యెహోవా హృదయాన్ని సంతోషపరిచే యౌవనులు
యెహోవా హృదయాన్ని సంతోషపరిచే యౌవనులు
ఈ అధ్యయన ఆర్టికల్‌లు ప్రత్యేకించి యెహోవాసాక్షుల్లోని యౌవనుల కోసం రూపొందించబడ్డాయి. కాబట్టి ఈ సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి, సంఘంలో కావలికోట అధ్యయనం జరిగేటప్పుడు స్వేచ్ఛగా వ్యాఖ్యానించమని మేము యౌవనులను ప్రోత్సహిస్తున్నాము.
“నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.”—సామెతలు 27:11.
మీరు బట్టల కోసం షాపింగ్ చేస్తున్నట్లు ఊహించుకోండి. బట్టల కోసం వెదుకుతున్నప్పుడు ఒక డ్రెస్ చూడగానే మీకు నచ్చింది. దాని రంగు, స్టైలు మీకు సరిగ్గా సరిపోతాయి అనిపించింది, దాని ధర కూడా తక్కువే. కానీ ఆ తర్వాత మీరు ఆ డ్రెస్‌ని జాగ్రత్తగా పరిశీలించారు. ఆ డ్రెస్ చివర్లలో దారాలు ఊడిరావడం, కుట్టిన విధానం సరిగ్గా లేకపోవడం చూసి మీరు ఆశ్చర్యపోయారు. ఆ డ్రెస్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ నాణ్యత లేనిది. మీరు అలాంటి తక్కువ నాణ్యతగల డ్రెస్‌ని కొనడానికి మీ డబ్బును ఖర్చుపెడతారా?
2 పైన వర్ణించబడిన పరిస్థితిని, క్రైస్తవ యౌవనులుగా మీకు ఎదురవగల పరిస్థితితో పోల్చండి. మొదటిసారి చూసినప్పుడు ఈ లోకం—ఆ డ్రెస్‌లాగే—ఎంతో ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ఉదాహరణకు మీ తోటి విద్యార్థులు ఉత్తేజకరమైన పార్టీలకు వెళుతుండవచ్చు, మాదకద్రవ్యాలు వాడుతుండవచ్చు, మద్యపానం సేవిస్తుండవచ్చు, విశ్వసనీయంగా ఉండాలనే ఉద్దేశమేమీ లేకుండానే డేటింగ్ చేస్తుండవచ్చు, వివాహానికి ముందే లైంగిక సంబంధాల్లో పాల్గొంటుండవచ్చు. అప్పుడప్పుడు మీరు అలాంటి జీవిత విధానానికి ఆకర్షితులౌతున్నారా? ఇతరులు స్వేచ్ఛ అని పిలిచేదాన్ని మీరు కూడా రుచి చూడాలని ఆశపడుతున్నారా? మీకలా అనిపిస్తుంటే, మీరు చెడ్డవారని క్రైస్తవులుగా ఉండేందుకు తగనివారని నిర్ధారించుకోకండి. వాస్తవానికి, లోకపు ఆకర్షణ—దేవుణ్ణి సంతోషపరచాలనుకునే వ్యక్తికి కూడా—ఎంతో శక్తివంతంగా ఉండవచ్చని బైబిలు అంగీకరిస్తోంది.—2 తిమోతి 4:10.
3 మీరు కొనడానికి ఇష్టపడిన డ్రెస్‌ని జాగ్రత్తగా పరిశీలించినట్లే ఈ లోకాన్ని కూడా దయచేసి జాగ్రత్తగా పరిశీలించండి. ‘ఈ విధానపు నాణ్యత ఏమిటి?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ‘లోకము గతించిపోవుచున్నది’ అని బైబిలు చెబుతోంది. (1 యోహాను 2:17) లోకంనుండి వచ్చే ఎటువంటి ఆనందమైనా కేవలం తాత్కాలికమే. అంతేకాక, దైవభక్తిలేని ప్రవర్తనవల్ల గంభీరమైన పర్యవసానాలు అనుభవించవలసి వస్తుంది. అది ప్రయోజనకరమైనది కాదనడంలో సందేహం లేదు. “వ్యర్థంగా గడిపిన యౌవనంవల్ల కలిగిన బాధలు” అని తాను వర్ణించిన బాధలను సహించిన ఒక క్రైస్తవురాలు ఇలా అంటోంది: “లోకం ఉత్తేజకరమైనదిగా కోరదగినదిగా ఆకర్షణీయమైనదిగా కనిపించవచ్చు. దానిలోని వినోదాన్ని మీరు ఎలాంటి బాధ లేకుండానే అనుభవించవచ్చని మీరు నమ్మాలని అది కోరుకుంటుంది. కానీ అది అసాధ్యం. లోకం మిమ్మల్ని వాడుకుంటుంది, దాని అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని విసిరి కొడుతుంది.” * ఇలాంటి తక్కువ స్థాయి జీవితాన్ని జీవించడానికి మీరు మీ యౌవనాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి?
