కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పూర్ణహృదయంతో యెహోవాపై నమ్మకం ఉంచండి

మీ పూర్ణహృదయంతో యెహోవాపై నమ్మకం ఉంచండి

మీ పూర్ణహృదయంతో యెహోవాపై నమ్మకం ఉంచండి

“నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు.”​—⁠కీర్తన 9:10.

నేడు మన సంక్షేమానికి ముప్పు తెచ్చేవి ఎన్నో ఉన్నాయి కాబట్టి భద్రతనిచ్చే ఎవరివైపైనా, దేనివైపైనా చూడడం సహజం. చాలా డబ్బుంటే తమ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని కొందరు అనుకుంటారు గానీ వాస్తవానికి డబ్బు చాలా అనిశ్చయమైన ఆశ్రయం. “ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 11:​28) ఇతరులు మానవ నాయకులవైపు చూస్తారు, కానీ ఎంతో ఉత్తములైన నాయకులు సహితం పొరపాట్లు చేస్తారు. చివరికి వారందరూ మరణిస్తారు. “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి” అని బైబిలు జ్ఞానయుక్తంగానే చెబుతోంది. (కీర్తన 146:⁠3) ఏ సహాయము లేకుండా మనం స్వయంగా చేసే ప్రయత్నాలను నమ్ముకోవడాన్ని గురించి కూడా ఆ ప్రేరేపిత లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. మనం కూడా అల్పులమైన ‘నరులమే.’

2 యెషయా ప్రవక్త తన కాలంలోని దేశ నాయకులు ‘అబద్ధములను ఆశ్రయముగా’ చేసుకొని వాటినే నమ్ముకున్నందుకు వారిని విమర్శించాడు. (యెషయా 28:​15-17) వారు భద్రతకోసం చేసే తమ అన్వేషణలో ఇరుగుపొరుగు రాజ్యాలతో రాజకీయ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాంటి ఒప్పందాలు నమ్ముకొనదగినవి కాదు, అవి అబద్ధాలు. అదే విధంగా, నేడు చాలామంది మతనాయకులు రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. ఆ ఒప్పందాలు కూడా “అబద్ధము”లుగా నిరూపించబడతాయి. (ప్రకటన 17:​16, 17) అవి శాశ్వత భద్రతను తీసుకురావు.

యెహోషువ, కాలేబు ఉంచిన మంచి మాదిరి

3 మరి మనం భద్రత కోసం ఎవరివైపు చూడాలి? మోషే కాలంలో యెహోషువ, కాలేబు చూసిన మూలంవైపుకే మనం కూడా చూడాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల చేయబడిన వెంటనే, ఆ జనాంగం వాగ్దాన దేశమైన కనానులోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఆ దేశాన్ని వేగు చూడడానికి పన్నెండుమంది పంపించబడ్డారు, 40 రోజులు ముగిశాక వాళ్ళు తమ నివేదికను అందజేయడానికి తిరిగి వచ్చారు. కనానులో ఇశ్రాయేలీయులు విజయం సాధించడాన్ని గురించి కేవలం ఇద్దరు వేగులవారు అంటే యెహోషువ, కాలేబు మాత్రమే అనుకూలంగా మాట్లాడారు. ఆ దేశం ఆకర్షణీయంగానే ఉందని ఇతరులు అంగీకరించారు గానీ, “ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; . . . ఆ జనులు మనకంటె బలవంతులు; మనము వారి మీదికి పోజాల[ము]” అన్నారు.​—⁠సంఖ్యాకాండము 13:​27, 28, 31.

4 ఇశ్రాయేలీయులు పదిమంది వేగులవారు చెప్పింది విని భయపడిపోయి, మోషేపై సణగడం కూడా మొదలుపెట్టారు. చివరికి యెహోషువ, కాలేబు ఎంతో భావోద్వేగంతో ఇలా అన్నారు: “మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును; అది పాలు తేనెలు ప్రవహించుదేశము. మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి.” (సంఖ్యాకాండము 14:​6-9) అయినా కూడా ఇశ్రాయేలీయులు వినడానికి నిరాకరించారు, తత్ఫలితంగా ఆ సమయంలో వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి వారు అనుమతించబడలేదు.

