కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారు హింసను జయించారు

వారు హింసను జయించారు

వారు హింసను జయించారు

ఫ్రీడా యెస్‌ డెన్మార్క్‌లో 1911లో జన్మించింది, అక్కడనుండి ఆమె తన తల్లిదండ్రులతో పాటు ఉత్తర జర్మనీలోని హుజుమ్‌ నగరానికి వెళ్ళింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె మాగ్డెబర్గ్‌లో ఉద్యోగం చేయడం ప్రారంభించి, 1930లో ఒక బైబిలు విద్యార్థిగా బాప్తిస్మం తీసుకుంది, యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలువబడేవారు. హిట్లర్‌ 1933లో అధికారానికి వచ్చాడు, ఫ్రీడా అప్పటినుండి 23 సంవత్సరాలపాటు ఒకటి కాదు రెండు నియంతృత్వ ప్రభుత్వాల చేతుల్లో హింసించబడింది.

1933 మార్చిలో జర్మన్‌ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలను ఏర్పాటు చేసింది. హామ్‌బర్గ్‌కు దగ్గర్లో ఉన్న న్యూయెన్‌గామ్‌ నిర్బంధ శిబిరాల జ్ఞాపకార్థ వస్తుప్రదర్శనశాల అధ్యక్షుడు డా. డెట్లెఫ్‌ గార్బె ఇలా వివరిస్తున్నాడు: “ఎన్నికల్లో అధికశాతం మంది తమ ఛాన్స్‌లర్‌, నాయకుడు అయిన అడాల్ఫ్‌ హిట్లర్‌కు మద్దతునిచ్చేలా చేయాలని నాజీ మద్దతుదారులు అనుకున్నారు.” యెహోవాసాక్షులు, రాజకీయపరంగా తటస్థంగా ఉండమనీ “లోకసంబంధులు కా[కుండా]” ఉండమనీ యేసు ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించి ఓట్లు వేయలేదు. దాని ఫలితం? సాక్షులు నిషేధించబడ్డారు.​—⁠యోహాను 17:16.

ఫ్రీడా తన క్రైస్తవ కార్యకలాపాలను రహస్యంగా కొనసాగించింది, కావలికోట పత్రికను ప్రచురించడంలో కూడా సహాయపడింది. “మా తోటి విశ్వాసుల కోసం కొన్ని పత్రికలు నిర్బంధ శిబిరాల్లోకి రహస్యంగా తీసుకెళ్ళబడేవి” అని ఆమె చెబుతోంది. ఆమె 1940లో అరెస్టు చేయబడి గెస్టపో ద్వారా ప్రశ్నించబడింది, ఆ తర్వాత ఆమె నెలల తరబడి ఏకాంత నిర్బంధంలో గడిపింది. ఆమె దాన్ని ఎలా సహించింది? ఆమె ఇలా చెబుతోంది: “ప్రార్థనే నా ఆశ్రయంగా ఉండేది. నేను తెల్లవారుజామునే ప్రార్థించడం ప్రారంభించి రోజంతటిలో అనేకసార్లు ప్రార్థించేదాన్ని. ప్రార్థన నాకు బలాన్నిచ్చి, అధికంగా వ్యాకులపడకుండా సహాయపడింది.”​—⁠ఫిలిప్పీయులు 4:6, 7.

ఫ్రీడా విడుదల చేయబడింది, కానీ 1944లో గెస్టపో ఆమెను మళ్ళీ అరెస్టు చేసింది. ఈసారి ఆమెకు వాల్ట్‌హిమ్‌ చెరసాలలో ఏడు సంవత్సరాల శిక్ష విధించబడింది. ఫ్రీడా ఇలా చెబుతోంది: “చెరసాల కాపలాదారులు నన్ను ఇతర స్త్రీలతోపాటు మరుగుదొడ్లలో పని చేయడానికి నియమించారు. నేను జెకోస్లోవేకియా నుండి వచ్చిన ఒక ఖైదీతో తరచూ పనిచేసేదాన్ని కాబట్టి యెహోవా గురించీ నా విశ్వాసం గురించీ నేను ఆమెతో ఎంతో మాట్లాడేదాన్ని. ఆ సంభాషణలు నా విశ్వాసాన్ని బలపరిచేవి.”