“దుష్టుని నుండి” రక్షణ
4 మనకు ఇవ్వడానికి ఈ లోకం దగ్గర నాణ్యమైనవేవీ లేవని గ్రహించి, యెహోవాసాక్షుల్లోని యౌవనులు ఈ లోకంతో స్నేహం చేయరు. (యాకోబు 4:4) ఆ నమ్మకస్థులైన యౌవనుల్లో మీరు కూడా ఉన్నారా? అలా అయితే మీరు ప్రశంసించదగినవారు. నిజమే, తోటివారి ఒత్తిడిని నిరోధించి, ఇతరుల నుండి వేరుగా ఉన్నట్లు ప్రత్యేకంగా కనబడడం అంత సులభం కాదు, కానీ మీకు సహాయం ఉంది.
5 యేసు మరణించడానికి కొద్ది సమయం ముందు, “దుష్టుని నుండి” తన శిష్యులను “కాపాడుమని” యెహోవాకు ప్రార్థించాడు. (యోహాను 17:15) యేసు అలా కోరడానికి మంచి కారణమే ఉంది. తన శిష్యులు ఏ వయసువారైనప్పటికీ యథార్థమైన మార్గంలో ప్రయాణించడం వారికి సులభం కాదని ఆయనకు తెలుసు. ఎందుకు? ఒక కారణం ఏమిటంటే, యేసు గుర్తించినట్లుగా ఆయన శిష్యులు ఒక శక్తివంతమైన అదృశ్య శత్రువును—‘దుష్టుడైన’ అపవాదియగు సాతానును—ఎదుర్కొంటారు. ఈ దుష్ట ఆత్మ ప్రాణి “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” అని బైబిలు చెబుతోంది.—1 పేతురు 5:8.
6 చరిత్రంతటిలోనూ సాతాను, మానవులను క్రూరాతిక్రూరంగా హింసించడంలో పైశాచిక ఆనందాన్ని పొందాడు. యోబుపై, ఆయన కుటుంబంపై సాతాను తీసుకువచ్చిన ఘోరమైన విపత్తుల గురించి ఆలోచించండి. (యోబు 1:13-19; 2:7) సాతాను క్రూరమైన స్వభావాన్ని ప్రతిబింబించే సంఘటనలకు సంబంధించి మీ జీవితకాలంలో మీరు విన్న వార్తలు బహుశా మీకు గుర్తురావచ్చు. అపవాది వేట కోసం తిరుగుతున్నాడు, ఎవరిని మ్రింగుదునా అని అతను చేస్తున్న అన్వేషణలో అతను యౌవనులను విడిచిపెట్టడు. ఉదాహరణకు సా.శ. మొదటి శతాబ్ద ఆరంభంలో, బేత్లెహేములో రెండు సంవత్సరాలలోపు వయసుగల అబ్బాయిలనందరినీ చంపించడానికి హేరోదు పథకం వేశాడు. (మత్తయి 2:16) బహుశా సాతానే హేరోదును ప్రేరేపించివుంటాడు—దేవుని వాగ్దత్త మెస్సీయాగా ఏదో ఒక రోజు తనపై దేవుని తీర్పు తీర్చే బాలుడిని నాశనం చేయడానికే ఆ కృషి అంతా! (ఆదికాండము 3:15) సాతానుకు యౌవనులంటే ప్రేమ లేదన్నది స్పష్టమౌతోంది. సాధ్యమైనంత ఎక్కువమంది మానవులను మ్రింగివేయాలన్నదే అతని సంకల్పం. ప్రత్యేకించి ఈ కాలంలో అది నిజం ఎందుకంటే సాతాను పరలోకంలోనుండి భూమిపైకి పడద్రోయబడ్డాడు, అతను “తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై” ఉన్నాడు.—ప్రకటన 12:9, 12.