5 పదిమంది వేగులవారు తప్పు నివేదిక ఇచ్చినా, యెహోషువ కాలేబు ఎందుకు మంచి నివేదికను ఇచ్చారు? ఆ పన్నెండుమందీ అవే బలమైన పట్టణములను, సుస్థిరమైన రాజ్యాలను చూశారు. ఇశ్రాయేలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేదని ఆ పదిమంది చెప్పింది వాస్తవమే. యెహోషువకు, కాలేబుకు కూడా ఆ విషయం తెలుసు. అయితే ఆ పదిమంది విషయాలను మానవ దృక్కోణం నుండి చూశారు. అయితే యెహోషువ, కాలేబు యెహోవాపై నమ్మకముంచారు. ఆయన ఐగుప్తులో, ఎఱ్ఱ సముద్రం వద్ద, సీనాయి పర్వతపాదం వద్ద చేసిన శక్తివంతమైన కార్యాలను వారు చూశారు. అంతెందుకు, దశాబ్దాల తర్వాత, యెరికో పట్టణస్థురాలైన రాహాబు ఆ చర్యలను గురించి కేవలం వినే, యెహోవా ప్రజల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టేంతగా కదిలించబడింది! (యెహోషువ 2:1-24; 6:​22-25) యెహోవా చర్యలకు ప్రత్యక్ష సాక్షులైన యెహోషువకు, కాలేబుకు దేవుడు తన ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాడన్న సంపూర్ణ నమ్మకం ఉంది. నలభై సంవత్సరాల తర్వాత, యెహోషువ నాయకత్వం క్రింద ఇశ్రాయేలీయుల ఒక క్రొత్త తరం కనానులోకి ప్రవేశించి దాన్ని జయించినప్పుడు వారి నమ్మకం సరైనదేనని నిరూపించబడింది.

మనం యెహోవాను ప్రగాఢంగా ఎందుకు నమ్మాలి?

6 ఇశ్రాయేలీయుల్లాగే మనం మనకంటే శక్తివంతులైన శత్రువులను ఈ ‘అపాయకరమైన కాలములలో’ ఎదుర్కొంటాము. (2 తిమోతి 3:⁠1) మనం నైతిక, ఆధ్యాత్మిక, కొన్ని సందర్భాల్లో శారీరక ఒత్తిళ్ళను కూడా ఎదుర్కొంటున్నాము. అవి మానవాతీత శక్తి అయిన అపవాదియగు సాతాను నుండి వస్తున్నాయి కాబట్టి ఆ ఒత్తిళ్ళను మనం స్వయంగా ఎదిరించలేము. (ఎఫెసీయులు 6:12; 1 యోహాను 5:​19) కాబట్టి మనం ఎవరి నుండి సహాయాన్ని పొందగలము? ప్రాచీన కాలంలోని ఒక విశ్వసనీయుడు యెహోవాకు ప్రార్థన చేస్తూ ఇలా అన్నాడు: “నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు.” (కీర్తన 9:​10) మనం నిజంగా యెహోవాను ఎరిగివుండి, ఆయన నామము దేన్ని సూచిస్తుందో అర్థం చేసుకుంటే యెహోషువ, కాలేబు ఆయనను ఎంత దృఢంగా నమ్మారో మనం కూడా అంతే దృఢంగా నమ్ముతాము.​—⁠యోహాను 17:⁠3.

7 మనమెందుకు యెహోవాపై నమ్మకముంచాలి? యెహోషువ, కాలేబు అలా నమ్మకముంచడానికి కొంతమేరకు కారణం వారు ఆయన శక్తికి నిదర్శనాలను చూసి ఉండడమే. మనం కూడా వాటిని చూశాము. ఉదాహరణకు, వందల కోట్ల నక్షత్ర వీధులుగల విశ్వంతో సహా యెహోవా సృష్టి కార్యాలను పరిశీలించండి. అపరిమితమైన భౌతిక శక్తులను యెహోవా అదుపుచేయడం, ఆయన నిజంగానే సర్వశక్తిమంతుడని వెల్లడిచేస్తోంది. సృష్టిలోని అద్భుతాల గురించి మనం ధ్యానిస్తుండగా, యెహోవా గురించి ఇలా చెప్పిన యోబుతో మనం ఏకీభవించవలసిందే: “ఆయనను అడ్డగింపగలవాడెవడు?​—⁠నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?” (యోబు 9:​12) నిజంగా యెహోవా మన పక్షాన ఉంటే, మొత్తం విశ్వమంతటిలో మనం ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు.​—⁠రోమీయులు 8:​31.

