కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తు సంఘాలతో మాట్లాడుతున్నాడు

క్రీస్తు సంఘాలతో మాట్లాడుతున్నాడు

క్రీస్తు సంఘాలతో మాట్లాడుతున్నాడు

ఏడు నక్షత్రములను తన కుడిచేతిలో పట్టుకొని ఉన్నవాడు చెప్పు సంగతులు ఇవే.’​ప్రకటన 2:⁠1.

యెహోవా అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు క్రైస్తవ సంఘానికి శిరస్సు. తన అభిషిక్త అనుచరుల సంఘాన్ని కళంకం లేకుండా ఉంచడానికి క్రీస్తు వారిని ప్రశంసించడం ద్వారా వారికి ఉపదేశించడం ద్వారా తన శిరసత్వ బాధ్యతను నిర్వహిస్తాడు. (ఎఫెసీయులు 5:​21-27) దీనికి సంబంధించిన ఉదాహరణలు ప్రకటన 2, 3 అధ్యాయాల్లో ఉన్నాయి, ఆసియా మైనర్‌లోని ఏడు సంఘాలకు యేసు ఇచ్చిన శక్తివంతమైన, ప్రేమపూర్వకమైన సందేశాలను మనం ఆ అధ్యాయాల్లో చదువుతాము.

2 యేసు ఆ ఏడు సంఘాలకు చెప్పే విషయాలను వినడానికి ముందు అపొస్తలుడైన యోహానుకు ‘ప్రభువు దినమునకు’ సంబంధించిన దర్శనం అనుగ్రహించబడింది. (ప్రకటన 1:​10) ఆ ‘దినము’ 1914వ సంవత్సరంలో మెస్సీయా రాజ్యం స్థాపించబడినప్పుడు ఆరంభమయ్యింది. కాబట్టి క్రీస్తు ఆ సంఘాలకు చెప్పిన విషయాలు ఈ అంత్యదినాల్లో మనకు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, ఉపదేశం ఈ అపాయకరమైన కాలాల్లో మనం ఎదుర్కొనే పరిస్థితులతో వ్యవహరించడానికి మనకు సహాయపడతాయి.​—⁠2 తిమోతి 3:1-5.

3 “ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు [సువర్ణ] దీపస్తంభములమధ్య” లేదా సంఘాలమధ్య ‘సంచరిస్తున్న’ మహిమాన్వితుడైన యేసుక్రీస్తును యోహాను చూశాడు. ఆ “నక్షత్రములు” “ఏడు సంఘములకు దూతలు.” (ప్రకటన 1:19, 20; 2:⁠1) నక్షత్రాలు కొన్నిసార్లు దేవదూతలైన ఆత్మ ప్రాణులను సూచిస్తాయి కానీ ఆత్మ ప్రాణుల కోసం సందేశాలను వ్రాయడానికి క్రీస్తు ఒక మానవుని ఉపయోగించుకోడు. కాబట్టి సహేతుకంగా ఈ “నక్షత్రములు” ఆత్మాభిషిక్తులైన పైవిచారణకర్తలను లేదా పెద్దల సభలను సూచిస్తాయి. “దూతలు” అనే పదం, సందేశాన్ని చేరవేసేవారిగా వారికున్న పాత్రను వివరిస్తోంది. దేవుని సంస్థ విస్తరించింది కాబట్టి “నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకు[డు]” యేసుకు చెందిన “వేరే గొఱ్ఱె[ల్లో]” నుండి అర్హతగల పురుషులను కూడా పైవిచారణకర్తలుగా నియమించాడు.​—⁠లూకా 12:42-44; యోహాను 10:16.

4 ఆ “నక్షత్రములు” యేసు కుడిచేతిలో ఉన్నాయి, అంటే అవి ఆయన శక్తి, ఆధీనం, అనుగ్రహం, రక్షణ క్రింద ఉన్నాయి. కాబట్టి ఆయనకు లెక్క అప్పజెప్పాల్సిన బాధ్యత వాటికుంది. ఆయన ఆ ఏడు సంఘాల్లోని ప్రతీ సంఘానికి చెప్పిన విషయాలను శ్రద్ధగా వినడం ద్వారా నేటి పెద్దలు అలాంటి పరిస్థితులతో తామెలా వ్యవహరించవచ్చో తెలుసుకుంటారు. అయితే దేవుని కుమారుడు చెప్పేదాన్ని క్రైస్తవులందరూ వినాలి. (మార్కు 9:⁠7) క్రీస్తు ఆ సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పే విషయాలపై అవధానం నిలపడం ద్వారా మనమేమి నేర్చుకోవచ్చు?

