కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనులారా—మీరు చేసిన కార్యమును యెహోవా మరచిపోడు!

యౌవనులారా—మీరు చేసిన కార్యమును యెహోవా మరచిపోడు!

యౌవనులారా​—⁠మీరు చేసిన కార్యమును యెహోవా మరచిపోడు!

“మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”​—⁠హెబ్రీయులు 6:10.

మీరు మీ స్నేహితునికి ఎప్పుడైనా సహాయం చేసినప్పుడు ఆయన మీకు కృతజ్ఞతలు చెప్పలేదా? దయాపూర్వకంగా చేసిన సహాయాన్ని తేలికగా తీసుకున్నా లేక అంతకంటే ఘోరంగా దాన్ని పూర్తిగా మరచిపోయినా అది ఎంతో బాధ కలిగిస్తుంది. అయితే మనం యెహోవాకు హృదయపూర్వకంగా సేవ చేసినప్పుడు అదెంత భిన్నంగా ఉంటుందో కదా! “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 6:​10) దీని భావమేమిటో ఆలోచించండి. నిజానికి యెహోవా సేవలో మీరు చేసినవాటిని, మీరు ఇప్పటికీ చేస్తున్న పనులను గనుక ఆయన మరచిపోయినట్లయితే అది తన తరఫున జరిగిన అన్యాయమైన చర్యగా​—⁠పాపముగా​—⁠ఆయన పరిగణిస్తాడు. ఆయన నిజంగా ప్రశంసించే దేవుడు.​—⁠మలాకీ 3:10.

2 ప్రశంసించే ఈ దేవుణ్ణి ఆరాధించేందుకు, సేవించేందుకు ప్రత్యేకమైన సదవకాశం మీకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 600 కోట్ల మందితో పోలిస్తే మీ తోటి విశ్వాసులు కేవలం దాదాపు 60 లక్షల మంది మాత్రమే ఉన్నారు కాబట్టి మీకున్న ఆధిక్యత నిజంగా అరుదైనదే. అంతేకాక, మీరు సువార్త సందేశాన్ని విని దానికి ప్రతిస్పందిస్తున్నారనే వాస్తవం యెహోవాకు మీపై వ్యక్తిగత శ్రద్ధ ఉందని రుజువు చేస్తోంది. అందుకే “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” అని యేసు అన్నాడు. (యోహాను 6:​44) అవును, క్రీస్తు బలి ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి యెహోవా ప్రతీ వ్యక్తికి సహాయం చేస్తాడు.

మీకు లభించిన గొప్ప ఆధిక్యతకు కృతజ్ఞులై ఉండడం

3 ముందటి ఆర్టికల్‌లో చర్చించబడినట్లు, యెహోవా హృదయాన్ని సంతోషపరిచే ప్రత్యేకమైన స్థానంలో మీరున్నారు. (సామెతలు 27:​11) ఆ స్థానాన్ని మీరు ఎన్నడూ తేలికగా తీసుకోకూడదు. కోరహు కుమారులు వ్రాసిన ప్రేరేపిత కీర్తనల్లోని ఒక కీర్తనలో యెహోవాకు సేవచేసే ఆధిక్యతకు వారు తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. “నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము” అని మనం చదువుతాము.​—⁠కీర్తన 84:10.

4 మీ పరలోక తండ్రికి సేవచేసే మీ ఆధిక్యత గురించి మీరు కూడా అలాగే భావిస్తున్నారా? యెహోవాను ఆరాధించడం మీ స్వేచ్ఛను పరిమితం చేస్తున్నట్లు కొన్నిసార్లు అనిపించవచ్చని ఒప్పుకోవలసిందే. నిజమే బైబిలు సూత్రాలకు అనుగుణంగా జీవించడానికి కొంత త్యాగం చేయాల్సివస్తుంది. అయితే యెహోవా మీ నుండి అడిగేవన్నీ మీ ప్రయోజనార్థమే. (కీర్తన 1:​1-3) అంతేకాక యెహోవా మీ కృషిని చూసి, మీ విశ్వసనీయతకు తన ప్రశంసను ప్రకటిస్తాడు. నిజమే యెహోవా “తన్ను వెదకువారికి ఫలము దయచేయువా[డు]” అని పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 11:⁠6) మీకు అలా ఫలము ఇవ్వడానికి యెహోవా అవకాశాల కోసం చూస్తున్నాడు. ప్రాచీన ఇశ్రాయేలులోని నీతిమంతుడైన ఒక ప్రవక్త ఇలా నివేదించాడు: “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.”​—⁠2 దినవృత్తాంతములు 16:⁠9.

