కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు జీవించాడనేందుకు పురావస్తుశాస్త్ర రుజువులా?

యేసు జీవించాడనేందుకు పురావస్తుశాస్త్ర రుజువులా?

యేసు జీవించాడనేందుకు పురావస్తుశాస్త్ర రుజువులా?

“యేసుకు సంబంధించిన రుజువులు శిలాలిఖితమై ఉన్నాయి” అన్న ఈ మాటలను బిబ్లికల్‌ ఆర్కియాలజి రివ్యూ (నవంబరు/డిసెంబరు 2002) అనే పత్రిక తన కవరుపేజీలో ప్రకటించింది. ఇశ్రాయేలులో లభ్యమైన సున్నపు రాయితో చేయబడిన ఒక అస్థికల పేటిక ఆ పత్రిక ముఖచిత్రంగా ఉంది. సా.శ.పూ. మొదటి శతాబ్దం నుండి సా.శ. 70కి మధ్య కొంతకాలం యూదులు అస్థికల పేటికలను ఎక్కువగా ఉపయోగించారు. ప్రత్యేకించి ఈ అస్థికల పేటిక ఇంత ప్రాచుర్యాన్ని పొందడానికి గల కారణమేమిటంటే దీనికి ఒక వైపున అరమిక్‌ భాషలో కొన్ని అక్షరాలు ఉండడమే. విద్వాంసులు వాటి భావాన్ని ఇలా గుర్తించారు: “యోసేపు కుమారుడును, యేసు సోదరుడైన యాకోబు.”

బైబిలు ప్రకారం నజరేయుడైన యేసుకు యాకోబు అనే తమ్ముడు ఉండేవాడు, మరియ భర్త యోసేపు కుమారుడిగా ఆయన పరిగణించబడేవాడు. యేసుక్రీస్తు తన సొంత ఊళ్ళో బోధించినప్పుడు ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు ఇలా అడిగారు: “ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా?”​—⁠మత్తయి 13:​54-56; లూకా 4:​22; యోహాను 6:​42.

అవును, అస్థికల పేటిక మీదున్న ఆ శిలాక్షరాలు నజరేయుడైన యేసు వర్ణనకు సరిగ్గా సరిపోతాయి. ఆ శిలాక్షరాల్లో ప్రస్తావించబడింది యేసుక్రీస్తు మాఱుటి తమ్ముడు యాకోబే గనుక అయితే, అది “యేసు గురించి బైబిలు వెలుపల లభ్యమైన అతి పురాతన పురావస్తు రుజువు” అవుతుంది అని ప్రాచీన శిలాశాసనాల సంబంధిత అధికారి, బిబ్లికల్‌ ఆర్కియాలజి రివ్యూ పత్రికలో పైన పేర్కొన్న ఆర్టికల్‌ వ్రాసిన రచయిత ఆండ్రే లమెర్‌ ప్రకటించారు. ఆ పత్రిక సంపాదకుడు హర్‌షెల్‌ షాంక్స్‌, ఈ అస్థికల పేటిక “స్పర్శ వేద్యమైనది, దృశ్యమానమైనది ఇది ఈ భూమిపై జీవించినవారిలోకెల్లా అత్యంత ప్రముఖుడైన ఏకైక వ్యక్తి దగ్గరకు వెనక్కి తీసుకువెళ్తోంది” అని పేర్కొన్నాడు.

అయితే ఆ అస్థికల పేటిక మీద వ్రాయబడిన మూడు పేర్లు మొదటి శతాబ్దంలో చాలా సాధారణమైన పేర్లు. కాబట్టి ఈ పేర్లు యేసుక్రీస్తు కుటుంబానివనే కాక యాకోబు, యోసేపు, యేసు అనే పేర్లున్న వేరే కుటుంబానికి చెందినవయ్యే అవకాశం కూడా ఉంది. లమెర్‌ ఇలా అంచనా వేశారు: “సా.శ. 70వ సంవత్సరానికి ముందు రెండు తరాల కాలంలో . . . ‘యోసేపు కుమారుడును, యేసు సోదరుడైన యాకోబు’ అని పిలువబడేవారు దాదాపు 20 మంది ఉండవచ్చు.” అయినప్పటికి అస్థికల పేటిక మీది యాకోబు, యేసు మాఱుటి తమ్ముడే అనేందుకు 90 శాతం అవకాశాలున్నాయని ఆయన భావిస్తున్నారు.