ఎఫెసులోని దూతకు

5 యేసు ఎఫెసులోని సంఘాన్ని ప్రశంసించాడు, మందలించాడు. (ప్రకటన 2:1-7 చదవండి.) ఆసియా మైనర్‌ పడమటి తీరప్రాంతంలోని ఈ నగరం సుసంపన్నంగా, వాణిజ్యానికీ మత కార్యకలాపాలకూ కేంద్రస్థానంగా ఉండేది. అక్కడ అర్తెమి దేవికి చెందిన పెద్ద ఆలయం ఉండేది. ఎఫెసు నగరం అనైతికత, అబద్ధ మతం, మంత్రతంత్రాల అభ్యాసంతో నిండివున్నప్పటికీ దేవుడు ఆ నగరంలో అపొస్తలుడైన పౌలు, మరితరులు చేసిన పరిచర్యను ఆశీర్వదించాడు.​—⁠అపొస్తలుల కార్యములు, 19వ అధ్యాయం.

6 క్రీస్తు ఎఫెసులోని సంఘాన్ని ఇలా ప్రశంసించాడు: “నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు . . . నేనెరుగుదును.” నేడు, యేసు నిజమైన అనుచరుల సంఘాలు కూడా సత్‌క్రియలకు, కష్టించి పనిచేయడానికి, సహనంతో ఉండడానికి పేరుగాంచాయి. అపొస్తలులుగా దృష్టించబడాలని కోరుకునే కపట సహోదరులను వారు సహించరు. (2 కొరింథీయులు 11:​13, 26) ఎఫెసీయుల్లాగే నేడు విశ్వసనీయులైన క్రైస్తవులు ‘దుష్టులను సహించరు.’ కాబట్టి యెహోవా ఆరాధన యొక్క పరిశుద్ధతను, సంఘాన్ని కాపాడడానికి వారు పశ్చాత్తాపం చెందని మత భ్రష్టులతో సహవసించరు.​—⁠గలతీయులు 2:4, 5; 2 యోహాను 8-11.

7 కానీ ఎఫెసులోని క్రైస్తవులకు ఒక గంభీరమైన సమస్య ఉండేది. ఆ సంఘంతో యేసు, “మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది” అని అన్నాడు. ఆ సంఘంలోని సభ్యులు యెహోవాపట్ల తాము మొదట చూపిన ప్రేమను పునరుజ్జీవింపజేసుకోవలసిన అవసరం ఏర్పడింది. (మార్కు 12:28-30; ఎఫెసీయులు 2:4; 5:​1, 2) మనమందరం యెహోవాపట్ల మొదట చూపిన ప్రేమను కోల్పోకుండా జాగ్రత్తపడాలి. (3 యోహాను 3) కానీ భౌతిక సంపదలుండాలనే కోరిక, సుఖానుభవాలకు సంబంధించిన అన్వేషణ మన జీవితంలో ప్రథమస్థానాన్ని ఆక్రమించుకోవడం ఆరంభిస్తే అప్పుడెలా? (1 తిమోతి 4:8; 6:​9, 10) అప్పుడు మనం అలాంటి ఆలోచనలను తొలగించుకొని వాటి స్థానంలో యెహోవాపట్ల ప్రగాఢమైన ప్రేమను, ఆయనా ఆయన కుమారుడూ మన కోసం చేసిన వాటన్నింటి పట్ల కృతజ్ఞతను పెంపొందింపజేసుకోవడానికి దైవిక సహాయం కోసం తీవ్రంగా ప్రార్థించాలి.​—⁠1 యోహాను 4:10, 16.

