కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి సంతోషం కలిగించే దానం

దేవునికి సంతోషం కలిగించే దానం

దేవునికి సంతోషం కలిగించే దానం

యేసు ఆయన శిష్యులు బేతనియలో మరియ, మార్త, ఇటీవలనే పునరుత్థానం చేయబడిన లాజరుతో కలిసి విందు ఆరగిస్తున్నారు, అక్కడ ఇంకా అనేకమంది సన్నిహిత స్నేహితులు కూడా ఉన్నారు. మరియ 300 గ్రాముల ఖరీదైన తైలము తీసుకుని యేసు పాదాలకు పూసినప్పుడు ఇస్కరియోతు యూదా కోపం తెచ్చుకొని, “యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు [దాదాపు ఒక సంవత్సరం ఆదాయానికి సమానం] అమ్మి బీదలకు ఇయ్యలే[దు]?” అన్నాడు. వెంటనే ఇతరులు కూడా అలాంటి ఫిర్యాదులే చేశారు.​—⁠యోహాను 12:1-6; మార్కు 14:​3-5.

అయితే యేసు దానికిలా సమాధానమిచ్చాడు: “ఈమె జోలికిపోకుడి . . . బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, మీకిష్టమైనప్పుడెల్ల వారికి మేలు చేయవచ్చును; నేను ఎల్లప్పుడును మీతో నుండను.” (మార్కు 14:​6-9) దానధర్మాలు చేయడం ఒక సుగుణమే కాదు దాని వల్ల పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా కలుగుతుందని యూదా మతనాయకులు బోధించారు. అయితే మరో వైపున, దేవునికి సంతోషం కలిగించే దానం కేవలం బీదలకు సహాయం చేయడం మాత్రమే కాదని యేసు స్పష్టం చేశాడు.

తొలి క్రైస్తవ సంఘంలో దానం చేయబడిన విధానాన్ని క్లుప్తంగా పరిశీలించడం, మనం మన శ్రద్ధను చూపించి తద్వారా మన దానములతో దేవునికి సంతోషం కలిగించగల కొన్ని ఆచరణాత్మకమైన విధానాలను ఉన్నతపరుస్తుంది. ఎంతో మంచిని చేకూర్చే ఒక విశేషమైన దానమును కూడా అది తెలియజేస్తుంది.

“ధర్మము చేయుడి”

“ధర్మము” చేయమని యేసు అనేక సందర్భాల్లో తన శిష్యులను ప్రోత్సహించాడు. (లూకా 12:33) అయితే, దేవుణ్ణి ఘనపరిచే బదులు దాతను ఘనపరచడానికి ఉద్దేశించబడిన ఆడంబరమైన ప్రదర్శనల గురించి యేసు హెచ్చరించాడు. “నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు” అని ఆయన అన్నాడు. (మత్తయి 6:1-4) ఈ హెచ్చరికను అన్వయించుకుంటూ తొలి క్రైస్తవులు తమ కాలంనాటి భక్తిపరులైన మతనాయకుల ఆడంబరమైన ప్రదర్శనలను విడిచిపెట్టి, స్వయంగా సహాయాన్నందించడం ద్వారా బహుమానాలు ఇవ్వడం ద్వారా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎంపిక చేసుకున్నారు.

ఉదాహరణకు, మగ్దలేనే మరియ, యోహన్న, సూసన్న, మరితరులు ఎలాంటి ఆర్భాటం లేకుండా యేసుకు ఆయన అపొస్తలులకు ఉపచారము చేయడానికి “తమకు కలిగిన ఆస్తి”ని ఉపయోగించారని లూకా 8:1-3 వచనాల్లో మనకు చెప్పబడింది. ఈ పురుషులు దీనావస్థలో లేకపోయినప్పటికీ పరిచర్య కోసమే సంపూర్ణంగా కృషి చేయడానికి తమ జీవనాధారాన్ని వదులుకున్నారు. (మత్తయి 4:18-22; లూకా 5:​27, 28) దేవుడు తమకిచ్చిన నియామకాన్ని నెరవేర్చడంలో వారికి సహాయం చేయడం ద్వారా ఆ స్త్రీలు దేవుని మహిమపరిచారు. భవిష్యత్‌ తరాలవారు చదవగలిగేలా వారి దయాపూర్వక ఔదార్యం బైబిలులో వ్రాయబడేలా చూడడం ద్వారా దేవుడు తన ఆమోదాన్ని తెలియజేశాడు.​—⁠సామెతలు 19:17; హెబ్రీయులు 6:​10.

