కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విదేశాల్లోని క్రైస్తవ సహోదరులకు వారు సేవచేస్తున్నారు

విదేశాల్లోని క్రైస్తవ సహోదరులకు వారు సేవచేస్తున్నారు

విదేశాల్లోని క్రైస్తవ సహోదరులకు వారు సేవచేస్తున్నారు

“అం తర్జాతీయ సేవకులు,” “అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకులు” అనే పదాలను మీరు విన్నారా? అంతర్జాతీయ సేవకులుగా సేవచేసే ఈ యెహోవాసాక్షులు బైబిలులోని రాజ్య సందేశాన్ని ముద్రించి, దాన్ని పంపిణీ చేసేందుకు ఉపయోగించే భవనాల నిర్మాణంలో సహాయం చేయడానికి తమ సమయాన్ని, సామర్థ్యాలను ఉపయోగిస్తారు. ఇలాంటి స్వచ్ఛంద సేవకులు బైబిలు ఉపదేశానికి కేంద్రస్థానాలుగా ఉపయోగపడే సమావేశ హాళ్ళు, రాజ్య మందిరాల నిర్మాణ పనిలో కూడా సహాయం చేస్తారు. ప్రస్తుతం ఈ స్వచ్ఛంద సేవకులు 34 దేశాల్లోని, ప్రాముఖ్యంగా పరిమితమైన వనరులుగల దేశాల్లోని నిర్మాణ ప్రాజెక్టుల్లో సహాయం చేస్తున్నారు. ఇలాంటి పరిచారకులు విదేశాల్లోని క్రైస్తవ సహోదరులకు సేవ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన సవాళ్ళను ఎదుర్కొంటారు, ఎలాంటి ఆనందాలను అనుభవిస్తారు? వారు చేస్తున్న పరిశుద్ధ “సేవ” గురించి ఎలా భావిస్తారు? (ప్రకటన 7:9, 15) అది తెలుసుకోవడానికి, మెక్సికోలో సేవచేసిన కొంతమంది స్వచ్ఛంద సేవకులను మనం కలుద్దాం.

విదేశాల నుండి స్వచ్ఛంద సేవకులు మొదటిసారిగా 1992వ సంవత్సరం మే నెలలో మెక్సికో వెళ్ళారు. ఆ తర్వాత వెంటనే, మెక్సికోలోని యెహోవాసాక్షుల కార్యకలాపాలను పర్యవేక్షించే బ్రాంచి విస్తరణకు సంబంధించిన నిర్మాణ పనిలో వారు ప్రముఖ పాత్ర వహించారు. బ్రాంచి కార్యాలయాన్ని విస్తరింపజేసే ప్రాజెక్టులో, బ్రాంచి కార్యాలయంలో సేవచేసే స్వచ్ఛంద సేవకులు నివసించడానికి గదులు, ఒక ముద్రణాలయం, ఒక ఆఫీసు భవనంతోపాటు 14 కొత్త భవనాలను నిర్మించాలి.

ఈ నిర్మాణ ప్రాజెక్టులో సహాయం చేయడానికి కెనడా, గ్రేట్‌ బ్రిటన్‌, అమెరికా, ఇతర దేశాల నుండి వచ్చిన 730 కంటే ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులు, మెక్సికోలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన వందలాది స్వచ్ఛంద సేవకులతో కలిసి ఐక్యంగా సేవచేశారు. అంతేకాక, బ్రాంచి కార్యాలయానికి దగ్గర్లోవున్న ప్రాంతాల్లోని 1,600 సంఘాలతో సహవసిస్తున్న 28,000 కంటే ఎక్కువమంది సాక్షులు వారాంతాల్లో నిర్మాణ పనుల్లో సహాయం చేశారు. అందరూ ఇష్టపూర్వకంగా, ఉచితంగా తమ నైపుణ్యాలను ఉపయోగించి సేవచేశారు. యెహోవాకు ఆ విధంగా సేవచేయడాన్ని వారు ఒక ఆధిక్యతగా ఎంచారు. నిర్మాణ ప్రాజెక్టు అంతటిలోనూ వారు కీర్తన 127:1 వచనంలోని ఈ ప్రేరేపిత మాటలను మనస్సులో ఉంచుకున్నారు: “యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.”

వారు ఎదుర్కొన్న సవాళ్ళు

విదేశీ నియామకంలో సేవ చేస్తున్నప్పుడు అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకులు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటారు? వారు చేసిన కొన్ని వ్యాఖ్యానాలను పరిశీలించండి. అమెరికా నుండి వచ్చిన కర్టిస్‌, సాలీ అనే వివాహిత జంట ఇండియా, జర్మనీ, జాంబియా, మెక్సికో, పరాగ్వే, రష్యా, రుమేనియా, సెనెగల్‌ దేశాల్లోని నిర్మాణ ప్రాజెక్టుల్లో సహాయం చేశారు. కర్టిస్‌ ఇలా తెలియజేస్తున్నాడు: “మాకు ఎదురైన మొదటి సవాలు, పయినీరు సేవ [పూర్తికాల పరిచర్య] చేస్తున్న మా కూతురిని, మిన్నెసొటాలోని మా సంఘాన్ని వదిలి రావడం. నా భార్యా నేను 24 సంవత్సరాలపాటు ఆ సంఘంతో సహవసించాము, మాకు అక్కడ బాగుండేది.”

