కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

జబ్బుపడిన లేదా బాగా ముసలిదైపోయిన పెంపుడు జంతువును చంపడం తప్పా?

చాలామంది వివిధ జంతువులు ఆసక్తికరంగా ఉంటాయని, ఆనందాన్నిస్తాయని భావిస్తారు. కొన్ని సాధుజంతువులు పెంపుడు జంతువులుగా మంచి సహచరులుగా ఉంటాయి. ఉదాహరణకు, కుక్కలు తమ యజమానుల పట్ల సంపూర్ణ విధేయత, ప్రేమ చూపిస్తాయని పేరుపొందాయి. కాబట్టి ప్రజలు అలాంటి పెంపుడు జంతువు పట్ల, ముఖ్యంగా ఆ పెంపుడు జంతువు గనుక ఎన్నో సంవత్సరాలుగా తమతో ఉంటే వారు దాని పట్ల మక్కువ పెంచుకోవడం అర్థం చేసుకోదగినదే.

అయితే, చాలా పెంపుడు జంతువుల ఆయుష్షు ఎంతో ఎక్కువ ఉండదు. కుక్కలు, పిల్లులు వాటి వాటి జాతిని బట్టి దాదాపు 10 నుండి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అవి ముసలివైపోయినప్పుడు జబ్బుపడడం, బలహీనమవ్వడం జరగవచ్చు, ఆ జంతువులు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఎంతో చురుగ్గా ఉండడం చూసిన వాటి యజమానులకు అది బాధకలిగించవచ్చు. అలాంటి జంతువులను వాటి బాధ నుండి తప్పించడం, వాటిని చంపేయడం తప్పా?

ఒక క్రైస్తవుడు జంతువులతో వ్యవహరించేటప్పుడు దేవుని చిత్తానికి అనుగుణంగా వ్యవహరించాలని కోరుకోవచ్చు. వాటితో క్రూరంగా వ్యవహరించడం ఖచ్చితంగా దేవుని చిత్తానికి విరుద్ధమైనదే, ఎందుకంటే ఆయన వాక్యం ఇలా చెబుతోంది: “నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును.” (సామెతలు 12:​10) అయితే, దేవుడు జంతువులను కూడా మానవులను దృష్టించినట్లే దృష్టిస్తాడని దాని భావం కాదు. దేవుడు మానవులను సృష్టించినప్పుడు, మానవులకు జంతువులకు మధ్య స్పష్టమైన తేడా ఉందని ఆయన చూపించాడు. ఉదాహరణకు, ఆయన మానవులకు నిత్యజీవ నిరీక్షణను ఇచ్చాడు కానీ జంతువులకు ఆ నిరీక్షణను ఇవ్వలేదు. (రోమీయులు 6:23; 2 పేతురు 2:​12) మానవులకు జంతువులకు మధ్య సరైన సంబంధాన్ని నిర్ణయించే హక్కు సృష్టికర్తగా ఆయనకుంది.

ఆ సంబంధం ఏమిటో ఆదికాండము 1:⁠28 మనకు చెబుతుంది. మొదటి మానవులకు దేవుడిలా చెప్పాడు: “సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలు[డి].” అలాగే కీర్తన 8:​6-8 ఇలా చెబుతోంది: “గొఱ్ఱెలనన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్రమార్గములలో సంచరించు వాటినన్నిటిని వాని [మానవుని] పాదములక్రింద నీవు [దేవుడు] ఉంచి యున్నావు.”

మానవుడు జంతువులను సరైన విధంగా ఉపయోగించుకోవచ్చని, వాటిని చంపవచ్చని దేవుడు స్పష్టం చేశాడు. ఉదాహరణకు, వాటి చర్మములను వస్త్రాలుగా ఉపయోగించుకోవచ్చు. అంతేగాక, దేవుడు తాను ముందు చెప్పినట్లుగా మానవులు కేవలం శాకాహారాన్ని మాత్రమే గాక జంతువుల మాంసాన్ని కూడా తినడానికి నోవహు కాలంనాటి జలప్రళయం తర్వాత అనుమతినిచ్చాడు.​—⁠ఆదికాండము 3:21; 4:4; 9:⁠3.

అయితే ఇది కేవలం క్రీడావినోదం కోసం జంతువులను చంపే అధికారాన్ని మనకివ్వడం లేదు. బైబిలు ఆదికాండము 10:9లో నిమ్రోదును ‘పరాక్రమముగల వేటగాడు’ అని వర్ణిస్తోంది. ఇది అతణ్ణి ‘యెహోవాకు వ్యతిరేకిని’ [NW] చేసిందని అదే వచనం చెబుతోంది.

కాబట్టి, మానవునికి జంతువులపై అధికారం ఉన్నప్పటికీ, అతడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా దేవుని వాక్యంలోని సూత్రాలకు అనుగుణంగా దాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే ఒక పెంపుడు జంతువు బాగా ముసలిదైపోవడం వల్ల, తీవ్రంగా గాయపడడం వల్ల లేదా దీర్ఘకాలంగా జబ్బుపడడం వల్ల అనవసరంగా బాధపడడానికి అనుమతించకపోవడం మంచిది. అలాంటి పరిస్థితుల్లో, ఏమి చేయాలనేది నిర్ణయించుకోవడం క్రైస్తవుడి బాధ్యత. బాగుపడే ఆశ లేకుండా అలాగే బాధపడుతూ ఉండడానికి అనుమతించకపోవడం దయాపూర్వకమైన చర్య అని అతడు నిర్ణయించుకుంటే, ఆయన దాన్ని నిద్రలోకి పంపించివేయవచ్చు.