నా పిల్లలు స్కూలుకు వెళ్ళాలా?
నా పిల్లలు స్కూలుకు వెళ్ళాలా?
మీరు ఈ పేజీలోని పదాలను చదవలేకపోవడాన్ని ఊహించుకోగలరా? మీరు మీ దేశ అధికారిక భాషను మాట్లాడలేకపోతే ఎలా? ప్రపంచ పటంలో మీ స్వదేశం ఎక్కడుందో మీరు కనుక్కోలేకపోతే ఎలా? లెక్కలేనంతమంది పిల్లలు సరిగ్గా ఆ స్థితిలోనే పెరిగి పెద్దవారవుతారు. మరి మీ పిల్లల విషయమేమిటి?
మీ పిల్లలు స్కూలుకు వెళ్ళాలా? చాలా దేశాల్లో ప్రాథమిక, మాధ్యమిక విద్య తప్పనిసరి, తరచూ అది ఉచితంగా ఇవ్వబడుతుంది. బాలల హక్కులపై సదస్సు, పాఠశాల విద్యను పిల్లల ప్రాథమిక హక్కుగా పరిగణిస్తోంది. మానవ హక్కుల విశ్వ ప్రకటన కూడా అలాగే పరిగణిస్తోంది. అయితే కొన్ని దేశాల్లో, పాఠశాల విద్య ఉచితం కాకపోవచ్చు, తల్లిదండ్రులపై అది ఆర్థిక భారాన్ని మోపవచ్చు. పాఠశాల విద్య ద్వారా లేదా ఇతర మాధ్యమాల ద్వారా తమ పిల్లలు అక్షరాస్యులు కావాలని కోరుకునే క్రైస్తవ తల్లిదండ్రుల దృక్కోణం నుండి ఈ విషయం గురించి మనం ఆలోచిద్దాం.
అక్షరాస్యతకు సంబంధించి బైబిలు ఉదాహరణలు
బైబిలులో ప్రస్తావించబడిన దేవుని సేవకులలో అనేకమంది చదవగలిగేవారు, వ్రాయగలిగేవారు. యేసు అపొస్తలులైన పేతురు, యోహాను చేపలు పట్టేవాళ్ళే అయినా వారు బైబిలు పుస్తకాలను తమ గలిలయ మాండలిక భాషలో కాకుండా గ్రీకు భాషలో వ్రాశారు. * తమ పిల్లలకు ప్రాథమిక విద్య లభించేలా వారి తల్లిదండ్రులు నిశ్చయపర్చుకొని ఉండవచ్చు. అలాంటి పరిస్థితిలోనే ఉన్న ఇతర బైబిలు రచయితల్లో గొఱ్ఱెల కాపరి అయిన దావీదు, వ్యవసాయదారుడైన ఆమోసు, బహుశా వడ్రంగి అయిన యేసు తమ్ముడు యూదా ఉన్నారు.
యోబుకు చదవడం వ్రాయడం వచ్చు, ఆయనకు విజ్ఞానశాస్త్రం గురించి కొంత అవగాహన ఉండేదని ఆయన పేరుతోవున్న బైబిలు పుస్తకం సూచిస్తోంది. ఆయనకు రచనా నైపుణ్యం కూడా ఉండివుండవచ్చు ఎందుకంటే యోబు పుస్తకంలో ఆయన వ్యాఖ్యానాలు కవితా రూపంలో ఉన్నాయి. తొలి క్రైస్తవులు అక్షరాస్యులని మనకు తెలుసు ఎందుకంటే బహుశా వారు వ్రాసుకున్న లేఖనాధారిత వ్యాఖ్యానాలు కావచ్చు కుండపెంకుల మీద కనుగొనబడ్డాయి.