సాలీ ఇలా చెప్పింది: “కొత్త పరిస్థితుల్లో జీవించడం ఒక సవాలు, బహుశా అది ఒక పురుషుడి కంటే స్త్రీకి మరింత కష్టంగా ఉంటుంది, కానీ నేను దానికి సర్దుకుపోవడం సాధ్యమేనని నేర్చుకున్నాను. నేను ఎన్నో కీటకాలను సహించడం కూడా నేర్చుకున్నాను!” ఆమె ఇంకా ఇలా చెప్పింది: “ఒక దేశంలోనైతే పదిమంది స్వచ్ఛంద సేవకులం కలిసి వంటగదిలేని, కేవలం రెండే స్నానాల గదులున్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్నాము. అక్కడ నేను మరింత సహనంతో ఉండడం అలవర్చుకున్నాను.”

కొత్త భాష నేర్చుకోవడమనేది మరో సవాలు, దానికి కృషి, వినయం అవసరం. వివిధ దేశాల్లో తన భర్తతో పాటు నిర్మాణ ప్రాజెక్టుల్లో సేవచేసిన షారన్‌ ఇలా చెబుతోంది: “మీరు సేవచేస్తున్న దేశ భాష తెలియకపోవడం ఒక సవాలే. మొదట్లో, మీరు మీ భావాలను సులభంగా వ్యక్తం చెయ్యలేనప్పుడు మీ ఆధ్యాత్మిక సహోదర సహోదరీలకు సన్నిహితమవడం కష్టం. అది చాలా నిరుత్సాహపరుస్తుంది. కానీ విదేశీ నియామకాల్లో మేము కలిసే సహోదరులు ఎంతో ఓర్పుగలవారు, వారు మా సంక్షేమం విషయంలో ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎక్కువకాలం గడవకముందే మాకు ఆ దేశ భాష తెలియకపోయినా మేము ఏదో ఒక విధంగా సంభాషించడం ప్రారంభించాము.”

పరిచర్యలో భాగం వహించడానికి ధైర్యం అవసరం

ఇలాంటి స్వయంత్యాగపూరిత స్వచ్ఛంద సేవకులు నిర్మాణ పనిని వృద్ధి చేయడానికి ఎంతో సహాయం చేస్తున్నప్పటికీ తాము మొదటిగా మరింత ప్రాముఖ్యంగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలసిన ప్రచారకులమని వారు గుర్తిస్తారు. కాబట్టి వారు సహవసించే సంఘాలు చేస్తున్న ప్రకటనా పనికి వారు పూర్తి మద్దతునిస్తారు. గ్వాడెలోప్‌, మలావీ, మెక్సికో, నైజీరియా దేశాల్లోని నిర్మాణ ప్రాజెక్టుల్లో సహాయం చేసిన ఓకా, ఇంగ్‌మేరీ అనే వివాహిత జంట విదేశంలో క్షేత్ర పరిచర్యలో భాగం వహించేటప్పుడు మరో భాషలో మాట్లాడడానికి ధైర్యం అవసరం అని ఒప్పుకుంటున్నారు.

ఇంగ్‌మేరీ ఇలా చెబుతోంది: “మొదట్లో మేము క్షేత్ర పరిచర్యలో చాలా పరిమితంగా పాల్గొనేవాళ్ళం ఎందుకంటే మేము ఎప్పుడూ స్థానిక సాక్షులతో పాటు వెళ్ళేవాళ్ళం, పరిచర్యలో మాట్లాడడానికి సిగ్గుపడి మేము వారినే మాట్లాడమనేవాళ్ళం. అయితే ఒక రోజు ఉదయం కేవలం మేమిద్దరమే క్షేత్ర పరిచర్యకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. మాకు చాలా భయనిపించినప్పటికీ మేము వెళ్ళాము. మేము ఒక యువతిని కలిశాము, నేను సిద్ధం చేసుకున్న అందింపును ఆమె విన్నది. నేను ఒక లేఖనం చదివి, సాహిత్యం అందించాను. తర్వాత ఆ యువతి, ‘దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. నా బంధువుల్లో ఒకరు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తున్నారు. నేను కూడా అధ్యయనం చేయాలంటే ఏమి చెయ్యాలి?’ అని అడిగింది. ఆశ్చర్యంతో నా నోట మాట రాలేదు. తర్వాత నేను నా ఆశ్చర్యాన్ని అణచుకొని ఆమెతో నేను అధ్యయనం చేస్తానని చెప్పాను.”

