కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇతరులను యెహోవా చూసినట్లే చూడడానికి ప్రయత్నించండి

ఇతరులను యెహోవా చూసినట్లే చూడడానికి ప్రయత్నించండి

ఇతరులను యెహోవా చూసినట్లే చూడడానికి ప్రయత్నించండి

“మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేది.”​—⁠1 సమూయేలు 16:⁠7, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

సా.శ.పూ. 11వ శతాబ్దంలో యెహోవా, సమూయేలు ప్రవక్తను ఒక రహస్య నియామకం మీద పంపించాడు. యెష్షయి అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆయన కుమారులలో ఒకరిని ఇశ్రాయేలుకు భావిరాజుగా అభిషేకించమని ఆ ప్రవక్తకు ఆజ్ఞాపించాడు. అక్కడ సమూయేలు యెష్షయి మొదటి కుమారుడైన ఏలీయాబును చూడగానే దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఈయనే అయివుంటాడని అనుకున్నాడు. అయితే యెహోవా ఇలా అన్నాడు: “ఏలీయాబు ఎంతో అందంగా ఎత్తుగా ఉన్నాడు. కానీ ఆ విషయాలు లక్ష్యపెట్టకు. మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేది. ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు కానీ యెహోవా హృదయం చూస్తాడు. ఏలీయాబు తగినవాడు కాడు.” (1 సమూయేలు 16:​6, 7, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) సమూయేలు, ఏలీయాబును యెహోవా చూసినట్లు చూడడంలో విఫలమయ్యాడు. *

2 ఇతరులను అంచనా వేయడంలో మానవులు పొరపాటు చేయడం ఎంత సులభమో కదా! ఒకవైపు పైకి ఆకర్షణీయంగా కనబడి అంతర్గతంగా నైతిక విలువలు లేనివారిని చూసి మనం మోసపోవచ్చు. మరోవైపు, మనకు చికాకు కలిగించే లక్షణాలున్న యథార్థవంతులను అంచనా వేసేటప్పుడు మనం దురుసుగా కఠినంగా ప్రవర్తిస్తుండవచ్చు.

3 మనం ఇతరుల గురించి, చివరికి మనకు ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారి గురించి అయినా సరే త్వరగా ఒక నిర్ధారణకు వచ్చేస్తే సమస్యలు తలెత్తవచ్చు. ఒకప్పుడు ఆత్మీయుడిగా ఉన్న ఒక క్రైస్తవునితో బహుశా మీరు తీవ్రంగా గొడవపడి ఉండవచ్చు. తెగిపోయిన మీ స్నేహబంధాన్ని తిరిగి కలుపుకోవాలనుకుంటున్నారా? అందుకు మీకు ఏమి సహాయపడుతుంది?

4 ఆ క్రైస్తవ సహోదరుని లేక సహోదరి గురించి ఒకసారి సమగ్రంగా, సుదీర్ఘంగా, సానుకూలంగా ఎందుకు ఆలోచించకూడదు? అయితే “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” అని యేసు చెప్పిన మాటల వెలుగులో ఆ వ్యక్తిని చూడండి. (యోహాను 6:​44) ఆ తర్వాత మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘యెహోవా ఈ వ్యక్తిని తన కుమారునివైపు ఎందుకు ఆకర్షించాడు? ఈ వ్యక్తిలో అభిలషణీయమైన ఏ లక్షణాలు ఉన్నాయి? ఆ లక్షణాలను నేను ఉపేక్షిస్తున్నానా లేక తక్కువగా అంచనా వేస్తున్నానా? మేము మొదట స్నేహితులం ఎందుకయ్యాము? ఈ వ్యక్తి నా స్నేహితుడిగా ఉండాలని నేనెందుకు కోరుకున్నాను?’ మొదట్లో ఆ వ్యక్తి మంచి లక్షణాల గురించి ఆలోచించడం మీకు కష్టంగా అనిపిస్తుండవచ్చు, ప్రత్యేకంగా కొంతకాలం నుండి మీ మనసు నొప్పించబడినట్లు మీరు భావిస్తున్నట్లయితే అలా అనిపిస్తుంది. అయినప్పటికీ మీ ఇరువురి మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి ఇది చాలా ప్రాముఖ్యమైన చర్య. ఇది ఎలా చేయవచ్చన్నదాన్ని సోదాహరణంగా, కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడే ఇద్దరు వ్యక్తుల్లో దృఢ విలక్షణాల కోసం మనం చూద్దాం. వాళ్ళే ప్రవక్తయైన యోనా, అపొస్తలుడైన పేతురు.

