రాజ్యానికి ప్రథమస్థానం ఇవ్వడం—సురక్షితమైన, ఆనందభరితమైన జీవితం
జీవిత కథ
రాజ్యానికి ప్రథమస్థానం ఇవ్వడం—సురక్షితమైన, ఆనందభరితమైన జీవితం
జత సునల్ చెప్పినది
ఉదయం కాఫీ ఫలహారాలయ్యాక మేము రేడియోలో ఈ ప్రకటన విన్నాం: “యెహోవాసాక్షులు చట్టవిరుద్ధమైనవారు, వాళ్ళ పని నిషేధించబడింది.”
అది 1950, ఇరవయ్యవ పడిలోని యువతులమైన మేము నలుగురం డొమినికన్ రిపబ్లిక్‌లో యెహోవాసాక్షుల మిషనరీలుగా సేవ చేస్తున్నాము. క్రితం సంవత్సరమే మేమక్కడికి చేరుకున్నాము.
మిషనరీ సేవ మొదటినుండి నా జీవిత లక్ష్యమేమీ కాదు. అవును, చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళేదాన్ని. అయితే మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మా నాన్నగారు చర్చికి వెళ్ళడం మానేశారు. నేను 1933లో ఎపిస్కోపల్ చర్చిలో సభ్యత్వం పొందిన రోజున బిషప్పు బైబిలులో నుండి కేవలం ఒకే ఒక్క లేఖనం చదివి, రాజకీయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మ ఎంతగా కలత చెందిందంటే ఆ తర్వాత ఆమె మళ్ళీ చర్చిలో అడుగుపెట్టలేదు.
మా జీవిత విధానం మారింది
మా నాన్నగారి పేరు విలియమ్ కార్ల్ ఆడమ్స్, అమ్మ పేరు మేరీ, వాళ్ళకు మొత్తం ఐదుగురు పిల్లలు. అబ్బాయిల పేర్లు డాన్, జోయెల్, కార్ల్. మా చెల్లి జోయి అందరికన్నా చిన్నది, నేను అందరికన్నా పెద్దదాన్ని. అప్పుడు నాకు దాదాపు పదమూడేళ్ళు ఉండవచ్చు, ఒకరోజు నేను స్కూలు నుండి వచ్చేసరికి అమ్మ యెహోవాసాక్షులు ప్రచురించిన ఒక చిన్న పుస్తకం చదువుతోంది. దాని పేరు రాజ్యం, ప్రపంచ నిరీక్షణ (ఆంగ్లం). “ఇదే సత్యం” అని అమ్మ నాతో అన్నది.
అమ్మ తాను బైబిలు నుండి నేర్చుకుంటున్న విషయాల గురించి మా అందరితోను మాట్లాడేది. “ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి” అని యేసు ఇచ్చిన ఉపదేశ ప్రాముఖ్యతను అమ్మ తన మాట ద్వారా, మాదిరి ద్వారా మా హృదయాలపై గాఢంగా ముద్రించింది.—మత్తయి 6:33.
నేనెప్పుడూ అంత ఆసక్తిగా వినేదాన్ని కాదు. ఒకసారైతే, “అమ్మా, నాకు బోధ చేయడం మానకపోయావంటే నేను గిన్నెలు తుడిచిపెట్టడం మానేస్తాను చూడు” అన్నాను. అయినా ఆమె విడువక ఎంతో నేర్పుగా మాతో మాట్లాడేది. ఆమె, పిల్లలమైన మమ్మల్నందరినీ క్లారా రైన్
వాళ్ళింట్లో జరిగే బైబిలు అధ్యయనాలకు క్రమంగా తీసుకువెళ్ళేది. క్లారా రైన్ వాళ్ళ ఇల్లు అమెరికాలో, ఇల్లినోయిస్‌లోని ఎల్మ్‌హర్ట్స్‌లో ఉన్న మా ఇంటి నుండి నడిచివెళ్ళగలిగేంత దగ్గర్లో ఉండేది.క్లారా పియానో పాఠాలు కూడా నేర్పించేది. తన విద్యార్థులు సంవత్సరానికొకసారి బహిరంగంగా చేసే సంగీత ప్రదర్శన సమయంలో, దేవుని రాజ్యం గురించి, పునరుత్థాన నిరీక్షణ గురించి మాట్లాడడానికి ఆమె ఆ అవకాశాన్ని ఉపయోగించుకునేది. నాకు సంగీతంలో ఆసక్తి ఉంది కాబట్టి, ఏడేళ్ళ వయస్సు నుండే వయోలిన్ నేర్చుకున్నాను కాబట్టి నేను క్లారా చెప్పేది వినేదాన్ని.
