కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆత్మ చెబుతున్న విషయాలను వినండి!

ఆత్మ చెబుతున్న విషయాలను వినండి!

ఆత్మ చెబుతున్న విషయాలను వినండి!

“సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినునుగాక.”​—⁠ప్రకటన 3:22.

బైబిలులోని ప్రకటన గ్రంథములో పేర్కొనబడిన ఏడు సంఘాలకు యేసుక్రీస్తు చెప్పిన ప్రేరేపిత మాటలపై యెహోవా సేవకులు అవధానముంచాలి. ఆ సందేశాల్లోని ప్రతీదానిలో ఈ ఉపదేశం ఉంది: “చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక.”​—⁠ప్రకటన 2:​7, 11, 17, 29; 3:​6, 13, 22.

2 ఎఫెసు, స్ముర్న, పెర్గము సంఘాల్లోని దూతలకు లేదా పైవిచారణకర్తలకు యేసు ఇచ్చిన సందేశాలను మనం ఇప్పటికే పరిశీలించాము. మిగతా నాలుగు సంఘాలకు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన విషయాలనుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

తుయతైరలోని దూతకు

3 “దేవుని కుమారుడు” తుయతైర సంఘానికి ప్రశంస, మందలింపు రెండూ ఇచ్చాడు. (ప్రకటన 2:​18-29 చదవండి.) తుయతైర (ఇప్పుడు అఖిసార్‌), ఆసియా మైనర్‌ పశ్చిమ భాగంలో ఉన్న గెడిజ్‌ (ప్రాచీన హెర్మస్‌) నదికి చెందిన ఉపనది ఒడ్డున నిర్మించబడింది. అది అనేక కళలకు ప్రసిద్ధికెక్కింది. అక్కడ రంగులను తయారుచేసేవారు ప్రఖ్యాతిగాంచిన సింధూరవర్ణం లేదా ఊదారంగును తయారుచేయడానికి మంజిష్ఠ అనే వేరును ముడిపదార్థంగా ఉపయోగించేవారు. గ్రీసులోని ఫిలిప్పీని పౌలు సందర్శించినప్పుడు క్రైస్తవురాలిగా మారిన లూదియ “ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు.”​—⁠అపొస్తలుల కార్యములు 16:12-15.

4 తుయతైర సంఘం సత్‌క్రియలు చేసినందుకు, ప్రేమ, విశ్వాసము, సహనం చూపినందుకు, పరిచర్య చేసినందుకు యేసు దాన్ని ప్రశంసించాడు. నిజానికి ‘వారి మొదటి క్రియలకన్న వారి కడపటి క్రియలు మరియెక్కువైనవిగా’ ఉన్నాయి. అయితే గతంలో మనం మంచి పనులు చేశామని, మన వ్యక్తిత్వం మంచిదని మనకు మంచి పేరు ఉన్నప్పటికీ మనం ఎన్నడూ మన నైతిక విలువలను నిర్లక్ష్యం చేయకూడదు.

5 తుయతైరలోని సంఘం విగ్రహారాధన, అబద్ధ బోధలు, లైంగిక అనైతికతను అనుమతించేది. వారి మధ్య “యెజెబెలను స్త్రీ” ఉండేది​—⁠ఇశ్రాయేలు పది గోత్రాల రాజ్యానికి దుష్ట రాణి అయిన యెజెబెలు లాంటి లక్షణాలున్న స్త్రీల గుంపును అది సూచిస్తుండవచ్చు. తుయతైరలోని ‘ప్రవక్త్రినులు,’ వాణిజ్య సంఘపు దేవుళ్ళనూ దేవతలనూ ఆరాధించేందుకు, విగ్రహాలకు అర్పించబడిన ఆహారానికి సంబంధించిన పండుగల్లో భాగం వహించేందుకు క్రైస్తవులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత దిన క్రైస్తవ సంఘంలో తనను తాను ప్రవక్త్రినిగా నియమించుకున్న స్త్రీ ఎవరైనా ఇతరులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించక పోవడం మంచిది!

