కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“భయపడకుడి జడియకుడి”

“భయపడకుడి జడియకుడి”

“భయపడకుడి జడియకుడి”

“భయపడకుడి జడియకుడి, . . . యెహోవా మీతోకూడ ఉండును.”​—⁠2 దినవృత్తాంతములు 20:17.

ఉగ్రవాదం! హృదయంలో భయం పుట్టించి, అభద్రతా భావాలనూ నిస్సహాయతా భావాలనూ కలుగజేయడానికి ఆ ఒక్క మాట చాలు. అది భయం, దుఃఖం, ఆగ్రహం కలగలసిన భావోద్వేగాలను రేపుతుంది. భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాల వరకూ మానవజాతిని పట్టి పీడిస్తుందని చాలామంది భయపడుతున్న ప్రమాదాన్ని ఆ పదం వర్ణిస్తుంది. కొన్ని దేశాలు ఎన్నో సంవత్సరాలుగా వివిధ రకాల ఉగ్రవాదంతో పోరాడుతున్నప్పటికీ కేవలం పరిమితమైన విజయాన్ని మాత్రమే సాధించగలిగాయి అనే వాస్తవం అలాంటి భయానికి ఆధారాన్నిస్తుంది.

2 అయితే ఉగ్రవాదం అంతమవుతుందని నిరీక్షించడానికి బలమైన కారణం ఉంది. భూమ్మీద 234 దేశాల్లో, ఆయాప్రాంతాల్లో చురుగ్గా ప్రకటిస్తున్న యెహోవాసాక్షులు గుర్తింపదగిన ఆశాభావంతో ఉన్నారు. ఉగ్రవాదం ఎన్నటికీ నిర్మూలించబడదని భయపడే బదులు అది అతిత్వరలోనే నిర్మూలించబడుతుందని వారు దృఢంగా విశ్వసిస్తున్నారు. వారిలా ఆశాభావంతో ఉండడం వాస్తవికంగా ఉంటుందా? లోకం నుండి ఈ ఉపద్రవాన్ని తీసివేయడంలో ఎవరు విజయం సాధించగలరు, అదెలా జరుగుతుంది? మనమందరం బహుశా ఏదో ఒక విధమైన దౌర్జన్యానికి గురయ్యేవుంటాము కాబట్టి అలాంటి ఆశాభావంతో ఉండడానికిగల ఆధారాన్ని పరిశీలించడం మంచిది.

3 నేడు ప్రజలు వివిధ కారణాలను బట్టి భయాందోళనలకు గురవుతున్నారు. వయసు పైబడినందువల్ల తమను తాము పోషించుకోలేకపోతున్న అనేకమంది ప్రజల గురించి, చికిత్సలేని వ్యాధులతో బాధపడుతూ రోజురోజుకీ బలహీనంగా తయారవుతున్న వారి గురించి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఆర్థిక పోరాటం చేస్తున్న కుటుంబాల గురించి ఆలోచించండి. నిజానికి జీవితం ఎంత అనిశ్చితమైనదో ఆలోచించండి! రోడ్డు ప్రమాదం ద్వారా లేదా విపత్తు ద్వారా సంభవించే ఆకస్మిక మరణం మనం ఎంతో విలువైనవిగా ఎంచే వాటన్నింటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి భయాందోళనలే కాక అనేక వ్యక్తిగత పోరాటాలు, నిరాశా నిస్పృహలు మన కాలాన్ని సరిగ్గా అపొస్తలుడైన పౌలు వర్ణించిన కాలంలానే మార్చేశాయి: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు . . . అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషు[లై]” ఉంటారు.​—⁠2 తిమోతి 3:1-3.