లూకా 1:79) ఆయన ప్రేమకు ప్రతిరూపం. వాస్తవానికి మన సృష్టికర్త ఈ ఘనమైన లక్షణాన్ని ఎంత ఎక్కువగా ప్రదర్శిస్తాడంటే “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు చెబుతోంది. (1 యోహాను 4:8) ఈ లోకపు దేవునికి, మీరు ఆరాధించే ఆధిక్యతగల దేవునికి ఎంత తేడానో కదా! సాతాను మ్రింగడానికి వెదుకుతాడు కానీ యెహోవా “యెవడును నశింపవలెనని యిచ్ఛయింప[డు].” (2 పేతురు 3:9) ఆయన ప్రతీ మానవ జీవితాన్ని—మీ జీవితాన్ని కూడా—విలువైనదిగా దృష్టిస్తాడు. యెహోవా తన వాక్యం ద్వారా, మిమ్మల్ని లోకసంబంధులై ఉండవద్దని ఉద్బోధించినప్పుడు ఆయన మీ జీవితంలోని ఆనందాన్ని నిర్మూలించడానికో మీ స్వేచ్ఛను పరిమితం చేయడానికో ప్రయత్నించడం లేదు. (యోహాను 15:19) బదులుగా ఆయన దుష్టుని నుండి మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఈ లోకంలోని తాత్కాలికమైన ఆనందాల కంటే ఎంతో మెరుగైనది మీకు లభించాలని మీ పరలోక తండ్రి కోరుకుంటున్నాడు. మీరు “వాస్తవమైన జీవము”—పరదైసు భూమిపై నిత్యజీవము—సంపాదించుకోవాలన్నదే ఆయన కోరిక. (1 తిమోతి 6:17-19) మీరు విజయం సాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు, ఆ లక్ష్యాన్ని చేరుకొమ్మని ఆయన మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. (1 తిమోతి 2:4) అంతేకాక, యెహోవా మీకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. అదేమిటి?
7 “బహు క్రోధముగలవాడై”న సాతానుకు పూర్తి భిన్నంగా యెహోవా “మహా వాత్సల్యము”గల వ్యక్తి. (“నా హృదయమును సంతోషపరచుము”
8 మీరు ఎప్పుడైనా మీ ప్రియమైన స్నేహితుని కోసం ఒక బహుమతిని కొని, దాన్ని అందుకున్నప్పుడు మీ స్నేహితుని ముఖం ఆశ్చర్యంతో, కృతజ్ఞతతో వెలిగిపోవడాన్ని చూశారా? ఆ వ్యక్తికి ఎలాంటి బహుమతి బాగుంటుందా అని మీరు బహుశా ఎంతోసేపు ఆలోచించివుండవచ్చు. ఇప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి: మీరు మీ సృష్టికర్తైన యెహోవా దేవునికి ఎలాంటి బహుమతి ఇవ్వగలరు? మొదటిసారి ఆలోచించినప్పుడు, ఆ తలంపే హాస్యాస్పదమైనదిగా అనిపించవచ్చు. సర్వశక్తిగల దేవుడికి సాధారణ మానవుని నుండి ఏమి అవసరముంటుంది? ఆయన దగ్గర ఇప్పటికే లేనిది ఏమైనా మీరు ఇచ్చే అవకాశముందా? సామెతలు 27:11వ వచనంలో బైబిలు ఇలా సమాధానమిస్తోంది: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.”
9 యెహోవాను నిందిస్తున్నది అపవాదియగు సాతాను అని మీరు బైబిలు అధ్యయనం ద్వారా తెలుసుకునే ఉంటారు. దేవుని సేవచేసే ప్రజలు ఆయనమీద ప్రేమతో చేయరు కానీ స్వార్థపూరితమైన కారణాల వల్ల చేస్తారని అతను మొండిగా వాదిస్తున్నాడు. దేవుని సేవకులు కష్టాలు అనుభవిస్తే వారు తక్షణమే సత్యారాధనను వదిలేస్తారని సాతాను ఆరోపిస్తున్నాడు. ఉదాహరణకు సాతాను నీతిమంతుడైన యోబు గురించి యెహోవాకు ఏమి చెప్పాడో పరిశీలించండి: “నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును.”—యోబు 1:10, 11.