6 క్రీస్తు ‘యెజెబెలు అను స్త్రీని మంచము పట్టించి, దానితోకూడ వ్యభిచరించువారు తమ క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేస్తాడు.’ పైవిచారణకర్తలు ఇలాంటి దుష్ట బోధలకు, ప్రభావానికి ఎన్నడూ లొంగకూడదు, క్రైస్తవుల్లో ఎవ్వరూ కూడా “సాతానుయొక్క గూఢమైన సంగతు[లు]” సంపూర్ణంగా దుష్టమైనవేనని గ్రహించడానికి ఆధ్యాత్మికంగానైనా శారీరకంగానైనా వ్యభిచారము చేయవలసిన అవసరం గానీ విగ్రహారాధనలో పాల్గొనవలసిన అవసరం గానీ లేదు. మనం యేసు ఇచ్చిన హెచ్చరికను లక్ష్యపెడితే, ‘మనకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొంటాము,’ అప్పుడు పాపము మనపై అధికారం చలాయించదు. భక్తిహీనమైన ఆచారాలను, వాంఛలను, లక్ష్యాలను తిరస్కరించినందుకు, పునరుత్థానం చేయబడిన అభిషిక్తులకు “జనులమీద అధికారము” లభిస్తుంది, వారు క్రీస్తుతో కలిసి ఆ జనులను ముక్కలుగా విరగగొడతారు. నేటి సంఘాలకు సూచనార్థక నక్షత్రాలు ఉన్నాయి, అభిషిక్తులు పరలోకానికి పునరుత్థానం చేయబడినప్పుడు వారికి “ప్రకాశమానమైన వేకువ చుక్క” ఇవ్వబడుతుంది అంటే పెండ్లికుమారుడైన యేసుక్రీస్తు ఇవ్వబడతాడు.​—⁠ప్రకటన 22:16.

7 మతభ్రష్టులను చేసే స్త్రీల దుష్ట ప్రభావాన్ని సహించవద్దని తుయతైర సంఘానికి హెచ్చరిక చేయబడింది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన క్రీస్తు ఆ సంఘానికి ఇచ్చిన ఉపదేశం, నేడు దైవభక్తిగల స్త్రీలు తమకు దేవుని ద్వారా నియమించబడిన స్థానాల్లోనే ఉండేలా వారికి సహాయం చేస్తుంది. వారు పురుషుల మీద అధికారం చలాయించడానికి ప్రయత్నించరు, ఆధ్యాత్మికంగా లేదా శారీరకంగా వ్యభిచారము చేయడానికి వారు సహోదరులను ప్రలోభపెట్టరు. (1 తిమోతి 2:​12) దానికి బదులు అలాంటి స్త్రీలు దేవునికి ఘనత తెచ్చేలా సత్‌క్రియలు చేయడంలో, ఆయనకు సేవచేయడంలో మాదిరికరంగా ఉంటారు. (కీర్తన 68:11; 1 పేతురు 3:​1-6) సంఘం తన దగ్గరున్న దాన్ని​—⁠స్వచ్ఛమైన సిద్ధాంతాన్ని, సత్‌ప్రవర్తనను, విలువైన రాజ్య పరిచర్యను​—⁠కాపాడుకుంటే క్రీస్తు దాన్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు కాని దానికి తీర్పు తీర్చడు.

సార్దీస్‌లోని దూతకు

8 సార్దీస్‌లోని సంఘం ఆధ్యాత్మికంగా మరణించింది కాబట్టి దానికి తక్షణ సహాయం అవసరమయ్యింది. (ప్రకటన 3:​1-6 చదవండి.) తుయతైరకు దక్షిణాన 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సార్దీస్‌ వర్ధిల్లుతున్న నగరంగా ఉండేది. ఆ నగరపు వాణిజ్యం, దాని సారవంతమైన భూమి, ఉన్ని వస్త్రాలు తివాచీల ఉత్పత్తి వల్ల అది సంపన్నమైన నగరంగా ఉండేది. దానిలో ఒకప్పుడు దాదాపు 50,000 మంది నివాసులు ఉండేవారు. చరిత్రకారుడైన జోసీఫస్‌ ప్రకారం సా.శ.పూ. మొదటి శతాబ్దంలో సార్దీస్‌లో పెద్ద యూదుల సమాజం ఉండేది. ఆ నగర శిథిలాల్లో ఒక సమాజ మందిరం, ఎఫెసీయుల అర్తెమి దేవి ఆలయం ఉన్నాయి.