“సత్‌క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి[న]” మరో స్త్రీ దొర్కా. ఆమె సముద్రతీరంలోగల యొప్పే అనే తన పట్టణంలోని అవసరంలోవున్న స్త్రీల కోసం బట్టలు కుట్టేది. వాటికయ్యే ఖర్చంతా ఆమె భరించేదో లేక ఆమె కేవలం వారి కోసం కుట్టిపెట్టేదో మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ ఆమె చేసిన మంచి పని ఆమె సహాయం చేయగలిగిన వారికి, అలాగే దేవునికి ఆమెను ప్రియమైన వ్యక్తిగా చేసింది, ఆమె మంచి గుణాన్ని దేవుడు దయతో ఆశీర్వదించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 9:36-41.

సరైన దృక్పథం ఎంతో అవశ్యం

దానం చేయడానికి ఈ వ్యక్తులను పురికొల్పిందేమిటి? సహాయం కోసం చేయబడిన బాధతో కూడిన విజ్ఞప్తి మూలంగా పురికొల్పబడ్డ కనికరంతో కూడిన కోరిక మాత్రమే కాదు. బీదరికాన్ని, విపత్తును, అనారోగ్యాన్ని లేక ఇతర కష్టాలను అనుభవిస్తున్న వారికి ప్రతిరోజు తాము చేయగలిగిన సహాయం చేయడానికి తమకు వ్యక్తిగత, నైతిక బాధ్యత ఉందని వారు భావించారు. (సామెతలు 3:27, 28; యాకోబు 2:​15, 16) ఈ విధమైన దానం దేవునికి సంతోషం కలిగిస్తుంది. అది ప్రాథమికంగా దేవునిపట్ల ప్రగాఢమైన ప్రేమతో, ఆయన దయాపూర్వకమైన ఉదార వ్యక్తిత్వాన్ని అనుకరించాలనే కోరికతో పురికొల్పబడుతుంది.​—⁠మత్తయి 5:44, 45; యాకోబు 1:17.

“ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?” అని అపొస్తలుడైన యోహాను అడిగినప్పుడు దానం చేయడంలోని ఈ ఆవశ్యకమైన అంశాన్ని ఆయన నొక్కితెల్పాడు. (1 యోహాను 3:​17) ఆ ప్రశ్నకు సమాధానం స్పష్టంగా ఉంది. దేవుని పట్ల ప్రజలకున్న ప్రేమ వారు దానం చేసేవారై ఉండేలా చేస్తుంది. తన వలే ఉదార స్వభావాన్ని చూపించేవారిని దేవుడు విలువైనవారిగా ఎంచుతాడు, వారికి ప్రతిఫలమిస్తాడు. (సామెతలు 22:9; 2 కొరింథీయులు 9:​6-11) నేడు మనం ఈ విధమైన ఔదార్యాన్ని చూడగలమా? యెహోవాసాక్షుల ఒక సంఘంలో ఇటీవల ఏమి జరిగిందో పరిశీలించండి.

వృద్ధురాలైన ఒక క్రైస్తవురాలి ఇల్లు ఎంతో మరమ్మత్తు అవసరమైన స్థితిలో ఉంది. ఆమె ఒంటరిగా జీవిస్తోంది, ఆమెకు సహాయం చేయడానికి ఆమెకు కుటుంబ సభ్యులు లేరు. గత సంవత్సరాల్లో ఆమె ఇల్లు క్రైస్తవ కూటాల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉండేది, తన ఆహ్వానాన్ని అంగీకరించే ఎవరినైనా ఆమె తరచూ భోజనానికి పిలిచేది. (అపొస్తలుల కార్యములు 16:​14, 15, 40) ఆమె పడుతున్న అవస్థ చూసి సంఘ సభ్యులు ఆమెకు సహాయం చేయడానికి తరలి వచ్చారు. కొందరు డబ్బు రూపేణా సహాయం చేస్తే కొందరు తమ శ్రమ శక్తిని దానం చేశారు. కొన్ని వారాంతాల్లో, స్వచ్ఛంద సేవకులు ఇంటి పైకప్పు కొత్తగా వేసి, కొత్త స్నానాలగది కట్టి, మొదటి అంతస్థు అంతా ప్లాస్టరింగ్‌ చేసి పెయింట్‌ వేశారు, వంటగదిలో కొత్త అలమారాలు బిగించారు. వారు చేసిన సహాయం ఆ స్త్రీ అవసరం తీరడమే గాక సంఘమంతా సన్నిహితమయ్యింది, నిజమైన క్రైస్తవులు చేసే దానం విషయంలో అది పొరుగువారికి మంచి మాదిరిగా నిలిచింది.