10 ఆ బైబిలు వృత్తాంతంలో వెల్లడి చేయబడినట్లు, సాతాను కేవలం యోబు విశ్వసనీయతనే కాక దేవుణ్ణి సేవించే వారందరి విశ్వసనీయతను—మీ విశ్వసనీయతను కూడా—ప్రశ్నించాడు. వాస్తవానికి, మానవజాతి గురించి మాట్లాడుతూ అతను యెహోవాతో ఇలా అన్నాడు: ‘తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు [యోబు మాత్రమే కాక ఎవరైనా సరే] ఇచ్చును గదా.’ (యోబు 2:4) ఈ ప్రాముఖ్యమైన వివాదంలో మీరు మీ పాత్రను గుర్తించారా? సామెతలు 27:11లో సూచించబడినట్లు, యెహోవాకు మీరు ఇవ్వగలిగినది ఒకటి ఉందని ఆయన చెబుతున్నాడు—అది, ఆయనను నిందిస్తున్న సాతానుకు సమాధానమివ్వడానికి ఆధారం. ఒక్కసారి ఊహించుకోండి—అన్నింటికంటే ప్రాముఖ్యమైన వివాదాంశం విషయంలో వ్యక్తిగతంగా సమాధానమివ్వమని విశ్వసర్వాధిపతి మిమ్మల్ని కోరుతున్నాడు. మీకు ఎంతటి అద్భుతమైన బాధ్యత, ప్రత్యేకమైన ఆధిక్యత ఇవ్వబడ్డాయో కదా! యెహోవా మీ నుండి కోరుతున్న దాన్ని మీరు చేయగలరా? యోబు చేశాడు. (యోబు 2:9, 10) యేసు చేశాడు, చరిత్రంతటిలో అనేకమంది యౌవనులతో పాటు లెక్కలేనంత మంది ఇతరులు అలాగే చేశారు. (ఫిలిప్పీయులు 2:8; ప్రకటన 6:9) మీరు కూడా అదే చేయవచ్చు. అయితే ఈ విషయంలో మీరు అనిర్ణీతంగా ఉండే అవకాశం లేదని మాత్రం మరచిపోకండి. మీ చర్యల ద్వారా, మీరు సాతాను నిందకు మద్దతునిస్తున్నారో యెహోవా జవాబుకు మద్దతునిస్తున్నారో చూపిస్తారు. మీరు దేన్ని సమర్థించడానికి ఎంపిక చేసుకుంటారు?
యెహోవా మీ గురించి చింతిస్తున్నాడు!
11 మీరు చేసుకునే ఎంపికను యెహోవా దేవుడు నిజంగా పట్టించుకుంటాడా? ఇప్పటికే ఎంతోమంది నమ్మకంగా కొనసాగడం ద్వారా సాతానుకు సరైన సమాధానం ఇచ్చేందుకు సరిపడేంత ఆధారాన్నివ్వలేదా? నిజమే, యెహోవాను ఏ ఒక్కరూ ప్రేమతో సేవించరని సాతాను వాదించాడు, ఆ నింద అబద్ధమని ఇప్పటికే రుజువైపోయింది. అయినప్పటికీ, సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశంలో మీరు ఆయన పక్షాన ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. “ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు” అని యేసు చెప్పాడు.—మత్తయి 18:14.
12 మీరు ఎంపిక చేసుకునే మార్గం విషయంలో యెహోవాకు ఆసక్తి ఉందన్న విషయం స్పష్టమౌతోంది. దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ ఎంపిక ఆయనను ప్రభావితం చేస్తుంది. మానవులు చేసే మంచి లేదా చెడు పనుల ద్వారా కదిలించబడే లోతైన భావోద్వేగాలు యెహోవాకు ఉన్నాయని బైబిలు స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు ఇశ్రాయేలీయులు పదేపదే తిరుగుబాటు చేసినప్పుడు యెహోవాకు “సంతాపము” కలిగింది. (కీర్తన 78:40, 41) నోవహు కాలంలో జలప్రళయానికి ముందు ‘నరుల చెడుతనము ఎక్కువగా’ ఉన్నప్పుడు యెహోవా “తన హృదయములో నొచ్చుకొ[న్నాడు].” (ఆదికాండము 6:5, 6) ఈ విషయం ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించండి. మీరు తప్పు మార్గాన్ని ఎంపిక చేసుకుంటే మీ సృష్టికర్తను బాధపెడతారు. దానర్థం దేవుడు బలహీనమైన వ్యక్తని లేదా భావోద్వేగాల ద్వారా నియంత్రించబడతాడని కాదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, మీ సంక్షేమం గురించి ఆయనకు శ్రద్ధ ఉందని దాని భావం. మరోవైపు, మీరు సరైనది చేసినప్పుడు యెహోవా హృదయం సంతోషిస్తుంది. సాతానుకు ఆయన మరోసారి సమాధానమిచ్చే అవకాశం ఉన్నందుకు సంతోషించడమే కాక, ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించవచ్చని కూడా ఆయన సంతోషిస్తాడు. అవును ఆయన మిమ్మల్మి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. (హెబ్రీయులు 11:6) యెహోవా దేవుడు ఎంతటి ప్రేమగల తండ్రో కదా!