9 సార్దీస్‌ సంఘంలోని దూతకు క్రీస్తు ఇలా చెప్పాడు: “నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే.” ఆధ్యాత్మిక వ్యక్తులమనే పేరు మనకున్నప్పటికీ మనం క్రైస్తవ ఆధిక్యతల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, కేవలం యాంత్రికంగా క్రైస్తవ కార్యకలాపాలను చేస్తూ, ఆధ్యాత్మికంగా ‘చావడానికి’ సిద్ధంగా ఉంటే అప్పుడెలా? అలాంటి పరిస్థితుల్లో మనం రాజ్య సందేశాన్ని ‘ఎలా విన్నామో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొంటూ’ ఉండాలి, పరిశుద్ధ సేవచేయడానికి మనం చేసే కృషిని పునరుద్ధరించుకోవాలి. మనం క్రైస్తవ కూటాల్లో పూర్ణ హృదయంతో భాగం వహించడం ఖచ్చితంగా ప్రారంభించాలి. (హెబ్రీయులు 10:​24, 25) క్రీస్తు సార్దీస్‌లోని సంఘాన్ని ఇలా హెచ్చరించాడు: “నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.” మన కాలం విషయమేమిటి? త్వరలోనే మనం కూడా లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.

10 సార్దీస్‌లో ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ‘తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని క్రీస్తుతోకూడ సంచరించేవారు’ కొందరు ఉండవచ్చు. వారు తమ క్రైస్తవ గుర్తింపును కాపాడుకుంటారు, ఈ లోకం నుండి నైతికపరమైన, మతపరమైన మాలిన్యము తమకంటకుండా నిష్కళంకముగా కొనసాగుతారు. (యాకోబు 1:​27) కాబట్టి యేసు ‘జీవగ్రంథములోనుండి వాళ్ళ పేర్లను ఎంతమాత్రమును తుడిపెయ్యక, తన తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను వాళ్ళ పేర్లు ఒప్పుకుంటాడు.’ క్రీస్తుతోపాటు నడవడానికి అర్హులుగా ప్రకటించబడిన పెండ్లికుమార్తె తరగతిలోని అభిషిక్తులు ప్రకాశించే, నిర్మలమైన సన్నని నారబట్టలు ధరించుకొంటారు, ఆ బట్టలు దేవుని పరిశుద్ధులు చేసే నీతియుక్తమైన క్రియలను సూచిస్తాయి. (ప్రకటన 19:⁠8) పరలోకంలో వారికోసం వేచివున్న అద్భుతమైన సేవాధిక్యతలు, ఈ లోకాన్ని జయించేందుకు వారిని ప్రేరేపిస్తాయి. భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణ ఉన్నవారి కోసం కూడా ఆశీర్వాదాలు వేచివున్నాయి. వారి పేర్లు కూడా జీవగ్రంథములో వ్రాయబడ్డాయి.

11 సార్దీస్‌లోని సంఘం చేరుకున్న విషాదకరమైన ఆధ్యాత్మిక పరిస్థితికి చేరుకోవాలని మనలో ఎవ్వరమూ కోరుకోము. కానీ మనం ఆధ్యాత్మిక నిద్రలోకి జారుకుంటున్నామని మనం గ్రహిస్తే అప్పుడెలా? మనం మన మంచి కోసం తక్షణమే చర్య తీసుకోవాలి. ఒకవేళ మనం భక్తిహీన మార్గాలకు ఆకర్షించబడుతున్నా లేదా కూటాలకు హాజరవడాన్ని, పరిచర్యలో భాగం వహించడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా మనం తీవ్రంగా ప్రార్థించి యెహోవా సహాయాన్ని కోరాలి. (ఫిలిప్పీయులు 4:​6, 7, 13) ప్రతీరోజు బైబిలు చదవడం, లేఖనాలనూ ‘నమ్మకమైన గృహనిర్వాహకుడి’ నుండి వచ్చే ప్రచురణలనూ అధ్యయనం చేయడం మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండేందుకు సహాయపడతాయి. (లూకా 12:​42-44) అప్పుడు మనం సార్దీస్‌లో క్రీస్తు ఆమోదాన్ని పొందిన వారిలా ఉంటాము, మనం మన తోటి విశ్వాసులకు ఆశీర్వాదకరంగా ఉంటాము.

