కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిశ్చలంగా నిలువబడి యెహోవా దయచేసే రక్షణను చూడండి!

నిశ్చలంగా నిలువబడి యెహోవా దయచేసే రక్షణను చూడండి!

నిశ్చలంగా నిలువబడి యెహోవా దయచేసే రక్షణను చూడండి!

‘మీ స్థానాల్లో నిశ్చలంగా నిలువబడి మీ పక్షాన యెహోవా దయచేసే రక్షణను చూడండి.’ ​—⁠2 దినవృత్తాంతములు 20:​17, Nw.

ఉగ్రవాదం ప్రపంచవ్యాప్త సమాజంపై, నాగరికతపై జరుగుతున్న దాడి అని వర్ణించబడింది. ఇలాంటి ప్రమాదాన్ని తప్పక గంభీరంగా తీసుకోవాలనడం అర్థంచేసుకోదగినదే. మరోవైపున, దానికంటే తీవ్రమైన పరిణామాలకు దారితీసే మరో దాడికి ప్రపంచవ్యాప్త సమాజం చాలా తక్కువ అవధానాన్నిస్తుంది లేదా అసలు అవధానమే ఇవ్వడంలేదు. ఏమిటా దాడి?

2 అది “మాగోగు దేశపువాడైన గోగు” చేసే దాడి, బైబిలు దాని గురించి యెహెజ్కేలు 38వ అధ్యాయంలో తెలియజేస్తోంది. ఈ దాడి అంతర్జాతీయ ఉగ్రవాదం కంటే తీవ్రమైన పరిణామాలను తీసుకువస్తుందని చెప్పడం అతిశయోక్తా? ఎంతమాత్రం కాదు ఎందుకంటే గోగు కేవలం మానవ ప్రభుత్వాలపై మాత్రమే దాడి చేయడు. ఆ దాడి దేవుని పరలోక ప్రభుత్వంపైనే జరుగుతుంది! మానవుల వ్యవస్థపై దాడులు జరిగితే వాటితో వ్యవహరించడంలో వారు పరిమితమైన విజయాన్ని మాత్రమే సాధించగలరు కానీ సృష్టికర్త వారిలా కాక, గోగు చేసే మరింత హానికరమైన దాడితో వ్యవహరించడానికి పూర్తిగా సమర్థుడు.

దేవుని ప్రభుత్వంపై దాడి

3 పరలోకంలో 1914వ సంవత్సరంలో దేవుని రాజ్యం స్థాపించబడినప్పటి నుండి, ప్రస్తుతం పరిపాలిస్తున్న దేవుని రాజుకు సాతాను దుష్ట వ్యవస్థకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో, దేవుడు ఎంపిక చేసుకున్న పరిపాలకునికి విధేయత చూపమని మానవ పరిపాలకులకు తెలియజేయబడింది. కానీ ముందే ప్రవచించబడినట్లుగా వారు అలా విధేయత చూపడానికి నిరాకరించారు: “మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.” (కీర్తన 2:​1-3) మాగోగు దేశపువాడైన గోగు దాడి చేసినప్పుడు, రాజ్య పరిపాలనపట్ల చూపించబడుతున్న ధిక్కారం ఖచ్చితంగా ముగింపుకు చేరుకుంటుంది.

4 మానవులు అదృశ్యమైన, పరలోక ప్రభుత్వంతో ఎలా పోరాడగలరు అని మనం ఆశ్చర్యపోవచ్చు. ఈ ప్రభుత్వం, “గొఱ్ఱెపిల్ల” అయిన క్రీస్తు యేసుతోపాటు ‘భూలోకములోనుండి కొనబడిన నూట నలువది నాలుగువేలమందితో’ రూపొందించబడిందని బైబిలు వెల్లడిచేస్తోంది. (యోహాను 1:​29; ప్రకటన 14:⁠1, 3) ఈ క్రొత్త ప్రభుత్వం పరలోక సంబంధమైనది కాబట్టి అది “క్రొత్త ఆకాశము” అని పిలువబడింది, భూమ్మీద ఆ ప్రభుత్వానికి లోబడి ఉండే ప్రజలు సహేతుకంగానే “క్రొత్త భూమి” అని పిలువబడ్డారు. (యెషయా 65:17; 2 పేతురు 3:​13) క్రీస్తుతోపాటు సహపరిపాలకులుగా ఉండే 1,44,000 మందిలో ఇప్పటికే చాలామంది తమ భూజీవితాన్ని విశ్వసనీయంగా ముగించారు. ఆవిధంగా వారు పరలోకంలో క్రొత్త సేవాధిక్యతలను చేపట్టడానికి తాము అర్హులమని నిరూపించుకున్నారు.

