కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుక్రీస్తు భూమ్మీద జీవించాడనేందుకు రుజువులు

యేసుక్రీస్తు భూమ్మీద జీవించాడనేందుకు రుజువులు

యేసుక్రీస్తు భూమ్మీద జీవించాడనేందుకు రుజువులు

అల్బర్ట్‌ ఐన్‌స్టయిన్‌ అనే ఒక వ్యక్తి ఈ భూమిపై జీవించాడని మీరు నమ్ముతారా? నమ్ముతాను, అని మీరు వెంటనే జవాబు చెబుతుండవచ్చు, కానీ ఎందుకలా చెబుతారు? చాలామంది ఆయనను వ్యక్తిగతంగా కలుసుకోలేదు. అయినా ఆయన సాధించిన వాటి గురించిన విశ్వసనీయమైన నివేదికలు, ఆయన జీవించాడని రుజువుపరుస్తాయి. ఆయన జీవించాడన్న విషయం ఆయన కనుగొన్న విజ్ఞానశాస్త్ర ప్రయోగాల్లో చూడవచ్చు. ఉదాహరణకు న్యూక్లియర్‌ శక్తి ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుచ్ఛక్తి నుండి అనేకమంది ప్రయోజనం పొందుతున్నారు, ఈ ఆవిష్కరణకు ఐన్‌స్టయిన్‌ ప్రసిద్ధ సమీకరణం E=mc2 (పరమాణు ద్రవ్యరాశిని కాంతి వేగపు వర్గముతో గుణించగా వచ్చేది శక్తి విలువ) అన్వయింపుకు చాలా దగ్గరి సంబంధం ఉంది.

చరిత్రలో అత్యంత ప్రాబల్యంగల వ్యక్తి అని గుర్తించబడిన యేసుక్రీస్తు విషయంలో కూడా అదే తర్కం వర్తిస్తుంది. ఆయన గురించి వ్రాయబడినవి, ఆయన చూపిన ప్రభావపు ప్రత్యక్ష సాక్ష్యం ఆయన జీవించాడనేందుకు బలమైన రుజువునిస్తున్నాయి. ఇటీవల పురావస్తు శాఖకు లభ్యమైన​—⁠దీని ముందరి ఆర్టికల్‌లో వర్ణించబడిన​—⁠యాకోబు శిలాక్షరాలు ఆసక్తికరమైనవే అయినప్పటికీ, యేసు చారిత్రకతకు ఆధారం ఈ పురాతన కళాఖండం గానీ వేరే కళాఖండం గానీ కాదు. వాస్తవేమిటంటే యేసు గురించి, ఆయన అనుచరుల గురించి చరిత్రకారులు వ్రాసిన వాటిలోనే యేసు ఈ భూమ్మీద జీవించాడనే రుజువులు మనకు కనబడతాయి.

చరిత్రకారుల సాక్ష్యం

ఉదాహరణకు ఫ్లేవియస్‌ జోసిఫస్‌ సాక్ష్యాన్ని పరిశీలించండి, మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడైన ఈయన ఒక పరిసయ్యుడు. ఈయన యూదుల ప్రాచీనకాలపు ఆచారాలు (ఆంగ్లం) అనే పుస్తకంలో యేసు గురించి ప్రస్తావించాడు. ఆయన యేసును మెస్సీయగా మొదటిసారి ప్రస్తావించినప్పుడు దాని ప్రామాణికత్వం గురించి కొందరు సందేహాన్ని వెలిబుచ్చినప్పటికీ, యెషీవా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ లూయిస్‌ హెచ్‌ ఫెల్డ్‌మన్‌, రెండవ ప్రస్తావన గురించిన ఖచ్చితత్వాన్ని కొందరు సందేహించారని అంటున్నాడు. అక్కడ జోసిఫస్‌ ఇలా అన్నాడు: “[ప్రధాన యాజకుడైన అన్న] మహాసభ న్యాయాధిపతులను సమావేశపరచి, వారియెదుట యాకోబు అనే ఒక వ్యక్తిని ప్రవేశపెట్టాడు, ఆయన క్రీస్తు అని పిలువబడే యేసుకు సోదరుడు.” (యూదుల ప్రాచీనకాలపు ఆచారాలు (ఆంగ్లం), xx, 200) అవును, ఒక పరిసయ్యుడు, యేసును వ్యతిరేకించే శత్రువులే ఎక్కువగా ఉన్న తెగకు చెందిన ఒక సభ్యుడు, “యేసు సోదరుడైన యాకోబు,” అని అంగీకరించాడు.

