నోవహు లాగ్‌బుక్ మన జీవితంలో దానికి ప్రాముఖ్యత ఉందా?
నోవహు లాగ్‌బుక్ మన జీవితంలో దానికి ప్రాముఖ్యత ఉందా?
యేసు తన ప్రత్యక్షత గురించి, ఈ యుగసమాప్తికి సూచన గురించి ప్రవచిస్తున్నప్పుడు ఇలా అన్నాడు: “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును [“ప్రత్యక్షత,” NW] ఆలాగే ఉండును.” (మత్తయి 24:3, 37) మన కాలంలో జరుగుతున్నదానికి నోవహు కాలంలో జరిగినదానికి పోలిక ఉందని యేసు ముందుగానే చెప్పాడని స్పష్టమవుతోంది. కాబట్టి నోవహు రోజుల్లో జరిగిన సంఘటనల గురించిన నమ్మదగిన ఖచ్చితమైన వృత్తాంతం మనకు ఒక అమూల్యమైన సంపదలాంటిది.
నోవహు లాగ్‌బుక్ అంత అమూల్యమైనదా? అది నిజమైన చారిత్రక నివేదికే అనడానికి ఆధారాలున్నాయా? జలప్రళయం ఎప్పుడు వచ్చిందో మనం ఖచ్చితంగా నిర్ధారించగలమా?
జలప్రళయం ఎప్పుడు వచ్చింది?
బైబిలు ఆయా సంఘటనలు జరిగిన కాలక్రమానుసారమైన సమాచారాన్ని తెలియజేస్తోంది, దాన్ని జాగ్రత్తగా వెనక్కి లెక్కిస్తూ వెళితే అది మనల్ని మానవ చరిత్ర ఆరంభానికి తీసుకువెళుతుంది. మొదటి మానవుడైన ఆదాము నుండి నోవహు జననం వరకున్న వంశానుక్రమాన్ని మనం ఆదికాండము 5:1-29 వచనాల్లో చదవవచ్చు. “నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము”లో జలప్రళయం మొదలైంది.—ఆదికాండము 7:11.
జలప్రళయం వచ్చిన సమయాన్ని నిర్ధారించేందుకు, మనమొక ప్రాముఖ్యమైన సంవత్సరం నుండి లెక్కించడం ప్రారంభించాలి. అంటే లౌకిక చరిత్ర అంగీకరించిన, బైబిలులో గ్రంథస్థమైన ఒక విశిష్ట సంఘటన జరిగిన సంవత్సరంతో మనం ప్రారంభించాలి. అలాంటి ఒక నియత బిందువు నుండి మనం లెక్కించడం ప్రారంభించి ఇప్పుడు వాడుకలోనున్న గ్రిగోరియన్ క్యాలండర్ ఆధారంగా జలప్రళయానికి ఒక తేదీని నిర్దేశించవచ్చు.
పారసీక రాజు కోరెషు బబులోనును పడగొట్టిన సా.శ.పూ. 539 ఒక ప్రాముఖ్యమైన సంవత్సరం. బబులోను శిలాశాసనాలే కాక దియోదరస్, ఆఫ్రికానస్, యుసేబియస్, టోలమీ అధికార పత్రాలు కూడా ఆయన పరిపాలనా కాలాన్ని ధృవీకరించే లౌకిక మూలాలుగా ఉన్నాయి. బబులోనులో మిగిలివున్న కొంతమంది యూదులు, కోరెషు జారీచేసిన ఒక ఆజ్ఞ కారణంగా సా.శ.పూ. 537లో బబులోను నుండి తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. దానితో యూదా నిర్మానుష్యంగా ఉండే 70 సంవత్సరాలు ముగింపుకు వచ్చాయి, బైబిలు నివేదిక ప్రకారం ఈ సమయం సా.శ.పూ. 607లో ప్రారంభమైంది. న్యాయాధిపతుల కాలాన్నీ ఇశ్రాయేలు రాజుల పరిపాలనా కాలాన్నీ లెక్కిస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిన సంవత్సరం సా.శ.పూ. 1513 అనే నిర్ధారణకు మనం వస్తాము. బైబిలు ఆధారిత కాలక్రమాన్ని బట్టి మరో 430 సంవత్సరాలు వెనక్కి లెక్కిస్తే, అబ్రాహాముతో నిబంధన చేయబడిన సా.శ.పూ. 1943కు మనం చేరుకుంటాము. ఆ తర్వాత మనం “జలప్రవాహము గతించిన రెండేండ్లకు” జన్మించిన అర్పక్షదుతోపాటు షేలహు, ఏబెరు, పెలెగు, రయూ, సెరూగు, నాహోరు, తెరహుల జననాలను వారు జీవించిన కాలాలను లెక్కించాలి. (ఆదికాండము 11:10-32) ఆ విధంగా మనం సా.శ.పూ. 2370లో జలప్రళయం ఆరంభమైందనే నిర్ధారణకు రాగలుగుతాము. *
జలప్రళయం ప్రారంభం
మనం నోవహు కాలంలోని సంఘటనలను సమీక్షించడానికి ముందు, మీరు దయచేసి ఆదికాండము 7వ అధ్యాయం 11వ వచనం నుండి 8వ అధ్యాయం 4వ వచనం వరకు చదవండి. అక్కడ కుంభవృష్టి గురించి మనకిలా చెప్పబడుతోంది: “నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము [సా.శ.పూ. 2370] రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.”—ఆదికాండము 7:11.
