కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నిజం మాట్లాడే పెదవులు నిరంతరం నిలుస్తాయి’

‘నిజం మాట్లాడే పెదవులు నిరంతరం నిలుస్తాయి’

‘నిజం మాట్లాడే పెదవులు నిరంతరం నిలుస్తాయి’

ఒక చిన్న నిప్పురవ్వ రగిలి మంటగా మారి మొత్తం అడవినే నాశనం చేయగలిగినట్లుగా, ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా పాడు చేయగల శక్తి దానికి ఉంది. అది విషపూరితమైనదైనా ఉండవచ్చు, “జీవవృక్షము”గా కూడా కావచ్చు. (సామెతలు 15:⁠4) జీవన్మరణములు దాని ఆధీనములో ఉన్నాయి. (సామెతలు 18:​21) చిన్న అవయవమైన మన ఈ నాలుకకు అంతటి శక్తి ఉంది, అది సర్వశరీరాన్ని మలినపరచగలదు. (యాకోబు 3:5-9) అందుకే నాలుకను అదుపులో ఉంచుకోవడం జ్ఞానయుక్తము.

బైబిలు పుస్తకం సామెతలు 12వ అధ్యాయపు రెండవ భాగంలో, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను మనం జాగ్రత్తగా మాట్లాడడానికి సహాయపడే విలువైన హితోపదేశాన్నిస్తున్నాడు. సంక్షిప్తమైనవే అయినా అర్థవంతమైన సామెతల ద్వారా, మనం మాట్లాడే మాటలు ప్రభావాన్ని చూపించడమే కాక మాట్లాడే వ్యక్తి లక్షణాలను కూడా ఎంతగానో వెల్లడిచేస్తాయని జ్ఞానియైన రాజు చూపిస్తున్నాడు. తమ “పెదవుల ద్వారమునకు కాపు పెట్టు”కోవాలనుకునే వారికెవరికైనా సొలొమోను ప్రేరేపిత హితోపదేశం తప్పకుండా అవసరం.​—⁠కీర్తన 141:⁠3.

“దోషము అపాయకరమైన ఉరి”

“పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును” అని సొలొమోను అంటున్నాడు. (సామెతలు 12:​13) పెదవుల దోషం అంటే అబద్ధం చెప్పడం, అది ఆ వ్యక్తికి మరణానికి దారితీసే ఒక ఉరిలా మారుతుంది. (ప్రకటన 21:⁠8) శిక్షను తప్పించుకోవడానికి లేదా ఇబ్బందికరమైన పరిస్థితి నుండి బయటపడడానికి మోసం ఒక సులభమైన మార్గంలా కనిపించవచ్చు. కానీ తరచుగా ఒక అబద్ధం మరికొన్ని అబద్ధాలకు దారితీయదా? ఒక వ్యక్తి చిన్న చిన్న మొత్తాలతో జూదమాడడం ప్రారంభించి అతడు పోగొట్టుకున్నదాన్ని తిరిగిపొందాలన్న తపనతో పెద్ద పెద్ద మొత్తాలతో పందాల్లోకి దిగినట్లు, అబద్ధం చెప్పే వ్యక్తి తానొక విషవలయంలో చిక్కుకుపోయానని త్వరలోనే గ్రహిస్తాడు.

పెదవుల దోషము ఆ ఉరిని మరింత బిగువు చేస్తుంది, ఎలాగంటే ఆ వ్యక్తి ఇతరులతో అబద్ధం చెప్పడంతో మాత్రమే ఆగక తనకు తాను అబద్ధాలు చెప్పుకోవడం ప్రారంభిస్తాడు. ఉదాహరణకు ఒక అబద్ధికుడు నిజానికి తనకు తెలిసింది కొంచెమే అయినప్పటికీ తనకెంతో పరిజ్ఞానం ఉందనీ తాను చాలా తెలివైనవాడిననీ తనను తాను సులభంగా నమ్మించుకోగలడు. ఆ విధంగా అతడు ఒక అబద్ధానికి అనుగుణంగా జీవించడం ప్రారంభిస్తాడు. వాస్తవానికి ‘అతని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది అతని దృష్టియెదుట అతని ముఖస్తుతి చేస్తుంది.’ (కీర్తన 36:⁠2) అబద్ధం చెప్పడం ఎంత పెద్ద ఉరిని తెస్తుందో కదా! మరోపక్కన నీతిమంతుడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకోడు. ఆయన కష్టసమయంలో కూడా అబద్ధం చెప్పడు.

