కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఇదిగో మన దేవుడు’

‘ఇదిగో మన దేవుడు’

‘ఇదిగో మన దేవుడు’

ఈ రెండు అధ్యయన ఆర్టికల్స్‌లో చర్చించిన సమాచారం, ప్రపంచవ్యాప్తంగా 2002/03లో జరిగిన జిల్లా సమావేశాల్లో విడుదల చేయబడిన యెహోవాకు సన్నిహితమవ్వండి (ఆంగ్లం) అనే పుస్తకంమీద ఆధారపడింది.​—⁠20వ పేజీలోవున్న “అది నా హృదయ శూన్యాన్ని నింపింది,” అనే ఆర్టికల్‌ చూడండి.

“ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు. . . . యెహోవా ఈయనే.”​—⁠యెషయా 25:⁠9.

“నాస్నేహితు[డు]” అని భూమ్యాకాశాలకు సృష్టికర్తయగు యెహోవా పితరుడైన అబ్రాహామును పిలిచాడు. (యెషయా 41:⁠8) అల్పుడైన మానవుడు విశ్వసర్వాధిపతితో స్నేహం ఆనందించడాన్ని ఊహించండి! ‘దేవునికి అంత సన్నిహితంగా ఉండడం నాకు సాధ్యమౌతుందా’ అని మీరాశ్చర్యపోవచ్చు.

2 దేవునికి సన్నిహితులం కావచ్చునని బైబిలు మనకు హామీ ఇస్తోంది. అలాంటి సన్నిహితత్వం అబ్రాహాముకు అనుగ్రహింపబడింది, ఎందుకంటే ఆయన ‘దేవుని నమ్మాడు.’ (యాకోబు 2:​23) నేడు కూడా, యెహోవా ‘యథార్థవంతులకు తోడుగా ఉంటాడు.’ (సామెతలు 3:​32) “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని యాకోబు 4:8 మనకు ఉద్బోధిస్తుంది. యెహోవాకు దగ్గరయ్యేందుకు మనం చర్యలు తీసుకుంటే నిశ్చయంగా ఆయన మనకు దగ్గరౌతాడు. అయితే పాపులము, అపరిపూర్ణ మానవులము అయిన మనమే మొదట చర్య తీసుకుంటామని ఈ ప్రేరేపిత లేఖనాల భావమా? ఎంతమాత్రం కాదు. మన ప్రేమగల దేవుడైన యెహోవాయే రెండు ప్రాముఖ్యమైన చర్యలు తీసుకున్నందున ఆయనతో ఆ సన్నిహితత్వం మనకు సాధ్యమౌతుంది.​—⁠కీర్తన 25:⁠14.

3 మొదటిగా, యేసు “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు” యెహోవా ఏర్పాటు చేశాడు. (మత్తయి 20:​28) ఆ విమోచన క్రయధన బలి మనం దేవునికి సన్నిహితం కావడాన్ని సాధ్యం చేస్తుంది. “ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము” అని బైబిలు చెబుతోంది. (1 యోహాను 4:⁠19) అవును, దేవుడే ‘మొదట మనలను ప్రేమించాడు,’ కాబట్టి మనమాయనతో స్నేహం చేయడానికి ఆయనే పునాది వేశాడు. రెండవది, యెహోవా తనను మనకు బయల్పరచుకున్నాడు. మనమెవరితో స్నేహంచేసినా, అది ఆ వ్యక్తిని నిజంగా తెలుసుకోవడం మీద, అతనికున్న విశేషలక్షణాలను మెచ్చుకుంటూ వాటిని విలువైనవిగా ఎంచడం మీద ఆ అనుబంధం ఆధారపడి ఉంటుంది. దీని భావమేమిటో ఆలోచించండి. ఒకవేళ యెహోవా మరుగైయుండి, తెలియబడని దేవునిగావుంటే, ఆయనకు మనమెన్నడూ సన్నిహితులం కాలేము. అయితే, తను మరుగైయుండడానికి బదులు మనమాయనను తెలుసుకోవాలని యెహోవా కోరుతున్నాడు. (యెషయా 45:​19) అందుకాయన తన వాక్యమైన బైబిలులో మనమర్థం చేసుకోగల మాటల్లోనే తనను బయల్పరచుకున్నాడు. అది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడనటానికే గాక మనం ఆయనను తెలుసుకొని పరలోక తండ్రిగా ఆయనను ప్రేమించాలని కోరుతున్నాడనటానికి కూడా ఒక నిదర్శనం.