త్వరలోనే పిల్లలమైన మేము అమ్మతోపాటు చికాగో పశ్చిమవైపున సంఘ కూటాలకు హాజరుకావడం మొదలుపెట్టాము. అది చాలా దూరం, అక్కడికి వెళ్ళాలంటే బస్సులోనూ స్ట్రీట్‌కార్‌లోనూ వెళ్ళాలి, అయితే రాజ్యానికి ప్రథమస్థానం ఇచ్చేందుకు మాకివ్వబడిన తొలి తర్ఫీదులో అది ఒక భాగం. అమ్మ బాప్తిస్మం తీసుకున్న మూడేళ్ళకు, 1938లో, చికాగోలో జరిగిన యెహోవాసాక్షుల సమావేశానికి నేను అమ్మతోపాటు వెళ్ళాను. ఆ సందర్భం కోసం రేడియోటెలిఫోన్ ద్వారా అనుసంధానం చేయబడిన 50 నగరాల్లో అదొకటి. అక్కడ నేను విన్నది నా హృదయాన్ని స్పృశించింది.
అయితే, మరోవైపున సంగీతం మీదున్న ప్రేమ కూడా నా హృదయ తంత్రులను మీటుతోంది. నేను 1938లో ఉన్నత పాఠశాల విద్య ముగించాను, చికాగోలోని అమెరికన్ కన్సర్వేటరీ ఆఫ్ మ్యూజిక్‌లో నేను చదువుకోవడానికి నాన్నగారు ఏర్పాట్లు చేశారు. కాబట్టి తర్వాతి రెండు సంవత్సరాల్లో నేను సంగీతం నేర్చుకొని, రెండు ఆర్కెస్ట్రాలలో పాల్గొని, ఆ రంగంలో ముందుకు వెళ్ళడం గురించి ఆలోచించాను.
నాకు వయోలిన్ నేర్పిస్తున్న హర్బర్ట్ బట్లర్ యూరప్ వదిలేసి అమెరికాలో నివసించడానికి వచ్చాడు. అందుకే ఆయన చదవడం కోసం శరణార్థులు * (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్నిచ్చాను. ఆయన దాన్ని చదివాడు, ఆ తర్వాతి వారం నా సంగీతం పాఠం అయ్యాక, “జెత, నువ్వు చాలా బాగా వాయిస్తావు, ఇలాగే సాధన కొనసాగిస్తే నీకు రేడియో ఆర్కెస్ట్రాలోగానీ సంగీత పాఠశాలలోగానీ ఉద్యోగం వస్తుంది. కానీ. . .” అంటూ నేను ఆయనకిచ్చిన చిన్న పుస్తకం వైపుకు వేలుపెట్టి చూపిస్తూ, “నీకు దీని మీద ఎక్కువ ఆసక్తి ఉందని నాకనిపిస్తోంది. నీవు దీన్నే నీ జీవిత లక్ష్యంగా ఎందుకు చేసుకోకూడదు?” అన్నాడు.
నేను దాని గురించి గంభీరంగా ఆలోచించాను. కన్సర్వేటరీలో నా చదువు కొనసాగించే బదులు, 1940 జూలైలో మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో యెహోవాసాక్షుల సమావేశానికి రమ్మని అమ్మ అడగడంతో దానికి అంగీకరించాను. మేము ట్రెయిలర్ సిటీలో టెంట్లలో ఉన్నాము. నేను నా వయోలిన్ కూడా నాతోపాటు తీసుకెళ్ళాను, సమావేశంలోని ఆర్కెస్ట్రాలో దాన్ని వాయించాను. అయితే ట్రెయిలర్ సిటీలో నేను
చాలామంది పయినీర్లను (పూర్తికాల సువార్తికులు) కలిశాను. వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. బాప్తిస్మం తీసుకుని, పయినీరు సేవ చేయడానికి దరఖాస్తు పెట్టాలని నిర్ణయించుకున్నాను. నేను నా జీవితమంతా పూర్తికాల పరిచర్యలో కొనసాగేలా నాకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాను.మా సొంత పట్టణంలోనే పయినీరు సేవ ప్రారంభించాను. తర్వాత నేను చికాగోలో సేవ చేశాను. తర్వాత 1943లో కెంటుకీకి వెళ్ళాను. ఆ వేసవిలో, సరిగ్గా జిల్లా సమావేశానికి ముందు, మిషనరీ పనిలో తర్ఫీదు పొందడానికి గిలియడ్ పాఠశాల రెండవ తరగతికి హాజరవమని నాకు ఆహ్వానం వచ్చింది. ఆ తరగతి 1943 సెప్టెంబరులో ప్రారంభం కానుంది.