8 యెహోవా వాక్యమైన బైబిలును కూడా పరిశీలించండి. దైవిక జ్ఞానపు ఈ తరగని గని, చెడు అలవాట్లను మానుకొని మన జీవితాలను యెహోవా చిత్తానికి అనుగుణంగా మార్చుకోవడానికి సహాయం చేయడంలో ఎంతో శక్తివంతమైనది. (హెబ్రీయులు 4:​12) బైబిలు ద్వారానే మనం యెహోవా నామమును తెలుసుకొని, ఆయన నామ విశిష్టతను చూడగలుగుతాము. (నిర్గమకాండము 3:​14) యెహోవా తన సంకల్పాలను నెరవేర్చుకోవడానికి తాను ప్రేమగల తండ్రి, నీతిగల న్యాయమూర్తి, విజయవంతమైన యోధుడు ఇలా ఏది కావాలనుకుంటే అది కాగలడని మనం గ్రహిస్తాము. ఆయన వాక్యం ఎల్లప్పుడూ ఎలా నిజమవుతుందో మనం చూస్తాము. మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తుండగా, “నీమాట నమ్ముకొనియున్నాను” అని చెప్పిన కీర్తనకర్తలా మనం కూడా చెప్పడానికి కదిలించబడతాము.​—⁠కీర్తన 119:42; యెషయా 40:⁠8.

9 యెహోవాపై నమ్మకముంచడానికి మరో కారణం విమోచన క్రయధన ఏర్పాటు. (మత్తయి 20:​28) మనకోసం విమోచన క్రయధనంగా మరణించడానికి దేవుడు తన సొంత కుమారుడ్ని పంపించాడన్నది ఎంత అద్భుతమైన విషయమో కదా! విమోచన క్రయధనం నిజంగా శక్తివంతమైనది. పశ్చాత్తాపపడి యథార్థమైన హృదయంతో యెహోవావైపుకు తిరిగే మానవులందరి పాపాలకు అది ప్రాయశ్చిత్తం చేస్తుంది. (యోహాను 3:16; హెబ్రీయులు 6:10; 1 యోహాను 4:​16, 19) విమోచన క్రయధనం చెల్లించడంలో భాగంగా యేసు పునరుత్థానం చేయబడాలి. వందలాదిమంది ప్రత్యక్షసాక్షులు చూసిన ఆ అద్భుతం యెహోవాపై నమ్మకం ఉంచడానికి మరింత కారణాన్నిస్తుంది. మన ఆశలు అడియాసలు కావనడానికి అది ఒక హామీ.​—⁠అపొస్తలుల కార్యములు 17:31; రోమీయులు 5:5; 1 కొరింథీయులు 15:​3-8.

10 యెహోవాపై మనకు సంపూర్ణ నమ్మకం ఎందుకుండవచ్చు, ఎందుకుండాలి అనేదానికి ఇవి కేవలం కొన్ని కారణాలు మాత్రమే. ఇంకా ఎన్నో కారణాలున్నాయి, వాటిలో కొన్ని వ్యక్తిగతమైనవి. ఉదాహరణకు, అప్పుడప్పుడూ మనమందరం మన జీవితాల్లో కష్టపరిస్థితులను ఎదుర్కొంటాము. వాటితో వ్యవహరించడంలో మనం యెహోవా మార్గనిర్దేశాన్ని అనుసరిస్తే, ఆ మార్గనిర్దేశం ఎంత ఆచరణాత్మకమైనదో మనం చూస్తాము. (యాకోబు 1:​5-8) మన అనుదిన జీవితాల్లో మనం యెహోవాపై ఎంతగా ఆధారపడి దాని ద్వారా మంచి ఫలితాలను చూస్తే, ఆయనపై మన నమ్మకం అంతగా బలపర్చబడుతుంది.

దావీదు యెహోవాపై నమ్మకం ఉంచాడు

11 యెహోవాపై నమ్మకం ఉంచినవారిలో ఒకరు ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన దావీదు. దావీదు తనను చంపజూస్తున్న సౌలు రాజు బెదిరింపును, ఇశ్రాయేలును జయించడానికి ప్రయత్నిస్తున్న ఫిలిష్తీయుల శక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. అయినా ఆయన తప్పించుకొన్నాడు, చివరికి విజయం కూడా సాధించాడు. ఎందుకు? దావీదు తానే ఇలా వివరిస్తున్నాడు: “యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?” (కీర్తన 27:⁠1) మనం కూడా యెహోవాపై అలాగే నమ్మకం ఉంచితే మనం కూడా విజయం సాధిస్తాము.

