కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముందు, తర్వాత అంధకారమైన గతం, ఉజ్వలమైన భవిష్యత్తు

ముందు, తర్వాత అంధకారమైన గతం, ఉజ్వలమైన భవిష్యత్తు

“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును”

ముందు, తర్వాత అంధకారమైన గతం, ఉజ్వలమైన భవిష్యత్తు

“దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, . . . హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (హెబ్రీయులు 4:​12) దేవుని సందేశానికున్న ఛేదించే శక్తి గురించి అపొస్తలుడైన పౌలు అలా అన్నాడు. ప్రత్యేకించి హృదయాన్ని చేరుకోవడంలో దానికున్న సామర్థ్యం సామాన్య శకం మొదటి శతాబ్దంలో స్పష్టంగా కనబడింది. ఆ కాలంలో హానికరమైన ప్రభావాలున్నప్పటికీ క్రైస్తవులుగా మారినవారు నూతన స్వభావాన్ని ధరించుకున్నారు.​—⁠రోమీయులు 1:​28, 29; కొలొస్సయులు 3:​8-10.

బైబిలులో వ్రాయబడినట్లుగా దేవుని వాక్యానికి మార్పు కలిగించే శక్తి ఉంది. ఆ శక్తి నేడు కూడా స్పష్టంగా కనబడుతోంది. ఉదాహరణకు ఎత్తుగా, బలంగా ఉండే రిచర్డ్‌ అనే ఒక వ్యక్తి విషయమే పరిశీలించండి. ముక్కోపి అయిన రిచర్డ్‌ చిన్న చిన్న విషయాలకే ముష్టియుద్ధానికి దిగేవాడు. దౌర్జన్యం ఆయన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. రిచర్డ్‌ చివరకు ఒక బాక్సింగ్‌ క్లబ్బులో చేరాడు. ఎంతో శ్రద్ధతో నేర్చుకొని జర్మనీలోని వెస్ట్‌ఫేలియలో హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా మారాడు. రిచర్డ్‌ బాగా త్రాగేవాడు తరచూ గలాటాలు కూడా చేసేవాడు. అలాంటి ఒక సందర్భంలో ఒక వ్యక్తి చంపబడ్డాడు, అప్పుడు రిచర్డ్‌ దాదాపు జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది.

రిచర్డ్‌ వైవాహిక జీవితం విషయమేమిటి? రిచర్డ్‌ జ్ఞాపకం చేసుకుంటూ ఇలా అంటున్నాడు: “నేను, హైక్‌ బైబిలు అధ్యయనం చేయడానికి ముందు మా ఇష్టమొచ్చిన రీతిలో జీవించాము. హైక్‌ తన స్నేహితురాళ్ళతో ఎక్కువ సమయం గడిపేది, నేనేమో నా అభిరుచులతో ముఖ్యంగా బాక్సింగ్‌, సర్ఫింగ్‌, డైవింగ్‌లతో గడిపేవాడిని.”

రిచర్డ్‌ హైక్‌లు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు, దేవుని వాక్యంలో పేర్కొనబడిన ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా తన జీవితాన్ని మార్చుకోవడానికి చేసుకోవలసిన మార్పులు అసంభవమైనవిగా అనిపించడంతో రిచర్డ్‌ నిర్వీర్యుడిగా భావించాడు. అయితే ఆయన యెహోవా దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి సంతోషపరచాలనే బలమైన కోరికను పెంచుకున్నాడు. దేవుడు దౌర్జన్యాన్ని ప్రేమించేవారిని గానీ వినోదం కోసం దౌర్జన్యం చేసేవారిని గానీ ఆమోదించడని రిచర్డ్‌ గ్రహించాడు. ‘బలాత్కారాసక్తులు [యెహోవాకు] అసహ్యులు’ అని రిచర్డ్‌ తెలుసుకున్నాడు.​—⁠కీర్తన 11:⁠5.

అంతేకాదు భూపరదైసులో నిత్యం జీవించే నిరీక్షణ రిచర్డ్‌ హైక్‌లను ఆకర్షించింది. వారిద్దరూ కలిసి పరదైసులో ఉండాలని కోరుకున్నారు! (యెషయా 65:​21-23) “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అనే ఆహ్వానం రిచర్డ్‌ హృదయాన్ని స్పృశించింది. (యాకోబు 4:⁠8) “బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము, వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయ గోరవద్దు. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును” అనే ప్రేరేపిత సలహాను పాటించడం ఎంతో విలువైనదని ఆయన తెలుసుకున్నాడు.​—⁠సామెతలు 3:​31, 32.