క్రైస్తవులకు విద్య ప్రాముఖ్యం
దేవుణ్ణి సంతోషపరచేందుకు క్రైస్తవులందరూ తమ బైబిలు జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. (ఫిలిప్పీయులు 1:9-11; 1 థెస్సలొనీకయులు 4:1) లేఖనాలను, బైబిలు ఆధారిత అధ్యయన పుస్తకాలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు. దేవుడు తన లిఖిత వాక్యాన్ని ఇచ్చాడు కాబట్టి, తన ఆరాధకులు సాధ్యమైనంత మేరకు అక్షరాస్యులై ఉండాలని ఆయన ఆశిస్తాడు. బైబిలును అవగాహనతో చదివితే, దాని ఉపదేశాన్ని అన్వయించుకోవడం సులభమవుతుంది. అయితే దానిలోని కొన్ని భాగాలను పూర్తిగా అర్థం చేసుకొని వాటిగురించి ధ్యానించాలంటే మనం ఆ విషయాలను ఒకటి కంటే ఎక్కువ సార్లు చదవవలసి రావచ్చు.—కీర్తన 119:104; 143:5; సామెతలు 4:7.
ప్రతీ సంవత్సరం యెహోవాసాక్షులకు, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” నడిపింపులో వ్రాయబడిన వందలాది పేజీల సహాయకరమైన సమాచారం లభిస్తోంది. (మత్తయి 24:45-47) ఆ ప్రచురణలు కుటుంబ జీవితం, ఆచారాలు, మతం, విజ్ఞానశాస్త్రం, ఎన్నో ఇతర విషయాల గురించి చర్చిస్తాయి. అన్నింటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే వాటిలో ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి లేఖనాధారిత ఉపదేశం ఉంటుంది. మీ పిల్లలు చదవలేకపోతే, వారు ఎంతో ప్రాముఖ్యమైన ఆ సమాచారాన్ని పొందలేరు.
మానవజాతి చరిత్రను తెలుసుకోవడం ప్రాముఖ్యము ఎందుకంటే అది, దేవుని రాజ్యం ఎందుకు అవసరమో అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. భూగోళశాస్త్రం గురించి ప్రాథమిక జ్ఞానం ఉండడం కూడా అభిలషణీయమే. ఇశ్రాయేలు, ఐగుప్తు, గ్రీసు వంటి అనేక ప్రాంతాల గురించి బైబిలు మాట్లాడుతోంది. మీ పిల్లలు ప్రపంచ పటంలో ఆ ప్రాంతాలను గుర్తుపట్టగలుగుతున్నారా? తమ సొంత దేశాన్ని వారు గుర్తుపట్టగలరా? ఒక పటాన్ని చదవలేకపోతే, నియమించబడిన క్షేత్రంలో ఒక వ్యక్తి తన పరిచర్యను సంపూర్ణంగా జరిగించే సామర్థ్యం కూడా పరిమితంగా ఉండవచ్చు.—2 తిమోతి 4:5.
సంఘంలో ఆధిక్యతలు
క్రైస్తవ పెద్దలకు, పరిచర్య సేవకులకు చదవడం అవసరమయ్యే అనేక బాధ్యతలు ఉంటాయి. ఉదాహరణకు సంఘ కూటాలకు సిద్ధపడవలసిన భాగాలుంటాయి. సాహిత్య సరఫరా గురించి, విరాళాల గురించి రికార్డులు వ్రాసిపెట్టవలసిన అవసరం ఉంటుంది. ప్రాథమిక విద్య లేని వ్యక్తికి ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం చాలా కష్టం.
ప్రపంచవ్యాప్తంగా బేతేలు గృహాలలో స్వచ్ఛంద సేవకులు పనిచేస్తారు. ఈ స్వచ్ఛంద సేవకులు చక్కగా సంభాషించాలంటే, సాహిత్యాన్ని అనువదించడం యంత్రాలను బాగుచేయడం వంటి తమ పనులను సక్రమంగా చేయాలంటే వారు తాము నివసిస్తున్న దేశ అధికారిక భాషను చదవగలిగి, వ్రాయగలిగి ఉండాలి. మీ పిల్లలు ఇలాంటి ఆధిక్యతలను పొందాలంటే, సాధారణంగా వారికి ప్రాథమిక విద్య అవసరమవుతుంది. మీ పిల్లలు స్కూలుకు వెళ్ళడానికి మరి కొన్ని ఆచరణాత్మకమైన కారణాలు ఏమిటి?