‘తృప్తినిచ్చే ఫలము’

“మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు” ఎందుకంటే “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అని అపొస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. (గలతీయులు 6:⁠7) ఈ సూత్రం మన మాటలకే కాక మన చర్యలకు కూడా వర్తిస్తుంది. సొలొమోను ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “ఒకడు తన నోటి ఫలముచేత తృప్తిగా మేలుపొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును.”​—⁠సామెతలు 12:​14.

“జ్ఞానమునుగూర్చి వచిం[చే]” నోరు తృప్తికరమైన ఫలాలనిస్తుంది. (కీర్తన 37:​30) జ్ఞానానికి పరిజ్ఞానం అవసరం, ఏ మానవుడూ సర్వజ్ఞాని కాదు. మంచి హితోపదేశాన్ని విని, దాన్ని పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. “మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది, జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును” అని ఇశ్రాయేలు రాజు అంటున్నాడు.​—⁠సామెతలు 12:​15.

యెహోవా, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[డు]” సమకూరుస్తున్న ప్రచురణలను ఉపయోగిస్తూ తన వాక్యం ద్వారా, తన సంస్థ ద్వారా మనకు విలువైన హితోపదేశాన్నిస్తున్నాడు. (మత్తయి 24:​45; 2 తిమోతి 3:​16, 17) మంచి సలహాను తిరస్కరించి మనకు నచ్చిన రీతిలో పనులను చేయడం ఎంత మూర్ఖత్వం! “మనుష్యులకు తెలివి నేర్పువా[డైన]” యెహోవా తన సంభాషణా మాధ్యమం ద్వారా మనకు హితోపదేశాన్నిస్తున్నప్పుడు మనం “వినుటకు వేగిరపడువా[రిగా]” ఉండాలి.​—⁠కీర్తన 94:​10; యాకోబు 1:​19.

జ్ఞానవంతులు, మూర్ఖులు అవమానాలకు లేదా అన్యాయమైన విమర్శలకు ఎలా ప్రతిస్పందిస్తారు? సొలొమోను ఇలా జవాబిస్తున్నాడు: “మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.”​—⁠సామెతలు 12:​16.

మూర్ఖుడు అగౌరవపరచబడినప్పుడు వెంటనే, “నిమిషములోనే” కోపంగా ప్రతిస్పందిస్తాడు. కానీ తెలివైన వ్యక్తి ఆశానిగ్రహము వహించడానికి దేవుని ఆత్మ కోసం ప్రార్థిస్తాడు. దేవుని వాక్యంలోని సలహా గురించి ఆలోచించడానికి ఆయన సమయం తీసుకోవడమే కాక, “నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము” అని యేసు చెప్పిన మాటలను కృతజ్ఞతతో మననం చేసుకుంటాడు. (మత్తయి 5:​39) వివేకవంతుడు “కీడుకు ప్రతి కీడెవనికిని చేయ[కూడదు]” అని కోరుకుంటాడు కాబట్టి, ఆయన అనాలోచితంగా మాట్లాడకుండా తన పెదవులను అదుపులో ఉంచుకుంటాడు. (రోమీయులు 12:​17) మనం ఏదైనా అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఇదేవిధంగా మన పెదవులను అదుపులో ఉంచుకుంటే, వివాదం అధికం కాకుండానే మనం తప్పించుకోగలం.

‘ఆరోగ్యదాయకమైన నాలుక’

పెదవుల దోషము వల్ల న్యాయస్థానంలోను చాలా చెరుపు జరిగే అవకాశముంది. ఇశ్రాయేలు రాజు ఇలా అంటున్నాడు: “సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూటసాక్షి మోసపు మాటలు చెప్పును.” (సామెతలు 12:​17) నిజమైన సాక్షి నీతిగల మాటలు మాట్లాడతాడు, ఎందుకంటే ఆయన సాక్ష్యం నమ్మదగినది, విశ్వసనీయమైనది. న్యాయమైన తీర్పు తీర్చడానికి ఆయన మాటలు దోహదపడతాయి. కానీ అబద్ధ సాక్షి మాటలు పూర్తి మోసకరమైనవిగా ఉండి, అన్యాయపు తీర్పు తీర్చేందుకు దారితీస్తాయి.

“కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము” అని అంటూ సొలొమోను కొనసాగిస్తున్నాడు. (సామెతలు 12:​18) మాటలు కత్తిలా పొడిచి స్నేహబంధాలను నాశనం చేయడమేకాక సమస్యలను సృష్టించగలవు. లేదా ఆహ్లాదకరంగా, సంతోషదాయకంగా ఉండి, స్నేహబంధాలను కాపాడగలవు. అవమానకరమైన పేర్లు పెట్టి పిలవడం, అరవడం, ఎప్పుడూ విమర్శించడం, కించపరిచే దూషణలు వంటివి మానసికంగా తీవ్ర గాయాలు చేసే కత్తిపోట్లు కాక మరేమిటి? ఇలాంటి విషయాల్లో మనమేమైనా పొరపాట్లు చేస్తే స్వస్థపరిచే మాటలతో యథార్థంగా క్షమాపణలు తెలపడం ద్వారా సరిదిద్దుకోవడం ఎంత మంచిది!

మనం జీవిస్తున్న కష్టకాలాల్లో చాలామంది “విరిగిన హృదయముగలవా[రు], . . . నలిగిన మనస్సుగలవా[రు]” ఉండడం ఆశ్చర్యమేమీ కాదు. (కీర్తన 34:​18) మనం ‘ధైర్యము చెడినవారిని ధైర్యపరుస్తున్నప్పుడు,’ ‘బలహీనులకు ఊత నిస్తున్నప్పుడు’ మాటలకున్న ఆరోగ్యదాయకమైన శక్తిని ఉపయోగంలో పెడుతున్నట్లే కాదా? (1 థెస్సలొనీకయులు 5:​14) సానుభూతితోకూడిన మాటలు, తోటివారి నుండి వచ్చే హానికరమైన ఒత్తిడితో పోరాడుతున్న యౌవనస్థులకు నిజంగా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆలోచనాత్మకమైన మాటలు, తాము అవసరమనీ తాము ప్రేమించబడుతున్నామనీ వృద్ధులకు హామీనిస్తాయి. ప్రేమపూర్వకమైన మాటలు, అనారోగ్యంతో ఉన్నవారి దినాన్ని ఆనందమయం చేస్తాయి. “సాత్వికమైన మనస్సుతో” ఇచ్చిన మందలింపు మాటలు కూడా సులభంగా అంగీకరించబడతాయి. (గలతీయులు 6:⁠1) దేవుని రాజ్య సువార్తను వినేవారికి ఆ సువార్తను వినిపించే నాలుక ఎంతటి ఆరోగ్యదాయకమైనదో కదా!

‘నిరంతరం నిలిచే పెదవులు’

“నాలుక”కు పర్యాయపదంగా “పెదవులు” అనే పదాన్ని ఉపయోగిస్తూ సొలొమోను ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.” (సామెతలు 12:​19) “నిజమాడు పెదవులు” అనే పదబంధం హీబ్రూ భాషలో ఏకవచనంలో ఉంది, దానికి నిజమైన మాట అనేదాని కంటే ఎక్కువ లోతైన భావం ఉంది. “అది దృఢత్వం, స్థిరత్వం, విశ్వసనీయత వంటి లక్షణాలను సూచిస్తుంది” అని ఒక గ్రంథం చెబుతోంది. “ఈ లక్షణాలున్న మాటలు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి . . . ఎందుకంటే అవి అబద్ధాలకు భిన్నంగా విశ్వసనీయంగా ఉంటాయి, అబద్ధాలు తాత్కాలికంగా మోసం చేయవచ్చు కానీ పరీక్షకు తట్టుకొని నిలబడలేవు” అని కూడా ఆ గ్రంథం చెబుతోంది.

“కీడు కల్పించువారి హృదయములో మోసముకలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు” అని జ్ఞానియైన రాజు అంటున్నాడు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు.”​—⁠సామెతలు 12:​20, 21.