యోనావైపు నిష్పాక్షిక దృష్టి

5 యెహోయాషు కుమారుడైన యరొబాము II కాలంలో యోనా ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి ప్రవక్తగా సేవ చేశాడు. (2 రాజులు 14:​23-25) ఒకరోజు యెహోవా, ఇశ్రాయేలును వదిలి శక్తివంతమైన అష్షూరు సామ్రాజ్య రాజధాని అయిన నీనెవెకు వెళ్ళమని యోనాకు ఆజ్ఞాపించాడు. ఆయన నియామకం ఏమిటి? ఆ మహా పట్టణం నాశనం కానున్నదని దాని నివాసులను హెచ్చరించాలి. (యోనా 1:​1, 2) దేవుని నిర్దేశాన్ని అనుసరించే బదులు యోనా పారిపోయాడు! ఆయన నీనెవెకు ఎంతో దూరానున్న తర్షీషుకు వెళ్తున్న ఒక ఓడలో ఎక్కి కూర్చున్నాడు.​—⁠యోనా 1:⁠3.

6 మీరు యోనా గురించి ఆలోచించినప్పుడు మీ మనస్సులో ఏమి మెదులుతుంది? ఆయన ఒక అవిధేయుడైన ప్రవక్త అని మీరు అనుకుంటారా? పైకి కనబడేదాన్ని బట్టి చూస్తే అలాంటి తలంపే రావచ్చు. అయితే యోనా అవిధేయుడైనందుకే దేవుడు ఆయనను ప్రవక్తగా నియమించాడా? ఎంతమాత్రం కాదు! యోనాలో తప్పకుండా కొన్ని అభిలషణీయమైన లక్షణాలు ఉండే ఉంటాయి. ప్రవక్తగా ఆయన చరిత్రను పరిశీలించండి.

7 నిజానికి యోనా అసలు ప్రతిస్పందనే లేని ఇశ్రాయేలు క్షేత్రంలో నమ్మకంగా కష్టపడి పనిచేశాడు. దాదాపు యోనా కాలంలోనే జీవించిన ఆమోసు ప్రవక్త, ఆ కాలంలోని ఇశ్రాయేలీయులను ధనాపేక్షులుగా భోగలాలసులుగా వర్ణించాడు. * దేశంలో దుష్కార్యాలు జరుగుతున్నా ఇశ్రాయేలీయులు వాటి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. (ఆమోసు 3:​13-15; 4:⁠4; 6:​4-6) అయినప్పటికీ యోనా వారికి ప్రకటించాలనే తన విధి నిర్వహణలో ఎడతెగక నమ్మకంగా కొనసాగాడు. మీరు సువార్త ప్రచారకులైతే, సంతృప్తిగా ఉదాసీనంగా ఉండే ప్రజలతో మాట్లాడడం ఎంత కష్టమో తెలుస్తుంది. కాబట్టి యోనా బలహీనతలను పరిగణలోకి తీసుకునేటప్పుడు, విశ్వాసంలేని ఇశ్రాయేలీయులకు ప్రకటించేటప్పుడు ఆయన కనబరచిన విశ్వసనీయత, సహనం వంటి లక్షణాలను కూడా జ్ఞాపకముంచుకుందాం.