5 మీ హృదయం పూర్తిగా యెహోవా వైపు ఉందని చూపించడానికి అత్యుత్తమమైన మార్గాల్లో ఒకటి, ఆయన గురించి ఇతరులతో మాట్లాడడం. మీ తోటి విద్యార్థుల్లో కొందరితో మీ విశ్వాసం గురించి మాట్లాడే అవకాశం మీకెప్పుడైనా లభించిందా? అలా చేయడానికి మొదట ధైర్యం చాలకపోవచ్చు, ఆ తలంపే మిమ్మల్ని కొంచెం భయపెట్టవచ్చు. ‘వారు నన్ను చూసి నవ్వితే అప్పుడెలా? నాది ఒక విచిత్రమైన మతమని వారు భావిస్తే ఎలా?’ అని మీరు ప్రశ్నించవచ్చు. రాజ్య సందేశాన్ని అందరూ వినరని యేసు అంగీకరించాడు. (యోహాను 15:​20) అయితే దాని భావం, మీరు ఎగతాళి చేయబడుతూ తిరస్కరించబడుతూ జీవించాలని కాదు. దానికి భిన్నంగా అనేకమంది యౌవన సాక్షులు, వినడానికి ఇష్టపడేవారిని కనుగొన్నారు, తమ నమ్మకాలకు కట్టుబడి ఉండడం ద్వారా వారు తమ తోటివారి నుండి ఎక్కువ గౌరవాన్ని కూడా సంపాదించుకున్నారు.

“యెహోవా మీకు సహాయం చేస్తాడు”

6 కానీ మీ విశ్వాసం గురించి మాట్లాడడానికి మీరు ధైర్యాన్ని ఎలా కూడదీసుకోగలరు? ప్రజలు మీ మతం గురించి మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు నిజాయితీగా నిర్మొహమాటంగా సమాధానం చెప్పాలని ఎందుకు తీర్మానించుకోకూడదు? పదిహేడేళ్ళ జెన్నిఫర్‌ అనుభవాన్ని పరిశీలించండి. “నేను స్కూల్లో లంచ్‌ చేస్తున్నాను. నా టేబుల్‌ దగ్గర కూర్చున్న అమ్మాయిలు మతం గురించి మాట్లాడుకుంటున్నారు, వారిలో ఒక అమ్మాయి నీది ఏ మతం అని నన్ను అడిగింది” అని ఆమె చెబుతోంది. సమాధానం చెప్పడానికి జెన్నిఫర్‌ భయపడిందా? ఆమె ఇలా ఒప్పుకుంటోంది: “అవును, నేను భయపడ్డాను ఎందుకంటే వాళ్ళెలా ప్రతిస్పందిస్తారో నాకు తెలియదు.” అయితే జెన్నిఫర్‌ ఏమి చేసింది? “నేను ఒక యెహోవాసాక్షినని ఆ అమ్మాయిలకు చెప్పాను. మొదట వారు ఆశ్చర్యపోయినట్లు అనిపించింది. యెహోవాసాక్షులు విచిత్రమైన ప్రజలనే అభిప్రాయం వారికున్నట్లు అనిపించింది. ఆ అపోహ వల్లనే వారు నన్ను ప్రశ్నలు అడిగారు, వారికున్న తప్పుడు అభిప్రాయాల్లో కొన్నింటిని నేను స్పష్టం చేయగలిగాను. ఆ తర్వాత కూడా కొంతమంది అమ్మాయిలు అప్పుడప్పుడు నన్ను ప్రశ్నలు అడగడానికి నా దగ్గరకు వచ్చేవారు” అంటూ ఆమె వివరించింది.