8 క్రీస్తు ఎఫెసీయులను ఇలా ప్రోత్సహించాడు: “నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము.” వారు ఆయన చెప్పినట్లు చేయకపోతే ఏమౌతుంది? “లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును” అని యేసు చెప్పాడు. గొఱ్ఱెలందరూ తమ మొదటి ప్రేమను కోల్పోతే ఆ “దీపస్తంభము” లేదా సంఘము ఇక ఉనికిలోనే ఉండదు. కాబట్టి అత్యంతాసక్తిగల క్రైస్తవులుగా మనం, సంఘం ఆధ్యాత్మికంగా ప్రకాశిస్తూ ఉండడానికి కృషి చేద్దాం.​—⁠మత్తయి 5:14-16.

9 ఎఫెసీయులు “నీకొలాయితుల క్రియలు” ద్వేషించడం ప్రశంసించదగినది. ఈ నీకొలాయితుల గురించి ప్రకటనలో ప్రస్తావించబడడమే తప్ప వారి ఆరంభం, వారి బోధనలు, వారి ఆచారాల గురించి ఖచ్చితమైన వివరాలు మనకు తెలియవు. అయితే యేసు మనుష్యులను అనుసరించడాన్ని ఖండించాడు కాబట్టి మనం ఎఫెసులోని క్రైస్తవులవలే తెగవాదాన్ని ద్వేషిస్తూనే ఉండాలి.​—⁠మత్తయి 23:10.

10 “చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక” అని క్రీస్తు అన్నాడు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు దేవుని ఆత్మ ప్రేరణతో మాట్లాడాడు. (యెషయా 61:1; లూకా 4:​16-21) కాబట్టి ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను ఉపయోగించి యేసు ద్వారా చెబుతున్న విషయాలపై మనం అవధానం నిలపాలి. ఆత్మ ప్రేరణతో యేసు ఇలా వాగ్దానం చేశాడు: “జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును.” ఆత్మ చెప్పే విషయాలను శ్రద్ధగా వినే అభిషిక్తులు పరలోకంలోని “దేవుని పరదైసు”లో లేదా యెహోవా సన్నిధిలో అమర్త్యులుగా ఉంటారని దీని భావం. ‘గొప్ప సమూహానికి’ చెందినవారు కూడా ఆత్మ చెప్పే విషయాలను వింటారు, వారు భూపరదైసులో “జీవజలముల నది” నుండి నీళ్ళు త్రాగి దాని ఒడ్డునవున్న “వృక్షముయొక్క ఆకులు” ఇచ్చే స్వస్థతను పొంది ఆనందంగా జీవిస్తారు.​—⁠ప్రకటన 7:9; 22:1, 2; లూకా 23:43.

11 ఎఫెసీయులు తమ మొదటి ప్రేమను కోల్పోయారు, అయితే నేడు కూడా ఏదైనా సంఘంలో అలాంటి పరిస్థితి ఏర్పడితే అప్పుడెలా? మనమందరము యెహోవా ప్రేమపూర్వకమైన మార్గాల గురించి స్వయంగా మాట్లాడుతూ ఆయనపట్ల ప్రేమను పెంపొందింపజేద్దాము. దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా విమోచన క్రయధనం ఏర్పాటు చేయడంలో చూపించిన ప్రేమకు మనం మన కృతజ్ఞతను వ్యక్తం చేయవచ్చు. (యోహాను 3:16; రోమీయులు 5:⁠8) సముచితమైనప్పుడు మనం మన వ్యాఖ్యానాల్లో, కూటాల్లో మనం నిర్వహించే భాగాల్లో దేవుని ప్రేమ గురించి ప్రస్తావించవచ్చు. మనం క్రైస్తవ పరిచర్యలో యెహోవా నామాన్ని స్తుతించడం ద్వారా ఆయనపట్ల వ్యక్తిగతంగా మనకున్న ప్రేమను చూపించవచ్చు. (కీర్తన 145:​10-13) అవును మన మాటలు మన చర్యలు, సంఘపు మొదటి ప్రేమను పునరుజ్జీవింపజేయడానికి లేక బలపర్చడానికి ఎంతో సహాయం చేయవచ్చు.