8 నీనెవెకు వెళ్ళే నియామకంలో చాలా క్లిష్టమైన సవాలు మరొకటి ఉంది. ఆ పట్టణానికి చేరుకోవడానికి యోనా దాదాపు 800 కి.మీ. పాదయాత్ర చేయాలి​—⁠అది చాలా కష్టమైన ప్రయాణం దానికి సుమారు ఒక నెల పడుతుంది. ఆ ప్రవక్త అక్కడికి చేరుకున్నాక క్రూరత్వానికి మారుపేరైన అష్షూరీయులకు ప్రకటించాలి. వారు చేసే యుద్ధాల్లో తరచు క్రూరాతిక్రూరంగా హింసించేవారు. వారు తమ క్రూరత్వం గురించి గొప్పలు కూడా చెప్పుకునేవారు. దాన్నిబట్టి నీనెవె “నరహత్య చేసిన పట్టణం[]” అని పిలువబడడంలో ఆశ్చర్యం లేదు.​—⁠నహూము 3:⁠1, 7.

9 యెహోవా ఆజ్ఞకు విధేయత చూపించడానికి ఇష్టపడని యోనా ఒక ఓడలో ఎక్కి కూర్చున్నాడు, అది ఆయనను తనకు నియమించబడిన ప్రదేశం నుండి చాలా చాలా దూరం తీసుకువెళ్ళింది. అయినప్పటికీ యెహోవా తన ప్రవక్తపై ఆశలు వదులుకోలేదు, ఆయన స్థానంలో మరొక వ్యక్తిని నియమించనూ లేదు. బదులుగా యోనాకు ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి యెహోవా చర్య తీసుకున్నాడు. దేవుడు సముద్రంలో ప్రచండమైన తుఫాను వచ్చేలా చేశాడు. దానితో యోనాను తీసుకువెళ్తున్న ఓడ అలలకు ఊగిసలాడింది. యోనా కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది! (యోనా 1:⁠4) యోనా ఎలా ప్రతిస్పందించాడు? తన కారణంగా ఆ ఓడలోని వారు ప్రాణాలు కోల్పోవడం ఇష్టంలేని యోనా వారితో ఇలా అన్నాడు: “నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండ నిమ్మళించు[ను].” (యోనా 1:​12) ఆ నావికులు చివరికి ఆయనను ఓడలోనుండి బయటకు పడవేసినప్పుడు, యెహోవా తనను సముద్రం నుండి కాపాడతాడని ఆశించడానికి ఆయనకు ఏ ఆధారం లేదు. (యోనా 1:​15) అయినా ఆ నావికులు ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండేందుకు యోనా చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. మనకిక్కడ ఆయన కనబరచిన ధైర్యం, వినయం, ప్రేమ వంటి లక్షణాలు కనబడ్డం లేదూ?

10 చివరికి యెహోవా యోనాను రక్షించాడు. ఇటీవల యోనా చేసిన క్రియలు ఆయన ఇక పైన దేవుని ప్రతినిధిగా సేవ చేయడానికి వీల్లేకుండా ఆయనను అనర్హుణ్ణి చేశాయా? లేదు, యెహోవా నీనెవె ప్రజలకు ప్రకటించడమనే ఆ ప్రవక్త నియామకాన్ని సానుభూతితో ప్రేమతో పునరుద్ధరించాడు. యోనా నీనెవెకు చేరుకున్నాక, వారు చేస్తున్న ఘోరమైన చెడుతనం దేవుని దృష్టికి వచ్చిందని, 40 రోజుల్లో ఆ పట్టణం నాశనం కానున్నదని దాని నివాసులకు ధైర్యంగా చెప్పాడు. (యోనా 1:⁠2; 3:⁠4) యోనా చెప్పిన ముక్కుసూటి సందేశాన్ని విన్న తర్వాత నీనెవె పట్టణస్థులు పశ్చాత్తాపం చెందారు, దాంతో వారి పట్టణం విడిచిపెట్టబడింది.