పేదరికం, మూఢనమ్మకం
పేదరికంలో జీవిస్తున్న ప్రజలు కొన్ని పరిస్థితులలో దాదాపు నిస్సహాయులుగా ఉండవచ్చు. అయితే ఇతర సందర్భాల్లో, మనమూ మన పిల్లలూ అనవసరమైన బాధలు పడకుండా ఉండేందుకు ఒక మోస్తరు విద్య సహాయపడవచ్చు. చాలామంది నిరక్షరాస్యులు కేవలం బ్రతికి ఉండడానికే ఎన్నో కష్టాలు పడాల్సివుంటుంది. కొన్నిసార్లు చాలీచాలని ఆదాయంవల్ల వైద్య సహాయం పొందడం అసాధ్యం కాబట్టి పిల్లలు, తల్లిదండ్రులు కూడా మరణిస్తారు. చాలా తక్కువ చదువుకున్నవారికి లేదా అస్సలు చదువుకోనివారికి తరచూ పోషకాహార లోపం, సరైన ఇళ్ళు లేకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విషయాలలో విద్య లేదా కనీసం చదవగలిగే వ్రాయగలిగే సామర్థ్యం కొంత సహాయకరంగా ఉండవచ్చు.
అక్షరాస్యతవల్ల మూఢనమ్మకస్థులుగా ఉండే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. మూఢనమ్మకాలు అక్షరాస్యుల మధ్య, నిరక్షరాస్యుల మధ్య కూడా ప్రబలంగా ఉన్నాయన్నది నిజమే. కానీ నిరక్షరాస్యులు ఇతరులకంటే సులభంగా మోసపోవచ్చు లేదా ఇతరులు తమ స్వలాభం కోసం నిరక్షరాస్యులను దోచుకోవచ్చు ఎందుకంటే అలాంటి మోసాలను బహిర్గతం చేసే సమాచారాన్ని వారు చదవలేరు. కాబట్టి వారు మరింత మూఢనమ్మకస్థులుగా ఉండి, భూత వైద్యుడు అద్భుత రీతిలో వ్యాధులను నయం చేయగలడు అని నమ్మడానికి మొగ్గు చూపుతారు.—ద్వితీయోపదేశకాండము 18:10-12; ప్రకటన 21:8.
విద్య కేవలం ఉద్యోగం సంపాదించుకోవడానికే కాదు
విద్య ముఖ్యోద్దేశం డబ్బు సంపాదించుకోవడమేనని చాలామంది భావిస్తారు. కానీ కొంతమంది విద్యావంతులు కూడా నిరుద్యోగులుగా ఉన్నారు లేదా కనీస అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా డబ్బు సంపాదించుకోలేకపోతున్నారు. కాబట్టి పిల్లలను స్కూలుకు పంపించడం ప్రయోజనకరం కాదని కొంతమంది తల్లిదండ్రులు అనుకోవచ్చు. కానీ పాఠశాల విద్య ఒకరిని డబ్బు సంపాదించుకోవడానికి సిద్ధపరచడం కంటే ఎక్కువే చేస్తుంది; అది పిల్లలను జీవితం కోసం సిద్ధం చేస్తుంది. (ప్రసంగి 7:12) ఒక వ్యక్తి తాను నివసిస్తున్న దేశ అధికారిక భాషలో మాట్లాడి, దాన్ని చదివి, వ్రాయగలిగితే, వైద్య సిబ్బందితో, ప్రజాధికారులతో, లేదా బ్యాంకు ఉద్యోగులతో వ్యవహరించడం భయాన్ని కలిగించేదిగా కాకుండా మరింత సులభమైనదిగా లేదా సామాన్యమైనదిగా తయారవుతుంది.