ఆ వేసవి కాలంలో జరిగిన సమావేశంలో నేను ఒక సాక్షి ఇంట్లో ఉన్నాను, ఆమె తన కుమార్తె బట్టల్లో నుండి నాకు కావలసినవన్నీ నన్ను తీసుకోమంది. ఆమె కుమార్తె సైన్యంలో చేరి, తన వస్తువులన్నీ వేరేవాళ్ళకు ఇచ్చేయమని వాళ్ళమ్మకు చెప్పిందట. నాకైతే అవి, “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అని యేసు చేసిన వాగ్దాన నెరవేర్పే అనిపించింది. (మత్తయి 6:33) గిలియడ్‌లో ఐదు నెలలు చాలా త్వరగా గడిచిపోయాయి, 1944, జనవరి 31న పట్టభద్రురాలినై, మిషనరీ సేవలోకి ప్రవేశించడానికి ఆత్రంగా ఎదురు చూశాను.
వాళ్ళు కూడా పూర్తికాల సేవను ఎంపిక చేసుకున్నారు
అమ్మ 1942లో పయినీరు సేవ ప్రారంభించింది. ఆ సమయంలో, మా తమ్ముళ్ళు ముగ్గురూ మా చెల్లి ఇంకా స్కూలుకు వెళ్తున్నారు. అమ్మ తరచూ స్కూలు అయిపోయాక వాళ్ళను కలుసుకుని, తనతోపాటు పరిచర్యకు తీసుకువెళ్ళేది. అమ్మ వాళ్ళకు ఇంటి పనులు చేయడం కూడా నేర్పించింది. అమ్మ పగలు పరిచర్యకు వెళ్ళడానికి వీలుగా రాత్రి చాలా సేపటి వరకు మెలకువగా ఉండి బట్టలు ఇస్త్రీ చేయడం, అవసరమైన ఇతర పనులు చూసుకోవడం లాంటివి చేస్తుండేది.
నేను 1943 జనవరిలో కెంటుకీలో పయినీరు సేవ చేస్తుండగా, మా తమ్ముడు డాన్ కూడా పయినీరు సేవ ప్రారంభించాడు. దానితో నాన్నగారు నిరాశ చెందారు, మా తల్లిదండ్రుల్లాగే మేము కూడా పెద్ద చదువులు చదువుకుంటామని ఆయన ఆశించారు. డాన్ దాదాపు రెండు సంవత్సరాలపాటు పయినీరు సేవ చేసిన తర్వాత, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో పూర్తికాల సేవను కొనసాగించడానికి ఆయనకు ఆహ్వానం అందింది.
1943 జూన్‌లో జోయెల్ ఇంటి దగ్గరే ఉండి పయినీరు సేవ ప్రారంభించాడు. ఆ రోజుల్లో సమావేశానికి హాజరవ్వమని నాన్నగారిని ఒప్పించడానికి ప్రయత్నించాడు గానీ విఫలమయ్యాడు. అయితే, జోయెల్ ఆ ప్రాంతంలో ఒక గృహ బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించి విఫలమవ్వడంతో “సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది” (ఆంగ్లం) అనే పుస్తకం నుండి జోయెల్ తనతో అధ్యయనం నిర్వహించడానికి నాన్నగారు అంగీకరించారు. నాన్నగారు ప్రశ్నలకు సులభంగానే సమాధానం చెప్పేవారు గానీ పుస్తకంలో చెప్పబడినదానికి లేఖనాధారిత రుజువును చూపించమని జోయెల్‌ను ఒత్తిడి చేసేవారు. అది బైబిలు సత్యాలను తన సొంతం చేసుకునేందుకు జోయెల్‌కు సహాయం చేసింది.
ఒక పరిచారకునిగా (సైన్యంలో చేరకుండా ఉండేందుకు) డాన్‌కు మినహాయింపు ఇచ్చిన సెలెక్టివ్ సర్వీస్ బోర్డ్ వారు తనకు కూడా మినహాయింపు ఇస్తారని జోయెల్ ఆశించాడు. కానీ జోయెల్ మరీ యువకుడిలా కనిపిస్తుండడం చూసి బోర్డ్ వారు ఆయనను పరిచారకునిగా వర్గీకరించడానికి నిరాకరించి, సైన్యంలో చేరమని నోటీసు పంపారు. ఆయన దానికి లోబడకపోయేసరికి అరెస్టు వారంట్ జారీ చేశారు. ఎఫ్. బి. ఐ. ఆయనను పట్టుకున్నప్పుడు ఆయన కుక్ కౌంటీ జైలులో మూడు రోజులు గడిపాడు.