స్ముర్నలోని దూతకు

12 “మొదటివాడును కడపటివాడునై యుండి మృతుడై” పునరుత్థానం ద్వారా “మరల బ్రదికినవాడు” అయిన క్రీస్తు స్ముర్నలోని సంఘాన్ని ప్రశంసించాడు. (ప్రకటన 2:​8-11 చదవండి.) స్ముర్న (ఇప్పుడు ఇజ్మీర్‌, టర్కీ) ఆసియా మైనర్‌ పశ్చిమ తీరప్రాంతంలో నిర్మించబడింది. గ్రీసు దేశస్థులు స్థాపించిన ఆ నగరాన్ని లిడియా దేశస్థులు సా.శ.పూ. 580లో నాశనం చేశారు. అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ తర్వాత వచ్చిన రాజులు స్ముర్నను ఒక కొత్త స్థలంలో మళ్ళీ నిర్మించారు. అది ఆసియాలోని రోమా మండలంలో భాగమయ్యింది, అప్పట్లో అది వర్ధిల్లుతున్న వాణిజ్య కేంద్రంగా ఉండేది, అందమైన భవనాలకు అది పేరుగాంచింది. దానిలో తిబెరి కైసరు ఆలయం ఉండడంవల్ల అది చక్రవర్తి ఆరాధనకు కేంద్రస్థానంగా ఉండేది. ఆ ఆలయానికి వచ్చే ఆరాధకులు చిటికెడు సాంబ్రాణితో ధూపం వేసి “కైసరు ప్రభువు” అని చెప్పాలి. క్రైస్తవులకు ‘యేసు ప్రభువు’ కాబట్టి వారు ఆ ఆచారాన్ని పాటించేవారు కాదు. దాని మూలంగా వారు ఎన్నో కష్టాలనుభవించేవారు.​—⁠రోమీయులు 10:⁠9.

13 కష్టాలనుభవించడంతో పాటు స్ముర్నలోని క్రైస్తవులు పేదరికంలో జీవించేవారు, వారు చక్రవర్తి ఆరాధనలో భాగం వహించనందుకు బహుశా ఆర్థిక ఇబ్బందులను అనుభవించారు. యెహోవా ఆధునిక దిన సేవకులు అలాంటి కష్టాలకు అతీతులు కారు. (ప్రకటన 13:​16, 17) స్ముర్నలోని క్రైస్తవుల్లాంటి వారు భౌతికంగా పేదవారైనప్పటికీ ఆధ్యాత్మికంగా ధనవంతులై ఉంటారు, అదే నిజంగా ప్రాముఖ్యమైనది!​—⁠సామెతలు 10:22; 3 యోహాను 2.

14 స్ముర్నలోని యూదుల్లో చాలామంది “సాతాను సమాజపు” వారు ఎందుకంటే వారు లేఖన విరుద్ధమైన సాంప్రదాయాలను అంటిపెట్టుకొని ఉండి, దేవుని కుమారుణ్ణి తిరస్కరించి, ఆత్మ జనితులైన యేసు అనుచరులను దూషించేవారు. (రోమీయులు 2:​28, 29) కానీ క్రీస్తు తర్వాత చెప్పిన మాటలనుండి అభిషిక్త క్రైస్తవులు ఎంతో గొప్ప ఓదార్పును పొందవచ్చు! “నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను” అని ఆయన చెప్పాడు.​—⁠ప్రకటన 2:​9, 10.

15 యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించినందుకు చనిపోవడానికి యేసు భయపడలేదు. (ఫిలిప్పీయులు 2:​5-8) సాతాను ఇప్పుడు అభిషిక్త శేషంతో యుద్ధం చేస్తున్నప్పటికీ వారు ఒక గుంపుగా తాము అనుభవించవలసిన కష్టాల గురించి అంటే కఠినమైన పరీక్షలు, చెరసాలలో వేయబడడం, క్రూరమైన మరణం గురించి భయపడరు. (ప్రకటన 12:​17) వారు లోకాన్ని జయిస్తారు. అన్యుల క్రీడల్లో విజయం సాధించినవారు వాడిపోయే పూలదండలను కిరీటముగా ధరించినట్లు కాక పునరుత్థానం చేయబడిన అభిషిక్త క్రైస్తవులు పరలోకంలో అమర్త్యమైన ప్రాణులుగా ‘జీవకిరీటము’ ధరిస్తారని యేసు వాగ్దానం చేస్తున్నాడు. అది ఎంత విలువైన బహుమానమో కదా!