కొన్ని ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన పిల్లలను తాపీ పని, చేపలు పట్టడం, బట్టలు కుట్టడం లేదా మరేదైనా ఇతర వృత్తి నేర్చుకోవడానికి వృత్తివిద్యార్థులుగా వేరేవారివద్దకు పంపించవచ్చు. ఒక వృత్తిని నేర్చుకోవడం ప్రయోజనకరమే, కానీ ఈ పిల్లలు అసలు స్కూలుకు వెళ్ళకపోతే సరిగ్గా చదవడం, వ్రాయడం నేర్చుకోకపోవచ్చు. వారు మొదట ప్రాథమిక విద్యను అభ్యసించి ఆ తర్వాత వృత్తి నేర్చుకుంటే వారు మోసం చేయబడడాన్ని నిరోధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వారు మరింత సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చు.
నజరేతువాడైన యేసు వడ్రంగి పని చేసేవాడు, బహుశా ఆయన తనను పెంచిన తండ్రి అయిన యోసేపు వద్ద వృత్తివిద్యార్థిగా శిక్షణ పొందివుండవచ్చు. (మత్తయి 13:55; మార్కు 6:3) యేసు అక్షరాస్యుడు కూడా, ఎందుకంటే 12 సంవత్సరాలకే ఆలయంలోని విద్యావంతులైన పురుషులతో అర్థవంతమైన చర్చలు జరిపేంత సామర్థ్యాన్ని ఆయన సంపాదించుకున్నాడు. (లూకా 2:46, 47) యేసు విషయంలో వృత్తిని నేర్చుకోవడం ఇతర విషయాలను నేర్చుకోకుండా అడ్డుకోలేదు.
అమ్మాయిలను కూడా చదివించాలా?
కొంతమంది తల్లిదండ్రులు తమ అబ్బాయిలను స్కూలుకు పంపిస్తారు కానీ అమ్మాయిలను పంపించరు. అమ్మాయిలను చదివించడం చాలా ఖరీదైన పని అని కొందరు తల్లిదండ్రులు అనుకుంటుండవచ్చు, రోజంతా ఇంట్లో ఉంటే వారు తమ తల్లికి మరింత సహాయకరంగా
ఉంటారని కూడా అనుకోవచ్చు. కానీ నిరక్షరాస్యత మీ అమ్మాయికి ప్రతిబంధకం కలుగజేస్తుంది. ఐక్యరాజ్య సమితి బాలల నిధి (యూనిసెఫ్) ప్రచురించిన ఒక పత్రిక ఇలా నివేదిస్తోంది: “పేదరికాన్ని నిర్మూలించడానికి ఉత్తమమైన మార్గాల్లో ఒకటి, అమ్మాయిలకు విద్య కల్పించడమని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి.” (పావర్టీ అండ్ చిల్డ్రన్: లెసన్స్ ఆఫ్ ద నైన్‌టీస్ ఫర్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్) విద్యావంతులైన అమ్మాయిలు జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి మరింత సంసిద్ధంగా ఉండి, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కుటుంబంలోని అందరికీ ప్రయోజనం కలుగజేస్తారు.పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్‌లో శిశు మరణాలకు సంబంధించిన ఒక అధ్యయనం, నిరక్షరాస్యులైన తల్లులు ఒక గుంపుగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 1,000 మంది పిల్లల్లో 167 మంది పిల్లలను పోగొట్టుకుంటున్నారు, కానీ మాధ్యమిక విద్యను పొందిన తల్లులు 1,000 మందిలో 38 మంది పిల్లలను మాత్రమే పోగొట్టుకుంటున్నారని సూచించింది. యూనిసెఫ్ ఇలా ముగిస్తోంది: “కాబట్టి బెనిన్‌లోలాగే ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా శిశు మరణాలను నిర్ణయించే కారకం విద్యాస్థాయి.” కాబట్టి మీ అమ్మాయిల్ని చదివించడం వివిధ ప్రయోజనాలను కలిగించగలదు.
అక్షరాస్యత తరగతులు సరిపోతాయా?