ఫిలదెల్ఫియలోని దూతకు

12 యేసు ఫిలదెల్ఫియలోని సంఘాన్ని ప్రశంసించాడు. (ప్రకటన 3:​7-13 చదవండి.) ఫిలదెల్ఫియ (ఇప్పుడు అలాసెహిర్‌) ఆసియా మైనర్‌లోని పశ్చిమ భాగంలో ద్రాక్షమద్యాన్ని ఉత్పత్తి చేసే ప్రాంతానికి వర్ధిల్లుతున్న కేంద్రంగా ఉండేది. నిజానికి అక్కడ ఆరాధించబడే ప్రధాన దైవం డయోనైసిస్‌ ద్రాక్షమద్యానికి దేవుడు. ఫిలదెల్ఫియలోని యూదులు అక్కడున్న యూదా క్రైస్తవులను మోషే ధర్మశాస్త్రంలోని కొన్ని ఆచారాలను అంటిపెట్టుకొని ఉండమని లేదా వాటిని ఆచరించడం తిరిగి ప్రారంభించమని బలవంతపెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారని తెలుస్తోంది.

13 క్రీస్తు వద్ద “దావీదు తాళపుచెవి” ఉంది కాబట్టి ఆయనకు రాజ్యాభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలన్నీ, విశ్వాస గృహానికి సంబంధించిన పర్యవేక్షణ ఇవ్వబడ్డాయి. (యెషయా 22:22; లూకా 1:​32) ప్రాచీన ఫిలదెల్ఫియలోని క్రైస్తవులకు, ఇతర ప్రాంతాల్లోని క్రైస్తవులకు రాజ్యాభివృద్ధికి సంబంధించిన బాధ్యతలను, నియామకాలను ఇవ్వడానికి యేసు ఆ తాళపుచెవిని ఉపయోగించాడు. 1919వ సంవత్సరం నుండి ఆయన ‘నమ్మకమైన గృహనిర్వాహకుడి’ ముందు రాజ్య ప్రకటనా పనికి నడిపించే “గొప్ప ద్వారము”ను తెరిచాడు, వ్యతిరేకులెవ్వరూ ఆ ద్వారాన్ని మూయలేరు. (1 కొరింథీయులు 16:​9, అధఃస్సూచి; కొలొస్సయులు 4:​2-4) అయితే “సాతాను సమాజపు” వారికి రాజ్యాధిక్యతల ద్వారం మూసివేయబడింది ఎందుకంటే వారు ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు కాదు.

14 యేసు ప్రాచీన ఫిలదెల్ఫియలోని క్రైస్తవులకు ఇలా వాగ్దానం చేశాడు: “నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధనకాలములో నేనును నిన్ను కాపాడెదను.” ప్రకటనా పని చేయడానికి యేసు ప్రదర్శించినటువంటి సహనం అవసరం. ఆయన శత్రువుకు ఎన్నడూ లొంగిపోలేదు కానీ తన తండ్రి చిత్తాన్ని చేస్తూనే ఉన్నాడు. అందుకే క్రీస్తు పరలోకంలో అమర్త్యమైన జీవితానికి పునరుత్థానం చేయబడ్డాడు. యెహోవాను ఆరాధించాలన్న మన నిర్ణయాన్ని మనం అంటిపెట్టుకొని ఉంటే, సువార్తను ప్రకటించడం ద్వారా రాజ్యానికి మద్దతునిస్తే మనం “శోధనకాలములో” అంటే ప్రస్తుత పరీక్షా కాలంలో విఫలమవ్వకుండా కాపాడబడతాము. మనం రాజ్యాభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలను అధికం చేయడానికి కృషి చేయడం ద్వారా మనం మనకు క్రీస్తు నుండి “కలిగినదానిని గట్టిగా పట్టుకొ[ని]” ఉంటాము. అలా చేస్తే అభిషిక్తులకు ఎంతో విలువైన పరలోకపు కిరీటము, విశ్వసనీయులైన వారి సహచరులకు భూమిపై నిత్యజీవం లభిస్తాయి.