ఆయనను జామీను మీద విడిపించడానికి నాన్నగారు మా ఇంటిని కుదువ పెట్టారు. ఆ తర్వాత అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న యౌవనస్థులైన ఇతర సాక్షుల కోసం కూడా నాన్నగారు అలాగే చేశారు. జరుగుతున్న అన్యాయాన్ని బట్టి నాన్నగారికి చాలా కోపం వచ్చింది, అప్పీలు పెట్టుకోవడానికి వీలవుతుందేమో చూడడానికి ఆయన జోయెల్‌తో పాటు వాషింగ్‌టన్ డి.సి.కి వెళ్ళారు. చివరికి, జోయెల్ పరిచారకుడిగా వర్గీకరించబడ్డాడు, దానితో కేసు కొట్టేశారు. మిషనరీ నియామకంలో ఉన్న నాకు మా నాన్నగారు,
“ఈ విజయానికి ఘనతను యెహోవాకే ఆపాదించాలి!” అని వ్రాశారు. జోయెల్‌కు కూడా 1946 ఆగస్టు చివరి భాగానికల్లా బ్రూక్లిన్‌లోని ప్రధాన కార్యాలయ సిబ్బందిలో సభ్యునిగా సేవ చేయడానికి ఆహ్వానం అందింది.స్కూలు సెలవుల్లో అనేకసార్లు పయినీరు సేవ చేసిన కార్ల్, 1947 తొలి భాగంలో తన ఉన్నత పాఠశాల విద్య ముగించిన తర్వాత క్రమ పయినీరుగా సేవ ప్రారంభించాడు. అప్పుడు నాన్నగారి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో, వ్యాపార విషయాల్లో కార్ల్ ఆయనకు కొంతకాలంపాటు సహాయం చేసి, మరోచోట తన పయినీరు నియామకాన్ని ప్రారంభించడానికి వెళ్ళిపోయాడు. తర్వాత 1947 చివరి భాగంలో కార్ల్ కూడా డాన్, జోయెల్ చేసినట్లే బ్రూక్లిన్ ప్రధాన కార్యాలయంలో బేతేలు కుటుంబ సభ్యుడిగా సేవ చేయడం ప్రారంభించాడు.
జోయి ఉన్నత పాఠశాల విద్య ముగించి, పయినీరు సేవ ప్రారంభించింది. తర్వాత 1951లో ఆమె కూడా తన అన్నయ్యల్లాగే బేతేలుకు వెళ్ళింది. ఆమె హౌస్‌కీపింగ్‌లోనూ సబ్‌స్క్రిప్షన్ విభాగంలోనూ పనిచేసింది. ఆమె 1955లో, బేతేలు కుటుంబ సభ్యుడైన రోజర్ మొర్గన్‌ను వివాహం చేసుకుంది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత, తమ సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు బేతేలు నుండి వచ్చేశారు. కాలం గడుస్తుండగా వారికిద్దరు పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా యెహోవా సేవ చేస్తున్నారు.
పిల్లలందరూ పూర్తికాల సేవలో ఉన్నప్పుడు, అమ్మ నాన్నగారికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో 1952లో ఆయన కూడా తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నారు. అప్పటి నుండి తన మరణం వరకు అంటే 15 ఏళ్ళ పాటు, అనారోగ్యం మూలంగా పరిమితులు ఉన్నప్పటికీ ఇతరులతో రాజ్య సత్యాన్ని పంచుకోవడానికి కొత్త మార్గాలను కనిపెట్టడంలో ఆయన ఎంతో సహాయకరంగా ఉన్నారు.
నాన్నగారి అనారోగ్యం మూలంగా అమ్మ కొంతకాలంపాటు పయినీరు సేవ మానుకున్నా ఆ తర్వాత మళ్ళీ మొదలుపెట్టి తన మరణం వరకు పయినీరు సేవ కొనసాగించింది. ఆమెకు కారు ఉండేది కాదు; సైకిలు కూడా ఉపయోగించేది కాదు. పొట్టిగా ఉండే అమ్మ ఎక్కడికైనా నడిచి వెళ్ళిపోయేది, బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి మారుమూల గ్రామ ప్రాంతాలకు తరచూ కాలినడకనే వెళుతుండేది.
మిషనరీ క్షేత్రంలోకి
గిలియడ్ పాఠశాల నుండి పట్టభద్రులమైన తర్వాత, మాలో కొంతమందిమి మా ప్రయాణానికి అవసరమైన చట్టపరమైన కాగితాలు వచ్చే వరకూ ఒక సంవత్సరం పాటు న్యూయార్క్ నగరం ఉత్తర భాగంలో పయినీరు సేవ చేశాము. చివరికి, 1945లో మేము మాకు నియామకం ఇవ్వబడిన క్యూబాకు బయలుదేరాము, అక్కడ మేము మెల్లగా కొత్త జీవనశైలికి అలవాటుపడ్డాము. మా ప్రకటనా పనికి మంచి ప్రతిస్పందన లభించేది, త్వరలోనే మేమందరం ఎన్నో బైబిలు అధ్యయనాలు నిర్వహించడం మొదలుపెట్టాము. అక్కడ మేము కొన్ని సంవత్సరాలపాటు సేవ చేశాము. తర్వాత మాకు డొమినికన్ రిపబ్లిక్‌లో నియామకం లభించింది. ఒకరోజు ఒక స్త్రీ, బైబిలు అర్థం చేసుకోవడానికి సహాయం కావాలని కోరుతున్న సూజన్ ఎన్‌ఫ్రా అనే ఫ్రాన్స్ దేశస్థురాలైన తన క్లయింట్‌ను కలవమని నన్ను కోరింది.