మనం ఇతరులకు సహాయం చేయడానికి అనేక మార్గాలున్నాయి. తండ్రిలేని అబ్బాయితో అమ్మాయితో సమయం గడపగలమా? మనకు తెలిసిన వృద్ధ విధవరాలి కోసం దుకాణం నుండి ఏదైనా కొనుక్కురావడమో, కుట్టిపెట్టడమో చేయగలమా? ఆర్థికంగా అంత మంచి స్థితిలో లేని వారి కోసం భోజనం సిద్ధం చేయగలమా లేదా ఏదైనా ఖర్చుకు కొంత డబ్బు ఇవ్వగలమా? సహాయం చేయడానికి మనం ధనవంతులమై ఉండవలసిన అవసరం లేదు. “మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి యుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును” అని వ్రాశాడు అపొస్తలుడైన పౌలు. (2 కొరింథీయులు 8:​12) అయితే అలా స్వయంగా, సూటిగా చేసే దానాన్ని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడా? కాదు.

సంస్థీకృత ఉపశమనం విషయమేమిటి?

కొన్నిసార్లు వ్యక్తిగతంగా మనం చేసే ప్రయత్నాలు మాత్రమే సరిపోవు. వాస్తవానికి, యేసు ఆయన అపొస్తలులు పేదవారి కోసం ఉమ్మడిగా ఒక నిధిని ఏర్పాటుచేసి, తమపనిలో తాము కలిసిన శ్రద్ధగల ప్రజలు విరాళాలు ఇచ్చినప్పుడు స్వీకరించారు. (యోహాను 12:6; 13:​29) అదేవిధంగా, మొదటి శతాబ్దపు సంఘాలు అవసరం ఏర్పడినప్పుడు విరాళాలు సేకరించి, పెద్ద ఎత్తున ఉపశమన ఏర్పాట్లు చేశాయి.​—⁠అపొస్తలుల కార్యములు 2:44, 45; 6:1-3; 1 తిమోతి 5:​9, 10.

సా.శ. 55లో అలాంటి ఒక సందర్భం వచ్చింది. యూదయలోని సంఘాలు బహుశా ఆమధ్యనే సంభవించిన గొప్ప కరువు మూలంగా కావచ్చు పేదరికాన్ని అనుభవిస్తున్నాయి. (అపొస్తలుల కార్యములు 11:​27-30) పేదల గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగివున్న అపొస్తలుడైన పౌలు మాసిదోనియ అంత దూరం నుండి సంఘాల సహాయాన్ని తీసుకున్నాడు. ఆయన తానుగా కొంత విరాళాన్ని సేకరించి, దాన్ని చేరవేయడానికి ఆమోదం పొందిన పురుషులను ఉపయోగించుకున్నాడు. (1 కొరింథీయులు 16:1-4; గలతీయులు 2:​10) ఆయనగానీ దానిలో భాగం వహించిన ఇతరులెవరైనాగానీ తమ సేవలకు జీతం తీసుకోలేదు.​—⁠2 కొరింథీయులు 8:​20, 21.

నేడు యెహోవాసాక్షులు కూడా విపత్తు సంభవించినప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఉదాహరణకు, 2001 వేసవిలో, అమెరికాలోని టెక్సాస్‌లోవున్న హౌస్టన్‌లో కుంభవృష్టి కురిసి వరదలు రావడంతో మొత్తం 723 మంది సాక్షుల ఇళ్ళు పాక్షికంగా దెబ్బతినగా వాటిలో అనేకం బాగా దెబ్బ తిన్నాయి. స్థానిక సాక్షులలో ఒక్కొక్కరి అవసరాలను అంచనావేసి, పరిస్థితిని తట్టుకోవడానికి వారికి సహాయం చేయడానికీ వారి ఇళ్ళు మరమ్మత్తు చేయడానికీ విరాళాలను పంచిపెట్టేందుకు అర్హతగల క్రైస్తవ పెద్దలతో కూడిన విపత్తు ఉపశమన కమిటీ వెంటనే ఏర్పాటు చేయబడింది. ఇరుగుపొరుగు సంఘాల నుండి వచ్చిన స్వచ్ఛంద సేవకులు పని అంతా చేశారు. ఒక సాక్షి తాను అందుకున్న సహాయానికి ఎంత కృతజ్ఞతగా భావించిందంటే, తన ఇంటి మరమ్మత్తులకైన ఖర్చును తన ఇన్సూరెన్స్‌ కంపెనీ ఇచ్చినప్పుడు, అవసరంలో ఉన్న ఇతరులకు సహాయపడే విధంగా ఆమె దాన్ని వెంటనే ఉపశమన నిధికి విరాళంగా ఇచ్చింది.