ఇప్పుడు గొప్ప ఆశీర్వాదాలు
13 యెహోవాను సేవించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కేవలం భవిష్యత్తు కోసమే కాదు. యెహోవాసాక్షుల్లోని అనేకమంది యౌవనులు ఇప్పుడు మంచి కారణంతోనే సంతోషంతో, సంతృప్తితో ఆశీర్వదించబడ్డారు. “యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును” అని కీర్తనకర్త వ్రాశాడు. (కీర్తన 19:8) మనకు ఏది మంచిది అనే విషయం ఏ మానవుడికంటే కూడా యెహోవాకు బాగా తెలుసు. యెషయా ప్రవక్త ద్వారా యెహోవా ఇలా చెప్పాడు: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.”—యెషయా 48:17, 18.
14 బైబిలు సూత్రాలను పాటించడం, మీరు ఎంతో బాధనూ హృదయ ఘోషను నివారించడానికి మీకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, డబ్బును ప్రేమించేవారు “నానాబాధలతో తమ్మును తామే పొడుచు”కొంటారని బైబిలు చెబుతోంది. (1 తిమోతి 6:9, 10) ఈ లేఖనంలో నివేదించబడినట్లు, మీ తోటివారిలో ఎవరైనా డబ్బును ప్రేమించడం వల్ల కఠినమైన పర్యవసానాలను అనుభవించారా? కొంతమంది యువతీ యువకులు తమ దగ్గర లేటెస్ట్ బ్రాండ్ వస్త్రాలు ఉండాలని, తాము అధునాతన సాంకేతిక పరికరాలను ఉపయోగించాలని కోరుకున్నందుకు అప్పుల్లో మునిగిపోయారు. కొనే స్థోమతలేని వస్తువుల కోసం ఎక్కువ వడ్డీలతో దీర్ఘకాలంపాటు కట్టవలసిన ఇన్‌స్టాల్‌మెంట్‌ల భారం మోయడం నిజంగా బాధాకరమైన బానిసత్వం!—సామెతలు 22:7.
15 లైంగిక దుర్నీతి విషయం కూడా ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లెక్కలేనంతమంది అవివాహిత యువతులు గర్భవతులవుతున్నారు. కొందరు తమకు ఇష్టంలేకపోయినా, పెంచే సామర్థ్యం లేకపోయినా పిల్లలను కంటున్నారు. ఇతరులు గర్భస్రావం చేయించుకొని అపరాధ భావాలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా లైంగిక సంబంధాల ద్వారా సంక్రమించే ఎయిడ్స్ వంటి వ్యాధులు సంక్రమించేలా చేసుకున్న యువతీ యువకులు ఉన్నారు. అయితే యెహోవాను తెలుసుకొన్నవారికి మాత్రం, అతి ఘోరమైన పర్యవసానం వారికి యెహోవాతో ఉన్న సంబంధం పాడైపోవడమే. * (గలతీయులు 5:19-21) “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అని బైబిలు చెప్పడానికి మంచి కారణమే ఉంది.—1 కొరింథీయులు 6:18.
‘సంతోషంగల దేవుని’కి సేవచేయడం
16 బైబిలు యెహోవాను “సంతోషంగల దేవుడు” అని వర్ణిస్తోంది. (1 తిమోతి 1:8, NW) మీరు కూడా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. వాస్తవానికి ఆయన సొంత వాక్యమే ఇలా చెబుతోంది: “యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము.” (ప్రసంగి 11:9) కానీ యెహోవా వర్తమానం కంటే ముందుకు చూసి, మంచి ప్రవర్తనకు చెడు ప్రవర్తనకు వచ్చే దీర్ఘకాలిక పర్యవసానాలను గ్రహించగలడు. అందుకే ఆయన మీకిలా ఉద్బోధిస్తున్నాడు: “దుర్దినములు రాకముందే—ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే . . . నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”—ప్రసంగి 12:1, 2.