సూజన్ యూదురాలు, హిట్లర్ ఫ్రాన్స్‌పై దాడి చేసినప్పుడు, ఆమె భర్త ఆమెను, ఆమె ఇద్దరు పిల్లల్ని మరో దేశానికి తీసుకువెళ్ళాడు. సూజన్ తాను నేర్చుకుంటున్న విషయాలను వెంటనే వేరేవాళ్ళతో పంచుకోవడం మొదలుపెట్టింది. ఆమెను కలవమని నాకు చెప్పిన స్త్రీతో ఆమె మొదట మాట్లాడింది, తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన తన స్నేహితురాలైన
బ్లాంష్‌తో మాట్లాడింది. ఇద్దరూ బాప్తిస్మం తీసుకునేంత వరకు అభివృద్ధి సాధించారు.“నా పిల్లలకు సహాయం చేయడానికి నేనేమి చేయవచ్చు?” అని సూజన్ నన్ను అడిగింది. ఆమె కుమారుడు మెడిసిన్ చదువుతున్నాడు, ఆమె కుమార్తె బాలే నేర్చుకుంటోంది, న్యూయార్క్‌లోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో డాన్సు చేయాలని ఆశిస్తోంది. సూజన్ వాళ్ళకు కావలికోట, తేజరిల్లు! పత్రికలు క్రమంగా వెళ్ళేలా చందా కట్టింది. ఫలితంగా సూజన్ కుమారుడు, ఆయన భార్య, ఆయన భార్య యొక్క కవల సహోదరి అందరూ సాక్షులయ్యారు. డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వం ఆ సమయంలో మన పనిని నిషేధించింది కాబట్టి సూజన్ భర్త లూయిస్ తన భార్య యెహోవాసాక్షుల పట్ల చూపిస్తున్న ఆసక్తిని బట్టి కంగారుపడ్డాడు. కానీ కుటుంబమంతా అమెరికాకు తరలి వెళ్ళిన తర్వాత, చివరికి ఆయన కూడా సాక్షి అయ్యాడు.
నిషేధం ఉన్నప్పటికీ సేవలో కొనసాగడం
మాకు 1949లో డొమినికన్ రిపబ్లిక్‌కు నియామకం ఇవ్వబడి ఎంతోకాలం గడవక ముందే అక్కడ యెహోవాసాక్షుల పని నిషేధించబడినప్పటికీ మనుష్యులకు కాదు మేము దేవునికే లోబడవలెనన్నది మా నిశ్చయం. (అపొస్తలుల కార్యములు 5:29) యేసుక్రీస్తు తన అనుచరులకు ఉపదేశించినట్లుగానే, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం ద్వారా మేము దేవుని రాజ్యానికి ప్రథమస్థానం ఇవ్వడం కొనసాగించాము. (మత్తయి 24:14) అయితే మేము మా ప్రకటనా పనిలో ‘పాములవలె వివేకంగా, పావురములవలె నిష్కపటంగా’ ఉండడం నేర్చుకున్నాము. (మత్తయి 10:16) ఉదాహరణకు, నా వయోలిన్ నాకు గొప్ప సహాయంగా ఉండేది. నేను బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి వెళ్ళేటప్పుడు దాన్ని నాతోపాటు తీసుకువెళ్ళేదాన్ని. నా విద్యార్థులు వయోలిన్ వాయించేవారిగా కాలేదు గానీ కొన్ని కుటుంబాలు యెహోవా సేవకులయ్యారు!
నిషేధం విధించబడిన తర్వాత, అమ్మాయిలమైన మేము నలుగురం—మేరీ ఆన్యోల్, సోఫ్యా సొవీక్, ఈడ్త్ మొర్గన్, నేను—సాన్ ఫ్రాన్సిస్కో డె మకోరీస్‌లోని మిషనరీ గృహం నుండి రాజధాని నగరమైన సాంటో డొమింగోలో ఉన్న బ్రాంచ్‌లోని మిషనరీ గృహానికి మార్చబడ్డాము. కానీ ప్రతి నెల, సంగీతం పాఠాలు బోధించడానికి నేను నా అసలు నియామకానికి వెళ్ళేదాన్ని. దానితో నేను నా వయోలిన్ కేస్‌లో మన క్రైస్తవ సహోదరుల కోసం ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకువెళ్ళడానికి, వాళ్ళ సాక్ష్యమిచ్చే కార్యకలాపాల రిపోర్టులను వెనక్కి తీసుకు వచ్చేందుకు వీలయ్యేది.