5 అయితే 1,44,000 మందిలో కొంత శేషం ఇప్పటికీ భూమ్మీదే ఉన్నారు. 2002వ సంవత్సరంలో ప్రభు రాత్రి భోజనానికి హాజరైన 1,50,00,000 కంటే ఎక్కువ మందిలో కేవలం 8,760 మంది మాత్రమే తాము పరలోక నియామకానికి ఎంపిక చేయబడ్డారనే తమ నిరీక్షణను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాజ్య పరిపాలకులుగా ఉండబోయే వారిలో భూమ్మీద మిగిలివున్నవారిపై దాడి చేయడానికి ఎవరైనా సాహసిస్తే వారు నిజానికి దేవుని రాజ్యంపై దాడి చేస్తున్నారు.​—⁠ప్రకటన 12:17.

రాజు జయిస్తాడు

6 యెహోవా స్థాపించిన రాజ్యానికి ఎదురయ్యే వ్యతిరేకతకు ఆయన ఎలా ప్రతిస్పందిస్తాడో ప్రవచించబడింది: “ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును​—⁠నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను.” (కీర్తన 2:​4-6) యెహోవా నడిపింపు క్రింద క్రీస్తు ‘జయించడానికి’ సమయం ఆసన్నమైంది. (ప్రకటన 6:⁠2) చివరిసారిగా జయించే సమయంలో తన ప్రజలకు ఎదురయ్యే వ్యతిరేకతను యెహోవా ఎలా దృష్టిస్తాడు? అది నిజానికి తనకు, పరిపాలిస్తున్న తన రాజుకు వ్యతిరేకంగా చేయబడుతున్నట్టు యెహోవా దృష్టిస్తాడు. “మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవా[డు]” అని యెహోవా చెబుతున్నాడు. (జెకర్యా 2:⁠8) ప్రజలు, తన అభిషిక్త సహోదరులకు ఏమి చేశారో, ఏమి చేయలేదో అవి తనకు చేసినట్లు లేదా చేయనట్లు దృష్టిస్తానని యేసు నొక్కి చెప్పాడు.​—⁠మత్తయి 25:40, 45.

7 అదే ప్రకారంగా అభిషిక్త శేషానికి చురుగ్గా మద్దతునిస్తున్నవారు గోగు కోపోద్రేకానికి గురవుతారు. దేవుని “క్రొత్త భూమి”లో ఉండబోయే వీరు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు” పిలువబడిన “గొప్పసమూహము.” (ప్రకటన 7:⁠9) వారు ‘తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి’ ఉన్నారని చెప్పబడుతోంది. అలా వారికి దేవుని ఎదుట క్రీస్తు యేసు ఎదుట ఆమోదయోగ్యమైన స్థానం ఉంది. వారు “ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని” విశ్వసర్వాధిపతిగా న్యాయమైన హక్కుగల యెహోవాను స్తుతిస్తారు, యెహోవా రాజుగా సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు అంటే “దేవుని గొఱ్ఱెపిల్ల” చేసే పరిపాలన యెహోవా పరిపాలనకు ప్రాతినిధ్యం వహిస్తుంది.​—⁠యోహాను 1:29, 36.

8 గోగు దాడి చేసినప్పుడు, సింహాసనాసీనుడైన దేవుని రాజు చర్య తీసుకొని అర్మగిద్దోను యుద్ధం చేస్తాడు. (ప్రకటన 16:​14, 16) యెహోవా సర్వాధిపత్యాన్ని అంగీకరించడానికి నిరాకరించేవారు నాశనం చేయబడతారు. మరోవైపున, దేవుని రాజ్యానికి విశ్వసనీయంగా ఉన్నందుకు హింసలను సహించిన వారు శాశ్వత ఉపశమనాన్ని పొందుతారు. దీని గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.”​—⁠2 థెస్సలొనీకయులు 1:5-8.

9 రానున్న మహాశ్రమల కాలంలో క్రీస్తు దుష్టత్వమంతటికీ వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు, ఈ మహాశ్రమలు అర్మగిద్దోనుతో ముగుస్తాయి. కానీ ఆయన అనుచరులు పోరాడవలసిన అవసరం ఉండదు, వేల సంవత్సరాల క్రితం రెండు తెగల రాజ్యమైన యూదా నివాసులు కూడా పోరాడవలసిన అవసరం రాలేదు. యుద్ధం యెహోవాది, ఆయనే వారికి విజయాన్ని అనుగ్రహించాడు. ఆ నివేదిక ఇలా చెబుతోంది: “వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయులమీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు.”​—⁠2 దినవృత్తాంతములు 20:22-24.