యేసు జీవించాడన్న వాస్తవికతను ఆయన శిష్యుల కార్యకలాపాల్లో చూడవచ్చు. దాదాపు సా.శ. 59వ సంవత్సరంలో అపొస్తలుడైన పౌలు రోములో ఖైదీగా ఉన్నప్పుడు, యూదులలోని ప్రముఖులు ఆయనతో ఇలా అన్నారు: “ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియు[ను].” (అపొస్తలుల కార్యములు 28:​17-22) యేసు శిష్యులు చేస్తున్న పనిని వారు “మతభేదము” అని పిలిచారు. ఒకవేళ యేసు శిష్యులు అన్ని ప్రాంతాల్లో ఆక్షేపణ చేయబడినట్లయితే, చరిత్రకారులు వారి గురించి తప్పకుండా నివేదించాలి, కాదంటారా?

సుమారు సా.శ. 55వ సంవత్సరంలో జన్మించిన టాసిటస్‌ ప్రపంచంలోని గొప్ప చరిత్రకారుల్లో ఒకడని అంటారు, ఆయన తన చారిత్రక పత్రాలు (ఆంగ్లం) అనే పుస్తకంలో క్రైస్తవుల గురించి ప్రస్తావించాడు. సా.శ. 64వ సంవత్సరంలో రోములో పెద్ద మంట చెలరేగడానికి నీరోను బాధ్యుడిగా చూపించే వృత్తాంతంలో, క్రైస్తవుల గురించి ఆయనిలా వ్రాశాడు: “ఒక వర్గం చేస్తున్న పనులు ఇష్టంలేని కారణంగా నీరో వారిపై అపరాధాన్ని మోపి వారిని తీవ్ర హింసలకు గురిచేశాడు, సామాన్య ప్రజానీకం వారిని క్రైస్తవులు అని పిలిచేది. క్రైస్తవులనే పేరుకు మూలం క్రీస్తుస్‌ అనే వ్యక్తి, ఆ వ్యక్తి తిబెరి పాలనాకాలంలోని మన న్యాయాధికారుల్లో ఒకరైన పొంతి పిలాతు చేతుల్లో మరణశిక్షకు గురయ్యాడు.” ఈ వృత్తాంతంలోని వివరాలు బైబిలులోని యేసుకు సంబంధించిన సమాచారంతో సరిపోతుంది.

యేసు అనుచరుల గురించి వ్యాఖ్యానించిన మరో రచయిత ప్లైనీ ద యంగర్‌, ఆయన బితూనియకు గవర్నరుగా ఉండేవాడు. ఆయన దాదాపు సా.శ. 111వ సంవత్సరంలో కైస్తవులతో ఎలా వ్యవహరించాలో ట్రాజన్‌ చక్రవర్తికి వ్రాశాడు. క్రైస్తవులు అని తప్పుగా ఆరోపించబడిన ప్రజలు క్రైస్తవులో కాదో తేల్చుకోవడానికి, వారిని దేవతలను ప్రార్థిస్తూ వేడుకొమ్మని, ట్రాజన్‌ విగ్రహాన్ని పూజించమని శాసించమంటూ ప్లైనీ వ్రాశాడు. ఆయన ఇంకా ఇలా వ్రాశాడు: “బలవంతం చేయకండి, వారు నిజంగా క్రైస్తవులైతే వారు ఈ రెండింటిలో దేనికీ లొంగిపోరు.” క్రీస్తు మీది విశ్వాసం కోసం ఆయన అనుచరులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసేవారనే ఈ విషయం, ఆయన జీవించాడనే వాస్తవికతను రుజువుచేస్తోంది.