7 తన నమ్మకాల గురించి మాట్లాడే అవకాశాన్ని ఉపయోగించుకున్నందుకు జెన్నిఫర్‌ ఆ తర్వాత బాధపడిందా? ఎంతమాత్రం బాధపడలేదు! “లంచ్‌ టైమ్‌ అయిపోయిన తర్వాత నేను చాలా సంతోషించాను. నిజానికి యెహోవాసాక్షులు ఎవరు అనే విషయం గురించి ఇప్పుడు ఆ అమ్మాయిలకు సరైన అవగాహన ఉంది” అని ఆమె చెబుతోంది. జెన్నిఫర్‌ ఇప్పుడు ఇస్తున్న సలహా ఎంతో సులభమైనది: “తోటి విద్యార్థులకు లేదా టీచర్లకు సాక్ష్యమివ్వడం కష్టంగా అనిపిస్తే వెంటనే చిన్న ప్రార్థన చేసుకోండి. యెహోవా మీకు సహాయం చేస్తాడు. సాక్ష్యమిచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నందుకు మీరు ఆనందిస్తారు.”​—⁠1 పేతురు 3:15.

8 మీ విశ్వాసం గురించి సాక్ష్యమిచ్చే అవకాశం దానంతటదే మీ ముందుకు వచ్చినప్పుడు యెహోవాకు ‘వెంటనే చిన్న ప్రార్థన చేయాలి’ అని జెన్నిఫర్‌ సిఫార్సు చేయడాన్ని గమనించండి. పారసీక రాజైన అర్తహషస్తకు పానదాయకుడైన నెహెమ్యాకు ఊహించని పరిస్థితి ఎదురైనప్పుడు ఆయన సరిగ్గా అదే చేశాడు. యూదులు పడుతున్న కష్టాల గురించి, యెరూషలేము ద్వారము దాని గోడలు శిథిలమై ఉండడం గురించి నెహెమ్యాకు తెలియడం వల్ల అతను విచారముగా కనిపించాడు. నెహెమ్యా వ్యాకులతతో ఉన్నాడని గమనించిన రాజు, ఏమి జరిగిందని నెహెమ్యాను అడిగాడు. సమాధానం చెప్పేముందు నెహెమ్యా మార్గనిర్దేశం కోసం ప్రార్థించాడు. తర్వాత ఆయన యెరూషలేముకు వెళ్ళి శిథిలమైన పట్టణాన్ని పునర్నిర్మించడానికి అనుమతినిమ్మని ధైర్యంగా కోరాడు. అర్తహషస్త ఆయన కోరికను మన్నించాడు. (నెహెమ్యా 2:​1-8) దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మీ విశ్వాసం గురించి సాక్ష్యమిచ్చే అవకాశం వచ్చినప్పుడు మీకు భయమనిపిస్తే, మౌనంగా ప్రార్థించే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. ‘యెహోవా మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి’ అని పేతురు వ్రాశాడు.​—⁠1 పేతురు 5:7; కీర్తన 55:22.

‘సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడు సిద్ధముగా ఉండండి’