4 ఈ లేఖనం విషాదభరితమైన పరిస్థితిని వర్ణించినప్పటికీ అది ఒక నిరీక్షణను కూడా సూచిస్తోంది. సాతాను ప్రస్తుత దుష్టవిధానపు “అంత్యదినములలో” అపాయకరమైన కాలాలు ఉంటాయని గమనించండి. విడుదల సమీపంలోనే ఉందని, త్వరలోనే ఈ దుష్ట లోకం స్థానంలో దేవుని పరిపూర్ణమైన రాజ్యం పరిపాలించనున్నదని దానర్థం. ఆ రాజ్యం గురించి ప్రార్థించమని యేసు తన అనుచరులకు బోధించాడు. (మత్తయి 6:​9, 10) ఆ రాజ్యము దేవుని పరలోక ప్రభుత్వము, “దానికెన్నటికిని నాశనము కలుగదు,” కానీ “అది ముందు చెప్పిన [మానవ] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును” అని దానియేలు ప్రవక్త చెబుతున్నాడు.​—⁠దానియేలు 2:44.

ఉగ్రవాదానికి ప్రతిగా క్రైస్తవ తటస్థత

5 ఎన్నో దశాబ్దాలుగా ఉగ్రవాదం వేలాదిమంది ప్రాణాలను బలిగొంది. 2001, సెప్టెంబరు 11వ తేదీన న్యూయార్క్‌ నగరంలో, వాషింగ్‌టన్‌ డి.సి.లో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ ఉగ్రవాదం గురించి మునుపటికంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఉగ్రవాదపు విస్తారత, దానికున్న భౌగోళిక పరిధిని దృష్టిలో పెట్టుకొని దానితో పోరాడడానికి భూవ్యాప్తంగా ఉన్న దేశాలు వెంటనే ఐక్యమయ్యాయి. ఉదాహరణకు, సమాచార మాధ్యమాల నివేదికల ప్రకారం 2001, డిసెంబరు 4వ తేదీన “యూరప్‌, ఉత్తర అమెరికా, మధ్యస్థ ఆసియాలోని దేశాల నుండి వచ్చిన 55 మంది విదేశాంగ మంత్రులు” ఉగ్రవాదంతో పోరాడడానికి తాము చేస్తున్న సమన్వయ కృషికి రూపొందించబడిన “ప్రణాళికను ఏకగ్రీవంగా ఆమోదించారు.” ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేయబడుతున్న కృషికి అది “క్రొత్త శక్తి” ఇచ్చిందని అమెరికాకు చెందిన ఒక ఉన్నతాధికారి దాన్ని ప్రశంసించాడు. ద న్యూయార్క్‌ టైమ్స్‌ మ్యాగజైన్‌ “చారిత్రక విశిష్టతగల యుద్ధ ఆరంభం” అని పేర్కొన్న ఆ పనిలో అకస్మాత్తుగా కోట్లాదిమంది భాగంవహించడం ప్రారంభించారు. ఇలాంటి కృషి ఎంత విజయవంతంగా ఉంటుందో వేచి చూడాల్సిందే. అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే ఇలాంటి యుద్ధ పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే విషయం చాలామందిలో భయాందోళనలను రేకెత్తించింది కానీ యెహోవాపై నమ్మకముంచే ప్రజల్లో మాత్రం కాదు.

