కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా “బహుగా” క్షమిస్తాడు

యెహోవా “బహుగా” క్షమిస్తాడు

యెహోవా “బహుగా” క్షమిస్తాడు

క్షమించడం అంటే తప్పుచేసిన వ్యక్తిని మన్నించడం; ఆయన చేసిన తప్పును బట్టి ఆయనపట్ల కోపం ఉంచుకోకుండా, ఏ విధమైన ప్రతిక్రియ చేయకుండా ఉండడం.

ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, దేవునికి వ్యతిరేకంగా లేదా తన తోటివారికి వ్యతిరేకంగా పాపంచేసిన వ్యక్తి తన పాపాలు క్షమించబడాలంటే, ధర్మశాస్త్రం పేర్కొన్నట్లుగా మొదట తన తప్పును సరిదిద్దుకొని ఆ తర్వాత​—⁠అనేక సందర్భాల్లో​—⁠రక్తాన్ని చిందించి యెహోవాకు బలి అర్పించాలి. (లేవీయకాండము 5:5-6:⁠7) అందుకే పౌలు ఈ సూత్రాన్ని పేర్కొన్నాడు: “ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.” (హెబ్రీయులు 9:​22) అయితే, వాస్తవానికి జంతు బలుల రక్తం పాపాలను నిర్మూలించి ఒక వ్యక్తికి పరిపూర్ణంగా పరిశుభ్రమైన మనస్సాక్షిని ఇవ్వలేదు. (హెబ్రీయులు 9:​9, 13, 14; 10:1-4) దానికి భిన్నంగా, ప్రవచించబడిన క్రొత్త నిబంధన, యేసుక్రీస్తు అర్పించిన విమోచన క్రయధన బలి ఆధారంగా నిజమైన క్షమాపణను సాధ్యం చేసింది. (యిర్మీయా 31:33, 34; మత్తయి 26:28; 1 కొరింథీయులు 11:25; ఎఫెసీయులు 1:⁠7) యేసు భూమ్మీద ఉన్నప్పుడు కూడా, పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని స్వస్థపరచడం ద్వారా, తనకు పాపాలను క్షమించే అధికారం ఉందని చూపించాడు.​—⁠మత్తయి 9:​2-8.

తప్పిపోయిన కుమారుని గురించి, తన దాసుని అప్పును క్షమించిన ఒక రాజు గురించి యేసు చెప్పిన ఉపమానాలు యెహోవా “బహుగా” క్షమిస్తాడనే విషయాన్ని సూచిస్తున్నాయి. ఈ రెండవ ఉపమానంలో ఒక రాజు తనకు 10,000 తలాంతులు (6,00,00,000 దేనారములు, లేదా ఇంచుమించు 4,00,00,000 డాలర్లు) చెల్లించవలసివున్న ఒక దాసుడ్ని క్షమిస్తాడు గానీ ఆ దాసుడు తనకు వంద దేనారములు (దాదాపు 70 డాలర్లు) చెల్లించవలసివున్న తన తోటిదాసుడ్ని క్షమించడానికి ఇష్టపడడు. (యెషయా 55:7; లూకా 15:11-32; మత్తయి 18:​23-35) అయితే, యెహోవా క్షమాపణ భావోద్వేగాలతో పురికొల్పబడేది కాదు, ఎందుకంటే ఆయన ఘోరమైన తప్పులకు శిక్షించకుండా విడిచిపెట్టడు. (కీర్తన 99:⁠8) మతభ్రష్టత్వాన్ని యెహోవా క్షమించడని యెహోషువ ఇశ్రాయేలీయులను హెచ్చరించాడు.​—⁠యెహోషువ 24:19, 20; యెషయా 2:​6-9 పోల్చండి.

