కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తొలి క్రైస్తవులు, మోషే ధర్మశాస్త్రం

తొలి క్రైస్తవులు, మోషే ధర్మశాస్త్రం

తొలి క్రైస్తవులు, మోషే ధర్మశాస్త్రం

“క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయెను.”​—⁠గలతీయులు 3:​24.

సా.శ.పూ. 1513లో ఇశ్రాయేలీయులకు యెహోవా ఒక నియమావళి ఇచ్చాడు. తన మాట వింటే వారిని ఆశీర్వదిస్తానని తద్వారా వారు సంతోషకరమైన సంతృప్తికరమైన జీవితాలను అనుభవించవచ్చని చెప్పాడు.​—⁠నిర్గమకాండము 19:⁠5, 6.

2 ఆ నియమావళి మోషే ధర్మశాస్త్రం అని లేదా కేవలం “ధర్మశాస్త్రము” అని పిలువబడింది, అది “పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది.” (రోమీయులు 7:​12) అది దయ, నిజాయితీ, నీతి, పొరుగువారితో స్నేహంగా ఉండడం వంటి అత్యుత్తమ లక్షణాలను ప్రోత్సహించింది. (నిర్గమకాండము 23:​4, 5; లేవీయకాండము 19:​14; ద్వితీయోపదేశకాండము 15:​13-15; 22:​10, 22) ఆ ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులు ఒకరినొకరు ప్రేమించుకునేలా కూడా పురికొల్పింది. (లేవీయకాండము 19:​18) అంతేగాక వారు ధర్మశాస్త్రానికి లోబడని అన్యజనులతో కలిసిపోవడం గానీ వియ్యమందుకోవడం గానీ చేయకూడదు. (ద్వితీయోపదేశకాండము 7:​3, 4) ఇశ్రాయేలీయులను, అన్యజనులను విడదీసే “మధ్యగోడ”లాగ మోషే ధర్మశాస్త్రం, దేవుని ప్రజలు అన్యదేవుళ్ళ ఆరాధనకు సంబంధించిన ఆలోచనలతో, అచారాలతో కలుషితం కాకుండా కాపాడింది.​—⁠ఎఫెసీయులు 2:​14, 15; యోహాను 18:​28.

3 అయితే అతి జాగ్రత్తపరులైన ఇశ్రాయేలీయులు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటించలేకపోయారు. అంటే యెహోవా వారి తాహతుకు మించిన దాన్ని ఆశిస్తున్నాడా? లేదు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వడానికి గల ఒక కారణం, వారి “అతిక్రమములను” ఎత్తి చూపడమే. (గలతీయులు 3:​19) ఆ ధర్మశాస్త్రం నిష్కపటులైన యూదులు తమకొక విమోచకుడు అత్యావశ్యకమని గుర్తించేలా చేసింది. ఆ విమోచకుడు వచ్చినప్పుడు నమ్మకస్థులైన యూదులు ఆనందించారు. పాప మరణాల శాపం నుండి వారికి విమోచన సమీపించింది!​—⁠యోహాను 1:​29.

4 మోషే ధర్మశాస్త్రం తాత్కాలిక ఏర్పాటుగానే ఉద్దేశించబడింది. అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులకు వ్రాస్తున్నప్పుడు దాన్ని ‘క్రీస్తు వద్దకు నడిపించే బాలశిక్షకుడు’ అని వర్ణించాడు. (గలతీయులు 3:​24) ప్రాచీన కాలంలోని ఒక బాలశిక్షకుడు పిల్లలను బడికి తీసుకువెళ్ళి ఇంటికి తీసుకువస్తుండేవాడు. సాధారణంగా అతను బోధకుడు కాదు; అతను కేవలం పిల్లలను బోధకుని వద్దకు తీసుకువెళ్ళేవాడు. అలాగే దైవభక్తిగల యూదులను క్రీస్తు వద్దకు నడిపించడానికి మోషే ధర్మశాస్త్రం రూపొందించబడింది. యేసు “యుగసమాప్తి వరకు సదాకాలము” తన అనుచరులతో ఉంటానని వాగ్దానం చేశాడు. (మత్తయి 28:​20) ఆ విధంగా క్రైస్తవ సంఘం ఏర్పడగానే “బాలశిక్షకుని”​—⁠ధర్మశాస్త్రం​—⁠అవసరం లేకుండా పోయింది. (రోమీయులు 10:⁠4; గలతీయులు 3:​25) కానీ కొందరు యూదా క్రైస్తవులు ఈ ప్రముఖ సత్యాన్ని వెంటనే గ్రహించలేకపోయారు. ఆ కారణంగా వారు ధర్మశాస్త్రంలోని నియమాలను యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత కూడా పాటిస్తూనే ఉన్నారు. అయితే కొందరు తమ ఆలోచనాధోరణిని సరిదిద్దుకున్నారు. వారలా చేయడం ద్వారా నేడు మనకొక చక్కని మాదిరి ఉంచారు. అదెలాగో చూద్దాం.