9 మరో అనుభవాన్ని పరిశీలించండి. పదమూడేళ్ళ లేయా స్కూల్లో లంచ్‌ టైమ్‌లో యువత అడిగే ప్రశ్నలు​—⁠ఆచరణాత్మకమైన సమాధానములు (ఆంగ్లం) * పుస్తకాన్ని చదువుతోంది. “ఇతరులు నన్ను గమనించారు, కాస్సేపటికి ఒక గుంపు వచ్చి నా చుట్టూ నిలబడి నేను చదువుతున్నదాన్ని చూడడం ప్రారంభించారు. ఆ పుస్తకం దేని గురించి అని వారు నన్ను ప్రశ్నించడం మొదలెట్టారు” అని ఆమె చెబుతోంది. సాయంకాలానికల్లా నలుగురు అమ్మాయిలు తమకు యువత అడిగే ప్రశ్నలు పుస్తకం కావాలని లేయాను అడిగారు. త్వరలోనే ఈ అమ్మాయిలు ఆ పుస్తకాన్ని ఇతరులకు చూపించడంతో వారు కూడా తమకొక కాపీ కావాలని అడిగారు. తర్వాతి కొన్ని వారాల్లో లేయా తన తోటి విద్యార్థులకు, వారి స్నేహితులకు యువత అడిగే ప్రశ్నలు పుస్తకం 23 ప్రతులను అందించింది. తాను చదువుతున్న పుస్తకం గురించి మొదట్లో ప్రశ్నించినప్పుడు వారికి సమాధానం చెప్పడం లేయాకు సులభమనిపించిందా? లేదు! “మొదట్లో నేను భయపడ్డాను” అని ఆమె ఒప్పుకుంటోంది. “కానీ నేను ప్రార్థన చేసుకున్నాను, యెహోవా నాతో ఉన్నాడని నాకు తెలుసు” అని ఆమె చెబుతోంది.

10 లేయా అనుభవం, సిరియాకు బంధీగా తీసుకెళ్ళబడిన ఇశ్రాయేలీయురాలైన యౌవనురాలిని మీకు గుర్తు చేయవచ్చు. ఆ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. సిరియా సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠురోగి. బహుశా ఆయన భార్య సంభాషణను ప్రారంభించివుండవచ్చు, అది ఈ యౌవనస్థురాలిని తన విశ్వాసం గురించి మాట్లాడడానికి పురికొల్పివుండవచ్చు. “షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయు[ను]” అని ఆమె చెప్పింది.​—⁠2 రాజులు 5:1-3.

11 ఈ యౌవనురాలి ధైర్యం ఫలితంగా, “ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతటియందును మరియొక దేవుడు లేడని” నయమాను తెలుసుకున్నాడు. “యెహోవాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను” అని కూడా ఆయన తీర్మానించుకున్నాడు. (2 రాజులు 5:15, 17) యెహోవా ఈ యౌవనురాలి ధైర్యాన్ని ఖచ్చితంగా ఆశీర్వదించాడు. ఆయన నేటి యౌవనులను కూడా అలాగే ఆశీర్వదించగలడు, ఆశీర్వదిస్తాడు. లేయాకు అలాంటి అనుభవమే కలిగింది. కొంతకాలానికి ఆమె తోటి విద్యార్థుల్లో కొందరు ఆమె దగ్గరకు వచ్చి యువత అడిగే ప్రశ్నలు పుస్తకం తమకు తమ ప్రవర్తనను మెరుగుపరచుకోవడానికి సహాయం చేస్తోందని చెప్పారు. “యెహోవా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, తమ జీవితాన్ని మార్చుకోవడానికి నేను ఇతరులకు సహాయపడుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను” అని లేయా చెబుతోంది.

12 జెన్నిఫర్‌కు, లేయాకు కలిగినటువంటి అనుభవాలు మీకు కూడా కలుగవచ్చు. క్రైస్తవులుగా మీరు “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉం[డండి]” అని పేతురు ఇచ్చిన సలహాను పాటించండి. (1 పేతురు 3:​15) మీరు దాన్ని ఎలా చేయవచ్చు? “బహు ధైర్యముగా” ప్రకటించడానికి తమకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించిన మొదటి శతాబ్దపు క్రైస్తవుల మాదిరిని అనుకరించండి. (అపొస్తలుల కార్యములు 4:​29, 30) తర్వాత మీ నమ్మకాల గురించి ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి. అలా చేయడం వల్ల వచ్చే ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. అంతేకాక మీరు యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తారు.