4 ఒక చిన్నపిల్లవాడు తన స్నేహితులకు తన తండ్రిని చూపిస్తూ “అదిగో మా నాన్న” అని అమాయకంగా ఆనందంతో, గర్వంతో చెప్పుకోవడం మీరెప్పుడైనా చూశారా? యెహోవా విషయంలో కూడా అదేలా భావించే ప్రతి కారణం దేవుని ఆరాధకులకుంది. “ఇదిగో . . . మన దేవుడు” అని విశ్వాస ప్రజలు ఉల్లసించే కాలాన్ని గూర్చి బైబిలు ముందుగానే చెబుతోంది. (యెషయా 25:​8, 9) యెహోవా లక్షణాల్ని మనమెంత గ్రహిస్తామో, అంతెక్కువగా మనకాయన శ్రేష్ఠమైన తండ్రని, సన్నిహిత స్నేహితుడని మనం భావిస్తాము. అవును, యెహోవా లక్షణాల్ని అర్థంచేసుకోవడం ఆయనకు సన్నిహితం కావడానికి మనకెన్నో కారణాల్నిస్తుంది. కాబట్టి యెహోవా ప్రధాన లక్షణాలైన​—⁠శక్తి, న్యాయం, జ్ఞానం, ప్రేమలను బైబిలెలా విశదపరుస్తుందో మనం పరిశీలిద్దాం. మొదటి మూడు లక్షణాల్ని మనమీ ఆర్టికల్‌లో చర్చిస్తాం.

‘సర్వశక్తుడు’

5 యెహోవా “సర్వశక్తు[డు.]” (యోబు 37:​23) “యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘనమైనదాయెను” అని యిర్మీయా 10:6 చెబుతోంది. ఏ ప్రాణికీ లేనంత అపరిమితమైన శక్తి యెహోవాకు ఉంది. ఆ కారణంగా, ఆయన మాత్రమే “సర్వాధికారీ” అని పిలువబడ్డాడు. (ప్రకటన 15:⁠3) సృష్టించేందుకు, నాశనం చేసేందుకు, రక్షించేందుకు, పునరుద్ధరించేందుకు యెహోవా తన భీకరశక్తిని ఉపయోగిస్తాడు. కేవలం రెండు ఉదాహరణలను ఆలోచించండి​—⁠ఆయనకున్న సృష్టించే శక్తి, రక్షించే శక్తి.

6 వేసవిలో ఒకరోజు బయట నిలబడితే మీ చర్మంపై మీకెలాంటి అనుభూతి కలుగుతుంది? సూర్యరశ్మితో వెచ్చని అనుభూతి మీకు కలుగుతుంది. నిజానికి, యెహోవా యొక్క సృష్టించే శక్తి ఫలితాలే మీకు కలిగిన ఆ అనుభూతికి కారణం. సూర్యునికెంత శక్తి ఉంది? సూర్యుని మధ్యభాగంలో దాదాపు 27 మిలియన్‌ డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుని ఆ మధ్యభాగం నుండి ఆవగింజంత ఉష్ణోగ్రత తీసి భూమ్మీద వేస్తే, దాని వేడికి 150 కిలోమీటర్ల లోపు మీరు సురక్షితంగా నిలబడలేరు! ప్రతి సెకనుకు, వందల కోట్ల అణు బాంబుల విస్ఫోటనానికి సమానమయ్యే శక్తి సూర్యునినుండి వెలువడుతుంది. అయినా, భూమి ఆ భీకర అణుథార్మిక కొలిమిచుట్టూ సరైన దూరంలో పరిభ్రమిస్తుంది. సూర్యునికి దగ్గరైందా భూమ్మీది నీరు ఆవిరైపోతుంది; దూరమైందా మొత్తం భూమంతా మంచు గడ్డలా మారుతుంది. దీనిలో ఏ విపరీతం జరిగినా మనది నిర్జీవ గ్రహమౌతుంది.