యేసుక్రీస్తు గురించి ఆయన అనుచరుల గురించి, మొదటి రెండు శతాబ్దాల చరిత్రకారులు అందించిన నివేదికలను క్లుప్తంగా తెలియజేసిన తర్వాత, ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (2002 ఎడిషన్‌) ఇలా పేర్కొంది: “మొదటిసారిగా 18వ శతాబ్దపు చివరిలో, ఆ తర్వాత 19వ శతాబ్దంలోను 20వ శతాబ్దపు ఆరంభంలోను సరైన కారణాలు లేకుండానే యేసు చారిత్రకత గురించి వాదోపవాదాలు జరిగాయి, కానీ ప్రాచీన కాలాల్లో క్రైస్తవత్వానికి శత్రువులైన వారు కూడా యేసు చారిత్రకత గురించి సందేహించలేదని ఈ స్వతంత్ర వృత్తాంతాలు రుజువు చేస్తున్నాయి.”

యేసు అనుచరుల సాక్ష్యం

“యేసు జీవితాన్ని, భవితవ్యాన్ని, ఆయన ప్రాముఖ్యతను తెలిపే తొలి క్రైస్తవ తాత్పర్యాలను చారిత్రకంగా పునర్నిర్మించేందుకు కావలసిన దాదాపు అన్ని రుజువులను కొత్త నిబంధన అందిస్తోంది” అని ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా చెబుతోంది. సంశయవాదులు బైబిలును యేసు ఉనికికి రుజువుగా అంగీకరించకపోవచ్చు. అయినప్పటికీ, లేఖనాధార వృత్తాంతాలను ఆధారంగా చేసుకున్న రెండు హేతువులు, యేసు వాస్తవంగా ఈ భూమ్మీద జీవించాడని నమ్మేందుకు ప్రత్యేకంగా సహాయపడతాయి.

మనం గమనించినట్లుగా ఐన్‌స్టయిన్‌ గొప్ప సిద్ధాంతాలే ఆయన ఉనికిని రుజువు చేశాయి. అదేవిధంగా యేసు బోధనలు ఆయన నిజంగానే జీవించాడని రుజువు చేస్తాయి. ఉదాహరణకు ఆయన కొండమీది ప్రసంగాన్నే తీసుకోండి, యేసు ఇచ్చిన ప్రసంగాల్లో ఇది ఎంతో ప్రసిద్ధిగాంచింది. (మత్తయి 5-7 అధ్యాయాలు) ఆ ప్రసంగ ప్రభావం గురించి అపొస్తలుడైన మత్తయి ఇలా వ్రాశాడు: “జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.” (మత్తయి 7:​28, 29) శతాబ్దాలపాటుగా ప్రజలపై ఆ ప్రసంగ ప్రభావం గురించి ప్రొఫెసర్‌ హన్స్‌ డీటర్‌ బెట్స్‌ ఇలా పేర్కొన్నారు: “కొండమీది ప్రసంగం ప్రజలను ఎంతగా ప్రభావితం చేసిందంటే, సాధారణంగా యూదామతము, క్రైస్తవమతము చివరకు పాశ్చాత్య సంస్కృతికి కూడా అది అందదు.” ఆయన ఆ ప్రసంగానికి “ప్రపంచమంతటా విశిష్ఠమైన ఆకర్షణ” ఉందని కూడా అన్నారు.

