కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సాత్వికము—అత్యావశ్యకమైన క్రైస్తవ లక్షణం

సాత్వికము—అత్యావశ్యకమైన క్రైస్తవ లక్షణం

సాత్వికము​—⁠అత్యావశ్యకమైన క్రైస్తవ లక్షణం

‘మీరు సాత్వికమును ధరించుకోండి.’​—⁠కొలొస్సయులు 3:​12.

సాత్వికుడైన వ్యక్తి సహచర్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, “సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును” అని జ్ఞానవంతుడైన సొలొమోను రాజు వ్యాఖ్యానించాడు. (సామెతలు 25:​15) సాత్వికమనేది ఆహ్లాదమూ శక్తీ రెండూ కలిసివున్న ఒక గమనార్హమైన లక్షణం.

2 అపొస్తలుడైన పౌలు గలతీయులు 5:22వ వచనంలో ‘ఆత్మ ఫలమును’ వర్ణించినపుడు దానిలో సాత్వికమును చేర్చాడు. పరిశుద్ధ గ్రంథములో, “సాత్వికము” అని అనుదించబడిన గ్రీకు పదం, ఇతర అనువాదాల్లో తరచుగా “వినయం” అని అనువదించబడింది. వాస్తవమేమిటంటే, అనేక ఇతర భాషల్లో ఈ గ్రీకు పదానికి ఖచ్చితంగా సరిసమానమైన పదాన్ని కనుగొనడం కష్టం, ఎందుకంటే మూల భాషలోని ఈ పదం బాహ్యంగా కనిపించే సౌమ్యతను లేదా వినయాన్ని కాదు గానీ అంతర్గతంగా ఉండే సాత్వికాన్ని, దయాళుత్వాన్ని సూచిస్తుంది; ఒకరి ప్రవర్తనా విధానాన్ని కాదు గానీ ఒకరి మానసిక స్థితిని, హృదయ పరిస్థితిని సూచిస్తుంది.

3 సాత్వికముకున్న అర్థాన్ని, విలువను మరింత సంపూర్ణంగా గ్రహించడానికి, మనం నాలుగు బైబిలు ఉదాహరణలను పరిశీలిద్దాం. (రోమీయులు 15:⁠4) మనమలా పరిశీలిస్తుండగా, ఈ లక్షణం గురించి తెలుసుకోవడమేకాక దాన్నెలా వృద్ధిచేసుకోవచ్చో, మన వ్యవహారాలన్నిటిలో దాన్నెలా చూపించవచ్చో కూడా నేర్చుకుంటాము.

“దేవుని దృష్టికి మిగుల విలువగలది”

4 సాత్వికము దేవుని ఆత్మ ఫలములో ఒక భాగం కాబట్టి, దానికి దేవుని అద్భుతమైన వ్యక్తిత్వంతో సన్నిహిత సంబంధం ఉండాలన్నది సహేతుకమే. అపొస్తలుడైన పౌలు, “సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణ[ము] . . . దేవుని దృష్టికి మిగుల విలువగలది” అని వ్రాశాడు. (1 పేతురు 3:⁠4) వాస్తవానికి, సాత్వికము దైవిక లక్షణాల్లో ఒకటి; యెహోవా దాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతాడు. కాబట్టి దేవుని సేవకులందరూ సాత్వికమును అలవరచుకోవడానికి ఈ కారణమొక్కటే చాలు. అయితే, విశ్వంలోకెల్లా అత్యున్నత అధికారంగల సర్వశక్తిమంతుడైన దేవుడు సాత్వికాన్ని ఎలా చూపిస్తాడు?

