కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రతి ఒక్కరు తమ అంజూరపు చెట్టు క్రింద కూర్చుంటారు

ప్రతి ఒక్కరు తమ అంజూరపు చెట్టు క్రింద కూర్చుంటారు

ప్రతి ఒక్కరు తమ అంజూరపు చెట్టు క్రింద కూర్చుంటారు

మధ్యప్రాచ్య దేశాల్లో వేడిగా ఉండే వేసవి కాలాల్లో నీడ దొరకడం చాలా కష్టం. సూర్య కిరణాల నుండి రక్షించే ఏ చెట్టయినా అభిలషణీయమైనదే, ప్రత్యేకించి స్వగృహానికి దగ్గరలో పెరిగేదైతే మరీ మంచిది. పొడవుగా ఉండే వెడల్పయిన ఆకులతో, విస్తరించుకుపోయే కొమ్మలతో అంజూరపు చెట్టు దాదాపు అక్కడ ఉండే మిగతా చెట్ల కన్నా మంచి నీడను ఇస్తుంది.

ప్లాంట్స్‌ ఆఫ్‌ ద బైబిల్‌ అనే పుస్తకం ప్రకారం, “[అంజూరపు చెట్టు ఇచ్చే] నీడ గుడారం కంటే ఎక్కువ ఉపశమనాన్ని, చల్లదనాన్ని ఇస్తుందని అంటారు.” ప్రాచీన ఇశ్రాయేలులో ద్రాక్షతోటల ఒడ్డున పెరిగే అంజూరపు చెట్లు పొలం పని చేసేవారికి విశ్రాంతినిచ్చే చక్కని స్థలాలు.

వేడిగా సుదీర్ఘంగా ఉండే దినానికి ముగింపులో కుటుంబ సభ్యులు తమ అంజూరపు చెట్టు క్రింద కూర్చొని ఆనందకరమైన సహవాసాన్ని అనుభవించేవారు. అంతేకాదు అంజూరపు చెట్టు తన యజమానికి పోషకవర్ధమైన ఫలాలను సమృద్ధిగా ఇస్తుంది. ఆ కారణంగానే సొలొమోను రాజు కాలం నుండి, ఒక వ్యక్తి తన అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నాడంటే అతను శాంతి, సంక్షేమం, సమృద్ధులతో నివసిస్తున్నట్లు సూచించబడుతోంది.​—⁠1 రాజులు 4:​24, 25.

శతాబ్దాలకు పూర్వం మోషే ప్రవక్త, వాగ్దాన దేశాన్ని ‘అంజూరపు చెట్లు గల దేశము’ అని వర్ణించాడు. (ద్వితీయోపదేశకాండము 8:⁠8) పన్నెండుగురు వేగులవారు ఇశ్రాయేలీయుల సర్వసమాజం వద్దకు అంజూరపు పండ్లను, ఇతర పండ్లను తీసుకువచ్చి ఆ దేశం సుసంపన్నమైనదనడానికి నిదర్శనాన్ని చూపించారు. (సంఖ్యాకాండము 13:​21-23) 19వ శతాబ్దంలో బైబిలు ప్రదేశాలను సందర్శించిన ఒక యాత్రికుడు, అక్కడ అధికంగా కనబడే చెట్లలో అంజూరపు చెట్టు ఒకటి అని నివేదించాడు. కాబట్టి లేఖనాలు తరచూ అంజూరపు పండ్లను, చెట్లను ప్రస్తావించడంలో ఆశ్చర్యమేమీ లేదు!

రెండు పంటలనిచ్చే చెట్టు

అంజూరపు చెట్టు చాలారకాల నేలలతో సర్దుకుపోతుంది, విస్తృతంగా ఉండే దాని వేర్లు మధ్యప్రాచ్యంలో పొడిగా ఉండే వేసవిలో అది ఎక్కువ కాలం బ్రతికేందుకు దోహదపడతాయి. ఈ చెట్టు చాలా అసాధారణమైనది, ఎందుకంటే ఇది దాని తొలి పండ్లను జూన్‌లో ఇస్తే ముఖ్య పంటను సాధారణంగా ఆగస్టు తర్వాత నుండి ఇస్తుంది. (యెషయా 28:⁠4) దీని తొలి పంటను తాజాగా ఉన్నప్పుడే తినడం ఇశ్రాయేలీయులకు అలవాటు. తర్వాతి పంటను సంవత్సరమంతా వాడుకోవడానికి ఎండబెట్టుకునేవారు. ఎండబెట్టిన అంజూరపు పండ్లను పిసికి గుండ్రటి అడల్లాగా చేస్తారు, కొన్నిసార్లు వాటితో బాదం పప్పు కలుపుతారు. అంజూరపు పండ్లతో చేసిన ఈ అడలు ప్రయోజనకరమైనవిగా, పుష్టికరంగా, కమ్మగా ఉంటాయి.

