గిలియడ్ స్కూల్ 60 సంవత్సరాల మిషనరీ శిక్షణ
గిలియడ్ స్కూల్ 60 సంవత్సరాల మిషనరీ శిక్షణ
“మేము బైబిలును లోతుగా అధ్యయనం చేయడంవల్ల యెహోవాకు మరింత సన్నిహితమయ్యి, ఆయన సంస్థ గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకున్నాము. విదేశీ నియామకంలో జీవించడానికి అది మమ్మల్ని సిద్ధం చేసింది.” వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ మొదటి తరగతికి చెందిన ఒక గ్రాడ్యుయేట్ తాను అనుసరించిన విద్యా విధానాన్ని పైవిధంగా వర్ణించింది. 60 సంవత్సరాల క్రితం గిలియడ్ స్కూల్ ప్రారంభమైనప్పటినుండి అది మిషనరీలను పంపిస్తూ ఉంది. 2003, మార్చి 8వ తేదీన న్యూయార్క్‌లోని పాటర్సన్‌లో ఉన్న వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్‌లో 114వ తరగతి గ్రాడ్యుయేషన్ జరిగింది. ఆడిటోరియమ్‌లో, ప్రత్యేకంగా టీ.వీ. ద్వారా ప్రసారం ఏర్పాటు చేయబడిన ఇతర ప్రాంతాల్లో సమకూడిన 6,404 మంది ఆ కార్యక్రమంలోని ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, గుంపు చర్చను శ్రద్ధగా విన్నారు.
యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన థియోడోర్ జారస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆసియా, కర్రీబియన్, మధ్య మరియు దక్షిణ అమెరికా, యూరప్‌ల నుండి వచ్చిన అంతర్జాతీయ ప్రేక్షకులకు తగ్గట్టు ఆయనచేసిన ప్రారంభ వ్యాఖ్యానాలు వారి శ్రద్ధనాకట్టుకున్నాయి. సహోదరుడు జారస్ 2 తిమోతి 4:5వ వచనం ఆధారంగా వ్యాఖ్యానిస్తూ గిలియడ్ నుండి శిక్షణ పొందిన మిషనరీ చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఒక “సువార్తికుని పని” అని నొక్కిచెప్పారు. ప్రజలకు బైబిలును బోధించడం ద్వారా వారు సత్యానికి సాక్ష్యమిస్తారు.
విద్యార్థులు చివరి ఉపదేశాన్ని పొందారు
చిన్న చిన్న ప్రసంగాల పరంపరను ప్రారంభిస్తూ అమెరికా బ్రాంచి కమిటీ సభ్యుడైన జాన్ లార్సన్, “దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?” అనే అంశంపై విశ్వాసాన్ని బలపరిచే ప్రసంగమిచ్చారు. (రోమీయులు 8:31) విద్యార్థులు తమ నియామకాల్లో ఎదురుకోగల ఎటువంటి ఆటంకాన్నైనా అధిగమించేందుకు యెహోవా శక్తి సహాయం చేస్తుందని పూర్తి నమ్మకం కలిగివుండడానికి ఆధారాన్ని బైబిలునుండి వివరించారు. రోమీయులు 8:38, 39 వచనాలను ఉపయోగిస్తూ సహోదరుడు లార్సన్ విద్యార్థులకు ఈ సలహా ఇచ్చారు: “దేవుడు మీ పక్షాన ఉపయోగిస్తున్న శక్తి గురించి ఆలోచించడానికి సమయం తీసుకోండి, యెహోవాకు మీ మీదవున్న వ్యక్తిగత శ్రద్ధను ఏదీ నాశనం చేయలేదని గుర్తుంచుకోండి.”
పరిపాలక సభ సభ్యుడైన గై పియర్స్ కార్యక్రమంలోని తర్వాతి ప్రసంగాన్నిచ్చారు. ఆయన ఎంపిక చేసుకున్న అంశం, “మీ కన్నులను ధన్యమైనవిగా ఉంచుకోండి!” (లూకా 10:23) యెహోవా గురించి తెలుసుకోవడం, ఆయన శాశ్వతమైన సంకల్పాన్ని అర్థం చేసుకోవడం, బైబిలు ప్రవచనాల నెరవేర్పును చూడడం కూడా నిజమైన సంతోషంలో భాగమేనని ఆయన వివరించారు. విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా వారు తమ కన్నులను ధన్యమైనవిగా ఉంచుకోవడం ద్వారా నిజమైన సంతోషాన్ని కాపాడుకోగలరు. యెహోవా మంచితనం గురించి లోతుగా ధ్యానించమని, ఆయన చిత్తం చేయడంపై తమ మనస్సులను హృదయాలను నిలిపివుంచమని సహోదరుడు పియర్స్ గ్రాడ్యుయేట్లను ప్రోత్సహించాడు. (కీర్తన 77:12) గ్రాడ్యుయేట్లు ఆశాభావ దృక్పథాన్ని కాపాడుకోవడం ద్వారా తమ మార్గంలో రాగల ఎటువంటి సమస్యలనైనా అధిగమించవచ్చు.