12 ఒక సందర్భంలో దావీదు ఇలా ప్రార్థించాడు: “దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రుభయమునుండి నా ప్రాణమును కాపాడుము. కీడుచేయువారి కుట్రనుండి దుష్టక్రియలు చేయువారి అల్లరినుండి నన్ను దాచుము, ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదుమాటలను బాణములుగా సంధించుదురు.” (కీర్తన 64:​1-4) దావీదు ఈ మాటలు వ్రాయడానికి ఖచ్చితంగా కారణమేమిటో మనకు తెలియదు. నేడు వ్యతిరేకులు అదే విధంగా ‘తమ నాలుకలకు పదును పెట్టుకుంటూ’ తమ మాటలనే యుద్ధాయుధాలుగా ఉపయోగిస్తున్నారని మనకు తెలుసు. వారు తమ నోటిమాటలను లేక లిఖిత పదాలను తప్పుగా నివేదించే “బాణములు”గా ఉపయోగిస్తూ వాటిని యథార్థవంతులైన క్రైస్తవులపై “సంధించుదురు.” మనం యెహోవాపై అచంచలమైన నమ్మకంతోవుంటే దాని ఫలితమెలా ఉంటుంది?

13 దావీదు ఇంకా ఇలా చెబుతున్నాడు: “దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము. . . . నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు.” (కీర్తన 64:​7-10) అవును శత్రువులు మనకు వ్యతిరేకంగా తమ నాలుకలకు పదును బెట్టుకున్నప్పటికీ అంతములో “వారు కూలుటకు వారి నాలుకే కారణము” అవుతుంది. తనపై నమ్మకం ఉంచినవారు ఆనందించగలిగేలా చివరికి యెహోవా విషయాలను విజయవంతమైన ముగింపుకు తీసుకువస్తాడు.

హిజ్కియా నమ్మకం సరైనదేనని నిరూపించబడింది

14 యెహోవాపై తనకున్న నమ్మకం సరైనదేనని నిరూపించబడిన మరొక వ్యక్తి హిజ్కియా. ఆయన పరిపాలనలో శక్తివంతమైన అష్షూరు సైన్యం యెరూషలేముకు ప్రమాదాన్ని తీసుకువచ్చింది. ఆ సైన్యం అనేక ఇతర దేశాలను జయించింది. అది యూదాలోని ఇతర నగరాలను కూడా జయించింది, కేవలం యెరూషలేము మాత్రం ఇంకా జయించబడలేదు, ఆ నగరాన్ని కూడా జయిస్తానని సన్హెరీబు ప్రగల్భాలు పలికాడు. సహాయం కోసం ఐగుప్తును నమ్ముకోవడం వ్యర్థమని ఆయన రబ్షాకే ద్వారా సరిగ్గానే సూచించాడు. అయితే, తర్వాత ఆయనిలా అన్నాడు: “యెరూషలేము అష్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.” (యెషయా 37:​10) అయితే, యెహోవా తనను మోసం చేయడని హిజ్కియాకు తెలుసు. కాబట్టి ఆయనిలా ప్రార్థించాడు: ‘యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలిసికొనునట్లు [అష్షూరీయుని] చేతిలోనుండి మమ్మును రక్షించుము.’ (యెషయా 37:​20) యెహోవా హిజ్కియా ప్రార్థనను విన్నాడు. ఒక్క రాత్రిలోనే ఒక దేవదూత 1,85,000 మంది అష్షూరు సైనికులను చంపేశాడు. యెరూషలేము తప్పించబడింది, సన్హెరీబు యూదాకు ఇక ఎన్నడూ తిరిగి రాలేదు. ఈ సంఘటన గురించి విన్నవారందరూ యెహోవా గొప్పతనం గురించి తెలుసుకున్నారు.

