పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
ఒక క్రైస్తవుడికి ఏవైనా స్వరాలు వినిపిస్తుంటే, ఆయనకు దయ్యం పట్టిందనే నిర్ధారణకు రావాలా?
లేదు. దయ్యాలు ఆ విధంగా మాట్లాడతాయని నివేదికలు చూపిస్తున్నాయి కానీ అలా స్వరాలు వినిపించడం లేదా వర్ణించలేని కలతపెట్టే అనుభవాలు కలగడం వంటివి అనుభవించిన అనేకమందిని పరిశోధించిన తర్వాత వారికి వైద్యపరమైన సమస్య ఉందని తేలింది.
మొదటి శతాబ్దంలో కూడా, దయ్యం పట్టిన వ్యక్తులూ శారీరకంగా అనారోగ్యం పాలైన వ్యక్తులూ కొన్నిసార్లు ఒకే విధమైన లక్షణాలను కనబరుస్తారని గ్రహించారన్నది స్పష్టమౌతోంది. మత్తయి 17:14-18 వచనాల్లో మనం యేసు స్వస్థపరచిన ఒక యౌవనుడి గురించి చదువుతాము. ఆ యౌవనుడు తీవ్రమైన మూర్ఛరోగానికి సంబంధించిన లక్షణాలను ప్రదర్శించినప్పటికీ నిజానికి ఆయనకు దయ్యం పట్టింది. అయితే దానికంటే ముందు ఒక సందర్భంలో, ప్రజలు బాధపడుతున్నవారిని స్వస్థత కోసం యేసు వద్దకు తీసుకువచ్చినప్పుడు వారిలో కొందరు ‘దయ్యముపట్టినవారు, చాంద్రరోగులు’ ఉన్నారు. (మత్తయి 4:24) అంటే కొంతమంది చాంద్రరోగులు దయ్యముపట్టినవారు కాదు అన్నది స్పష్టమౌతోంది. వారి సమస్యలు వైద్యపరమైనవి.
ఒక రకమైన మతి భ్రమణ వ్యాధితో—ఈ వ్యాధిని చాలామట్టుకు మందులతో నయం చేయవచ్చు—బాధపడే కొంతమందికి స్వరాలు వినిపిస్తాయనీ లేదా వారిలో అసహజమైన ఇతర లక్షణాలు కనిపిస్తాయనీ నివేదించబడింది. * ఇతర శారీరక పరిస్థితులు కూడా మానసిక గందరగోళానికి దారితీయవచ్చు, అవి దయ్యాల మూలంగా కలుగుతున్నాయని కొందరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా తమకు స్వరాలు వినిపిస్తున్నాయనీ లేదా కలవరపెట్టే ఇతర అనుభవాలు కలుగుతున్నాయనీ తెలియజేసినప్పుడు ఆయనకు దయ్యం పట్టిందని నిర్ధారించుకునే ముందు ఆయన అనుభవిస్తున్నవాటికి ఇతర శారీరక అనారోగ్యం కారణమేమో తెలుసుకోవడానికి వైద్యుణ్ణి సంప్రదించమని తప్పకుండా ప్రోత్సహించాలి.
[అధస్సూచీలు]
^ పేరా 5 కావలికోట సహ పత్రిక అయిన తేజరిల్లు! (ఆంగ్లం) సెప్టెంబరు 8, 1986 సంచికలో వచ్చిన “మానసిక అనారోగ్యానికి సంబంధించిన రహస్యాన్ని ఛేదించడం” అనే ఆర్టికల్ చూడండి.