5 మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దని దేవుడు స్పష్టంగా ఇచ్చిన ఆజ్ఞకు మొదటి మానవ జంటైన ఆదాము, హవ్వ ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపించారు. (ఆదికాండము 2:​16, 17) అలా ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపడం మూలంగా, వారికీ వారి భవిష్యత్‌ సంతానానికీ పాప మరణాలు సంక్రమించడమే గాక వారు దేవునికి దూరమయ్యారు. (రోమీయులు 5:​12) అలాంటి తీర్పుతీర్చడం యెహోవాకు పూర్తిగా న్యాయమే అయినప్పటికీ, ఆయన మానవ కుటుంబం పూర్తిగా భ్రష్టమయినదనీ విమోచించడానికి వీలులేనిదనీ దాన్ని నిర్దాక్షిణ్యంగా త్రోసిపుచ్చలేదు. (కీర్తన 130:⁠3) బదులుగా, యెహోవా తన దయాళుత్వాన్ని బట్టి, ఖండితంగా ఉండడానికి ఆయనకున్న విముఖతను బట్టి​—⁠ఈ రెండు గుణాలు సాత్వికము యొక్క వ్యక్తీకరణలే​—⁠పాపులైన మానవులు తనవద్దకు వచ్చి తన అనుగ్రహాన్ని పొందడానికి ఒక ఏర్పాటు చేశాడు. అవును, యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు చెల్లించిన విమోచన క్రయధన బలి అనే బహుమానం ద్వారా మనం ఆయన ఉన్నతమైన సింహాసనాన్ని నిర్భయంగా లేదా నిర్భీతితో సమీపించడాన్ని సుసాధ్యం చేశాడు.​—⁠రోమీయులు 6:23; హెబ్రీయులు 4:14-16; 1 యోహాను 4:​9, 10, 18.

6 యేసు భూమిపైకి రావడానికి చాలాకాలం ముందే, ఆదాము కుమారులైన కయీను, హేబేలు దేవునికి తమ అర్పణలను అర్పించినప్పుడు యెహోవా సాత్వికము స్పష్టమయ్యింది. యెహోవా వారి హృదయ పరిస్థితిని గ్రహించి కయీను అర్పణను తిరస్కరించి, హేబెలును ఆయన అర్పణను ‘లక్ష్యపెట్టాడు.’ విశ్వసనీయుడైన హేబెలును, ఆయన అర్పణను దేవుడు సద్భావంతో దృష్టించడం, కయీను ప్రతికూలంగా ప్రతిస్పందించేలా చేసింది. “కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొ[న్నాడు]” అని బైబిలు వృత్తాంతం తెలియజేస్తోంది. యెహోవా ఎలా ప్రతిస్పందించాడు? కయీను చూపించిన చెడు వైఖరిని బట్టి తాను అవమానింపబడినట్లు ఆయన భావించాడా? లేదు. కోపంగా ఎందుకున్నావని యెహోవా సాత్వికముతో కయీనును అడిగాడు. “తలనెత్తుకొన[డానికి]” కయీను ఏమి చేయవచ్చో కూడా ఆయన వివరించాడు. (ఆదికాండము 4:​3-7) నిజంగా యెహోవా సాత్వికానికే ప్రతిరూపం.​—⁠నిర్గమకాండము 34:⁠6.

సాత్వికము ఆకర్షిస్తుంది, పునరుత్తేజాన్నిస్తుంది

7 సాటిలేని యెహోవా లక్షణాలను అర్థం చేసుకోవడానికిగల ఉత్తమమైన మార్గాల్లో ఒకటి, యేసుక్రీస్తు జీవితాన్ని, పరిచర్యను అధ్యయనం చేయడం. (యోహాను 1:18; 14:​6-9) యేసు తన ప్రకటనా కార్యక్రమంలోని రెండవ సంవత్సరంలో గలిలయలో ఉన్నప్పుడు కొరాజీను, బెత్సయిద, కపెర్నహోములలోనూ ఆ పరిసర ప్రాంతాల్లోనూ ఎన్నో శక్తివంతమైన కార్యాలు చేశాడు. అయినా చాలామంది అహంకారంతో, ఉదాసీనతతో ఆయనను విశ్వసించడానికి నిరాకరించారు. యేసు ఎలా ప్రతిస్పందించాడు? వారి విశ్వాసలేమికి రాగల పర్యవసానాల గురించి ఆయన వారికి దృఢంగా గుర్తుచేసినప్పటికీ వారి మధ్యనున్న ఆమ్‌హారేట్స్‌ అంటే దీనుల, సామాన్య ప్రజల దుర్భరమైన ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఆయన వారిమీద కనికరపడ్డాడు.​—⁠మత్తయి 9:35, 36; 11:​20-24.

