కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొందరు జవాబులు పొందిన విధానము

కొందరు జవాబులు పొందిన విధానము

కొందరు జవాబులు పొందిన విధానము

కో ట్లమంది ప్రార్థిస్తారు. వాళ్ళలో కొంతమంది తమ ప్రార్థనలకు జవాబులు దొరికాయని నమ్ముతారు. మరికొందరు తమ ప్రార్థనలు అసలు ఆలకించబడ్డాయో లేదోనని సందేహిస్తుంటారు. ఇంకొందరైతే జవాబుల కోసం స్వయంగా వెదకుతారు కానీ తమ విన్నపాలను ప్రార్థనలో దేవుని ఎదుట పెట్టాలని ఆలోచించరు.

సత్య దేవుడు “ప్రార్థన ఆలకించువా[డు]” అని బైబిలు తెలియజేస్తోంది. (కీర్తన 65:⁠2) మీరు ప్రార్థిస్తున్నట్లయితే, మీరు సత్య దేవునికే ప్రార్థిస్తున్నారని నమ్మకంగా చెప్పగలరా? మీ ప్రార్థనలు ఆయన జవాబిచ్చేలా ఉన్నాయా?

ఈ భూమిపై అన్ని ప్రాంతాల్లోని అనేకమందికి దాని జవాబు అవును అనే రుజువైంది! వారు జవాబులను ఎలా పొందారు? వారేమి నేర్చుకున్నారు?

దేవుడెవరు?

క్రైస్తవ సన్యాసినుల, మతగురువుల దగ్గర విద్యాభ్యాసం చేసిన, పోర్చుగల్‌కు చెందిన ఒక ఉపాధ్యాయురాలు తన మతాన్ని యథార్థంగానే అనుసరించింది. కానీ చర్చిలో మార్పులు జరిగి, చాలా ముఖ్యమైనవిగా తనకు బోధించిన ఆచారాలను అది విడనాడడంతో ఆమె తికమక పడింది. ఆమె మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు పాశ్చాత్యుల ఆరాధనా విధానాల గురించి తెలుసుకుంది, దానితో సత్య దేవుడు ఉన్నాడా లేడా అన్న సందేహం ఆమెలో మొదలయ్యింది. ఇప్పుడు ఆమె ఎలా ఆరాధించాలి? ఆమె బైబిలులోని విషయాల గురించి తన మతగురువును అడిగినప్పుడు ఆమె ప్రశ్నలు తోసివేయబడ్డాయి, దానితో ఆమె నిరాశచెందింది.

ఆ ఉపాధ్యాయురాలు ఉన్న నగరంలో, యెహోవాసాక్షులతో మాట్లాడవద్దని తమ చర్చి సభ్యులను హెచ్చరిస్తూ క్యాథలిక్‌ చర్చి ఒక కరపత్రాన్ని పంచిపెట్టింది. కానీ ఆమె సందేహాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఒకరోజు ఆమె ఇంటికి ఒక యెహోవాసాక్షి వచ్చినప్పుడు ఆమె విని, ఆసక్తి చూపించింది. ఆమె వారితో మాట్లాడడం అదే మొదటిసారి.

ఆమె తనలోని అనేక సందేహాలకు జవాబుల కోసం, సాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించింది. ప్రతివారం ఆమె ప్రశ్నలతో నిండివున్న ఒక పొడవైన లిస్టు పట్టుకొని ఎదురుచూస్తుండేది. దేవుని పేరు ఏమిటి, సత్య దేవుడు ఒక్కడే ఉన్నాడా, ఆయన ఆరాధనలో విగ్రహాలను ఆమోదిస్తాడా వంటివేకాక ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఆమె కోరుకుంది. ఆమె తాను జవాబులన్నీ బైబిలు నుండే పొందానని, అవి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు కావని గ్రహించి ఎంతో ఆశ్చర్యపోయింది, తాను నేర్చుకుంటున్న వాటిని బట్టి సంతోషించింది. క్రమేణా ఆమె తనలోని అనేక సందేహాలకు జవాబులను పొందింది. “యథార్థముగా ఆరాధించువారు” ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారని యేసు చెప్పిన రీతిలోనే ఆమె నేడు యెహోవాను ఆరాధిస్తోంది.​—⁠యోహాను 4:​23.