11 యోనాకు ఇంకా సరైన దృక్కోణం కలుగలేదు. అయితే యెహోవా తాను పైకి కనబడేదానిని మించినది చూస్తానని తెలుసుకునేందుకు యోనాకు పత్యక్ష దృష్టాంతం ద్వారా ఓపికతో సహాయం చేశాడు. యెహోవా హృదయాన్ని పరిశీలిస్తాడు. (యోనా 4:​5-11) యోనా ఒక విలువైన పాఠం నేర్చుకున్నాడనడానికి ఆయన స్వయంగా గ్రంథస్తం చేసిన నిష్పాక్షిక వృత్తాంతమే నిదర్శనం. ఆయన తన బలహీనతలను తన ఆత్మగౌరవానికి భంగం కలిగించేంత వివరంగా నివేదించడానికి కూడా వెనకాడకపోవడం, ఆయనలోని వినయానికి గొప్ప రుజువు. తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి!

12 శతాబ్దాల తర్వాత యేసుక్రీస్తు యోనా జీవితంలో సంభవించిన ఒక సంఘటన గురించి సానుకూలంగా వ్యాఖ్యానించాడు. ఆయనిలా అన్నాడు: “యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును.” (మత్తయి 12:​40) యేసు తాను సమాధిలో గడిపిన సమయాన్ని ఈ ప్రవక్త తన జీవితంలో నిష్క్రియుడిగా ఉన్న సమయంతో పోల్చాడని యోనా తాను పునరుత్థానం చేయబడిన తర్వాత తెలుసుకుంటాడు. తన సేవకులు తప్పులు చేసినప్పుడు వారిని తిరస్కరించని దేవుణ్ణి సేవించడానికి మనం సంతోషించడం లేదా? కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.” (కీర్తన 103:​13, 14) నిజంగానే ఈ ‘మన్ను’​—⁠నేటి అపరిపూర్ణ ప్రజలతోపాటు​—⁠దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో గొప్పవాటినే సాధించగలదు!

పేతురు పట్ల సమతుల్య దృక్పథం

13 ఇప్పుడు మనం రెండవ ఉదాహరణను క్లుప్తంగా పరిశీలిద్దాం, అది అపొస్తలుడైన పేతురుది. పేతురును వర్ణించమని మిమ్మల్ని అడిగినట్లయితే మీరు వెంటనే తొందరపాటు, దుడుకుతనం, చివరికి దుస్సాహసం వంటి విలక్షణాల గురించి ఆలోచిస్తారా? పేతురు కొన్నిసార్లు అలాంటి లక్షణాలనే కనబరిచాడు. అయితే పేతురు నిజంగానే తొందరపాటు, దుడుకుతనం, దుస్సాహసం గల వ్యక్తే అయితే యేసు ఆయనను తన 12 అపొస్తలుల్లో ఒకనిగా ఎంపిక చేసుకునేవాడా? (లూకా 6:​12-14) ఎంతమాత్రం కాదు! యేసు ఈ లోపాలను పట్టించుకోకుండా ఆయనలోని దృఢ లక్షణాలను గ్రహించాడు.

14 పేతురు కొన్నిసార్లు ఇతర అపొస్తలుల పక్షాన మాట్లాడే ప్రతినిధిగా పనిచేశాడు. కొందరు దీన్ని వినయం లేదనడానికి నిదర్శనంగా దృష్టిస్తుండవచ్చు. కానీ అది నిజమా? పేతురు ఇతర అపొస్తలుల కంటే పెద్దవాడు కావచ్చని కొందరు అంటారు​—⁠బహుశా యేసు కంటే కూడా పెద్దవాడు కావచ్చు. అదే గనుక నిజమైతే తరచుగా పేతురే మొదట ఎందుకు మాట్లాడేవాడో వివరించేందుకు అది సహాయపడవచ్చు. (మత్తయి 16:​22) అయితే పరిశీలించవలసిన మరొక విషయం కూడా ఉంది. పేతురు ఆధ్యాత్మిక వ్యక్తి. పరిజ్ఞానం పట్ల ఆయనలోవున్న తృష్ణ ప్రశ్నలడిగేందుకు ఆయనను కదిలించింది. అది మనకు ప్రయోజనాన్ని చేకూర్చింది. పేతురు వేసిన ప్రశ్నలకు జవాబుగా యేసు అనేక అమూల్యమైన వ్యాఖ్యానాలను చేశాడు, అవి బైబిలులో భద్రపరచబడ్డాయి. ఉదాహరణకు పేతురు చేసిన ఒక వ్యాఖ్యకు ప్రతిస్పందనగా యేసు “నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకు[ని]” గురించి మాట్లాడాడు. (లూకా 12:​41-44) పేతురు అడిగిన ఈ ప్రశ్న గురించి ఆలోచించండి: “ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకు[ను]?” ఇది యేసు బలపరిచే వాగ్దానాన్ని చేసేందుకు దారి తీసింది: “నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.”​—⁠మత్తయి 15:​15; 18:​21, 22; 19:​27-29.