6 యెహోవాసాక్షులు రాజకీయ వ్యవహారాల్లో తటస్థంగా ఉంటారని పేరుపొందారు. చాలామంది ప్రజలు యుద్ధాలేమీ లేకుండా శాంతిగా ఉన్నప్పుడు, యెహోవాసాక్షుల రాజకీయ తటస్థతను స్వీకరించడానికి ఇష్టపడవచ్చేమో కానీ క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రం వారు చాలా తక్కువ సహనశీలతను ప్రదర్శిస్తారు. యుద్ధాలవల్ల కలిగే భయం, అనిశ్చయత తరచూ బలమైన జాతీయతా భావాలను ప్రేరేపిస్తాయి. ప్రఖ్యాతిగాంచిన ఇలాంటి జాతీయ కార్యకలాపాలకు మద్దతునివ్వడానికి ఎవరైనా నిరాకరిస్తే, వారు ఎందుకు అలా చేశారో అర్థంచేసుకోవడం ఇతరులకు కష్టమనిపించవచ్చు. అయినప్పటికీ, ‘లోకసంబంధులుగా ఉండవద్దు’ అని యేసు ఇచ్చిన ఆజ్ఞకు తాము విధేయత చూపించాలని నిజ క్రైస్తవులకు తెలుసు. (యోహాను 15:19; 17:14-16; 18:36; యాకోబు 4:⁠4) ఆ ఆజ్ఞకు విధేయత చూపించాలంటే వారు రాజకీయ లేదా సామాజిక వ్యవహారాల్లో తమ తటస్థతను కాపాడుకోవాలి. ఈ విషయంలో యేసు స్వయంగా సరైన మాదిరిని ఉంచాడు. యేసుకు పరిపూర్ణ జ్ఞానం, అసాధారణమైన సామర్థ్యం ఉన్నాయి కాబట్టి ఆయన తన కాలంలోని మానవ వ్యవహారాలను ఎంతో మెరుగుపరచి ఉండగలిగేవాడు. అయినప్పటికీ ఆయన రాజకీయాల్లో భాగంవహించడానికి నిరాకరించాడు. తన పరిచర్య ప్రారంభంలో సాతాను తనకు లోక రాజ్యములన్నింటిని పరిపాలించే అధికారం ఇస్తానని చెప్పినప్పుడు ఆయన దాన్ని స్థిరంగా తిరస్కరించాడు. మరో సందర్భంలో ఆయన రాజకీయ అధికారం స్వీకరించకుండా నిశ్చయపూర్వకంగా తప్పించుకున్నాడు.​—⁠మత్తయి 4:8-10; యోహాను 6:14, 15.

7 యెహోవాసాక్షులు తటస్థంగా ఉన్నప్పుడు, వారు హింసకు మద్దతునిస్తున్నారని లేదా దాన్ని చూసీచూడనట్లు వదిలేయడానికి ఇష్టపడుతున్నారని వారిని అపార్థం చేసుకోకూడదు. ఒకవేళ యెహోవాసాక్షులు హింసకు మద్దతునిస్తే లేదా దాన్ని చూసీచూడనట్లు వదిలేస్తే, “ప్రేమ సమాధానములకు కర్తయగు దేవు[ని]” సేవకులమని వారు చెప్పుకుంటున్నదానికి అది విరుద్ధంగా ఉంటుంది. (2 కొరింథీయులు 13:​11) యెహోవా దేవుడు హింసను ఎలా దృష్టిస్తాడో వారు తెలుసుకున్నారు. కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “యెహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు.” (కీర్తన 11:⁠5) అపొస్తలుడైన పేతురుకు యేసు చెప్పిన విషయం కూడా వారికి తెలుసు: “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.”​—⁠మత్తయి 26:52.

8 అబద్ధ క్రైస్తవులు తరచూ “కత్తి” సహాయాన్ని ఆశ్రయించారని చరిత్ర స్పష్టంగా చూపిస్తున్నప్పటికీ యెహోవాసాక్షుల విషయంలో అది నిజం కాదు. వారు అలాంటి కార్యకలాపాలన్నింటి నుండి దూరంగా ఉంటారు. రోమీయులు 13:1, 2 వచనాల్లో ఇవ్వబడిన ఆజ్ఞకు సాక్షులు నమ్మకంగా విధేయత చూపిస్తారు: “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ వలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.”

9 అయితే ఉగ్రవాదం ఎంతో దుష్టమైనది కాబట్టి యెహోవాసాక్షులు దాన్ని నిరోధించేందుకు చురుగ్గా సహాయం చేయడానికి ఏదైనా చేయకూడదా? అవును వారు చేయాలి, చేస్తున్నారు కూడా. మొదటిగా వారు ఉగ్రవాదానికి సంబంధించిన కార్యకలాపాల్లో భాగంవహించడానికి దూరంగా ఉంటారు. రెండవదిగా, వారు ప్రజలకు క్రైస్తవ సూత్రాలను బోధిస్తారు. ఆ సూత్రాలను అన్వయించుకున్నప్పుడు ప్రజలు అన్ని విధాలైన హింసను తిరస్కరించేందుకు అవి వారికి సహాయం చేస్తాయి. * గత సంవత్సరం, ఈ క్రైస్తవ మార్గం గురించి ప్రజలు నేర్చుకోవడానికి సహాయం చేసేందుకు సాక్షులు 1,20,23,81,302 గంటలను వెచ్చించారు. వారు వెచ్చించిన ఈ సమయం వృథా కాలేదు ఎందుకంటే వారు చేసిన పని ఫలితంగా 2,65,469 మంది తాము హింసను పూర్తిగా తిరస్కరిస్తున్నామని బహిరంగంగా ప్రదర్శిస్తూ యెహోవాసాక్షులుగా బాప్తిస్మం తీసుకున్నారు.