శ్రీలంకలోని ఒక కుటుంబ సభ్యులు ప్రతిరోజూ కలిసి బైబిలు చదువుతారు, కానీ వారు ప్రాముఖ్యమైన అనేక ప్రశ్నలకు జవాబులను పొందలేకపోయారు. వారికి సహాయం అవసరమైనప్పటికీ వారి మతగురువు ఎలాంటి సహాయమూ చేయలేదు. అయితే యెహోవాసాక్షులు వారిని సందర్శించి సహాయకరమైన బైబిలు సాహిత్యాన్ని ఇచ్చివెళ్ళారు. ఆ తర్వాత, ఆ కుటుంబానికిగల బైబిలు సందేహాలకు యెహోవాసాక్షులు సంతృప్తికరమైన జవాబులు ఇవ్వడంతో, వారు బైబిలు అధ్యయనం చేయడానికి ఒప్పుకున్నారు. అధ్యయనాల్లో వారు నేర్చుకున్నది వారిలో చాలా ఆసక్తి కలిగించింది.

అయితే చిన్నప్పుడు చర్చిలో నేర్చుకున్న సిద్ధాంతాలు ఆ ఇంటి ఇల్లాలి హృదయంలో బలంగా నాటుకుపోవడంతో అవి, తండ్రే “అద్వితీయ సత్యదేవు[డు]” అని యేసు స్వయంగా చెప్పిన విషయాన్ని గ్రహించకుండా ఆమెను అడ్డుకున్నాయి. (యోహాను 17:​1, 3) యేసు తన తండ్రితో సమానుడని ఆ “మర్మం” గురించి ప్రశ్నించకూడదని ఆమెకు బోధించబడింది. నిరాశపడిన ఆమె యెహోవా పేరు ఉపయోగించి, యేసు ఎవరో తనకు తెలియజేయమని యథార్థంగా ప్రార్థించింది. ఆ తర్వాత ఆమె సంబంధిత లేఖనాలను జాగ్రత్తగా మరోసారి పరిశీలించింది. (యోహాను 14:​28; 17:​20, 21; 1 కొరింథీయులు 8:​5, 6) ఇప్పుడామె కంటిలోనుండి పొరలు తొలగిపోయినట్లు యెహోవాయే నిజమైన దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త, యేసుక్రీస్తుకి తండ్రి అని స్పష్టంగా చూడగలిగింది.​—⁠యెషయా 42:⁠8; యిర్మీయా 10:​10-12.

ఎందుకీ బాధలు?

యోబు అతి తీవ్రమైన కష్టాలను అనుభవించాడు. ఆయన పిల్లలందరూ తుఫానులో మరణించారు, ఆస్తి మొత్తం కోల్పోయి బీదవాడయ్యాడు. ఆయన చాలా బాధకరమైన వ్యాధిని కూడా అనుభవించాడు, అబద్ధ స్నేహితుల ఒత్తిడిని సహించాడు. వీటన్నింటి మధ్య యోబు కొన్ని అనాలోచిత వ్యాఖ్యలు చేశాడు. (యోబు 6:⁠3) కానీ దేవుడు పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నాడు. (యోబు 35:​15) యోబు హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు కాబట్టి యోబుకు కావలసిన సలహాను అందించాడు. ఆయన నేడు కూడా ప్రజలకు సలహాలను అందిస్తాడు.

మొజాంబిక్‌లోని కాస్ట్రో పదేండ్ల వయసులో తన తల్లిని కోల్పోయాడు. ఆయన ఎంతో క్రుంగిపోయాడు. “ఆమె ఎందుకు చనిపోవాలి, మమ్మల్నెందుకు వదిలెయ్యాలి?” అని ఆయన అడిగాడు. ఆయన దేవుడంటే భయభక్తులుగల తల్లిదండ్రుల చేతుల్లోనే పెరిగినప్పటికీ, ఇప్పుడు ఆయనకు పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆయన మనసును హృదయాన్ని ఏది ఓదార్చగలదు? ఆయన చిచెవా భాషలోవున్న ఒక చిన్న బైబిలు చదవడం ద్వారా, దాన్ని తన అన్నదమ్ములతో చర్చించడం ద్వారా ఓదార్పు పొందాడు.