15 పేతురులో మరొక మంచి లక్షణం ఉంది​—⁠ఆయన విశ్వసనీయుడు. యేసు బోధనల్లోని ఒక బోధన అర్థంకాని కారణంగా ఆయన శిష్యుల్లో చాలామంది ఆయనను అనుసరించడం మానేసినప్పుడు, 12 మంది అపొస్తలుల తరఫున “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు” అని మాట్లాడింది పేతురే. (యోహాను 6:​66-68) ఆ మాటలు యేసు హృదయానికి ఎంత సంతోషాన్ని కలిగించి ఉంటాయో కదా! ఆ తర్వాత తన యజమానిని బంధించడానికి ఒక సమూహం వచ్చినప్పుడు అపొస్తలుల్లో చాలామంది పారిపోయారు. అయితే పేతురు కాస్త దూరం నుండి ఆ గుంపును వెంబడించి నేరుగా ప్రధానయాజకుని ఇంటి ముంగిట్లోకే ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళేందుకు ఆయనను పురికొల్పింది పిరికితనం కాదు, ధైర్యం. యేసు విచారించబడుతున్నప్పుడు పేతురు అక్కడ మంటవేసి చలి కాచుకుంటున్న ఒక యూదుల గుంపులో చేరాడు. ప్రధానయాజకుని సేవకుడు ఆయనను గుర్తించి నీవు యేసుతో ఉన్నావని ఆరోపించాడు. పేతురు తన యజమానిని కాదన్నది నిజమే, కానీ పేతురు అలాంటి పరిస్థితిలో ఇరుక్కున్నది యేసు పట్ల విశ్వసనీయత, ఆయన పట్ల శ్రద్ధ ఉన్నందుకేనన్న విషయం మనం మరచిపోకూడదు, అపొస్తలుల్లో చాలామంది అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే సాహసం చేయలేదు.​—⁠యోహాను 18:​15-27.

16 పేతురులోని దృఢ లక్షణాలు ఆయనలోని లోపాలకంటే ఎంతో శ్రేష్ఠమైనవి. యోనా విషయం కూడా అంతే. మనం యోనాను పేతురును మామూలు కంటే మరింత సానుకూల దృక్కోణంతో చూసినట్లే, నేటి మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలను అంచనా వేసేటప్పుడు కూడా అలాంటి సానుకూల దృక్కోణంతోనే చూసేలా మనం శిక్షణ పొందాలి. అది వారితో సత్సంబంధాలకు దారి తీస్తుంది. అసలు అలాంటి సానుకూల దృక్కోణం ఎందుకు ఉండాలి?

ఆ పాఠాన్ని నేడు అన్వయించుకోవడం

17 నేడు అన్ని ఆర్థిక స్థాయుల్లో నుండి, విద్యా స్థాయుల్లో నుండి, జాతుల నేపథ్యాల నుండి వచ్చిన స్త్రీలు, పురుషులు, పిల్లలు కలిసి ఐక్యంగా యెహోవాను సేవిస్తున్నారు. (ప్రకటన 7:​9, 10) క్రైస్తవ సంఘంలో మనం ఎంత విస్తృతమైన వైవిధ్య వ్యక్తిత్వాలను చూస్తామో కదా! మనం సన్నిహితంగా కలిసి దేవుణ్ణి సేవిస్తున్నాము కాబట్టి అప్పుడప్పుడు విభేదాలు రావడం అనివార్యం.​—⁠రోమీయులు 12:​10; ఫిలిప్పీయులు 2:⁠3.

