కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి యున్నాను’

‘ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి యున్నాను’

‘ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి యున్నాను’

యేసు మరణించిన దినము​—⁠యూదుల నెల నీసాను 14వ రోజు​—⁠సా.శ. 33వ సంవత్సరం, మార్చి 31వ తేదీ, గురువారం సూర్యాస్తమయం తర్వాత మొదలయ్యింది. ఆ సాయంకాలం యేసు, ఆయన అపొస్తలులు పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేములోని ఒక ఇంటి మేడగదిలో సమావేశమయ్యారు. యేసు “తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్ళ[డానికి]” సిద్ధపడుతూ తాను తన అపొస్తలులను అంతము వరకు ప్రేమించానని చూపించాడు. (యోహాను 13:⁠1) ఎలా? జరగనున్న సంగతుల కోసం వారిని సిద్ధం చేస్తూ వారికి ఉన్నతమైన పాఠాలు నేర్పించడం ద్వారా తాను వారిని అంతము వరకు ప్రేమించానని చూపించాడు.

రాత్రి గడుస్తుండగా యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నా[ను].” (యోహాను 16:​33) అలా ధైర్యంగా వ్యాఖ్యానించడంలో యేసు ఉద్దేశమేమిటి? కొంతవరకు ఆయన ఉద్దేశం ఇది: ‘ఈ లోకంలోని దుష్టత్వం నాలో ద్వేషాన్ని పెంచి నేను పగతీర్చుకొనేలా చెయ్యలేదు. ఈ లోకం నన్ను తన సొంత మూసలోనికి లాగడానికి నేను అనుమతించలేదు. అది మీకు కూడా సాధ్యమవుతుంది.’ యేసు భూమిపై తన జీవితపు చివరి గడియలలో తన నమ్మకమైన అపొస్తలులకు బోధించిన విషయాలు, వారు కూడా అదేవిధంగా లోకాన్ని జయించడానికి వారికి సహాయం చేస్తాయి.

నేడు లోకంలో చెడుతనం విస్తృతంగా ఉందనే విషయాన్ని ఎవరైనా కాదంటారా? అన్యాయాలకు, అర్థరహితమైన దౌర్జన్యానికి మనమెలా ప్రతిస్పందిస్తాము? అవి మనలో ద్వేషాన్ని పెంపొందిస్తాయా, కీడుకు ప్రతికీడు చేసేలా మనల్ని శోధిస్తాయా? మన చుట్టూవున్న నైతిక పతనం మనల్ని ఎలా ప్రభావితం చేస్తోంది? అంతేకాక మానవ అపరిపూర్ణతల వల్ల, పాపభరితమైన కోరికల వల్ల మనం రెండు క్షేత్రాల్లో యుద్ధం చేయవలసి ఉంది: బయట దుష్ట లోకానికి వ్యతిరేకంగా, మనలోనే ఉన్న పాపభరితమైన కోరికలకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలి. దేవుని సహాయం లేకుండానే మనం విజయం సాధించవచ్చని నిజంగా ఆశించవచ్చా? ఆయన సహాయాన్ని మనమెలా పొందవచ్చు? శారీరక కోరికలను అధిగమించేందుకు సహాయపడే ఏ లక్షణాలను మనం పెంపొందించుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం, యేసు తన భూ జీవితంలోని ఆఖరి రోజు ప్రియులైన తన శిష్యులకు ఏమి నేర్పించాడో పరిశీలిద్దాం.

వినయంతో గర్వాన్ని జయించండి

ఉదాహరణకు గర్వం లేదా అహంకారం అనే సమస్యనే తీసుకోండి. దాని గురించి బైబిలిలా చెబుతోంది: “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును.” (సామెతలు 16:​18) “ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్ను తానే మోసపరచుకొనును” అని కూడా లేఖనాలు మనకు ఉపదేశిస్తున్నాయి. (గలతీయులు 6:⁠3) అవును గర్వం వినాశనకరమైనది, మోసకరమైనది. కాబట్టి మనం “గర్వము అహంకారము”లను ద్వేషించడం జ్ఞానయుక్తం.​—⁠సామెతలు 8:13.