10 అంతేకాక తమకు తాముగా ఈ లోకంలోని దుష్టత్వాన్ని నిర్మూలించలేమని యెహోవాసాక్షులు గ్రహించారు. అందుకే వారు ఈ మార్పు తీసుకురాగల వ్యక్తిపై అంటే యెహోవా దేవునిపై తమ పూర్తి నమ్మకాన్ని ఉంచుతారు. (కీర్తన 83:​18) మానవులు యథార్థంగా కృషి చేసినప్పటికీ వారు హింసను అంతమొందించలేరు. ప్రేరేపిత బైబిలు రచయిత మన కాలం గురించి అంటే “అంత్యదినముల” గురించి మనల్ని ముందుగానే హెచ్చరిస్తూ ఇలా అన్నాడు: “దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.” (2 తిమోతి 3:​1, 13) ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే దుష్టత్వానికి వ్యతిరేకంగా చేసే యుద్ధంలో మానవులు విజయం సాధించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. మరోవైపు హింసను పూర్తిగా, శాశ్వతంగా నిర్మూలించడానికి మనం యెహోవాపై ఆధారపడవచ్చు.​—⁠కీర్తన 37:1, 2, 9-11; సామెతలు 24:19, 20; యెషయా 60:18.

దాడి సమీపిస్తున్నా నిర్భయంగా ఉండడం

11 సమాధానకర్తయగు దేవుడు హింసను ద్వేషిస్తున్నాడు కాబట్టి దానికి మూల కారకుడైన అపవాదియగు సాతానును నాశనం చేయడానికి ఆయన చర్యలు తీసుకోవడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఆయన ప్రధానదూతయగు మిఖాయేలు చేతుల్లో ఇప్పటికే సాతాను అవమానకరంగా ఓడిపోయేలా చేశాడు. మిఖాయేలు క్రొత్తగా సింహాసనాసీనుడైన దేవుని రాజగు, క్రీస్తు యేసు. బైబిలు ఆ సంఘటనను ఇలా వర్ణిస్తోంది: “పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.”​—⁠ప్రకటన 12:7-9.

12 పరలోకంలో ఆ యుద్ధం జరిగిన సంవత్సరం 1914 అని సూచించడంలో బైబిలు వృత్తాంతం, ప్రపంచ సంఘటనలు ఏకీభవిస్తున్నాయి. అప్పటి నుండి ప్రపంచంలోని పరిస్థితులు క్రమంగా దిగజారిపోయాయి. దానికిగల కారణాన్ని వివరిస్తూ ప్రకటన 12:⁠12 ఇలా చెబుతోంది: “అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నా[డు].”

13 ప్రత్యేకించి దేవుని అభిషిక్త ఆరాధకులపై, వారి సహచరులైన “వేరే గొఱ్ఱెల”పై అపవాది కోపోద్రేకం రగులుతోందన్న విషయం అర్థం చేసుకోదగినదే. (యోహాను 10:16; ప్రకటన 12:​17) దేవుడు స్థాపించిన రాజ్యాన్ని సమర్థించి, దానిపై విశ్వాసముంచే వారందరిపై అపవాది క్రూరాతిక్రూరంగా దాడి చేసినప్పుడు ఆ వ్యతిరేకత ముగింపుకు చేరుకుంటుంది. అపవాది తన శాయశక్తులూ ఉపయోగించి చేసే ఆ దాడి యెహెజ్కేలు 38వ అధ్యాయంలో “మాగోగు దేశపువాడైన గోగు” చేసే దాడి అని పిలువబడింది.