8 యేసు తర్వాతి చర్యలు, ఆయన “తండ్రిని ఎరు[గును]” అని, తండ్రిని అనుకరించాడని చూపించాయి. సామాన్య ప్రజలను యేసు వాత్సల్యపూరితంగా ఇలా ఆహ్వానించాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.” అణచివేయబడి కృంగిపోయి ఉన్నవారికి ఆ మాటలు ఎంతటి ఓదార్పును, పునరుత్తేజాన్ని ఇచ్చాయో కదా! అవి నేడు మనకు కూడా ఓదార్పును, పునరుత్తేజాన్ని ఇస్తాయి. మనం యథార్థంగా సాత్వికమును ధరించుకుంటే, తన తండ్రిని ‘కుమారుడెవరికి బయలుపరచ నుద్దేశిస్తాడో’ వారిలో ఒకరమై ఉంటాము.​—⁠మత్తయి 11:​27-29.

9 సాత్వికముతో అణకువకు అంటే “దీనమనస్సు” కలిగి ఉండడానికి సన్నిహిత సంబంధం ఉంది. అయితే మరోవైపున, గర్వం స్వయం స్తుతికి నడిపిస్తుంది, అది ఇతరులతో క్రూరంగా కఠినంగా వ్యవహరించేలా చేయగలదు. (సామెతలు 16:​18, 19) యేసు తన భూ పరిచర్య అంతటిలోనూ వినయాన్ని చూపించాడు. యేసు తన మరణానికి ఆరు రోజుల ముందు యెరూషలేములోకి ప్రవేశించి, యూదుల రాజుగా కొనియాడబడినప్పుడు కూడా ఆయనకు ఈ లోక పాలకులకు ఎంతో తేడా ఉందని స్పష్టమయ్యింది. “ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నా[డు]” అని జెకర్యా వ్రాసిన మెస్సీయా సంబంధిత ప్రవచనాన్ని ఆయన నెరవేర్చాడు. (మత్తయి 21:5; జెకర్యా 9:⁠9) విశ్వసనీయుడైన దానియేలు ప్రవక్త ఒక దర్శనాన్ని చూశాడు, అందులో యెహోవా తన కుమారునికి పరిపాలనాధికారం ఇచ్చాడు. అయితే, అంతకు ముందటి ఒక ప్రవచనంలో ఆయన యేసును, “అత్యల్ప మనుష్యు[డు]” అని వర్ణించాడు. నిజంగానే సాత్వికానికి, వినయానికి సన్నిహిత సంబంధం ఉంది.​—⁠దానియేలు 4:17; 7:​13, 14.

10 యెహోవా, యేసు ఆహ్లాదకరమైన రీతిలో చూపించే సాత్వికము మనం వారికి దగ్గరయ్యేందుకు సహాయం చేస్తుంది. (యాకోబు 4:⁠8) అయితే సాత్వికము బలహీనతను సూచించదు. ఖచ్చితంగా అది బలహీనత కాదు! సర్వశక్తిగల దేవుడైన యెహోవా అపరిమితమైన బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తాడు. అనీతిమంతులపై ఆయన ఆగ్రహం రగులుకుంటుంది. (యెషయా 30:27; 40:​26) అలాగే యేసు కూడా అపవాదియగు సాతాను దాడి చేసినప్పుడు సహితం రాజీపడకూడదని దృఢనిశ్చయం చేసుకున్నాడు. ఆయన తన కాలంనాటి మతనాయకుల చట్టవ్యతిరేకమైన ఆచారాలను సహించడానికి నిరాకరించాడు. (మత్తయి 4:1-11; 21:12, 13; యోహాను 2:​13-17) అయినప్పటికీ ఆయన తన శిష్యుల పొరపాట్లతో సాత్వికముతో వ్యవహరించి, వారి బలహీనతలను ఓపికతో సహించాడు. (మత్తయి 20:​20-28) ఒక బైబిలు పండితుడు సాత్వికమును సరిగ్గానే ఇలా వర్ణించాడు: “మార్దవమనే లక్షణం వెనుక ఉక్కులాంటి బలం ఉంది.” క్రీస్తు లక్షణమైన ఈ సాత్వికమును మనం చూపిద్దాం.