10 యెహోవా ముందుగా చెప్పినట్లే జరిగింది: “మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు.” (2 దినవృత్తాంతములు 20:​17) యేసుక్రీస్తు “జయించుటకు” వచ్చినప్పుడు క్రైస్తవులు అనుసరించడానికి అది ప్రమాణాన్ని ఏర్పరచింది. అంతవరకూ వారు దుష్టత్వానికి వ్యతిరేకంగా అక్షరార్థమైన ఆయుధాలతో కాక ఆధ్యాత్మిక ఆయుధాలతో పోరాడుతూనే ఉంటారు. అలా చేయడం ద్వారా వారు “మేలు చేత కీడును జయి[స్తూనే]” ఉంటారు.​—⁠రోమీయులు 6:13; 12:17-21; 13:12; 2 కొరింథీయులు 10:3-5.

గోగు దాడిని ఎవరు నడిపిస్తారు?

11 మాగోగు దేశపువాడైన గోగు, 1914 నుండి అవమానకరమైన స్థానంలో ఉన్న అపవాదియగు సాతానుగా గుర్తించబడ్డాడు. ఒక ఆత్మప్రాణిగా అతను ప్రత్యక్షంగా దాడి చేయలేడు, కానీ అతను తన పనులు చేయడానికి మానవ శక్తులను ఉపయోగించుకుంటాడు. ఈ మానవ శక్తులు ఎవరై ఉంటారు? ఈ విషయంలో బైబిలు మనకు వివరాలేమీ ఇవ్వడం లేదు కానీ వారు ఎవరై ఉంటారో గుర్తించడానికి సహాయంచేసే కొన్ని సూచనలను ఇస్తుంది. బైబిలు ప్రవచనాలను నెరవేరుస్తూ ప్రపంచ సంఘటనలు సంభవిస్తుండగా మనకు క్రమంగా మరింత స్పష్టమైన అవగాహన లభిస్తుంది. యెహోవా ప్రజలు అనవసరమైన ఊహాగానాలు చేయరు కానీ బైబిలు ప్రవచన నెరవేర్పును సూచించే రాజకీయపరమైన, మతపరమైన సంఘటనల గురించి పూర్తిగా తెలుసుకొని ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉంటారు.

12 దేవుని ప్రజలపై జరిగే ఆఖరి దాడి గురించి దానియేలు ప్రవక్త మరింత సమాచారాన్ని వెల్లడిచేస్తూ ఇలా వ్రాశాడు: “అత్యాగ్రహము కలిగి అనేకులను పాడుచేయుటకును నశింపజేయుటకును అతడు [ఉత్తరదేశపు రాజు] బయలుదేరును. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములుగల పర్వతమునకును మధ్య వేయును.”​—⁠దానియేలు 11:44, 45.

13 బైబిలు కాలాల్లో ఆ “సముద్రము[లు]” మహా సముద్రాన్ని లేదా మధ్యధరా సముద్రాన్ని, “పరిశుద్ధానందములుగల పర్వతము” సీయోను పర్వతాన్ని సూచించాయి. సీయోను గురించి యెహోవా ఇలా చెప్పాడు: “నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను.” (కీర్తన 2:6; యెహోషువ 1:⁠4) కాబట్టి ఆధ్యాత్మిక భావంలో “సముద్రములకును పరిశుద్ధానందములుగల పర్వతమునకును మధ్య” ఉన్న భూమి అభిషిక్త క్రైస్తవుల సంపన్న ఆధ్యాత్మిక స్థితికి ప్రాతినిధ్యం వహిస్తోంది. వారు ఇక దేవునికి దూరమైపోయిన మానవజాతిని సూచించే సముద్రంలో భాగంగా గుర్తించబడరు, వారు క్రీస్తు యేసుతోపాటు పరలోక రాజ్యంలో పరిపాలించడానికి నిరీక్షిస్తున్నారు. దానియేలు ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉత్తరదేశపు రాజు తన హానికరమైన దాడిని ప్రారంభించినప్పుడు దేవుని అభిషిక్త సేవకులు, గొప్ప సమూహానికి చెందిన విశ్వసనీయమైన వారి సహచరులు అతని ఆగ్రహానికి గురవుతారు.​—⁠యెషయా 57:20; హెబ్రీయులు 12:22; ప్రకటన 14:⁠1.

దేవుని సేవకులు ఎలా ప్రతిస్పందిస్తారు?