17 నేడు, అనేకమంది యౌవనులు యెహోవాకు సేవచేయడంలో గొప్ప ఆనందాన్ని పొందుతున్నారు. ఉదాహరణకు 15 సంవత్సరాల లీనా ఇలా అంటోంది: “నాకు ఆత్మవిశ్వాసం, స్వగౌరవం ఉన్నాయి. పొగత్రాగనందుకు, మాదకద్రవ్యాలు వాడనందుకు నా శరీరం ఆరోగ్యవంతంగా ఉంది. సాతాను నుండి వచ్చే విపరీతమైన ఒత్తిడిని తట్టుకోవడానికి నాకు సంఘం విలువైన మార్గనిర్దేశకాలనిస్తుంది. రాజ్యమందిరం వద్ద ఉండే ప్రోత్సాహకరమైన సహవాసం వల్ల నా ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. అన్నింటికంటే ఎక్కువగా, భూమిపై నిరంతరం జీవించే అత్యుత్తమమైన నిరీక్షణ నాకుంది.”
18 లీనావలే చాలామంది క్రైస్తవ యౌవనులు విశ్వాసం కోసం బలంగా పోరాడుతున్నారు, అది వారికి సంతోషాన్ని తెస్తుంది. వారి జీవితానికి—కొన్నిసార్లు ఎన్నో సమస్యలు ఒత్తిళ్ళు ఎదురైనప్పటికీ—నిజమైన సంకల్పం, నిజమైన భవిష్యత్తు ఉన్నాయని వారు గ్రహించారు. కాబట్టి మీ సంక్షేమం గురించి నిజమైన శ్రద్ధ ఉన్న దేవునికి సేవచేయడంలో కొనసాగండి. ఆయన హృదయాన్ని సంతోషపరచండి, ఆయన మీరు ఇప్పుడూ భవిష్యత్తులో నిరంతరమూ సంతోషంగా ఉండేలా చేస్తాడు!—కీర్తన 5:11.
[అధస్సూచీలు]
^ పేరా 6 అక్టోబరు 22, 1996, తేజరిల్లు! (ఆంగ్లం) సంచికలోని “సత్యం నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చింది” అనే ఆర్టికల్ చూడండి.
^ పేరా 22 పశ్చాత్తాపపడి, తప్పు చేయడం మానివేసి, తన పాపాలను ఒప్పుకునే వ్యక్తిని యెహోవా “బహుగా క్షమించును” అని తెలుసుకోవడం ఎంతో ఓదార్పుకరమైన విషయం.—యెషయా 55:7.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
• ‘దుష్టుడైన’ సాతాను నుండి మీకు ఎలాంటి ప్రమాదం ఎదురవుతుంది?
• మీరు యెహోవా హృదయాన్ని ఎలా సంతోషపరచగలరు?
• యెహోవాకు మీపై శ్రద్ధ ఉందని బైబిలు ఎలా చూపిస్తోంది?
• యెహోవాకు సేవచేయడంవల్ల వచ్చే కొన్ని ఆశీర్వాదాలు ఏవి?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) లోకానికి ఆకర్షితులైనంత మాత్రాన మీరు క్రైస్తవులుగా ఉండేందుకు తగనివారని భావమా, వివరించండి. (రోమీయులు 7:21) (బి) ఆసాపు ఉదాహరణనుండి మీరేమి నేర్చుకోవచ్చు? (13వ పేజీలోని బాక్సు చూడండి.)
3. (ఎ) లోకసంబంధమైన విషయాలను అనుసరించడం ఎందుకు వ్యర్థము? (బి) లోకసంబంధమైన విషయాలను అనుసరించడం వ్యర్థమన్న విషయాన్ని ఒక క్రైస్తవురాలు ఎలా వర్ణిస్తోంది?
4, 5. (ఎ) యేసు తన మరణానికి కొద్ది సమయం ముందు యెహోవాకు చేసిన ప్రార్థనలో ఏమి కోరాడు? (బి) ఆ కోరిక ఎందుకు సరైనది?
6. సాతానుకు యౌవనులంటే ప్రేమ లేదని మనకు ఎలా తెలుసు?