16 మన నిరీక్షణ పరలోక సంబంధమైనదైనా లేక భూలోక సంబంధమైనదైనా మనం ప్రాచీన స్ముర్నలాంటి సంఘంతో సహవసిస్తుంటే అప్పుడెలా? అలాంటప్పుడు, దేవుడు హింసను అనుమతించడానికి గల ముఖ్య కారణంపై​—⁠విశ్వ సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదంపై​—⁠అవధానం నిలపడానికి మనం తోటి విశ్వాసులకు సహాయం చేద్దాం. యెహోవాకు యథార్థంగా ఉండే ప్రతీ సాక్షి, సాతాను అబద్ధీకుడని నిరూపిస్తాడు, విశ్వ సర్వాధిపతిగా పరిపాలించడానికి దేవునికిగల హక్కుకు హింసించబడే మానవుడు కూడా స్థిరంగా మద్దతునివ్వగలడని చూపిస్తాడు. (సామెతలు 27:​11) హింసను సహించమని, దాని ఫలితంగా “మన జీవిత కాలమంతయు”​—⁠నిరంతరం​—⁠‘నిర్భయులమై, [యెహోవా] సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనకు సేవచేసే ఆధిక్యత’ను ఎప్పటికీ కాపాడుకొమ్మని మనం ఇతర క్రైస్తవులను ప్రోత్సహిద్దాం.​—⁠లూకా 1:​68-75.

పెర్గములోని దూతకు

17 పెర్గములోని సంఘానికి ప్రశంస, దిద్దుబాటు రెండూ ఇవ్వబడ్డాయి. (ప్రకటన 2:12-17 చదవండి.) స్ముర్నకు 80 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశలో ఉన్న పెర్గము నగరము అన్యమతంలో మునిగిపోయి ఉండేది. కల్దీయుల జ్యోతిష్కులు బబులోను నుండి తప్పించుకొని పారిపోయి అక్కడకు వెళ్ళివుంటారు. ఎంతోమంది రోగులు పెర్గములో ప్రఖ్యాతిగాంచిన అస్‌క్లీపియస్‌ ఆలయానికి​—⁠స్వస్థతకు, వైద్యానికి దేవుడిగా ఆరాధించబడే అబద్ధ దేవుని ఆలయానికి​—⁠వెళ్ళేవారు. కైసరు ఔగుస్తు ఆరాధనకు కేటాయించబడిన ఆలయం ఉన్న పెర్గము “సామ్రాజ్యపు తొలికాలంలో చక్రవర్తులను ఆరాధించే తెగ ప్రజలకు ముఖ్య కేంద్రం” అని పిలువబడేది.​—⁠ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, 1959, 17వ సంపుటి, 507వ పేజీ.

18 పెర్గములో జీయస్‌కు ప్రతిష్ఠించబడిన బలిపీఠం ఉండేది. అపవాది ద్వారా ప్రేరేపించబడినదైన మనుష్యుల ఆరాధనకు కూడా ఆ నగరం కేంద్రస్థానంగా ఉండేది. కాబట్టి అక్కడి సంఘం “సాతాను సింహాసనమున్న స్థలములో” ఉందని చెప్పబడడంలో ఆశ్చర్యమేమీ లేదు! యెహోవా సర్వాధిపత్యానికి మద్దతునిచ్చే వ్యక్తి చక్రవర్తిని ఆరాధించడానికి నిరాకరిస్తే అది ఆయన మరణానికి దారి తీసేది. లోకం ఇప్పటికీ అపవాది ఆధీనంలోనే ఉంది, ఇప్పుడు జాతీయ చిహ్నాలు ఆరాధించబడుతున్నాయి. (1 యోహాను 5:​19) మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకూ, “నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబ[డ్డాడు]” అని క్రీస్తు ప్రస్తావించిన వ్యక్తిలాగే ఎంతోమంది నమ్మకస్థులైన క్రైస్తవులు హతసాక్షులుగా చంపబడ్డారు. విశ్వసనీయులైన అలాంటి సేవకులను యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఖచ్చితంగా జ్ఞాపకముంచుకుంటారు.​—⁠1 యోహాను 5:21.