మోసగాళ్ళు చేసే కీడు బాధను, దుఃఖాన్ని కలిగిస్తుంది. మరోవైపు సమాధానపరచడానికి ఆలోచన చెప్పేవారు మాత్రం సరైనది చేయడం ద్వారా సంతృప్తి పొందుతారు. సత్ఫలితాలను చూసే ఆనందం కూడా వారికి ఉంటుంది. అతి ముఖ్యంగా వారు దేవుని ఆమోదాన్ని పొందుతారు, ఎందుకంటే “అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు.”​—⁠సామెతలు 12:22.

‘విద్యను దాచే మాటలు’

తను మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండే వ్యక్తికీ, జాగ్రత్తగా ఉండని వ్యక్తికీ మధ్య ఉన్న మరొక తేడాను వర్ణిస్తూ ఇశ్రాయేలు రాజు ఇలా అంటున్నాడు: “వివేకియైనవాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు.”​—⁠సామెతలు 12:​23.

ఒక వివేకికి లేదా తెలివైన వ్యక్తికి ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలుసు. ఆయన తనకు తెలిసినదాన్ని గొప్పలుగా చెప్పుకోకుండా ఉండడం ద్వారా తన విద్యను దాచిపెట్టుకుంటాడు. దీనర్థం ఆయన తన విద్యను దాచుకునేవుంటాడని కాదు. బదులుగా ఆయన దాన్ని తెలివిగా ప్రదర్శిస్తాడు. దానికి భిన్నంగా అవివేకి మాట్లాడడానికి తొందరపడి తన మూర్ఖత్వాన్ని వెల్లడిచేసుకుంటాడు. కాబట్టి మన మాటలు తక్కువగా ఉండేలా, మన నాలుక గొప్పలు చెప్పకుండా ఉండేలా చూసుకుందాం.

వ్యత్యాసాల గురించి ఇంకా వివరిస్తూ సొలొమోను చురుకుతనం, సోమరితనం గురించి గమనార్హమైన ఒక అంశాన్ని ఇలా తెలియజేస్తున్నాడు: “శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును.” (సామెతలు 12:​24) కష్టపడి పనిచేస్తే అది అభివృద్ధికి, ఆర్థిక స్వేచ్ఛకు దారి తీస్తుంది, సోమరితనం శ్రమకు, దాసత్వానికి నడిపిస్తుంది. “సోమరివాడు చివరకు చురుకుగా ఉండే వ్యక్తికి బానిస అవుతాడు” అని ఒక విద్వాంసుడు అంటున్నాడు.

‘సంతోషపెట్టే మాట’

మానవ నైజం గురించి తీక్షణంగా వ్యాఖ్యానిస్తూ సొలొమోను రాజు మళ్ళీ మాట్లాడే విషయంపై దృష్టి సారించాడు. “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టును.”​—⁠సామెతలు 12:​25.

హృదయాన్ని విషాదంతో కృంగిపోయేలా చేసే చింతలు, వ్యాకులతలు అనేకమున్నాయి. ఆ భారాన్ని తగ్గించి హృదయాన్ని సంతోషపరిచేందుకు కావలసిందల్లా అర్థం చేసుకోగల వ్యక్తి నుండి వచ్చే ప్రోత్సాహకరమైన ఒక మంచి మాట మాత్రమే. కానీ మన హృదయంలోని చింతల తీవ్రతను మనం మనసు విప్పి చెప్పనిదే ఇతరులకు ఎలా తెలుస్తుంది? అవును మనం చింతను లేదా వ్యధను అనుభవిస్తున్నట్లయితే సానుభూతితో మనకు సహాయం చేయగల వ్యక్తికి చెప్పుకోవాలి. అంతేకాదు మన భావాలను మాటల్లో చెప్పినప్పుడు హృదయ వేదననుండి కాస్త ఉపశమనం కలుగుతుంది. కాబట్టి వివాహ భాగస్వామితో, తల్లి లేక తండ్రితో లేదా సానుభూతిగల ఆధ్యాత్మికంగా యోగ్యుడైన స్నేహితునితో చెప్పుకోవడం మంచిది.

బైబిలులో లభించేవాటి కంటే మంచి ప్రోత్సాహకరమైన మాటలు ఏమున్నాయి? కాబట్టి మనం దేవుని ప్రేరేపిత వాక్యాన్ని కృతజ్ఞతాపూర్వకంగా మననం చేసుకుంటూ ఆయనకు సన్నిహితమవ్వాలి. అలాంటి పునరాలోచన విచారంగా ఉన్న హృదయానికి సంతోషాన్నీ దుఃఖితమైన కళ్ళకు కాంతినీ తప్పకుండా తీసుకువస్తుంది. కీర్తనకర్త ఆ విషయాన్ని ఇలా చెబుతూ ధ్రువీకరిస్తున్నాడు: “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును; యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.”​—⁠కీర్తన 19:⁠7, 8.