సాన్ ఫ్రాన్సిస్కో డె మకోరీస్ నుండి వచ్చిన సహోదరులు క్రైస్తవులుగా తటస్థస్థానాన్ని వహించినందుకు సాంటియాగోలో చెరసాలలో వేయబడినప్పుడు, వాళ్ళ కోసం డబ్బు, వీలైతే బైబిళ్ళు తీసుకువెళ్ళి, వాళ్ళ దగ్గరి నుండి వాళ్ళ కుటుంబాలకు సమాచారం తీసుకురమ్మని నన్ను అడిగారు. సాంటియాగో చెరసాలలో, గార్డులు నా భుజానికున్న వయోలిన్ కేస్‌ను చూసి “అదెందుకు?” అని అడిగారు. “వాళ్ళ కోసం వాయించడానికి” అని నేను సమాధానమిచ్చాను.
నేను వాయించిన పాటల్లో ఒకటి, ఒక సాక్షి నాజీ నిర్బంధ శిబిరంలో ఉన్నప్పుడు వ్రాసినది. అదిప్పుడు యెహోవాసాక్షుల పాటల పుస్తకంలో 29వ పాట. చెరసాలలో ఉన్న మన సహోదరులు దాన్ని పాడడం నేర్చుకోవాలని నేనది వాయించాను.
చాలామంది సాక్షులు ప్రభుత్వాధినేత అయిన ట్రుహీయోకు చెందిన పొలానికి బదిలీ చేయబడ్డారని నాకు తెలిసింది. అది బస్సు మార్గానికి దగ్గరలోనే ఉందని నాకు చెప్పడంతో దాదాపు మధ్యాహ్నం వేళ, బస్సు దిగి ఆ పొలానికి ఎలా వెళ్ళాలో కనుక్కున్నాను. ఒక చిన్న దుకాణం యజమాని అది కొండల అవతల ఉందని చెప్పి,
నేను నా వయోలిన్‌ను తన దగ్గర పెడితే తన గుఱ్ఱాన్ని, నాకు దారి చూపడానికి ఒక చిన్న అబ్బాయిని పంపిస్తానన్నాడు.ఆ కొండల అవతల మేమొక నదిని దాటవలసి వచ్చింది, మేమిద్దరం గుఱ్ఱం మీద కూర్చుంటే అది ఈదుతూ మమ్మల్ని అవతలి వైపుకు తీసుకువెళ్ళింది. అక్కడ మాకు కొన్ని రామచిలుకలు కనిపించాయి, వాటి ఆకుపచ్చ నీలం ఈకలు సూర్యకాంతికి మెరుస్తున్నాయి. అదెంత అందంగావున్న దృశ్యమో! “వాటిని అంత అందంగా చేసినందుకు కృతజ్ఞతలు యెహోవా” అని నేను ప్రార్థించాను. చివరికి, మధ్యాహ్నం నాలుగు గంటల వేళ మేము ఆ పొలానికి చేరుకున్నాము. అక్కడ విధి నిర్వహణలో ఉన్న సైనికుడు నేను సహోదరులతో మాట్లాడడానికి దయాపూర్వకంగా అనుమతించాడు, నేను వాళ్ళ కోసం తెచ్చినవాటన్నింటినీ చివరికి ఒక చిన్న బైబిలును కూడా వాళ్ళకివ్వడానికి ఆయన అనుమతించాడు.
తిరిగి వచ్చేస్తున్నప్పుడు నేను దారిపొడుగునా ప్రార్థిస్తూనేవున్నాను ఎందుకంటే అప్పటికే చీకటి పడిపోయింది. మేము దుకాణం దగ్గరికి తిరిగి వచ్చేసరికి వర్షంలో తడిసి ముద్దైపోయాము. ఆ రోజు చివరి బస్సు వెళ్ళిపోయింది కాబట్టి, ఆ వైపుగా వెళ్తున్న ట్రక్కును నా కోసం ఆపమని దుకాణదారుడ్ని అడిగాను. ట్రక్కులో ఇద్దరు పురుషులతోపాటు నేను వెళ్ళడం మంచిదేనా? వారిలో ఒకరు, “మీకు సోఫ్యా తెలుసా? ఆమె మా చెల్లితో అధ్యయనం చేసింది” అని అడిగారు. అది యెహోవా నా ప్రార్థనలకు ఇచ్చిన సమాధానమే అని నాకనిపించింది! వాళ్ళు నన్ను సాంటో డొమింగోకు క్షేమంగా తీసుకువెళ్ళారు.
1953లో న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియం వద్ద జరిగిన యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశానికి డొమినికన్ రిపబ్లిక్ నుండి హాజరైనవారిలో నేనూ ఉన్నాను. నాన్నగారితో సహా మా కుటుంబమంతా అక్కడుంది. డొమినికన్ రిపబ్లిక్‌లో ప్రకటనా పని ఎలా వృద్ధి చెందుతోందనే దాని గురించి ఒక నివేదిక ఇవ్వబడిన తర్వాత, నిషేధం ఉన్నప్పుడు మేమెలా ప్రకటించామో చూపించే చిన్న ప్రదర్శనను నేనూ నా మిషనరీ సహచరి మేరీ ఆన్యోల్ ప్రదర్శించాము.