తన తల్లి చనిపోవడానికి కారణం దేవుడు చేసిన అన్యాయం కాదనీ, జన్మతః వచ్చిన అపరిపూర్ణతే దానికి కారణమనీ కాస్ట్రో క్రమంగా అర్థం చేసుకున్నాడు. (రోమీయులు 5:​12; 6:​23) పునరుత్థానం గురించిన బైబిలు వాగ్దానం ఆయనకు గొప్ప ఓదార్పునిచ్చింది, ఎందుకంటే ఆయన తన తల్లిని మళ్ళీ చూస్తాననే నమ్మకానికి ఆధారాన్ని బైబిలులో చూశాడు. (యోహాను 5:​28, 29; అపొస్తలుల కార్యములు 24:​14) విషాదకరంగా ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు ఆయన తండ్రికూడా చనిపోయాడు. అయితే కాస్ట్రో ఈసారి కలిగిన లోటును స్థైర్యంగా తట్టుకోగలిగాడు. నేడు ఆయన యెహోవాను ప్రేమిస్తూ తన జీవితాన్ని దేవుని సేవలోనే విశ్వసనీయంగా ఉపయోగిస్తున్నాడు. ఆయన పొందిన ఆనందం ఆయన గురించి తెలిసిన వారందరికీ స్పష్టంగా కనబడుతుంది.

తమ ప్రియమైనవారిని కోల్పోయిన చాలామంది, కాస్ట్రోకు ఓదార్పునిచ్చిన బైబిలు సత్యాలతోనే ఓదార్పునొందారు. దుర్మార్గుల చర్యల వలన తీవ్రమైన కష్టాలను అనుభవించిన కొందరు యోబు అడిగినట్లే ఇలా అడుగుతారు: “దుర్మార్గులు చాలాకాలం బతుకుతారెందుకు?” (యోబు 21:⁠7, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) దేవుడు తన వాక్యం ద్వారా చెబుతున్న దాన్ని ప్రజలు నిజంగా విన్నప్పుడు, దేవుడు విషయాలతో వ్యవహరించే విధానం వాస్తవానికి తమకే ప్రయోజనం చేకూరుస్తుందని తెలుసుకుంటారు.​—⁠2 పేతురు 3:⁠9.

అమెరికాలో పెరిగిన బార్బర, యుద్ధం వల్ల కలిగే బీభత్సాలను స్వయంగా అనుభవించలేదు. కానీ ఆమె ప్రపంచమంతా యుద్ధంలో మునిగివున్న కాలాల్లోనే పెరిగింది. వార్తల్లో రోజూ యుద్ధ నివేదికలు ప్రచురించబడుతుండేవి. ఆమె స్కూల్లో చదువుకుంటున్నప్పుడు, చరిత్రలోని సంఘటనలు ఊహాకందని రీతిలో ఎలా సంభవించాయో తెలుసుకొని దిగ్భ్రాంతి చెందింది. అలా జరగడానికి బాధ్యులెవరు? జరుగుతున్నదాని గురించి దేవుడేమైనా పట్టించుకుంటున్నాడా? దేవుడున్నాడని ఆమె నమ్మింది, కానీ ఆయన గురించి ఆమెకు అస్పష్టమైన భావాలుండేవి.