19 క్రీస్తు “బిలాము బోధ” గురించి కూడా మాట్లాడాడు. స్వార్ధపూరితంగా భౌతిక ప్రయోజనాన్ని ఆశించిన ఆ అబద్ధపు ప్రవక్త ఇశ్రాయేలును శపించడానికి ప్రయత్నించాడు. యెహోవా అతని శాపాన్ని ఆశీర్వాదంగా మార్చివేసినప్పుడు బిలాము మోయాబు రాజు బాలాకుతో కలిసి చాలామంది ఇశ్రాయేలీయులను విగ్రహారాధన చేయడానికి, లైంగిక అనైతికతకు పాల్పడడానికి ప్రలోభపెట్టాడు. బిలాము క్రియలకు వ్యతిరేకంగా చర్య తీసుకున్న ఫీనెహాసు నీతి కోసం ఎంత స్థిరంగా నిలబడ్డాడో క్రైస్తవ పెద్దలు కూడా అంతే స్థిరంగా నిలబడాలి. (సంఖ్యాకాండము 22:1-25:15; 2 పేతురు 2:15, 16; యూదా 11) నిజానికి క్రైస్తవులందరూ ఏ విధమైన విగ్రహారాధనా చేయకుండా, లైంగిక అనైతికత సంఘంలోకి జొరబడకుండా జాగ్రత్త వహించాలి.​—⁠యూదా 3, 4.

20 పెర్గములోని సంఘం ‘నీకొలాయితుల బోధ ననుసరించు వారిని’ తన మధ్య ఉండనిచ్చింది కాబట్టి అది గొప్ప ప్రమాదంలో పడింది. “మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధము చేసెదను” అని క్రీస్తు ఆ సంఘానికి చెప్పాడు. తెగవాదులు క్రైస్తవులకు ఆధ్యాత్మికంగా హాని చేయాలనుకుంటారు, అలా భేదములను విభజనలను సృష్టించాలని తీర్మానించుకున్నవారు దేవుని రాజ్యములోకి ప్రవేశించరు. (రోమీయులు 16:17, 18; 1 కొరింథీయులు 1:10; గలతీయులు 5:​19-21) ఏ క్రైస్తవుడైనా మతభ్రష్టత్వపు దృక్కోణాలను తన మనస్సులో ఉంచుకొని వాటిని వ్యాప్తిచేయడానికి ఇష్టపడుతుంటే అతను క్రీస్తు హెచ్చరికను లక్ష్యపెట్టాలి! తనను తాను నాశనం నుండి కాపాడుకోవడానికి అతను పశ్చాత్తాపపడి సంఘంలోని పెద్దల నుండి ఆధ్యాత్మిక సహాయాన్ని తీసుకోవాలి. (యాకోబు 5:​13-18) ఈ విషయంలో తక్షణ చర్య తీసుకోవడం ప్రాముఖ్యం ఎందుకంటే యేసు త్వరలోనే తీర్పు తీర్చనున్నాడు.

21 నమ్మకస్థులైన అభిషిక్త క్రైస్తవులు, విశ్వసనీయులైన వారి సహచరులు రాబోయే తీర్పు విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద యేసు ఇచ్చిన ఉపదేశాన్ని శ్రద్ధగా వినేవారందరూ ఆశీర్వదించబడతారు. ఉదాహరణకు లోకాన్ని జయించే అభిషిక్తులు “మరుగైయున్న మన్నా”లో కొంతభాగాన్ని భుజించడానికి ఆహ్వానించబడతారు, వారికి “క్రొత్తపేరు” చెక్కబడిన ‘తెల్లరాయి’ ఇవ్వబడుతుంది.