14 దేవుని సేవకులపై దాడి చేయబడినప్పుడు వారు ఏమి చేయాలని ఆశించబడుతుంది? యెహోషాపాతు కాలంలో దేవుని విశిష్టమైన జనాంగం ప్రతిస్పందించిన విధానం ఈ విషయంలో కూడా ఒక ప్రమాణాన్ని ఏర్పరుస్తుంది. ఆ జనాంగం మూడు పనులు చేయడానికి ఆజ్ఞాపించబడ్డారని గమనించండి: (1) తమ స్థానాల్లో ఉండడం, (2) నిశ్చలంగా నిలువబడడం, (3) యెహోవా రక్షణను చూడడం. నేడు దేవుని ప్రజలు ఈ మాటలకు అనుగుణంగా ఎలా ప్రవర్తిస్తారు?​—⁠2 దినవృత్తాంతములు 20:​17, NW.

15తమ స్థానాల్లో ఉండడం: దేవుని ప్రజలు అస్థిరంగా ఉండకుండా, దేవుని రాజ్యాన్ని చురుగ్గా సమర్థించడంలో తమ స్థానాన్ని కాపాడుకుంటారు. వారు తమ క్రైస్తవ తటస్థతను కాపాడుకోవడంలో కొనసాగుతారు. వారు యెహోవాకు చేసే విశ్వసనీయమైన సేవలో ‘స్థిరులుగా, కదలనివారిగా’ ఉంటారు, యెహోవా చూపిస్తున్న ప్రేమపూర్వక దయను బట్టి ఆయనను బహిరంగంగా స్తుతిస్తూనే ఉంటారు. (1 కొరింథీయులు 15:58; కీర్తన 118:​28, 29) ప్రస్తుత ఒత్తిడి గానీ భవిష్యత్తులో రాగల ఒత్తిడి గానీ, దేవునిచే ఆమోదించబడిన వారి స్థానం నుండి వారిని కదల్చలేవు.

16నిశ్చలంగా నిలువబడడం: యెహోవా సేవకులు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించరు కానీ వారు తమ పూర్తి నమ్మకాన్ని యెహోవాపై ఉంచుతారు. తన సేవకులను ఈ లోకపు గందరగోళం నుండి తప్పించే సామర్థ్యం కేవలం ఆయనకు మాత్రమే ఉంది, ఆయన వారిని రక్షిస్తానని వాగ్దానం చేశాడు. (యెషయా 43:10, 11; 54:15; విలాపవాక్యములు 3:​26) యెహోవాపై నమ్మకముంచడంలో, ఆయన తన సంకల్పాల కోసం 100 సంవత్సరాలకు పైగా ఉపయోగించుకుంటున్న ఆధునికదిన దృశ్య విధానంపై నమ్మకముంచడం కూడా చేరివుంది. మనపై పర్యవేక్షించడానికి యెహోవా నుండి, పరిపాలిస్తున్న ఆయన రాజు నుండి అధికారం పొందిన తోటి ఆరాధకులపై నిజ క్రైస్తవులు మునుపటికంటే ఎక్కువగా ఆ సమయంలో నమ్మకముంచాలి. నమ్మకస్థులైన ఈ పురుషులు దేవుని ప్రజలను నడిపిస్తారు. వారి నడిపింపును నిర్లక్ష్యం చేస్తే అది విపత్తుకు దారితీస్తుంది.​—⁠మత్తయి 24:45-47; హెబ్రీయులు 13:7, 17.

17యెహోవా రక్షణను చూడడం: తమ క్రైస్తవ యథార్థతను కాపాడుకొని, రక్షణ కోసం యెహోవాపై నమ్మకముంచే వారందరికీ రక్షణ అనుగ్రహించబడుతుంది. వారు ఆఖరి గడియ వరకు తమకు సాధ్యమైనంత ఎక్కువగా, యెహోవా తీర్పు రాబోతుందని ప్రకటిస్తారు. యెహోవా సత్య దేవుడని, ఆయనకు భూమ్మీద నమ్మకమైన సేవకులున్నారని సృష్టంతటికీ తెలియాలి. యెహోవా సర్వాధిపత్యానికి గల న్యాయమైన హక్కు విషయంలో మరెన్నడూ ఇంత సుదీర్ఘమైన వివాదం ఉండదు.​—⁠యెహెజ్కేలు 33:33; 36:23.