ఆ కొండమీది ప్రసంగంలో క్లుప్తంగా, ఆచరణాత్మకంగా ఉండే జ్ఞానవంతమైన ఈ మాటలను పరిశీలించండి: “నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.” “మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతికార్యము చేయకుండ జాగ్రత్తపడుడి;” “రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును;” “మీ ముత్యములను పందులయెదుట వేయకుడి;” “అడుగుడి మీకియ్యబడును,” “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి;” “వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు.” “ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును.”​—⁠మత్తయి 5:​39; 6:⁠1, 34; 7:⁠6, 7, 12, 13, 16, 17.

నిస్సందేహంగా మీరు వీటిలో కొన్నింటినైనా లేక వాటి ముఖ్యాంశాన్నైనా వినేవుంటారు. బహుశా అవి మీ భాషలో సామెతలుగా కూడా మారివుండవచ్చు. అవన్నీ కొండమీది ప్రసంగంలోనుండి తీసుకోబడినవే. అనేకమంది ప్రజలపైన, సంస్కృతులపైన ఆ ప్రసంగం చూపించిన ప్రభావం “ఒక గొప్ప బోధకుడు” జీవించాడని బలంగా రుజువుచేస్తోంది.

ఒక వ్యక్తి యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తిని సృష్టించాడనుకుందాం. బైబిల్లో యేసు బోధనలు అని పరిగణించబడే బోధనలు ఆ వ్యక్తికి తెలుసనుకుందాం. అలాంటప్పుడు ఆ వ్యక్తి యేసును యేసు బోధనలను సాధారణ ప్రజానీకానికి సాధ్యమైనంతవరకు అభిలషణీయంగా ఉండేలా రూపొందించడా? అయితే పౌలు ఇలా ఉండడం గమనించాడు: “యూదులు సూచకక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు.” (1 కొరింథీయులు 1:​22-24) క్రీస్తు సిలువవేయబడ్డాడనే సందేశం అటు యూదులకు ఇటు అన్యులకు ఎవరికీ ఆకర్షణీయంగా లేదు. అయినా మొదటి శతాబ్దపు క్రైస్తవులు క్రీస్తు గురించి ప్రకటించారు. క్రీస్తు సిలువవేయబడిన దాని గురించిన వర్ణన ఎందుకు అవసరం? దానికి సంతృప్తికరమైన వివరణ ఏమిటంటే క్రైస్తవ గ్రీకు లేఖనాల రచయితలు యేసు జీవిత మరణాల గురించిన సత్యాన్ని గ్రంథస్థం చేశారన్నదే.

యేసు చారిత్రకతకు మద్దతునిచ్చే మరో హేతువు, ఆయన అనుచరులు ఆయన బోధనలను అవిరామంగా ప్రకటించడంలో కనబడుతుంది. యేసు తన పరిచర్యను ప్రారంభించిన తర్వాత సుమారు 30 సంవత్సరాలకే, సువార్త “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడిన[ది]” అని పౌలు అనగలిగాడు. (కొలొస్సయులు 1:​23) అవును వ్యతిరేకత ఉన్నప్పటికీ యేసు బోధనలు ప్రాచీన లోకమంతటా వ్యాపించాయి. క్రైస్తవుడైనందుకు హింసించబడిన పౌలే స్వయంగా ఇలా వ్రాశాడు: “క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ [మా NW] విశ్వాసమును వ్యర్థమే.” (1 కొరింథీయులు 15:​12-17) పునరుత్థానం పొందని క్రీస్తు గురించి చేసే ప్రకటన వ్యర్థమైనప్పుడు, అసలు ఉనికిలోనే లేని క్రీస్తు గురించి ప్రకటించడం అంతకంటే వ్యర్థమవుతుంది. ప్లైనీ ద యంగర్‌ నివేదికలో మనం చదివినదాని ప్రకారం, మొదటి శతాబ్దపు క్రైస్తవులు యేసుక్రీస్తు మీది విశ్వాసం కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడ్డారు. క్రీస్తు నిజమైన వ్యక్తి కాబట్టే వారు తమ ప్రాణాలకైనా తెగించారు; గ్రంథస్థమైన సువార్త వృత్తాంతాలు చెబుతున్నట్లుగా ఆయన ఈ భూమ్మీద జీవించాడు.

