కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘అరారాతు దేశములోని’ సర్వోన్నత న్యాయస్థానం సత్యారాధనను సమర్థించింది

‘అరారాతు దేశములోని’ సర్వోన్నత న్యాయస్థానం సత్యారాధనను సమర్థించింది

‘అరారాతు దేశములోని’ సర్వోన్నత న్యాయస్థానం సత్యారాధనను సమర్థించింది

ముగ్గురు పిల్లల తండ్రి అయిన అర్మేనియన్‌ వయోధికుడు, తన దేశ సర్వోన్నత న్యాయస్థానంలో నిలబడివున్నాడు. ఆయన స్వాతంత్ర్యం, ఎంతోమంది తోటి విశ్వాసుల స్వాతంత్ర్యం ప్రమాదంలో ఉంది. తన నమ్మకాలను వివరించడానికి ఆయన బైబిలు నుండి లేఖనాలను ఉటంకించి చెబుతుండగా న్యాయస్థానం వింటున్నది. ఈ కేసు ద్వారా ఆ దేశంలో సత్యారాధన ఘనవిజయం ఎలా సాధించిందో అర్థం చేసుకోవడానికి మనం ఈ కేసుకు దారితీసిన సంఘటనలను పరిశీలిద్దాం.

అర్మేనియా, టర్కీకి తూర్పున, విశాలమైన కాకాసస్‌ పర్వత శ్రేణులకు దక్షిణాన ఉంది. ఆ దేశంలో 30 లక్షలకంటే ఎక్కువ జనాభా ఉంది. ఆ దేశపు రాజధాని నగరమైన యరవాన్‌ నుండి అరారాతు పర్వతానికి చెందిన రెండు శిఖరాలు అద్భుతంగా కనిపిస్తాయి, భూవ్యాప్త జలప్రళయం తర్వాత నోవహు ఓడ ఆ శిఖరాలపై నిలిచిందనే నమ్మకం వ్యాప్తిలో ఉంది.​—⁠ఆదికాండము 8:⁠4. *

యెహోవాసాక్షులు అర్మేనియాలో 1975 నుండి తమ క్రైస్తవ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అర్మేనియా మునుపటి సోవియట్‌ యూనియన్‌ నుండి 1991లో స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత, మత సంస్థలను రిజిస్టర్‌ చేసేందుకు దానిలో స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ రెలిజియస్‌ ఎఫైర్స్‌ స్థాపించబడింది. అయితే ఆ కౌన్సిల్‌ యెహోవాసాక్షులను రిజిస్టర్‌ చేయడానికి పదేపదే నిరాకరించింది, దానికి ముఖ్య కారణం వారి క్రైస్తవ తటస్థత. తత్ఫలితంగా, 1991నుండి అర్మేనియాలో 100 కంటే ఎక్కువమంది యువ సాక్షులపై నేరారోపణ చేసి, సైనిక సేవకు సంబంధించి వారి బైబిలు ఆధారిత తటస్థత కారణంగా వారిలో చాలామందిని చెరసాలలో వేశారు.

ఒక క్రైస్తవ పెద్ద, స్థానిక పరమాణువు ఉత్పాదక కేంద్రం తరఫున కష్టపడి పనిచేసే న్యాయవాది అయిన ల్యోవా మార్గార్యాన్‌ యొక్క మతసంబంధ కార్యకలాపాలపై దర్యాప్తు జరపమని ఆ కౌన్సిల్‌ ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌ కార్యాలయాన్ని కోరింది. చివరకు 244వ రాజ్యాంగచట్టం క్రింద సహోదరుడు మార్గార్యాన్‌పై నేరం మోపబడింది, ఈ చట్టం యెహోవాసాక్షులను, ఇతర మత గుంపులను ఆటంకపరచి చివరకు వారిని నిర్మూలించడానికి ఉద్దేశించబడి క్రుస్చేవ్‌ శకంలో జారీచేయబడిన సోవియట్‌ చట్టానికి సంబంధించినది.

