స్థిరంగా ఉండి, జీవపు పరుగుపందెంలో
స్థిరంగా ఉండి, జీవపు పరుగుపందెంలో
విజయం సాధించండి
తుఫానుతో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ప్రయాణించవలసి వస్తే, మీరు ఎలాంటి పడవలో ప్రయాణించడానికి ఇష్టపడతారు? బలహీనంగా ఉన్న చిన్న నావలో ప్రయాణించడానికి ఇష్టపడతారా లేదా చక్కగా నిర్మించబడిన దృఢమైన ఓడలోనా? నిస్సందేహంగా మీరు దృఢమైన ఓడనే ఎంపిక చేసుకుంటారు ఎందుకంటే అది శక్తివంతమైన అలలగుండా సమర్థవంతంగా ప్రయాణించగలదు.
మనం కల్లోలభరితమైన, అపాయకరమైన ఈ విధానంలో ప్రయాణిస్తుండగా అభద్రతా భావాలను కలుగజేసే సవాళ్ళను ఎదుర్కొంటాము. ఉదాహరణకు యౌవనులు కొన్నిసార్లు ఈ లోకంలో గజిబిజిగావున్న తలంపులను, ప్రమాణాలను చూసి తికమకపడి అభద్రతగా భావించవచ్చు. ఇటీవలే క్రైస్తవులుగా తమ జీవితాలను ప్రారంభించిన వారికి ఇంకా అస్థిరంగానే అనిపిస్తుండవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా దేవునికి నమ్మకంగా సేవచేస్తూ స్థిరంగా ఉన్న కొందరికి కూడా తాము ఆశించినవి ఇంకా పూర్తిగా నెరవేరకపోవడం ఒక పరీక్షలా ఉండవచ్చు.
ఇలాంటి భావనలు కొత్తవేమీ కాదు. యెహోవాకు నమ్మకమైన సేవకులైన మోషే, యోబు, దావీదు వంటి వారు కూడా కొన్నిసార్లు అస్థిరంగా భావించారు. (సంఖ్యాకాండము 11:14, 15; యోబు 3:1-4; కీర్తన 55:4) అయినప్పటికీ వారి జీవిత విధానం, వారు యెహోవా పట్ల స్థిరమైన భక్తితో ఉన్నారని స్పష్టం చేస్తోంది. వారి చక్కని మాదిరి స్థిరంగా ఉండేందుకు మనల్ని ప్రోత్సహిస్తుంది, కానీ అపవాదియైన సాతాను నిత్యజీవితపు పరుగుపందెంలో మనల్ని పక్కదారి పట్టించాలని కోరుకుంటున్నాడు. (లూకా 22:31) కాబట్టి మనం దృఢంగా ఉంటూ “విశ్వాసమందు స్థిరులై” ఎలా ఉండవచ్చు? (1 పేతురు 5:9) మనం మన తోటి విశ్వాసులను ఎలా బలపరచవచ్చు?
యెహోవా మనం స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాడు
మనం యెహోవాకు నమ్మకంగా ఉంటే, మన స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఆయన మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. కీర్తనకర్త అయిన దావీదు ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు కానీ ఆయన దేవునిపై నమ్మకముంచాడు కాబట్టి ఇలా పాడగలిగాడు: “నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన [యెహోవా] నన్ను పైకెత్తెను. నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను.”—కీర్తన 40:2.
మనం ‘నిత్యజీవాన్ని చేపట్టేలా’ “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము” పోరాడడానికి యెహోవా మనల్ని బలపరుస్తాడు. (1 తిమోతి 6:12) మనం స్థిరంగా ఉండడానికి, ఆధ్యాత్మిక పోరాటంలో విజయం సాధించడానికి మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. “ప్రభువుయొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులై” ఉండడంలో కొనసాగమని, “అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొ[మ్మని]” అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులను ప్రోత్సహించాడు. (ఎఫెసీయులు 6:10-17) కానీ మనల్ని అస్థిరంగా చేసేదేమిటి? అలాంటి అపాయకరమైన ప్రభావాలను మనం ఎలా నిరోధించవచ్చు?