యేసు అపొస్తలులకు గర్వం, అహంకారం విషయంలో సమస్య ఉండేదా? వారు కనీసం ఒక సందర్భంలో, ఎవరు గొప్పవారు అని తమలో తాము వాదించుకున్నారు. (మార్కు 9:​33-37) మరో సందర్భంలో యాకోబు, యోహాను రాజ్యంలో తమకు ప్రధాన స్థానాలు కావాలని కోరారు. (మార్కు 10:​35-45) అలాంటి స్వభావాన్ని తొలగించుకునేందుకు తన శిష్యులకు సహాయం చేయాలని యేసు కోరుకున్నాడు. కాబట్టి పస్కా భోజనం సమయంలో ఆయన లేచి, తువాలు తీసుకొని నడుముకు కట్టుకొని తన శిష్యుల పాదములు కడగడం ప్రారంభించాడు. అలా చేయడం ద్వారా వారు నేర్చుకోవాలని తాను కోరుకుంటున్న పాఠాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. “కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే” అని యేసు అన్నాడు. (యోహాను 13:​14) గర్వము స్థానంలో దాని వ్యతిరేక లక్షణమైన వినయాన్ని అలవరచుకోవాలి.

అయితే గర్వాన్ని జయించడం సులభం కాదు. ఆ సాయంకాలం కొద్ది సమయం గడిచాక, యేసు తనను అప్పగించబోయే యూదా ఇస్కరియోతును పంపివేసిన తర్వాత 11 మంది అపొస్తలుల మధ్య తీవ్రమైన వివాదం తలెత్తింది. వారు దేని గురించి వాదించుకున్నారు? వారిలో ఎవరు గొప్పవారు అన్న విషయం గురించి! యేసు వారిని మందలించే బదులు ఇతరులకు సేవచేయడం యొక్క ప్రాముఖ్యత గురించి మరోసారి సహనంతో నొక్కిచెప్పాడు. ఆయన ఇలా చెప్పాడు: “అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను.” ఆయన వారికి తన మాదిరిని గుర్తుచేసి ఇలా అన్నాడు: “నేను మీ మధ్య పరిచర్య చేయువానివలె ఉన్నాను.”​—⁠లూకా 22:24-27.

అపొస్తలులు తాము నేర్చుకోవలసిన పాఠాన్ని గ్రహించారా? రుజువులను బట్టి చూస్తే వారు గ్రహించారన్న నిర్ధారణకు రావచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.” (1 పేతురు 3:⁠8) మనం కూడా గర్వాన్ని వినయంతో జయించడం ఎంత ప్రాముఖ్యమో కదా! పేరుప్రతిష్ఠలు, అధికారం లేదా హోదాను సంపాదించుకోవడంలో మునిగిపోకుండా ఉండడం జ్ఞానయుక్తం. “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును” అని బైబిలు నివేదిస్తోంది. (యాకోబు 4:⁠6) అదేవిధంగా జ్ఞానవంతమైన ఒక ప్రాచీన సామెత ఇలా చెబుతోంది: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.”​—⁠సామెతలు 22:⁠4.

ద్వేషాన్ని జయించడం​—⁠ఎలా?

లోకంలో సర్వసాధారణంగా ఉన్న మరో లక్షణమైన ద్వేషాన్ని పరిశీలించండి. ద్వేషానికి కారణం భయం, అజ్ఞానం, పక్షపాతం, అణచివేత, అన్యాయం, దేశభక్తి, వర్గ భేదాలు, లేదా జాతి విభేదాలు వంటివేవైనప్పటికీ మన చుట్టూ ద్వేషమే ఉన్నట్లు అనిపిస్తుంది. (2 తిమోతి 3:​1-4) యేసు కాలంలో కూడా ద్వేషం ప్రబలంగా ఉండేది. సుంకరులను యూదా సమాజంలో, వెలివేయబడినవారిలాగే ద్వేషించేవారు. యూదులు సమరయులతో సాంగత్యము చేసేవారు కాదు. (యోహాను 4:⁠9) అన్యులను లేదా యూదేతరులను కూడా యూదులు తృణీకరించేవారు. అయితే కొంతకాలానికి, యేసు ప్రారంభించిన ఆరాధనా విధానం ప్రకారం అన్ని జనాంగాల ప్రజలను స్వీకరించాలి. (అపొస్తలుల కార్యములు 10:34, 35; గలతీయులు 3:​28) అందుకే ఆయన తన శిష్యులకు ప్రేమపూర్వకంగా ఒక కొత్త విషయాన్ని చెప్పాడు.

