ఆధ్యాత్మిక విలువలకు ఏమవుతోంది?
ఆధ్యాత్మిక విలువలకు ఏమవుతోంది?
“వివాహానికి ముందు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు [క్యాథలిక్కులు] నిర్వహించిన ఒక సాయంత్రపు కార్యక్రమానికి పదిహేను జంటలు హాజరయ్యాయి. హాజరైన 30 మందిలో ముగ్గురు మాత్రమే తమకు విశ్వాసం ఉందని తెలియజేశారు.”
లా క్ర్వా, ఫ్రెంచ్ క్యాథలిక్ దినపత్రిక.
ఆధ్యాత్మిక విలువలు ప్రమాదంలో ఉన్నాయి. 1999, జూలై 12వ తేదీకి సంబంధించిన న్యూస్‌వీక్ అంతర్జాతీయ సంచిక ముఖచిత్రంపై “దేవుడు మరణించాడా?” అనే ప్రశ్న వేయబడింది. పశ్చిమ యూరప్ విషయంలో అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా అవును అన్నట్లే కనిపిస్తోందని ఆ పత్రిక తెలియజేసింది. అదే సంవత్సరం అక్టోబరులో రోమ్‌లో నిర్వహించబడిన క్యాథలిక్ చర్చి మతగురువుల సభ గురించి నివేదిస్తూ ఫ్రెంచ్ వార్తాపత్రిక ల మొండ్ ఇలా తెలియజేసింది: “చర్చి అంటే ‘అయిష్టత’ పెంపొందించుకున్న సంస్కృతిలోని ప్రజలకు తన సందేశాన్ని తెలియజేయడం చర్చికి మునుపటికంటే ఇప్పుడు ఎంతో కష్టంగా ఉంది. . . . ఇటలీలోని క్యాథలిక్కులందరూ సిద్ధాంతాల విషయంలో, ఆచారాల విషయంలో ఎంతమాత్రం ఐక్యంగా లేరు. . . . జర్మనీలో గర్భస్రావం చేయించుకోవడానికి కావలసిన సలహాలిచ్చే కేంద్రాలకు సంబంధించిన వివాదంవల్ల, పోప్కూ నియంతృత్వ అభిప్రాయాలను స్వీకరించడానికి సుముఖంగా లేని ప్రజాస్వామ్యానికీ మధ్యవున్న అగాధం పెద్దదౌతోంది. నైతికత, యూతనేషియా (బ్రతుకుతాడనే ఆశలేని అనారోగ్యంతో లేదా గాయాలతో బాధపడుతున్న రోగిని దయతో చంపివేయడం) విషయంలో సాహసోపేత స్థానం తీసుకోవడం వల్లనే [నెదర్లాండ్స్] అకస్మాత్తుగా క్రైస్తవేతర దేశంగా మారిందని కొందరు పరిశీలకులు చెబుతున్నారు.”
ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. 1999వ సంవత్సరంలో క్యాంటర్బరీ ఆర్చ్‌బిషప్ అయిన జార్జ్ క్యారీ, ఇంగ్లాండ్ చర్చి “మరో తరంలోగా అంతరించిపోతుందని” హెచ్చరించాడు. “క్రైస్తవ యూరప్ అంతం” అనే శీర్షికగల ఆర్టికల్‌లో ఫ్రెంచ్ వార్తాపత్రిక ల ఫేగారో ఇలా చెప్పింది: “ఎక్కడ చూసినా ఇదే పద్ధతి కనిపిస్తోంది. . . . ప్రజలు నైతికపరమైన, సిద్ధాంతపరమైన విషయాల గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.”
