ వహించడానికి వారికి సహాయం చేస్తుంది. వారికున్న అనుభవం, వారు తమ శక్తిని గొప్ప ప్రయోజనం చేకూరే విధంగా ఉపయోగించగలిగేలా, వారు వినియోగించే పనిముట్లకు పదునుపెట్టిందని చెప్పవచ్చు. (ప్రసంగి 10:​10) వాస్తవానికి, ఒక నిర్దిష్ట సమయంలో, తరచూ వారు శారీరకంగా తమకన్నా బలవంతులే అయినా అంతగా అనుభవం లేనివారి కంటే ఎక్కువే సాధించగలుగుతారు.

అలాంటి సహోదరులు, తమ భార్యలతో పాటు, యెహోవా ప్రజల్లోని యౌవనులకు చక్కని మాదిరులుగా ఉన్నారు. ఇటువంటి జంటలు మన క్రైస్తవ ప్రచురణల్లో నివేదించబడిన అనేక సవాళ్ళను, ఆశీర్వాదాలను వ్యక్తిగతంగా చవిచూశారని యౌవనస్థులు గమనిస్తారు. వృద్ధుడైనప్పటికీ సవాలుదాయకమైన నియామకాన్ని ఇవ్వమని కోరిన కాలేబువంటి స్ఫూర్తిని చూపించే స్త్రీ పురుషులను చూడడం ప్రోత్సాహాన్నిస్తుంది.​—⁠యెహోషువ 14:​10-12.

వారి విశ్వాసాన్ని అనుకరించండి

ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన జంటల విశ్వాసాన్ని, చర్యలను బహుశా మీరు అనుకరించగలరా? వారు సత్యాన్ని తమ జీవన మార్గంగా చేసుకున్నారని గుర్తుంచుకోండి. వారు తమ పిల్లల్లో పయినీరు సేవ చేయాలనే కోరికను వృద్ధిచేశారు. యాన్‌ చెబుతున్నట్లుగా, “యెహోవాపట్ల, ఆయన సంస్థపట్ల ప్రేమ కలిగివుండే విషయంలో మాదిరి ఉంచడం ద్వారా, మంచి సహవాసం కోసం ఏర్పాట్లు చేయడం ద్వారా, తమ కాళ్ళపై తాము నిలబడడాన్ని పిల్లలకు నేర్పించడం ద్వారా” వారు దాన్ని సాధించారు. వారు ఒక కుటుంబంగా కలిసి పనిచేశారు, కలిసి ఆడుకున్నారు. “సెలవుల్లో సాధారణంగా ఉదయం పూట కుటుంబమంతా కలిసి ప్రకటనా పనికి వెళ్ళేవాళ్ళం, మధ్యాహ్నాల్లో కలిసి విశ్రాంతి తీసుకునేవాళ్ళం” అని పమ్‌ గుర్తుతెచ్చుకుంటున్నాడు.

అంతేగాక, ఈ క్రైస్తవులు తమ పరిస్థితులు మారినప్పుడు కొత్త పరిస్థితి నుండి ప్రయోజనం పొందడానికి సిద్ధంగా ఉండగలిగేలా ముందుగా ప్రణాళిక వేసుకున్నారు. వారు లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని త్వరగా సాధించుకోవడానికి సహాయపడే నిర్ణయాలను తీసుకున్నారు. తక్కువ సమయం వెచ్చించవలసి వచ్చే ఉద్యోగాల కోసం అన్వేషించి, తక్కువ ఆదాయంతో సరిపెట్టుకోవడానికి సుముఖతను పెంపొందించుకున్నారు. (ఫిలిప్పీయులు 1:​9-11) భార్యలు తమ భర్తలకు పూర్తి మద్దతునిచ్చారు. “కార్యానుకూలమైన గొప్ప ద్వారము”లోకి కలిసి ప్రవేశించి, తత్ఫలితంగా యెహోవా నుండి గొప్ప ఆశీర్వాదాలను పొందాలని వారు ఎంతగానో కోరుకున్నారు.​—⁠1 కొరింథీయులు 16:​9, అధస్సూచి; సామెతలు 10:​22.

పరిచర్యలో ఎక్కువగా పాల్గొనాలని మీరు అలాగే కోరుకుంటున్నారా? అలాగైతే, మారుతున్న పరిస్థితులను చక్కగా వినియోగించుకోవడం అలా చేయడానికి కీలకంగా నిరూపించబడవచ్చు.

[20వ పేజీలోని చిత్రం]

సమావేశ హాలు గురించి శ్రద్ధ తీసుకుంటున్న పమ్‌, ఆనీ

[20వ పేజీలోని చిత్రం]

ప్రకటనాపనిలో భాగం వహిస్తున్న యాన్‌, వోత్‌

[21వ పేజీలోని చిత్రం]

బేతేలులో సేవచేస్తున్న డ్రీస్‌, యెనీ

[21వ పేజీలోని చిత్రం]

తర్వాతి సంఘాన్ని సందర్శించడానికి సిద్ధపడుతున్న ఒటో, జూడీ