7 తమ జీవితమంతా సూర్యునిపై ఆధారపడి ఉన్నా, చాలామంది దాన్ని తేలిగ్గా తీసుకుంటారు. అలా వారు, సూర్యుడు మనకు బోధించగల విషయం నేర్చుకోరు. కీర్తన 74:⁠16 యెహోవాను గూర్చి మనకిలా చెబుతోంది: “సూర్యచంద్రులను నీవే నిర్మించితివి.” అవును, ‘ఆకాశమును భూమిని సృజించిన’ యెహోవాను సూర్యుడు మహిమపరుస్తున్నాడు. (కీర్తన 146:⁠6) అయినా, యెహోవా అపారశక్తిని గూర్చి మనకు బోధించే అనేక సృష్టి కార్యాల్లో అది ఒకటి మాత్రమే. యెహోవా సృష్టించే శక్తిని గూర్చి మనమెంత నేర్చుకుంటే, ఆయన పట్ల మన భయభక్తులు అంత ప్రగాఢమౌతాయి.

8 యెహోవా తన సేవకులను కాపాడ్డానికి, వారి గురించి శ్రద్ధ తీసుకోవడానికి కూడా తన అపారశక్తిని ఉపయోగిస్తాడు. కాపుదలనిస్తానని యెహోవా చేసిన వాగ్దానాల్ని వర్ణించడానికి బైబిలు కొన్ని సుస్పష్టమైన, హృదయాన్ని తాకే దృష్టాంతాల్ని ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, యెషయా 40:​11 ఏమి చెబుతుందో గమనించండి. అక్కడ యెహోవా తనను గొఱ్ఱెలకాపరితో, తన ప్రజలను గొఱ్ఱెలతో పోలుస్తున్నాడు. మనమిలా చదువుతాము: “గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.” ఆ వచనంలో వర్ణించబడినదాన్ని మీరు దృశ్యీకరించుకోగలరా?

9 కొన్ని జంతువులు మాత్రమే పెంపుడు గొఱ్ఱెలంత నిస్సహాయంగా ఉంటాయి. బైబిలు కాలాల గొఱ్ఱెలకాపరికి తన గొఱ్ఱెలను తోడేళ్ళు, ఎలుగుబంట్లు, సింహాలనుండి కాపాడ్డానికి ఎంతో ధైర్యం కావాలి. (1 సమూయేలు 17:34-36; యోహాను 10:​10-13) అయితే గొఱ్ఱెల్ని మృదువుగా కాపాడవలసిన, శ్రద్ధచూపవలసిన, సందర్భాలు కూడా ఉండేవి. ఉదాహరణకు, మందకు దూరంగా గొఱ్ఱె ఈనినప్పుడు, అప్పుడే పుట్టిన ఆ నిస్సహాయ గొఱ్ఱెపిల్లను కాపరెలా కాపాడతాడు? ఆ గొఱ్ఱెపిల్లను బహుశా ఆయన కొన్నిరోజుల పాటు “రొమ్మున ఆనించుకొని” అంటే తన పై వస్త్రపు మడతల్లోవుంచుకొని మోస్తాడు. అయితే ఆ చిన్న గొఱ్ఱెపిల్ల గొఱ్ఱెలకాపరి రొమ్మునకు ఎలా చేరుకొంటుంది? ఆ గొఱ్ఱెపిల్ల గొఱ్ఱెలకాపరి కాళ్ళ దగ్గరకొచ్చి ముట్టెతో మెల్లగా పొడవవచ్చు. అయితే, ఆ గొఱ్ఱెలకాపరే స్వయంగా క్రిందికివంగి ఆ గొఱ్ఱెపిల్లనెత్తుకుని దాన్ని భద్రంగా తన రొమ్మున ఆనించుకోవలసి ఉంటుంది. తన సేవకుల్ని కాపాడి, వారిని జాగ్రత్తగా చూసుకొనే మన గొప్ప గొఱ్ఱెలకాపరి సంసిద్ధతకు అదెంతటి వాత్సల్యపూరిత చిత్రీకరణో గదా!

