కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రభువు రాత్రి భోజనం మీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది

ప్రభువు రాత్రి భోజనం మీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది

ప్రభువు రాత్రి భోజనం మీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది

ప్రభువు రాత్రి భోజనానికి మీ జీవితంలో శాశ్వతమైన ప్రాముఖ్యత ఉందా? అది తెలుసుకొనేందుకు, యేసుక్రీస్తు స్వయంగా ఈ ప్రత్యేకమైన సందర్భానికి ఏ ప్రాముఖ్యతను జోడించాడో మొదట మనం తెలుసుకుందాము.

సా.శ. 33 నీసాను 14 సాయంత్రం, వార్షిక పస్కాపండుగ చేసుకోవడానికి యేసు తన 12 మంది అపొస్తలులతో యెరూషలేములోని మేడగదిలో సమకూడాడు. వారు పస్కా భోజనాన్ని భుజించిన తర్వాత, ద్రోహి అయిన యూదా యేసును అప్పగించడానికి ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు. (యోహాను 13:​21, 26-30) మిగిలిన 11 మంది అపొస్తలులకు యేసు “ప్రభువు రాత్రి భోజనము”ను పరిచయం చేశాడు. (1 కొరింథీయులు 11:​20) అది జ్ఞాపకార్థ ఆచరణ అని కూడా పిలువబడుతోంది ఎందుకంటే, “నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయు[డి]” అని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. కేవలం ఈ ఆచరణను జ్ఞాపకం చేసుకొమ్మని క్రైస్తవులకు ఆజ్ఞాపించబడింది.​—⁠1 కొరింథీయులు 11:24.

చాలా ప్రాంతాల్లో, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని లేదా సంఘటనను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రజలు ఒక స్మారకచిహ్నాన్ని కడతారు లేదా ఒక ప్రత్యేకమైన రోజును దానికి కేటాయిస్తారు. అయితే యేసు జ్ఞాపకార్థ భోజనాన్ని ప్రారంభించాడు​—⁠ప్రాముఖ్యమైన ఆ రోజున ఎంతో ప్రాధాన్యతగల సంఘటనలు జరిగాయి, వాటిని తన శిష్యులు గుర్తుంచుకోవడానికి సహాయం చేస్తూ జ్ఞాపక సాధనంగా ఉపయోగపడే ఒక జ్ఞాపకార్థ భోజనాన్ని ప్రారంభించాడు. ఈ జ్ఞాపకార్థ భోజనం, తర్వాతి కాలంలో దానిని ఆచరించేవారికి యేసు ఆ రాత్రి చేసిన పనులకు, ప్రత్యేకించి ఆయన ఉపయోగించిన చిహ్నాలకు ఉన్న లోతైన భావాన్ని గుర్తుచేస్తుంది. యేసు ఏ చిహ్నాలను ఉపయోగించాడు, వాటి భావమేమిటి? సా.శ. 33వ సంవత్సరంలో ఆ రాత్రి ఏమి జరిగిందో తెలియజేసే బైబిలు నివేదికను మనం పరిశీలిద్దాము.

పరిశుద్ధమైన సూచనార్థక భావాలు

“ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చి—ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము [“శరీరమును సూచిస్తుంది,” NW]; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.”​—⁠లూకా 22:​19.

యేసు రొట్టెను తీసుకొని “ఇది నా శరీరమును సూచిస్తుంది” అని చెప్పినప్పుడు, పులియని రొట్టె తాను “లోకమునకు జీవముకొరకై” ఇచ్చిన తన పాపరహిత భౌతిక శరీరానికి ప్రాతినిధ్యం వహిస్తుందని లేదా చిహ్నంగా ఉందని సూచించాడు. (యోహాను 6:​51) కొన్ని అనువాదాలు ‘ఇది నా శరీరం అయియున్నది [గ్రీకు, ఎస్టిన్‌]’ అని అనువదించినప్పటికీ, ఆ క్రియాపదానికి తరచూ “గుర్తుగా ఉండు, సూచించు, అర్థమిచ్చు” అనే భావముంటుందని థేయర్స్‌ గ్రీక్‌-ఇంగ్లీష్‌ లెక్సికన్‌ ఆఫ్‌ ద న్యూ టెస్ట్‌మెంట్‌ చెబుతోంది. అది ప్రాతినిధ్యం వహించడం లేదా సూచించడం అనే తలంపునిస్తుంది.​—⁠మత్తయి 26:26.