22 ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణించినప్పుడు దేవుడు వారికి ఆహారంగా మన్నాను ఇచ్చాడు. ఆ “మన్నా”లో కొంతభాగం బంగారు పాత్రలో ఉంచబడి నిబంధన మందసములో పెట్టబడింది కాబట్టి అది గుడారములోని అతిపరిశుద్ధస్థలములో దాచబడి ఉండేది, యెహోవా సన్నిధిని సూచించడానికి అక్కడ అద్భుతమైన వెలుగు ఉండేది. (నిర్గమకాండము 16:14, 15, 23, 26, 33; 26:34; హెబ్రీయులు 9:​3, 4) ఆ దాచబడిన మన్నాను తినడానికి ఎవ్వరూ అనుమతించబడేవారు కాదు. అయితే యేసు అభిషిక్త అనుచరులు పునరుత్థానమైనప్పుడు “మరుగైయున్న మన్నాను” తినడంతో ద్వారా సూచించబడిన అమర్త్యతను పొందారు.​—⁠1 కొరింథీయులు 15:53-57.

23 రోమా న్యాయస్థానాల్లో నల్లరాయి ఖండించబడడాన్ని సూచించేది కానీ తెల్లరాయి నిర్దోషిగా విడుదలవడాన్ని సూచించేది. లోకాన్ని జయించే అభిషిక్త క్రైస్తవులకు యేసు ‘తెల్లరాయి’ ఇవ్వడం ఆయన వారిని నిర్దోషులుగా, పరిశుద్ధమైన వారిగా, పరిశుభ్రమైనవారిగా పరిగణిస్తున్నాడని సూచిస్తోంది. రోమా దేశస్థులు ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు వాటికి హాజరవడానికి రాళ్ళను టిక్కెట్‌లా ఉపయోగించేవారు కాబట్టి ఈ ‘తెల్లరాయి,’ పరలోకంలో జరిగే గొఱ్ఱెపిల్ల వివాహానికి అభిషిక్తులు హాజరవడానికి ఇవ్వబడే అనుమతిని సూచించవచ్చు. (ప్రకటన 19:​7-9) “క్రొత్తపేరు,” పరలోక రాజ్యంలో యేసుతోపాటు సహపరిపాలకులుగా ఐక్యమైవుండే ఆధిక్యతను సూచిస్తోందని స్పష్టమౌతోంది. ఇదంతా అభిషిక్తులను, యెహోవాకు సేవచేయడంలో వారికి సహచరులుగా ఉంటూ భూపరదైసులో జీవించడానికి నిరీక్షించేవారిని ఎంత ప్రోత్సాహిస్తుందో కదా!

24 పెర్గము సంఘం మతభ్రష్టులవల్ల ప్రమాదంలో పడిందని గుర్తుంచుకోవడం జ్ఞానయుక్తం. మనం సహవసించే సంఘపు ఆధ్యాత్మిక సంక్షేమం అలాంటి పరిస్థితివల్ల ప్రమాదంలో పడితే, మనం మతభ్రష్టత్వాన్ని పూర్తిగా తిరస్కరించి సత్యంలో నడుస్తూనే ఉందాము. (యోహాను 8:32, 44; 3 యోహాను 4) మతభ్రష్టత్వంవైపు మొగ్గుచూపే అబద్ధ బోధకులు లేదా వ్యక్తులు మొత్తం సంఘాన్ని భ్రష్టుపట్టించగలరు కాబట్టి మనం మతభ్రష్టత్వానికి వ్యతిరేకంగా స్థిరంగా నిలబడాలి, సత్యానికి విధేయత చూపకుండా దుష్ట ఆలోచనలు మనల్ని ఆటంకపరిచే అవకాశం ఎన్నడూ ఇవ్వకూడదు.​—⁠గలతీయులు 5:7-12; 2 యోహాను 8-11.

25 ఆసియా మైనర్‌లోని ఏడు సంఘాల్లో మనం పరిశీలించిన మూడు సంఘాలకు మహిమాన్వితుడైన యేసుక్రీస్తు అందజేసిన ప్రశంస, ఉపదేశం నిజంగా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ మార్గనిర్దేశంలో ఆయన మిగతా నాలుగు సంఘాలకు చెప్పవలసింది ఇంకా ఎంతో ఉంది. తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయ సంఘాలను ఉద్దేశించి ఇవ్వబడిన ఆ సందేశాలు తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడతాయి.

మీరెలా సమాధానమిస్తారు?

• క్రీస్తు సంఘాలకు చెప్పే విషయాలపై మనం ఎందుకు అవధానం నిలపాలి?

• ఒక సంఘం చూపిన మొదటి ప్రేమను పునరుజ్జీవింపజేయడానికి మనం ఎలా తోడ్పడవచ్చు?