అయితే బార్బర యెహోవాసాక్షులతో సహవాసం చేయడం వలన, జీవితం పట్ల ఆమెకున్న దృక్పథం క్రమంగా మారిపోయింది. వారు చెప్పేది ఆమె విన్నది, వారితో బైబిలు అధ్యయనం చేసింది. రాజ్యమందిరంలో కూటాలకు హాజరయ్యింది. వారు జరుపుకునే ఒక పెద్ద సమావేశానికి కూడా ఆమె హాజరయ్యింది. అంతేకాదు ఆమె తన సందేహాలను వెలిబుచ్చినప్పుడు, ఒక్కొక్క సాక్షి ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని ఆమె గమనించింది. వారి ఆలోచన బైబిలు ఆధారమైనది కాబట్టి సాక్షులందరూ ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ లోకము దాని పరిపాలకుని చేత అంటే అపవాదియైన సాతాను చేత ప్రభావితమైనదనడానికి, సాతాను స్ఫూర్తినే ప్రతిబింబిస్తోందనడానికి రుజువును సాక్షులు బైబిలులో నుండి చూపించారు. (యోహాను 14:​30; 2 కొరింథీయులు 4:⁠4; ఎఫెసీయులు 2:​1-3; 1 యోహాను 5:​19) బార్బరను దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటనలు బైబిలులో ముందే చెప్పబడ్డాయని వారు వివరించారు. (దానియేలు 2, 7, 8 అధ్యాయాలు) తాను చూడాలనుకున్నప్పుడు భవిష్యత్తులోకి చూసే సామర్థ్యం దేవునికి ఉంది కాబట్టి వాటి గురించి ఆయన ముందే చెప్పాడు. ఆ సంఘటనల్లో కొన్నింటిని దేవుడే జరిగేలా చేశాడు. మరి కొన్ని జరిగేందుకు ఆయన కేవలం అనుమతించాడు. మన కాలంలోని మంచి, చెడు సంఘటనల గురించి కూడా బైబిలు ముందుగానే తెలియజేస్తోందనీ వాటి భావం వివరిస్తోందనీ సాక్షులు బార్బరకు చూపించారు. (మత్తయి 24:​3-14) వారు నీతి ప్రబలమై, బాధలు గతించిపోయే నూతన లోకము గురించిన బైబిలు వాగ్దానాలను ఆమెకు చూపించారు.​—⁠2 పేతురు 3:​13; ప్రకటన 21:⁠3, 4.

మానవుల బాధలకు యెహోవా దేవుడు బాధ్యుడు కాడనీ, తన ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసే మానవుల చేత బలవంతంగా తన ఆజ్ఞలను పాటింపజేసి బాధలను నివారించడనీ బార్బర క్రమంగా అర్థంచేసుకోగలిగింది. (ద్వితీయోపదేశకాండము 30:​19, 20) మనం నిత్యం సంతోషంగా జీవించగలిగే ఏర్పాట్లను దేవుడు చేశాడు, అయితే మనం ఆయన నీతియుక్తమైన మార్గాలకు అనుగుణంగా జీవిస్తామో లేదో నిరూపించుకునే సదవకాశాన్ని ఇప్పుడు మనకిస్తున్నాడు. (ప్రకటన 14:​6, 7) దేవుడు ఏమి కోరుతున్నాడో తెలుసుకోవడానికి, వాటి ప్రకారం జీవించడానికి బార్బర నిశ్చయించుకుంది. యేసు తన నిజమైన శిష్యులకు గుర్తింపు చిహ్నంగా ఉంటుందని చెప్పినటువంటి ప్రేమను కూడా ఆమె యెహోవాసాక్షుల మధ్య చూసింది.​—⁠యోహాను 13:​34, 35.

ఆమెకు సహాయపడిన ఏర్పాట్ల ద్వారా మీరు కూడా ప్రయోజనం పొందవచ్చు.

అర్థవంతమైన జీవితం

జీవితం సంతృప్తికరంగా సాగుతోందనుకునేవారు కూడా తమను తికమక పెట్టే సందేహాలకు జవాబుల కోసం వెదకుతుండవచ్చు. ఉదాహరణకు బ్రిటన్‌కు చెందిన మాథ్యూ అనే యువకుడు, సత్య దేవుని గురించీ జీవిత సంకల్పం గురించీ తెలుసుకోవాలని ఎప్పుడూ పరితపించేవాడు. మాథ్యూ 17వ యేట ఆయన తండ్రి మరణించాడు. ఆ తర్వాత ఆయన సంగీతంలో పట్టా సంపాదించుకున్నాడు. తదనంతరం భౌతికపరమైన తన జీవనశైలి నిరర్థకమైనదని ఆయన గ్రహించాడు. దానితో ఆయన ఇల్లు వదిలేసి లండన్‌లో ఉండేందుకు వెళ్ళిపోయాడు, అక్కడ ఆయన మత్తుపదార్థాలు, నైట్‌క్లబ్బులు, జ్యోతిశ్శాస్త్రం, అభిచారం, జేన్‌ బుద్ధిజమ్‌, ఇతర తాత్త్విక పద్ధతులు వంటివాటికి పరిచితుడయ్యాడు​—⁠ఇవన్నీ ఆయన సంతృప్తికరమైన జీవనశైలిని వెదకడం కోసమే చేశాడు. నిరాశపడిన ఆయన సత్యాన్ని కనుగొనడానికి సహాయం చేయమని దేవుణ్ణి వేడుకున్నాడు.