అస్థిరంగా చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి
ఈ ప్రాముఖ్యమైన వాస్తవాన్ని గుర్తుంచుకోవడం జ్ఞానయుక్తం: మనం తీసుకునే నిర్ణయాలు చివరికి మన క్రైస్తవ
స్థిరత్వంపై మంచి ప్రభావాన్నో లేక చెడు ప్రభావాన్నో చూపుతాయి. యౌవనులు తమ కెరీర్ గురించి, అదనపు విద్యాభ్యాసం గురించి, వివాహం గురించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వయోజనులు మరో ప్రాంతానికి వెళ్ళాలా లేక అదనపు ఉద్యోగం చేపట్టాలా అనే విషయంలో నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. సమయం ఎలా ఉపయోగించుకోవాలనే విషయం గురించి, అనేక ఇతర విషయాల గురించి మనం ప్రతీరోజు నిర్ణయాలు తీసుకుంటుంటాము. దేవుని సేవకులుగా మన స్థిరత్వాన్ని బలపరిచే జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? ఎంతోకాలంగా క్రైస్తవురాలిగా ఉన్న ఒక స్త్రీ ఇలా చెప్పింది: “నేను నిర్ణయాలు తీసుకునేటప్పుడు యెహోవా సహాయాన్ని కోరతాను. బైబిలులో, క్రైస్తవ కూటాల్లో, పెద్దల ద్వారా, బైబిలు ఆధారిత ప్రచురణల్లో ఇవ్వబడే ఉపదేశాన్ని స్వీకరించి అన్వయించుకోవడం చాలా ప్రాముఖ్యమని నేననుకుంటున్నాను.”నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేను ఈ రోజు తీసుకునే నిర్ణయాల విషయంలో ఐదు, పది సంవత్సరాల తర్వాత నేను సంతోషంగా ఉంటానా లేక ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు బాధపడతానా? నేను తీసుకునే నిర్ణయాలు నన్ను ఆధ్యాత్మికంగా అస్థిరంగా చేయకుండా నా ఆధ్యాత్మిక అభివృద్ధికి మద్దతునిచ్చేలా ఉన్నాయని నిశ్చయపరచుకోవడానికి నేను కృషి చేస్తున్నానా?’—ఫిలిప్పీయులు 3:16.
శోధనలకు లొంగిపోవడం లేదా దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించేంతవరకూ రావడానికి తమను తాము అనుమతించుకోవడం వల్ల కొంతమంది బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులు అస్థిరమైన జీవితాన్ని గడిపారు. పశ్చాత్తాపం లేకుండా పాపభరితమైన మార్గాన్ని అనుసరించినందుకు సంఘం నుండి బహిష్కరించబడిన కొందరు తిరిగి సంఘంలో చేరడానికి ఎంతో కృషి చేశారు, కానీ అలాంటి తప్పే చేసినందుకు—కొన్నిసార్లు వెంటనే—వారు మళ్ళీ బహిష్కరించబడ్డారు. వారు ‘చెడ్డదానిని అసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని ఉండడానికి’ దేవుని సహాయం కోసం ప్రార్థించకుండా ఉన్నారేమో అనడానికి అవకాశం ఉందా? (రోమీయులు 12:9; కీర్తన 97:10) మనమందరం ‘మన పాదములకు మార్గములను సరళము చేసుకుంటూ’ ఉండాలి. (హెబ్రీయులు 12:13) కాబట్టి మన ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మనకు సహాయపడే కొన్ని అంశాలను మనం పరిశీలిద్దాం.
క్రైస్తవ కార్యకలాపాలు చేస్తూ స్థిరంగా ఉండండి
మన జీవపు పరుగుపందెంలో స్థిరంగా పరుగెత్తడానికి ఒక మార్గం ఏమిటంటే రాజ్య ప్రకటనా పనిలో ఎక్కువగా భాగం వహించడం. అవును, దేవుని చిత్తం చేయడంపై మన హృదయాలను మనస్సులను కేంద్రీకృతం చేసి ఉంచడానికి, నిత్యజీవితపు బహుమానంపై మన దృష్టిని స్థిరంగా నిలిపివుంచడానికి క్రైస్తవ పరిచర్య ఎంతో విలువైన సాధనం. ఈ విషయంలో పౌలు కొరింథీయులను ఇలా ప్రోత్సహించాడు: “నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.” (1 కొరింథీయులు 15:58) “స్థిరులు”గా ఉండడమంటే ‘తమ స్థానంలో నిశ్చలంగా ఉండడం’ అని అర్థం. ‘కదలనివారిగా’ ఉండడమంటే ‘లంగరు వేయబడిన స్థలం నుండి దూరమవడానికి అనుమతించకపోవడాన్ని’ సూచించవచ్చు. కాబట్టి పరిచర్యలో ఎక్కువగా భాగం వహించడమనేది మన క్రైస్తవ జీవితంపై స్థిరపరిచే ప్రభావాన్ని చూపగలదు. యెహోవా గురించి తెలుసుకోవడానికి ఇతరులకు సహాయపడడం మన జీవితాలను అర్థవంతంగా చేసి మనకు సంతోషాన్నిస్తుంది.—అపొస్తలుల కార్యములు 20:35.