వీడియోలు, ప్రత్యేకమైన ప్రాజెక్టులు

13 చాలామంది యౌవనులు వీడియోలను ఉపయోగించి తమ విశ్వాసం గురించి తోటి విద్యార్థులకు లేదా టీచర్లకు వివరించారు. కొన్నిసార్లు, స్కూలు ప్రాజెక్టులు కూడా యెహోవాకు ఘనతను తీసుకువచ్చే అవకాశాలను కల్పించాయి. ఉదాహరణకు యెహోవాసాక్షులైన ఇద్దరు పదిహేనేళ్ళ అబ్బాయిలకు ప్రపంచ చరిత్రలో భాగంగా ప్రపంచంలోని మతాల్లో ఒకదానిపై రిపోర్టు వ్రాసే నియామకం లభించింది. వీరిద్దరు కలిసి యెహోవాసాక్షులు​—⁠దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకాన్ని తమ సమాచార మూలంగా ఉపయోగించి తమ రిపోర్టును వ్రాశారు. * వారు ఐదు నిమిషాల మౌఖిక రిపోర్టును కూడా చెప్పవలసి ఉండింది. ఆ తర్వాత వారి ఉపాధ్యాయుడూ ఇతర విద్యార్థులూ ఎన్నో ప్రశ్నలు అడగడం వల్ల వారు మరో 20 నిమిషాలు క్లాస్‌ ఎదుట నిలబడి సమాధానం చెప్పవలసి వచ్చింది. అప్పటి నుండి అనేక వారాల వరకు వారి తోటి విద్యార్థులు యెహోవాసాక్షుల గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు!

14 పైన ప్రస్తావించబడిన అనుభవాలు ఉదహరించినట్లు, యెహోవాసాక్షుల్లో ఒకరిగా మీ నమ్మకాల గురించి ఇతరులకు తెలియజేయడం ద్వారా గొప్ప ఆశీర్వాదాలను అనుభవించవచ్చు. ఇతరులు యెహోవా గురించి తెలుసుకునేలా వారికి సహాయం చేయడంలో ఆనందించే ఆధిక్యతను మనుష్య భయం వల్ల కోల్పోకండి. “భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును” అని బైబిలు నివేదిస్తోంది.​—⁠సామెతలు 29:25.

15 క్రైస్తవ యౌవనులుగా మీ దగ్గర మీ తోటి వారికి ఎంతో అవసరమైనది ఒకటి​—⁠ఇప్పుడు జీవించడానికి అత్యుత్తమమైన మార్గం, భవిష్యత్తులో నిరంతరం జీవిస్తారనే వాగ్దానం​—⁠ఉందని గుర్తుంచుకోండి. (1 తిమోతి 4:⁠8) ఆసక్తికరమైన విషయమేమిటంటే అమెరికాలో​—⁠ఈ దేశంలో సాధారణంగా ప్రజలు మతం విషయంలో అనాసక్తంగా లేదా లౌకికంగా ఆలోచిస్తారని మీరు అనుకోవచ్చు​—⁠నిర్వహించబడిన ఒక సర్వేలో కనీసం సగంమంది యౌవనులు మతం గురించి చాలా గంభీరంగా ఆలోచిస్తున్నారని, మూడవ వంతు మతపరమైన విశ్వాసం తమ జీవితంలో “అత్యంత ప్రాముఖ్యమైన ప్రభావంగా ఉంది” అని చెబుతున్నారని వెల్లడయ్యింది. ప్రపంచంలోని అనేక ఇతర భాగాల్లో కూడా పరిస్థితి అదే విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు బైబిలు గురించి చెప్పే విషయాలను మీ స్కూల్లోని తోటి విద్యార్థులు వినడానికి ఇష్టపడే అవకాశం ఉంది.

యౌవనులుగా యెహోవాకు సన్నిహితమవ్వండి

16 అయితే యెహోవా హృదయాన్ని సంతోషపరచడంలో కేవలం ఇతరులతో ఆయన గురించి మాట్లాడడం కంటే ఎక్కువే ఉంది. ఆయన ప్రమాణాలకు అనుగుణంగా మీరు మీ ప్రవర్తనను కూడా మార్చుకోవాలి. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (1 యోహాను 5:⁠3) మీరు యెహోవాకు సన్నిహితమైతే అది నిజమేనని మీరు గ్రహిస్తారు. దాన్ని మీరెలా చేయవచ్చు?