రెండు రోజుల తర్వాత మాథ్యూ ఒక పాత స్నేహితుడ్ని కలిశాడు, అప్పుడు తన గోడంతా ఆయనతో వెళ్ళబోసుకున్నాడు. ఆయన యెహోవాసాక్షులతో అధ్యయనం చేసిన వ్యక్తి. ఆయన మాథ్యూకు 2 తిమోతి 3:​1-5 చూపించినప్పుడు, మన చుట్టుపక్కలనున్న ప్రపంచం గురించి బైబిలు అంత ఖచ్చితంగా వర్ణించడం చూసి మాథ్యూ అబ్బురపడ్డాడు. కొండమీది ప్రసంగం చదివినప్పుడు ఆయన హృదయం పరవశించిపోయింది. (మత్తయి 5-7 అధ్యాయాలు) మాథ్యూ అంతకుముందు యెహోవాసాక్షులను విమర్శించే కొంత సమాచారాన్ని చదవడం మూలంగా కూటాలకు హాజరవడానికి మొదట సంకోచించాడు, కానీ చివరకు సమీపంలోని రాజ్యమందిరంలో కూటాలకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నాడు.

మాథ్యూ తాను విన్నదాన్ని బట్టి ఆనందించి, ఒక సంఘ పెద్దతో బైబిలు అధ్యయనం చేయడం ఆరంభించాడు. తాను ఇప్పుడు నేర్చుకుంటున్నదే ఇంతకాలం తాను వెదకుతున్నదని, అది తన ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబని ఆయన త్వరలోనే గ్రహించాడు. యెహోవాను అసంతృప్తిపరచే అలవాట్లను వదిలేస్తుండగా ఆయన ఎన్నో ప్రయోజనాలు పొందాడు. ఆయన ఆరోగ్యకరమైన దైవభక్తిని అలవరచుకొంటుండగా, దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా జీవించేందుకు పురిగొల్పబడ్డాడు. అలాంటి జీవితానికి నిజమైన అర్థమున్నదని మాథ్యూ తెలుసుకున్నాడు.​—⁠ప్రసంగి 12:​13.

ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించిన మాథ్యూ గానీ ఇతరులు గానీ సంతృప్తికరమైన జీవితం పొందుతారని ముందుగానే నిర్ణయించబడలేదు. కానీ వారు యెహోవా దేవునికి ఒక ప్రేమపూర్వక సంకల్పం ఉందని, ఆయన ఆజ్ఞలను శిరసావహించడానికి సంతోషంగా ముందుకువచ్చే వారందరికీ అది వర్తిస్తుందని తెలుసుకున్నారు. (అపొస్తలుల కార్యములు 10:​34, 35) ఆ సంకల్పంలో యుద్ధము లేని, అనారోగ్యము ఆకలి నుండి విముక్తి పొందిన, చివరకు మరణం నుండి కూడా విడుదలైన లోకంలో నిత్యజీవము పొందడం ఒక భాగం. (యెషయా 2:⁠4; 25:​6-8; 33:​24; యోహాను 3:​16) మీరూ అదే కోరుకుంటున్నారా? అలాగైతే యెహోవాసాక్షులు తమ రాజ్యమందిరాల్లో జరుపుకునే బైబిలు ఆధారిత కూటాలకు హాజరవడం ద్వారా, సంతృప్తికరమైన జీవితానికి కీలకాన్ని కనుక్కోవడం గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. అందుకు మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు.

[7వ పేజీలోని చిత్రం]

దేవుని నామము ఉపయోగిస్తూ ఆయనకు హృదయపూర్వకంగా ప్రార్థించండి

[7వ పేజీలోని చిత్రం]

 బిలులో ఉన్నదానినే బోధించేవారితో బైబిలు అధ్యయనం చేయండి

[7వ పేజీలోని చిత్రాలు]

రాజ్యమందిరంలో కూటాలకు హాజరవండి

[4వ పేజీలోని చిత్రసౌజన్యం]

హైకర్‌: Chad Ehlers/Index Stock Photography