పౌలీన్ అనే క్రైస్తవురాలు 30 సంవత్సరాలకంటే ఎక్కువకాలం మిషనరీగా సేవ చేస్తూ, ఇతర పూర్తికాల ప్రకటనా కార్యకలాపాల్లో పాల్గొంటూ గడిపింది. ఆమె ఇలా చెబుతోంది: “పరిచర్య చేయడం నాకు రక్షణగా ఉంటుంది ఎందుకంటే ఇతరులకు సాక్ష్యమివ్వడమనేది నా దగ్గర ఖచ్చితంగా సత్యం ఉందని నేను భావించేలా చేస్తుంది.” క్రమంగా ఇతర క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొనడం—ఆరాధన కోసం కూటాలకు హాజరవడం, అత్యంతాసక్తితో వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేయడం—కూడా అలాంటి దృఢ నమ్మకాన్ని పెంపొందిస్తుంది.
ప్రేమపూర్వక సహోదరత్వం ద్వారా స్థిరపరచబడడం
సత్యారాధకుల ప్రపంచవ్యాప్త సంస్థలో భాగంగా ఉండడం మనపై శక్తివంతమైన స్థిరపరిచే ప్రభావాన్ని చూపగలదు. ఇంత ప్రేమపూర్వకమైన ప్రపంచవ్యాప్త సహోదరత్వంతో సహవసించడం ఎంత ఆశీర్వాదకరమో కదా! (1 పేతురు 2:17) మనం మన తోటి విశ్వాసులపై కూడా స్థిరపరిచే ప్రభావాన్ని చూపించవచ్చు.
నీతిమంతుడైన యోబు చేసిన సహాయకరమైన కార్యాలను పరిశీలించండి. కపట ఆదరణకర్త అయిన ఎలీఫజు కూడా ఇలా ఒప్పుకోవలసి వచ్చింది: “నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను. క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి.” (యోబు 4:4) మనం ఇతరులకు సహాయకరంగా ఉంటున్నామా? మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు దేవుని సేవలో కొనసాగేందుకు సహాయపడవలసిన బాధ్యత మనలో ప్రతీ ఒక్కరికీ ఉంది. మనం మన సహోదర సహోదరీలతో వ్యవహరించేటప్పుడు ఈ మాటల్లోని స్ఫూర్తికి అనుగుణంగా ప్రవర్తించవచ్చు: “సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి.” (యెషయా 35:3) కాబట్టి మీరు మీ తోటి క్రైస్తవులను కలిసిన ప్రతీసారీ వారిలో ఒకరినో ఇద్దరినో బలపరచి, ప్రోత్సహించడాన్ని మీ లక్ష్యంగా ఎందుకు పెట్టుకోకూడదు? (హెబ్రీయులు 10:24, 25) యెహోవాను సంతోషపరచడానికి వారు పట్టుదలతో చేస్తున్న కృషి గురించి ప్రోత్సాహకరంగా ప్రశంసించడం, మెప్పుదల చూపించడం వారు జీవపు పరుగుపందెంలో విజయం సాధించాలనే నిరీక్షణతో స్థిరంగా కొనసాగడానికి సహాయం చేస్తుంది.
క్రైస్తవ పెద్దలు కొత్త వారిని ప్రోత్సహించడం ద్వారా ఎంతో మంచిని సాధించవచ్చు. వారికి సహాయకరమైన సలహాలివ్వడం, చక్కని లేఖనాధారిత ఉపదేశాన్నివ్వడం, వారితో కలిసి క్షేత్ర పరిచర్యలో భాగం వహించడం ద్వారా దీన్ని సాధించే అవకాశం ఉంటుంది. అపొస్తలుడైన పౌలు ఇతరులను బలపరిచే అవకాశాలను ఎల్లప్పుడూ సద్వినియోగం చేసుకునేవాడు. ఆయన రోములోని క్రైస్తవులను ఆధ్యాత్మికంగా బలపరచడం కోసం వారిని చూసేందుకు ఎంతో ఆపేక్షించాడు. (రోమీయులు 1:11, 12) ఆయన ఫిలిప్పీలోని తన ప్రియమైన సహోదర సహోదరీలను తన ‘ఆనందముగా తన కిరీటముగా’ పరిగణించాడు, వారు ‘ప్రభువునందు స్థిరులై ఉండాలని’ వారికి ఉద్బోధించాడు. (ఫిలిప్పీయులు 4:1) పౌలు థెస్సలొనీకలోని తన సహోదరులు అనుభవిస్తున్న కష్టాల గురించి విన్నప్పుడు, ‘శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు వారిని స్థిరపరచడానికి’ వారిని ఓదార్చడానికి తిమోతిని పంపించాడు.—1 థెస్సలొనీకయులు 3:1-3.