ఆ చట్టం ప్రకారం, మతపరమైన నమ్మకాలను ప్రకటించడం అనే వంకతో ‘రిజిస్టర్‌ చేయబడని మతానికి సంబంధించిన కూటాలకు హాజరయ్యేలా యౌవనస్థులను ప్రలోభపెట్టి, తమ పౌర సంబంధ బాధ్యతలను నిరాకరించేలా సభ్యులను ప్రభావితం చేసే’ మత గుంపును వ్యవస్థీకరించడం లేదా నడపడం నేరం. ప్రాసిక్యూటర్‌ తన ఆరోపణకు మద్దతుగా, మెట్సామోర్‌ నగరంలో సహోదరుడు మార్గార్యాన్‌ నిర్వహించే కూటాలకు మైనరు పిల్లలు హాజరవడంపై తన అవధానాన్ని నిలిపాడు. సంఘంలోని యౌవనస్థులు సైనిక సేవలో చేరడానికి నిరాకరించేలా సహోదరుడు మార్గార్యాన్‌ బలవంతపెడుతున్నాడని కూడా ప్రాసిక్యూటర్‌ ఆరోపించాడు.

విచారణ మొదలయ్యింది

శుక్రవారం, జూలై 20 2001, ఆర్మవీర్‌ జిల్లా న్యాయస్థానంలో న్యాయమూర్తి మాన్వెల్‌ సీమోన్యాన్‌ ఆధ్వర్యంలో విచారణ మొదలయ్యింది. అది ఆగస్టు వరకూ కొనసాగింది. ప్రాసిక్యూషన్‌ తరపు సాక్షులు సాక్ష్యమిచ్చేటప్పుడు, సహోదరుడు మార్గార్యాన్‌కు వ్యతిరేకంగా తాము వ్రాతపూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలంలో కొంతభాగాన్ని నేషనల్‌ సెక్యూరిటీ మినిస్ట్రీ (మునుపు కేజీబి) ఆదేశాల మేరకు వ్రాశామనీ, ఆ వాంగ్మూలాలపై సంతకం పెట్టేందుకు వారు తమను బలవంతం చేశారనీ చివరకు ఒప్పుకున్నారు. ఒక సందర్భంలో, “యెహోవాసాక్షులు మన ప్రభుత్వాన్నీ మన మతాన్నీ వ్యతిరేకించేవారు” అని ఆరోపించమని సెక్యూరిటీ మినిస్ట్రీకి చెందిన ఒక అధికారి తనను ఆదేశించాడని ఒక స్త్రీ ఒప్పుకుంది. తనకు వ్యక్తిగతంగా యెహోవాసాక్షులు తెలియదని, స్టేట్‌ టెలివిజన్‌లో వారికి వ్యతిరేకంగా ప్రసారం చేయబడిన నిందారోపణలను మాత్రమే తాను విన్నానని ఆ స్త్రీ తెలియజేసింది.

సహోదరుడు మార్గార్యాన్‌ మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు, యెహోవాసాక్షుల కూటాలకు హాజరయ్యే మైనర్‌ పిల్లలు తమ తల్లిదండ్రుల అనుమతితోనే హాజరవుతారని తెలియజేశాడు. సైనిక సేవ చేయాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం అని కూడా ఆయన వివరించాడు. ప్రాసిక్యూటర్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చాలా రోజుల వరకూ కొనసాగింది. తన నమ్మకాల గురించి వేయబడిన ప్రశ్నలకు సహోదరుడు మార్గార్యాన్‌ బైబిలు ఉపయోగిస్తూ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, ఆయన అలా సమాధానమిస్తున్నప్పుడు ప్రాసిక్యూటర్‌ తన సొంత బైబిలులో లేఖనాలను తీసి చూసుకున్నాడు.