18 మన సహోదరుల లోపాలను మనం గమనించినప్పటికీ వాటిపైనే మన మనస్సు కేంద్రీకరించము. మనం యెహోవాను అనుకరించడానికి ప్రయత్నిస్తాం, ఆయన గురించి కీర్తనకర్త ఇలా పాడాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” (కీర్తన 130:⁠3) మనల్ని విడదీయగల వ్యక్తిత్వ లక్షణాలపై మనసు పెట్టడానికి బదులు మనం “సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము.” (రోమీయులు 14:​19) లోపాలపై కాకుండా మంచి లక్షణాలపై మనసు కేంద్రీకరించడం ద్వారా యెహోవా వ్యక్తులను ఎలా చూస్తాడో మనమూ అలాగే చూడడానికి కృషి చేస్తాం. మనం అలా చేసినప్పుడు అది ‘ఒకరినొకరు సహించడానికి’ మనకు దోహదపడుతుంది.​—⁠కొలొస్సయులు 3:​13.

19 మనం సులభంగా పరిష్కరించుకోలేని అపార్థాలు తలెత్తితే ఎలా? (కీర్తన 4:⁠4) మీకు మీ తోటి విశ్వాసికి మధ్య అలాంటి సమస్య తలెత్తిందా? ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదూ? (ఆదికాండము 32:​13-16) మొట్ట మొదట మార్గనిర్దేశనం కోసం యెహోవాకు ప్రార్థించండి. తర్వాత ఆ వ్యక్తి మంచి లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ‘జ్ఞానముతో కూడిన సాత్వికముగలవారిగా’ ఆయనను సమీపించండి. (యాకోబు 3:​13) ఆయనతో సమాధానపడాలనుకుంటున్నారని చెప్పండి. “వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను” అన్న ప్రేరేపిత సలహాను గుర్తుంచుకోండి. (యాకోబు 1:​19) “కోపించుటకు నిదానించు” అనే సలహా, అవతలి వ్యక్తి మీకు కోపం వచ్చేలా ఏదైనా చేయవచ్చు లేదా ఏమైనా అనవచ్చు అని పరోక్షంగా సూచిస్తోంది. అలా గనుక జరిగితే ఆశానిగ్రహాన్ని కాపాడుకోవడానికి యెహోవాను సహాయం అడగండి. (గలతీయులు 5:​22) మీ సహోదరుణ్ణి తన వ్యధను వెళ్ళబుచ్చనీయండి, అప్పుడు మీరు శ్రద్ధగా వినండి. ఆయన చెప్పే ప్రతి విషయాన్నీ మీరు అంగీకరించకపోయినా మధ్యలో అంతరాయం కలిగించకండి. ఆయన దృక్కోణం తప్పే కావచ్చు, కానీ అది ఎలాంటిదైనా అది ఆయన దృక్కోణం. సమస్యను ఆయన దృక్కోణం నుండి చూడడానికి ప్రయత్నించండి. మీ సహోదరుని దృక్కోణం నుండి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడంలో ఇది ఒక భాగం కావచ్చు.​—⁠సామెతలు 18:​17.

20 మీరు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు సాదరంగా మాట్లాడండి. (కొలొస్సయులు 4:⁠6) మీ సహోదరునిలో మీరేమి ఇష్టపడతారో ఆయనకు చెప్పండి. మీరు చేసినదాంట్లో ఏదైనా అపార్థానికి గురిచేస్తే మిమ్మల్ని క్షమించమని అడగండి. మీ నమ్రతాపూర్వక ప్రయత్నాలు మైత్రిని చేకూరిస్తే యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేయండి. అలా జరగకపోతే, సమాధానపడడానికి వేరే అవకాశాల కోసం చూస్తూ మార్గదర్శకం కోసం యెహోవాను అడుగుతూనే ఉండండి.​—⁠రోమీయులు 12:​18.