15 హిజ్కియాలాగే నేడు మనం యుద్ధం చేస్తున్నాము. మనం చేసే యుద్ధం ఆధ్యాత్మికమైనది. అయినా, ఆధ్యాత్మిక యోధులుగా మనం ఆధ్యాత్మికంగా సజీవంగా ఉండడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. దాడులు జరుగుతాయని ముందుగానే తెలుసుకుని మనం వాటిని ఎదుర్కోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. (ఎఫెసీయులు 6:​11, 12, 17) అస్థిరమైన ఈ లోకంలో, పరిస్థితులు హఠాత్తుగా మారిపోయే అవకాశముంది. పౌర సంక్షోభం అనుకోకుండా తలెత్తగలదు. మతసహనం గల దేశాలుగా పేరుపొందినవి అసహనంగా తయారుకావచ్చు. హిజ్కియాలాగే మనం యెహోవాపై అచంచలమైన నమ్మకాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా మనల్ని మనం సిద్ధం చేసుకుంటేనే తప్ప ఏమి జరిగినప్పటికీ మనం సంసిద్ధంగా ఉండలేము.

యెహోవాపై నమ్మకం ఉంచడమంటే ఏమిటి?

16 యెహోవాపై నమ్మకం ఉంచడమంటే కేవలం మాటల్లో వ్యక్తం చేయడం కాదు. అది మన హృదయంలో ఉండాలి, మన చర్యల్లో వ్యక్తమవ్వాలి. మనకు యెహోవాపై నమ్మకం ఉంటే మనం ఆయన వాక్యమైన బైబిలుపై సంపూర్ణంగా నమ్మకం ఉంచుతాము. దాన్ని ప్రతిరోజు చదువుతాము, దాని గురించి ధ్యానిస్తాము, అది మన జీవితాల్లో నిర్దేశాన్నివ్వడానికి అనుమతిస్తాము. (కీర్తన 119:​105) యెహోవాపై నమ్మకం ఉంచడంలో ఆయన పరిశుద్ధాత్మ శక్తిపై నమ్మకం ఉంచడం కూడా ఒక భాగమే. పరిశుద్ధాత్మ సహాయంతో, మనం యెహోవాను సంతోషపరిచే ఫలాన్ని వృద్ధి చేసుకోవచ్చు, మనలో బలంగా నాటుకుపోయిన చెడు అలవాట్లను పెకిలించివేయవచ్చు. (1 కొరింథీయులు 6:11; గలతీయులు 5:​22-24) కాబట్టి, అనేకులు పరిశుద్ధాత్మ సహాయంతో పొగత్రాగడాన్ని, మాదకద్రవ్యాల వినియోగాన్ని మానుకున్నారు. మరితరులు అనైతిక జీవన విధానాలను మార్చుకున్నారు. అవును, మనం యెహోవాపై నమ్మకం ఉంచితే మనం మన సొంత శక్తితో కాదు గానీ ఆయన బలంతో చర్య తీసుకుంటాము.​—⁠ఎఫెసీయులు 3:​14-18.

17 యెహోవాపై నమ్మకం ఉంచడమంటే ఆయన నమ్మేవారిని నమ్మడమని కూడా అర్థం. ఉదాహరణకు, యెహోవా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[డు]” రాజ్యానికి సంబంధించిన భూసంబంధమైన విషయాల గురించి శ్రద్ధ వహించేలా ఏర్పాటు చేశాడు. (మత్తయి 24:​45-47) మనం స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నించము, నమ్మకమైన దాసుని నియామకాన్ని మనం అలక్ష్యం చేయము, ఎందుకంటే యెహోవా ఏర్పాటుపై మనం నమ్మకం ఉంచుతాము. అంతేగాక, పెద్దలు స్థానిక క్రైస్తవ సంఘంలో సేవ చేస్తున్నారు, అపొస్తలుడైన పౌలు చెబుతున్నదాని ప్రకారం, వారు పరిశుద్ధాత్మచేత నియమించబడ్డారు. (అపొస్తలుల కార్యములు 20:​28) సంఘంలోని పెద్దల ఏర్పాటుతో సహకరించడం ద్వారా మనకు యెహోవాపై నమ్మకం ఉందని కూడా మనం చూపిస్తాము.​—⁠హెబ్రీయులు 13:17.