అపొస్తలులైన పౌలు, పేతురు తమ తోటి ఆరాధకుల విశ్వసనీయమైన కృషిని గుర్తించి దాన్ని విలువైనదిగా ఎంచారు. (కొలొస్సయులు 2:5; 1 థెస్సలొనీకయులు 3:7, 8; 2 పేతురు 1:12) మనం కూడా వారిలాగే మన సహోదరుల బలహీనతలపై కాక వారి మంచి లక్షణాలపై, స్థిరంగా ఉండేందుకూ యెహోవాను ఘనపరిచేందుకూ వారు విజయవంతంగా పోరాడుతున్న పోరాటంపై అవధానం నిలుపుదాము.
మనం ప్రతికూలంగానో, విమర్శించే వారిగానో ఉంటే, మనం అనాలోచితంగానే ఇతరులు విశ్వాసమందు తమ స్థిరత్వాన్ని కాపాడుకోవడం వారికి మరింత కష్టమయ్యేలా చేసినవారమవుతాము. ఈ విధానంలో మన సహోదరులు ‘విసికి చెదరియున్నారని’ గుర్తుంచుకోవడం ఎంత సముచితమైనదో కదా! (మత్తయి 9:36) క్రైస్తవ సంఘంలో వారు ఓదార్పును, పునరుత్తేజాన్ని పొందగలగాలి. కాబట్టి మనమందరం మన తోటి విశ్వాసులను బలపరచడానికి, వారు స్థిరంగా ఉండేందుకు వారికి సహాయపడడానికి చేయగలినదంతా చేద్దాము.
ఇతరులు అప్పుడప్పుడు మనతో, మనం మన స్థిరత్వం కోల్పోయే విధంగా వ్యవహరించవచ్చు. కఠినమైన వ్యాఖ్యానం గానీ నిర్దయతో కూడిన చర్య గానీ యెహోవాకు మనం చేసే సేవలో మనం నీరసించిపోయేలా చేయడానికి మనం అనుమతిస్తామా? మనల్ని అస్థిరంగా చేయడానికి మనం ఎన్నడూ ఎవ్వరినీ అనుమతించకూడదు!—2 పేతురు 3:17.
దేవుని వాగ్దానాలు స్థిరపరిచే ప్రభావాన్ని చూపిస్తాయి
రాజ్య పరిపాలనలో అద్భుతమైన భవిష్యత్తు గురించిన యెహోవా వాగ్దానం, మన స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి సహాయపడే నిరీక్షణను మనకిస్తుంది. (హెబ్రీయులు 6:19) దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేరుస్తాడనే దృఢ నమ్మకం మనం ‘మెలకువగా ఉండి, విశ్వాసమందు నిలుకడగా ఉండడానికి’ మనల్ని ప్రేరేపిస్తుంది. (1 కొరింథీయులు 16:13; హెబ్రీయులు 3:6) దేవుని వాగ్దానాల్లో కొన్ని నెరవేరడం ఆలస్యమవుతోంది అనిపించినప్పుడు అది మన విశ్వాసాన్ని పరీక్షించగలదు. కాబట్టి అబద్ధపు బోధనల ద్వారా తప్పుదారి పట్టకుండా, మన నిరీక్షణ నుండి పక్కకు తొలగిపోకుండా మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండడం ఎంతో ప్రాముఖ్యం.—కొలొస్సయులు 1:23; హెబ్రీయులు 13:9.
యెహోవా వాగ్దానాల్లో విశ్వాసం లేనందువల్ల నాశనమైపోయిన ఇశ్రాయేలీయుల చెడు మాదిరి మనకు ఒక హెచ్చరికలా ఉపయోగపడాలి. (కీర్తన 78:37) మనం వారిలా ఉండకుండా స్థిరంగా ఉండి ఈ అంత్యదినాల్లో అత్యవసర భావంతో దేవునికి సేవ చేద్దాము. అనుభవజ్ఞుడైన ఒక పెద్ద ఇలా చెప్పాడు: “నేను నా జీవితంలోని ప్రతీ రోజును యెహోవా గొప్ప దినము రేపే వస్తుంది అన్నట్లు జీవిస్తాను.”—యోవేలు 1:15.
అవును, యెహోవా గొప్ప దినము రాబోతోంది. అయితే మనం దేవునికి సన్నిహితంగా ఉన్నంతకాలం దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆయన నీతియుక్తమైన ప్రమాణాలను హత్తుకొని స్థిరంగా కొనసాగితే నిత్యజీవితపు పరుగుపందెంలో మనం విజయవంతంగా పరుగెత్తవచ్చు!—సామెతలు 11:19; 1 తిమోతి 6:12, 17-19.
[23వ పేజీలోని చిత్రం]
తోటి క్రైస్తవులు స్థిరంగా ఉండడానికి సహాయపడేందుకు మీరు చేయగలిగినదంతా చేస్తున్నారా?
[21వ పేజీలోని చిత్రం]
The Complete Encyclopedia of Illustration/J. G. Heck