కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కేవలం ఒక వాడుకా లేక లంచగొండితనమా?

కేవలం ఒక వాడుకా లేక లంచగొండితనమా?

కేవలం ఒక వాడుకా లేక లంచగొండితనమా?

పోలండ్‌లోని కొన్ని కాలేజీల్లో, విద్యార్థులు తమ ఉపాధ్యాయుల కోసం బహుమతులు కొనడానికి డబ్బులు వసూలు చేయడం ఒక రివాజు, పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవాలనే ఆశతో వారలా చేస్తారు. క్రైస్తవ యౌవనస్థురాలైన కాటర్జీనా దానివల్ల కష్టమైన పరిస్థితిని ఎదుర్కోవడంలో ఆశ్చర్యం లేదు. “డబ్బు ఇవ్వాలా వద్దా?” అని ఆమె ఆలోచించింది. ఆమె తోటి విద్యార్థులు ఇలా తర్కించారు: “ఇది మామూలే. ఇలా చేయడం వల్ల నువ్వేమీ నష్టపోవు, పైగా ఎంతో ప్రయోజనం పొందవచ్చు, కాబట్టి ఎందుకు సందేహిస్తావు?”

“మొదటి సంవత్సరంలో నేను కూడా డబ్బు వసూలు చేయడంలో భాగం వహించానని నేను ఒప్పుకోవలసిందే” అని కాటర్జీనా చెప్పింది. “కానీ ఆ తర్వాత, నేను అలా డబ్బులు వసూలు చేయడం ద్వారా లంచగొండితనానికి మద్దతునిచ్చానని, దాన్ని బైబిలు ఖండిస్తోందని గ్రహించాను.” యెహోవా లంచగొండితనాన్ని బలంగా ఖండిస్తున్నాడని చూపించే లేఖనాలను ఆమె గుర్తుచేసుకుంది. (ద్వితీయోపదేశకాండము 10:17; 16:19; 2 దినవృత్తాంతములు 19:⁠7) కాటర్జీనా ఇలా చెబుతోంది: “తోటివారి ఒత్తిడికి లొంగిపోవడం ఎంత సులభమో నాకు అర్థమయ్యింది. నేను ఆ విషయం గురించి మరోసారి ఆలోచించి, అప్పటి నుండి ఆ వాడుకకు మద్దతునివ్వలేదు.” గత మూడు సంవత్సరాలుగా ఇతర విద్యార్థులు అవహేళన చేస్తున్నప్పటికీ, తాను తన బైబిలు నమ్మకాల కారణంగా ఇలా “బహుమతుల” కోసం డబ్బు వసూలు చేయలేనని కొంతమందికి వివరించగలిగింది.

కాటర్జీనా స్వార్థంతో ప్రవర్తిస్తోందని, సంఘవిద్రోహ వైఖరిని కనబరుస్తోందని కొందరు నిందించారు. “వారిలో కొందరు ఇప్పటికీ నాతో స్నేహపూర్వకంగా ఉండరు, కానీ చాలామంది నా దృక్కోణాన్ని గౌరవిస్తారు, అది నాకు సంతోషాన్నిస్తుంది” అని ఆమె చెబుతోంది. కాటర్జీనా, తమ దైనందిన జీవితంలో బైబిలు సూత్రాలను పాటించే యెహోవాసాక్షుల్లో ఒకరిగా పేరుపొందింది.