తర్వాత, విద్యార్థులకు ప్రతీరోజు బోధిస్తూ వచ్చిన ఇద్దరు ఉపదేశకులు ప్రోత్సాహకరమైన మాటలతో తరగతికి వీడ్కోలు చెప్పారు. లారెన్స్ బౌవెన్ తన ప్రసంగపు అంశంలో, “మీరు దేవుని మహిమను వెదుకుతున్నారా?” అని ప్రశ్నించారు. చాలామంది ప్రజలు మహిమను తమకు లభించే ప్రశంసతో, గౌరవంతో, విశిష్టమైన స్థానంతో జతచేస్తారు. అయితే కీర్తనకర్తయైన ఆసాపు కీర్తన 73:24, 25) ఎడతెగక బైబిలును లోతుగా అధ్యయనం చేయడం ద్వారా యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని కాపాడుకొమ్మని గ్రాడ్యుయేషన్ పొందనున్న విద్యార్థులు ప్రోత్సహించబడ్డారు. క్రీస్తు ద్వారా నెరవేరుతున్న యెహోవా సంకల్పానికి సంబంధించిన వివరాలను దూతలు “తొంగిచూడగోరుచున్నారు.” (1 పేతురు 1:12) దేవుడు తమకిచ్చిన నియామకాల్లో ఆయన మహిమను ప్రతిబింబించేందుకు వారు తమ తండ్రి గురించి సాధ్యమైనంత ఎక్కువగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత, అమూల్యమైన నిధిని కనుగొనడంలో ఇతరులకు సహాయం చేయడం ద్వారా తమ మిషనరీ నియామకాల్లో యెహోవాను మహిమపరచమని ప్రసంగీకుడు విద్యార్థులను ప్రోత్సహించాడు.
నిజమైన మహిమను అంటే యెహోవాతో కలిగియుండే గౌరవప్రదమైన అమూల్య సంబంధాన్ని గుణగ్రహించాడు. (గిలియడ్ స్కూల్ రెజిస్ట్రర్ వాలెస్ లివరెన్స్ ప్రారంభపు ప్రసంగాల పరంపరను ముగిస్తూ ‘దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించండి’ అనే అంశంపై ప్రసంగించారు. (1 కొరింథీయులు 2:7) అపొస్తలుడైన పౌలు మిషనరీ సేవ చేస్తుండగా మాట్లాడిన ఈ దేవుని జ్ఞానము ఏమిటి? అది విశ్వవ్యాప్తంగా శాంతిని, ఐక్యమత్యాన్ని నెలకొల్పడానికి యెహోవా ఉపయోగించే జ్ఞానయుక్తమైన, శక్తివంతమైన మార్గం. ఈ జ్ఞానం యేసుపై కేంద్రీకృతమై ఉంది. ప్రజలు తమ సామాజిక సమస్యలను పరిష్కరించుకోవడానికి బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం గురించిన సువార్తను ప్రకటించే బదులు పౌలు ఆదాము పాపపు ప్రభావాలను దేవుడు ఎలా సరిదిద్దుతాడో అర్థం చేసుకునేందుకు ప్రజలకు సహాయం చేశాడు. (ఎఫెసీయులు 3:8, 9) ప్రసంగీకుడు తన శ్రోతలకు ఇలా బోధించారు: “మీకు లభించిన ఈ సేవాధిక్యతను పౌలువలే ఉపయోగించండి, ఆయన తన మిషనరీ నియామకాన్ని, సృష్టికర్తయైన యెహోవా యేసు ద్వారా తన సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తాడో గ్రహించేందుకు సహాయపడడానికిగల అవకాశంగా దృష్టించాడు.”
ఈ ప్రసంగం తర్వాత, గిలియడ్ స్కూల్‌లో మరో ఉపదేశకుడైన మార్క్ న్యూమర్ తరగతిలోని అనేక విద్యార్థులతో ఉత్సాహవంతమైన చర్చను నిర్వహించారు. “దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం అత్యంతాసక్తిగల పరిచారకులను ఉత్పన్నం చేస్తుంది” అనే చర్చాంశం రోమీయులు 10:10వ వచనంలోని పౌలు మాటలను నొక్కి చెప్పింది. విద్యార్థులు స్కూల్‌కు హాజరవుతున్న సమయంలో తమకు క్షేత్ర పరిచర్యలో కలిగిన అనేక అనుభవాలను చెప్పారు. మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి దాని గురించి ధ్యానించినప్పుడు, యెహోవా దేవునికీ ఆయన రాజ్యానికీ సంబంధించిన అద్భుతమైన విషయాలు మన హృదయంలో నింపబడతాయి, మనం వాటి గురించి ఇతరులకు చెబుతాము అని వారి అనుభవాలు చూపించాయి. విద్యార్థులు వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్‌లో నివసించిన ఐదు నెలల్లో, దగ్గర్లోని సంఘాలు తరచుగా ప్రకటించిన క్షేత్రాల్లో సేవచేసి 30 గృహ బైబిలు అధ్యయనాలను ప్రారంభించారు.
