కొరియాలో అపూర్వమైన భాషా గుంపుకు సేవచేయడం
కొరియాలో అపూర్వమైన భాషా గుంపుకు సేవచేయడం
ఎంతో ఉత్సాహవంతులైనప్పటికీ చాలా నిశ్శబ్దంగావున్న ప్రజలు, 1997వ సంవత్సరం వేసవికాలంలో యెహోవాసాక్షుల జిల్లా సమావేశానికి హాజరయ్యారు. కొరియాలో చెవిటివారి కోసం, వినే శక్తి లోపించినవారి కోసం సమావేశం జరగడం అదే మొదటిసారి. ఆ సమావేశానికి మొత్తం 1,174 మంది హాజరయ్యారు. అక్కడ ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, నాటకంతో సహా సమావేశ కార్యక్రమమంతా కొరియన్ సంజ్ఞా భాషలో ప్రదర్శించబడింది, సమావేశ హాలంతటా స్పష్టంగా కనిపించడానికి వీలుగా కార్యక్రమమంతా ఒక పెద్ద తెరపై చూపించబడింది. ఈ సమావేశం, ఎన్నో సంవత్సరాలుగా అనేకమంది స్వచ్ఛంద సేవకులు చేసిన కృషి ఫలితం.
పరదైసు భూమిపై “చెవిటివారి చెవులు విప్పబ[డే]” సమయం వస్తుంది. (యెషయా 35:5) ఆ పరదైసులో జీవితాన్ని అనుభవించడానికి చెవిటివారితో సహా ప్రజలందరూ ముందుగా ఆధ్యాత్మిక పరదైసులోకి ప్రవేశించాలి అంటే దేవుని సంతోషకరమైన ప్రజలు అనుభవిస్తున్న సంపన్నమైన ఆధ్యాత్మిక పరిస్థితికి చేరుకోవాలి. వారు యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకొన్న సేవకులవ్వాలి, ఆయన ద్వారా ఉపదేశించబడాలి.—మీకా 4:1-4.
చిన్న ప్రారంభం
చెవిటివారికి 1960లలో సువార్త ప్రకటించబడినప్పటికీ, కేవలం 1970లలోనే వారిలో కొందరు కొరియా రాజధాని సీయోల్ నగరంలో యెహోవాసాక్షుల కూటాలకు హాజరవడం ప్రారంభించారు. చాలా వేగంగా వ్రాయగల ఒక క్రైస్తవ సహోదరుడు ప్రసంగాల్లోని ముఖ్యాంశాలను, పేర్కొనబడిన బైబిలు లేఖనాలను వ్రాయడానికి ఒక బ్లాక్‌బోర్డును ఉపయోగించేవాడు.
టాజాన్ నగరంలోని ఒక సాక్షి 1971లో తన చెవిటి కుమారుడితోపాటు అతని చెవిటి స్నేహితులకు రాజ్య సందేశాన్ని బోధించడం ప్రారంభించాడు. ఆ గుంపుతో అధ్యయనం చేసినవారిలో అత్యంతాసక్తిగల కొందరు ఇప్పుడు సంజ్ఞా భాష క్షేత్రంలో మూలాధారంగా సేవచేస్తున్నారు.—జెకర్యా 4:10.
ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చిన యౌవనులు
చెవిటివారు యెహోవా గురించి, యేసు గురించి జ్ఞానం సంపాదించుకొని జీవమార్గములో నడవడం ప్రారంభించాలంటే స్వచ్ఛంద సేవకులు ఎక్కువ కృషి చేయాలి. (యోహాను 17:3) ఆ లక్ష్యాన్ని సాధించేందుకు చాలామంది యెహోవాసాక్షులు సంజ్ఞా భాష నేర్చుకున్నారు, వారు ప్రోత్సాహకరమైన అనుభవాలతో ఆశీర్వదించబడ్డారు.