తన కాలంలో అత్యంత సాత్వికుడు

11 మనం పరిశీలించే మూడవ ఉదాహరణ మోషేది. బైబిలు ఆయనను “భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు” అని వర్ణిస్తోంది. (సంఖ్యాకాండము 12:⁠3) ఈ వర్ణన దేవుని ప్రేరేపణతో వ్రాయబడింది. మోషే చూపించిన గమనార్హమైన సాత్వికము ఆయన యెహోవా ఇచ్చే నిర్దేశాన్ని స్వీకరించేలా చేసింది.

12 మోషే పెంపకం చాలా అసాధారణమైనది. విశ్వసనీయులైన హీబ్రూ తల్లిదండ్రులకు జన్మించిన ఈ కుమారుడు మోసాలు, హత్యలు జరుగుతున్న కాలంలో సజీవంగా కాపాడబడేలా యెహోవా చూశాడు. మోషే తన బాల్యాన్ని తన తల్లి సంరక్షణలో గడిపాడు, ఆమె ఆయనకు సత్యదేవుడైన యెహోవా గురించి శ్రద్ధతో బోధించింది. ఆ తర్వాత, మోషే తన ఇంటి వాతావరణానికి పూర్తి భిన్నమైన వాతావరణంలో జీవించడానికి తీసుకువెళ్ళబడ్డాడు. “మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడైయుండెను” అని తొలి క్రైస్తవ హతసాక్షియైన స్తెఫను వివరంగా చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 7:​22) ఫరో వద్ద పనిచేసే కార్యనియామకులు తన సహోదరులకు చేస్తున్న అన్యాయాలను ఆయన గమనించినప్పుడు, ఆయన విశ్వాసం ప్రదర్శితమయ్యింది. ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుని కొట్టడం చూసిన మోషే ఆ ఐగుప్తీయుడ్ని చంపినందుకు, ఆయన ఐగుప్తు నుండి మిద్యానుకు పారిపోవలసి వచ్చింది.​—⁠నిర్గమకాండము 1:15, 16; 2:1-15; హెబ్రీయులు 11:​24-26.

13 నలభై ఏళ్ళ వయస్సులో మోషే అరణ్యంలో తన బాగోగులు తాను చూసుకోవలసి వచ్చింది. మిద్యానులో ఆయన రగూయేలు ఏడుగురు కుమార్తెలను కలుసుకుని, వారి తండ్రికున్న పెద్ద మందకు నీళ్ళు పెట్టడానికి వారికి సహాయం చేశాడు. ఆ యువతులు ఇంటికి తిరిగివెళ్ళి, తమను ఇబ్బందిపెడుతున్న మందకాపరుల నుండి “ఐగుప్తీయుడొకడు” తమను తప్పించాడని రగూయేలుకు సంతోషంగా వివరించారు. రగూయేలు కోరిక మేరకు మోషే ఆ కుటుంబంతోపాటు ఉండిపోయాడు. ఆయన అనుభవించిన బాధలు ఆయనకు ఆగ్రహం కలిగించలేదు; ఆయన తన జీవన శైలిని కొత్త పరిసరాలకు అనుగుణంగా మార్చుకోవడాన్ని నేర్చుకోకుండా నిరోధించనూ లేదు. యెహోవా చిత్తం చేయాలన్న ఆయన కోరిక ఎన్నడూ చెదరిపోలేదు. రగూయేలు గొఱ్ఱెలను కాస్తూ సిప్పోరాను వివాహం చేసుకొని, తన కుమారులను పెంచిన సుదీర్ఘమైన 40 సంవత్సరాల్లో మోషే తనకు మారుపేరుగా నిలిచిన లక్షణాన్ని వృద్ధిచేసుకొని దాన్ని మెరుగుపరచుకున్నాడు. అవును, ప్రతికూల పరిస్థితుల్లో మోషే సాత్వికాన్ని అలవర్చుకున్నాడు.​—⁠నిర్గమకాండము 2:16-22; అపొస్తలుల కార్యములు 7:​29, 30.