పరిణతి చెందినవారు మంచి సలహా ఇచ్చారు
విద్యార్థులు గిలియడ్ స్కూల్‌లో ఉన్నంతకాలం అమెరికా బేతేలు కుటుంబంలోని సభ్యులతో సహవసించడం ద్వారా ప్రయోజనం పొందారు. అమెరికా బ్రాంచి సభ్యులైన రాబర్ట్ సిరాంకో, రాబర్ట్ పి. జాన్సన్ యెహోవాకు ఎంతోకాలంగా నమ్మకంగా సేవచేస్తున్న అనేకమందిని ఇంటర్వ్యూ చేశారు, ఇంటర్వ్యూ చేయబడినవారిలో ప్రస్తుతం వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్న ప్రయాణ పైవిచారణకర్తలు కూడా ఉన్నారు. ఇంటర్వ్యూ చేయబడినవారందరూ ఒకప్పుడు మిషనరీలుగా సేవచేసిన గిలియడ్ గ్రాడ్యుయేట్లే. అనుభవంగల ఈ ఆధ్యాత్మిక పురుషుల జ్ఞానయుక్తమైన మాటలను వినడమనేది విద్యార్థులకు, వారి కుటుంబాలకు, స్నేహితులకు ఎంతో అభయాన్నిచ్చింది.
వారు ఇచ్చిన సలహాలు: “పరిచర్య చేయడంలో, సంఘ కార్యకలాపాలు చేయడంలో సాధ్యమైనంత ఎక్కువగా భాగం వహించండి.” “మీ గురించి మరీ ఎక్కువగా ఆలోచించకండి. ఒక మిషనరీగా మీ సంకల్పంపై దృష్టి నిలిపి మీ నియామకాన్ని మీ గృహంగా మార్చుకోండి.” ఇతర సహాయకరమైన వ్యాఖ్యానాలు, ఒక పరిచారకుడు ఎక్కడ నియమించబడినా సత్‌క్రియలు చేస్తూవుండడానికి గిలియడ్ శిక్షణ ఆయన్ను ఎలా సిద్ధపరుస్తుందో చూపించాయి. ఇవి వాటిలో కొన్ని: “మేము ఒకరితో ఒకరు సహకరించుకొని, కలిసి పనిచేయడం నేర్చుకున్నాము.” “కొత్త సంస్కృతులను స్వీకరించడానికి స్కూల్ మాకు సహాయం చేసింది.” “లేఖనాలను విభిన్నమైన దృక్కోణంలో ఉపయోగించడం మాకు నేర్పించబడింది.”
ఎంతోకాలంగా పరిపాలక సభ సభ్యుడిగా ఉన్న జాన్ ఇ. బార్ కార్యక్రమపు ప్రధాన ప్రసంగాన్ని ఇచ్చారు. ఆయన లేఖనాధారిత అంశం: “వారి స్వరము భూలోకమందంతటికి బయలువెళ్ళెను.” (రోమీయులు 10:18) నేడు దేవుని ప్రజలు కష్టమైన ఈ పనిని నిర్వర్తించగలిగారా? అని ఆయన ప్రశ్నించారు. అవును, నిస్సందేహంగా! 1881వ సంవత్సరంలో కావలికోట పత్రికా పాఠకులకు ఈ ప్రశ్న వేయబడింది: “మీరు ప్రకటిస్తున్నారా”? ప్రసంగీకుడు ఆ తర్వాత, 1922వ సంవత్సరంలో అమెరికాలోని ఒహాయోలో సీడార్ పాయింట్ దగ్గర జరిగిన సమావేశంలో ఇవ్వబడిన చారిత్రాత్మకమైన పిలుపును ప్రేక్షకులకందరికీ గుర్తుచేశారు: “రాజును, ఆయన రాజ్యాన్ని ప్రకటించండి!” కాలం గడుస్తున్న కొద్దీ, అద్భుతమైన రాజ్య సత్యాలను అన్ని దేశాలకూ ప్రకటించేందుకు దేవుని నమ్మకమైన సేవకులకున్న ఆసక్తి వారిని కదిలించింది. ప్రచురించబడిన సమాచారం ద్వారా, నోటి మాట ద్వారా సువార్త భూదిగంతముల వరకూ చేరుకుంది, అది యెహోవాకు ఘనతనూ స్తుతినీ తెచ్చింది. సహోదరుడు బార్ తన ప్రసంగాన్ని ప్రేరణాత్మకంగా ముగిస్తూ గ్రాడ్యుయేట్లకు లభించిన ఆశీర్వాదాల గురించి ఆలోచించమని చెబుతూ ఇలా అన్నారు: “మీ నియామకంలో మీరు ప్రతీరోజు యెహోవాకు ప్రార్థించేటప్పుడు, ‘వారి స్వరము భూలోకమందంతటికి బయలువెళ్ళెను’ అనే మాటల నెరవేర్పులో మీకు ఇవ్వబడిన పాత్ర విషయమై ఆయనకు యథార్థంగా కృతజ్ఞతలు తెలియజేయండి.”