పౌలు మాదిరిని అనుసరించండి

18 అపొస్తలుడైన పౌలు మనలాగే తన పరిచర్యలో ఎన్నో ఒత్తిళ్ళను ఎదుర్కొన్నాడు. ఆయన కాలంలో, అధికారుల ఎదుట క్రైస్తవత్వం తప్పుగా వర్ణించబడింది, ఆ తప్పుడు అభిప్రాయాలను సరిచేయడానికి లేదా చట్టబద్ధంగా ప్రకటనా పనిని స్థాపించడానికి ఆయన కొన్నిసార్లు కృషి చేశాడు. (అపొస్తలుల కార్యములు 28:19-22; ఫిలిప్పీయులు 1:⁠7) నేడు క్రైస్తవులు ఆయన మాదిరిని అనుసరిస్తారు. సాధ్యమైన చోటల్లా, అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటూ మనం మన పని గురించి ఇతరులకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాము. సువార్తను సమర్థించడానికి, చట్టబద్ధంగా స్థాపించడానికి కృషిచేస్తాము. అయితే మనం అలాంటి కృషిపై పూర్తి నమ్మకాన్ని ఉంచము, ఎందుకంటే మన విజయం లేదా వైఫల్యం కోర్టు కేసులు గెలవడంపై గానీ అనుకూలమైన ప్రచారం లభించడం గానీ ఆధారపడి ఉన్నట్లు మనం దృష్టించము. బదులుగా మనం యెహోవాపై నమ్మకం ఉంచుతాము. ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఆయనిచ్చిన ఈ ప్రోత్సాహాన్ని మనం గుర్తుంచుకుంటాము: “మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును.”​—⁠యెషయా 30:​15.

19 మన ఆధునిక చరిత్రలో, తూర్పు పశ్చిమ యూరప్‌లలో, ఆసియా ఆఫ్రికాలలోని కొన్ని భాగాల్లో, ఉత్తర దక్షిణ అమెరికా దేశాల్లో మన పని కొన్నిసార్లు నిషేధించబడింది లేదా మన పనిపై ఆంక్షలు విధించబడ్డాయి. యెహోవాపై మనం ఉంచిన నమ్మకం వ్యర్థమయ్యిందని దాని భావమా? కాదు. యెహోవా కొన్నిసార్లు తాను విలువైనదిగా ఎంచిన కారణాన్ని బట్టే తీవ్రమైన హింసను అనుమతించినప్పటికీ అలాంటి హింసకు గురైనవారిని ఆయన ప్రేమపూర్వకంగా బలపరిచాడు. హింసించబడినప్పుడు చాలామంది క్రైస్తవులు దేవునిపై విశ్వాసం, నమ్మకం కలిగివుండడంలో అద్భుతమైన మాదిరిని ఉంచారు.

20 మరోవైపున, అనేక దేశాల్లో మనకు చట్టబద్ధమైన గుర్తింపు ఉంది, కొన్నిసార్లు మనకు ప్రచార మాధ్యమాల నుండి అనుకూలమైన ప్రచారం లభిస్తుంది. దీనికి మనం కృతజ్ఞులమై ఉన్నాము, ఇది కూడా యెహోవా సంకల్పాన్ని నెరవేర్చడానికి సహాయపడుతుందని గుర్తిస్తాము. ఆయన ఆశీర్వాదంతో, మనం ఈ గొప్ప స్వేచ్ఛను మన వ్యక్తిగత జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికి కాదు గానీ బహిరంగంగా, సంపూర్ణంగా యెహోవా సేవ చేయడానికి వినియోగించుకుంటాము. అయితే, అధికారుల మన్ననలు పొందడానికి మనం ఎన్నడూ మన తటస్థత విషయంలో రాజీపడము, మన ప్రకటనా కార్యకలాపాలను తగ్గించము, లేదా యెహోవాకు మనం చేసే సేవను ఏ విధంగానూ బలహీనపరచము. మనం మెస్సీయా రాజ్య పౌరులం, సంపూర్ణంగా యెహోవా సర్వోన్నతాధిపత్యం పక్షం వహిస్తాము. మన నిరీక్షణ ఈ విధానంపై కాదుగానీ పరలోక మెస్సీయా రాజ్యం ఈ భూమిపై పరిపాలించే ఏకైక ప్రభుత్వంగా ఉండే నూతన లోకంపై ఆధారపడి ఉంది. బాంబులు, క్షిపణులు, అణుబాంబుల దాడులు ఆ ప్రభుత్వాన్ని కదల్చలేవు, పరలోకం నుండి దాన్ని పడద్రోయలేవు. అది అజేయమైన రాజ్యం, దానిపట్ల యెహోవాకున్న సంకల్పాన్ని అది నెరవేరుస్తుంది.​—⁠దానియేలు 2:44; హెబ్రీయులు 12:28; ప్రకటన 6:⁠2.