తాత్కాలిక విడుదల

1945 మే నెలలో సోవియట్‌ దళాలు వాల్ట్‌హిమ్‌ చెరసాలలోని ఖైదీలను విడుదల చేశాయి, మాగ్డెబర్గ్‌కు తిరిగి వెళ్ళి తన బహిరంగ పరిచర్యను ప్రారంభించడానికి ఫ్రీడాకు స్వేచ్ఛ లభించినా అది తాత్కాలికమే. సాక్షులు మళ్ళీ జాతి విచక్షణకు గురయ్యారు, అయితే ఈసారి అలా చేసింది సోవియట్‌ ఆక్యుపేషనల్‌ జోన్‌ అధికారులు. హన్నా-ఆరెంట్‌-ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇంటు టోటాలిటేరియనిజమ్‌కు చెందిన జెరాల్డ్‌ హక్కే ఇలా వ్రాశారు: “జర్మనీలోని రెండు నియంతృత్వ పాలనల ద్వారా దాదాపు నిరంతరం హింసించబడిన కొన్ని సామాజిక గుంపులలో యెహోవాసాక్షులు కూడా ఉన్నారు.”

మళ్ళీ ఎందుకు ఈ జాతి విచక్షణ? ఈసారి కూడా ముఖ్య వివాదం క్రైస్తవ తటస్థత గురించే. తూర్పు జర్మనీ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి 1948లో వారు నేరుగా ఓట్లు వేసేలా ఎన్నికలు నిర్వహించింది, హక్కే వివరిస్తున్నట్లుగా “[యెహోవాసాక్షులు హింసించబడడానికి] ప్రాథమిక కారణం వారు ఆ ఎన్నికల్లో పాల్గొనకపోవడమే.” తూర్పు జర్మనీలో, 1950 ఆగస్టులో యెహోవాసాక్షులు నిషేధించబడ్డారు. ఫ్రీడాతోపాటు వందలాదిమంది అరెస్టు చేయబడ్డారు.

ఫ్రీడాను మరోసారి న్యాయస్థానానికి తీసుకువెళ్ళారు, ఆమెకు ఆరు సంవత్సరాల కారాగార శిక్ష విధించబడింది. “ఈసారి నేను నా తోటి విశ్వాసులతోపాటు ఉన్నాను, వారి సహవాసం నాకు ఎంతో సహాయపడింది” అని ఫ్రీడా చెబుతోంది. ఫ్రీడా 1956లో విడుదల చేయబడినప్పుడు పశ్చిమ జర్మనీకి వెళ్ళింది. ఇప్పుడు ఫ్రీడాకు 90 సంవత్సరాలు, ఆమె ఇప్పటికీ సత్యదేవుడైన యెహోవాను సేవిస్తూ హుజుమ్‌లో నివసిస్తోంది.

రెండు నియంతృత్వ పాలనల క్రింద ఫ్రీడా 23 సంవత్సరాల హింసను అనుభవించింది. “నాజీలు నన్ను భౌతికంగా నాశనం చేయడానికి ప్రయత్నించారు; కమ్యూనిస్టులు నా నైతికతను పడగొట్టడానికి ప్రయత్నించారు. నాకు శక్తి ఎక్కడనుండి వచ్చింది? నేను స్వేచ్ఛగా ఉన్నప్పుడు కలిగివున్న మంచి బైబిలు అధ్యయన అలవాట్లు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఎడతెగక ప్రార్థించడం, వీలైనప్పుడల్లా తోటి విశ్వాసులతో సహవసించడం, అవకాశం లభించిన ప్రతీసారి ఇతరులకు నా నమ్మకాల గురించి చెప్పడం వంటివి నన్ను బలపరిచాయి” అని ఆమె చెబుతోంది.

హంగేరీలో ఫాసిజం

యెహోవాసాక్షులు దశాబ్దాలపాటు జాతి విచక్షణను సహించిన మరో దేశం హంగేరీ. కొందరు రెండు కాదు మూడు నియంతృత్వ పాలనల్లో హింసలను అనుభవించారు. దానికి ఒక ఉదాహరణ, ఆడమ్‌ సింగర్‌. ఆడమ్‌ హంగేరీలోని పాక్స్‌లో 1922లో జన్మించాడు, ఆయన ఒక ప్రొటస్టెంట్‌గా పెంచబడ్డాడు. 1937లో కొంతమంది బైబిలు విద్యార్థులు ఆడమ్‌ను కలిశారు, ఆయన వారి సందేశం విన్నవెంటనే ఆసక్తి కనబరిచాడు. ఆయన బైబిలు నుండి నేర్చుకున్న విషయాలు, తన చర్చీ బోధలు బైబిలు సంబంధమైనవి కావు అని ఆయనను ఒప్పింపజేశాయి. కాబట్టి ఆయన ప్రొటస్టెంట్‌ చర్చిని విడిచి, బైబిలు విద్యార్థులతో కలిసి బహిరంగ పరిచర్య చేయడం ప్రారంభించాడు.