ద్రాక్షారసపు గిన్నెకు కూడా ఒక భావముంది. యేసు ఇలా అన్నాడు: “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన [“క్రొత్త నిబంధనను సూచిస్తుంది,” NW].”​—⁠లూకా 22:20.

మత్తయి నివేదికలో యేసు ఆ గిన్నె గురించి ఇలా అన్నాడు: “ఇది నా రక్తము [“రక్తమును సూచిస్తుంది,” NW], అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.” (మత్తయి 26:​28) యేసు ఆ గిన్నెలోని ద్రాక్షారసాన్ని తన సొంత రక్తానికి సూచనగా లేదా చిహ్నంగా ఉపయోగించాడు. ఆయన చిందించిన రక్తం, ఆయనతోపాటు పరలోకములో రాజులుగా యాజకులుగా పరిపాలించబోయే తన ఆత్మాభిషిక్త శిష్యులకు “క్రొత్త నిబంధన”కు ఆధారమై ఉండాలి.​—⁠యిర్మీయా 31:31-33; యోహాను 14:2, 3; 2 కొరింథీయులు 5:5; ప్రకటన 1:5, 6; 5:9, 10; 20:4, 6.

గిన్నెలోని ద్రాక్షారసం, యేసు చిందించిన రక్తం “పాపక్షమాపణ”కు ఆధారమని కూడా గుర్తుచేస్తుంది. దానిలో పాలుపంచుకునేవారు క్రీస్తుతోపాటు సహపరిపాలకులుగా పరలోక జీవితమునకు పిలువబడేందుకు అది మార్గాన్ని తెరుస్తుంది. కాబట్టి జ్ఞాపకార్థ ఆచరణలో రొట్టె ద్రాక్షారసంలో పాలుపంచుకునేది పరలోక నిరీక్షణ ఉన్నవారు​—⁠పరిమితమైన సంఖ్య​—⁠మాత్రమేనన్నది అర్థం చేసుకోదగినదే.​—⁠లూకా 12:32; ఎఫెసీయులు 1:13, 14; హెబ్రీయులు 9:22; 1 పేతురు 1:3, 4.

మరి క్రొత్త నిబంధనలో భాగంకాని యేసు అనుచరులందరి విషయమేమిటి? వారు ప్రభువుకు చెందిన “వేరే గొఱ్ఱెలు,” వారు క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలించడానికి కాదు కానీ పరదైసు భూమిపై నిత్యజీవాన్ని అనుభవించాలని నిరీక్షిస్తారు. (యోహాను 10:16; లూకా 23:43; ప్రకటన 21:​3, 4) ‘రాత్రింబగళ్లు [దేవుణ్ణి] సేవిస్తున్న’ నమ్మకమైన క్రైస్తవుల “గొప్ప సమూహము”గా వారు ప్రభువు రాత్రి భోజనం వద్ద కృతజ్ఞతగల వీక్షకులుగా ఉండడంలో ఆనందిస్తున్నారు. వారి మాటలు, క్రియలు “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్ర[ము]” అని ప్రకటిస్తున్నాయి.​—⁠ప్రకటన 7:9, 10, 14, 15.

ఎంత తరచుగా?

“నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయు[డి].”​—⁠లూకా 22:19.

క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను ఎంత తరచుగా ఆచరించాలి? యేసు దీని గురించి నిర్దిష్టంగా చెప్పలేదు. అయితే ఆయన ప్రభువు రాత్రి భోజనాన్ని నీసాను 14, పస్కా పండుగ రోజున సాయంత్రం ప్రారంభించాడు​—⁠ఇశ్రాయేలీయులు సంవత్సరానికి ఒకసారి పస్కాపండుగ చేసుకునేవారు​—⁠కాబట్టి జ్ఞాపకార్థ ఆచరణను కూడా అలాగే ఆచరించాలని యేసు ఉద్దేశించాడన్నది స్పష్టమౌతోంది. ఇశ్రాయేలీయులు తాము ఐగుప్తు నుండి పొందిన విడుదలను సంవత్సరానికి ఒకసారి గుర్తుచేసుకునేవారు, అయితే క్రైస్తవులు తాము పాపమరణాల నుండి పొందిన విముక్తిని సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు.​—⁠నిర్గమకాండము 12:11, 17; రోమీయులు 5:20, 21.

