కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

టేషన్‌—క్రైస్తవమత సిద్ధాంతాలను సమర్థించేవాడా విరోధించేవాడా?

టేషన్‌—క్రైస్తవమత సిద్ధాంతాలను సమర్థించేవాడా విరోధించేవాడా?

టేషన్‌​—⁠క్రైస్తవమత సిద్ధాంతాలను సమర్థించేవాడా విరోధించేవాడా?

అపొస్తలుడైన పౌలు తన మూడవ మిషనరీ యాత్ర ముగింపులో ఎఫెసులోని సంఘ పెద్దలను కలిసినప్పుడు, వారితో ఇలా చెప్పాడు: “నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.”​—⁠అపొస్తలుల కార్యములు 20:​29, 30.

పౌలు చెప్పినట్లుగానే సా.శ. రెండవ శతాబ్దంలో మార్పు జరిగింది, ముందే చెప్పబడిన మతభ్రష్టత్వము తలెత్తింది. జ్ఞానమతము, అంటే కొందరు విశ్వాసుల విశ్వాసాన్ని కలుషితం చేసిన మతపరమైన, తత్త్వజ్ఞానపరమైన ఉద్యమం అభివృద్ధి చెందింది. జ్ఞానమతస్థులు ఆధ్యాత్మిక విషయాలు మంచివి, భౌతిక విషయాలన్నీ చెడ్డవి అని నమ్మేవారు. భౌతిక ప్రపంచం పాపమయమనే తర్కంతో వారు వివాహము, సంతానోత్పత్తి సాతాను నుండి వచ్చినవని వాదిస్తూ వాటిని నిరాకరించారు. వారిలో కొందరు, ఆత్మకు సంబంధించినది మాత్రమే మంచిది కాబట్టి ఒక వ్యక్తి తన భౌతిక శరీరంతో ఏమి చేసినా ఫరవాలేదని నమ్మేవారు. అలాంటి దృక్పథాలు త్యాగ సన్యాస ప్రవృత్తి, స్వచ్ఛంద కాముక ప్రవృత్తి వంటి విపరీతమైన జీవన విధానాలకు దారితీశాయి. ఈశ్వరుని గురించిన రహస్య జ్ఞానము, లేదా సాక్షాత్కార జ్ఞానము ద్వారానే మోక్షము సాధ్యమని నమ్మే జ్ఞానమతస్థుల వాదము దేవుని వాక్య సత్యానికి ఏమాత్రం తావులేకుండా చేసింది.

క్రైస్తవులమని చెప్పుకునేవారు జ్ఞానవాదపు ప్రమాదానికి ఎలా ప్రతిస్పందించారు? కొందరు విద్యావంతులు దాని తప్పుడు సిద్ధాంతానికి అసమ్మతి ప్రకటించారు, మరికొందరు దాని ప్రభావానికి లొంగిపోయారు. ఉదాహరణకు చర్చి విరుద్ధమైన ఆ బోధనలతో ఐరేనియస్‌ జీవితకాల పోరాటాన్ని మొదలుపెట్టాడు. ఈయన అపొస్తలుల సమకాలీనుడైన పాలికార్ప్‌ వద్ద విద్యాభ్యాసం చేశాడు. యేసుక్రీస్తు బోధనలకు, ఆయన అపొస్తలుల బోధనలకు గట్టిగా అంటిపెట్టుకొని ఉండాలని పాలికార్ప్‌ సిఫార్సుచేశాడు. ఐరేనియస్‌ స్నేహితుడు ఫ్లోరినస్‌, పాలికార్ప్‌ దగ్గరే విద్యాభ్యాసం చేసినప్పటికీ జ్ఞానవాదపు ఉద్యమానికి అత్యంత ప్రముఖ నాయకుడైన వాలెంటైనస్‌ బోధనల్లోకి జారిపోయాడు. అవి నిజంగానే సంక్షోభిత కాలాలు.

ఆ కాలంనాటి మతపర ఆలోచనల గురించి టేషన్‌ రచనలు వివరిస్తున్నాయి, ఆయన రెండవ శతాబ్దంలోని ఒక ప్రముఖ రచయిత. టేషన్‌ ఎలాంటి వ్యక్తి? ఆయన తాను క్రైస్తవుడనని చెప్పుకునే వ్యక్తిగా ఎలా మారాడు? జ్ఞానమతపు విరుద్ధవాదనల ప్రభావాన్ని టేషన్‌ ఎలా ఎదుర్కొన్నాడు? ఆసక్తి రేకెత్తించే ఆయన జవాబులు, ఆయన మాదిరి నేటి సత్యాన్వేషకులకు విలువైన పాఠాలను అందిస్తాయి.