పదిహేనేళ్ళ పార్క్ ఇన్సన్ సంజ్ఞా భాష నేర్చుకోవడాన్ని తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. దాన్ని సాధించడానికి ఆయన 20 మంది చెవిటివారు పనిచేస్తున్న ఒక కర్మాగారంలో అప్రెంటీస్‌గా చేరాడు. సంజ్ఞా భాషను, చెవిటివారి ఆలోచనా విధానాన్ని నేర్చుకోవడానికి ఆయన వారితో ఎనిమిది నెలల వరకు సన్నిహితంగా పనిచేశాడు. ఆ తర్వాతి సంవత్సరం క్రమ పయినీరు లేదా పూర్తికాల రాజ్య ప్రచారకుడిగా మారిన ఆయన బైబిలు సత్యంపట్ల ఆసక్తిగల కొంతమంది చెవిటివారితో పనిచేశాడు. ఆ గుంపు వేగంగా అభివృద్ధి సాధించింది, ఎంతోకాలం గడవకముందే ఆదివారం కూటాలకు 35 కంటే ఎక్కువమంది హాజరవడం ప్రారంభించారు.—కీర్తన 110:3.
ఆ తర్వాత సీయోల్‌లో మొట్టమొదటిసారిగా క్రైస్తవ కూటాలు కేవలం సంజ్ఞా భాషలో నిర్వహించబడడానికి ఏర్పాట్లు జరిగాయి. అభివృద్ధి చెందుతున్న ఈ గుంపులో సహోదరుడు పార్క్ ఇన్సన్ ప్రత్యేక పయినీరుగా సేవచేశాడు. ఆ సమయానికల్లా ఆయన సంజ్ఞా భాషలో ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు. కొన్ని నెలల్లో ఆయన 28 మంది చెవిటివారితో గృహ బైబిలు అధ్యయనం నిర్వహించాడు. వారిలో చాలామంది అభివృద్ధి సాధించి యెహోవాసాక్షులయ్యారు.
ఎంతో చురుగ్గా కొనసాగిన ఈ స్వచ్ఛంద సేవ ఫలితంగా 1976 అక్టోబరు నెలలో సీయోల్‌లో 40 మంది ప్రచారకులు, ఇద్దరు క్రమ పయినీర్లతో మొదటి సంజ్ఞా భాష సంఘం ప్రారంభించబడింది. ఇది కొరియాలోని ఇతర నగరాల్లో జరుగుతున్న పనిని పురికొల్పింది. ఎంతోమంది చెవిటివారు సువార్త విషయంలో ఆకలిదప్పులు కలవారై, తమను సందర్శించేవారి కోసం వేచివుండేవారు.
చెవిటివారి మధ్య పనిచేయడం
చెవిటివారు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుస్తుంది అని మీరు ఆలోచిస్తుండచ్చు. ఒక వ్యక్తి తనకు తెలిసినవారిని పరిచయం చేయడం, వారు మరికొందరిని పరిచయం చేయడం, ఇలా చాలామంది చెవిటివారిని కనుగొనడం జరిగింది. అంతేకాక, స్థానిక బియ్యం షాపుల యజమానులను సంప్రదించినప్పుడు వారు చెవిటివారి పేర్లు, చిరునామాలు తెలియజేశారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇలాంటి సమాచారం తెలియజేయడంలో సహాయం చేశాయి. చెవిటివారు నివసించే ప్రాంతంలో శ్రద్ధగా ప్రకటించడం ఎంత విజయవంతమయ్యిందంటే కొంతకాలానికి ఆ ప్రాంతంలో నాలుగు సంజ్ఞా భాష సంఘాలు స్థాపించబడ్డాయి. చాలామంది క్రైస్తవ యౌవనులు సంజ్ఞా భాష నేర్చుకోవడానికి ప్రోత్సహించబడ్డారు.
సంజ్ఞా భాష నేర్చుకున్న ప్రత్యేక పయినీరు సేవకులను యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం సంజ్ఞా భాష సంఘాల్లో సేవచేయడానికి నియమించింది. ఇటీవలే, పరిచర్యా శిక్షణ పాఠశాల నుండి పట్టభద్రులైన సహోదరులు ఈ సంఘాలకు నియమించబడ్డారు, వారు అక్కడివారిని ఆధ్యాత్మికంగా బలపరిచారు.
అయితే ఈ పని చేయడానికి కొన్ని కష్టాలను అధిగమించవలసి ఉంటుంది. ఈ క్షేత్రంలో సేవచేయడానికి చెవిటివారి సంస్కృతిని అర్థం చేసుకొనేందుకు కృషి చేయాలి. వారి ఆలోచనలు, చర్యలు చాలా ముక్కుసూటిగా ఉంటాయి. కొన్నిసార్లు అది ప్రజలను ఆశ్చర్యపరచి, అపార్థాలకు దారితీయవచ్చు. అంతేకాక సాక్షులు చెవిటివారితో బైబిలు అధ్యయనాలు నిర్వహించేటప్పుడు వారు తమ భాషలో ప్రావీణ్యతను సంపాదించుకోవడానికి వారికి సహాయం చేయాలి, వారు సొంతగా చదవడం అధ్యయనం చేయడం వంటి పనులను విస్తృతం చేసుకోవడానికి వారిని ప్రోత్సహించాలి.
చెవిటివారు తమ దైనందిన కార్యకలాపాల్లో, చాలామట్టుకు ఇతరులకు తెలియని కష్టాలను ఎదుర్కొంటారు. యోహాను 13:34, 35.
ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆస్పత్రుల్లో, సరళమైన వ్యాపార లావాదేవీల గురించి సంప్రదింపులు జరపడం కూడా వారికి పెద్ద సమస్యలుగా ఉంటాయి. సమీప సంఘాల్లో ఉన్న సాక్షులు ప్రేమపూర్వకంగా సహాయం చేశారు కాబట్టి క్రైస్తవ సంఘంలోని చెవిటివారు నిజమైన సహోదరత్వాన్ని చవిచూశారు.—అనియత సాక్ష్యం ఫలితాలను తెస్తుంది
కొరియా దక్షిణ భాగంలో పెద్ద ఓడరేవు నగరమైన పూసాన్‌లో ఒక సాక్షి అనుకోకుండా ఇద్దరు చెవిటివారిని కలిశాడు, వారు ఒక కాగితపు ముక్కపై ఇలా వ్రాశారు: “మాకు పరదైసు ఎంతో ఇష్టం. నిత్యజీవం గురించి తెలియజేసే లేఖనాలను మేము తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాము.” ఆ సహోదరుడు వారి చిరునామా వ్రాసుకొని వారిని సందర్శించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వారిని సందర్శించినప్పుడు, రాజ్య సందేశం వినడానికి ఒక గది నిండా చెవిటివారు కూర్చొని ఎదురుచూస్తున్నారు. ఈ అనుభవం, సంజ్ఞా భాష నేర్చుకోవడం ప్రారంభించేందుకు ఆయన్ను పురికొల్పింది. కొద్ది కాలానికి పూసాన్‌లో ఒక సంజ్ఞా భాష సంఘం ప్రారంభించబడింది.