ప్రాముఖ్యమైన సంఘటనను సంవత్సరానికి ఒకసారి గుర్తుచేసుకోవడం అసాధారణమైనదేమీ కాదు. ఉదాహరణకు, వివాహిత జంట తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం గురించి లేదా ఒక దేశం తమ చరిత్రలో ప్రాముఖ్యమైన సంఘటనను గుర్తుచేసుకోవడం గురించి ఆలోచించండి. సాధారణంగా ఆ సంఘటన జరిగిన రోజున, సంవత్సరానికి ఒకసారి అది జ్ఞాపకం చేసుకోబడుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, క్రీస్తు తర్వాత అనేక శతాబ్దాలపాటు, తాము క్రైస్తవులమని చెప్పుకునే అనేకమంది “పద్నాల్గవ దినాన్ని ఆచరించేవారు” అనే భావంగల క్వార్టోడెసిమన్స్‌ అని పిలువబడేవారు ఎందుకంటే వారు యేసు మరణాన్ని సంవత్సరానికి ఒకసారి నీసాను 14న జ్ఞాపకం చేసుకునేవారు.

సరళమైనదే కానీ ప్రాముఖ్యమైనది

ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరించడం, యేసు శిష్యులు ‘ప్రభువు మరణమును ప్రచురిస్తూ’ ఉండడానికి సహాయం చేస్తుందని అపొస్తలుడైన పౌలు వివరించాడు. (1 కొరింథీయులు 11:​26) కాబట్టి ఈ జ్ఞాపకార్థ ఆచరణ, దేవుని సంకల్ప నెరవేర్పులో యేసు తన మరణం ద్వారా పోషించిన కీలకమైన పాత్రపై అవధానముంచుతుంది.

యేసుక్రీస్తు తన మరణం వరకూ నమ్మకంగా ఉండడం ద్వారా, యెహోవా దేవుడు జ్ఞానవంతుడైన ప్రేమగల సృష్టికర్త అనీ నీతియుక్తమైన సర్వాధిపతి అనీ నిరూపించాడు. సాతాను నిందలకు విరుద్ధంగా, ఆదామువలే కాక, యేసు తీవ్రమైన ఒత్తిడి సమయంలో కూడా దేవునికి నమ్మకంగా ఉండడం మానవునికి సాధ్యమేనని నిరూపించాడు.​—⁠యోబు 2:4, 5.

ప్రభువు రాత్రి భోజనం, యేసు స్వయం త్యాగపూరితమైన ప్రేమను కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపకం చేసుకోవడానికి కూడా దోహదపడుతుంది. తీవ్రమైన కష్టాలు వచ్చినప్పటికీ యేసు తన తండ్రికి పరిపూర్ణ విధేయతను చూపించాడు. ఆ విధంగా ఆయన తన పరిపూర్ణ మానవ జీవితాన్ని, ఆదాము పాపం మూలంగా చెల్లించవలసి వచ్చిన అపరిమితమైన మూల్యాన్ని సమతుల్యం చేసేందుకు అర్పించగలిగాడు. “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము” ఇవ్వడానికి వచ్చానని యేసే స్వయంగా వివరించాడు. (మత్తయి 20:​28) కాబట్టి యేసుపై నమ్మకముంచే వారందరి పాపాలు క్షమించబడతాయి, మానవజాతిపట్ల యెహోవాకున్న ఆది సంకల్పానికి అనుగుణంగా వారు నిత్యజీవాన్ని పొందుతారు.​—⁠రోమీయులు 5:6, 8, 12, 18, 19; 6:23; 1 తిమోతి 2:5, 6. *

ఇదంతా మానవజాతి రక్షణ కోసం ఏర్పాటు చేయడంలో యెహోవా చూపించిన విస్తారమైన మంచితనాన్ని, అపాత్రమైన దయను కూడా ఉన్నతపరుస్తుంది. “మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది” అని బైబిలు నివేదిస్తుంది.​—⁠1 యోహాను 4:9, 10.