“కొన్ని విభిన్న రచనలతో” పరిచయం

టేషన్‌ సిరియా దేశస్థుడు. ఆయన అత్యధికంగా ప్రయాణాలు చేయడం వల్ల, విపరీతంగా చదవడం వల్ల ఆయన తన కాలపు గ్రీకోరోమన్‌ సంస్కృతి గురించి మంచి అవగాహన సంపాదించుకున్నాడు. టేషన్‌ ఒక సంచార ఉపన్యాసకుడిగా రోముకు వచ్చాడు. అయితే రోములో ఉన్నప్పుడు, క్రైస్తవ మతంవైపుకు ఆయన అవధానం మళ్ళింది. ఆయనకు జస్టిన్‌ మార్టిర్‌తో పరిచయమేర్పడి బహుశా చివరకు ఆయన శిష్యుడు అయివుంటాడు.

తాను ఆ కాలంలోని క్రైస్తవ మతానికి మారిన విషయాన్ని తెలియజేసే ఒక వృత్తాంతంలో, “నేను సత్యాన్ని ఎలా తెలుసుకోగలనా అని అన్వేషించాను” అని టేషన్‌ తెలియజేస్తున్నాడు. లేఖనాలు చదివే అవకాశం లభించినప్పటి తన సొంత అనుభవం గురించి చెబుతూ ఆయనిలా అంటున్నాడు: “నాకు కొన్ని విభిన్న రచనలతో పరిచయమైంది, అవి గ్రీకుల అభిప్రాయాలతో పోల్చలేనంత పురాతనమైనవి, వారి పొరపాట్లతో పోల్చలేనంత దివ్యమైనవి; వాటి సరళమైన భాష, రచయితల నిజాయితీ, భావి సంఘటనలకు సంబంధించి చూపించబడిన భవిష్యజ్ఞానము, ధర్మసూత్రాల్లోని అద్భుతమైన నాణ్యత, ఒకే వ్యక్తిపై కేంద్రీకృతమైన విశ్వ ప్రభుత్వాన్ని గురించిన ప్రకటన నేను వాటిలో విశ్వాసముంచేందుకు నడిపించాయి.”

తన కాలంనాటి క్రైస్తవత్వాన్ని పరిశీలించమని, అనాగరిక మతపు సంక్లిష్టతకు భిన్నంగా క్రైస్తవత్వంలో ఉన్న సరళత్వాన్ని, స్పష్టతను గమనించమని టేషన్‌ తన సమకాలీనులను ఆహ్వానించడానికి సంకోచించలేదు. ఆయన రచనల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

ఆయన రచనలు ఏమి వెల్లడిచేస్తున్నాయి?

టేషన్‌ రచనలు ఆయనను క్రైస్తవమతాన్ని సమర్థించే వ్యక్తిగా, తన మత విశ్వాసాలను సమర్థించుకునే ఒక రచయితగా చూపిస్తాయి. అన్యమత తత్త్వజ్ఞానం పట్ల ఆయనకు తీవ్రమైన వ్యతిరేక వైఖరి ఉండేది. ఆయన వ్రాసిన అడ్రస్‌ టు ద గ్రీక్స్‌ అనే పుస్తకంలో, అన్యమతపు అయోగ్యతను ఆ కాలంనాటి క్రైస్తవత్వపు సహేతుకతను టేషన్‌ నొక్కిచెప్పాడు. ఆయన గ్రీకు విధానాలపట్ల తన తృణీకారాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు ఉపయోగించిన రచనా శైలి చాలా నిష్ఠూరంగా ఉండేది. ఉదాహరణకు తత్త్వవేత్త అయిన హెరక్లైటస్‌ను ఉద్దేశించి ఆయనిలా వ్యాఖ్యానించాడు: “ఏదేమైనా ఆయన మరణం ఆయన బుద్ధిహీనతను వ్యక్తంచేసింది; ఎందుకంటే ఆయన జలోదర రోగానికి గురైనప్పుడు, తాను వైద్యశాస్త్రము తత్త్వజ్ఞానము అభ్యసించినవాడవడం వల్ల ఆయన తనకు తానే ఆవుపేడను పూసుకున్నాడు, అది గట్టిపడి ఆయన మొత్తం శరీరం బిగుసుకుపోయేలా చేసింది, దానితో ఆయన ముక్కలుగా చింపివేసినట్లయి చనిపోయాడు.”