18 పునరుద్ధరించబడిన శక్తితో దేవుని ప్రజలు క్రొత్త లోకంలోకి ప్రవేశిస్తారు, ప్రాచీన ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం నుండి తప్పించబడినప్పుడు పాడినట్లు వారు కూడా విజయ గీతాన్ని పాడడానికి ఆతురతతో ఉంటారు. యెహోవా దయచేసిన రక్షణకు నిరంతరం కృతజ్ఞులై ఉంటూ వారు వ్యక్తిగతంగా, ఒక గుంపుగా ఈ ప్రాచీన మాటలను ప్రతిధ్వనిస్తారు: “యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను . . . యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు. . . . యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయమువలన అణచివేయుదువు నీ కోపాగ్నిని రగులజేయుదువు అది వారిని చెత్తవలె దహించును. . . . నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. . . . నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువపెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు.”​—⁠నిర్గమకాండము 15:1-19.

19 నిత్యము జీవించివుండే నిరీక్షణ ఇప్పుడు మునుపటికంటే స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి దేవుని సేవకులు యెహోవాపట్ల తమకున్న భక్తిని ప్రదర్శించడానికి, తమ శాశ్వతమైన రాజుగా ఆయనకు సేవచేయాలనే తమ తీర్మానాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇది ఎంత చక్కని సమయమో కదా!​—⁠1 దినవృత్తాంతములు 29:11-13.

మీరు వివరించగలరా?

• గోగు అభిషిక్తులపై, వేరే గొఱ్ఱెలపై ఎందుకు దాడి చేస్తాడు?

• దేవుని ప్రజలు తమ స్థానాల్లో ఎలా ఉంటారు?

• నిశ్చలంగా నిలబడివుండడం అంటే భావమేమిటి?

• దేవుని ప్రజలు యెహోవా రక్షణను ఎలా చూస్తారు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. “మాగోగు దేశపువాడైన గోగు” చేయబోయే దాడి అంతర్జాతీయ ఉగ్రవాదం కంటే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని ఎందుకు చెప్పవచ్చు?

3. ప్రపంచ పరిపాలకులు 1914 నుండి ఏమి చేయడానికి ఆహ్వానించబడ్డారు, వారు దానికి ఎలా ప్రతిస్పందించారు?

4, 5. దేవుని అదృశ్యమైన, పరలోక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మానవులు ఎలా పోరాడగలరు?

6. దేవుని ప్రజలకు ఎదురయ్యే వ్యతిరేకతను యెహోవా, క్రీస్తు ఎలా దృష్టిస్తారు?

7. ప్రకటన 7:9లో వర్ణించబడిన “గొప్ప సమూహము”కు చెందినవారు ఏ కారణాలను బట్టి గోగు కోపోద్రేకానికి గురవుతారు?

8. గోగు దాడి చేసినప్పుడు క్రీస్తు ఏమి చేస్తాడు, దాని ఫలితమేమిటి?

9, 10. యెహోవా యూదాకు భయంకరమైన శత్రువుపై విజయాన్ని ఎలా అనుగ్రహించాడు? (బి) నేడు క్రైస్తవులు ఏమి చేస్తూనే ఉండాలి?

11. (ఎ) గోగు దాడి చేయడానికి ఏ శక్తులను ఉపయోగించుకుంటాడు? (బి) ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉండడంలో ఏమి చేరివుంది?

12, 13. దేవుని ప్రజలపై జరిగే ఆఖరి దాడి గురించి దానియేలు ప్రవక్త ఎలా ప్రవచించాడు?

14. దేవుని ప్రజలపై దాడి చేయబడినప్పుడు వారు ఏ మూడు పనులను చేస్తారు?

15. యెహోవా ప్రజలు తమ స్థానాల్లో ఉండడం అంటే ఏమిటి?

16. యెహోవా సేవకులు ఏ విధంగా నిశ్చలంగా నిలువబడి ఉంటారు?

17. దేవుని నమ్మకమైన సేవకులు ఎందుకు యెహోవా రక్షణను చూస్తారు?

18, 19. (ఎ) గోగు దాడినుండి రక్షించబడేవారి భావాలను నిర్గమకాండము 15వ అధ్యాయంలోని విజయగీతం ఎలా ప్రతిబింబిస్తుంది? (బి) యెహోవా ప్రజలు ఇప్పుడు ఏమి చేయడం తగినది?

[18వ పేజీలోని చిత్రం]

యెహోషాపాతు, ఆయన ప్రజలు పోరాడవలసిన అవసరం లేకుండానే యెహోవా వారికి విజయాన్ని అనుగ్రహించాడు

[20వ పేజీలోని చిత్రం]

అభిషిక్తులు, వేరే గొఱ్ఱెలు కలిసి యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తారు

[22వ పేజీలోని చిత్రం]

ప్రాచీన ఇశ్రాయేలీయుల్లా, దేవుని ప్రజలు త్వరలోనే విజయగీతం పాడతారు