క్రైస్తవ సిద్ధాంతంలో ఉద్వేగభరితమైన పరిణామాలు

5 క్రైస్తవ అపొస్తలుడైన పేతురు సా.శ. 36లో ఒక గమనార్హమైన దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో, ధర్మశాస్త్రానుసారం అపవిత్రమైనవిగా పరిగణించబడే పక్షులను జంతువులను చంపుకొని తినమని పరలోకం నుండి ఒక స్వరం ఆయనను ఆజ్ఞాపించింది. పేతురు నిర్ఘాంతపోయాడు! ఆయన ‘నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను ఎన్నడును తినలేదు.’ కానీ ఆ స్వరం ఆయనతో ఇలా చెప్పింది: “దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైనవాటినిగా ఎంచవ[ద్దు].” (అపొస్తలుల కార్యములు 10:​9-15) పేతురు మొండిగా ధర్మశాస్త్రానికే అంటిపెట్టుకొని ఉండకుండా తన అభిప్రాయాన్ని సరిదిద్దుకున్నాడు. అది ఆయనకు దేవుని సంకల్పాల పట్ల ఒక ఆశ్చర్యకరమైన అవగాహన ఏర్పడేందుకు దారితీసింది.

6 జరిగిందేమిటంటే, కొర్నేలీ అనే సున్నతిపొందని అన్యుడైన ఒక భక్తుని ఇంటికి తమతోపాటు రమ్మని పేతురును అడగడానికి ముగ్గురు వ్యక్తులు ఆయన ఉంటున్న ఇంటికి వచ్చారు. పేతురు ఈ ముగ్గురిని ఇంట్లోకి ఆహ్వానించి వారికి ఆతిథ్యమిచ్చాడు. ఈ దర్శన భావాన్ని గ్రహించిన పేతురు మరుసటి రోజు ఆ ముగ్గురితో కలిసి కొర్నేలీ ఇంటికి వెళ్ళాడు. అక్కడ పేతురు యేసుక్రీస్తు గురించి సమగ్రంగా సాక్ష్యమిచ్చాడు. పేతురు ఇలా అన్నాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” కొర్నేలీ మాత్రమే కాక ఆయన బంధువులు, సన్నిహిత స్నేహితులు కూడా యేసుపై విశ్వాసముంచారు, “బోధ విన్న వారందరిమీదికి పరిశుద్ధాత్మ ది[గింది].” దీంట్లో యెహోవా హస్తం ఉందని గ్రహించిన పేతురు, “యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలె[ను]” అని ఆజ్ఞాపించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 10:​17-48.