21 యెహోవా తన సేవకులందరినీ ప్రేమిస్తాడు. మనలో అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ ఆయన మనల్నందరినీ తన సేవ కోసం ఉపయోగించుకోవడానికి సంతోషిస్తాడు. ఇతరులను ఆయన ఎలా దృష్టిస్తాడనేది మనం తెలుసుకొంటుండగా మన సహోదర సహోదరీల పట్ల మన ప్రేమ అధికమవుతుంది. మన తోటి క్రైస్తవునిపై ప్రేమ చల్లారినా దాన్ని తిరిగి జ్వలింపజేయవచ్చు. ఇతరుల పట్ల సానుకూల దృక్కోణాన్ని చూపించడానికి, అవును, వారిని యెహోవా చూసినట్లే చూడడానికి కృత నిశ్చయంతో ప్రయత్నిస్తే గొప్ప ఆశీర్వాదాలను పొందుతాం!

[అధస్సూచీలు]

^ పేరా 3 ఆకర్షణీయంగా కనబడే ఏలీయాబులో ఇశ్రాయేలుకు తగిన రాజుకు ఉండవలసిన లక్షణాలు లేవని ఆ తర్వాత స్పష్టమయ్యింది. ఫిలిష్తీయుల శూరుడైన గొల్యాతు ఇశ్రాయేలీయులను సవాలు చేసినప్పుడు, ఇతర ఇశ్రాయేలీయులతో పాటు ఏలీయాబు భయంతో కుంచించుకుపోయాడు.​—⁠1 సమూయేలు 17:​11, 28-30.

^ పేరా 10 కొన్ని ముఖ్యమైన దండయాత్రలు, పూర్వపు ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకోవడం, బహుశా తత్ఫలితంగా వసూలు చేయబడిన కప్పము వంటి వాటి ద్వారా యరొబాము II ఉత్తర రాజ్యపు సంపదను అధికం చేయడానికి ఎంతో కృషి చేశాడని స్పష్టమవుతోంది.​—⁠2 సమూయేలు 8:⁠6; 2 రాజులు 14:​23-28; 2 దినవృత్తాంతములు 8:​3, 4; ఆమోసు 6:⁠2.

మీరెలా జవాబిస్తారు?

• యెహోవా తన నమ్మకమైన సేవకుల లోపాలను ఎలా చూస్తాడు?

• యోనా పేతురుల ఏ దృఢ లక్షణాలను మీరు పేర్కొనగలరు?

• మీ క్రైస్తవ సహోదరుల గురించిన ఎలాంటి దృక్కోణాన్ని మీరు కాపాడుకోవడానికి దృఢ నిశ్చయం చేసుకున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. ఏలీయాబు విషయంలో యెహోవా దృక్కోణం సమూయేలు దృక్కోణానికి ఎలా భిన్నంగా ఉంది, దీన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

3, 4. (ఎ) ఇద్దరు క్రైస్తవుల మధ్య ఒక సమస్య తలెత్తినట్లయితే వారిరువురు ఏమి చేయడానికి నిశ్చయించుకోవాలి? (బి) మన తోటి విశ్వాసితో చాలా తీవ్రమైన విభేదముంటే మనల్ని మనం ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి?

5. యోనాకు ఇవ్వబడిన నియామకం ఏమిటి, ఆయన దానికెలా ప్రతిస్పందించాడు?

6. యోనాను నీనెవెకు పంపించడానికి యెహోవా ఎందుకు ఎంపిక చేసుకున్నాడు?

7. యోనా ఇశ్రాయేలులో ఎలాంటి పరిస్థితుల్లో యెహోవా సేవ చేశాడు, ఆ విషయం తెలియడం వల్ల మీకు ఆయన పట్ల ఉన్న దృక్పథం ఎలా ప్రభావితమవుతుంది?

8. ఇశ్రాయేలు ప్రవక్త నీనెవెలో ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాలి?