ఈ ప్రసంగం తర్వాత వేర్వేరు బ్రాంచీలనుండి వచ్చిన అభినందనలు చదవబడ్డాయి, అధ్యక్షుడు గ్రాడ్యుయేట్లందరికీ డిప్లొమాలను అందించారు. ఆ తర్వాత, సంతోషమూ ప్రియమైన స్కూల్‌ను విడిచివెళుతున్నందుకూ బాధా కలిసిన భావాలతో, “ఇది మొదలుకొని నిత్యము” యెహోవాను స్తుతిస్తాము అని గ్రాడ్యుయేట్ల తీర్మానాన్ని వ్యక్తం చేస్తూ పరిపాలక సభకు, బేతేలు కుటుంబానికి వ్రాయబడిన ఉత్తరాన్ని ఒక సహోదరుడు తరగతి తరఫున చదివి వినిపించాడు.—కీర్తన 115:18.
ఈ గ్రాడ్యుయేట్ల కంటే ముందు స్కూల్‌నుండి బయటకు వెళ్ళిన ఇతర మిషనరీలు దాదాపు 60 సంవత్సరాలు సేవచేసినట్లే వీరు కూడా తమ కొత్త గృహాల్లో సర్దుకుపోయి ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిని వృద్ధిచేయడానికి మద్దతునివ్వాలని మనం ప్రార్థిద్దాం.
[23వ పేజీలోని బాక్సు]
తరగతి గణాంకాలు
ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 12
పంపించబడిన దేశాల సంఖ్య: 16
విద్యార్థుల సంఖ్య: 48
సగటు వయస్సు: 34.4
సత్యంలో సగటు సంవత్సరాలు: 17.6
పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు 13.5
[24వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 114వ తరగతి విద్యార్థులు
ఈ క్రింద ఇవ్వబడిన లిస్టులోని వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి, పేర్లు ప్రతి వరుసలోను ఎడమవైపు నుండి కుడివైపుకు పేర్కొనబడ్డాయి.
(1) రోజ్, డి.; గార్రీగొలాస్, జె.; లిండ్‌స్ట్రామ్, ఆర్.; పావ్‌నెలో, పి.; టాట్, ఎన్. (2) వాన్ హౌట్, ఎమ్.; డొనాబావుర్, సి.; మార్టినీస్, ఎల్.; మిల్లర్, డి.; ఫెస్ట్రె, వై.; నట్టర్, ఎస్. (3) మార్టినీస్, పి.; క్లార్క్, ఎల్.; మాన్, బి.; ఫిషర్, ఎల్.; రొమొ, జి. (4) రొమొ, ఆర్.; ఈడి, ఎస్.; టైమన్, సి.; క్యాంప్‌బెల్, పి.; మిల్లర్, డి.; రోసా, డబ్ల్యూ. (5) లిండ్‌స్ట్రామ్, సి.; గార్రీగొలాస్, జె.; మార్క్‌విచ్, ఎన్.; లిండాల్, కె.; వాన్ డెన్ హ్యూల్, జె.; టాట్, ఎస్.; నట్టర్, పి. (6) మాన్, పి.; పావ్‌నెలో, వి.; ఈడి, ఎన్.; వెస్ట్, ఎ.; క్లార్క్, డి.; మార్క్‌విచ్, జె. (7) ఫిషర్, డి.; డొనాబావుర్, ఆర్.; కర్రీ, పి.; కర్రీ, వై.; కార్‌ఫానో, డబ్ల్యూ.; వెస్ట్, ఎమ్.; టైమన్, ఎ. (8) వాన్ హౌట్, ఎమ్.; క్యాంప్‌బెల్, సి.; ఫెస్ట్రె, వై.; కార్‌ఫానో, సి.; వాన్ డెన్ హ్యూల్, కె.; లిండాల్, డి.