ప్రయాణపనిలోని ప్రత్యేక ఆనందాలు
ఆ వేసవిలో నేను రూడేల్ఫ్ సునల్‌ను కలిశాను, తర్వాతి సంవత్సరం మేము వివాహం చేసుకున్నాము. పెన్సిల్వేనియాలోని అల్గేనీలో ఉండే ఆయన కుటుంబ సభ్యులు, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కొంతకాలానికి సాక్షులయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తన క్రైస్తవ తటస్థతను బట్టి చెరసాలలో ఉన్న తర్వాత, ఆయన న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న బేతేలులో సేవ చేయడం ప్రారంభించారు. మా వివాహమైన కొంతకాలానికి, ప్రయాణ పైవిచారణకర్తగా సంఘాలను సందర్శించడానికి ఆయనకు ఆహ్వానం అందింది. తర్వాతి 18 సంవత్సరాలు, నేను సర్క్యూట్ పనిలో ఆయనతోపాటు ఉన్నాను.
సర్క్యూట్ పనిలో మేము పెన్సిల్వేనియా, పశ్చిమ విర్జీనియా, న్యూ హాంప్‌షైర్, మసాచుసెట్స్ వంటి ప్రాంతాలతో సహా ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళాము. సాధారణంగా మేము మన క్రైస్తవ సహోదరులతోపాటు వాళ్ళ ఇండ్లలో ఉండేవాళ్ళము. వాళ్ళతో బాగా పరిచయం ఏర్పరచుకుని వాళ్ళతో కలిసి యెహోవా సేవ చేయగలగడం నిజంగా ఒక ప్రత్యేకమైన ఆనందం. మాపై వాళ్ళు చూపించిన ప్రేమ, ఇచ్చిన ఆతిధ్యం ఎల్లప్పుడూ ఎంతో ఆదరపూర్వకంగా, స్వచ్ఛంగా ఉండేవి. జోయెల్ నా మునుపటి మిషనరీ సహచరి అయిన మేరీ ఆన్యోల్‌ను వివాహం చేసుకున్న తర్వాత, వాళ్ళు పెన్సిల్వేనియా, మిచిగాన్‌లలోని సంఘాలను సందర్శిస్తూ మూడు సంవత్సరాలు ప్రయాణ పనిలో గడిపారు. ఆ తర్వాత 1958లో జోయెల్ మరోసారి అంటే ఈసారి మేరీతోపాటు, బేతేలు కుటుంబంలో సభ్యుడిగా సేవ చేయడానికి ఆహ్వానించబడ్డాడు.
కార్ల్ దాదాపు ఏడు సంవత్సరాలపాటు బేతేలులో ఉన్నాడు, అదనపు అనుభవం కోసం ఆయనను కొన్ని సంవత్సరాల పాటు సర్క్యూట్ పనికి నియమించారు. ఆ తర్వాత ఆయన గిలియడ్ పాఠశాల ఉపదేశకుడయ్యాడు. ఆయన 1963లో బాబీని వివాహం చేసుకున్నాడు, ఆమె 2002 అక్టోబరులో తన మరణం వరకు బేతేలులో నమ్మకంగా సేవ చేసింది.
డాన్ బేతేలులో తాను సేవ చేసిన అనేక సంవత్సరాల్లో, బ్రాంచి కార్యాలయాల్లోనూ మిషనరీ క్షేత్రంలోనూ పని చేస్తున్న వారికి సేవచేయడానికి అనేకసార్లు ఇతర దేశాలకు ప్రయాణించాడు. ఆయన తన నియామకాలను బట్టి ప్రాచ్య దేశాలకు, ఆఫ్రికాకు, యూరప్‌కు, అమెరికాల్లోని వివిధ భాగాలకు వెళ్ళాడు. డాన్ విశ్వసనీయురాలైన భార్య డలొరస్ ఆయనతోపాటు తరచూ ప్రయాణిస్తుంది.
మా పరిస్థితులు మారాయి
దీర్ఘకాలంపాటు అనారోగ్యంతో బాధపడి నాన్నగారు చనిపోయారు, కానీ చనిపోవడానికి ముందు, మేము యెహోవా దేవుని సేవ చేయడానికి ఎంపిక చేసుకున్నందుకు తనకెంతో సంతోషంగా ఉన్నట్లు నాతో చెప్పారు. ఆయన కోరుకున్నట్లుగా మేము కాలేజీ చదువులు చదివితే వచ్చే ఆశీర్వాదాలకన్నా ఎన్నోరెట్లు ఎక్కువ ఆశీర్వాదాలను మేము పొందామని ఆయన అన్నారు. మా చెల్లి జోయికి దగ్గరలో ఉండడానికి వెళ్ళేందుకు అన్నీ సర్దుకోవడానికి నేను అమ్మకు సహాయం చేశాను. ఆ తర్వాత, ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న మా అత్తగారికి సహాయం చేయడానికి ఆమెకు దగ్గర్లో ఉండేందుకు నేను, నా భర్త న్యూ ఇంగ్లాండ్‌లో వివిధ పయినీరు నియామకాలను స్వీకరించాము. మా అత్తగారు మరణించిన తర్వాత, మా అమ్మ 13 సంవత్సరాలు మాతోపాటు ఉంది. తర్వాత, 1987 జనవరి 18న, 93 ఏళ్ళ వయస్సులో ఆమె తన భూ నియామకాన్ని ముగించింది.