7 మోషే ధర్మశాస్త్రానికి లోబడని అన్యజనులు ఇప్పుడు యేసుక్రీస్తు అనుచరులుగా మారవచ్చనే నిర్ధారణకు వచ్చేందుకు పేతురుకు ఏమి సహాయపడింది? ఆధ్యాత్మిక అవగాహన. సున్నతి పొందని అన్యజనులపై దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించడం ద్వారా తన అంగీకారాన్ని చూపించాడు కాబట్టి, వారిని బాప్తిస్మానికి అంగీకరించవచ్చని పేతురు గ్రహించాడు. అదే సమయంలో, అన్యులలో నుండి క్రైస్తవులైనవారు బాప్తిస్మం పొందాలంటే వారు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని దేవుడు కోరడంలేదని పేతురు గ్రహించాడని స్పష్టమవుతోంది. మీరు ఆ కాలంలో జీవించి ఉన్నట్లయితే, మీ దృక్పథాన్ని సరిదిద్దుకోవడానికి, పేతురు ఇష్టపడినట్లుగా ఇష్టపడేవారా?

కొందరు ఆ తర్వాత కూడా ‘బాలశిక్షకుణ్ణి’ అనుసరించారు

8 పేతురు కొర్నేలీ ఇంటి నుండి వచ్చిన తర్వాత యెరూషలేముకు వెళ్ళాడు. సున్నతి పొందని అన్యజనులు ‘దేవుని వాక్యమంగీకరించారు’ అనే వార్త అక్కడి సంఘానికి తెలిసింది, దానితో యూదులైన కొందరు శిష్యులు ఆ విషయాన్ని బట్టి కలతచెందారు. (అపొస్తలుల కార్యములు 11:​1-3) అన్యజనులు యేసు అనుచరులు కావచ్చునని అంగీకరిస్తూనే యూదేతరులైన ఈ ప్రజలు రక్షించబడాలంటే వారు ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని “సున్నతి పొందినవారు” వాదించారు. మరోపక్కన అన్యజనులు ఎక్కువగా ఉండి యూదా క్రైస్తవులు తక్కువమంది ఉన్న ప్రాంతాల్లో సున్నతి గురించిన సమస్య తలెత్తలేదు. ఈ రెండు భిన్నాభిప్రాయాలు 13 సంవత్సరాల వరకు కొనసాగాయి. (1 కొరింథీయులు 1:​10) తొలి క్రైస్తవులకు​—⁠ముఖ్యంగా యూదా ప్రాంతాల్లో నివసిస్తున్న అన్యజనులకు​—⁠అది ఎంతటి పరీక్ష అయ్యుంటుందో కదా!

9 ఆ సమస్య చివరికి సా.శ. 49లో క్రైస్తవులు యెరూషలేము నుండి పౌలు ప్రకటిస్తున్న సిరియాలోని అంతియొకయకు వచ్చినప్పుడు చరమాంకానికి చేరుకుంది. మతం మార్చుకున్న అన్యజనులు మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందాలని వారు బోధించడం ప్రారంభించారు. వారికీ, పౌలు బర్నబాలకూ మధ్య పెద్ద వివాదం చెలరేగింది! ఆ వివాదం పరిష్కరించబడకపోతే కొందరు క్రైస్తవులు​—⁠యూదా నేపథ్యం గలవారే కావచ్చు లేదా అన్యమత నేపథ్యం గలవారే కావచ్చు​—⁠తొట్రుపడడం అనివార్యం. ఆ కారణంగా పౌలుతోపాటు మరికొందరు యెరూషలేముకు వెళ్ళి క్రైస్తవ పరిపాలక సభను ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తెలియజేయమని అడగడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి.​—⁠అపొస్తలుల కార్యములు 15:​1, 2, 24.

నిష్కపటమైన అసమ్మతి​—⁠ఆ తర్వాత, ఐకమత్యం!

10 సమావేశమైన ఒక కూటమిలో కొందరు సున్నతిని గట్టిగా సమర్థిస్తూ వాదించారని, మరికొందరు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని స్పష్టమవుతోంది. కానీ భావోద్వేగాలు నిలువలేదు. ఎన్నో వాగ్వివాదాలు జరిగిన తర్వాత, అపొస్తలులైన పేతురు పౌలులు సున్నతి పొందని విశ్వాసులలో యెహోవా చేసిన సూచకక్రియల గురించి తెలియజేశారు. సున్నతి పొందని అన్యజనులపై దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడని వారు వివరించారు. ఒక విధంగా చెప్పాలంటే వారు, ‘దేవుడు అంగీకరించినవారిని క్రైస్తవ సంఘం తిరస్కరించడం న్యాయమేనా?’ అని అడిగారు. ఆ తర్వాత శిష్యుడైన యాకోబు చదివిన ఒక లేఖన భాగం, ఆ విషయంలో యెహోవా చిత్తమేమిటో అక్కడ హాజరైన వారందరూ గ్రహించేందుకు సహాయపడింది.​—⁠అపొస్తలుల కార్యములు 15:​4-17.

11 ఇప్పుడు అందరి దృష్టి పరిపాలక సభపైనే ఉంది. వారి యూదా నేపథ్యం, సున్నతిని సమర్థించే నిర్ణయం తీసుకునేందుకు వారిని నడిపిస్తుందా? లేదు. నమ్మకస్థులైన ఈ పురుషులు లేఖనాలను, దేవుని పరిశుద్ధాత్మ మార్గదర్శకాన్ని అనుసరించడానికి దృఢంగా నిశ్చయించుకున్నారు. పరిపాలక సభ సంబంధిత వాంగ్మూలాలన్నీ విన్న తర్వాత అన్యులలో నుండి క్రైస్తవులైనవారు మోషే ధర్మశాస్త్రానికి బద్ధులుగా సున్నతి పొందాల్సిన అవసరం లేదని ఏకగ్రీవంగా అంగీకరించింది. ఈ నిర్ణయం గురించి సహోదరులు విన్నప్పుడు ఎంతో సంతోషించారు, సంఘాలు “అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.” స్పష్టమైన దైవపరిపాలనకు సంబంధించిన మార్గదర్శకానికి లోబడిన ఆ క్రైస్తవులు దృఢమైన లేఖనాధార జవాబుతో ఆశీర్వదించబడ్డారు. (అపొస్తలుల కార్యములు 15:​19-23, 28, 29; 16:​1-5) ఇంకా ఒక ముఖ్యమైన ప్రశ్న అలాగే ఉండిపోయింది.

యూదా క్రైస్తవుల విషయమేమిటి?

12 అన్యులలో నుండి క్రైస్తవులైనవారు సున్నతి పొందాల్సిన అవసరం లేదని పరిపాలక సభ స్పష్టంగా తెలియజేసింది. కానీ యూదా క్రైస్తవుల విషయమేమిటి? పరిపాలక సభ చేసిన నిర్ణయం ప్రశ్నలోని ఈ భాగాన్ని నిర్దిష్టంగా విశ్లేషించలేదు.

13 “ధర్మశాస్త్రమందు ఆసక్తిగల” కొందరు యూదా క్రైస్తవులు తమ పిల్లలకు సున్నతి చేయిస్తూ ధర్మశాస్త్రంలోని కొన్ని ఆచరణలను పాటిస్తూనే ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 21:​20) మరి కొందరైతే యూదా క్రైస్తవులు రక్షించబడాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ఆవశ్యకమని నొక్కిచెప్పేంత వరకూ వెళ్ళారు. ఈ విషయంలో వాళ్ళు ఘోరంగా పొరబడ్డారు. ఉదాహరణకు క్రైస్తవులెవరైనా తమ పాప క్షమాపణ కోసం జంతు బలిని ఎలా అర్పించగలరు? క్రీస్తు బలి అలాంటి జంతుబలులను నిరర్థకం చేసింది. యూదులు అన్యులతో సాన్నిహిత్యం పెంచుకోకూడదనే ధర్మశాస్త్ర నియమం సంగతి ఏమిటి? ఆసక్తిగల క్రైస్తవ ప్రచారకులకు ఈ నియమాలను పాటిస్తూ యేసు బోధించినవన్నీ అన్యజనులకు బోధించాలనే ఆజ్ఞను పాటించడం చాలా కష్టమైపోయి ఉండేది. (మత్తయి 28:​19, 20; అపొస్తలుల కార్యములు 1:⁠8; 10:28) * పరిపాలక సభ ఈ విషయాన్ని ఏదైనా ఒక కూటమిలో విశదీకరించిందనడానికి ఎలాంటి రుజువు లేదు. అయినా ఎలాంటి సహాయం లేకుండా సంఘం వదిలివేయబడలేదు.