21 “మనము నశించుటకు వెనుకతీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమైయున్నాము” అని పౌలు అంటున్నాడు. (హెబ్రీయులు 10:​39) కాబట్టి మనమందరం అంతం వరకు నమ్మకంగా యెహోవా సేవ చేద్దాము. మనం ఇప్పుడూ నిరంతరమూ యెహోవాపై సంపూర్ణ నమ్మకాన్ని ఉంచడానికి మనకు ప్రతి కారణం ఉంది.​—⁠కీర్తన 37:3; 125:⁠1.

మీరేమి నేర్చుకున్నారు?

• యెహోషువ, కాలేబు ఎందుకు మంచి నివేదికను ఇచ్చారు?

• మనం యెహోవాపై సంపూర్ణ నమ్మకంతో ఉండడానికి కొన్ని కారణాలు ఏవి?

• యెహోవాపై నమ్మకం ఉంచడమంటే ఏమిటి?

• యెహోవాపై నమ్మకం ఉంచి మనం ఏ స్థానం వహించడానికి నిశ్చయించుకున్నాము?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. భద్రత కోసం ప్రజలు వ్యర్థంగా నమ్ముకునే కొన్ని ఏవి?

3, 4. యెహోషువ, కాలేబు ఇచ్చిన నివేదికకు, పదిమంది ఇతర వేగులవారు ఇచ్చిన నివేదికకు ఉన్న తేడా ఏమిటి?

5. యెహోషువ, కాలేబు ఎందుకు మంచి నివేదికను ఇచ్చారు?

6. నేడు క్రైస్తవులు ఒత్తిడి క్రింద ఎందుకున్నారు, వారు ఎవరిపై నమ్మకముంచాలి?

7, 8. యెహోవాపై నమ్మకముంచడానికి సృష్టి మనకు ఎలా కారణాలను ఇస్తుంది? (బి) యెహోవాపై నమ్మకముంచడానికి బైబిలు మనకు ఏ కారణాలను ఇస్తుంది?

9. విమోచన క్రయధన ఏర్పాటు, యేసు పునరుత్థానం యెహోవాపై మన నమ్మకాన్ని ఎలా బలపరుస్తాయి?

10. యెహోవాపై నమ్మకం ఉంచడానికి మనకు ఏ వ్యక్తిగత కారణాలున్నాయి?

11. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు యెహోవాపై నమ్మకం ఉంచాడు?

12, 13. వ్యతిరేకులు తమ నాలుకలను మనపైకి ఆయుధాలుగా ఉపయోగించినప్పటికీ మనం యెహోవాపై నమ్మకం ఉంచాలని దావీదు ఎలా చూపించాడు?

14. (ఎ) ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో సహితం హిజ్కియా యెహోవాపై నమ్మకం ఉంచాడు? (బి) అష్షూరీయుని అబద్ధాలను తాను నమ్మలేదని హిజ్కియా ఎలా చూపించాడు?

15. అస్థిరమైన ఈ లోకంలో కష్టతరమైన ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ సిద్ధంగా ఉండడానికి ఏది మాత్రమే మనకు సహాయం చేయగలదు?

16, 17. మనకు యెహోవాపై నమ్మకం ఉందని మనమెలా చూపిస్తాము?

18. క్రైస్తవులు నేడు పౌలు మాదిరిని ఎలా అనుసరిస్తారు, కానీ వారు దేనిపై తమ నమ్మకాన్ని ఉంచరు?

19. హింసించబడినప్పుడు మన సహోదరులకు యెహోవాపై ఉన్న నమ్మకం తగినదేనని ఎలా నిరూపించబడింది?

20. చట్టపరమైన స్వేచ్ఛ నుండి మనం ప్రయోజనం పొందినప్పటికీ ఏ విషయాల్లో మనం ఎన్నటికీ రాజీపడము?

21. మనం ఏ మార్గాన్ని అనుసరించడానికి నిశ్చయించుకున్నాము?

[15వ పేజీలోని చిత్రం]

యెహోషువ, కాలేబు ఎందుకు మంచి నివేదికను ఇచ్చారు?

[16వ పేజీలోని చిత్రం]

యెహోవాపై నమ్మకం ఉంచడానికి సృష్టి మనకు బలమైన కారణాన్నిస్తుంది

[చిత్రసౌజన్యం]

మూడు చిత్రాలూ: Courtesy of Anglo-Australian Observatory, photograph by David Malin

[18వ పేజీలోని చిత్రం]

 యిహోవాపై నమ్మకం ఉంచడమంటే ఆయన నమ్మేవారిపై నమ్మకం ఉంచడమని అర్థం