ఇంగ్‌మేరీ ఇంకా ఇలా చెబుతోంది: “మేము తీసుకొన్న చొరవను, సత్యాన్ని ఇతరులతో పంచుకోవాలనే మా కోరికను యెహోవా ఆశీర్వదించినందుకు నేను ఎంతో సంతోషించాను, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాను.” ఆ స్త్రీ చక్కని అభివృద్ధి సాధించి మెక్సికో పట్టణంలో ఒక జిల్లా సమావేశంలో యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకుంది. ఓకా, ఇంగ్‌మేరీ తమ పరిచర్య గురించి క్లుప్తంగా ఇలా చెబుతున్నారు: “వివిధ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి మా నియామకాలను మేము ఎంతో విలువైనవిగా ఎంచుతాము కానీ ఒక వ్యక్తి సత్యాన్ని అంగీకరించడానికి సహాయపడినప్పుడు కలిగే ఆనందమూ సంతృప్తీ సాటిలేనివి.”

స్వయంత్యాగపూరితమైన స్ఫూర్తి

స్వచ్ఛంద సేవకులు విదేశాల్లోని సహోదరులకు సేవచేయడానికి తమ కుటుంబాన్ని, స్నేహితులను విడిచిపెట్టి ఎన్నో త్యాగాలు చేస్తారన్నది నిజమే కానీ వారు సాటిలేని ఆనందాన్ని కూడా అనుభవిస్తారు. అదేమిటి?

అంగోలా, ఈక్వెడార్‌, ఎల్‌ సాల్వడార్‌, కొలంబియా, గయానా, ప్యూర్టోరికో, మెక్సికో దేశాల్లో తన భార్య పమేలాతోపాటు సేవచేసిన హోవార్డ్‌ ఇలా వివరిస్తున్నాడు: “వివిధ దేశాల్లోని సహోదర సహోదరీలను కలిసి, మన అంతర్జాతీయ సహోదరత్వంలోని ప్రేమ బంధాన్ని స్వయంగా అనుభవించడమనేది ఒక ఆధిక్యత. మనం తరచూ దాని గురించి చదువుతాము కానీ వివిధ సంస్కృతులకు, వివిధ నేపథ్యాలకు చెందిన ఇతరులతో కలిసి జీవించినప్పుడు వారితో కలిసి సేవచేసినప్పుడు అమూల్యమైన మన సహోదరత్వాన్ని మరింత విలువైనదిగా ఎంచుతారు.”

ఈక్వెడార్‌, కొలంబియా, కోస్టరికా, మెక్సికో, జాంబియా దేశాల్లోని నిర్మాణ ప్రాజెక్టుల్లో సహాయం చేసిన గ్యారీ కూడా ఈ పని తనకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని భావిస్తున్నాడు. ఆయన ఇలా చెబుతున్నాడు: “నేను నియమించబడిన దేశాల్లోని బ్రాంచి కార్యాలయాల్లో సేవచేస్తున్న పరిణతిగల సహోదరులతో సహవసించడం వల్ల ఇన్ని సంవత్సరాల్లో నాకు లభించిన శిక్షణ, నా నియామకాల్లోని సవాళ్ళను ఎదుర్కోవడానికి నేను మరింత సిద్ధంగా ఉండడానికి సహాయపడింది. అది నా విశ్వాసాన్ని ఎంతో బలపరచింది ఎందుకంటే, యెహోవా దేవుని ప్రపంచవ్యాప్త సంస్థకు గుర్తింపు చిహ్నంగావున్న ఐకమత్యాన్ని​—⁠భాష, జాతి, సంస్కృతుల్లోని తేడాలకు అతీతమైన ఐకమత్యాన్ని​—⁠అనుభవించేందుకు అది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.”

మెక్సికోలో నిర్మాణ కార్యక్రమం పూర్తి చేయబడింది, విస్తరించబడిన బ్రాంచి సౌకర్యాలను ఈ సంవత్సరం ప్రతిష్ఠించారు. యెహోవాపై తమకున్న ప్రేమ ద్వారా ప్రేరేపించబడిన అంతర్జాతీయ సేవకులు, అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకులు మెక్సికోలో అలాగే ఇతర ప్రాంతాల్లో సత్యారాధన విస్తరించడానికి ఎంతో మద్దతునిచ్చారు. విదేశాల్లోని తమ క్రైస్తవ సహోదరులకు సేవచేయడానికి వారు చూపించిన ఇష్టపూర్వకమైన, స్వయంత్యాగపూరితమైన స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగావున్న యెహోవాసాక్షులు ఎంతో ప్రశంసిస్తారు.

[25వ పేజీలోని చిత్రం]

ఈక్వెడార్‌

[25వ పేజీలోని చిత్రం]

కొలంబియా

[25వ పేజీలోని చిత్రం]

అంగోలా

[26వ పేజీలోని చిత్రం]

బ్రాంచిలోని ఉద్యానవనం

[26వ పేజీలోని చిత్రం]

మెక్సికో బ్రాంచిలోని కొత్త భవనాల్లో పని ప్రారంభమవడం

[26వ పేజీలోని చిత్రం]

క్రింద: నిర్మాణ విభాగానికి చెందిన కొంతమంది సభ్యులు కొత్త భవనాల ఎదుట నిలబడివున్నారు

[27వ పేజీలోని చిత్రం]

నిర్మాణ పని కోసం వచ్చిన స్వచ్ఛంద సేవకులు స్థానిక సంఘాలతో కలిసి ప్రకటనా పనికి మద్దతునివ్వడంలో ఆనందిస్తారు