15 క్రీస్తు ఇంకా ఇలా చెప్పాడు: “జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; . . . మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వానిమీద వ్రాసెదను.” అభిషిక్తులైన పైవిచారణకర్తలు సత్యారాధనకు మద్దతునివ్వాలి. వారు దేవుని రాజ్యం గురించి ప్రకటించడం ద్వారా, ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉండడం ద్వారా “నూతనమైన యెరూషలే[ము]”లో సభ్యులుగా ఉండేందుకు తమ అర్హతలను కాపాడుకోవాలి. వారు మహిమాన్వితమైన పరలోక ఆలయంలో స్తంభాలుగా ఉండాలంటే, దేవుని పట్టణంలో పరలోక నివాసులుగా ఉండేందుకు ఆ పట్టణపు పేరును వహించాలంటే, క్రీస్తు పెండ్లికుమార్తెగా ఆయన నామంలో భాగం కలిగివుండాలంటే వారు అలా చేయడం అవసరం. “సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట” వినే చెవులు వారికుండాలి.

లవొదికయలోని దూతకు

16 లవొదికయలో ఉదాసీనంగా ఉన్న సంఘాన్ని క్రీస్తు మందలించాడు. (ప్రకటన 3:​14-22 చదవండి.) ఎఫెసుకు తూర్పున దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో, ల్యూకస్‌ నదికి చెందిన సారవంతమైన పల్లపు ప్రాంతంలోని ముఖ్యమైన వ్యాపార మార్గాల కూడలి వద్ద ఉన్న లవొదికయ నగరం సుసంపన్నమైన ఉత్పత్తిదారుగా, ఆర్థిక కేంద్రంగా ఉండేది. ఆ ప్రాంతంలోని నల్లని ఉన్నితో చేసే వస్త్రాలు ప్రఖ్యాతిగాంచినవి. ప్రసిద్ధిగాంచిన వైద్య కళాశాల ఉన్న నగరం కాబట్టి బహుశా లవొదికయ ఫిర్గియన్‌ పౌడర్‌ అని పిలువబడే కళ్ళ మందును ఉత్పత్తి చేసేది. మందులకు దేవుడైన అస్‌క్లీపియస్‌ ఆ నగరపు ప్రధాన దైవాల్లో ఒకడిగా ఆరాధించబడేవాడు. నిజానికి లవొదికయలో యూదుల జనాభా అధికంగా ఉండేది, వారిలో కొందరు చాలా ధనవంతులని తెలుస్తోంది.

17 లవొదికయలో ఉన్న సంఘపు “దూత” ద్వారా ఆ సంఘాన్ని ఉద్దేశిస్తూ యేసు “నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవా[డిగా]” అధికారంతో మాట్లాడుతున్నాడు. (కొలొస్సయులు 1:​13-16) లవొదికయలోని వారు ఆధ్యాత్మికంగా “చల్లగానైనను వెచ్చగానైనను” లేనందుకు మందలించబడ్డారు. వారు నులివెచ్చగా ఉన్నందువల్ల క్రీస్తు వారిని తన నోటినుండి ఉమ్మివేయాలనుకున్నాడు. ఆ ఉపమాన భావాన్ని గ్రహించడం వారికి కష్టమైవుండకపోవచ్చు. ఆ నగరానికి దగ్గర్లో ఉన్న హియెరాపొలిలో వేడినీటి బుగ్గలు ఉండేవి, కొలొస్సయిలో చల్లని నీరు ఉండేది. అయితే లవొదికయకు నీరు చాలా దూరం నుండి పైపుల ద్వారా చేరవేయబడాలి కాబట్టి నీరు ఆ నగరానికి చేరుకునే సరికి నులివెచ్చగా మారేది. ఆ నీరు కొంతదూరం వరకు రాతికాలువ ద్వారా చేరవేయబడేది. లవొదికయ సమీపంలోకి వచ్చాక, సమచతురస్రాకారపు రాళ్ళను ఒకదానితో మరోదాన్ని సిమెంటుతో అతికించి వాటి మధ్యలో రంధ్రం చేసి నిర్మించిన కాలువలో నీరు ప్రవహించేది.