నోవహు ఒక సంవత్సరాన్ని నెలకు 30 రోజులున్న 12 నెలలుగా విభజించాడు. ప్రాచీన కాలాల్లో, మన క్యాలండర్ నెలైన సెప్టెంబరు మధ్యభాగంలో మొదటి నెల ఆరంభమయ్యేది. జలప్రళయం “రెండవ నెల పదియేడవ దినమున” ఆరంభమై, సా.శ.పూ. 2370 నవంబరు, డిసెంబరు నెలల్లో వరుసగా 40 పగళ్ళు 40 రాత్రులు కొనసాగింది.
జలప్రళయం విషయంలో మనకింకా ఇలా తెలియజేయబడింది: “నూట ఏబది దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను. . . . అప్పుడు నీళ్లు భూమిమీదనుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను; నూట ఏబది దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను.” (ఆదికాండము 7:24-8:4) అంటే భూమి మొత్తం జలమయమై అవి పూర్తిగా తగ్గిపోవడానికి 150 రోజులు లేదా అయిదు నెలలు పట్టింది. ఆ తర్వాత అంటే సా.శ.పూ. 2369 ఏప్రిల్ నెలలో ఆ ఓడ అరారాతు కొండలపైకి వచ్చి నిలిచింది.
ఇప్పుడు మీరు దయచేసి ఆదికాండము 8:5-17 వచనాలు చదవండి. దాదాపు రెండున్నర నెలల (73 రోజుల) తర్వాత, “పదియవ నెల [జూన్] మొదటి దినమున” కొండల శిఖరాలు కనిపించాయి. (ఆదికాండము 8:5) * మూడు నెలల (90 రోజుల) తర్వాత—నోవహు వయస్సులో “ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలిదినమున” లేదా సా.శ.పూ. 2369 సెప్టెంబరు మధ్యలో—నోవహు ఆ ఓడ కప్పు తీసి చూసినప్పుడు “నేల ఆరియుండెను.” (ఆదికాండము 8:13) నెల 27 రోజుల (57 రోజుల) తర్వాత, “రెండవ నెల యిరువది యేడవ దినమున [సా.శ.పూ. 2369 నవంబరు మధ్యలో] భూమియెండి యుండెను.” అప్పుడు నోవహు ఆయన కుటుంబము ఓడలోనుండి ఆరిన నేలమీద అడుగుపెట్టారు. దీన్నిబట్టి నోవహు మరితరులు ఆ ఓడలో ఒక చాంద్రమాన సంవత్సరం పైన పది రోజులు (370 రోజులు) గడిపారు.—ఆదికాండము 8:14.
సంఘటనలు, వివరాలు, కాల గణకాల ఈ ఖచ్చితమైన నివేదికలు ఏమి రుజువు చేస్తున్నాయి? తనకు అందజేయబడిన నివేదికల ఆధారంగా ఆదికాండము వ్రాసిన హీబ్రూ ప్రవక్త మోషే, వాస్తవాలను తెలియజేస్తున్నాడే తప్ప కాల్పనిక కథను కాదని చాలా స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.
కాబట్టి జలప్రళయానికి నేడు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఇతర బైబిలు రచయితలు జలప్రళయాన్ని ఎలా దృష్టించారు?
ఆదికాండములోని వృత్తాంతంతోపాటు నోవహు గురించి లేదా జలప్రళయం గురించి ప్రస్తావించిన నివేదనలు బైబిలులో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు:
(1) పరిశోధకుడైన ఎజ్రా నోవహును ఆయన కుమారులను (షేము హాము యాపెతు) ఇశ్రాయేలు జనాంగపు వంశావళిలో చేర్చాడు.—1 దినవృత్తాంతములు 1:4-17.