మతసంబంధిత కార్యకలాపాల్లో తక్కువగా పాల్గొనడం
యూరప్‌లో చర్చికి హాజరయ్యే వారి సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. ఫ్రెంచ్ క్యాథలిక్కుల్లో 10 శాతం కంటే తక్కువమంది ప్రతీ ఆదివారం
మాస్కు హాజరవుతున్నారు, పారిస్ క్యాథలిక్కుల్లో కేవలం 3 నుండి 4 శాతంమంది మాత్రమే క్రమంగా చర్చికి హాజరవుతున్నారు. యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, స్కాండినేవియా దేశాల్లో కూడా చర్చికి హాజరయ్యేవారి సంఖ్య అదే విధంగా లేదా అంతకంటే తక్కువగా ఉందని గమనించడం జరిగింది.మతగురువులుగా ఉండేందుకు ఇష్టపడే సభ్యుల కొరత, మతాధికారులను కలతపరుస్తోంది. ఒక దశాబ్దం కంటే తక్కువ కాలంలోనే ఫ్రాన్స్‌లో మతగురువుల సంఖ్య విపరీతంగా పడిపోయింది, 10,000 నివాసులకు 14 మతగురువుల నుండి నేడు 10,000 మందికి ఒక్క మతగురువు కూడా లేడు. యూరప్ అంతటిలో మతగురువు కావడానికిగల కనీస వయసును అధికం చేస్తున్నారు, ఐర్లాండ్, బెల్జియం వంటి దేశాల్లో కూడా ప్రీస్టుల కొరత కనిపిస్తోంది. అదేసమయంలో మతసిద్ధాంతాలకు సంబంధించిన ముద్రిత ప్రశ్నోత్తర రూపంలో జరిపే బోధనా తరగతులకు హాజరయ్యే పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతోంది, క్యాథలిక్ చర్చికి తనను తాను పునరుద్ధరణ చేసుకునే సామర్థ్యం ఉందా లేదా అనే విషయంలో గంభీరమైన అనుమానాలు తలెత్తుతున్నాయి.
మతం విషయానికి వచ్చేసరికి ప్రజలకు నమ్మకం లేకుండా పోతోంది. “కేవలం ఒకే ఒక మతంలో సత్యం లభ్యమవుతుంది” అని ఫ్రెంచ్ ప్రజల్లో కేవలం 6 శాతంమంది మాత్రమే నమ్ముతున్నారు, కానీ 1981లో 15 శాతంమంది, 1952లో 50 శాతంమంది అలా నమ్మేవారు. మతం పట్ల ఉదాసీనత అధికమవుతోంది. తమకు మతంతో ఎటువంటి సంబంధమూ లేదని చెప్పుకొనే ప్రజల సంఖ్య 1980లో 26 శాతం ఉంటే 2000లో 42 శాతానికి పెరిగిపోయింది.—ఫ్రెంచ్ వాల్యూస్—డెవలప్మెంట్ ఫ్రమ్ 1980 టు 2000.
నైతిక విలువల్లో గొప్ప మార్పు
విలువలకు సంబంధించిన క్లిష్టపరిస్థితి నైతికత విషయంలో కూడా స్పష్టంగా కనబడుతోంది. ముందు ప్రస్తావించినట్లు, చర్చికి వెళ్ళేవారిలో అనేకమంది తమ చర్చి విధించే నైతిక కట్టడలను అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. మత నాయకులకు ప్రవర్తనా ప్రమాణాలు స్థాపించే హక్కు ఉందనే తలంపుతో వారు ఏకీభవించడం లేదు. మానవ హక్కుల విషయంలో పోప్ ప్రమాణాన్ని మెచ్చుకొనే ప్రజలే తమ వ్యక్తిగత జీవితాలకు వచ్చే సరికి ఆయన మాట వినడానికి నిరాకరిస్తున్నారు. ఉదాహరణకు గర్భనిరోధం విషయంలో ఆయన ప్రమాణాన్ని చాలామంది—క్యాథలిక్ జంటల్లో కూడా అనేకులు—ఉపేక్షించారు.
