కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

సా.శ. 33 నుండి 36 వరకు బాప్తిస్మం తీసుకున్న యూదులు క్రీస్తు ద్వారా దేవునికి సమర్పించుకోవలసిన అవసరం లేదని ముందు విశ్వసించబడేది, అయితే 2002 ఏప్రిల్‌ 1 కావలికోట 11వ పేజీలోని 7వ పేరాలో, సా.శ. 33 పెంతెకొస్తు దినమున కొత్తగా విశ్వాసులైన యూదుల నీటి బాప్తిస్మం వారు ‘క్రీస్తు ద్వారా దేవునికి చేసుకున్న వ్యక్తిగత సమర్పణను’ సూచిస్తుందని ఎందుకు చెబుతోంది?

సా.శ.పూ. 1513లో యెహోవా దేవుడు ‘తన మాట శ్రద్ధగా విని తన నిబంధనను అనుసరించి’ నడిచినంత కాలం తన పరిశుద్ధ జనముగా ఉండే సదవకాశాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. దానికి వారు “యెహోవా చెప్పినదంతయు చేసెద[ము]” అని సమాధానమిచ్చారు.​—⁠నిర్గమకాండము 19:​3-8; 24:​1-8.

మోషే ధర్మశాస్త్రమును పాటించడానికి ఒప్పుకోవడం ద్వారా ఇశ్రాయేలీయులు దేవునికి సమర్పించుకున్నారు. ఆ తర్వాతి యూదుల సంతానం ఈ సమర్పిత జనాంగంలోనే జన్మించింది. అయితే సా.శ. 33 నుండి యేసుక్రీస్తు అనుచరులుగా మారిన యూదుల బాప్తిస్మం, ఒక సమర్పిత జనాంగపు సభ్యులుగా దేవునికి సమర్పించుకోవడాన్ని మాత్రమే కాక, యేసుక్రీస్తు ద్వారా యెహోవా దేవునితో పెంచుకునే ఒక కొత్త సంబంధాన్ని కూడా సూచిస్తోంది. ఏ విధంగా?

సా.శ. 33 పెంతెకొస్తు దినమున యెరూషలేములోని ఒక మేడగదిలో సమకూడిన దాదాపు 120 మంది శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత, అపొస్తలుడైన పేతురు లేచి నిలబడి, అక్కడేమి జరిగిందో చూడడానికి వచ్చిన అనేకమంది యూదులకు, యూదామత ప్రవిష్టులకు ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన సంపూర్ణ సాక్ష్యం ఇచ్చిన తర్వాత, పశ్చాత్తాపపడుతున్న యూదులతో ఇలా అన్నాడు: “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి.” పేతురిచ్చిన ప్రబోధకు ప్రతిస్పందనగా “అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి; ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి.”​—⁠అపొస్తలుల కార్యములు 2:​1-41.

పేతురు ప్రబోధకు ప్రతిస్పందించి బాప్తిస్మం పొందిన ఆ యూదులు అప్పటికే సమర్పించుకున్న ఒక జనాంగపు సభ్యులు కాదా? వారికి దేవునితో సమర్పిత సంబంధం లేదా? లేదు. అపొస్తలుడైన పౌలు ‘దేవుడు ధర్మశాస్త్రమును మేకులతో సిలువకు కొట్టి, మనకు అడ్డం లేకుండ దానిని ఎత్తివేశాడు’ అని వ్రాశాడు. (కొలొస్సయులు 2:​13, 14) యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులు తనతో సమర్పిత సంబంధాన్ని ఉంచుకునేందుకు ముఖ్య ఆధారమైన ధర్మశాస్త్ర నిబంధనను సా.శ. 33లో క్రీస్తు మరణం ద్వారా తీసివేశాడు. దేవుని కుమారుణ్ణి తిరస్కరించిన ఆ జనాంగాన్ని ఇప్పుడు దేవుడే స్వయంగా తిరస్కరించాడు. ‘శరీరప్రకారమైన ఆ ఇశ్రాయేలు’ ఇకపైన దేవునికి సమర్పించుకున్న జనాంగమని చెప్పుకోలేదు.​—⁠1 కొరింథీయులు 10:​18; మత్తయి 21:​43.