2001, సెప్టెంబరు 18వ తేదీన, మార్గార్యాన్‌ కార్యకాలాపాల్లో “నేరానికి సంబంధించిన జాడలు లేవు” అని నివేదిస్తూ న్యాయాధిపతి ఆయనను “నిర్దోషి”గా ప్రకటించాడు. అసోసియేటెడ్‌ ప్రెస్‌లో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడి చేసే రిపోర్టు ప్రచురించబడింది. దానిలో ఇలా ఉంది: “అర్మేనియాలోని యెహోవాసాక్షుల నాయకుడు ఒకాయన మతమార్పిడులు చేస్తున్నాడనే, యౌవనస్థులు సైనిక సేవ చెయ్యకుండా తప్పించుకునేలా వారిని బలవంతపెడుతున్నాడనే ఆరోపణల నుండి నేడు విముక్తుడయ్యాడు. రెండు నెలల విచారణ తర్వాత, లెవోన్‌ మార్కారియాన్‌ [ల్యోవా మార్గార్యాన్‌] అనే నాయకుడికి వ్యతిరేకంగా తగినన్ని రుజువులు లేవని న్యాయస్థానం తెలియజేసింది. ఆయనకు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించబడేది. . . . అర్మేనియా రాజ్యాంగం మత స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తున్నప్పటికీ కొత్త గుంపులు రిజిస్టర్‌ చేసుకోవడం కష్టం, నియమాలు ప్రబలమైన అర్మేనియన్‌ అపొస్టలిక్‌ చర్చీకి మద్దతునిచ్చే విధంగానే ఉన్నాయి.” ఆర్గనైజేషన్‌ ఫర్‌ సెక్యూరిటీ అండ్‌ కో ఆపరేషన్‌ ఇన్‌ యూరప్‌ (ఓఎస్‌సిఇ), 2001, సెప్టెంబరు 18వ తేదీన పత్రికా ప్రచురణ కోసం విడుదల చేసిన ప్రకటనలో ఇలా నివేదించింది: “ఇవ్వబడిన తీర్పును ఓఎస్‌సిఇ కార్యాలయం సంతోషంగా స్వీకరించిప్పటికీ, అసలు ఈ అభియోగం నడపడం ప్రారంభించినందుకే ఇంకా చింతిస్తూ ఉంది.”

ప్రాసిక్యూషన్‌ కొనసాగింది

అయినప్పటికీ ప్రాసిక్యూటర్లు మళ్ళీ అప్పీలు చేశారు, అప్పీలు విచారణ జరగడానికి మరో నాలుగు నెలలు పట్టింది. విచారణ ప్రారంభంలో సహోదరుడు మార్గార్యాన్‌ మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు, న్యాయమూర్తుల బృందంలోని ఒక న్యాయమూర్తి మొదటిగా ఆయనను ప్రశ్నించారు. సహోదరుడు మార్గార్యాన్‌ ఆ ప్రశ్నకు సమాధానమివ్వడం ప్రారంభించగానే అధ్యక్షురాలు ఆయనను ఆటంకపరుస్తూ వ్యతిరేకించింది. ఆ తర్వాత ఆమె, సహోదరుడు మార్గార్యాన్‌ను కనీసం ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పనివ్వలేదు. ఆమె కారణాలు చెప్పకుండానే, ప్రతివాదులు ఆయనను అడిగిన ప్రశ్నలలో చాలా ప్రశ్నలు రికార్డులలో వ్రాయబడకుండా చేసింది. సాక్షులను వ్యతిరేకించే మత దురావేశపరులు న్యాయస్థానం నిండా ఉన్నారు, విచారణ జరుగుతుండగా వారు సహోదరుడు మార్గార్యాన్‌ను పదే పదే దూషించారు. సెషన్‌ అయిపోయిన తర్వాత, ఈ విచారణ గురించి అనేక అబద్ధ, వక్రమైన నివేదికలు టీవీలో ప్రసారమయ్యాయి. ఉదాహరణకు సహోదరుడు మార్గార్యాన్‌ తన తప్పు ఒప్పుకున్నాడని ఒక నివేదిక చెప్పింది.

దాదాపు సగం విచారణ జరిగిపోయిన తర్వాత, సహోదరుడు మార్గార్యాన్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకొమ్మని ప్రాసిక్యూటర్‌ కార్యాలయాన్ని ఆజ్ఞాపిస్తూ స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ రెలిజియస్‌ ఎఫైర్స్‌ నుండి వచ్చిన ఉత్తరాన్ని చూపించడం ద్వారా ముగ్గురు న్యాయమూర్తుల బృందానికి అధ్యక్షురాలు అందరినీ ఆశ్చర్యపరచింది. విచారణ కోసం వచ్చిన అంతర్జాతీయ వీక్షకులను ఈ చర్య నిర్ఘాంతపరచింది ఎందుకంటే, కౌన్సిల్‌ ఆఫ్‌ యూరప్‌లో సభ్యత్వం కోసం అర్మేనియా దరఖాస్తు పెట్టుకున్నప్పుడు “అన్ని చర్చీలు లేదా మతపరమైన సమాజాలు ప్రత్యేకించి ‘సాంప్రదాయబద్ధం కానివి’గా పేర్కొనబడే సమాజాలు వివక్షకు గురికాకుండా తమ మతాన్ని ఆచరించుకునేలా నిశ్చయపరచుకోవాల్సిన” బాధ్యత తనకుందని అంగీకరించింది.