18 లవొదికయుల లాంటి వ్యక్తులు నేడు ఉత్తేజం కలిగించేంత వేడిగానైనా లేరు పునరుజ్జీవింపజేసేంత చల్లగానైనా లేరు. నులివెచ్చని నీళ్ళలా వారు ఉమ్మివేయబడతారు! యేసు వారిని తన వాగ్దూతగా, అభిషిక్త ‘క్రీస్తు రాయబారులుగా’ ఉపయోగించుకోవడానికి ఇష్టపడలేదు. (2 కొరింథీయులు 5:​20) వారు పశ్చాత్తాపపడకపోతే రాజ్య ప్రచారకులుగా వారికున్న ఆధిక్యతను వారు కోల్పోతారు. లవొదికయులు భూసంబంధమైన సంపదలను సమకూర్చుకున్నారు కానీ వారు ‘దౌర్భాగ్యులుగా, దిక్కుమాలిన వారిగా, దరిద్రులుగా, గ్రుడ్డివారిగా, దిగంబరులుగా ఉన్నారని’ గ్రహించలేదు. నేడు వారివలే ఉన్నవారు ఎవరైనా తమ ఆధ్యాత్మిక పేదరికాన్ని, గ్రుడ్డితనాన్ని, దిగంబరత్వాన్ని తొలగించుకోవడానికి క్రీస్తు నుండి పరీక్షించబడిన విశ్వాసానికి చెందిన ‘పుటమువేయబడిన బంగారాన్ని,’ నీతియుక్తమైన “తెల్లని వస్త్రములను,” ఆధ్యాత్మిక దృష్టిని మెరుగుపరచే “కాటుకను” కొనుక్కోవలసిన అవసరం ఉంది. వారు “విశ్వాసమందు భాగ్యవంతులుగా” తయారయ్యేందుకు తమ ఆధ్యాత్మిక అవసరాలపట్ల శ్రద్ధగలవారిగా ఉండేందుకు వారికి సహాయం చేయడానికి క్రైస్తవ పైవిచారణకర్తలు సంతోషిస్తారు. (యాకోబు 2:5; మత్తయి 5:⁠3, NW) అంతేకాక, ఆధ్యాత్మిక “కాటుక” పెట్టుకోవడానికి అంటే యేసు బోధలను, ఉపదేశాన్ని, మాదిరిని, మనోవైఖరిని స్వీకరించి దానికి కట్టుబడి ఉండేలా పైవిచారణకర్తలు వారికి సహాయం చేయవలసిన అవసరం ఉంది. ఇది ‘శరీరాశను నేత్రాశను జీవపుడంబమును’ స్వస్థపరిచే చికిత్స.​—⁠1 యోహాను 2:15-17.

19 యేసు తాను ప్రేమించే వారందరినీ సరిదిద్ది, వారికి క్రమశిక్షణనిస్తాడు. ఆయన క్రింద సేవచేసే పైవిచారణకర్తలు కూడా అదే పనిని దయాపూర్వకంగా చేయాలి. (అపొస్తలుల కార్యములు 20:​28, 29) లవొదికయులు తమ ఆలోచనా విధానంలో, తమ జీవిత విధానంలో మార్పులు చేసుకొని “ఆసక్తి కలిగి మారు మనస్సు” పొందవలసి వచ్చింది. మనలో కొందరము దేవునికి చేయవలసిన పరిశుద్ధ సేవకు మన జీవితాల్లో తక్కువ ప్రాముఖ్యతనిచ్చే జీవిత విధానానికి అలవాటుపడిపోయామా? అయితే మనం అత్యంతాసక్తితో రాజ్యాన్ని మొదట వెదకవలసిన ప్రాముఖ్యతను చూసేందుకు ‘యేసు నుండి కాటుకను’ కొనుక్కుందాము.​—⁠మత్తయి 6:33.

20 “ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము” అని క్రీస్తు చెబుతున్నాడు. యేసు భోజనం చేసే సమయాల్లో తరచూ ఆధ్యాత్మిక ఉపదేశాన్నిచ్చేవాడు. (లూకా 5:29-39; 7:36-50; 14:​1-24) ఆయన ఇప్పుడు లవొదికయుల సంఘంలాంటి సంఘపు తలుపును తడుతున్నాడు. ఆ సంఘ సభ్యులు ఆయనకు ప్రతిస్పందించి, ఆయనపట్ల తమ ప్రేమను పునరుజ్జీవింపజేసుకొని, ఆయనను తమ మధ్యకు ఆహ్వానించి, ఆయనను తమకు బోధించనిస్తారా? వారలా చేస్తే వారికి గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరే విధంగా క్రీస్తు వారితోపాటు కలిసి భోజనం చేస్తాడు.