7. (ఎ) యెహోవా సాతానుకు పూర్తి భిన్నంగా ఎలా ఉన్నాడు? (బి) మీరు జీవితాన్ని ఆనందించే విషయం గురించి యెహోవా ఎలా భావిస్తాడు?
8, 9. (ఎ) మీరు యెహోవాకు ఎలాంటి బహుమతి ఇవ్వగలరు? (బి) యోబు విషయంలో ఉదహరించబడినట్లు సాతాను యెహోవాను ఎలా నిందిస్తాడు?
10. (ఎ) సాతాను కేవలం యోబు యథార్థతను మాత్రమే ప్రశ్నించలేదని మనకెలా తెలుసు? (బి) సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదంలో మీరు ఎలా చేరివున్నారు?
11, 12. మీరు ఆయనను సేవించాలా వద్దా అనే విషయంలో చేసుకునే ఎంపిక యెహోవాను నిజంగా ప్రభావితం చేస్తుందా? వివరించండి.
13. యెహోవాకు సేవ చేయడం ఇప్పుడు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటుంది?
14. అప్పుల బాధను నివారించడానికి బైబిలు సూత్రాలు మీకు ఎలా సహాయపడవచ్చు?
15. లైంగిక దుర్నీతివల్ల వచ్చే బాధలనుండి బైబిలు సూత్రాలు మిమ్మల్ని ఎలా కాపాడతాయి?
16. (ఎ) మీ యౌవనాన్ని మీరు సంతోషంగా గడపాలని యెహోవా కోరుకుంటున్నాడని మనకెలా తెలుసు? (బి) మీరు పాటించడానికి యెహోవా మార్గనిర్దేశకాలను ఎందుకు ఏర్పాటు చేస్తాడు?
17, 18. ఒక క్రైస్తవ యౌవనురాలు యెహోవాకు సేవచేయడంలో తన సంతోషాన్ని ఎలా వ్యక్తం చేసింది, మీరు కూడా అలాంటి సంతోషాన్ని ఎలా పొందవచ్చు?
[13వ పేజీలోని బాక్సు/చిత్రం]
ఒక నీతిమంతుడు అభ్యంతరపడే పరిస్థితి వచ్చింది
ఆసాపు ప్రాచీన ఇశ్రాయేలులోని యెహోవా ఆలయంలో లేవీ సంగీతకారుల్లో ప్రముఖుడు. ఆయన బహిరంగ ఆరాధనలో ఉపయోగించే పాటలను కూడా కూర్చేవాడు. ఆయనకు ప్రత్యేక సేవాధిక్యతలు ఉన్నప్పటికీ, ఎటువంటి దుష్పరిణామాలు లేకుండానే దేవుని ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్నట్లుగా కనిపించే తన తోటివారి దైవభక్తిలేని ప్రవర్తనకు ఆయన ఆకర్షితుడయ్యాడు. ఆసాపు ఆ తర్వాత ఇలా ఒప్పుకున్నాడు: “నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.”—కీర్తన 73:2, 3.
తర్వాత ఆసాపు దేవుని పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఈ విషయం గురించి ప్రార్థించాడు. పునరుద్ధరించబడిన ఆధ్యాత్మిక దృష్టితో, యెహోవా చెడుతనాన్ని అసహ్యించుకుంటాడనీ కొంతకాలానికి, దుష్టులు నీతిమంతులు తాము విత్తినదాన్ని బట్టే పంటను కోస్తారనీ ఆయన అర్థం చేసుకున్నాడు. (కీర్తన 73:17-20; గలతీయులు 6:7, 8) నిజమే భక్తిహీనులు కాలుజారే చోట ఉన్నారు. చివరికి యెహోవా ఈ భక్తిహీన వ్యవస్థను నాశనం చేసినప్పుడు వారు ఓడిపోతారు.—ప్రకటన 21:8.
[15వ పేజీలోని చిత్రాలు]
యెహోవాకు మీ సంక్షేమం పట్ల నిజమైన శ్రద్ధ ఉంది, కానీ మిమ్మల్ని మ్రింగివేయాలన్నది సాతాను లక్ష్యం
[16వ పేజీలోని చిత్రం]
చాలామంది యౌవనులు తోటి క్రైస్తవులతోపాటు యెహోవాకు సేవచేయడంలో అత్యధికమైన ఆనందాన్ని పొందుతున్నారు