14 యెహోవా మోషేను ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడిగా నియమించిన తర్వాత కూడా ఆయనలో సాత్వికము అలాగే ఉంది. ఎల్దాదు, మేదాదు పాళెములో ప్రవక్తలుగా వ్యవహరిస్తున్నారని ఒక యువకుడు మోషేకు చెప్పాడు​—⁠మోషేకు సహాయకులుగా పనిచేయనున్న 70 మంది పెద్దలపై యెహోవా తన ఆత్మను కుమ్మరించినప్పుడు వారిలో ఈ ఇద్దరూ లేరు. అప్పుడు యెహోషువ “మోషే నా ప్రభువా, వారిని నిషేధింపు[ము]” అని అన్నాడు. దానికి మోషే సాత్వికముతో ఇలా సమాధానమిచ్చాడు: “నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక!” (సంఖ్యాకాండము 11:​26-29) ఆ ఉద్రిక్త పరిస్థితిలో ప్రశాంతత నెలకొనేందుకు సాత్వికము దోహదపడింది.

15 ఒక సందర్భంలో మోషేకు సాత్వికము కొరవడినట్లు అనిపిస్తోంది. ఆయన కాదేషు సమీపంలోని మెరీబా వద్ద, అద్భుతాలు చేసే యెహోవాను మహిమపరచకుండా అశ్రద్ధ చేశాడు. (సంఖ్యాకాండము 20:​1, 9-13) మోషే అపరిపూర్ణుడే అయినప్పటికీ ఆయన అచంచల విశ్వాసం ఆయనకు తన జీవితమంతా మద్దతునిచ్చింది, ఆయన చూపించిన విశేషమైన సాత్వికము నేడు కూడా మన మనస్సును ఆకర్షిస్తుంది.​—⁠హెబ్రీయులు 11:​23-28.

కఠినత్వము-సాత్వికము

16 మరో హెచ్చరికా మాదిరి దావీదు కాలం నాటిది, అది దేవుని ప్రవక్తయైన సమూయేలు మరణించిన తర్వాతి కాలానికి చెందినది. అది నాబాలు, ఆయన భార్య అబీగయీలు అనే దంపతులకు సంబంధించినది. ఈ ఇద్దరి మధ్య ఎంతో తేడా ఉంది. అబీగయీలు “సుబుద్ధిగలదై” ఉండగా ఆమె భర్త “మోటువాడును దుర్మార్గుడునై యుండెను.” నాబాలుకు చెందిన పెద్ద మందలను దొంగల బారినపడకుండా కాపాడడంలో సహాయపడిన దావీదు మనుష్యులు భోజనపానీయాలు ఇవ్వమని చేసిన విన్నపాన్ని అతడు కఠినంగా త్రోసిపుచ్చాడు. న్యాయంగానే ఆగ్రహించిన దావీదు, ఆయన మనుష్యులు కత్తులు ధరించి నాబాలుతో తలపడడానికి బయలుదేరారు.​—⁠1 సమూయేలు 25:​2-13.

17 జరిగిన సంగతి అబీగయీలుకు తెలియగానే ఆమె రొట్టెలు, ద్రాక్షారసము, మాంసము, ద్రాక్షగెలలు, అంజూరపు అడలు సిద్ధం చేసుకొని దావీదును కలుసుకోవడానికి బయలుదేరింది. “నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడ నిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పుమాటలను ఆలకించుము” అని ఆయనను వేడుకుంది. అబీగయీలు సాత్వికముతో చేసిన విన్నపం దావీదు హృదయాన్ని మెత్తబరిచింది. అబీగయీలు ఇచ్చిన వివరణను విన్న తర్వాత, దావీదు ఇలా అన్నాడు: “నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. . . . ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.” (1 సమూయేలు 25:18, 24, 32, 33) నాబాలు కఠినత్వం చివరికి అతని మరణానికి దారితీసింది. అబీగయీలు మంచి లక్షణాలు, చివరికి దావీదు భార్య అయ్యే ఆనందాన్ని ఆమెకు కలిగించాయి. నేడు యెహోవా సేవ చేసేవారందరికీ ఆమె సాత్వికము ఆదర్శప్రాయమైనది.​—⁠1 సమూయేలు 25:​36-42.