• ప్రాచీన స్ముర్నలోని భౌతికంగా పేదవారైన క్రైస్తవులు నిజానికి ధనవంతులని ఎందుకు చెప్పవచ్చు?

• పెర్గములోవున్న సంఘంలోని పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం మతభ్రష్టత్వపు ఆలోచనలను ఎలా దృష్టించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. ఆసియా మైనర్‌లోని ఏడు సంఘాలకు క్రీస్తు చెప్పిన విషయాలపట్ల మనం ఎందుకు ఆసక్తి చూపించాలి?

3. అపొస్తలుడైన యోహాను చూసిన “నక్షత్రములు,” “దూతలు,” “సువర్ణ దీపస్తంభముల” సూచనార్థక భావాలు ఏమిటి?

4. క్రీస్తు ఆ సంఘాలకు చెప్పే విషయాలపై అవధానం నిలపడం ద్వారా పెద్దలు ఎలా ప్రయోజనం పొందుతారు?

5. ఎఫెసు ఎలాంటి నగరంగా ఉండేది?

6. నేటి విశ్వసనీయులైన క్రైస్తవులకు ప్రాచీన ఎఫెసులోని క్రైస్తవులకు ఎలాంటి పోలికలు ఉన్నాయి?

7, 8. ఎఫెసు సంఘంలో ఎలాంటి గంభీరమైన సమస్య ఉండేది, అలాంటి పరిస్థితిలో మనమేమి చేయవచ్చు?

9. మనం తెగవాదాన్ని ఎలా దృష్టించాలి?

10. ఆత్మ చెప్పే విషయాలను శ్రద్ధగా వినేవారు ఎలాంటి భవిష్యత్తును అనుభవిస్తారు?

11. మనం యెహోవాపట్ల ప్రేమను ఎలా పెంపొందింపజేయవచ్చు?

12. స్ముర్న గురించి, అక్కడి మతపరమైన ఆచారాల గురించి చరిత్ర ఏమి వెల్లడి చేస్తోంది?

13. స్ముర్నలోని క్రైస్తవులు భౌతికంగా పేదవారైనప్పటికీ ఏ భావంలో ధనవంతులుగా ఉండేవారు?

14, 15. ప్రకటన 2:10వ వచనం నుండి అభిషిక్త క్రైస్తవులు ఎలాంటి ఓదార్పును పొందవచ్చు?

16. మనం ప్రాచీన స్ముర్నలోని సంఘంలాంటి సంఘంతో సహవసిస్తుంటే, మనం ఏ వివాదంపై మన అవధానాన్ని నిలపాలి?

17, 18. పెర్గము ఎలాంటి ఆరాధనకు కేంద్రస్థానంగా ఉండేది, అలాంటి విగ్రహారాధనలో భాగం వహించడానికి నిరాకరిస్తే ఏమి జరిగేది?

19. బిలాము ఏమి చేశాడు, క్రైస్తవులందరూ దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి?

20. ఏ క్రైస్తవుడైనా మతభ్రష్టత్వపు దృక్కోణాలను మనస్సులో ఉంచుకుంటే అతను ఏమి చేయాలి?

21, 22. “మరుగైయున్న మన్నాను” ఎవరు భుజిస్తారు, అది దేన్ని సూచిస్తోంది?

23. ‘తెల్లరాయి,’ “క్రొత్త పేరు” దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి?

24. మనం మతభ్రష్టత్వం విషయంలో ఏ స్థానం వహించాలి?

25. యేసు ఏ సంఘాలకు ఇచ్చిన సందేశాలు తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడతాయి?

[10వ పేజీలోని మ్యాపు]

గ్రీసు

ఆసియా మైనర్‌

స్ముర్న

ఎఫెసు

పెర్గము

తుయతైర

సార్దీస్‌

ఫిలదెల్ఫియ

లవొదికయ

[12వ పేజీలోని చిత్రం]

“గొప్ప సమూహము” భూపరదైసులో ఆనందంగా జీవిస్తుంది

[13వ పేజీలోని చిత్రం]

హింసించబడే క్రైస్తవులు లోకాన్ని జయిస్తారు