ఆ సంఘంలోని ఒక సహోదరుడు, ఇద్దరు చెవిటివారు సంజ్ఞల ద్వారా మాట్లాడుకోవడాన్ని గమనించి వారి దగ్గరకి వెళ్ళాడు. వారు అప్పుడే ఒక మతసంబంధ కూటానికి హాజరై వస్తున్నారని తెలుసుకొని ఆయన అదే రోజు మధ్యాహ్నం రాజ్యమందిరంలో జరగబోయే కూటానికి వారిని ఆహ్వానించాడు. వారు కూటానికి హజరయ్యారు, వారితో బైబిలు అధ్యయనం ప్రారంభించబడింది. కొద్ది రోజుల తర్వాత వారిద్దరు మరో 20 మంది చెవిటి స్నేహితులతో కలిసి జిల్లా సమావేశానికి హాజరయ్యారు. ఆ గుంపులోని చాలామంది తమ జీవితాలను
యెహోవాకు సమర్పించుకున్నారు. ఇద్దరు సంజ్ఞా భాష సంఘాల్లో సంఘ పెద్దలుగా, ఒకరు పరిచర్య సేవకుడిగా సేవచేస్తున్నారు.పట్టుదలకు ప్రతిఫలం లభించింది
కొంతమంది చెవిటివారు సంజ్ఞా భాష సంఘాలకు ఎంతో దూరంలో నివసిస్తున్నారు కాబట్టి వారికి క్రమంగా బైబిలు నుండి ఆధ్యాత్మిక పోషణను అందించడానికి తరచూ ఎంతో కృషి, పట్టుదల అవసరం. ఉదాహరణకు, 31 సంవత్సరాల వ్యక్తి ఒక ద్వీప తీరప్రాంతంలో జాలరి వృత్తి చేసేవాడు. ఆయన తమ్ముడిని యెహోవాసాక్షులు కలుసుకోవడం వల్ల ఆయన తన తమ్ముడి నుండి బైబిలు సందేశాన్ని తెలుసుకున్నాడు. చెవిటివాడైన ఆ జాలరి తన ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకొనే ప్రయత్నంలో, కొరియా దక్షిణ తీరప్రాంతంలోని టాన్‌యాన్ నగరానికి వెళ్ళడానికి 16 కిలోమీటర్లు పడవలో ప్రయాణించాడు. ఆయన మాసాన్ నగరంలోని సంజ్ఞా భాష సంఘంలో సేవచేస్తున్న ప్రత్యేక పయినీరును కలుసుకోవడానికి వెళ్ళాడు. ఆ ప్రత్యేక పయినీరు చెవిటివాడైన ఆ జాలరితో బైబిలు అధ్యయనం నిర్వహించడానికి ప్రతీ సోమవారం 40 మైళ్ళు ప్రయాణించి వెళ్ళేవాడు.
మాసాన్ నగరంలో ఆదివారం కూటానికి హాజరవడానికి, చెవిటివాడైన ఆ బైబిలు విద్యార్థి 10 మైళ్ళు పడవలో ప్రయాణించి, అక్కడనుండి 40 మైళ్ళు బస్సులో ప్రయాణించాలి. ఆయన పట్టుదల మంచి ఫలితాలను తెచ్చింది. కొన్ని నెలల్లో ఆయన సంజ్ఞా భాషను నేర్చుకోవడంలో అభివృద్ధి సాధించి, కొరియన్ భాషలో ఎక్కువ అక్షరాలను నేర్చుకున్నాడు, మరింత ప్రాముఖ్యంగా ఆయన యెహోవాతో సంబంధం ఏర్పరచుకోవడానికి గల ఒకే ఒక్క మార్గం గురించి నేర్చుకున్నాడు. కూటాలకు హాజరవడం, క్రమంగా ప్రకటనా పనిలో పాల్గొనడం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి ఆయన సంజ్ఞా భాష సంఘ క్షేత్రంలో నివసించడానికి వెళ్ళాడు. అది సులభమా? కాదు. ఆయన తనకు ప్రతీ నెలా 3,800 డాలర్ల లాభం తెచ్చిపెట్టే జాలరి పనిని వదులుకోవలసి వచ్చింది, కానీ ఆయన పట్టుదలకు ప్రతిఫలం లభించింది. సత్యం నేర్చుకోవడంలో అభివృద్ధి సాధించిన తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకొని ఇప్పుడు తన కుటుంబంతోపాటు యెహోవాకు సంతోషంగా సేవచేస్తున్నాడు.