17 బైబిలును, బైబిలు ఆధారిత ప్రచురణలను చదవడానికి సమయం తీసుకోండి. మీరు యెహోవా గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, ఆయనకు విధేయత చూపించడం, ఆయన గురించి ఇతరులతో మాట్లాడడం అంత సులభంగా ఉంటాయి. “సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును” అని యేసు చెప్పాడు. (లూకా 6:​45) కాబట్టి మీ హృదయాన్ని మంచి విషయాలతో నింపుకోండి. ఈ విషయంలో లక్ష్యాలను ఎందుకు ఏర్పరచుకోకూడదు? బహుశా వచ్చేవారం సంఘ కూటాలకు సిద్ధపడడాన్ని మీరు మెరుగుపరచుకోవచ్చు. క్లుప్తంగానే అయినా హృదయపూర్వకంగా వ్యాఖ్యానించడం ద్వారా కూటంలో భాగం వహించడమనేది మీ తర్వాతి లక్ష్యం కావచ్చు. అయితే మీరు నేర్చుకుంటున్న విషయాలను ఆచరణలో పెట్టడం కూడా ప్రాముఖ్యమే.​—⁠ఫిలిప్పీయులు 4:⁠9.

18 యెహోవాకు సేవచేయడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు దీర్ఘకాలికమైనవి​—⁠నిజానికి అవి నిత్యమూ నిలిచేవి. యెహోవాసాక్షులుగా ఉండడం వల్ల మీరు అప్పుడప్పుడు కొంత వ్యతిరేకతను లేదా ఎగతాళిని అనుభవించే అవకాశముందన్నది నిజమే. కానీ మోషే గురించి ఆలోచించండి. “అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 11:​24-26) యెహోవా గురించి నేర్చుకోవడానికి, ఆయన గురించి ఇతరులతో మాట్లాడడానికి మీరు చేసే కృషి విషయంలో ఆయన మీకు ప్రతిఫలమిస్తాడని మీరు కూడా దృఢంగా విశ్వసించవచ్చు. అవును ఆయన ‘మీరు చేసిన కార్యమును, తన నామమునుబట్టి చూపిన ప్రేమను’ ఎన్నటికీ మరచిపోడు.​—⁠హెబ్రీయులు 6:10.

[అధస్సూచీలు]

^ పేరా 14 యెహోవాసాక్షులు ప్రచురించినది.

^ పేరా 19 యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• యెహోవా మీ సేవను విలువైనదిగా ఎంచుతాడని మీరు ఎందుకు నిశ్చయత కలిగివుండవచ్చు?

• స్కూల్లో సాక్ష్యమివ్వడానికి ఉపయోగించగల ఏ పద్ధతులు విజయవంతంగా ఉన్నాయని కొందరు తెలుసుకున్నారు?

• మీ తోటి విద్యార్థులకు సాక్ష్యమివ్వడానికి మీరు ఎలా బలపరచబడవచ్చు?

• మీరు యెహోవాకు ఎలా సన్నిహితులు కావచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యెహోవా మీ సేవను ప్రశంసిస్తాడని బైబిలు పుస్తకాలైన హెబ్రీయులు, మలాకీ ఎలా చూపిస్తున్నాయి?

2. యెహోవాకు సేవ చేయడం ఎందుకు నిజంగా ప్రత్యేకమైనది?

3. యెహోవాకు సేవచేసే ఆధిక్యతకు కోరహు కుమారులు తమ కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేశారు?

4. (ఎ) యెహోవాను ఆరాధించడం తమ స్వేచ్ఛను పరిమితం చేస్తుందని కొందరు భావించడానికి కారణం ఏమిటి? (బి) తన సేవకుల పనులను గమనించడానికి, వారికి ప్రతిఫలము ఇవ్వడానికి తనకు ఆసక్తి ఉందని యెహోవా ఎలా చూపిస్తాడు?