అవసరమైన ప్రాంతాల్లో, చదవలేని సంఘ సభ్యుల కోసం యెహోవాసాక్షులు అక్షరాస్యతా తరగతులను నిర్వహిస్తారు. * ప్రయోజనకరమైన ఈ ఏర్పాటు, ప్రజలు సాధారణంగా తమ స్థానిక భాషలో చదవడం నేర్చుకునేందుకు సహాయం చేస్తుంది. పాఠశాల విద్యకు ఇది తగిన ప్రత్యామ్నాయమేనా? పాఠశాలలు ఉన్నప్పటికీ మీ పిల్లలకు సంఘమే విద్య నేర్పించాలని మీరు ఆశించవచ్చా?
అక్షరాస్యత తరగతులు యెహోవాసాక్షుల సంఘాలు చేసిన దయాపూర్వకమైన ఏర్పాటే అయినప్పటికీ అవి చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళలేకపోయిన వయోజనుల కోసం ఉద్దేశించబడినవి. బహుశా వారి తల్లిదండ్రులకు అక్షరాస్యత ప్రాముఖ్యత గురించి తెలిసుండకపోవచ్చు లేదా అప్పుడు పాఠశాలలు లేకపోయివుండవచ్చు. అలాంటి వ్యక్తులు సంఘాల్లో నిర్వహించబడే అక్షరాస్యత తరగతులకు హాజరవడం ద్వారా సహాయాన్ని పొందవచ్చు. అయితే ఈ తరగతులు పాఠశాల విద్యకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు, అవి ప్రాథమిక విద్యను నేర్పించడానికి రూపొందించబడలేదు. అలాంటి తరగతులలో విజ్ఞానశాస్త్రం, గణితశాస్త్రం, చరిత్ర వంటి విషయాలు నేర్పించబడవు. అవి పాఠశాల విద్యలో నేర్పించబడతాయి.
ఆఫ్రికాలో, అక్షరాస్యత తరగతులు ఎక్కువగా స్థానిక తెగల భాషలలో నిర్వహించబడతాయి, చాలా అరుదుగా మాత్రమే ఆ దేశపు అధికారిక భాషలో నిర్వహించబడతాయి. అయితే పాఠశాల విద్య మాత్రం సాధారణంగా దేశపు అధికారిక భాషలోనే నేర్పించబడుతుంది. ఇది పిల్లలకు అదనపు ప్రయోజనాలను కలుగజేస్తుంది ఎందుకంటే అధికారిక భాషలో ఎక్కువ పుస్తకాలు, చదవడానికి వీలుగా ఇతర సమాచారం ఎక్కువగా లభిస్తుంది. సంఘ అక్షరాస్యత తరగతులు ఒక పిల్లవాడి పాఠశాల విద్యకు తోడ్పడినప్పటికీ అవి దాని స్థానాన్ని తీసుకోలేవు. కాబట్టి సాధ్యమైతే పిల్లలకు పాఠశాల విద్య నేర్పించడం అవసరం కాదంటారా?
తల్లిదండ్రుల బాధ్యత
సంఘ ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడంలో నాయకత్వం వహించే పురుషులు మాదిరికరమైన క్రైస్తవులుగా ఉండాలి. వారు తమ ఇంటివారిని పిల్లలను “బాగుగా” పర్యవేక్షించేవారై ఉండాలి. (1 తిమోతి 3:4, 12) “బాగుగా” పర్యవేక్షించడంలో మన పిల్లలకు భవిష్యత్తులో ప్రతిబంధకం కలుగజేసేవాటిని నివారించడానికి సాధ్యమైనదంతా చేయడం చేరివుంటుంది.
దేవుడు క్రైస్తవ తల్లిదండ్రులకు గొప్ప బాధ్యతనిచ్చాడు. వారు తమ పిల్లలను ఆయన వాక్యం ప్రకారం పెంచి, వారు ‘జ్ఞానమును ప్రేమించేవారిగా’ తయారవడానికి సహాయం చేయాలి. (సామెతలు 12:1; 22:6; ఎఫెసీయులు 6:4) అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” (1 తిమోతి 5:8) మన పిల్లలకు తగిన విద్యను కూడా నేర్పించాలి.