సర్వ సృష్టికర్త అయిన ఏకైక దేవుణ్ణి విశ్వసించడాన్ని టేషన్‌ ఎంతో ఉన్నతమైనదిగా పరిగణించేవాడు. (హెబ్రీయులు 3:​3, 4) అడ్రస్‌ టు ద గ్రీక్స్‌ పుస్తకంలో ఆయన, దేవుడు “ఒక ఆత్మ” అని సూచిస్తూ ఇలా అంటున్నాడు: “ఆరంభం లేనివాడు ఆయనొక్కడే, అన్నింటికీ ఆరంభం ఆయనే.” (యోహాను 4:​24; 1 తిమోతి 1:​17) ఆరాధనలో విగ్రహాల ఉపయోగాన్ని తిరస్కరిస్తూ టేషన్‌ ఇలా వ్రాశాడు: “కఱ్ఱ ముక్కలను, రాళ్ళను పట్టుకొని అవి దేవుళ్ళని నేనెలా అనగలను?” (1 కొరింథీయులు 10:​14) పరలోకపు తండ్రి సృష్టికార్యాల్లో మొదటిసృష్టిగా వాక్యము లేదా లోగోస్‌ ఉనికిలోకి వచ్చాడని, ఆ తర్వాత భౌతిక విశ్వాన్ని సృష్టించడంలో ఉపయోగించబడ్డాడని ఆయన విశ్వసించాడు. (యోహాను 1:​1-3; కొలొస్సయులు 1:​13-17) నియమిత సమయంలో జరిగే పునరుత్థానం గురించి టేషన్‌ ఇలా పేర్కొంటున్నాడు: “అన్నీ అంతం అయిన తర్వాత శరీరాలు పునరుత్థానం అవుతాయని మేము విశ్వసిస్తున్నాము.” మనమెందుకు చనిపోతామనేదాని గురించి టేషన్‌ ఇలా వ్రాశాడు: “మనం చనిపోవడానికి సృష్టించబడలేదు, కానీ మనం మన సొంత పొరపాట్ల వల్లనే చనిపోతున్నాము. మన స్వేచ్ఛా చిత్తమే మనల్ని నాశనం చేసింది; స్వేచ్ఛగా ఉండే మనం బానిసలం అయ్యాము; పాపం కారణంగా మనం అమ్మివేయబడ్డాము.”

ఆత్మ గురించి టేషన్‌ ఇచ్చే వివరణ తికమకగా ఉంటుంది. ఆయనిలా అంటున్నాడు: “ఓ గ్రీకులారా, ఆత్మ దానంతట అది అమర్త్యమైనది కాదు కానీ మర్త్యమైనదే. అయినా అది మరణించకుండా ఉండడం సాధ్యమవుతుంది. అది ఒకవేళ సత్యాన్ని తెలుసుకోకపోతే అది మరణిస్తుంది, శరీరంతోపాటు నశించిపోతుంది, కానీ లోకాంతపు చివర్లో మళ్ళీ శరీరంతో లేస్తుంది, మరణాన్ని శాశ్వత శిక్షగా పొందుతుంది.” ఈ వ్యాఖ్యానాలను బట్టి టేషన్‌ అసలు ఏమి చెబుతున్నాడన్నది అస్పష్టంగా ఉంది. ఆయన కొన్ని బైబిలు బోధనలను అంటిపెట్టుకొని, అదేసమయంలో తన సమకాలీనులను సంతోషపరచడం కోసం లేఖనాధార సత్యాలకు అన్యమతపు సిద్ధాంతాలను జోడించాడని అనుకోవచ్చా?

టేషన్‌ వ్రాసిన డయాటెస్సారోన్‌ లేక హార్మనీ ఆఫ్‌ ద ఫోర్‌ గాస్పెల్స్‌ అనే మరో పుస్తకం గమనార్హమైనది. సిరియాలోని సంఘాలకు వారి స్వభాషలో సువార్తలను అందించిన మొదటి వ్యక్తి టేషన్‌. ఇది నాలుగు సువార్తలను కలిపి ఒకటే పుస్తకంగా చేయబడిన, ఎంతో ఉన్నతమైనదిగా పరిగణించబడిన గ్రంథం. దీన్ని సిరియా చర్చి ఉపయోగించింది.

