కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన ఆధ్యాత్మిక విలువలు మనకెక్కడ లభిస్తాయి?

నిజమైన ఆధ్యాత్మిక విలువలు మనకెక్కడ లభిస్తాయి?

నిజమైన ఆధ్యాత్మిక విలువలు మనకెక్కడ లభిస్తాయి?

“మీరు కేవలం కుటుంబ సాంప్రదాయం కారణంగానే ఒక మతాన్ని అనుసరించాలనుకుంటే, 2,000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఆచరించిన సెల్టిక్‌ మతాన్నే ఎందుకు ఎంపిక చేసుకోకూడదు?” అని రొడాల్ఫ్‌ వ్యంగ్యంగా అడిగాడు. ఆయన చెబుతున్నది వింటున్న యువకునికి ఆ తలంపు నవ్వు తెప్పించింది.

“దేవునితో ఉన్న సంబంధం నాకెంతో ప్రాముఖ్యమైనది. వందలాది లేక వేలాది సంవత్సరాల క్రితం జీవించిన నా కుటుంబ సభ్యులు ఒక నిర్దిష్టమైన మతాన్ని ఆచరించారు కాబట్టి ఆ మత విశ్వాసాలను సాంప్రదాయం పేరుతో నాపై రుద్దడం అనే తలంపును నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను” అని ఆయన అంటున్నాడు. రొడాల్ఫ్‌ విషయాలను జాగ్రత్తగా పరిశీలించాడు; ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన కేవలం తనకు వారసత్వంగా వచ్చినదన్నట్లు దృష్టించలేదు.

ఒక తరం నుండి ఇంకో తరానికి మతాన్ని వారసత్వంగా అందజేయడం నేడు తగ్గు ముఖం పట్టినప్పటికీ అధికశాతం మంది ఇంకా తమ కుటుంబానికి చెందిన మతాన్నే అంటిపెట్టుకొని ఉంటున్నారు. అయితే ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు అనుసరించే మత విలువలనే అంటిపెట్టుకొని ఉండడం ఎల్లప్పుడూ సరైనదేనా? బైబిలు ఏమి చెబుతోంది?

మోషే తర్వాత నాయకుడైన యెహోషువ, ఎడారిలో నలభై సంవత్సరాలు గడిపిన ఇశ్రాయేలీయుల ఎదుట ఒక ఎంపికను ఉంచాడు: “యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.”​—⁠యెహోషువ 24:15.

యెహోషువ ప్రస్తావించిన పితరుల్లో అబ్రాహాము తండ్రియైన తెరహు ఒకడు, అప్పట్లో యూఫ్రటీసు నదికి తూర్పున ఉన్న ఊరు పట్టణంలో ఆయన నివసించేవాడు. తెరహు ఇతర దేవుళ్ళను ఆరాధించేవాడనే వాస్తవం తప్పించి బైబిలు అతని గురించి ఎక్కువగా తెలియజేయడం లేదు. (యెహోషువ 24:⁠2) ఆయన కుమారుడైన అబ్రాహాముకు దేవుని సంకల్పం గురించిన సంపూర్ణ పరిజ్ఞానం లేకపోయినప్పటికీ యెహోవా ఆజ్ఞాపించినప్పుడు ఆయన తన సొంత పట్టణాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అవును, అబ్రాహాము తన తండ్రి మతానికి భిన్నమైన మతాన్ని ఎంపిక చేసుకున్నాడు. అలా చేసినందుకు అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు లభించాయి, ఆయన “దేవుణ్ణి నమ్మేవారందరికీ తండ్రి” అని అనేక మతాలు గుర్తిస్తున్న వ్యక్తి అయ్యాడు.​—⁠రోమీయులు 4:​11, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌.

యేసుక్రీస్తు పూర్వీకురాలైన రూతు కథను కూడా బైబిలు సానుకూలంగా తెలియజేస్తోంది. మోయాబు స్త్రీ అయిన రూతు ఒక ఇశ్రాయేలీయుడిని పెళ్ళి చేసుకొని తర్వాత విధవరాలైంది, అప్పుడు ఆమె ఎదుట ఒక ఎంపిక ఉంచబడింది: స్వదేశంలో ఉండడం లేదా అత్తగారితో కలిసి ఇశ్రాయేలుకు తిరిగి వెళ్ళడం. తన తల్లిదండ్రులు చేసే విగ్రహారాధనతో పోలిస్తే యెహోవా ఆరాధనకున్న ఉన్నతమైన విలువను గుర్తించి రూతు తన అత్తగారితో ఇలా అన్నది: “నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు.”​—⁠రూతు 1:16, 17.

బైబిలు పుస్తకాల్లో ఈ పుస్తకానికున్న విలువ గురించి వ్యాఖ్యానిస్తూ, “ఇశ్రాయేలుకు శత్రువులు, ఇశ్రాయేలీయులు ద్వేషించే అన్య ప్రజల మధ్య జన్మించిన ఒక స్త్రీ, . . . యెహోవా ప్రజలపట్ల, ఆయన ఆరాధనపట్ల తన ప్రేమనుబట్టి ఎంతో సంతోషకరంగా పరిశుద్ధ రాజైన దావీదుకు పూర్వీకురాలు ఎలా అయ్యిందో” ఈ వృత్తాంతం తెలియజేస్తుందని డిక్షనేర్‌ డి లా బైబిల్‌ వివరిస్తోంది. తన తల్లిదండ్రుల మతానికి భిన్నమైన మతాన్ని ఎంపిక చేసుకోవడానికి రూతు సంకోచించలేదు, ఆమె తీసుకున్న ఆ నిర్ణయం కారణంగా ఆమెకు యెహోవా ఆశీర్వాదం లభించింది.

క్రైస్తవత్వం ఎలా ప్రారంభమయ్యిందో తెలియజేసే నివేదిక, యేసు శిష్యులు తమ పూర్వీకుల మతాన్ని విడిచిపెట్టడానికి గల కారణాలను మరింత స్పష్టంగా వివరిస్తోంది. ఎంతో ఒప్పింపజేసే ప్రసంగంలో అపొస్తలుడైన పేతురు, తమ పాపాలకు పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోవడం ద్వారా “మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొం[దండి]” అని తన ప్రేక్షకులను ఆహ్వానించాడు. (అపొస్తలుల కార్యములు 2:​37-41) అత్యంత గమనార్హమైన ఉదాహరణల్లో ఒకటి, క్రైస్తవులను హింసించిన యూదుడైన సౌలుది. దమస్కుకు వెళ్ళే దారిలో సౌలు యేసు దర్శనాన్ని చూసిన తర్వాత క్రైస్తవుడిగా మారి అపొస్తలుడైన పౌలుగా గుర్తించబడ్డాడు.​—⁠అపొస్తలుల కార్యములు 9:1-9.

తొలి క్రైస్తవుల్లోని అధికశాతం మందికి ఇలాంటి అద్భుతమైన అనుభవాలేమీ లేవు. అయినప్పటికీ వారందరూ యూదా మతాన్ని లేదా అన్య దేవుళ్ళ ఆరాధనను విడిచిపెట్టాల్సి వచ్చింది. క్రైస్తవత్వాన్ని అంగీకరించిన వారు వాస్తవాల గురించి సంపూర్ణ పరిజ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత, మెస్సీయాగా యేసు పాత్ర గురించి దీర్ఘంగా చర్చించిన తర్వాత అలా చేశారు. (అపొస్తలుల కార్యములు 8:26-40; 13:16-43; 17:​22-34) తమ జీవితాల్లో మార్పులు చేసుకోవలసిన అవసరం గురించి ఆ తొలి క్రైస్తవులకు స్పష్టంగా తెలియజేయబడింది. ఆ ఆహ్వానం యూదులకు, యూదేతరులకు అందరికీ ఇవ్వబడింది, కానీ సందేశం మాత్రం ఒక్కటే. దేవుణ్ణి సంతోషపరచడానికి ఒక కొత్త ఆరాధనా విధానమైన క్రైస్తవత్వాన్ని పాటించడం అవసరమయ్యింది.

మనకు సంబంధించిన ఎంపిక

తొలి శతాబ్దంలో యూదా మతం, చక్రవర్తి ఆరాధన, అన్య దేవతల ఆరాధన వంటి కుటుంబ మత సాంప్రదాయాలను వదిలేసి యూదులు, రోమా దేశస్థులు ఇరువురూ ఎగతాళి చేసే మతంలో చేరడానికి ఖచ్చితంగా ధైర్యం అవసరమయ్యింది. ఈ ఎంపిక త్వరలోనే క్రూరమైన హింసకు దారి తీసింది. వేర్స్‌ యుయెన్‌ ఫ్రాన్స్‌ పేయిన్న్‌? (ఫ్రాన్స్‌ను అన్యమతాల దేశంగా చేయడమా?) అనే తన పుస్తకంలో క్లెర్‌మాంట్‌ ఫెర్నాండ్‌కు చెందిన క్యాథలిక్‌ బిషప్‌ హిప్పొలైట్‌ సైమన్‌ వివరించినట్లు, “అధికంగా వ్యాపిస్తున్న సమ్మతించే వాతావరణంలో చిక్కుకుపోయి అందులో మునిగిపోయేందుకు” నిరాకరించడానికి నేడు అలాంటి ధైర్యమే అవసరం. కొన్నిసార్లు విమర్శించబడే యెహోవాసాక్షుల మైనారిటీ మతంలో చేరడానికి ధైర్యం అవసరం.

కార్సికాలోని బాస్ట్యాకు చెందిన పౌల్‌ అనే యువకుడు క్యాథలిక్‌ మతంలో పెంచబడ్డాడు, ఆయన అప్పుడప్పుడు చర్చి కార్యకలాపాల్లో​—⁠క్యాథలిక్‌ చారిటబుల్‌ ఆర్గనైజేషన్‌ కోసం డబ్బులు కూడబెట్టడానికి కేకులు అమ్మడం వంటివాటిలో​—⁠పాల్గొనేవాడు. బైబిలు గురించి మంచి అవగాహన సంపాదించుకోవాలనే కోరికతో ఆయన యెహోవాసాక్షులతో క్రమంగా అధ్యయనం చేయడానికి ఒప్పుకున్నాడు. తాను నేర్చుకుంటున్న విషయాలు తనకు శాశ్వత ప్రయోజనాలను చేకూరుస్తాయని ఆయన కొంతకాలానికి గ్రహించాడు. పౌల్‌ బైబిలు విలువలను సంపూర్ణంగా అంగీకరించి యెహోవాసాక్షిగా మారాడు. ఆయన ఎంపికను ఆయన తల్లిదండ్రులు గౌరవించారు ఎందుకంటే అది వారి మధ్యవున్న సన్నిహిత కుటుంబ బాంధవ్యాన్ని మార్చలేదు.

ఎమిలీ దక్షిణ ఫ్రాన్స్‌లో నివసిస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు నాలుగు తరాలుగా యెహోవాసాక్షులుగా ఉన్నారు. ఆమె తన తల్లిదండ్రుల మతపరమైన విలువలను అంగీకరించడానికి ఎందుకు ఎంపిక చేసుకుంది? “మీ తల్లిదండ్రులు లేక తాతామామ్మలు యెహోవాసాక్షులుగా ఉన్నారు కాబట్టి లేక వారు ఇంతకుముందు యెహోవాసాక్షులు కాబట్టి మీరు ఒక యెహోవాసాక్షిగా మారరు. ‘ఇది నా మతం ఎందుకంటే ఇవి నా నమ్మకాలు’ అని చివరికి మీరే ఒప్పుకుంటారు” అని ఆమె చెబుతోంది. అనేకమంది ఇతర యౌవన యెహోవాసాక్షుల్లాగే, తన బలమైన మత నమ్మకాలు తనకు ఒక జీవిత సంకల్పాన్నీ శాశ్వతమైన సంతోషానికి మూలాన్నీ ఇస్తాయని ఎమిలీకి తెలుసు.

దైవిక విలువలను ఎందుకు అంగీకరించాలి?

సామెతల పుస్తకంలో 6వ అధ్యాయంలోని 20వ వచనం, దేవుణ్ణి సంతోషపరచాలనుకునేవారిని ఇలా ప్రోత్సహిస్తోంది: “నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.” ఈ లేఖనంలో ఇవ్వబడిన ఉపదేశం, దేవునికి గుడ్డిగా విధేయత చూపమని సలహా ఇచ్చే బదులు తమ విశ్వాసాన్ని దృఢపరచుకోవడం ద్వారా, సొంతగా దేవుని పక్షాన నిలబడడం ద్వారా దేవుని ప్రమాణాలను అంగీకరించమని యౌవనులను ప్రోత్సహిస్తోంది. తమకు బోధించబడుతున్నవి దేవుని వాక్యానికీ ఆయన చిత్తానికీ అనుగుణంగా ఉన్నాయా లేదా అని “సమస్తమును పరీక్షించి” చూసిన తర్వాత వాటి ప్రకారం ప్రవర్తించమని అపొస్తలుడైన పౌలు తన సహచరులను కోరాడు.​—⁠1 థెస్సలొనీకయులు 5:21.

క్రైస్తవ కుటుంబంలో పెంచబడినా పెంచబడకపోయినా, 60 లక్షల కంటే ఎక్కువమంది యెహోవాసాక్షులు, యౌవనులు వృద్ధులు కూడా అలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. బైబిలును జాగ్రత్తగా అధ్యయనం చేయడం ద్వారా వారు జీవిత సంకల్పం గురించిన తమ ప్రశ్నలకు నమ్మదగిన సమాధానాలను పొందారు, మానవజాతి పట్ల దేవుని చిత్తమేమిటో వారు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఈ పరిజ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత వారు దైవిక విలువలను అంగీకరించి, దేవుని చిత్తాన్ని చేయడానికి వారికి సాధ్యమైనదంతా చేస్తారు.

మీరు ఈ పత్రికను క్రమంగా చదివేవారైనా చదవనివారైనా, బైబిలులోని ఆధ్యాత్మిక విలువలను పరిశీలించడానికి యెహోవాసాక్షులు మీకు అందించే సహాయాన్ని ఎందుకు స్వీకరించకూడదు? ఈ విధంగా మీరు “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొ[న]”గలుగుతారు, ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు, ఆ పరిజ్ఞానాన్ని మీరు ఆచరణలో పెట్టినప్పుడు అది మిమ్మల్ని నిత్యజీవానికి నడిపిస్తుంది.​—⁠కీర్తన 34:8; యోహాను 17:⁠3.

[5వ పేజీలోని చిత్రం]

ఫ్రాన్స్‌లోని ఒక యెహోవాసాక్షుల కుటుంబంలో నాలుగు తరాలు

[7వ పేజీలోని చిత్రం]

రూతు తన పూర్వీకుల దేవుళ్ళకు బదులు యెహోవాకు సేవ చేయడానికి ఎంపిక చేసుకుంది