14 మార్గనిర్దేశం వచ్చింది, అది పరిపాలక సభ నుండి వచ్చిన ఉత్తరం రూపంలో రాలేదు కానీ అపొస్తలులు వ్రాసిన అదనపు ప్రేరేపిత పత్రికల ద్వారా వచ్చింది. ఉదాహరణకు అపొస్తలుడైన పౌలు రోములో నివసిస్తున్న యూదులకు, అన్యజనులకు ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపించాడు. వారికి వ్రాసిన ఉత్తరంలో, ఒక నిజమైన యూదుడు అంటే “అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు” అని అతని “సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే” అని ఆయన వివరించాడు. (రోమీయులు 2:​28, 29) అదే ఉత్తరంలో, క్రైస్తవులు ధర్మశాస్త్రానికి ఇకపైన బద్ధులు కారని రుజువుచేయడానికి పౌలు ఒక ఉపమానాన్ని ఉపయోగించాడు. ఒక స్త్రీ ఒకేసారి ఇద్దరు పురుషులను వివాహం చేసుకోలేదని, ఒకవేళ ఆమె భర్త మరణించినట్లయితే ఆమె మళ్ళీ వివాహం చేసుకోవచ్చునని ఆయన వాదించాడు. ఆ తర్వాత పౌలు ఆ ఉపమానాన్ని అన్వయిస్తూ అభిషిక్త క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రానికి లోబడి ఉండి, అదే సమయంలో క్రీస్తుకు చెందినవారు కాలేరని చూపించాడు. వారు “ధర్మశాస్త్రము విషయమై మృతులై” ఉండాలి, అప్పుడే వారు క్రీస్తుతో ఐక్యం కాగలరు.​—⁠రోమీయులు 7:​1-5.

విషయాన్ని అవగాహన చేసుకోవడంలో జాప్యం

15 ధర్మశాస్త్రానికి సంబంధించి పౌలు చేసిన తర్కం నిర్వివాదం. మరలాంటప్పుడు కొందరు యూదా క్రైస్తవులు ఆ విషయాన్ని ఎందుకు గ్రహించలేక పోయారు? వారిలో ఆధ్యాత్మిక అవగాహన లోపించిందనేది ఒక కారణం. ఉదాహరణకు వారు బలమైన ఆధ్యాత్మిక ఆహారము తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేశారు. (హెబ్రీయులు 5:​11-14) వారు క్రైస్తవ కూటాలకు కూడా క్రమంగా హాజరయ్యేవారు కాదు. (హెబ్రీయులు 10:​23-25) కొందరు ఆ విషయాన్ని గ్రహించకపోవడానికిగల మరొక కారణం, ధర్మశాస్త్ర విధ్యుక్త ధర్మంతో ముడివడివుంది. అది దేవాలయము, యాజకత్వం వంటి కంటికి కనబడే, అనుభూతిని పొందగల, స్పృశించగల వాటిపై కేంద్రీకృతమై ఉండేది. ఆధ్యాత్మికత లోపించిన ఎవరికైనా కంటికి కనిపించని వాటిపై కేంద్రీకృతమైన లోతైన క్రైస్తవ సూత్రాలను హత్తుకోవడం కంటే ధర్మశాస్త్రాన్ని అంగీకరించడమే తేలికగా ఉంటుంది.​—⁠2 కొరింథీయులు 4:​18.