5. (ఎ) మీ హృదయం పూర్తిగా యెహోవా వైపే ఉందని చూపించడానికి అత్యుత్తమమైన మార్గాల్లో ఒకటి ఏమిటి? (బి) మీ విశ్వాసం గురించి ఇతరులతో మాట్లాడడం ఎందుకు కష్టమనిపించవచ్చు?

6, 7. (ఎ) పదిహేడేళ్ళ ఒక అమ్మాయి తన తోటి విద్యార్థులకు ఎలా సాక్ష్యమివ్వగలిగింది? (బి) జెన్నిఫర్‌ అనుభవం నుండి మీరేమి నేర్చుకున్నారు?

8. (ఎ) నెహెమ్యాకు ఊహించని పరిస్థితి ఎదురైనప్పుడు ప్రార్థన ఆయనకు ఎలా సహాయం చేసింది? (బి) మీరు స్కూల్లో క్లుప్తంగా, మౌనంగా యెహోవాకు ప్రార్థించే అవసరం ఏర్పడగల కొన్ని పరిస్థితులు ఏవి?

9. పదమూడేళ్ళ లేయా, యువత అడిగే ప్రశ్నలు పుస్తకం 23 ప్రతులను ఎలా అందించగలిగింది?

10, 11. సిరియా సైన్యాధిపతి యెహోవా గురించి తెలుసుకోవడానికి ఇశ్రాయేలీయురాలైన ఒక యౌవనురాలు ఎలా సహాయం చేయగలిగింది, ఆ తర్వాత ఆయన ఎలాంటి మార్పులు చేసుకున్నాడు?

12. మీ విశ్వాసం గురించి ప్రశ్నించేవారికి సమాధానము చెప్పడానికి మీరు ఎలా బలపరచబడవచ్చు?

13. కొంతమంది యౌవనులు సాక్ష్యమివ్వడానికి ఎలాంటి అవకాశాలను ఉపయోగించుకున్నారు? (20, 21వ పేజీల్లోని బాక్సులను చూడండి.)

14, 15 (ఎ) మనుష్య భయం ఎందుకు ఒక ఉరివంటిది? (బి) మీ నమ్మకాల గురించి ఇతరులకు తెలియజేసే విషయంలో మీరు ఎందుకు ధైర్యంగా ఉండాలి?

16. యెహోవాను సంతోషపరచడంలో భాగంగా, ఆయన గురించి ఇతరులతో మాట్లాడడంతోపాటు ఇంకా ఏమి చేయాలి?

17. మీరు యెహోవాకు ఎలా సన్నిహితులు కావచ్చు?

18. మీరు కొంత వ్యతిరేకతను అనుభవించినప్పటికీ, మీరు దేని విషయంలో దృఢ నమ్మకంతో ఉండవచ్చు?

[20వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

చిన్నపిల్లలు కూడా యెహోవాను స్తుతిస్తున్నారు!

చిన్నపిల్లలు కూడా స్కూల్లో సాక్ష్యమివ్వగలుగుతున్నారు. ఈ అనుభవాలను పరిశీలించండి.

పదేళ్ళ ఆంబర్‌ ఐదవ తరగతి చదువుతోంది. ఒకరోజు ఆమె క్లాస్‌లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదులపై జరిగిన నాజీ దాడికి సంబంధించిన పుస్తకం చదివారు. ఊదారంగు త్రికోణాలు (ఆంగ్లం) వీడియోను తన టీచర్‌కు చూపించాలని ఆంబర్‌ నిర్ణయించుకుంది. నాజీ పరిపాలనా కాలంలో యెహోవాసాక్షులు కూడా హింసించబడ్డారని తెలుసుకొన్న ఆమె టీచర్‌ ఆశ్చర్యపోయింది. టీచర్‌ ఆ వీడియోను క్లాసంతటికీ చూపించింది.