21 నేటి “వేరే గొఱ్ఱెలు” సూచనార్థకంగా యేసును లోపలికి ఆహ్వానిస్తున్నారు, వారలా చేయడం నిత్యజీవానికి నడిపిస్తుంది. (యోహాను 10:16; మత్తయి 25:​34-40, 46) లోకాన్ని జయించే ప్రతీ అభిషిక్తునికి క్రీస్తు ‘తాను జయించి తన తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము తనతోకూడ తన సింహాసనమునందు కూర్చుండే’ ఆధిక్యతను ఇస్తాడు. అవును ఈ లోకాన్ని జయించే అభిషిక్తులకు యేసు పరలోకంలో తన తండ్రి కుడిచేతి దగ్గర తనతోపాటు సింహాసనము మీద కూర్చునే గొప్ప ఆశీర్వాదాన్ని వాగ్దానం చేస్తున్నాడు. జయించేవారిగా ఉండే వేరే గొఱ్ఱెలు రాజ్య పరిపాలన క్రింద ఈ భూమ్మీద అద్భుతమైన స్థానాన్ని పొందేందుకు ఎదురుచూస్తారు.

మనందరం నేర్చుకోవలసిన పాఠాలు

22 ఆసియా మైనర్‌లోని ఏడు సంఘాలకు యేసు చెప్పిన విషయాల నుండి క్రైస్తవులందరూ ఎంతో ప్రయోజనం పొందవచ్చనడంలో సందేహం లేదు. ఉదాహరణకు క్రీస్తు ఆ సంఘాలను తగిన విధంగా ప్రశంసించాడని గమనించడం ద్వారా ప్రేమపూర్వకమైన క్రైస్తవ పెద్దలు ఆధ్యాత్మికంగా మంచి స్థానంలో ఉన్న వ్యక్తులను, సంఘాలను ప్రశంసించడానికి ప్రేరేపించబడతారు. తోటి విశ్వాసులకు బలహీనతలుంటే పెద్దలు వారికి లేఖనాధారిత పరిష్కారాలను అన్వయించుకోవడానికి సహాయం చేస్తారు. క్రీస్తు ఆ ఏడు సంఘాలకు ఇచ్చిన ఉపదేశాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా, ఆలస్యం చేయకుండా అన్వయించుకొంటూ ఉన్నంత కాలం ఆ ఉపదేశంలోని వివిధ అంశాల నుండి మనమందరం ప్రయోజనం పొందుతూనే ఉంటాము. *

23 ఈ అంత్యదినాలు ఉదాసీనంగా ఉండడానికి, భౌతిక సంపదలు సమకూర్చుకోవడానికి లేదా దేవునికి కేవలం యాంత్రికంగా సేవచేసేలా ఒత్తిడి తెచ్చే దేన్నైన్నా వెంబడించడానికి సమయం కాదు. కాబట్టి యేసు వాటి స్థానాల్లోనే ఉంచే దీపస్తంభాలవలే సంఘాలన్నీ ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉండును గాక. విశ్వసనీయులైన క్రైస్తవులుగా మనం క్రీస్తు చెప్పే విషయాలపై అవధానముంచి ఆత్మ చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని ఎల్లప్పుడూ తీర్మానించుకుందాము. అప్పుడు మనం యెహోవా మహిమకు వెలుగు ప్రకాశకులుగా శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాము.

[అధస్సూచీలు]

^ పేరా 29 ప్రకటన 2:​1–3:⁠22 వచనాలు ప్రకటన​—⁠దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకంలోని 7 నుండి 13 అధ్యాయాల్లో కూడా చర్చించబడ్డాయి, ఈ పుస్తకాన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు.

మీరెలా సమాధానమిస్తారు?