ఆ శిలాక్షరాల్లోని యాకోబు, యేసుక్రీస్తు మాఱుటి తమ్ముడేనని కొందరు విశ్వసించేందుకు మరో కారణం ఉంది. అలాంటి శిలాక్షరాలలో చనిపోయిన వ్యక్తి తండ్రి పేరు వ్రాయడం మామూలే అయినప్పటికీ, సోదరుని పేరు వ్రాయడం చాలా అరుదు. ఈ కారణంగానే కొందరు విద్వాంసులు ఈ యేసు చాలా ప్రముఖుడై ఉంటాడని విశ్వసిస్తున్నారు, అది ఆయనే క్రైస్తవత్వ సంస్థాపకుడైన యేసుక్రీస్తు అని వారు అనుకునేలా చేస్తోంది.

ఆ అస్థికల పేటిక నమ్మదగినదేనా?

అస్థికల పేటిక అంటే ఏమిటి? అదొక పెట్టె లేక మందసం, దానిలో చనిపోయిన వ్యక్తి శరీరం సమాధిలో క్షీణించిపోయిన తర్వాత అతని ఎముకలను ఉంచుతారు. యెరూషలేము చుట్టుపక్కల శ్మశానాల నుండి అనేక అస్థికల పేటికలు దొంగిలించబడ్డాయి. యాకోబు పేరుతో శిలాక్షరాలున్న ఈ పేటిక సాధికారంగా త్రవ్వకాలు జరుపుతున్న స్థలం నుండి లభ్యం కాలేదు, ఇది పురాతన వస్తువులు అమ్మే ఒక దుకాణంలో లభ్యమైంది. ఆ అస్థికల పేటిక యజమాని దాన్ని 1970లో కొన్ని వందల డాలర్లు ఇచ్చి కొన్నానని చెప్పాడు. ఆ విధంగా ఆ అస్థికల పేటిక మూలస్థానం అగోచరమైన ముసుగులోనే ఉండిపోయింది. “ఒక కళాఖండం ఎక్కడ లభించిందో, దాదాపు 2000 సంవత్సరాలపాటు అది ఎక్కడ ఉందో చెప్పలేనప్పుడు దానికి, దాని గురించి ప్రజలకున్న అభిప్రాయానికి మధ్య సంబంధమున్నట్లు ఊహించలేము” అని న్యూయార్క్‌లోని బార్డ్‌ కాలేజికి చెందిన ప్రొఫెసర్‌ బ్రూస్‌ చిల్టన్‌ అంటున్నారు.

పురావస్తు నేపథ్యంలోని కొరతను పూరించేందుకు ఆండ్రే లమెర్‌ ఆ అస్థికల పేటికను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇజ్రాయిల్‌కు పంపించారు. అక్కడ పరిశోధకులు ఆ అస్థికల పేటిక సున్నపురాయితో చేయబడిందని, అది మొదటి లేక రెండవ శతాబ్దానికి చెందినదని ధ్రువపరిచారు. దాన్ని చేయడానికి “ఆధునిక పరికరాన్ని గానీ పనిముట్టును గానీ ఉపయోగించిన సూచనలేమీ కనబడలేదు” అని వారు నివేదించారు. బైబిలు విద్వాంసులను ఇంటర్వ్యూ చేసిన ద న్యూయార్క్‌ టైమ్స్‌ కూడా తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తంచేసింది: “యేసును సూచించడాన్ని సమర్థించే అప్రధాన వివరాలపై ఆధారపడిన ఒక రుజువు బహుశా బలమైనదే కావచ్చు, కానీ అది కేవలం ఇతర అంశాలపై ఆధారపడిన రుజువు మాత్రమే.”

“ఈ కాలంలోని విద్యావంతుల్లో ఏ ఒక్కరు కూడా యేసు ఈ భూమ్మీద జీవించాడనే విషయంలో సందేహించరు” అని టైమ్‌ పత్రిక వ్యాఖ్యానించింది. అయినప్పటికీ యేసు జీవించాడనేందుకు బైబిలులోనే కాక అదనంగా రుజువులు ఉండాలని చాలామంది భావిస్తారు. ఒక వ్యక్తి యేసుక్రీస్తును విశ్వసించాలంటే అందుకు పురావస్తు శాస్త్రమే ఆధారమా? “ఈ భూమిపై జీవించినవారిలోకెల్లా అత్యంత ప్రముఖుడైన ఏకైక వ్యక్తి”కి సంబంధించిన చరిత్ర గురించిన రుజువులు మన దగ్గర ఏమున్నాయి?

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

ఎడమ, యాకోబు అస్థికల పేటిక: AFP PHOTO/J.P. Moczulski; కుడి, శిలాక్షరాలు: AFP PHOTO/HO