తన మార్గాలను మార్చుకోవాలని రిచర్డ్‌ బలంగా కోరుకున్నప్పటికీ, అది తన సొంత శక్తితో సాధ్యం కాదని ఆయన గ్రహించాడు. ప్రార్థన ద్వారా దేవుని సహాయం కోసం అర్థించాలని తెలుసుకున్నాడు. అందుకే ఆయన, “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన[ము]” అని యేసు తన అపొస్తలులతో చెప్పిన మాటలకు అనుగుణంగా చేశాడు.​—⁠మత్తయి 26:​41.

దౌర్జన్యాన్నీ కలహాలనూ దేవుడు ఎలా దృష్టిస్తాడన్న విషయం తెలుసుకున్న తర్వాత బాక్సింగ్‌ ఆమోదకరమైన క్రీడ కాదని రిచర్డ్‌కు అవగతమైంది. యెహోవా సహాయంతో, ఆయనతో బైబిలు అధ్యయనం చేసినవారి ప్రోత్సాహంతో రిచర్డ్‌ దౌర్జన్యాన్ని విడిచిపెట్టాడు. ఆయన బాక్సింగును, పోట్లాటలను వదిలేసి తన కుటుంబ జీవితాన్ని మెరుగుపరచుకోవాలని నిర్ణయించుకున్నాడు. “నేను చర్య తీసుకోవడానికి ముందు ఆగి ఆలోచించేందుకు, బైబిలు నుండి నేను నేర్చుకున్న సత్యం సహాయం చేసింది” అని రిచర్డ్‌ అంటున్నాడు, ఆయనిప్పుడు యెహోవాసాక్షుల ఒక సంఘంలో సాత్వికుడైన పైవిచారణకర్తగా ఉన్నాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “ప్రేమ గౌరవాల గురించిన సూత్రాలు, ఇప్పుడు నా భార్యాపిల్లలతో నా అనుబంధానికి మార్గదర్శకంగా ఉన్నాయి. తత్ఫలితంగా మా కుటుంబం సన్నిహితమయ్యింది.”

తప్పుడు సమాచారం వల్ల ప్రజలు కొన్నిసార్లు, యెహోవాసాక్షులు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తారని నిందించారు. అయితే రిచర్డ్‌ లాంటి వ్యక్తుల ఉదాహరణలు వారి ఆరోపణ తప్పని రుజువు చేస్తాయి. నిజానికి బైబిలు సత్యం కుటుంబ బంధాలను స్థిరం చేస్తుంది, అంధకారమయమైన గతాన్ని ఉజ్వలభరితమైన భవిష్యత్తుగా మారుస్తుంది.​—⁠యిర్మీయా 29:​11.

[9వ పేజీలోని చిత్రం]

“భూపరదైసు నిరీక్షణ నేను మారాలనే ప్రేరణను ఇచ్చింది”

[9వ పేజీలోని బాక్సు]

సహాయపడే బైబిలు సూత్రాలు

ప్రజల జీవితాల్లో బైబిలు శక్తివంతమైన ప్రభావాన్ని చూపగలదు. దౌర్జన్యపూరితంగా ఉండే వ్యక్తులు మారడానికి సహాయపడిన కొన్ని లేఖనాధార సూత్రాలు:

“పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు.” (సామెతలు 16:​32) అదుపుచేసుకోలేని కోపం బలహీనతకు గుర్తు, బలానికి కాదు.

“ఒకని సుబుద్ధి [“అంతర్దృష్టి,” NW] వానికి దీర్ఘశాంతము నిచ్చును.” (సామెతలు 19:​11) ఒక పరిస్థితి గురించి అంతర్దృష్టి, అవగాహన ఉంటే, ప్రతిఘటనకు దారితీసే కారణాలను స్పష్టంగా చూసేందుకు సహాయం చేసి వెంటనే కోపం రాకుండా ఆపుతుంది.

‘కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవాని మార్గములతో పరిచయము కలిగియుండకుము.’ (సామెతలు 22:​24, 25) క్రైస్తవులు క్రోధావేశానికి ఉన్ముఖులై ఉండేవారితో సహవాసాన్ని తెలివిగా తప్పించుకుంటారు.