14 సాతాను పరలోకం నుండి పడద్రోయబడినప్పటి నుండి అతను దేవుని ప్రజలపై దాడి చేస్తూనే ఉన్నాడు కానీ కొన్నిసార్లు కొన్ని రాజకీయ శక్తులు వారిని సాతాను దాడుల నుండి కాపాడాయి, అది ప్రకటన 12:​15, 16 వచనాల్లో సూచనార్థక భాషలో వర్ణించబడింది. కానీ దానికి విరుద్ధంగా సాతాను ఆఖరిసారిగా దాడి చేసినప్పుడు, తమ నమ్మకాన్ని యెహోవాపై ఉంచే వారిని కాపాడడానికి మానవులెవ్వరూ ముందుకురారని బైబిలు సూచిస్తోంది. ఆ కారణాన్ని బట్టి క్రైస్తవులు భయాందోళనలకు గురికావాలా? అవసరమే లేదు!

15 యెహోషాపాతు రాజు కాలంలో తన విశిష్టమైన జనాంగానికి మద్దతునిచ్చినట్లే యెహోవా తన ప్రజలకు ఖచ్చితంగా మద్దతునిస్తాడు. మనం ఇలా చదువుతాము: “యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా​—⁠ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. . . . ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడుడి; మీతోకూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు [“మీరు మీ స్థానాల్లో నిశ్చలంగా నిలువబడి, మీ పక్షాన యెహోవా దయచేసే రక్షణను చూడండి,” NW]; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతోకూడ ఉండును.”​—⁠2 దినవృత్తాంతములు 20:15-17.

16 యూదా ప్రజలు పోరాడవలసిన అవసరం లేదని వారికి హామీ ఇవ్వబడింది. అలాగే దేవుని ప్రజలపై మాగోగు దేశపువాడైన గోగు దాడి చేసినప్పుడు వారు తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలను చేపట్టరు. దానికి బదులుగా వారు “నిశ్చలంగా నిలువబడి” తమ పక్షాన “యెహోవా దయచేసే రక్షణను చూస్తారు.” అయితే ‘నిశ్చలంగా నిలువబడడం’ అంటే పూర్తిగా నిష్క్రియులై ఉండడాన్ని సూచించడం లేదు, యెహోషాపాతు కాలంలో కూడా దేవుని ప్రజలు పూర్తిగా నిష్క్రియులై నిలబడలేదు. మనమిలా చదువుతాము: “అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను; యూదావారును యెరూషలేము కాపురస్థులును యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. . . . మరియు అతడు [యెహోషాపాతు] జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచు​—⁠యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను.” (2 దినవృత్తాంతములు 20:​18-21) అవును శత్రువులు దాడి చేసినప్పుడు కూడా ఆ ప్రజలు యెహోవాను స్తుతిస్తూనే ఉన్నారు. గోగు తమపై దాడి చేసినప్పుడు యెహోవాసాక్షులు అనుసరించడానికి అది ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేసింది.

17 అప్పటి వరకూ, అలాగే గోగు దాడి ప్రారంభమైన తర్వాత కూడా, యెహోవాసాక్షులు దేవుని రాజ్యాన్ని సమర్థిస్తూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 94,600 కంటే ఎక్కువ సంఘాలతో సహవసిస్తూ వారు బలాన్ని, రక్షణను పొందుతూనే ఉంటారు. (యెషయా 26:​20) యెహోవాను ధైర్యంగా స్తుతించడానికి ఇది ఎంత చక్కని అవకాశమో కదా! గోగు చేయబోయే దాడి కోసం ఎదురుచూస్తూ జీవించడం, వారు భయంతో వెనకడుగు వేసేలా చేయదు అనడంలో సందేహం లేదు. దానికి విరుద్ధంగా వారు తమ స్తుతియాగాన్ని ఎంత వీలైతే అంత ఎక్కువ చేసుకోవడానికి అది వారిని పురికొల్పుతుంది.​—⁠కీర్తన 146:⁠2.

