పక్షులు మనకేమి నేర్పించగలవు?
పక్షులు మనకేమి నేర్పించగలవు?
“ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?” (మత్తయి 6:26) గలిలయ సముద్రం దగ్గర ఒక కొండమీద యేసుక్రీస్తు ఇచ్చిన ప్రఖ్యాతిగాంచిన ప్రసంగంలో చెప్పిన మాటలవి. ఆయన ప్రేక్షకుల్లో కేవలం ఆయన అనుచరులు మాత్రమే కాక ఆయన శిష్యులయ్యే అవకాశమున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారందరూ ఆ ప్రాంతంలోని అన్ని భాగాలనుండి వచ్చారు. వారిలో పేదవారైన అనేకులు అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచడానికి యేసు వద్దకు తీసుకువచ్చారు.—మత్తయి 4:23-5:2; లూకా 6:17-20.
వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరచిన తర్వాత యేసు మరింత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలపై అవధానముంచాడు. ఆయన నేర్పించిన పాఠాల్లో పైన ప్రస్తావించబడినది ఒకటి.
ఆకాశపక్షులు ఎంతోకాలంగా ఉనికిలో ఉన్నాయి. వాటిలో కొన్ని పురుగులను తింటాయి, మరికొన్ని పక్షులు పళ్ళను, విత్తనాలను తింటాయి. దేవుడు పక్షులకు ఇంత సమృద్ధిగా ఆహారం దయచేశాడు కాబట్టి తన మానవ సేవకులు తమ దైనందిన ఆహారాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేసే సామర్థ్యం ఆయనకు ఖచ్చితంగా ఉంది. వారు ఆహారం కోసం డబ్బు సంపాదించుకోవడానికి వారికి ఉద్యోగం లభించేందుకు సహాయం చేయడం ద్వారా ఆయన అలా చేయవచ్చు. లేదా వారు సొంతగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడంలో సఫలులయ్యేలా చేయవచ్చు. అత్యవసర సమయాల విషయానికి వస్తే, దయగల పొరుగువారు, స్నేహితులు తమ దగ్గరవున్న ఆహారాన్ని అవసరంలోవున్నవారితో పంచుకొనేలా దేవుడు వారి హృదయాలను కదిలించగలడు.
పక్షుల జీవితాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా మనం ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. పక్షులు తమ పిల్లలను పెంచడానికి గూళ్ళు నిర్మించుకునే అద్భుతమైన సహజ జ్ఞానంతో దేవుడు వాటిని సృష్టించాడు. రెండు రకాల గూళ్ళను పరిశీలించండి. ఎడమవైపున ఉన్న చిత్రంలో ఆఫ్రికన్ రాక్ మార్టిన్ గూడు ఉంది. అది ఒక రాయిపై లేదా ఇంటి గోడపై నిర్మించబడుతుంది. ఇలాంటి గూళ్ళకు, మీదుగావున్న మరో రాయి లేదా ఈ చిత్రంలో చూపించబడినట్లు భవనపు చూరు పైకప్పుగా ఉపయోగపడుతుంది. ఆ గూడు అడుగుభాగం చిన్నచిన్న మట్టి పెల్లలను ఒక గిన్నె ఆకారంలో అతికించడం ద్వారా తయారుచేయబడుతుంది. మట్టి పెల్లలను సేకరించడానికి మగ పక్షి, ఆడ పక్షి కష్టించి పనిచేస్తాయి, ఆ గూడును నిర్మించడం పూర్తిచేయడానికి ఒక నెలకంటే ఎక్కువ కాలం పట్టవచ్చు. ఆ తర్వాత అవి తమ గూడు లోపలిభాగాన్ని గడ్డితో, ఈకలతో కప్పుతాయి. మగ పక్షి, ఆడ పక్షి కూడా తమ పిల్లలకు ఆహారం పెడతాయి. క్రింద కనిపిస్తున్నగూడు మాస్క్‌డ్ వీవర్ మగ పక్షిది. కష్టపడి పనిచేసే ఈ ఆఫ్రికా పక్షి గడ్డి పోచలను లేదా ఇతర మొక్కల ఆకులను ఉపయోగించి తన గూడు నిర్మించుకుంటుంది. అది ఒక్క రోజులో ఒక గూడును నిర్మించడం పూర్తిచేయగలదు, ఒక రుతువులో 30 కంటే ఎక్కువ గూళ్ళను నిర్మించగలదు!
వీటినుండి మనమేమి నేర్చుకోవచ్చు? దేవుడు పక్షులకు ఇలాంటి నైపుణ్యాలను ఇచ్చి, గూళ్ళు నిర్మించుకోవడానికి అవసరమైనవి సమృద్ధిగా దయచేశాడు కాబట్టి ఆయన తన మానవ సేవకులకు అవసరమైన గృహాలను ఏర్పాటుచేసుకోవడానికి తప్పకుండా సహాయం చేయగలడు. అయితే మన వస్తుదాయక అవసరాలను సంపాదించుకోవడానికి యెహోవా దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం చేయవలసినది మరొకటి ఉందని యేసు చూపించాడు. “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అని యేసు వాగ్దానం చేశాడు. (మత్తయి 6:33) ‘రాజ్యమును మొదట వెదకడం’ అంటే ఏమిటి? అని మీరు ఆలోచించవచ్చు. ఈ పత్రికను అందించే యెహోవాసాక్షులు ఆ ప్రశ్నకు సమాధానమివ్వడానికి సంతోషిస్తారు.