ఈ వైఖరి మతపరమైన ప్రజలను, మతమంటే విశ్వాసంలేని ప్రజలను, సమాజంలోని అన్ని స్థాయిలకు చెందిన వారిని ఒకే విధంగా ప్రభావితం చేస్తోంది. పరిశుద్ధ లేఖనాల్లో స్పష్టంగా ఖండించబడిన క్రియలు అనుమతించబడుతున్నాయి. ఇరవై సంవత్సరాల క్రితం ఫ్రెంచ్ దేశస్థుల్లోని 45 శాతంమంది స్వలింగ సంయోగాన్ని ఆమోదించేవారు కాదు. నేడు 80 శాతం మందికి అది ఆమోదయోగ్యంగా ఉంది. అధికశాతం మంది వైవాహిక సంబంధాల విషయంలో విశ్వసనీయంగా ఉండడాన్ని ఆమోదించినప్పటికీ 36 శాతం మంది మాత్రమే వివాహేతర సంబంధాలు సమర్థించుకోదగినవి కావని ఖండిస్తారు.—రోమీయులు 1:26, 27; 1 కొరింథీయులు 6:9, 10; హెబ్రీయులు 13:4.
మతపరమైన గందరగోళం
పాశ్చాత్య సమాజంలో మీరే-స్వయంగా-తయారుచేసుకోండి మతం అభివృద్ధి చెందుతోంది, దానిలో ప్రతీ ఒక్కరూ తమకు నచ్చిన నమ్మకాలను ఎంపిక చేసుకునే హక్కును ఉపయోగించుకుంటారు. వారు కొన్ని సిద్ధాంతాలు స్వీకరిస్తారు, కొన్నింటిని నిరాకరిస్తారు. కొంతమంది పునర్జన్మలో నమ్మకముంచుతూనే తాము క్రైస్తవులమని చెప్పుకుంటారు, ఇతరులు అనేక మతాలకు సంబంధించిన అభిప్రాయాలను ఒకేసారి అనుసరించడానికి కూడా వెనుకాడరు. (ప్రసంగి 9:5, 10; యెహెజ్కేలు 18:4, 20; మత్తయి 7:21; ఎఫెసీయులు 4:5, 6) నేడు అనేకమంది విశ్వాసులు, చర్చి స్థాపించిన మార్గాలనుండి ఇష్టపూర్వకంగానే దూరమవుతున్నారని ఫ్రెంచ్ వాల్యూస్ అనే పుస్తకం స్పష్టంగా చూపించింది.
అయితే మతపరమైన విశిష్టతకు సంబంధించిన ఈ ధోరణి ప్రమాదరహితమేమీ కాదు. ఇన్స్టిట్యూట్ ద ఫ్రాన్స్ సభ్యుడు, మత చరిత్రకారుడు అయిన ఝాన్ డెల్యూమో, స్థాపించబడిన ఏ వ్యవస్థతోను సంబంధం లేకుండా ఒక వ్యక్తి తన సొంత మతాన్ని సృష్టించుకోవడమనేది అసాధ్యమని బలంగా నమ్ముతున్నాడు. “వ్యవస్థీకరించబడిన ఒక నిర్దిష్ట మత సంస్థతో సంబంధంలేని విశ్వాసం నిలువలేదు” అని ఆయన అంటున్నాడు. మతసాంప్రదాయాలకూ మంచి ఆధ్యాత్మిక విలువలకూ పొందిక ఉండాలి. మార్పులతో నాశనం చేయబడిన సమాజంలో అలాంటి పొందిక ఎక్కడ లభిస్తుంది?
ప్రవర్తనకు, నైతికతకు సంబంధించిన అంగీకారయోగ్యమైన ప్రమాణాలను దేవుడు స్థాపిస్తాడని, అయితే వాటిని పాటించాలా వద్దా అని నిర్ణయించుకునే స్వేచ్ఛను మానవులకు ఇస్తాడని బైబిలు అంతటిలో మనకు గుర్తుచేయబడుతోంది. ఎంతో గౌరవించబడే ఈ పుస్తకం నేడు ఆచరణాత్మకమైన విలువ కలిగివుందని, అది ‘తమ పాదములకు దీపమును తమ త్రోవకు వెలుగునై యున్నదని’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది గుర్తిస్తున్నారు. (కీర్తన 119:105) వారు ఆ నిర్ధారణకు ఎలా వచ్చారు? అది తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడుతుంది.