కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రకటనా పనిలోని మధుర జ్ఞాపకాలు

ప్రకటనా పనిలోని మధుర జ్ఞాపకాలు

ప్రకటనా పనిలోని మధుర జ్ఞాపకాలు

 ర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కొండల గుండావున్న దారికి అంతమే లేదన్నట్లు అనిపిస్తోంది. ఎన్నో అడ్డంకులను అధిగమించిన తర్వాత, మేము చివరకు మా గమ్యమైన ఒక మారుమూల గ్రామాన్ని చేరుకున్నాము. మొదటి తలుపు తట్టగానే ఆ ఇంటి వారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించినప్పుడు మా అలసటంతా ఆనందంగా మారిపోయింది. సాయంకాలానికల్లా మేము తెచ్చిన సాహిత్యాన్నంతటినీ అందించాము, అనేక బైబిలు అధ్యయనాలను ప్రారంభించాము. ప్రజలు నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మేము తిరిగి వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది, అయితే మేము మళ్ళీ వస్తామని వారికి వాగ్దానం చేశాము.”

మెక్సికోలోని ఒక పయినీరు బృందానికి ఇలాంటి అనుభవాలు ఎదురవడం సర్వసాధారణమే. ‘మీరు భూదిగంతముల వరకు, నాకు సాక్షులైయుంటారు’ అని యేసుక్రీస్తు తన శిష్యులకిచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో ఆసక్తితో భాగం వహించాలని వారు తీర్మానించుకున్నారు. (అపొస్తలుల కార్యములు 1:⁠8) మెక్సికోలో, ఏ సంఘానికీ నియమించబడని ప్రాంతాలకు దేవుని రాజ్యసువార్త క్రమంగా అందడం లేదు కాబట్టి అలాంటి క్షేత్రాల్లో ప్రకటనా పని చేయడం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలను​—⁠పయినీరు మార్గాలు అని పిలువబడే కార్యక్రమాలను​—⁠వ్యవస్థీకరించారు. సాధారణంగా అవి మారుమూల క్షేత్రాలు లేదా చేరుకోవడం కష్టమయ్యే క్షేత్రాలు. ప్రకటించడానికి విస్తారమైన క్షేత్రం ఉన్న ఐసొలేటెడ్‌ సంఘాలకు కూడా సహాయం చేయబడుతుంది.

పయినీరు మార్గాల ద్వారా దేశంలోని ఏ ప్రాంతాల్లో ప్రకటనా పని చేయాలో నిర్ణయించేందుకు యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం క్షేత్ర అవసరాలను పరిశీలిస్తుంది. * ఆ పని ముగిసిన తర్వాత, ఆ క్షేత్రంలో ప్రకటించడానికి ప్రత్యేక పయినీర్ల బృందాలను నియమిస్తారు. ఎత్తుపల్లాలతో సరిగాలేని రోడ్లపై ప్రయాణించడానికి అనువైన వాహనాలను వారికి ఇస్తారు. ఆ వాహనాలు సాహిత్యం నిల్వచేసుకోవడానికి, అవసరమైనప్పుడు నిద్రపోవడానికి కూడా ఉపయోగపడతాయి.

మనఃపూర్వకమైన ప్రతిస్పందన

1996 అక్టోబరు నుండి, సువార్తను ప్రకటించే ఇతర ప్రచారకులు కూడా ప్రత్యేక పయినీర్లతోపాటు ఈ కార్యక్రమంలో భాగం వహించేందుకు ఆహ్వానించబడ్డారు. అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పరిచర్య చేయడానికి ఇష్టపడే రాజ్య ప్రచారకులు, క్రమ పయినీర్లు ఈ కార్యక్రమంలో వేర్వేరు సమయాల్లో భాగం వహిస్తారు. క్షేత్రంలో పనిచేస్తూ ఆసక్తిగల ప్రజలకు అదనపు సహాయం చేయడానికి కొంతమందిని పయినీరు మార్గంలోని సంఘాలకు నియమించారు. అనేకమంది యౌవన ప్రచారకులు, పయినీర్లు ఈ ఆహ్వానాన్ని స్వీకరించి ఎంతో ప్రోత్సాహకరమైన అనుభవాలతో ఆశీర్వదించబడ్డారు.

ఉదాహరణకు మొబైల్‌ ఫోన్‌ల కంపెనీలో మంచి జీతంవచ్చే ఉద్యోగం చేసే క్రైస్తవ యువకుడైన అబిమయెల్‌ మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న ప్రకటనా పనిలో భాగం వహించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఉద్యోగం వదిలేస్తున్నాడని తెలుసుకున్న యజమానులు ఆయనకు ప్రమోషన్‌ ఇస్తామని జీతం పెంచుతామని చెప్పారు. అది అరుదైన అవకాశమనీ దాన్ని వదులుకోవడం తెలివితక్కువతనమనీ తోటి ఉద్యోగులు ఆయనను ఒత్తిడి చేశారు. అయినప్పటికీ అబిమాయెల్‌ ప్రకటనా పని కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమానికి మూడు నెలలపాటు మద్దతునివ్వాలని తీర్మానించుకున్నాడు. ఈ పరిచర్యలో ఆనందించిన తర్వాత, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ఒక ఐసొలేటెడ్‌ సంఘంలో ఎప్పటికీ ఉండిపోవాలని అబిమయెల్‌ నిర్ణయించుకున్నాడు. ఆయన ఇప్పుడు ఒక మామూలు ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన తన జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకోవడం నేర్చుకున్నాడు.

మరో అనుభవం, కూలిసా తన నియామక స్థలానికి చేరుకోవడానికి బస్సుల్లో 22 గంటలు ప్రయాణించాలి. ప్రయాణం చివరి భాగంలో, ఆ రోజు ఆఖరి బస్సును ఆమె అందుకోలేకపోయింది. అయితే పనివారిని తీసుకువెళ్ళడానికి ఒక ట్రక్కు ఉందని ఆమెకు తెలిసింది. కూలిసా ధైర్యాన్ని కూడగట్టుకొని తనను కూడా తీసుకువెళ్ళమని వారిని అడిగింది. అంతమంది పురుషుల మధ్య ఒక్కర్తే స్త్రీ అవడం వల్ల ఆమె కొంచెం సంకోచించిందనే విషయం అర్థం చేసుకోదగినదే. ఆమె ఒక యువకుడికి ప్రకటించడం ప్రారంభించినప్పుడు, ఆయన ఒక యెహోవాసాక్షి అని ఆమెకు తెలిసింది! “అంతేకాక ఆ ట్రక్కు డ్రైవరు, నేను నియమించబడిన సంఘంలో ఒక పెద్ద అని నేను తెలుసుకున్నాను!” అని కూలిసా గుర్తుచేసుకుంటోంది.

వృద్ధులు భాగం వహించడం

అయితే ఈ కార్యక్రమం కేవలం యౌవనస్థుల కోసం కాదు. వృద్ధ సహోదరి అయిన అడెలా ప్రకటనా పని కోసం ఎక్కువ సమయం వెచ్చించాలని ఎంతోకాలంగా అనుకుంటోంది. ప్రకటనా పనికోసం ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగం వహించేందుకు ఆమె ఆహ్వానించబడినప్పుడు ఆమెకు ఆ అవకాశం లభించింది. “నా నియామకం నాకు ఎంతగా నచ్చిందంటే, నేను ఎప్పటికీ అక్కడే ఉండిపోతానని ఆ సంఘ పెద్దలను కోరాను. నేను వృద్ధురాలినైనప్పటికీ యెహోవాకు ఉపయోగకరంగా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది” అని ఆమె చెబుతోంది.

అదేవిధంగా యెహోవాపట్ల కృతజ్ఞతతో, తోటివారి పట్ల ప్రేమతో ప్రేరేపించబడిన 60 సంవత్సరాల మార్తా ఈ కార్యక్రమంలో భాగం వహించడానికి ముందుకు వచ్చింది. ప్రజలను చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించాలి కాబట్టి, అంతేకాక ఆ ప్రాంతాల్లో ప్రయాణించడం కష్టం కాబట్టి తన బృందం ప్రజలందరినీ చేరుకోలేకపోతోందని గమనించి ఆమె పయినీర్లు ఉపయోగించుకోవడానికి ఒక కారు కొన్నది. ఈ సహోదరి చేసిన సహాయం వల్ల, ఎక్కువ క్షేత్ర భాగంలో ప్రకటించడానికి మరింత ఎక్కువమందితో బైబిలు సత్యాన్ని పంచుకోవడానికి సాధ్యమయ్యింది.

హృదయాన్ని సంతోషపరిచే ప్రతిస్పందన

ప్రకటనా పనికోసం ఏర్పాటుచేయబడిన ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగం వహించేవారి లక్ష్యం ‘శిష్యులను చేయడమే.’ ఈ విషయంలో అద్భుతమైన ప్రతిఫలాలు లభించాయి. ఐసొలేటెడ్‌ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు జీవితాన్ని కాపాడే బైబిలు సత్యాలు లభించాయి. (మత్తయి 28:​19, 20) అనేక బైబిలు అధ్యయనాలు ప్రారంభించబడ్డాయి. ఈ అధ్యయనాలను ఆ ప్రాంతంలోని ప్రచారకులు లేదా అదే క్షేత్రంలో ఉండిపోయిన సువార్తికులు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ప్రచారకుల గుంపులు వ్యవస్థీకరించబడ్డాయి, వేరే ప్రాంతాల్లో చిన్న సంఘాలు కూడా ప్రారంభించబడ్డాయి.

మాగ్డెలెనో, ఆయన సహచరులు తమకు నియమించబడిన ఐసొలేటెడ్‌ క్షేత్రానికి చేరుకోవడానికి ప్రజా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకున్నారు. క్షేత్రానికి వెళ్ళేటప్పుడు వారు బస్సు డ్రైవరుకు ప్రకటించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నారు. “వారం రోజుల క్రితం తను ఇంట్లో లేనప్పుడు కొంతమంది సాక్షులు తన ఇంటిని సందర్శించారని ఆ వ్యక్తి మాకు చెప్పాడు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు, ఆయన కుటుంబ సభ్యులు తాము విన్నవాటిని ఆయనకు తెలియజేశారు. మేము చుట్టుప్రక్కల ప్రాంతం నుండి వచ్చినవాళ్ళం కాదు కానీ ఈ ప్రత్యేకమైన ప్రకటనా కార్యక్రమానికి మద్దతునివ్వడానికి దేశంలోని వివిధ రాష్ట్రాలనుండి మా సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చామని ఆయనకు చెప్పాము. ఎంతో ప్రభావితుడైన ఆ డ్రైవరు తన కుటుంబంతోపాటు అదే వారం బైబిలును అధ్యయనం చేయడం ప్రారంభిస్తానని చెప్పాడు. ఆ ప్రయాణానికి మా దగ్గర డబ్బులు తీసుకోకుండా ఆయన మా పనికి మద్దతునిచ్చాడు.”

చియాపాస్‌ పర్వతాల్లోని స్థానిక ప్రజల ప్రతిస్పందన కూడా మాగ్డెలెనోను ఎంతో ప్రోత్సహించింది. “ప్రెస్బిటేరియన్‌ చర్చీకి వెళ్ళే 26 మంది యౌవనస్థుల బృందానికి రాజ్య సందేశాన్ని తెలియజేసే అవకాశం నాకు నా భార్యకు లభించింది. వారందరూ 30 నిమిషాల పాటు శ్రద్ధగా విన్నారు. వాళ్ళు తమ బైబిళ్ళను బయటకు తీశారు కాబట్టి మేము వారికి యెహోవా సంకల్పాల గురించి సంపూర్ణంగా సాక్ష్యమివ్వగలిగాము. అక్కడి ప్రజల్లో అధికశాతం ప్రజలవద్ద జెల్టల్‌ భాషలో సొంత బైబిళ్ళు ఉన్నాయి” అని ఆయన వివరించాడు. అక్కడ అనేక బైబిలు అధ్యయనాలు ప్రారంభించబడ్డాయి, అవి వృద్ధి చెందుతున్నాయి.

వ్యతిరేకత తగ్గింది

చియాపాస్‌లోని ఒక సమాజంలోని కొంతమంది ప్రజల వ్యతిరేకత వల్ల ఆ ప్రాంతంలో రెండు సంవత్సరాల వరకూ బైబిలు సందేశం ప్రకటించబడలేదు. ఆ గ్రామంలో ప్రకటించడానికి కొంతమంది సాక్షులు వెనకాడుతున్నారని టెరెసా అనే పూర్తికాల సువార్తికురాలు గమనించింది. “ప్రజలు వినడానికి సుముఖంగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మేము ప్రకటనా పని ముగించేసరికి పెద్ద వర్షం మొదలయ్యింది. ఆశ్రయం కోసం వెదుకుతూ మేము సెబాస్టియన్‌ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళాము. ఆదర స్వభావంగల ఆ వ్యక్తి మమ్మల్ని తన ఇంటిలోకి ఆహ్వానించాడు. లోపలికి వెళ్ళిన తర్వాత, మిమ్మల్ని ఎవరైనా సందర్శించారా అని నేను ఆయనను అడిగాను. ఎవ్వరూ సందర్శించలేదని ఆయన చెప్పినప్పుడు నేను ఆయనకు సాక్ష్యమివ్వడం ప్రారంభించి నిత్యజీవానికి నడిపించే జ్ఞానము * పుస్తకంలో నుండి బైబిలు అధ్యయనం మొదలుపెట్టాను. మేము మాట్లాడడం ముగించిన తర్వాత సెబాస్టియన్‌ కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని, తనతో అధ్యయనం చేయడానికి తిరిగి రమ్మని మమ్మల్ని వేడుకొన్నాడు.”

చియాపాస్‌ను సందర్శించిన మరో పయినీరు బృందం ఇలా నివేదించింది: “యెహోవా సహాయంతో మాకు మంచి ప్రతిఫలాలు లభించాయి. మొదటి వారంలోనే మేము 27 అధ్యయనాలను ప్రారంభించాము; రెండవ వారంలో, బైబిలు​—⁠మీ జీవితంలో దాని శక్తి (ఆంగ్లం) వీడియోను చూసేందుకు మేము ప్రజలను ఆహ్వానించాము. దానికి అరవై మంది హాజరయ్యారు. అందరికీ ఆ వీడియో ఎంతో నచ్చింది. వీడియో చూడడం అయిపోయిన తర్వాత ఆ గుంపుతో బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి మేము వారి అనుమతి కోరాము. ఆశ్చర్యకరంగా ఈ గ్రామంలో రెండు అధ్యయన గుంపులు ఏర్పడ్డాయి.

“మాకు నియమించబడిన క్షేత్రాల్లో ప్రకటించడం ముగించిన తర్వాత, ఆసక్తిగల వారిని బలపరచడానికీ బైబిలు అధ్యయన గుంపులు ఎలా వృద్ధిచెందుతున్నాయో చూడడానికీ మేము ఆ గ్రామానికి తిరిగి వెళ్ళాము. మేము వారిని బహిరంగ కూటానికి, కావలికోట అధ్యయనానికి ఆహ్వానించాము. అయితే కూటాలు నిర్వహించడానికి సరిపడేంత స్థలంలేదు. అధ్యయన గుంపు కలుసుకోవడానికి తన ఇంటిని వాడుకొమ్మని చెప్పిన వ్యక్తి తన ఇంటి పెరటిని చూపించి, ‘కూటాలను పెరట్లో నిర్వహించుకోవచ్చు’ అన్నాడు.”

ఆ వారాంతం, ఆ ప్రాంతాన్ని సందర్శించిన పయినీర్లూ ఆసక్తిగల ప్రజలూ కూటాల కోసం ఆ పెరటిని సిద్ధం చేయడానికి ఉత్సాహంతో సహాయం చేశారు. మొదటి కూటానికి 103 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఆ గ్రామంలో 40 బైబిలు అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి.

“అద్భుతమైన అనుభవం”

ప్రకటనా పనిలో అద్భుతమైన ఫలితాలు సాధించడంతో పాటు ఈ కార్యక్రమంలో భాగం వహించినవారికి వ్యక్తిగతంగా ఎంతో ప్రయోజనం చేకూరింది. ఈ కార్యక్రమాల్లోని ఒకదానిలో భాగం వహించిన మారియా అనే పయినీరు యువతి తన భావాలను ఇలా వ్యక్తం చేస్తోంది: “రెండు కారణాలను బట్టి అది ఒక అద్భుతమైన అనుభవం అని చెప్పవచ్చు. ప్రకటనా పనిలో నా ఆనందం అధికమయ్యింది, యెహోవాతో నా సంబంధం మరింత పటిష్ఠమయ్యింది. ఒకసారి మేము ఒక కొండ ఎక్కుతున్నప్పుడు మాకు చాలా అలసట అనిపించింది. యెహోవా సహాయాన్ని కోరిన తర్వాత యెషయా 40:29-31 వచనాల్లోని మాటలు మా విషయంలో నిజమయ్యాయి: ‘యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు.’ మేము మా గమ్యాన్ని చేరుకొని, మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించిన ప్రజలతో అధ్యయనాలను నిర్వహించాము.”

మరో యౌవన పయినీరైన 17 సంవత్సరాల క్లాడియా మాకు ఇలా చెప్పింది: “నాకు ఎంతో ప్రయోజనం చేకూరింది. నేను పరిచర్యలో మరింత నైపుణ్యవంతంగా ఉండడం నేర్చుకున్నాను, అది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది, నేను ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి అది దారి తీసింది. నేను ఆధ్యాత్మిక పరిణతి కూడా సాధించాను. ఇంటిదగ్గర మా అమ్మే నాకు అన్ని పనులు చేసిపెట్టేది. ఇప్పుడు, ఎక్కువ అనుభవంతో నేను మరింత బాధ్యతాయుతంగా తయారయ్యాను. ఉదాహరణకు నేను ఆహారం తినే విషయంలో చాలా మారాం చేసేదాన్ని. కానీ ఇప్పుడు నేను వివిధ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఆహారం గురించి ఫిర్యాదు చేయడం లేదు. ఈ విధమైన పరిచర్య నేను ఎంతో మంచి స్నేహాలను పెంపొందించుకోవడానికి సహాయపడింది. మా దగ్గరున్నవన్నీ మేము పంచుకుంటాము, ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటాము.”

ఆనందకరమైన కోతపని

ఈ ప్రత్యేకమైన కృషి ఫలితాలు ఏమిటి? 2002 తొలి భాగంకల్లా దాదాపు 28,300 మంది పయినీర్లు ఈ పయినీరు మార్గాల్లో భాగం వహించారు. వారు ప్రకటనా పని కోసం 20 లక్షల గంటలకంటే ఎక్కువ సమయాన్ని వెచ్చించి 1,40,000 కంటే ఎక్కువ బైబిలు అధ్యయనాలను నిర్వహించారు. బైబిలు సత్యం నేర్చుకోవడానికి ప్రజలకు సహాయపడేందుకు వారు దాదాపు 1,21,000 పుస్తకాలను దాదాపు 7,30,000 పత్రికలను ప్రతిపాదించారు. కొంతమంది పయినీర్లు 20 లేక అంతకంటే ఎక్కువ బైబిలు అధ్యయనాలను నిర్వహించారంటే అది అసాధారణమైన విషయమేమీ కాదు.