హంగేరీలో ఫాసిజం ప్రభావం అధికమవుతోంది. ఆడమ్‌ ఇంటింటి పరిచర్య చేయడం గమనించిన పోలీసులు ఎన్నోసార్లు ఆయనను ప్రశ్నించడానికి తీసుకువెళ్ళారు. సాక్షులపై ఒత్తిడి తీవ్రతరమయ్యింది, 1939లో వారి కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. 1942లో ఆడమ్‌ను అరెస్టు చేసి, జైలుకు తీసుకువెళ్ళి తీవ్రంగా కొట్టారు. 19 సంవత్సరాల వయస్సులో ఆ బాధలను, నెలల తరబడి జైలు శిక్షను సహించడానికి ఆయనకు సహాయం చేసిందేమిటి? “నేను ఇంటివద్ద ఉన్నప్పుడు బైబిలును శ్రద్ధగా అధ్యయనం చేసి యెహోవా సంకల్పాల గురించి మంచి అవగాహన సంపాదించుకున్నాను” అని ఆయన చెబుతున్నాడు. చివరకు ఆడమ్‌ చెరసాలనుండి విడుదల చేయబడిన తర్వాతే ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన 1942 ఆగస్టులో తన ఇంటి దగ్గరున్న ఒక నదిలో రాత్రిపూట బాప్తిస్మం తీసుకున్నాడు.

హంగేరీలో జైలు, సెర్బియాలో లేబర్‌ క్యాంపు

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేయడంలో హంగేరీ జర్మనీతో కలిసింది, 1942 శరదృతువులో ఆడమ్‌ సైన్యంలో చేరడానికి ఎంపిక చేసుకోబడ్డాడు. ఆయన ఇలా నివేదిస్తున్నాడు: “నేను బైబిలు నుండి నేర్చుకున్న విషయాల కారణంగా సైన్యంలో సేవచేయలేను అని తెలియజేశాను. నా తటస్థ సానాన్ని వారికి వివరించాను.” ఆయనకు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. కానీ ఆడమ్‌ హంగేరీలో ఎంతోకాలం ఉండలేదు.

1943లో దాదాపు 160మంది యెహోవాసాక్షులను ఒకచోట చేర్చి, వారిని పడవలలో ఎక్కించి, డాన్యూబ్‌ నది గుండా సెర్బియాకు తరలించారు. వారిలో ఆడమ్‌ కూడా ఉన్నాడు. అప్పుడు ఆ ఖైదీలు సెర్బియాలో హిట్లర్‌ మూడవ రైక్‌ ఆధీనంలో ఉన్నారు. వారిని బోర్‌లోని లేబర్‌ క్యాంపులో ఉంచి, బలవంతంగా రాగి గనిలో పనిచేయించేవారు. ఒక సంవత్సరం తరువాత వారిని తిరిగి హంగేరీకి పంపించారు, అక్కడ 1945 వసంతకాలంలో సోవియట్‌ దళాలు ఆడమ్‌ను విడుదల చేశాయి.

కమ్యూనిస్టు పరిపాలనలో హంగేరీ

అయితే స్వాతంత్ర్యం ఎంతోకాలం నిలువలేదు. యుద్ధానికి ముందు ఫాసిస్టులు చేసినట్లే 1940వ దశాబ్దపు చివరిభాగానికల్లా కమ్యూనిస్టు అధికారులు హంగేరీలో యెహోవాసాక్షుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. అప్పటికి వివాహమై ఇద్దరు పిల్లలున్న 29 సంవత్సరాల ఆడమ్‌ 1952లో సైన్యంలో చేరడానికి మరోసారి నిరాకరించినందుకు అరెస్టు చేయబడ్డాడు, ఆయనపై నేరారోపణ చేయబడింది. ఆడమ్‌ న్యాయస్థానంలో ఇలా వివరించాడు: “నేను సైన్యంలో చేరడానికి నిరాకరించడం ఇది మొదటిసారి కాదు. యుద్ధకాలంలో నేను ఈ కారణంగానే జైలుకు వెళ్ళి, సెర్బియాకు పంపించబడ్డాను. నా మనస్సాక్షి కారణంగా నేను సైన్యంలో చేరడానికి నిరాకరిస్తున్నాను. నేను ఒక యెహోవాసాక్షిని, రాజకీయపరంగా నేను తటస్థంగా ఉంటాను.” ఆడమ్‌కు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది, ఆ తర్వాత అది నాలుగు సంవత్సరాలకు తగ్గించబడింది.

బైబిలు విద్యార్థులు తన తల్లిదండ్రుల ఇంటిని మొదటిసారిగా సందర్శించిన తర్వాత 35 సంవత్సరాలకు పైగా అంటే 1970ల మధ్యకాలం వరకూ ఆడమ్‌ జాతి విచక్షణను సహిస్తూనే ఉన్నాడు. ఈ కాలమంతటిలో, ఆరు న్యాయస్థానాలు ఆయనకు 23 సంవత్సరాల కారాగార శిక్షను విధించాయి, ఆయన కనీసం 10 జైళ్ళలో, శిబిరాలలో నిర్బంధించబడ్డాడు. ఆయన మూడు పరిపాలనల క్రింద​—⁠రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు హంగేరీలో ఫాసిస్టులచేత, సెర్బియాలో జర్మన్‌ నాజీలచేత, అంతర్యుద్ధం జరుగుతున్న హంగేరీలో కమ్యూనిస్టులచేత​—⁠వరుసగా హింసను సహించాడు.

ఆడమ్‌ ఇప్పటికీ దేవునికి విశ్వసనీయంగా సేవచేస్తూ తన సొంత పట్టణమైన పాక్స్‌లో నివసిస్తున్నాడు. కష్టాలను విజయవంతంగా సహించడానికి సహాయపడిన అదనపు సామర్థ్యాలేమైనా ఆయనకు ఉన్నాయా? లేదు. ఆయనిలా వివరిస్తున్నాడు:

“బైబిలు అధ్యయనం, ప్రార్థన, తోటి విశ్వాసులతో సహవాసం చాలా అవసరం. అయితే నేను మరో రెండు విషయాలను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. మొదటి విషయం, యెహోవాయే శక్తికి మూలం. ఆయనతో నాకున్న సన్నిహిత సంబంధం నన్ను కాపాడింది. రెండవ విషయం, ‘మీకు మీరే పగతీర్చుకొనవద్దు’ అని చెబుతున్న రోమీయులు 12వ అధ్యాయాన్ని నేను మనస్సులో ఉంచుకున్నాను. కాబట్టి నేను పగ పెంచుకోలేదు. నన్ను హింసించినవారిపై పగతీర్చుకోవడానికి నాకు ఎన్నోసార్లు అవకాశాలు లభించాయి, కానీ నేను అలా చేయలేదు. యెహోవా మనకిచ్చిన శక్తిని కీడుకు ప్రతికీడు చేయడానికి మనం ఉపయోగించకూడదు.”

హింస అంతమవుతుంది

ఫ్రీడా, ఆడమ్‌ ఇప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా యెహోవాను ఆరాధించగలుగుతున్నారు. అయితే ఇలాంటి అనుభవాలు మతపరమైన హింస గురించి ఏ విషయాన్ని వెల్లడి చేస్తున్నాయి? అలాంటి హింస​—⁠కనీసం యథార్థ క్రైస్తవులపై ప్రయోగించబడినప్పుడు​—⁠సఫలం కాదని చూపిస్తున్నాయి. యెహోవాసాక్షులను హింసించడానికి వారు ఎన్నో వనరులను ఉపయోగించి క్రూరంగా బాధించినప్పటికీ, దాని సంకల్పం నెరవేర్చడంలో అది విఫలమయ్యింది. ఒకప్పుడు రెండు గొప్ప నియంతృత్వ పాలనలు అధికారం చేసిన యూరప్‌లో నేడు యెహోవాసాక్షులు వర్ధిల్లుతున్నారు.

యెహోవాసాక్షులు హింసకు ఎలా ప్రతిస్పందించారు? ఫ్రీడా, ఆడమ్‌ ఉదాహరణలు చూపిస్తున్నట్లు వారు ఈ బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకున్నారు: “కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.” (రోమీయులు 12:​21) మేలు నిజంగా కీడును జయించగలదా? ఆ మేలు దేవునిపై మనకున్న బలమైన విశ్వాసం ఫలితంగా కలిగినదైనప్పుడు, అది తప్పకుండా జయిస్తుంది. యూరప్‌లో యెహోవాసాక్షులు హింసపై సాధించిన విజయం నిజానికి దేవుని ఆత్మ సాధించిన విజయం, అది వినయులైన క్రైస్తవులలో పరిశుద్ధాత్మ ఉత్పన్నంచేసే విశ్వాసం ఫలితంగా కలిగిన మేలుకు ఉన్న శక్తిని వెల్లడిచేసింది. (గలతీయులు 5:​22) దౌర్జన్యపూరితమైన నేటి లోకంలో అందరూ గంభీరంగా ఆలోచించవలసిన విషయం అది.

[5వ పేజీలోని చిత్రం]

ఫ్రీడా యెస్‌ (ఇప్పుడు ఫ్రీడా థైలి) అరెస్ట్‌ చేయబడినప్పుడు, ఇప్పుడు

[7వ పేజీలోని చిత్రాలు]

ఆడమ్‌ సింగర్‌ జైల్లో వేయబడినప్పుడు, ఇప్పుడు