• “యెజెబెలను స్త్రీ” ఎవరు, దైవభక్తిగల స్త్రీలు ఆమెను ఎందుకు అనుకరించరు?

• సార్దీస్‌ సంఘంలో ఎలాంటి పరిస్థితి ఉండేది, అక్కడ నివసించిన అనేకమంది క్రైస్తవుల్లా మనం తయారవకుండా ఉండడానికి ఏమి చేయవచ్చు?

• ఫిలదెల్ఫియ సంఘానికి యేసు ఏ వాగ్దానాలను చేశాడు, అవి నేడు ఎలా వర్తిస్తాయి?

• లవొదికయులు ఎందుకు మందలించబడ్డారు, అత్యంతాసక్తిగల క్రైస్తవులకు ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. ప్రకటనలో ప్రస్తావించబడిన ఏడు సంఘాలకు యేసు ఇచ్చిన సందేశాల్లో పదేపదే ఏ ఉపదేశం ఇవ్వబడింది?

3. తుయతైర పట్టణం ఎక్కడ ఉండేది, అది ప్రత్యేకించి దేనికి పేరుగాంచింది?

4. తుయతైరలోని సంఘం ఏ విషయంలో ప్రశంసించబడింది?

5-7 (ఎ) “యెజెబెలను స్త్రీ” ఎవరు, ఆమె చూపే చెడు ప్రభావం విషయంలో ఏమి చేయాలి? (బి) క్రీస్తు తుయతైర సంఘానికి ఇచ్చిన సందేశం, దైవభక్తిగల స్త్రీలు ఏమి చేయడానికి సహాయం చేస్తుంది?

8. (ఎ) సార్దీస్‌ నగరం ఎక్కడ ఉండేది, దానికి సంబంధించిన కొన్ని వివరాలు ఏమిటి? (బి) సార్దీస్‌లోని సంఘానికి సహాయం ఎందుకు అవసరమయ్యింది?

9. మన సేవా కార్యకలాపాలు యాంత్రికంగా మారిపోతే మనమేమి చేయాలి?

10. సార్దీస్‌లో ఉన్నటువంటి పరిస్థితిలో కూడా కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారు?

11. మనం ఆధ్యాత్మిక నిద్రలోకి జారుకుంటుంటే ఏమి చేయాలి?

12. ప్రాచీన ఫిలదెల్ఫియలోని మత పరిస్థితిని మీరెలా వర్ణిస్తారు?

13. క్రీస్తు “దావీదు తాళపుచెవి”ని ఎలా ఉపయోగించాడు?

14. (ఎ) యేసు ఫిలదెల్ఫియలోని సంఘానికి ఏమని వాగ్దానం చేశాడు? (బి) మనం “శోధనకాలములో” విఫలమవ్వకుండా ఎలా కాపాడబడతాము?

15. ‘దేవుని ఆలయంలో స్తంభాలుగా’ ఉండబోయే వారు ఏమి చేయాలి?

16. లవొదికయకు సంబంధించిన కొన్ని వాస్తవాలు ఏమిటి?

17. లవొదికయులు ఎందుకు మందలించబడ్డారు?

18, 19. నేడు లవొదికయులవలే ఉన్న క్రైస్తవులకు సహాయం ఎలా అందుతుంది?

20, 21. యేసు ‘తలుపు తడుతున్నప్పుడు’ నేడు ఎవరు సరిగ్గా ప్రతిస్పందిస్తున్నారు, వారికి ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?

22, 23. (ఎ) ఏడు సంఘాలకు యేసు చెప్పిన మాటల నుండి క్రైస్తవులందరూ ఎలా ప్రయోజనం పొందవచ్చు? (బి) మన తీర్మానం ఏమై ఉండాలి?

[16వ పేజీలోని చిత్రం]

“యెజెబెలను స్త్రీ” యొక్క దుష్ట విధానాలను నిరోధించవలసిన అవసరం ఉంది

[18వ పేజీలోని చిత్రాలు]

 సు తన అనుచరుల ఎదుట, రాజ్యాధిక్యతలు పొందడానికి నడిపించే “గొప్ప ద్వారము”ను తెరిచాడు

[20వ పేజీలోని చిత్రం]

మీరు యేసును ఆహ్వానించి ఆయన చెప్పేది వింటారా?