ఈ ప్రేమను పొందినవారు తమకు బైబిలు సందేశాన్ని తెలియజేయడానికి చేయబడిన అదనపు కృషికి ఎంతో కృతజ్ఞులై ఉన్నారు. వారు పేదవారైనప్పటికీ, ప్రచారకులు తమ దగ్గరనుండి విరాళాలు స్వీకరించాలని చాలామంది పట్టుబట్టేవారు. అవసరంలోవున్న 70 సంవత్సరాల ఒక స్త్రీ తనను సందర్శించే పయినీర్లకు ప్రతీసారి ఏదో ఒకటి ఇస్తుండేది. వారు స్వీకరించడానికి నిరాకరిస్తే ఆమె ఏడుస్తుండేది. ఒక పేద కుటుంబం తమ కోడి ప్రత్యేకంగా పూర్తికాల సువార్తికుల కోసమే కొన్ని గుడ్లు పెట్టిందని చెప్పి, వారిని ఆ గుడ్లు తీసుకొమ్మని బలవంతపెడుతుండేది.

ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యథార్థమైన ప్రజలు ఆధ్యాత్మిక విషయాలపట్ల నిజమైన కృతజ్ఞత చూపిస్తున్నారు. ఉదాహరణకు ఒక యౌవన స్త్రీ క్రైస్తవ కూటాలన్నిటికీ హాజరవడానికి ఒంటరిగా మూడున్నర గంటల పాటు నడిచివస్తుంది. ఆసక్తిగల ఒక వృద్ధురాలికి మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పటికీ ప్రయాణ పైవిచారణకర్త సందర్శనం జరుగుతునప్పుడు బైబిలునుండి ఉపదేశం పొందడానికి ఆమె రెండు గంటలపాటు ప్రయాణించి వచ్చింది. నిరక్షరాస్యులైన కొంతమంది, బైబిలు విద్య నుండి మరింత ప్రయోజనం పొందడానికి చదవడం వ్రాయడం నేర్చుకోవాలని ఇష్టపడ్డారు. వారి కృషి గొప్పగా ఆశీర్వదించబడింది.

అపొస్తలుల కార్యములు పుస్తకంలో లూకా అపొస్తలుడైన పౌలు చూసిన ఒక దర్శనాన్ని ఇలా వర్ణించాడు: “అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి—నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొ[న్నాడు].” పౌలు ఇష్టపూర్వకంగా ఆ కోరికను మన్నించాడు. నేడు మెక్సికోలోని మారుమూల ప్రాంతాల్లో అనేకమంది అదే స్ఫూర్తితో ప్రతిస్పందించారు, వారు “భూదిగంతముల వరకు” సువార్తను ప్రకటించడానికి ముందుకు వచ్చారు.​—⁠అపొస్తలుల కార్యములు 1:8; 16:​9, 10.

[అధస్సూచీలు]

^ పేరా 4 ఇటీవలి ఒక సంవత్సరంలో, మెక్సికోలోని 8 కంటే ఎక్కువ శాతం క్షేత్రంలో యెహోవాసాక్షుల సంఘాలు క్రమంగా ప్రకటనా పని చేయలేదు. అంటే ప్రకటనా పని పరిమితంగా ఉన్న ఐసొలేటెడ్‌ ప్రాంతాల్లో 82,00,000 కంటే ఎక్కువమంది ప్రజలు నివసిస్తున్నారు.

^ పేరా 17 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[9వ పేజీలోని చిత్రం]

మెక్సికోలోని అనేకమంది సాక్షులు ప్రకటనా పనికోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగం వహించారు