18 ధైర్యంతో కూడిన ఈ మనోవైఖరిని, ప్రపంచవ్యాప్తంగా పూర్తికాల పరిచర్యను చేపట్టిన వేలాదిమంది యౌవనులు చక్కగా ప్రదర్శిస్తున్నారు. అలాంటి జీవితవిధానాన్ని ఎంపిక చేసుకోవడం ఎంత ఉత్తమమైనదో నొక్కి చెప్పడానికి 2002 జిల్లా సమావేశాల్లో యౌవనస్థులారా​—⁠మీ జీవితంలో మీరేమి చేస్తారు? అనే కరపత్రం విడుదల చేయబడింది. క్రైస్తవులైన యౌవనస్థులు, వృద్ధులు సముచితమైన ఈ జ్ఞాపికలను బట్టి ఎంతో కృతజ్ఞులుగా ఉన్నారు.​—⁠కీర్తన 119:14, 24, 99, 119, 129, 146.

19 ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ క్రైస్తవులు భయపడనవసరం లేదు, జడియనవసరం లేదు. యెహోవా రాజ్యం త్వరలోనే హింసను దాని విధానాలన్నింటిని శాశ్వతంగా నిర్మూలిస్తుందని వారికి తెలుసు. హింస కారణంగా తమ ప్రాణాలను కోల్పోయిన అనేకమంది పునరుత్థానం చేయబడతారని తెలుసుకోవడం వారికి ఓదార్పునిస్తుంది. పునరుత్థానం చేయబడడం కొంతమందికి యెహోవా గురించి నేర్చుకోవడానికి మొదటి అవకాశాన్నిస్తుంది, ఇతరులకు ఆయనకు తాము చేసిన సమర్పిత సేవలో కొనసాగడానికి అవకాశాన్నిస్తుంది.​—⁠అపొస్తలుల కార్యములు 24:​14, 15.

20 నిజ క్రైస్తవులుగా మనం మన క్రైస్తవ తటస్థతను కాపాడుకోవలసిన అవసరం గురించి మనకు తెలుసు, మనం మన తటస్థతను కాపాడుకోవాలని తీర్మానించుకున్నాము. ‘నిశ్చలంగా నిలువబడి యెహోవా దయచేసే రక్షణను చూసే’ అద్భుతమైన నిరీక్షణను మనం గట్టిగా పట్టుకొని ఉండాలని కోరుకుంటున్నాము. తర్వాతి ఆర్టికల్‌, బైబిలు ప్రవచనపు నెరవేర్పుకు సంబంధించి క్రమంగా అదనపు అంతర్దృష్టిని కల్పిస్తున్న ప్రస్తుత సంఘటనల గురించి మనకు తెలియజేయడం ద్వారా మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 12 సాక్షులుగా మారేందుకు తమ హింసాపూరితమైన జీవిత విధానాన్ని విడిచిపెట్టిన వ్యక్తుల ఉదాహరణల కోసం తేజరిల్లు! (ఆంగ్లం) మార్చి 22, 1990, 21వ పేజీ; ఆగస్టు 8, 1991, 18వ పేజీ; కావలికోట జనవరి 1, 1996, 5వ పేజీ; ఆగస్టు 1, 1998, 5వ పేజీ చూడండి.

మీరు వివరించగలరా?

• నేడు చాలామంది ప్రజలు ఎందుకు ఇంత నిరాశాభావంతో ఉన్నారు?

• యెహోవాసాక్షులు భవిష్యత్తు గురించి ఎందుకు ఆశాభావంతో ఉన్నారు?

• హింసకు మూలకారకుడైన వ్యక్తి విషయంలో యెహోవా ఇప్పటికే ఏమి చేశాడు?

• గోగు దాడి గురించి మనం భయపడాల్సిన అవసరం ఎందుకు లేదు?

[అధ్యయన ప్రశ్నలు]

1. ఉగ్రవాదం ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది, వారి భయం ఎందుకు అర్థం చేసుకోదగినదే?

2. యెహోవాసాక్షులు ఉగ్రవాద సమస్యకు ఎలా ప్రతిస్పందిస్తారు, అది ఎలాంటి ప్రశ్నలను లేవదీస్తుంది?

3. భయం కలిగించే ఎలాంటి కారణాలు ఉనికిలో ఉన్నాయి, మన కాలం గురించి ఏమని ప్రవచించబడింది?

4. రెండవ తిమోతి 3:​1-3లో వర్ణించబడిన విషాదభరితమైన పరిస్థితుల తర్వాత ఏమి జరుగుతుందని వాగ్దానం చేయబడింది?

5. ఉగ్రవాద బెదిరింపుకు ఇటీవల దేశాలు ఎలా ప్రతిస్పందించాయి?

6. (ఎ) యెహోవాసాక్షుల క్రైస్తవ తటస్థ స్థానాన్ని అంగీకరించడం కొన్నిసార్లు కొందరికి ఎందుకు కష్టమనిపించవచ్చు? (బి) రాజకీయ కార్యకలాపాల విషయంలో యేసు తన అనుచరులకు ఎలాంటి మాదిరిని ఉంచాడు?

7, 8. యెహోవాసాక్షులు రాజకీయపరంగా తటస్థంగా ఉన్నప్పుడు వారు ఎలాంటి వారని అపార్థం చేసుకోకూడదు, ఎందుకు? (బి) ప్రభుత్వాలకు వ్యతిరేకంగా హింసాయుత కార్యకలాపాల్లో భాగంవహించడాన్ని రోమీయులు 13:​1, 2 వచనాలు ఎలా కొట్టివేస్తున్నాయి?

9. యెహోవాసాక్షులు ఉగ్రవాదంతో ఏ రెండు విధాల్లో పోరాడతారు?

10. నేటి లోకంలోని హింసను నిర్మూలించే ఎలాంటి ఉత్తరాపేక్షలు ఉన్నాయ?

11. హింసను నిర్మూలించడానికి యెహోవా ఇప్పటికే ఎలాంటి చర్యలు తీసుకున్నాడు?

12, 13. (ఎ) 1914వ సంవత్సరం ఎందుకు గమనార్హమైనది? (బి) దేవుని రాజ్యాన్ని సమర్థించేవారి గురించి యెహెజ్కేలు ప్రవచనం ఏమి చెబుతోంది?

14. యెహోవాసాక్షులు గతంలో ఎలా కాపాడబడ్డారు, పరిస్థితి ఎప్పుడూ అలానే ఉంటుందా?

15, 16. (ఎ) యెహోషాపాతు కాలంలో యెహోవా తన ప్రజలకు అభయాన్నిస్తూ చెప్పిన మాటలు నేటి క్రైస్తవులు ఆశాభావంతో ఉండడానికి ఏ కారణాన్నిస్తాయి? (బి) యెహోషాపాతు, ఆ నాటి ప్రజలు నేడు దేవుని సేవకుల కోసం ఎలాంటి ప్రమాణాన్ని ఏర్పాటు చేశారు?

17, 18. (ఎ) గోగు దాడికి సంబంధించి నేడు యెహోవాసాక్షులు ఎలాంటి అనుకూలమైన దృక్పథంతో ఉన్నారు? (బి) క్రైస్తవ యౌవనస్థులకు ఇటీవలే ఎలాంటి జ్ఞాపిక ఇవ్వబడింది?

19, 20. (ఎ) క్రైస్తవులు భయపడడానికి జడియడానికి ఏ కారణమూ లేదని ఎలా చెప్పవచ్చు? (బి) తర్వాతి అధ్యయన ఆర్టికల్‌ ఏమి చేస్తుంది?

[13వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ తటస్థత విషయంలో యేసు సరైన మాదిరిని ఉంచాడు

[16వ పేజీలోని చిత్రాలు]

వేలాదిమంది యౌవనస్థులు సంతోషంగా పూర్తికాల పరిచర్యను చేపట్టారు

[12వ పేజీలోని చిత్రసౌజన్యం]

UN PHOTO 186226/M. Grafman