(2) వైద్యుడు, సువార్త రచయిత అయిన లూకా యేసుక్రీస్తు పూర్వీకులను పేర్కొనేటప్పుడు నోవహును కూడా చేర్చాడు.—లూకా 3:36.
(3) అపొస్తలుడైన పేతురు తన తోటి క్రైస్తవులకు వ్రాసేటప్పుడు జలప్రళయ వృత్తాంతాన్ని పలుమార్లు ప్రస్తావించాడు.—2 పేతురు 2:5; 3:5, 6.
(4) నోవహు తన ఇంటివారి రక్షణ కోసం ఓడ నిర్మించేటప్పుడు చూపించిన గొప్ప విశ్వాసం గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు.—హెబ్రీయులు 11:7.
ప్రేరేపిత బైబిలు రచయితలైన వీరు ఆదికాండములోని జలప్రళయ వృత్తాంతాన్ని అంగీకరించారనడంలో ఇంకా ఏమైనా సందేహముండే అవకాశముందా? వారందరూ దీన్ని వాస్తవ ఘటనగా పరిగణించారనడంలో ఏమాత్రం సందేహం లేదు.
యేసు, జలప్రళయం
యేసుక్రీస్తు మానవునిగా జన్మించకముందే ఉనికిలో ఉన్నాడు. (సామెతలు 8:30, 31) జలప్రళయ కాలంలో ఆయన ఒక ఆత్మ ప్రాణిగా పరలోకంలో ఉన్నాడు. అందుకే యేసు ప్రత్యక్ష సాక్షిగా నోవహు గురించి జలప్రళయం గురించి లేఖనాధారితంగా మనకు గొప్ప ధ్రువీకరణను ఇస్తున్నాడు. ఆయనిలా అన్నాడు: “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును [“ప్రత్యక్షత,” NW] ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ [“ప్రత్యక్షత,” NW] ఉండును.”—మత్తయి 24:37-39.
రానున్న ఈ విధానాంతము గురించి మనల్ని హెచ్చరించడానికి యేసు ఒక కట్టుకథను ఉపయోగిస్తాడా? ఎంతమాత్రం ఉపయోగించడు! దుష్టుల మీదికి వచ్చిన దేవుని తీర్పు గురించిన ఒక యథార్థ ఉదాహరణనే ఆయన ఉపయోగించాడని మనం దృఢంగా నమ్ముతాం. ఆ జలప్రళయంలో అనేకమంది తమ ప్రాణాలను కోల్పోయారన్నది నిజమే, కానీ నోవహు, ఆయన కుటుంబము రక్షించబడ్డారనే విషయం నుండి మనం ఊరట పొందవచ్చు.
“మనుష్యకుమారు[డైన]” యేసుక్రీస్తు “రాకడ [“ప్రత్యక్షత,” NW]” కాలంలో అంటే ఇప్పుడు జీవిస్తున్నవారికి “నోవహు దినములు” ఎంతో సూచనార్థకమైనవి. విశ్వవ్యాప్త జలప్రళయం గురించి నోవహు భద్రపరచిన వివరణాత్మక వృత్తాంతాన్ని మనం చదువుతున్నప్పుడు, అది యథార్థమైన గ్రంథమనీ చారిత్రక ఆధారమున్న గ్రంథమనీ మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. అంతేకాదు దేవునిచే ప్రేరేపించబడిన ఆదికాండములో జలప్రళయం గురించిన వృత్తాంతానికి మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. నోవహు, ఆయన కుమారులు, వారి భార్యలు తమను రక్షించడానికి దేవుడు చేసిన ఏర్పాటును విశ్వసించినట్లే నేడు మనం, యేసు విమోచన క్రయధన బలిపై విశ్వాసం ఆధారంగా యెహోవా రక్షణలోకి రావచ్చు. (మత్తయి 20:28) అంతేకాదు నోవహు ఓడ ప్రయాణ వివరాలు చూపిస్తున్నట్లుగా, అలనాటి దైవభక్తిలేని లోకాన్ని అంతం చేసిన జలప్రళయం నుండి నోవహు ఆయన కుటుంబము రక్షించబడినట్లే మనం కూడా ఈ దుష్ట విధానాంతము నుండి రక్షించబడేవారిలో ఉంటామని నిరీక్షించవచ్చు.
[అధస్సూచీలు]
^ పేరా 7 జలప్రళయ సమయాన్ని నిర్ధారించే వివరాల కోసం, యెహోవాసాక్షులు ముద్రించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 1లో 458-60 పేజీలు చూడండి.