యేసు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.” వారు ఈ ప్రేమను ప్రదర్శించడం నేర్చుకోవాలి ఎందుకంటే, ఆ తర్వాత ఆయన ఇలా చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందు[రు].” (యోహాను 13:​34, 35) ఈ ఆజ్ఞ కొత్తది ఎందుకంటే, దానిలో “నిన్నువలె నీ పొరుగు వానిని” ప్రేమించడం కంటే ఎక్కువే ఉంది. (లేవీయకాండము 19:​18) ఏ విధంగా? యేసు ఇలా అంటూ ఆ విషయాన్ని స్పష్టం చేశాడు: “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకని నొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు.” (యోహాను 15:​12, 13) వారు ఒకరి కోసం ఒకరు, ఇతరుల కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సుముఖంగా ఉండాలి.

అపరిపూర్ణ మానవులు తమ జీవితాల నుండి క్రూరమైన ద్వేషాన్ని ఎలా నిర్మూలించుకోవచ్చు? దాని స్థానంలో స్వయం త్యాగపూరిత ప్రేమను పెంపొందించుకోవడం ద్వారా వారు అలా చేయవచ్చు. అన్ని జాతుల నుండి, సాంస్కృతిక, మత, రాజకీయ నేపథ్యాల నుండి వచ్చిన లక్షలాది మంది యథార్థమైన ప్రజలు అలాగే చేస్తున్నారు. వారిప్పుడు ఐక్యతగల, ద్వేష రహిత సమాజంలోకి​—⁠యెహోవాసాక్షుల భూవ్యాప్త సహోదరత్వంలోకి​—⁠సమకూర్చబడుతున్నారు. అపొస్తలుడైన యోహాను వ్రాసిన ఈ ప్రేరేపిత మాటలను వారు లక్ష్యపెడుతున్నారు: “తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.” (1 యోహాను 3:​15) నిజ క్రైస్తవులు యుద్ధాలలో పాల్గొనడానికి నిరాకరించడమే కాకుండా ఒకరి పట్ల ఒకరు ప్రేమను కనబరచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తారు.

అయితే తోటి విశ్వాసులు కాని వారిపట్ల, మనల్ని ద్వేషించే వారిపట్ల మన మనోవైఖరి ఎలా ఉండాలి? యేసు కొయ్యపై ఉన్నప్పుడు తన మరణానికి కారణమైనవారి తరఫున ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు[ము].” (లూకా 23:​34) ద్వేషపూరితులైన ప్రజలు స్తెఫనును రాళ్ళతో కొట్టి చంపినప్పుడు ఆయన ఆఖరి మాటలు ఇవి: “ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకు[ము].” (అపొస్తలుల కార్యములు 7:​60) యేసు, స్తెఫను తమను ద్వేషించినవారికి సహితం మేలు జరగాలనే కోరుకున్నారు. వారి హృదయాల్లో ద్వేషం లేదు. “అందరియెడలను . . . మేలు చేయుదము” అని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది.​—⁠గలతీయులు 6:10.