తన పిల్లలందరూ యెహోవాను ప్రేమిస్తూ ఆయన సేవ చేసేలా పెంచినందుకు స్నేహితులు తనను ప్రశంసించినప్పుడు అమ్మ తరచు, “పని చేయడానికి నాకు మంచి ‘నేల’ దొరికిందంతే” అనేది వినమ్రంగా. (మత్తయి 13:23) ఆసక్తి, అణకువలలో మాకు చక్కని మాదిరిని ఉంచిన దైవభయంగల తల్లిదండ్రులను పొందడం ఎంతటి ఆశీర్వాదమో!
ఇప్పటికీ రాజ్యానికే ప్రథమస్థానం
మేము మా జీవితాల్లో దేవుని రాజ్యానికి ప్రథమస్థానం ఇవ్వడం కొనసాగించాము, అంతేగాక ఇతరులతో పంచుకోవడం గురించి యేసు ఇచ్చిన ఉపదేశాన్ని అన్వయించుకోవడానికి ప్రయత్నించాము. (లూకా 6:38; 14:12-14) యెహోవా మా అవసరాల కోసం ఎంతో ఉదారంగా అన్నీ ఇచ్చాడు. మాది ఎంతో సురక్షితమైన, ఆనందభరితమైన జీవితం.
రూడీకి, నాకు ఇప్పటికీ సంగీతమంటే ఎంతో ఇష్టం. మా లాగే ఇష్టపడేవారెవరైనా ఒక సాయంవేళ మా ఇంటికి వస్తే, మేము కలిసి మా వాయిద్యాలను వాయిస్తుంటాము, నిజంగా అదొక ఆహ్లాదకరమైన సమయం. కానీ సంగీతం నా జీవితగమనం కాదు. అది నా జీవితంలో ఒక అదనపు ఆహ్లాదం. ఇప్పుడు నేను, నా భర్త మా పయినీరు పరిచర్య ప్రతిఫలాలను, అంటే గడిచిన సంవత్సరాల్లో మేము సహాయం చేసిన ప్రజలను చూసి ఆనందిస్తున్నాము.
ప్రస్తుతం ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పూర్తికాల పరిచర్యలో 60 సంవత్సరాల కంటే ఎక్కువకాలం గడిపిన మా జీవితాలు నిజంగా ఎంతో ఆనందభరితమైనవి, సురక్షితమైనవి అని చెప్పగలను. ప్రతి ఉదయం నేను మేల్కొన్నప్పుడు, ఎన్నో సంవత్సరాల క్రితం నేను పూర్తికాల పరిచర్యలోకి ప్రవేశించేటప్పుడు చేసిన ప్రార్థనకు సమాధానం ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను, ‘ఇప్పుడిక ఈ రోజు నేను ఎలా రాజ్యానికి ప్రథమస్థానం ఇవ్వగలను?’ అని ఆలోచిస్తాను.
[అధస్సూచి]
^ పేరా 14 యెహోవాసాక్షులు ప్రచురించినది, ఇప్పుడు ముద్రించబడడం లేదు.
[24వ పేజీలోని చిత్రం]
1948లో మా కుటుంబం (ఎడమ నుండి కుడికి): జోయి, డాన్, అమ్మ, జోయెల్, కార్ల్, నేను, నాన్నగారు
[25వ పేజీలోని చిత్రం]
పరిచర్యలో అమ్మ ఆసక్తితో కూడిన మాదిరిని ఉంచింది
[26వ పేజీలోని చిత్రం]
కార్ల్, డాన్, జోయెల్, జోయి, నేను ఈనాడు అంటే దాదాపు 50 సంవత్సరాల తర్వాత
[27వ పేజీలోని చిత్రం]
ఎడమ నుండి కుడికి: నేను, మేరీ ఆన్యోల్, సోఫ్యా సొవీక్, ఈడ్త్ మొర్గన్, డొమినికన్ రిపబ్లిక్‌లో మిషనరీలుగా
[28వ పేజీలోని చిత్రం]
మేరీతో (ఎడమవైపున) యాంకీ స్టేడియం వద్ద, 1953
[29వ పేజీలోని చిత్రం]
నా భర్త సర్క్యూట్ పనిలో ఉన్నప్పుడు ఆయనతో