^ పేరా 12 కైల్ డెలిట్ష్ కామెంటరీ ఆన్ ది ఓల్డ్ టెస్టమెంట్ సంపుటి 1 148వ పేజీ ఇలా వ్యాఖ్యానిస్తోంది: “బహుశా ఓడ నిలిచిన 73 రోజుల తర్వాత, పర్వత శిఖరాలు అంటే ఆ ఓడ చుట్టుపక్కలనున్న అర్మేనియన్ పీఠభూముల శిఖరాలు కనిపించి ఉండవచ్చు.”
[5వ పేజీలోని బాక్సు]
వాళ్ళు అంత కాలం జీవించారా?
“నో వహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 9:29) నోవహు తాతయ్య మెతూషెల 969 సంవత్సరాలు జీవించాడు—చరిత్రలో మానవుడు జీవించిన అత్యధిక కాలం. ఆదాము నుండి నోవహు వరకుగల పది తరాలవారి సరాసరి ఆయుష్కాలం 850 సంవత్సరాల కంటే ఎక్కువే. (ఆదికాండము 5:5-31) ఆ కాలంలో ప్రజలు అంత దీర్ఘకాలం జీవించేవారా?
మానవుడు నిరంతరం జీవించాలన్నది దేవుని మొట్టమొదటి సంకల్పం. మొదటి మానవుడైన ఆదాము దేవునికి విధేయత చూపిస్తే ఎన్నటికీ అంతము కాని ఆయుష్షుతో జీవించే సదవకాశంతో సృష్టించబడ్డాడు. (ఆదికాండము 2:15-17) కానీ ఆదాము అవిధేయత చూపించి, ఆ సదవకాశాన్ని పోగొట్టుకున్నాడు. మరణానికి నెమ్మదిగా చేరువవుతూ ఆదాము 930 సంవత్సరాల తర్వాత, తాను ఏ మట్టిలో నుండి తీయబడ్డాడో అదే మట్టిలో మళ్ళీ కలిసిపోయాడు. (ఆదికాండము 3:19; 5:5) మొదటి మానవుడు తన సంతానమంతటికీ పాపమరణాలను వారసత్వంగా సంక్రమింపజేశాడు.—రోమీయులు 5:12.
అయితే ఆ కాలంలో జీవించిన ప్రజలు, ఆదాముకు మొదట్లో ఉన్న పరిపూర్ణతకు దగ్గరగా ఉన్నారు, బహుశా ఆ కారణంగానే ఆ తర్వాత జన్మించిన వారికంటే ఎక్కువ కాలం జీవించి ఉండవచ్చు. అందుకే జలప్రళయానికి ముందు దాదాపు వెయ్యి సంవత్సరాలున్న మానవ ఆయుష్కాలం జలప్రళయం తర్వాత చాలా వేగంగా తగ్గిపోయింది. ఉదాహరణకు అబ్రాహాము కేవలం 175 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. (ఆదికాండము 25:7) నమ్మకస్థుడైన ఆ పూర్వీకుడు మరణించిన తర్వాత దాదాపు 400 సంవత్సరాలకు మోషే ప్రవక్త ఇలా వ్రాశాడు: “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు. అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే.” (కీర్తన 90:10) నేటి పరిస్థితి దాదాపు అలాగే ఉంది.
[6, 7వ పేజీలోని చార్టు/చిత్రాలు]
యూదులను చెర నుండి తిరిగి వెళ్ళేందుకు అనుమతిస్తూ కోరెషు ఇచ్చిన ఆజ్ఞ నుండి నోవహు కాలంలోని జలప్రళయం వరకు వెనక్కి లెక్కించడం
537 కోరెషు ఆజ్ఞ *
539 పారసీకుడైన కోరెషు బబులోనును
కూలద్రోయడం
68 సంవత్సరాలు
607 యూదా 70 సంవత్సరాల నిర్జనకాలం ఆరంభం
906 సంవత్సరాలు నాయకులు,
న్యాయాధిపతులు, ఇశ్రాయేలు రాజుల
పర్యవేక్షణ
1513 ఐగుప్తు నుండి ఇశ్రాయేలు నిర్గమనం
430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులోను
కనానులోను గడిపిన 430 సంవత్సరాల
కాలం (నిర్గమకాండము 12:40, 41)
1943 అబ్రాహాము నిబంధన అమలులోకి రావడం
205 సంవత్సరాలు
2148 తెరహు జననం
222 సంవత్సరాలు
2370 జలప్రళయం ఆరంభం
[అధస్సూచి]
^ పేరా 35 కోరెషు యూదులను చెరనుండి విడుదల చేసే అధికారిక ప్రకటన “పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు” చేయబడింది, అంటే బహుశా సా.శ.పూ. 538లో లేదా సా.శ.పూ. 537 ఆరంభంలో చేయబడి ఉండవచ్చు.