‘ఎల్లప్పుడు ఉండే ఆదరణకర్త’

పదకొండు మంది నమ్మకమైన అపొస్తలులతో కూటమి కొనసాగుతుండగా, త్వరలో తాను శారీరకంగా వారితో ఉండనని యేసు వారికి చెప్పాడు. (యోహాను 14:28; 16:​28) కానీ ఆయన వారికి ఈ హామీ ఇచ్చాడు: “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను . . . మీకనుగ్రహించును.” (యోహాను 14:​16) వాగ్దానం చేయబడిన ఆ ఆదరణకర్త దేవుని పరిశుద్ధాత్మ. అది లేఖనాల్లోని లోతైన విషయాలను వారికి బోధించి, యేసు తన భూపరిచర్య కాలంలో వారికి బోధించిన విషయాలను వారికి జ్ఞాపకం చేస్తుంది.​—⁠యోహాను 14:26.

నేడు పరిశుద్ధాత్మ మనకు ఎలా సహాయం చేయగలదు? బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యము. ప్రవచనాలు చెప్పిన బైబిలును వ్రాసిన పురుషులు “పరిశుద్ధాత్మవలన ప్రేరేపించబ[డ్డారు].” (2 పేతురు 1:20, 21; 2 తిమోతి 3:​16, 17) మనం లేఖనాలను అధ్యయనం చేసి నేర్చుకున్నవాటిని అన్వయించుకోవడం మనకు బుద్ధిని, జ్ఞానమును, అవగాహనను, అంతర్దృష్టిని, వివేచనను, ఆలోచనా సామర్థ్యాన్ని ఇస్తుంది. అప్పుడు మనం ఈ దుష్ట లోకం నుండి వచ్చే ఒత్తిళ్ళను ఎదుర్కోవడానికి మరింత సిద్ధంగా ఉండమా?

పరిశుద్ధాత్మ మరో విధంగా కూడా ఆదరణకర్తగా ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మ ప్రయోజనకరమైన, శక్తివంతమైన ప్రభావాన్ని చూపి, దాని ప్రభావం క్రింద ఉన్నవారు మంచి లక్షణాలను ప్రదర్శించేలా సహాయం చేస్తుంది. “ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” అని బైబిలు చెబుతోంది. ఈ లక్షణాలు అనైతికత, విబేధాలు, అసూయ, కోపంవంటి ఇతర శారీరక లక్షణాలను జయించడానికి మనకు అవసరం లేదంటారా?​—⁠గలతీయులు 5:19-22.

దేవుని ఆత్మపై ఆధారపడడం ద్వారా మనం ఎలాంటి సమస్యతోనైనా లేదా ఎలాంటి బాధతోనైనా వ్యవహరించడానికి “బలాధిక్యము” కూడా పొందవచ్చు. (2 కొరింథీయులు 4:⁠7) పరిశుద్ధాత్మ కష్టాలను, శోధనలను తీసివేయకపోవచ్చు కానీ వాటిని సహించడానికి అది తప్పకుండా మనకు సహాయం చేయగలదు. (1 కొరింథీయులు 10:​13) “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (ఫిలిప్పీయులు 4:​13) దేవుడు అలాంటి బలాన్ని తన పరిశుద్ధాత్మ ద్వారా ఇస్తాడు. మనం పరిశుద్ధాత్మను పొందడానికి ఎంత కృతజ్ఞులమై ఉండాలో కదా! ‘యేసును ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనేవారికి’ అది వాగ్దానం చేయబడింది.​—⁠యోహాను 14:15.

“నా ప్రేమయందు నిలిచి యుండుడి”

యేసు మానవునిగా ఉన్న చివరి రాత్రి తన అపొస్తలులకు ఇలా కూడా చెప్పాడు: “నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును.” (యోహాను 14:​21) “నా ప్రేమయందు నిలిచి యుండుడి” అని ఆయన వారిని ప్రోత్సహించాడు. (యోహాను 15:⁠9) తండ్రి ప్రేమయందు, కుమారుని ప్రేమయందు నిలిచి ఉండడం, మనలోని పాపభరితమైన కోరికలతో, వెలుపలి దుష్ట లోకంతో మనం చేసే యుద్ధంలో మనకు ఎలా సహాయం చేస్తుంది?