క్రైస్తవుడా, చర్చి విరోధా?

టేషన్‌ రచనలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయనకు లేఖనాలతో మంచి పరిచయముందని ఆయన వాటిని బాగా గౌరవించేవాడని వెల్లడవుతుంది. తన మీద వాటి ప్రభావం గురించి ఆయనిలా వ్రాస్తున్నాడు: “నేను ఐశ్వర్యవంతుణ్ణి కావాలనే ఆత్రుత నాకు లేదు; సైనిక అధికారాన్ని నేను నిరాకరిస్తాను; అవివాహితుల మధ్య లైంగికసంబంధాన్ని నేను అసహ్యించుకొంటాను; నేను నావికుడిగా మారి సంపదలు కూడబెట్టుకోవాలనే స్వార్థపు ప్రేమతో పురికొల్పబడలేదు; . . . కీర్తి సంపాదించుకోవాలనే పిచ్చి కోరిక నాకు లేదు; . . . సంపదల్లో బ్రతికేవారికైనా పేదరికంలో బ్రతికేవారికైనా అందరికీ ఒకటే సూర్యుడు, అందరికీ ఒకటే మరణం.” టేషన్‌ ఇలా ప్రబోధిస్తున్నాడు: “లోకం నుండి విముక్తులు కండి, దానిలోని అవివేకవర్తనాన్ని వదిలేయండి. దేవుని కోసం జీవించండి, ఆయనను తెలుసుకోవడం ద్వారా మీ పాత స్వభావాన్ని వదిలేయండి.”​—⁠మత్తయి 5:​45; 1 కొరింథీయులు 6:​18; 1 తిమోతి 6:​10.

అయితే టేషన్‌ వ్రాసిన ఆన్‌ పర్‌ఫెక్షన్‌ ఎకార్డింగ్‌ టు ద డాక్ట్రిన్‌ ఆఫ్‌ ద సేవియర్‌ అనే పుస్తకాన్ని పరిశీలించండి. ఈ పుస్తకంలో ఆయన వివాహ ఏర్పాటుకు సాతానును నిందిస్తున్నాడు. వివాహం చేసుకోవడం ద్వారా, ఆయా వ్యక్తులు నాశనమయ్యే లోకంతో తమ శరీరాలను ముడిపెట్టుకుంటున్నారని అంటూ టేషన్‌ వివాహాన్ని చాలా గట్టిగా ఖండిస్తాడు.

జస్టిన్‌ మార్టిర్‌ మరణించిన తర్వాత, సుమారు సా.శ. 166లో టేషన్‌ ఎన్‌క్రాటీటస్‌ అని పిలువబడే భోగపరాణ్ముఖులైన ఒక తెగను స్థాపించినట్లు లేదా వారితో సహవసించినట్లు అనిపిస్తుంది. దాన్ని పాటించేవారు ఖచ్చితమైన ఆత్మనిగ్రహం గురించి, ఇంద్రియ వశీకరణం గురించి నొక్కి చెప్పేవారు. వారు మద్యానికి, వివాహానికి, ఆస్తులకు దూరంగా ఉంటూ సన్యాసాన్ని పాటించేవారు.

నేర్చుకోవలసిన పాఠం

టేషన్‌ లేఖనాల నుండి అంత దూరం ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన “విని మరచువాడు” అయ్యాడా? (యాకోబు 1:​23-25) టేషన్‌ తప్పుడు కథనాలను తిరస్కరించకపోవడం వల్ల మానవ తత్త్వజ్ఞానానికి బలయ్యాడా? (కొలొస్సయులు 2:⁠8; 1 తిమోతి 4:⁠7) ఆయన సమర్థించినవి చాలా పెద్ద తప్పులు కాబట్టి ఆయనకేమైనా మతి తప్పి ఉండవచ్చని అనుమానించవచ్చా?

విషయం ఏదైనప్పటికీ టేషన్‌ రచనలు, ఆయన మాదిరి ఆయన కాలంలోని మత వాతావరణం గురించిన అవగాహనను ఇస్తున్నాయి. లౌకిక తత్త్వజ్ఞానం ఎంత హానికరమైన ప్రభావాన్ని చూపించగలదో అవి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి మనము “అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము” అని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన హెచ్చరికను మనసులో ఉంచుకుందాం.​—⁠1 తిమోతి 6:​20.