ఎక్కువమంది పిల్లలు ఉండడంవల్ల, సరిపడేంత డబ్బులేనందువల్ల లేదా తక్కువ జీతాల మూలంగా అసంతోషంగా ఉన్న ఉపాధ్యాయుల వల్ల కొన్ని స్కూళ్ళకు పిల్లల విద్యావసరాలను తీర్చే సామర్థ్యం ఉండదు. కాబట్టి తమ పిల్లలు స్కూల్లో ఏమి నేర్చుకుంటున్నారు అనే విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవడం ప్రాముఖ్యం. ఉపాధ్యాయులతో—ప్రత్యేకించి ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో—పరిచయం పెంచుకోవడం జ్ఞానయుక్తం, పిల్లలు మెరుగైన విద్యార్థులుగా ఉండేందుకు ఏమి చేయాలో వారిని సలహా అడగవచ్చు. అలా చేస్తే ఉపాధ్యాయులు గౌరవించబడినట్లు భావించి, పిల్లల విద్యావసరాలను తీర్చడానికి అధికంగా కృషి చేసేందుకు పురికొల్పబడతారు.
పిల్లల అభివృద్ధికి విద్య ప్రాముఖ్యం. “జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు” అని సామెతలు 10:14 చెబుతోంది. ప్రత్యేకించి బైబిలు జ్ఞానం విషయంలో ఆ మాటలు నిజం. యెహోవా ప్రజలు—యౌవనస్థులు, వృద్ధులు కూడా—ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడానికి, ‘దేవునియెదుట యోగ్యులుగాను, సిగ్గుపడనక్కరలేని పనివారిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారిగాను తమను తాము దేవునికి కనుపరచుకోవడానికి’ సాధ్యమైనంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. (2 తిమోతి 2:15; 1 తిమోతి 4:15) కాబట్టి మీ పిల్లలు స్కూలుకు వెళ్ళాలా? అది చాలామేరకు మీ దేశంలో ఏది ఆచరణాత్మకమైన విద్య అనే విషయంపై అధారపడివున్నప్పటికీ నిస్సందేహంగా మీరు, వాళ్ళు స్కూలుకు వెళ్ళాలనే ముగింపుకే వస్తారు. కానీ క్రైస్తవ తల్లిదండ్రులు మరింత ప్రాముఖ్యమైన ఈ ప్రశ్నకు సమాధానమివ్వాలి: ‘నా పిల్లలకు విద్య నేర్పించాలా?’ మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం రావాలని మీరు అంగీకరించరా?
[అధస్సూచీలు]
^ పేరా 5 వారి మాతృభాష గలిలయ మాండలికం అయిన అరామిక్ లేదా మాండలిక రూపంలో ఉన్న హీబ్రూ అయివుండాలి. యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం), మొదటి సంపుటి 144-6 పేజీలను చూడండి.
^ పేరా 25 డిసెంబరు 22, 2000, తేజరిల్లు! (ఆంగ్లం)లోని 8, 9 పేజీలు చూడండి.