జ్ఞాపకార్థ ఆచరణ ఎంత అద్భుతమైనదో! ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పరిస్థితుల్లో సులభంగా జ్ఞాపకం చేసుకోదగినది, ఆచరణాత్మకమైనది అయినప్పటికీ చాలాకాలం వరకూ ప్రాముఖ్యమైన జ్ఞాపికగా నిలిచివుండేంత సూచనార్థకమైనది.

మీ జీవితంలో దాని ప్రాముఖ్యత

మన ప్రభువైన యేసుక్రీస్తు బలి మరణం కోసం ఆయనా, ఆయన తండ్రి యెహోవా ఎంతో మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. ఒక పరిపూర్ణ మానవుడైన యేసు, మనందరిలా మరణాన్ని వారసత్వంగా పొందలేదు. (రోమీయులు 5:12; హెబ్రీయులు 7:​26) ఆయన నిరంతరం జీవిస్తూనే ఉండగలిగేవాడు. ఆయన అనుమతి లేకుండా, బలవంతంగా కూడా ఎవరూ ఆయన ప్రాణమును తీసుకునే అవకాశం లేదు. “ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను” అని ఆయన అన్నాడు.​—⁠యోహాను 10:18.

అయినప్పటికీ, “మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును” యేసు తన పరిపూర్ణ మానవ జీవితాన్ని ఇష్టపూర్వకంగా బలి అర్పించాడు. (హెబ్రీయులు 2:​14, 15) యేసు మరణించిన విధానంలో కూడా ఆయన స్వయం త్యాగపూరితమైన ప్రేమ స్పష్టమౌతోంది. తాను ఎలాంటి బాధలు అనుభవిస్తాడో, ఎలా మరణిస్తాడో ఆయనకు బాగా తెలుసు.​—⁠మత్తయి 17:22; 20:17-19.

జ్ఞాపకార్థ ఆచరణ, మన పరలోక తండ్రియైన యెహోవా వ్యక్తం చేసిన అత్యంత గొప్ప ప్రేమను కూడా గుర్తుచేస్తుంది. “ఎంతో జాలియు కనికరమును గలవా[డైన]” ఆయనకు, గెత్సేమనే తోటలో యేసు “మహా రోదనము”ను వినడం, ఆయన “కన్నీళ్ల”ను, అతిక్రూరమైన హింసను, ఘోరంగా కొరత వేయబడడాన్ని, హింసననుభవిస్తూ క్రమేణా చనిపోవడాన్ని చూడడం ఎంత బాధాకరం. (యాకోబు 5:11; హెబ్రీయులు 5:7; యోహాను 3:16; 1 యోహాను 4:​7, 8) శతాబ్దాల తర్వాత ఇప్పుడు కూడా యేసు మరణాన్ని గుర్తుచేసుకోవడం ఎంతోమందికి భావోద్వేగపరమైన బాధను కలుగజేస్తుంది.

పాపులమైన మన కోసం యెహోవా దేవుడు, యేసుక్రీస్తు అంత గొప్ప త్యాగాన్ని చేయడం గురించి ఒక్కసారి ఆలోచించండి! (రోమీయులు 3:​23) మనది పాపభరితమైన నైజం, మనలో అపరిపూర్ణతలున్నాయి అనే బాధాకరమైన వాస్తవాలను మనం ప్రతిరోజు గ్రహిస్తాము. అయితే, యేసు విమోచన క్రయధన బలిపై విశ్వాసం ఆధారంగా మనం దేవుణ్ణి క్షమాపణ కోసం వేడుకోవచ్చు. (1 యోహాను 2:​1, 2) అది దేవునితో స్వేచ్ఛగా మాట్లాడడాన్ని, మంచి మనస్సాక్షిని కలిగివుండడాన్ని సాధ్యం చేస్తుంది. (హెబ్రీయులు 4:14-16; 9:​13, 14) అంతేకాకుండా, మనం పరదైసు భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణను కలిగివుండవచ్చు. (యోహాను 17:3; ప్రకటన 21:​3, 4) ఇవే కాకుండా మరెన్నో ఇతర ఆశీర్వాదాలు యేసు చేసిన అత్యంత గొప్ప స్వయం త్యాగం యొక్క ఫలితాలే.