దేవుణ్ణి క్షమాపణ కోరడానికి, దాన్ని పొందడానికి ఆయన ఒక నిర్దిష్టమైన విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తి తన పాపాన్ని అంగీకరించాలి, అది దేవునికి వ్యతిరేకంగా చేయబడిన తప్పని గుర్తించాలి, దాన్ని సంపూర్ణంగా ఒప్పుకోవాలి, జరిగిన తప్పుకు హృదయపూర్వకంగా తీవ్రంగా దుఃఖించాలి, అలాంటి మార్గం నుండి లేదా అలవాటు నుండి మళ్ళడానికి కృతనిశ్చయం చేసుకోవాలి. (కీర్తన 32:5; 51:4; 1 యోహాను 1:8, 9; 2 కొరింథీయులు 7:​8-11) జరిగిన తప్పును సరిదిద్దుకోవడానికి లేదా జరిగిన నష్టాన్ని పూడ్చడానికి తాను చేయగలిగినదంతా చేయాలి. (మత్తయి 5:​23, 24) ఆ తర్వాత అతడు దేవునికి ప్రార్థిస్తూ క్రీస్తు విమోచన క్రయధన బలి ఆధారంగా క్షమాపణ కోరాలి.​—⁠ఎఫెసీయులు 1:⁠7.

అంతేగాక ఇతరులు వ్యక్తిగతంగా మనపట్ల చేసిన తప్పులకు ఎన్నిసార్లయినా సరే వారిని క్షమించాలి, అది క్రైస్తవత్వంలో తప్పనిసరి. (లూకా 17:3, 4; ఎఫెసీయులు 4:32; కొలొస్సయులు 3:​13) ఇతరులను క్షమించడానికి నిరాకరించే వారికి దేవుని క్షమాపణ లభించదు. (మత్తయి 6:​14, 15) అయితే, గంభీరమైన పాపం మూలంగా ఒక “దుర్మార్గుని” క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించవలసి వచ్చినా, ఆ వ్యక్తి తాను నిజంగా పశ్చాత్తాపపడుతున్నానని నిరూపించుకున్నప్పుడు తగిన సమయంలో ఆయనను క్షమించవచ్చు. ఆ సమయంలో సంఘంలోని వారందరూ ఆయన పట్ల తమ ప్రేమను చూపించవచ్చు. (1 కొరింథీయులు 5:13; 2 కొరింథీయులు 2:​6-11) అయితే, పశ్చాత్తాపపడకుండా విద్వేషపూరితంగా, ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూనే ఉండేవారిని క్రైస్తవులు క్షమించవలసిన అవసరం లేదు. అలాంటి వారు దేవునికి శత్రువులవుతారు.​—⁠హెబ్రీయులు 10:26-31; కీర్తన 139:21, 22.

ఇతరుల తరఫున, చివరికి సంఘమంతటి తరఫున దేవుని క్షమాపణ కోసం ప్రార్థించడం సబబే. మోషే ఇశ్రాయేలు జనాంగం కోసం అలాగే చేశాడు, ఒక జనాంగంగా వారు చేసిన పాపాన్ని ఒప్పుకొని ఆయన క్షమాపణ కోరినప్పుడు యెహోవా ఆయన ప్రార్థనను ఆలకించాడు. (సంఖ్యాకాండము 14:​19, 20) సొలొమోను కూడా ఆలయ ప్రతిష్ఠాపన సమయంలో, యెహోవా ప్రజలు పాపం చేసి ఆ తర్వాత తప్పు మార్గం నుండి మళ్ళినప్పుడు వారిని క్షమించమని ఆయనకు ప్రార్థించాడు. (1 రాజులు 8:30, 33-40, 46-52) తిరిగి వచ్చిన యూదుల పాపాలను బహిరంగంగా ఒప్పుకోవడంలో ఎజ్రా వారికి ప్రాతినిధ్యం వహించాడు. ఆయన హృదయపూర్వకమైన ప్రార్థన, ఉద్బోధ మూలంగా ప్రజలు యెహోవా తమను క్షమించేలా చర్య తీసుకున్నారు. (ఎజ్రా 9:13-10:4; 10:​10-19, 44) ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తన కోసం ప్రార్థించడానికి సంఘ పెద్దలను పిలిపించాలని యాకోబు సలహా ఇచ్చాడు, “అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.” (యాకోబు 5:​14-16) అయితే, “మరణకరమైన పాపము” ఉంది, అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపం, ఉద్దేశపూర్వకంగా చేస్తూనే ఉండే ఆ పాపానికి క్షమాపణ లేదు. ఇలాంటి పాపం చేసేవారి కోసం ఒక క్రైస్తవుడు ప్రార్థించకూడదు.​—⁠1 యోహాను 5:16; మత్తయి 12:31; హెబ్రీయులు 10:​26, 27.