ఎనిమిదేళ్ళ ఎలెక్సా, తాను క్రిస్మస్‌ వేడుకలో ఎందుకు పాల్గొనలేదో వివరిస్తూ తన క్లాస్‌కు ఒక ఉత్తరం వ్రాసింది. టీచర్‌ ఎంత ప్రభావితురాలయ్యిందంటే, ఆ ఉత్తరాన్ని ఎలెక్సా తన క్లాస్‌లో, రెండు ఇతర క్లాసుల్లో చదివి వినిపించే ఏర్పాట్లు చేసింది! “నా నమ్మకాలకు భిన్నమైన నమ్మకాలున్నవారితో గౌరవపూర్వకంగా వ్యవహరించాలని నాకు నేర్పించబడింది, క్రిస్మస్‌ వేడుక చేసుకోకూడదనే నా నిర్ణయాన్ని మీరు గౌరవించినందుకు మీకు నా కృతజ్ఞతలు” అని ఎలెక్సా తన ఉత్తరం ముగింపులో చెప్పింది.

ఎరిక్‌ ఒకటో తరగతిలో చేరిన కొద్దికాలానికి నా బైబిలు కథల పుస్తకమును స్కూలుకు తీసుకువెళ్ళి, దాన్ని తన తోటి విద్యార్థులకు చూపించడానికి అనుమతి కోరాడు. ఆ అబ్బాయి టీచర్‌ “నాకు మరో మంచి ఐడియా ఉంది” అని చెప్పి, “నువ్వు ఆ పుస్తకంలోని ఒక కథ క్లాస్‌లో చదివి ఎందుకు వినిపించకూడదు?” అని అడిగింది. ఎరిక్‌ అలాగే చదివాడు. ఆ తర్వాత ఆ పుస్తకం కావాలని ఇష్టపడేవారందరినీ చెయ్యి ఎత్తమని కోరాడు. టీచర్‌తో సహా పద్దెనిమిది మంది తమ చేతులను ఎత్తారు! ఇప్పుడు సాక్ష్యమివ్వడానికి తనకు ప్రత్యేకమైన సొంత క్షేత్రం ఉందని ఎరిక్‌ భావిస్తున్నాడు.

యెహోవాసాక్షులు మరియు విద్య * (ఆంగ్లం) అనే బ్రోషుర్‌ పట్ల తొమ్మిదేళ్ళ విట్నీ ఎంతో కృతజ్ఞతతో ఉంది. “సాధారణంగా ప్రతీ సంవత్సరం మా అమ్మ ఈ బ్రోషుర్‌ను నా టీచర్లకు ఇస్తుంది, కానీ ఈ సంవత్సరం నేనే స్వయంగా ఇచ్చాను” అని ఆమె చెబుతోంది. “ఆ బోషుర్‌వల్ల మా టీచర్‌ నన్ను ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద వీక్‌’గా నామినేట్‌ చేసింది.”

[అధస్సూచి]

^ పేరా 56 ప్రస్తావించబడిన ప్రచురణలన్నీ యెహోవాసాక్షులు ఉత్పత్తి చేసినవి.

[21వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

కొందరు తమ విశ్వాసం గురించి మాట్లాడడానికి ఉపయోగించుకున్న సందర్భాలు

స్కూల్లో ఏదైనా నివేదిక లేదా ప్రాజెక్ట్‌ తయారుచేయడానికి నియమించబడినప్పుడు, కొందరు తాము సాక్ష్యమివ్వడానికి వీలయ్యే అంశాన్ని ఎంపిక చేసుకున్నారు

చాలామంది యౌవనులు, క్లాస్‌లో చర్చించబడుతున్న విషయానికి సంబంధించిన వీడియోను లేదా ప్రచురణను తమ టీచర్‌కు ఇచ్చారు

కొంతమంది యౌవనులు విరామ సమయంలో బైబిలును లేదా బైబిలు ఆధారిత ప్రచురణను చదువుతున్నప్పుడు, ఇతర యౌవనులు వారి దగ్గరికి వచ్చి ప్రశ్నలు అడిగారు

[18వ పేజీలోని చిత్రం]

యౌవనులు యెహోవాకు సేవచేసేలా, అనుభవం గలవారు వారికి శిక్షణనివ్వవచ్చు