ప్రతిఫలమిచ్చే మార్గం

నీతిమంతుని మార్గానికీ దుష్టుని మార్గానికీ వ్యత్యాసాన్ని చూపిస్తూ ఇశ్రాయేలు రాజు ఇలా అంటున్నాడు: “నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును.” (సామెతలు 12:​26) నీతిమంతుడు తను నడిచే మార్గం విషయంలో​—⁠తాను ఎంపిక చేసుకునే సహవాసుల, స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. ఆయన వారిని తెలివిగా ఎంపిక చేసుకుంటాడు, ప్రమాదకరమైన సంబంధాలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. దుష్టులు అలా చేయరు, వారు హితవును పెడచెవిన పెట్టి తమ సొంత మార్గంలో నడవడానికి పట్టుబడతారు. వారు దారి తప్పి మార్గం కోసం తచ్చాట్లాడతారు.

దాని తర్వాత సొలొమోను రాజు సోమరికీ చురుకైన వ్యక్తికీ మధ్యవుండే తేడా గురించి మరో దృక్కోణం నుండి ఇలా చూపిస్తున్నాడు: “సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము.” (సామెతలు 12:​27) ఒక సోమరి​—⁠“బద్ధకస్తుడు”​—⁠“వేటాడినను” లేదా ‘వాటి వెనక వెళ్ళినా’ తాను వేటాడే వాటిని పట్టుకోడు. (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) నిజంగానే అతడు తాను ఆరంభించినదాన్ని ముగించలేడు. కానీ చురుకైన వ్యక్తికి ఐశ్వర్యాలు చేకూరతాయి.

సోమరితనం అంత హానికరమైనది కాబట్టే అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకలోని తన తోటి క్రైస్తవులకు దాని గురించి వ్రాసి, “అక్రమముగా నడుచుకొను” కొందరిని​—⁠అసలే పని చేయకుండా వారికి సంబంధించని విషయాల్లో తలదూర్చుతున్నవారిని సరిదిద్దాల్సిన అవసరముందని భావించాడు. అటువంటివారు మిగతావారిపై చాలా భారాన్ని పెట్టారు. అందుకే పౌలు, “నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలె[ను]” అని వారికి ఉద్బోధిస్తూ బాహాటంగా వారిని మందలించాడు. ఆ స్థిరమైన హితవుకు వారు ప్రతిస్పందించకపోయినట్లయితే, అలాంటి వారినుండి “తొలగిపోవలె[ను]”​—⁠స్పష్టంగా చెప్పాలంటే సామాజిక వ్యవహారాల్లో వారికి దూరంగా ఉండమని సంఘంలోని ఇతరులను ఆజ్ఞాపించాడు.​—⁠2 థెస్సలొనీకయులు 3:​6-12.

మనం కష్టపడి పని చేయడం గురించి సొలొమోను ఇచ్చిన సలహానే కాక, మన నాలుకను సరిగా ఉపయోగించడంపై ఆయనిచ్చిన సలహాను కూడా మన హృదయంలోకి తీసుకోవాలి. ఆ చిన్న అవయవాన్ని స్వస్థతను సంతోషాన్ని చేకూర్చే విధంగా ఉపయోగిస్తూ, పెదవుల దోషం నుండి తప్పించుకొంటూ నీతిమార్గంలో నడిచేందుకు కృషి చేద్దాం. “నీతిమార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు” అని సొలొమోను మనకు నమ్మకంగా చెబుతున్నాడు.​—⁠సామెతలు 12:​28.

[27వ పేజీలోని చిత్రాలు]

“జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును”

[28వ పేజీలోని చిత్రాలు]

“జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము”

[29వ పేజీలోని చిత్రం]

నమ్మకమైన స్నేహితునితో చెప్పుకుంటే ఓదార్పు పొందే అవకాశముంది

[30వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యాన్ని కృతజ్ఞతతో మననం చేసుకోవడం హృదయానికి సంతోషాన్నిస్తుంది