తర్వాతి వారాల్లో విచారణ కొనసాగుతుండగా, వాతావరణం మరింత ఉద్రిక్తంగా తయారయ్యింది. వ్యతిరేకులు న్యాయస్థానం లోపల, బయట సాక్షులపై దాడిచేసి వారిని వేధించడం కొనసాగించారు. యెహోవాసాక్షులైన స్త్రీలను మోకాళ్ళపై తన్నారు. ఒక యెహోవాసాక్షిపై దాడిచేయబడినప్పుడు ఆయన దానికి ప్రతిస్పందించడానికి నిరాకరించినందుకు ఆయనను వెనుకనుండి వెన్నెముకపై కొట్టడం వల్ల ఆయనను హాస్పిటల్‌లో చేర్చవలసి వచ్చింది.

అదే సమయంలో, ఈ కేసును పర్యవేక్షించడానికి కొత్త న్యాయమూర్తి నియమించబడ్డాడు. ప్రేక్షకుల్లో కొంతమంది ప్రతివాద న్యాయవాదిని భయపెట్టడానికి ప్రయత్నించినప్పటికీ ఈ కొత్త అధ్యక్షుడు వారిని అదుపుచేసి, ప్రతివాద న్యాయవాదిని బెదిరిస్తూ అరుస్తున్న ఒక స్త్రీని న్యాయస్థానం బయటకు తీసుకువెళ్ళమని పోలీసులకు ఆజ్ఞాపించాడు.

అర్మేనియా సర్వోన్నత న్యాయస్థానానికి

చివరకు 2002, మార్చి 7వ తేదీన అప్పీలు న్యాయస్థానం కూడా జిల్లా న్యాయస్థానం తీర్పును సమర్థించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ తీర్పు ప్రకటించబడడానికి ముందు రోజు స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ రెలిజియస్‌ ఎఫైర్స్‌ రద్దుచేయబడింది. కాబట్టి ప్రాసిక్యూషన్‌ వారు ఈసారి అర్మేనియాలోని సర్వోన్నత న్యాయస్థానానికి​—⁠నెపొలియన్‌ సూత్రీకరించిన పౌర న్యాయశాస్త్రాన్ని అనుసరించే దేశాల్లో అప్పీలు చేసుకునే న్యాయస్థానం​—⁠అప్పీలు చేసుకున్నారు. “దోషాన్ని నిరూపించే తీర్పును అందజేయడానికి” మళ్ళీ విచారణ చేసేందుకు న్యాయస్థానం కేసును తిరిగి ఇవ్వాలని ప్రాసిక్యూటర్లు కోరారు.

న్యాయాధిపతి మేర్‌ కాచాత్ర్యాన్‌ అధ్యక్షతన ఆరుగురు న్యాయాధిపతులు 2002, ఏప్రిల్‌ 19వ తేదీ ఉదయం 11:⁠00 గంటలకు సమావేశమయ్యారు. మునుపటి రెండు న్యాయస్థానాలు సహోదరుడు మార్గార్యాన్‌ను దోషిగా పరిగణించలేకపోయినందుకు ఒక ప్రాసిక్యూటర్‌ తన ప్రారంభపు మాటల్లో ఎంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఆ ప్రాసిక్యూటర్‌ మాటలను మధ్యలోనే ఆపుచేసి నలుగురు న్యాయమూర్తులు ఆయనను సూటిగా ప్రశ్నించారు. సహోదరుడు మార్గార్యాన్‌కు వ్యతిరేకంగా ఆయన ఇచ్చిన నివేదనలో ప్రకటనా పనిని, యెహోవాసాక్షులది రిజిస్టర్‌ కాని మతం అనే విషయాన్ని కూడా చేర్చి​—⁠ఈ రెండింటిలో ఏదీ కూడా 244 రాజ్యాంగచట్టంలో నేరాలుగా నిర్వచించబడలేదు​—⁠న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినందుకు ఒక న్యాయమూర్తి ప్రాసిక్యూటర్‌ను మందలించాడు. ఆ తర్వాత ఆ న్యాయమూర్తి ప్రాసిక్యూటర్‌ చర్యలను, “నేరారోపణ చేయడం ద్వారా హింసించడం” అని అభివర్ణించాడు. మరో న్యాయమూర్తి యూరోపియన్‌ న్యాయస్థానంలో విచారించబడిన వివిధ కేసులను ప్రస్తావించి వాటిలో యెహోవాసాక్షులది “అందరికీ తెలిసిన మతం” అని గుర్తించబడిందని, యూరోపియన్‌ కన్వెన్షన్‌ ఆన్‌ హ్యూమన్‌ రైట్స్‌కు వారిని రక్షించే బాధ్యత ఉందని చెప్పారు. ఈ సమయంలో, న్యాయస్థానంలో ఉన్న ఒక ప్రీస్టు, యెహోవాసాక్షులు దేశాన్ని విభజిస్తున్నారని అరిచాడు. ఆయనను నిశ్శబ్దంగా ఉండమని న్యాయస్థానం ఆజ్ఞాపించింది.