9. ప్రచండమైన తుఫాను నావికులను భయపెట్టినప్పుడు యోనా ఏ లక్షణాలను చూపించాడు?

10. యెహోవా యోనా నియామకాన్ని పునరుద్ధరించిన తర్వాత ఏమి జరిగింది?

11. యోనా ఒక విలువైన పాఠం నేర్చుకున్నాడనడానికి నిదర్శనమేమిటి?

12. (ఎ) ప్రజల పట్ల యెహోవాకు ఉన్న అభిప్రాయమే యేసుకు ఉందని మనకెలా తెలుసు? (బి) మనం సువార్త ప్రకటిస్తున్న ప్రజల విషయంలో ఎలాంటి అభిప్రాయంతో ఉండాలని ప్రోత్సహించబడుతున్నాము? (18వ పేజీలోని బాక్సు చూడండి.)

13. పేతురులోని ఏ లక్షణాలు మన మనసులో మెదలవచ్చు, అయినా యేసు ఆయనను అపొస్తలుడిగా ఎందుకు ఎంపిక చేసుకున్నాడు?

14. (ఎ) పేతురు బాహాటంగా మాట్లాడడం గురించి ఏమని వివరించవచ్చు? (బి) పేతురు తరచుగా ప్రశ్నలు అడిగినందుకు మనం ఎందుకు కృతజ్ఞులమై ఉండాలి?

15. పేతురు నిజంగానే విశ్వసనీయుడని ఎందుకు చెప్పవచ్చు?

16. యోనా పేతురుల దృఢ లక్షణాలను మనం పరిశీలించడానికిగల ఆచరణాత్మక కారణం ఏమిటి?

17, 18. (ఎ) క్రైస్తవుల మధ్య విభేదాలు ఎందుకు రావచ్చు? (బి) తోటి విశ్వాసులతో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి మనకు బైబిలులోని ఏ సలహా దోహదపడగలదు?

19. ఒక క్రైస్తవుడు తీవ్రమైన విభేదాలను పరిష్కరించుకోవడానికి తీసుకోగల ఆచరణాత్మకమైన చర్యలేమిటో చెప్పండి.

20. విభేదాలు పరిష్కరించుకునేటప్పుడు, సమాధానపడడానికి దోహదపడగల ఇతర చర్యలు ఏవి?

21. ఇతరులను యెహోవా చూసినట్లే చూడడానికి ఈ చర్చ మీకు ఎలా సహాయపడింది?

[18వ పేజీలోని బాక్సు]

ఇతరులను యెహోవా ఎలా దృష్టిస్తాడో ఆలోచించండి

మీరు యోనా గురించిన బైబిలు వృత్తాంతాన్ని ధ్యానిస్తుండగా, మీరు సువార్తను క్రమంగా ప్రకటిస్తున్నవారిని ఒక కొత్త దృక్కోణం నుండి చూడవలసిన అవసరాన్ని గమనించగలుగుతున్నారా? వారు సంతృప్తి గలవారిగా లేక ఇశ్రాయేలీయుల్లాగే ఉదాసీనులుగా లేక దేవుని సందేశాన్ని వ్యతిరేకించేవారిగా కనబడుతుండవచ్చు. అయినప్పటికీ వారు యెహోవా దేవునికి ఎలా కనబడతారు? యోనా ప్రకటించినదానికి ప్రతిస్పందనగా నీనెవె రాజు పశ్చాత్తాపం చెందినట్లే, ఈ విధానంలో ప్రముఖ స్థానంలో ఉన్న కొందరు వ్యక్తులు కూడా ఏదో ఒకరోజు యెహోవావైపు మళ్ళుతుండవచ్చు.​—⁠యోనా 3:⁠6, 7.

[15వ పేజీలోని చిత్రం]

మీరు ఇతరులను యెహోవా చూసినట్లే చూస్తారా?

[16వ పేజీలోని చిత్రం]

యోనా అనుభవం గురించి చెప్పడానికి యేసు సానుకూలమైనదాన్ని చూశాడు