ధర్మశాస్త్ర నిబంధన సా.శ. 33లో కొట్టివేయబడింది, కానీ యూదుల పట్ల దేవుని ప్రత్యేక అనుగ్రహ కాలము ఆయన శ్రద్ధ మాత్రం అదే సమయంలో ముగియలేదు. * సా.శ. 36లో పేతురు, ఇటలీ దేశస్థుడూ దైవభక్తిగలవాడూ అయిన కొర్నేలీకి ఆయన ఇంటివారికి, ఇతర అన్యులకు ప్రకటించేంత వరకు ఆ కాలము కొనసాగింది. (అపొస్తలుల కార్యములు 10:​1-48) దేవుని అనుగ్రహము ఇలా పొడిగింపబడడానికి మూలాధారమేమిటి?

“[మెస్సీయా] ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును” అని దానియేలు 9:​27 తెలియజేస్తోంది. సా.శ. 29లో యేసు బాప్తిస్మం నుండి, మెస్సీయా బహిరంగ పరిచర్య ఆరంభించినప్పటి నుండి ఏడు సంవత్సరాలు లేక “ఒక వారము” వరకు అమలులో ఉన్న నిబంధన, అబ్రాహాము నిబంధన. ఒక వ్యక్తికి ఆ నిబంధనతో సంబంధం ఉండాలంటే ఆయన కేవలం అబ్రాహాము సంతానంలోని వాడైతే చాలు. కానీ ఈ ఏకపక్ష నిబంధన ఒక వ్యక్తి యెహోవాతో సమర్పిత సంబంధం ఏర్పరచుకునేందుకు ఆధారాన్నివ్వలేదు. ఆ కారణంగానే సా.శ. 33లో పేతురు ప్రసంగం ఇచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకోబోయే యూదులైన ఆ విశ్వాసులు సహజ యూదులుగా ప్రత్యేక శ్రద్ధను పొందినవారే అయినప్పటికీ, ధర్మశాస్త్ర నిబంధన తీసివేయబడడంతో దేవునితో తమకు సమర్పిత సంబంధం ఉందని చెప్పుకునే అవకాశం వారికి లేకుండా పోయింది. వారు వ్యక్తిగతంగా దేవునికి సమర్పించుకోవలసిన అవసరం ఏర్పడింది.

సా.శ. 33 పెంతెకొస్తు దినమున బాప్తిస్మం తీసుకోబోయే యూదులు, యూదా మత ప్రవిష్టులు వ్యక్తిగతంగా సమర్పించుకోవడం మరో కారణాన్ని బట్టి కూడా అత్యావశ్యకం. అపొస్తలుడైన పేతురు మారుమనస్సు పొంది యేసు నామమున బాప్తిస్మం పొందమని తన శ్రోతలను ఉద్బోధించాడు. వారలా చేయాలంటే వారు ఈ లోకపు నడవడిని వదిలేసి యేసును ప్రభువుగా, మెస్సీయాగా, ప్రధాన యాజకుడిగా, పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నవాడిగా అంగీకరించాలి. వారు క్రీస్తు యేసు ద్వారా రక్షణ కోసం యెహోవా దేవుని నామమున ప్రార్థన చేయాలి, అందులో క్రీస్తును విశ్వసించడము ఆయనను తమ నాయకుడిగా గుర్తించడము కూడా ఉంది. దేవునితో సంబంధాన్ని పెంచుకునేందుకు పాపాలకు క్షమాపణ పొందేందుకు గల మొత్తం ఆధారం ఇప్పుడు మారిపోయింది. ఈ కొత్త ఏర్పాటును విశ్వాసులైన యూదులు వ్యక్తిగతంగా అంగీకరించాలి. ఎలా? దేవునికి తమను తాము సమర్పించుకొని యేసుక్రీస్తు నామమున బహిరంగంగా నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా అంగీకరించాలి. నీటి బాప్తిస్మం వారు దేవునికి చేసుకున్న సమర్పణకు సూచన, అది వారిని యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఒక క్రొత్త సంబంధంలోకి తెస్తుంది.​—⁠అపొస్తలుల కార్యములు 2:​21, 33-36; 3:​19-23.

[అధస్సూచి]

^ పేరా 7 యేసుక్రీస్తు తను బలిగా అర్పించిన మానవ జీవితపు విలువను పరలోకానికి వెళ్ళి యెహోవా దేవునికి సమర్పించినప్పుడు, మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ముందుగా చెప్పబడిన “క్రొత్త నిబంధన”కు ఆధారం వేయబడింది.​—⁠యిర్మీయా 31:​31-34.