అయితే సంస్థీకృత విరాళాల విషయానికి వచ్చేసరికి, మనకు చేయబడే అనేక విజ్ఞప్తులను మనం తూచి చూసుకునేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ధర్మసంస్థలకు నిర్వహణ వ్యయం లేదా విరాళాలు సేకరించడానికయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సేకరించిన డబ్బులో చాలా కొద్ది మొత్తం మాత్రమే అసలు సంకల్పానికి ఉపయోగించబడుతుంది. “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును” అని సామెతలు 14:⁠15 చెబుతోంది. కాబట్టి వాస్తవాలను జాగ్రత్తగా పరీక్షించడం జ్ఞానయుక్తమైన చర్య.

ఎంతో ప్రయోజనకరమైన దానం

విరాళాలు ఇవ్వడం కంటే ఎంతో ప్రాముఖ్యమైన దానం ఒకటుంది. నిత్యజీవం పొందడానికి నేనేమి చేయాలని ఒక ధనికుడైన యౌవన పరిపాలకుడు అడిగినప్పుడు యేసు దాని గురించి పరోక్షంగా సూచించాడు. యేసు ఆ వ్యక్తితో ఇలా అన్నాడు: “పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించు.” (మత్తయి 19:​16-22) ‘బీదలకివ్వు నీకు జీవం లభిస్తుంది’ అని యేసు చెప్పలేదని గమనించండి. బదులుగా, “నీవు వచ్చి నన్ను వెంబడించు” అని ఆయన అన్నాడు. వేరే మాటల్లో చెప్పాలంటే, దానధర్మాలు చేయడం ఎంతో ప్రశంసనీయము, ప్రయోజనకరము అయినప్పటికీ క్రీస్తు శిష్యునిగా ఉండడంలో అంతకంటే ఎక్కువే చేరివుంది.

యేసుకున్న ముఖ్య శ్రద్ధ ఏమిటంటే ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేయాలన్నదే. ఆయన తన మరణానికి కొంచెం ముందు పిలాతుతో ఇలా అన్నాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.” (యోహాను 18:​37) పేదవారికి సహాయం చేయడం, రోగులను స్వస్థపరచడం, ఆకలిగొన్న వారి ఆకలి తీర్చడం వంటివాటిలో యేసు ముందున్నప్పటికీ ఆయన తన శిష్యులకు ప్రాథమికంగా ప్రకటించే పనిలో శిక్షణనిచ్చాడు. (మత్తయి 10:​7, 8) వాస్తవానికి, ఆయన వారికిచ్చిన చివరి సూచనల్లో ఈ ఆజ్ఞ ఉంది: “వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.”​—⁠మత్తయి 28:​19, 20.

నిజమే ప్రకటనా పని ప్రపంచ సమస్యలన్నిటినీ పరిష్కరించదు. అయినప్పటికీ దేవుని రాజ్య సువార్తను అన్ని రకాల ప్రజలతో పంచుకోవడం దేవుణ్ణి ఘనపరుస్తుంది ఎందుకంటే ప్రకటనా పని దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దైవిక సందేశాన్ని అంగీకరించేవారు నిత్య ప్రయోజనాలు పొందడానికి మార్గాన్ని తెరుస్తుంది. (యోహాను 17:3; 1 తిమోతి 2:​3, 4) ఈసారి యెహోవాసాక్షులు వచ్చినప్పుడు వారేమి చెప్పాలనుకుంటున్నారో ఎందుకు వినకూడదు? వాళ్ళు ఒక ఆధ్యాత్మిక బహుమతితో వస్తారు. వాళ్ళు మీకు ఇవ్వడానికి అది అత్యంత శ్రేష్ఠమైన మార్గమని వాళ్ళకు తెలుసు.

[6వ పేజీలోని చిత్రం]

మనకు శ్రద్ధ ఉందని చూపించడానికి అనేక మార్గాలున్నాయి

[7వ పేజీలోని చిత్రం]

మనం సువార్త ప్రకటించడం దేవునికి సంతోషం కలిగించి, నిత్య ప్రయోజనాలకు మార్గాన్ని తెరుస్తుంది