మనకు బలమైన ప్రేరణ లేకుండా మనం పాపభరితమైన కోరికలను నిజంగా అదుపు చేసుకోగలమా? యెహోవా దేవునితో, ఆయన కుమారునితో మంచి సంబంధాన్ని కలిగివుండాలన్న కోరిక కంటే బలమైన ప్రేరణ ఏమి ఉండగలదు? తాను చిన్నప్పటి నుండి జీవిస్తున్న అనైతిక జీవితానికి వ్యతిరేకంగా బలంగా పోరాడిన ఎర్నేస్టో * అనే యువకుడు ఇలా వివరిస్తున్నాడు: “నేను దేవుణ్ణి సంతోషపరచాలనుకున్నాను, నేను జీవిస్తున్న విధానాన్ని ఆయన అంగీకరించడని నేను బైబిలు నుండి నేర్చుకున్నాను. కాబట్టి ఒక భిన్నమైన వ్యక్తిగా, దేవుని మార్గనిర్దేశాలకు కట్టుబడి ఉండే వ్యక్తిగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అయినా ప్రతిరోజు నా మనస్సులోకి ప్రవాహంలా వచ్చే వినాశనకరమైన, అసహ్యమైన తలంపులకు వ్యతిరేకంగా నేను పోరాడవలసి వచ్చేది. అయితే నేను ఈ యుద్ధంలో విజయం సాధించాలని తీర్మానించుకున్నాను, దేవుని సహాయం కోసం ఎడతెగక ప్రార్థించాను. రెండు సంవత్సరాల తర్వాత నేను దాన్ని జయించగలిగాను, అయితే ఇప్పటికీ నాతో నేను కఠినంగానే వ్యవహరిస్తాను.”

బయటి లోకంతో చేసే యుద్ధం విషయానికి వస్తే, యెరూషలేములోని ఆ మేడగదిని వదిలివెళ్ళే ముందు యేసు చేసిన ముగింపు ప్రార్థనను పరిశీలించండి. ఆయన తన శిష్యుల తరఫున తన తండ్రికి ప్రార్థిస్తూ ఇలా అడిగాడు: “నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:​15, 16) ఎంత గొప్ప హామీయో కదా! యెహోవా తాను ప్రేమించే వారిని కనిపెట్టుకొని ఉంటాడు, వారు తమను తాము లోకమునుండి వేరుగా ఉంచుకుంటుండగా ఆయన వారిని బలపరుస్తాడు.

“విశ్వాసముంచుడి”

దుష్టలోకానికీ మన పాపభరితమైన కోరికలకూ వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటంలో విజయం సాధించడానికి యేసు ఆజ్ఞలను పాటించడం నిజంగా సహాయపడగలదు. ఇలా విజయం సాధించడం ప్రాముఖ్యమే అయినప్పటికీ, అది ఈ లోకాన్ని గానీ మనకు వారసత్వంగా వచ్చిన పాపాన్ని గానీ నిర్మూలించలేదు. అయితే మనం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు.

“లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని బైబిలు ప్రకటిస్తోంది. (1 యోహాను 2:​17) తనయందు “విశ్వాసముంచు ప్రతి [ఒక్కరిని]” పాపమరణాల నుండి రక్షించేందుకు యేసు తన ప్రాణాన్ని అర్పించాడు. (యోహాను 3:​16) దేవుని చిత్తం గురించి, ఆయన సంకల్పాల గురించి మన జ్ఞానం అధికమవుతుండగా మనం యేసు చేసిన ఈ ఉద్బోధను లక్ష్యపెడదాం: “దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి.”​—⁠యోహాను 14:⁠1.

[అధస్సూచి]

^ పేరా 22 ఇక్కడ వేరే పేరు ఉపయోగించబడింది.

[7వ పేజీలోని చిత్రం]

“నా ప్రేమయందు నిలిచి యుండుడి” అని యేసు తన అపొస్తలులను ప్రోత్సహించాడు

[7వ పేజీలోని చిత్రం]

పాపము నుండి దాని ప్రభావాల నుండి విడుదల త్వరలోనే ఒక వాస్తవమవుతుంది