ఆ తర్వాత సహోదరుడు మార్గార్యాన్‌ను ప్రేక్షకుల్లో నుండి ముందుకు రమ్మని న్యాయమూర్తులు పిలిచారు​—⁠ఈ న్యాయస్థానం అలా చేయడం చాలా అసాధారణమైన విషయం. సహోదరుడు మార్గార్యాన్‌ వివిధ విషయాల్లో యెహోవాసాక్షుల క్రైస్తవ స్థానం గురించి వివరిస్తూ చక్కని సాక్ష్యమిచ్చారు. (మార్కు 13:⁠9) నిర్ణయం తీసుకోవడానికి కొంత నిశిత పరిశీలన చేసిన తర్వాత, న్యాయమూర్తులందరూ ఏకగ్రీవంగా సహోదరుడు మార్గార్యాన్‌ “నిర్దోషి” అని తీర్పునిచ్చారు. సహోదరుడు మార్గార్యాన్‌ సంతోషం స్పష్టంగా కనిపించింది. తన వ్రాతపూర్వక నిర్ణయంలో న్యాయస్థానం ఇలా నివేదించింది: “[ల్యోవా మార్గార్యాన్‌] కార్యకలాపాలు ప్రస్తుత చట్టం ప్రకారం నేరం కాదు, ఇలాంటి నేరారోపణ ఆర్మేనియన్‌ రాజ్యాంగంలోని 23వ రాజ్యాంగచట్టానికి, యురోపియన్‌ కన్వెన్షన్‌లోని 9వ రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకమైనది.”

తీర్పు ప్రభావాలు

ఒకవేళ ప్రాసిక్యూషన్‌ తన ఆరోపణలను నిరూపించుకోవడంలో విజయవంతమైతే, అర్మేనియా అంతటిలోవున్న సంఘాల్లోని సాక్షుల పెద్దలకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడేది. న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన తీర్పు అలాంటి హింసను నివారిస్తుందని ఆశిద్దాం. ప్రతికూలమైన తీర్పు వచ్చివుంటే, యెహోవాసాక్షుల రిజిస్ట్రేషన్‌ను నిరాకరిస్తూనే ఉండడానికి కూడా అది కారణమయ్యేది. న్యాయస్థానం అలాంటి అబద్ధపు కారణాన్ని తీసివేయడం ఎంతో ఆనందకరమైన విషయం.

ఈ దేశంలోని 7,000 కంటే ఎక్కువమంది యెహోవాసాక్షులకు రిజిస్ట్రేషన్‌ ఇవ్వబడుతుందా లేదా అనేది కాలమే చెబుతుంది. ఈలోగా, “అరారాతు దేశము”లో సత్యారాధన ఇంకా వర్ధిల్లుతూనే ఉంది.

[అధస్సూచి]

^ పేరా 3 అర్మేనియన్‌లు తమ దేశానికి అరారాతు పర్వతానికి సంబంధం ఉందని చెప్పుకోవడానికి ఇదొక కారణం. ప్రాచీన కాలాల్లో అర్మేనియా ఎంతో సువిశాలమైన రాజ్యం, ఆ పర్వతాలు కూడా దాని క్షేత్రంలోనే ఉండేవి. అందుకే యెషయా 37:38వ వచనంలోని “ఆరారాతు దేశము” అనే పదబంధాన్ని గ్రీక్‌ సెప్టాజింట్‌ బైబిలు అనువాదము “అర్మేనియా” అని అనువదించింది. ప్రస్తుతం అరారాతు పర్వతం, టర్కీ దేశంలో తూర్పు సరిహద్దుకు దగ్గరలో ఉంది.

[12వ పేజీలోని చిత్రం]

తన విచారణ సమయంలో ల్యోవా మార్గార్యాన్‌

[13వ పేజీలోని చిత్రం]

సహోదరుడు మార్గార్యాన్‌, ఆయన కుటుంబసభ్యులు