సాత్వికము కోసం ప్రయాసపడండి

18 కాబట్టి, సాత్వికము చాలా అవసరమైన గుణం. అది సాధు స్వభావం కంటే ఎక్కువే; అది ఇతరులకు నూతనోత్తేజాన్ని ఇచ్చే స్వభావంగల ఆకర్షణీయమైన లక్షణం. గతంలో, కఠినంగా మాట్లాడే, నిర్దయగా ప్రవర్తించే అలవాటు మనకు ఉండి ఉండవచ్చు. అయితే బైబిలు సత్యం తెలుసుకున్న తర్వాత, మనం మారి మరింత ఆహ్లాదకరమైనవారిగా, సంతోషదాయకమైనవారిగా తయారయ్యాము. “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి” అని తన తోటి క్రైస్తవులను ఉద్బోధించినప్పుడు పౌలు ఆ మార్పు గురించే మాట్లాడాడు. (కొలొస్సయులు 3:​12) బైబిలు ఆ మార్పును, తోడేలు, చిఱుతపులి, సింహము, ఎలుగు, నాగుపాము వంటి క్రూరమైన అడవి మృగాలు గొఱ్ఱెపిల్ల, మేకపిల్ల, కోడెదూడ, ఆవు వంటి శాంతస్వభావంగల సాధుజంతువులుగా మారడంతో పోలుస్తోంది. (యెషయా 11:6-9; 65:​25) అలాంటి వ్యక్తిత్వ మార్పులు ఎంత విశేషమైనవిగా ఉంటాయంటే, వాటిని గమనించేవారు ఆశ్చర్యచకితులవుతారు. అయితే దేవుని ఆత్మ పనిచేయడమే ఆ మార్పుకు కారణమని మనం అంగీకరిస్తాము ఎందుకంటే గమనార్హమైన దాని ఫలములో సాత్వికము ఒక భాగం.

19 ఒకసారి మనం అవసరమైన మార్పులు చేసుకొని, యెహోవాకు సమర్పించుకుంటే ఇక మనం సాత్వికముతో ఉండడం గురించి కృషి చేయవలసిన అవసరం లేదని దీని భావమా? ఎంతమాత్రం కాదు. ఉదాహరణకు, కొత్త బట్టలను శుభ్రంగా చక్కగా అలాగే ఉంచుకోవాలంటే వాటి గురించి ఎల్లవేళలా శ్రద్ధ తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని నిశితంగా పరిశీలిస్తూ, దానిలోని మాదిరుల గురించి ధ్యానించడం మనల్ని మనం కొత్త దృష్టితో మరోసారి యథాతధంగా పరిశీలించుకోవడానికి సహాయం చేస్తుంది. దేవుని ప్రేరేపిత వాక్యమనే అద్దం మీ గురించి ఏమి వెల్లడి చేస్తోంది?​—⁠యాకోబు 1:​23-25.

20 మన స్వభావాలు భిన్నంగా ఉండడం సహజం. సాత్వికమును ప్రదర్శించడం దేవుని సేవకుల్లో కొందరికి ఇతరులకన్నా సులభంగా ఉండవచ్చు. అయినప్పటికీ క్రైస్తవులందరూ సాత్వికముతో సహా దేవుని ఆత్మ ఫలమును వృద్ధి చేసుకోవలసిన అవసరం ఉంది. పౌలు ప్రేమపూర్వకంగా తిమోతికిలా ఉపదేశించాడు: “నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.” (1 తిమోతి 6:​11) “సంపాదించుకొనుటకు ప్రయాసపడుము” అనే పదబంధం కృషి అవసరమని సూచిస్తోంది. ఒక బైబిలు అనువాదం ఈ ఉద్బోధను ‘మనసు లగ్నం చేయండి’ అని అనువదిస్తోంది. (న్యూ టెస్ట్‌మెంట్‌ ఇన్‌ మాడర్న్‌ ఇంగ్లీష్‌, జె. బి. ఫిలిప్స్‌) దేవుని వాక్యంలోని చక్కని మాదిరులను ధ్యానించడానికి మీరు కృషి చేస్తే, అవి మీ శరీరంలో అమర్చబడినట్లుగా మీలో ఒక భాగమైపోతాయి. అవి మిమ్మల్ని మలిచి, మీకు మార్గనిర్దేశాన్నిస్తాయి.​—⁠యాకోబు 1:​21.