రుజువులను మీరు చూశారు

క్రైస్తవ ప్రకటనా పనికి ముందు యేసుక్రీస్తు పునరుత్థానంలో విశ్వాసం ఉండాలి. మీరు కూడా, నేడు యేసు చూపిస్తున్న ప్రాబల్యాన్ని గమనించడం ద్వారా, పునరుత్థానుడైన యేసును మీ మనోనేత్రాలతో చూడవచ్చు.

యేసు కొరతవేయబడడానికి ముందు, తన భావి ప్రత్యక్షత గురించి ఒక గొప్ప ప్రవచనాన్ని అందించాడు. ఆయన తాను పునరుత్థానం చేయబడతానని, దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి తన శత్రువులను మట్టుపెట్టే సమయం కోసం ఎదురుచూస్తానని కూడా సూచించాడు. (కీర్తన 110:⁠1; యోహాను 6:​62; అపొస్తలుల కార్యములు 2:​34, 35; రోమీయులు 8:​34) ఆ తర్వాత ఆయన చర్య తీసుకొని సాతానును అతని దయ్యములను పరలోకము నుండి పడద్రోస్తాడు.​—⁠ప్రకటన 12:​7-9.

అవన్నీ ఎప్పుడు సంభవిస్తాయి? యేసు తన శిష్యులకు ‘తన ప్రత్యక్షత గురించిన ఈ యుగసమాప్తి గురించిన సూచనలు’ ఇచ్చాడు. ఆయన అదృశ్య ప్రత్యక్షతను గుర్తించే సూచనలో యుద్ధములు, కరవులు, భూకంపములు సంభవించడం, అబద్ధ ప్రవక్తలు కనిపించడం, అక్రమము విస్తరించడం, తెగుళ్లు రావడం ఉన్నాయి. అలాంటి విపత్కరమైన సంఘటనలు సంభవిస్తాయి, ఎందుకంటే అపవాదియైన సాతాను పడద్రోయబడడం అంటే ‘భూమికి శ్రమ.’ అపవాది భూపరిసరాల్లోకి దిగివచ్చాడు, “తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై” ఉన్నాడు. అంతేగాక, ఆ సూచనలో “సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతట” రాజ్య సువార్త ప్రకటింపబడడం కూడా ఉంది.​—⁠మత్తయి 24:3-14; ప్రకటన 12:12; లూకా 21:7-19.

కత్తిరించబడిన పజిల్‌ ముక్కలు ఒక్కచోట అమరినట్లు, యేసు ప్రవచించిన విషయాలు చోటు చేసుకున్నాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం సంభవించినప్పటి నుండి, మనం యేసు అదృశ్య ప్రతక్షత గురించిన సంయుక్త రుజువును చూశాము. ఆయన దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలిస్తూ, తన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. మీ చేతిలో ఉన్న ఈ పత్రిక, నేడు రాజ్య ప్రకటనా పని జరుగుతోందనడానికి నిదర్శనం.

యేసు జీవిత పరిణామం గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మీరు బైబిలు అధ్యయనం చేయాలి. యేసు ప్రత్యక్షత గురించిన వివరాలను యెహోవాసాక్షులను అడిగి ఎందుకు తెలుసుకోకూడదూ?

[5వ పేజీలోని చిత్రాలు]

జోసిఫస్‌, టాసిటస్‌, ప్లైనీ ద యంగర్‌లు యేసుక్రీస్తును ఆయన అనుచరులను సూచించారు

[చిత్రసౌజన్యం]

మొత్తం మూడు చిత్రాలు: © Bettmann/CORBIS

[7వ పేజీలోని చిత్రం]

తొలి క్రైస్తవులు యేసు నిజమైన వ్యక్తి అని దృఢంగా నమ్మారు