16 తాము క్రైస్తవులమని చెప్పుకునే కొందరు ధర్మశాస్త్రాన్ని పాటించాలని తీవ్రంగా ఎందుకు కోరుకుంటున్నారో, పౌలు గలతీయులకు వ్రాసిన ఉత్తరంలో విశదీకరించాడు. తాము గౌరవనీయులుగా, ప్రఖ్యాతిగాంచిన మత సభ్యులుగా పరిగణించబడాలని వాళ్ళు కోరుకున్నారని ఆయన వివరించాడు. వాళ్ళు సమాజంలో క్రైస్తవులుగా భిన్నమైనవారిగా గుర్తించబడాలని కోరుకోవడానికి బదులుగా వారు ఆ సమాజంలో కలిసిపోయేందుకు దాదాపు ఎలాంటి రాజీకైనా ఇష్టపడ్డారు. వాళ్ళు దేవుని ఆమోదాన్ని పొందడానికి బదులు మనుష్యుల ఆమోదాన్ని పొందడానికే ఎక్కువ ఆసక్తి చూపించారు.​—⁠గలతీయులు 6:​12.

17 దేవుని ప్రేరణతో పౌలు, మరితరులు వ్రాసినవాటిని జాగ్రత్తగా అధ్యయనం చేసిన వివేచనగల క్రైస్తవులు, ధర్మశాస్త్రం విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలకు వచ్చారు. అయితే సా.శ. 70వ సంవత్సరం వరకు మోషే ధర్మశాస్త్రం గురించిన సరైన దృక్పథమేమిటో యూదా క్రైస్తవులందరికీ సుస్పష్టం కాలేదు. దేవుడు యెరూషలేము, దానిలోని దేవాలయం, దాని యాజకత్వానికి సంబంధించిన గ్రంథాలు నాశనమవడానికి అనుమతించినప్పుడు ఆ విషయం స్పష్టమైంది. ఆ కారణంగా ధర్మశాస్త్రంలోని అన్ని విషయాలను పాటించడం ఎవరికీ సాధ్యం కాకుండా పోయింది.

నేడు ఆ పాఠాన్ని అన్వయించుకోవడం

18 చాలాకాలం క్రితం జరిగిన ఈ సంఘటనల్ని పరిశీలించిన తర్వాత బహుశా మీరిలా ఆలోచిస్తుండవచ్చు: ‘నేను ఆ కాలంలో జీవించి ఉన్నట్లయితే, దేవుడు తన చిత్తాన్ని దినదినం వెల్లడి చేస్తుండగా నేనెలా ప్రతిస్పందించి ఉండేవాడిని? నేను సాంప్రదాయ దృక్పథాలనే మొండిగా అంటిపెట్టుకుని ఉండేవాడినా? లేక దాని గురించిన సరైన అవగాహన సుస్పష్టమయ్యేంతవరకు ఓపికతో ఉండేవాడినా? అది సుస్పష్టమైనప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించేవాడినా?’

19 మనం ఆ కాలంలో జీవించి ఉన్నట్లయితే ఎలా ప్రతిస్పందించి ఉండేవాళ్ళమో ఖచ్చితంగా చెప్పలేమన్నది నిజమే. కానీ మనల్ని మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేడు బైబిలు అవగాహనలో సవరింపులు చేయబడినప్పుడు నేనెలా ప్రతిస్పందిస్తున్నాను? (మత్తయి 24:​45) లేఖనాధారిత మార్గనిర్దేశం ఇవ్వబడినప్పుడు, లిఖిత ఉపదేశాలను తూ.చా. తప్పకుండా పాటించడమే కాక అందులో చెప్పబడుతున్న స్ఫూర్తిని గ్రహించి దాన్ని అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తానా? (1 కొరింథీయులు 14:​20) ఎంతోకాలం నుండి ఉన్న ప్రశ్నలకు జవాబులు వెంటనే తెలియనప్పుడు ఓపికతో యెహోవా కోసం వేచి ఉంటున్నానా?’ మనం “కొట్టుకొనిపోకుం[డా]” ఉండగలిగేలా, నేడు లభ్యమవుతున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. (హెబ్రీయులు 2:⁠1) యెహోవా తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, భూసంస్థ ద్వారా మార్గనిర్దేశాన్నిస్తున్నప్పుడు జాగ్రత్తగా విందాం. అలా వింటే యెహోవా మనల్ని అనంతమైన జీవితంతో ఆశీర్వదిస్తాడు, ఆ జీవితం సంతోషంగానూ సంతృప్తికరంగానూ ఉంటుంది.