21 ఇతరులతో మనం ప్రవర్తించే విధానం మనం ఈ లక్షణాన్ని ఎంత చక్కగా ప్రదర్శిస్తున్నామనేదాన్ని వెల్లడి చేస్తుంది. యాకోబు ఇలా ప్రశ్నిస్తున్నాడు: “మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికముగలవాడై, తన యోగ్యప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.” (యాకోబు 3:​13) మనం ఈ క్రైస్తవ లక్షణాన్ని మన ఇంట్లో, క్రైస్తవ పరిచర్యలో, సంఘంలో ఎలా ప్రదర్శించవచ్చు? తర్వాతి ఆర్టికల్‌ సహాయకరమైన మార్గదర్శకాన్నిస్తుంది.

పునఃసమీక్షలో

• సాత్వికము గురించి మీరు

• యెహోవా మాదిరి నుండి ఏమి నేర్చుకున్నారు?

• యేసు మాదిరి నుండి ఏమి నేర్చుకున్నారు?

• మోషే మాదిరి నుండి ఏమి నేర్చుకున్నారు?

• అబీగయీలు మాదిరి నుండి ఏమి నేర్చుకున్నారు?

• మనం సాత్వికము కోసం ఎందుకు ప్రయాసపడాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. సాత్వికమును ఒక గమనార్హమైన లక్షణంగా చేసేదేమిటి?

2, 3. సాత్వికానికి పరిశుద్ధాత్మకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాము?

4. యెహోవా సాత్వికమును విలువైనదిగా ఎంచుతాడని మనకెలా తెలుసు?

5. యెహోవాకున్న సాత్వికమును బట్టి మనకు ఏ భవిష్యత్‌ నిరీక్షణ ఉంది?

6. దేవుడు కయీనుతో వ్యవహరించిన విధానంలో సాత్వికము ఎలా స్పష్టమయ్యింది?

7, 8. (ఎ) మనం యెహోవా సాత్వికమును ఎలా అర్థం చేసుకోవచ్చు? (బి) మత్తయి 11:27-29 వచనాల్లోని మాటలు యెహోవా గురించి, యేసు గురించి ఏమి తెలియజేస్తున్నాయి?

9. సాత్వికముతో ఏ లక్షణం జతచేయబడింది, ఈ విషయంలో యేసు ఒక చక్కని మాదిరిగా ఎలా ఉన్నాడు?

10. క్రైస్తవ సాత్వికము బలహీనతను ఎందుకు సూచించదు?

11, 12. మోషే పెంపకం దృష్ట్యా, ఆయనలో సాత్వికము ఉండడం ఎందుకు గమనార్హం?

13. మోషే మిద్యానులో నివసించిన 40 సంవత్సరాలు ఆయనపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి?

14. మోషే ఇశ్రాయేలీయులపై నాయకత్వం వహించిన సమయంలో, ఆయన సాత్వికాన్ని వెల్లడి చేసిన ఒక సంఘటనను తెలియజేయండి.

15. మోషే అపరిపూర్ణుడే అయినా ఆయన ఎందుకు ఆదర్శప్రాయుడు?

16, 17. నాబాలు, అబీగయీలు వృత్తాంతంలో మనకు ఎలాంటి హెచ్చరిక ఉంది?

18, 19. (ఎ) మనం సాత్వికమును ధరించినప్పుడు ఎలాంటి మార్పులు స్పష్టంగా కనబడతాయి? (బి) మనల్ని మనం సమర్థంగా పరిశీలించుకోవడానికి మనకేమి సహాయం చేయగలదు?

20. సాత్వికమును చూపించడంలో మనమెలా సఫలులం కావచ్చు?

21. (ఎ) మనం సాత్వికము కోసం ఎందుకు ప్రయాసపడాలి? (బి) మన తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?

[16వ పేజీలోని చిత్రం]

యెహోవా హేబెలు అర్పణను ఎందుకు లక్ష్యపెట్టాడు?

[17వ పేజీలోని చిత్రం]

సాత్వికానికి, వినయానికి సంబంధం ఉందని యేసు చూపించాడు

[18వ పేజీలోని చిత్రం]

సాత్వికము కలిగివుండడంలో మోషే చక్కని మాదిరిని ఉంచాడు