ప్రభువు రాత్రి భోజనంపట్ల కృతజ్ఞతను చూపించడం

ప్రభువు రాత్రి భోజనం “దేవుడు కనుపరచిన అత్యధికమైన కృప”ను అద్భుతంగా వ్యక్తం చేస్తుందనడంలో సందేహం లేదు. యెహోవా దేవుడు ఏర్పాటు చేసిన, యేసు స్వయం త్యాగపూరిత ప్రేమ ద్వారా సాధ్యం చేయబడిన, విమోచన క్రయధన బలి నిజంగా “చెప్ప శక్యము కాని ఆయన వరము.” (2 కొరింథీయులు 9:​14, 15) యేసుక్రీస్తు ద్వారా దేవుడు కనపరచిన ఈ మంచితనం, మీలో శాశ్వతంగా నిలిచిపోయే గాఢమైన కృతజ్ఞతా భావాన్ని కలిగించదా?

అది ఖచ్చితంగా మనలో కృతజ్ఞతా భావాన్ని కలుగజేస్తుంది. కాబట్టి యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణను ఆచరించడంలో యెహోవాసాక్షులతో సమావేశమవమని మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 16, బుధవారం సూర్యాస్తమయం తర్వాత జ్ఞాపకార్థ ఆచరణ జరుగుతుంది. అతి ప్రాముఖ్యమైన ఈ ఆచరణ జరిగే ఖచ్చితమైన సమయాన్ని, స్థలాన్ని మీకు తెలియజేయడానికి మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు సంతోషిస్తారు.

[అధస్సూచి]

^ పేరా 19 విమోచన క్రయధనం గురించిన సంపూర్ణ వివరణ కోసం, దయచేసి యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని చూడండి.

[6వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

“ఇది నా శరీరము” లేదా “ఇది నా శరీరమును సూచిస్తుంది” ఈ రెండిటిలో ఏది?

“ద్వారమును నేనే,” “నేను నిజమైన ద్రాక్షావల్లిని” అని యేసు అన్నప్పుడు ఆయన అక్షరార్థ ద్వారము లేదా ద్రాక్షావల్లి అని ఎవ్వరూ అనుకోలేదు. (ఇటాలిక్కులు మావి.) (యోహాను 10:⁠7, 8; 15:⁠1) అలాగే, ద న్యూ జెరూసలేమ్‌ బైబిల్‌ “ఈ గిన్నె క్రొత్త నిబంధన అయియున్నది” అని యేసు అన్నట్లు నివేదించినప్పుడు ఆ గిన్నే అక్షరార్థంగా క్రొత్త నిబంధన అని మనం అనుకోము. అదేవిధంగా యేసు, రొట్టె తన శరీరమని చెప్పినప్పుడు, ఆ రొట్టె ఆయన శరీరానికి సూచనగా ఉందనడంలో సందేహం లేదు. అందుకే చార్లెస్‌ బి. విలియమ్స్‌ అనువాదం “ఇది నా శరీరానికి ప్రాతినిధ్యం వహిస్తుంది” అని చెబుతోంది.​—⁠లూకా 22:19, 20.

[5వ పేజీలోని చిత్రం]

పులియని రొట్టె, ద్రాక్షారసం యేసు పాపరహితమైన శరీరానికీ ఆయన చిందించిన రక్తానికీ తగిన చిహ్నాలుగా ఉన్నాయి

[7వ పేజీలోని చిత్రం]

జ్ఞాపకార్థ ఆచరణ యెహోవా దేవుడు, యేసుక్రీస్తు చూపించిన గొప్ప ప్రేమను గుర్తుచేస్తుంది