[అధస్సూచి]

^ పేరా 19 పేతురు సిరియాలోని అంతియొకయకు వెళ్ళినప్పుడు ఆయన అన్యజనులలోని విశ్వాసులతో ఆదరంతో కూడిన సాంగత్యాన్ని అనుభవించాడు. అయితే యెరూషలేము నుండి యూదా క్రైస్తవులు వచ్చినప్పుడు పేతురు “సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరై పోయెను.” తాము గౌరవంతో చూసే ఆ అపొస్తలుడు తమతో కలిసి భోజనం చేయడానికి నిరాకరించడం, మతం మార్చుకున్న ఆ అన్యజనుల మనసుకు ఎంత బాధ కలిగించి ఉంటుందో మనం ఊహించవచ్చు.​—⁠గలతీయులు 2:​11-13.

మీరెలా ప్రతిస్పందిస్తారు?

• ఏ భావంలో మోషే ధర్మశాస్త్రం ‘క్రీస్తు వద్దకు నడిపించే బాలశిక్షకుడు’గా ఉండింది?

• సత్యాన్ని అర్థం చేసుకోవడంలోని సవరింపులకు పేతురు, “సున్నతిపొందినవారు” ప్రతిస్పందించిన భిన్న విధానాలను మీరెలా వివరిస్తారు?

• నేడు సత్యాన్ని యెహోవా వెల్లడిచేసే విధానం గురించి మీరేం నేర్చుకున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మోషే ధర్మశాస్త్రమును శ్రద్ధగా పాటించిన ఇశ్రాయేలీయులకు లభించిన కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

3. ధర్మశాస్త్రమును ఎవరూ పరిపూర్ణంగా పాటించలేకపోవడం వల్ల అది ఎలాంటి ప్రభావాన్ని చూపించింది?

4. ధర్మశాస్త్రం ‘క్రీస్తు వద్దకు నడిపించే బాలశిక్షకుడు’ అంటే భావమేమిటి?

5. ఒక దర్శనంలో పేతురు ఏ సూచనలను పొందాడు, ఆయనెందుకు నిర్ఘాంతపోయాడు?

6, 7. తనిప్పుడు అన్యజనులకు ప్రకటించవచ్చుననే నిర్ధారణకు వచ్చేందుకు పేతురుకు ఏమి సహాయం చేసింది, ఆయన ఇంకా ఎలాంటి నిర్ధారణలకు వచ్చి ఉండవచ్చు?

8. యెరూషలేములో నివసిస్తున్న కొందరు క్రైస్తవులు సున్నతి విషయంలో పేతురు దృక్కోణానికి భిన్నంగా ఎలాంటి దృక్కోణాన్ని లేవదీశారు, ఎందుకు?

9. సున్నతి గురించిన వివాదాన్ని పరిష్కరించడం ఎందుకు ప్రాముఖ్యం?

10. అన్యజనుల స్థానం గురించి నిర్ణయం తీసుకొనే ముందు పరిపాలక సభ పరిశీలించిన కొన్ని అంశాలు ఏమిటి?

11. సున్నతి గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు వారు దేనికి ప్రాధాన్యతనివ్వలేదు, ఆ నిర్ణయంపై యెహోవా ఆశీర్వాదం ఉందని ఏమి చూపిస్తోంది?

12. ఏ ప్రశ్న విశ్లేషించబడకుండా వదిలేయబడింది?

13. రక్షణ పొందడానికి మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం ఆవశ్యకం అని నొక్కి చెప్పడం తప్పెందుకు అవుతుంది?

14. పౌలు ప్రేరేపిత పత్రికలు ధర్మశాస్త్రానికి సంబంధించి ఎలాంటి మార్గనిర్దేశాన్నిచ్చాయి?

15, 16. కొందరు యూదా క్రైస్తవులు తాము ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదని ఎందుకు గ్రహించలేకపోయారు, ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం గురించి ఇదేమి సూచిస్తోంది?

