కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై” ఉండండి

“నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై” ఉండండి

“నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై” ఉండండి

“నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ మనస్సాక్షి చెప్పేది వినండి” అనే సలహాను మనం తరచూ వింటుంటాము. కానీ మన మనస్సాక్షి ఆధారపడదగినదిగా ఉండాలంటే మంచేదో చెడేదో తెలిసివుండేలా దానికి సరైన శిక్షణనివ్వాలి, అది మనల్ని ఎక్కడకు నడిపిస్తుందో మనకు బాగా తెలిసివుండాలి.

బైబిలులో నమోదు చేయబడిన జక్కయ్య అనే వ్యక్తి అనుభవాన్ని పరిశీలించండి. యెరికో పట్టణంలో నివసించే జక్కయ్య సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు. ఆయన తాను బలవంతంగా డబ్బు వసూలు చేయడంవల్ల​—⁠ఇలా చేయడం ఖచ్చితంగా ఇతరులకు బాధ కలిగిస్తుంది​—⁠ధనం సంపాదించుకున్నానని స్వయంగా ఒప్పుకున్నాడు. జక్కయ్య చేసిన అన్యాయానికి ఆయన మనస్సాక్షి ఆయనను కలతపెట్టిందా? ఒకవేళ అదలా చేసివుంటే, బహుశా ఆయన దానిని నిర్లక్ష్యం చేసివుంటాడు.​—⁠లూకా 19:1-7.

అయితే జక్కయ్య తన జీవిత విధానాన్ని తిరిగి పరిశీలించుకునేలా చేసిన పరిస్థితి ఆయనకు ఎదురయ్యింది. ఒకరోజు యేసు యెరికోకు వచ్చాడు. పొట్టివాడైన జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు, కానీ జనసమూహం వల్ల చూడలేకపోయాడు. కాబట్టి ఆయన ముందుగా పరుగెత్తి, యేసును చూడడానికి ఒక చెట్టెక్కాడు. జక్కయ్య కనబరచిన అత్యంతాసక్తిని బట్టి ప్రభావితుడైన యేసు ఆయన ఇంటికి వచ్చి ఆయనను సందర్శిస్తానని ఆయనకు చెప్పాడు. ప్రఖ్యాతి గాంచిన తన అతిథికి జక్కయ్య సంతోషంగా ఆతిథ్యమిచ్చాడు.

యేసు సహవాసంలో జక్కయ్య చూసిన విషయాలు, విన్న విషయాలు ఆయన హృదయాన్ని స్పృశించి, తన మార్గాలను మార్చుకోవడానికి ఆయనను పురికొల్పాయి. ఆయనిలా ప్రకటించాడు: “ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతు[ను].”​—⁠లూకా 19:⁠8.

జక్కయ్య మనస్సాక్షికి జ్ఞానోదయం కలిగింది, ఆయన దాని మాట విని దానికి స్పందించాడు. అందువల్ల వచ్చిన మంచి ఫలితాలు ఎంతో ప్రభావవంతమైనవి. “నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది” అని యేసు ఆయనతో చెప్పినప్పుడు జక్కయ్య ఎలా భావించివుంటాడో ఊహించుకోండి!​—⁠లూకా 19:⁠9.

ఎంతటి ప్రోత్సాహకరమైన ఉదాహరణో కదా! మనం గతంలో ఎలాంటి మార్గాన్ని అనుసరించినప్పటికీ మనం మారవచ్చని అది చూపిస్తోంది. జక్కయ్యలాగే మనం, బైబిలులో నమోదు చేయబడిన యేసు మాటలను లక్ష్యపెట్టి మంచేదో చెడేదో గ్రహించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అప్పుడు మనం అపొస్తలుడైన పేతురు ఉద్బోధించినట్లు “నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై” ఉండవచ్చు. మనం శిక్షణపొందిన మన మనస్సాక్షి మాట విని సరైనది చేయవచ్చు.​—⁠1 పేతురు 3:​15, 16.