చెవిటివారి కోసం అనువాదం
రాజ్య సువార్త తరచూ నోటిమాట ద్వారానే చెప్పబడుతుంది. అయితే దేవుని వాక్యం నుండి వచ్చే సందేశాన్ని మరింత ఖచ్చితంగా తెలియజేయడానికి బైబిలు బోధనను మరింత శాశ్వతమైన రూపంలో అందించడం ఆవశ్యకం. అందుకే మొదటి శతాబ్దంలో అనుభవంగల పెద్దలు పుస్తకాలను, ఉత్తరాలను వ్రాశారు. (అపొస్తలుల కార్యములు 15:22-31; ఎఫెసీయులు 3:4; కొలొస్సయులు 1:2; 4:16) మన కాలంలో పుస్తకాల ద్వారా, ఇతర క్రైస్తవ ప్రచురణల ద్వారా ఆధ్యాత్మిక ఆహారం సమృద్ధిగా అందించబడుతోంది. అవి వివిధ సంజ్ఞా భాషలతోపాటు వందలాది భాషల్లోకి అనువదించబడ్డాయి. వాటిని కొరియన్ సంజ్ఞా భాషలోకి అనువదించడానికి బ్రాంచి కార్యాలయంలో ఒక సంజ్ఞా భాష అనువాద విభాగం ఉంది. వీడియో విభాగం సంజ్ఞా భాష వీడియోలను తయారుచేస్తోంది. సువార్తను ప్రకటిస్తున్న చెవిటి ప్రచారకులకు, కొరియాలోని సంఘాల్లోవున్న ఆసక్తిగల వారికి అవి ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తున్నాయి.
ఎంతోమంది సహోదరులు సంజ్ఞా భాషలో ప్రావీణ్యతను సంపాదించుకొని, వీడియోలను తయారుచేయడంలో సహాయం చేశారు. అయితే చెవిటి తల్లిదండ్రుల పిల్లలే సాధారణంగా ఉత్తమమైన అనువాదకులుగా ఉండగలరు. వారు శిశువులుగా ఉన్నప్పటినుండి సంజ్ఞా భాషను నేర్చుకున్నారు. వారు సరైన సంజ్ఞలను చేయడమే కాక తాము చెబుతున్న సందేశానికి తమ సంజ్ఞలతో, ముఖ కవళికలతో హృదయపూర్వకమైన భావాన్ని, ప్రాముఖ్యతను ఇస్తారు, అలా వారు మనస్సును హృదయాన్ని చేరుకుంటారు.
ముందు ప్రస్తావించబడినట్లు కొరియాలో ఇప్పుడు సంజ్ఞా భాషలో సమావేశాలు క్రమంగా నిర్వహించబడుతున్నాయి. అలా చేయడానికి, ఎంతో పని చేయవలసి ఉంటుంది, ఎంతో ఖర్చవుతుంది, ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. అయితే ఆ సమావేశాలకు హాజరైనవారు ఆ ఏర్పాటుకు కృతజ్ఞులై ఉన్నారు. సమావేశాలు ముగిసిన తర్వాత చాలామంది ప్రోత్సాహకరమైన సహవాసాన్ని అనుభవించాలని, అందించబడిన చక్కని ఆధ్యాత్మిక ఆహారం గురించి మాట్లాడాలని ఆశిస్తూ కొంతసేపు అక్కడే ఉంటారు. నిజమే, అపూర్వమైన ఈ గుంపుకు సేవచేయడంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాలి, కానీ దానివల్ల లభించే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కృషికి తగ్గ ఫలితాన్ని ఇస్తాయి.
[10వ పేజీలోని చిత్రం]
కొరియాలో తయారుచేయబడిన సంజ్ఞా భాష వీడియోలు: “దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?,” “మన ఆధ్యాత్మిక వారసత్వంపట్ల మెప్పుదల,” “మన కాలానికి హెచ్చరికా మాదిరులు,” “యెహోవా అధికారాన్ని గౌరవించండి”
[10వ పేజీలోని చిత్రాలు]
క్రింద నుండి సవ్యదిశలో: కొరియా బ్రాంచిలో సంజ్ఞా భాష వీడియో తయారీ; దైవపరిపాలనా పదాలను తెలియజేయడానికి సంజ్ఞలను తయారుచేయడం; సంజ్ఞా భాష అనువాదకుల జట్టు; వీడియోను తయారుచేసేటప్పుడు సంజ్ఞలు చేసేవ్యక్తికి తగిన సూచనలివ్వడం