బుద్ధిమంతురాలైన అబీగయీలు దావీదుకు రెండువందల అంజూరపు అడలను ఇచ్చింది, అవి శరణార్థులకు శ్రేష్ఠమైన ఆహారంగా ఉంటాయని ఆమె భావించిందనడంలో సందేహం లేదు. (1 సమూయేలు 25:​18, 27) అలా పిసికిన అంజూరపు పండ్లు వైద్యపరంగా కూడా ఉపయోగపడతాయి. హిజ్కియా ప్రాణానికి ముప్పుగా వాటిల్లిన ఒక కురుపుపైన ఎండబెట్టిన అంజూరపు పండ్ల నుండి తీసిన గుజ్జును పూశారు, అయితే ఆయన కోలుకున్నది మాత్రం ముఖ్యంగా దేవుడు జోక్యం చేసుకోవడం వల్లనే. *​—⁠2 రాజులు 20:​4-7.

ప్రాచీన కాలాల్లో ఎండబెట్టిన అంజూరపు పండ్లను మధ్యధరా ప్రాంతమంతటా చాలా విలువైనవాటిగా పరిగణించేవారు. రాజనీతిజ్ఞుడైన కాటొ, కార్తేజ్‌కు వ్యతిరేకంగా మూడవ ప్యూనిక్‌ యుద్ధం చేసేందుకు రోమన్‌ సెనెట్‌ను ఒప్పించడానికి ఒక అంజూరపు పండును చూపించాడు. రోములో లభించే శ్రేష్ఠమైన ఎండిన అంజూరపు పండ్లు ఆసియా మైనరులోని కరీయ నుండి వచ్చినవే. ఆ విధంగా ఎండబెట్టిన అంజూరపు పండ్లకు లాటిన్‌లో కారిక అనే పేరు వచ్చింది. నేడు టర్కీలో ఉన్న ఆ ప్రాంతం ఇప్పటికీ నాణ్యమైన ఎండబెట్టిన అంజూరపు పండ్లను ఉత్పత్తి చేస్తోంది.

ఇశ్రాయేలు రైతులు తరచూ తమ ద్రాక్షతోటల్లో అంజూరపు చెట్లను నాటుకునేవారు, కానీ పంటనివ్వని చెట్లను కొట్టేసేవారు. పరిమితంగా ఉండే సారవంతమైన నేలను వారు ఫలించని చెట్ల కోసం వ్యర్థం చేసేవారు కాదు. యేసు చెప్పిన ఫలమివ్వని అంజూరపు చెట్టు ఉపమానంలో, రైతు ద్రాక్ష తోటమాలితో ఇలా చెప్పాడు: “మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలె[ను].” (లూకా 13:​6, 7) యేసు కాలంలో ఫలమిచ్చే చెట్లకు పన్ను కట్టాల్సివచ్చేది కాబట్టి, ఫలమివ్వని చెట్టు ఆర్థికపరంగా కూడా అనవసరమైన భారంగా ఉండేది.

అంజూరపు పండ్లు ఇశ్రాయేలీయుల ఆహారంలో చాలా ముఖ్యమైనవిగా ఉండేవి. అందుకే, అంజూరపు పంట సరిగా పండలేదంటే అది బహుశా యెహోవా నుండి వచ్చిన ప్రతికూల తీర్పుకు సంబంధించినదిగా, ఒక విపత్తుగా పరిగణించబడేది. (హోషేయ 2:​12; ఆమోసు 4:⁠9) హబక్కూకు ప్రవక్త ఇలా అన్నాడు: “అంజూరపుచెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను, . . . నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.”​—⁠హబక్కూకు 3:​17, 18.

విశ్వాసంలేని దేశానికి సూచన

లేఖనాలు కొన్నిసార్లు అంజూరపు పండ్లను లేక అంజూరపు చెట్లను సూచనార్థకంగా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు యిర్మీయా చెరలో ఉన్న విశ్వసనీయులైన యూదులను ఒక గంపలో ఉన్న, సాధారణంగా తాజాగా తినే తొలి ఫలాలైన మంచి అంజూరపు పండ్లతో పోల్చాడు, అయితే చెరలో ఉన్న అవిశ్వసనీయులను తినకుండా పడవేసే జబ్బు అంజూరపు పండ్లతో పోల్చాడు.​—⁠యిర్మీయా 24:⁠2, 5, 8, 10.

యేసు చెప్పిన ఫలమివ్వని అంజూరపు చెట్టు ఉపమానంలో, దేవుడు యూదా జనాంగం పట్ల కనబరచిన సహనం గురించి తెలియజేశాడు. ముందు పేర్కొన్నట్లుగా ఆయన, ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు నాటుకున్న ఒక వ్యక్తి గురించి మాట్లాడాడు. ఆ చెట్టు మూడు సంవత్సరాలుగా పంటనివ్వలేదు, దానితో యజమాని దాన్ని కొట్టివేయాలనుకున్నాడు. కానీ తోటమాలి ఇలా అన్నాడు: “అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరముకూడ ఉండనిమ్ము; అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయు[ము].”​—⁠లూకా 13:⁠8, 9.