17. ధర్మశాస్త్రాన్ని పాటించడం గురించిన సరైన దృక్పథమేమిటో ఎప్పుడు సుస్పష్టం అయింది?

18, 19. (ఎ) ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండడానికి మనమెలాంటి వైఖరులను అలవరచుకోవాలి, ఎలాంటి వైఖరులను విడిచిపెట్టాలి? (బి) బాధ్యతగల సహోదరుల నుండి పొందిన మార్గనిర్దేశాన్ని అనుసరించడం విషయంలో పౌలు మాదిరి మనకు ఏమి బోధిస్తోంది? (24వ పేజీలోని బాక్సు చూడండి.)

[24వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఒక పరీక్షకు పౌలు వినయపూర్వక ప్రతిస్పందన

పౌలు ఒక విజయవంతమైన మిషనరీ యాత్ర తర్వాత సా.శ. 56లో యెరూషలేముకు చేరుకున్నాడు. అక్కడ ఆయనొక పరీక్షనెదుర్కోనున్నాడు. కొట్టివేయబడిన ధర్మశాస్త్రాన్ని పౌలు బోధిస్తున్నాడనే వార్త ఆ సంఘానికి చేరింది. పౌలు ధర్మశాస్త్రం అనే అంశం గురించి నిక్కచ్చిగా మాట్లాడడం చూసి కొత్తగా మతం మార్చుకున్న యూదా క్రైస్తవులు తొట్రుపడతారేమోనని, క్రైస్తవులకు యెహోవా ఏర్పాట్లపై గౌరవం లోపించిందని వారు భావిస్తారేమోనని ఆ సంఘ పెద్దలు భయపడ్డారు. ఆ సంఘంలో, మ్రొక్కుబడి చేసుకున్న​—⁠నాజీరు మ్రొక్కుబడి కావచ్చు​—⁠నలుగురు యూదా క్రైస్తవులు ఉన్నారు. ఆ మ్రొక్కుబడి చెల్లించడానికి వారు దేవాలయముకు వెళ్ళాల్సి ఉంది.

ఆ నలుగురితో కలిసి దేవాలయముకు వెళ్ళమని, మ్రొక్కుబడి చెల్లించడానికయ్యే ఖర్చులు భరించమని సంఘ పెద్దలు పౌలును కోరారు. పౌలు అప్పటికే కనీసం రెండు ప్రేరేపిత పత్రికలను వ్రాశాడు, వాటిలో రక్షణ కోసం ధర్మశాస్త్రాన్ని పాటించాల్సినవసరం లేదని వాదించాడు. అయినా ఆయన ఇతరుల మనస్సాక్షిని గురించి ఆలోచించాడు. గతంలో ఆయన ఇలా వ్రాశాడు: “ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించికొనుటకు నేను . . . ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.” (1 కొరింథీయులు 9:​20-23) ప్రాముఖ్యమైన లేఖన సూత్రాలున్న విషయాలతో అసలు రాజీపడకుండానే, ఆ పెద్దలు చెప్పిన దాన్ని తాను అంగీకరించవచ్చునని పౌలు భావించాడు. (అపొస్తలుల కార్యములు 21:​15-26) ఆయనలా చేయడం తప్పేమీ కాదు. మ్రొక్కుబడుల ఏర్పాటులో లేఖన విరుద్ధమైనదేమీ లేదు, దేవాలయము స్వచ్ఛారాధనకు ఉపయోగించబడుతోందేగానీ విగ్రహారాధనకు కాదు. కాబట్టి ఇతరులు తొట్రుపడడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో పౌలు ఆ పెద్దలు కోరినట్లే చేశాడు. (1 కొరింథీయులు 8:​13) అలా చేయడానికి పౌలుకు ఎంతో వినయం అవసరమైందనడంలో సందేహం లేదు, ఇది మనకు ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని అధికం చేసే వాస్తవం.

[23వ పేజీలోని చిత్రం]

క్రైస్తవుల్లో ధర్మశాస్త్రం గురించిన భిన్నాభిప్రాయాలు కొన్ని సంవత్సరాలపాటు కొనసాగాయి