స్కూలుకు వెళ్ళడం అసాధ్యమైతే
[12, 13వ పేజీలోని బాక్సు/చిత్రం]
కొన్ని పరిస్థితుల్లో స్కూలుకు వెళ్ళడం అసాధ్యం. ఉదాహరణకు, శరణార్థ శిబిరాలలో ఐదుగురు పిల్లల్లో అర్హతగల ఒక్కరికి మాత్రమే స్కూలుకు వెళ్ళే అవకాశముందని శరణార్థులు (ఆంగ్లం) అనే పత్రిక నివేదించింది. కొన్ని సందర్భాల్లో స్ట్రైక్‌ల మూలంగా చాలాకాలం వరకు స్కూళ్ళు మూతపడతాయి. కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ళు ఉండకపోవచ్చు లేదా చాలా దూరంలో ఉండవచ్చు. క్రైస్తవులను హింసించడంలో భాగంగా కూడా వారి పిల్లలు స్కూలునుండి బహిష్కరించబడవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు? మీకు ఎక్కువమంది పిల్లలుండి, మీరు నివసిస్తున్న ప్రాంతంలో అధిక ధరల మూలంగా వారందరూ స్కూలుకు వెళ్ళడం అసాధ్యంగా ఉంటే అప్పుడు మీరు ఏమి చేయవచ్చు? ఆధ్యాత్మిక ప్రమాదానికి గురికాకుండానే మీ పిలల్లో కనీసం ఒకరినో ఇద్దరినో స్కూలుకు పంపించగలరా? అయితే, వారు స్కూల్లో నేర్చుకున్న విషయాలను కుటుంబంలోని ఇతర పిల్లలకు నేర్పించడంలో సహాయపడవచ్చు.
కొన్ని దేశాల్లో ఇంట్లో విద్యాబోధన అనే ఏర్పాటు కూడా ఉంది. * ఈ ఏర్పాటులో, సాధారణంగా తల్లిదండ్రులలో ఒకరు ప్రతీ రోజు తమ పిల్లలకు నేర్పించడానికి కొన్ని గంటల సమయాన్ని వెచ్చిస్తారు. పూర్వకాలంలో, తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించడంలో విజయవంతులయ్యేవారు. బహుశా తల్లిదండ్రులు ఇచ్చిన మంచి శిక్షణ కారణంగానే కావచ్చు యాకోబు కుమారుడైన యోసేపు తన యౌవనంలోనే ఇతరులను పర్యవేక్షించే సామర్థ్యాన్ని సంపాందించుకున్నాడు.
శరణార్థి శిబిరం వంటి ప్రాంతాల్లో పాఠశాల విద్య లేదా బోధనా కార్యక్రమం లభ్యమవడం కష్టంగా ఉండవచ్చు, కానీ తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన ప్రచురణలను ఆధారంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు చిన్న పిల్లలకు నేర్పించడానికి నా బైబిలు కథల పుస్తకము సహాయకరంగా ఉండవచ్చు. తేజరిల్లు! పత్రికలో వివిధ విషయాలకు సంబంధించిన ఆర్టికల్‌లు ఉంటాయి. విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన విషయాలు బోధించడానికి జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం) పుస్తకాన్ని ఉపయోగించవచ్చు. యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం (ఆంగ్లం)లో చిన్న ప్రపంచ పటం ఉంటుంది, వివిధ దేశాల్లోని జీవిత విధానం గురించి ప్రకటనా కార్యకలాపాల గురించి అది చెబుతుంది.
మీరు బాగా సిద్ధపడి, పిల్లల అవగాహనా స్థాయికి అనుగుణంగా బోధిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. వారు చదవడాన్ని, నేర్చుకోవడాన్ని కొనసాగిస్తే, భవిష్యత్తులో వారు స్కూలుకు వెళ్లే అవకాశం వచ్చినప్పుడు వారు దానికి సులభంగా సర్దుకుపోతారు. చొరవ తీసుకోవడం ద్వారా, కృషి చేయడం ద్వారా మీరు మీ పిల్లలు విద్యావంతులుగా ఉండడానికి సహాయం చేయగలుగుతారు. అది ఎంత ప్రతిఫలదాయకమైనదై ఉంటుందో కదా!
[అధస్సూచి]
^ పేరా 40 జూలై 8, 1993, తేజరిల్లు!లో 9-12 పేజీల్లోని “ఇంట్లో విద్యాబోధన—మీ కొరకా?” అనే ఆర్టికల్‌ను చూడండి.
[చిత్రం]
మీ పిల్లలు స్కూలుకు వెళ్ళే అవకాశంలేని ప్రాంతంలో మీరు నివసిస్తుంటే మీరేమి చేయవచ్చు?