యేసు ఈ ఉపమానం చెప్పినప్పుడు, ఆయన అప్పటికి మూడు సంవత్సరాలుగా ప్రకటిస్తూ యూదా జనాంగపు సభ్యుల్లో విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాడు. సూచనార్థక అంజూరపు చెట్టుకు​—⁠యూదా జనాంగానికి​—⁠ఎరువు వేసినట్లు యేసు తన కార్యకలాపాలను తీవ్రం చేసి ఫలించడానికి దానికి అవకాశం కల్పించాడు. అయితే ఆయన మరణించిన ముందటి వారంలో, ఆ ప్రజానీకం మెస్సీయాను తిరస్కరించిందని స్పష్టమయ్యింది.​—⁠మత్తయి 23:​37, 38.

ఆ జనాంగపు ఆధ్యాత్మిక దుస్థితిని స్పష్టం చేసేందుకు యేసు మరోసారి అంజూరపు చెట్టును ఉపయోగించాడు. ఆయన మరణించడానికి నాలుగు రోజుల ముందు, బేతనియ నుండి యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఒక్క పండుకూడా ఫలించని, ఆకులతో దట్టంగా ఉన్న ఒక అంజూరపు చెట్టును చూశాడు. తొలి పండ్లు ఆకులతోపాటు కాస్తాయి​—⁠కొన్నిసార్లు ఆకులకంటే ముందే కాస్తాయి​—⁠కాబట్టి ఆ చెట్టుకు పండ్లు లేవంటే అది అయోగ్యమైనదన్నట్లే.​—⁠మార్కు 11:​13, 14. *

ఆరోగ్యంగా కనబడిన, ఫలమివ్వని ఆ అంజూరపు చెట్టులా యూదా జనాంగపు బాహ్యరూపం మోసకరంగా ఉంది. అది దేవుణ్ణి సంతోషపరిచే ఫలాలను ఫలించకుండా చివరకు యెహోవా సొంత కుమారుణ్ణే తిరస్కరించింది. పంటనివ్వని ఆ అంజూరపు చెట్టును యేసు శపించాడు, దాని తర్వాతి రోజు అది ఎండిపోయి ఉండడాన్ని శిష్యులు గమనించారు. ఎండిపోయిన చెట్టు, దేవుడు తాను ఎంపిక చేసుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులను భవిష్యత్తులో తిరస్కరించబోయేదాన్ని స్పష్టంగా సూచించింది.​—⁠మార్కు 11:​20, 21.

‘అంజూరపు చెట్టును చూచి నేర్చుకొనుడి’

యేసు తన ప్రత్యక్షత గురించి ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పించడానికి కూడా అంజూరపు చెట్టును ఉపయోగించాడు. ఆయనిలా అన్నాడు: “అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నాడని తెలిసికొనుడి.” (మత్తయి 24:​32, 33) పచ్చగా నిగ నిగలాడుతూ దృష్టిని ఆకట్టుకునేలా ఉండే అంజూరపు చెట్టు ఆకులు వేసవి కాల ఆగమనాన్ని స్పష్టంగా సూచిస్తాయి. అదేవిధంగా మత్తయి 24, మార్కు 13, లూకా 21 అధ్యాయాల్లో గ్రంథస్థమైన యేసు గొప్ప ప్రవచనం, పరలోకంలో ఇప్పుడు రాజ్యాధికారంతో ఉన్న ఆయన ప్రత్యక్షతకు స్పష్టమైన రుజువునిస్తోంది.​—⁠లూకా 21:​29-31.

చరిత్రలోనే చాలా ప్రాముఖ్యమైనటువంటి కాలంలో మనం జీవిస్తున్నాము కాబట్టి, అంజూరపు చెట్టును చూచి మనం తప్పకుండా నేర్చుకుంటాము. మనమలా నేర్చుకొని ఆధ్యాత్మికంగా మెలకువతో ఉంటే, మనకు ఈ గొప్ప వాగ్దాన నెరవేర్పును అనుభవించే నిరీక్షణ ఉంటుంది: “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవామాట యిచ్చియున్నాడు.”​—⁠మీకా 4:⁠4.

[అధస్సూచీలు]

^ పేరా 8 19వ శతాబ్దపు మధ్యభాగంలో బైబిలు దేశాలను సందర్శించిన హెచ్‌. బి. ట్రిస్ట్రమ్‌ అనే ప్రకృతి శాస్త్రజ్ఞుడు స్థానిక ప్రజలు ఇప్పుడు కూడా కురుపుల చికిత్సకు అంజూరపు పండ్ల గుజ్జును ఉపయోగిస్తున్నట్లు గమనించాడు.

^ పేరా 16 ఈ సంఘటన బేత్పగే గ్రామానికి సమీపంలో జరిగింది. ఆ పేరుకు “తొలి అంజూరపు పండ్ల ఇల్లు” అని అర్థం. ఇది, ఆ ప్రాంతం తొలి అంజూరపు పండ్లు సమృద్ధిగా పండడానికి పేరుగాంచిందని సూచిస్తుండవచ్చు.