10 యెహోవా కాపుదలనిస్తానని కేవలం వాగ్దానం చేయడంకంటే ఎక్కువే చేశాడు. “భక్తులను శోధనలోనుండి తప్పించుటకు” తాను సమర్థుడని బైబిలు కాలాల్లో ఆయన అద్భుత రీతుల్లో ప్రదర్శించాడు. (2 పేతురు 2:⁠9) నేటి విషయమేమిటి? మనల్నిప్పుడు సమస్త విపత్తుల్నుండి కాపాడ్డానికి ఆయన తన శక్తిని ఉపయోగించడని మనకు తెలుసు. అయితే, ఆయన మనకు మరిముఖ్యమైనది అంటే ఆధ్యాత్మిక కాపుదలనిస్తాడు. పరీక్షల్ని తట్టుకోవడానికి, ఆయనతో మనకున్న సంబంధాన్ని కాపాడుకోవడానికి మనకవసరమైనది దయచేయడం ద్వారా మన ప్రేమగల దేవుడు మనల్ని ఆధ్యాత్మిక హానినుండి కాపాడతాడు. ఉదాహరణకు, లూకా 11:⁠12, 13 ఇలా చెబుతోంది: “మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు[ను].” ఆ అధికశక్తి మనమెదుర్కొనే ఏ పరీక్షనైనా, సమస్యనైనా తాళుకొనే బలాన్నివ్వగలదు. (2 కొరింథీయులు 4:⁠7) ఆ విధంగా, యెహోవా మన జీవాన్ని కొన్ని సంవత్సరాలు కాదుగాని నిరంతరం కాపాడేలా చర్య తీసుకుంటాడు. ఆ ఉత్తరాపేక్షను మనస్సులో ఉంచుకున్న వారిగా, మనమీ విధానంలో కలిగే ఎలాంటి బాధనైనా ‘క్షణమాత్రముండే చులకని శ్రమగా’ దృష్టించవచ్చు. (2 కొరింథీయులు 4:​18) మనపక్షంగా తన శక్తిని అంత ప్రేమగా ఉపయోగించే దేవుని వైపుకు మనం ఆకర్షించబడడం లేదా?

“యెహోవా న్యాయమును ప్రేమించువాడు”

11 యెహోవా సవ్యమైనది, న్యాయమైనదే చేస్తాడు, అదీ అన్ని సందర్భాల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా అలా చేస్తాడు. దైవిక న్యాయం మనల్ని తరిమి కొట్టేంత ఉదాసీనమైంది, కఠినమైంది కాదు, అది మనల్ని యెహోవావైపు ఆకర్షించే ఒక ప్రియ లక్షణం. ఈ లక్షణపు హృదయోత్తేజకరమైన నైజాన్ని బైబిలు స్పష్టంగా వర్ణిస్తోంది. కాబట్టి, యెహోవా తన న్యాయం ప్రదర్శించే మూడు మార్గాల్ని మనం పరిశీలిద్దాం.

12 మొదటిది, తన సేవకులపట్ల నమ్మకత్వం, యథార్థత చూపేలా న్యాయం యెహోవాను పురికొల్పుతుంది. యెహోవా న్యాయానికిగల ఈ అంశాన్ని కీర్తనకర్తయైన దావీదు వ్యక్తిగతంగా చవిచూశాడు. స్వీయానుభవం నుండి, దేవుని మార్గాల అధ్యయనం నుండి దావీదు చివరకే నిర్ణయానికి వచ్చాడు? ఆయనిలా ప్రకటించాడు: “యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికి కాపాడబడుదురు.” (కీర్తన 37:​28) ఇదెంత ఓదార్పునిచ్చే హామీ! తనయెడల యథార్థంగా ఉన్నవారిని మన దేవుడు ఒక్కక్షణం కూడా ఎడబాయడు. కాబట్టి మనమాయన సన్నిహితత్వంపై, ప్రేమపూర్వక శ్రద్ధపై ఆధారపడవచ్చు. ఆయన న్యాయం దీనికి హామీ ఇస్తోంది!​—⁠సామెతలు 2:​7, 8.

13 రెండవది, దైవిక న్యాయం బాధలో ఉన్నవారి అవసరాల్ని పరిగణలోకి తీసుకుంటుంది. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో నిర్భాగ్యులపట్ల ఆయనకున్న శ్రద్ధ స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకు, ధర్మశాస్త్రం విధవరాండ్రను అనాధల్ని శ్రద్ధగా చూసుకొనే ఏర్పాట్లు చేసింది. (ద్వితీయోపదేశకాండము 24:​17-21) అట్టి కుటుంబాలకు జీవితమెంత కష్టభరితంగా ఉండగలదో గుర్తించి, యెహోవాయే స్వయంగా వారికి తండ్రివంటి న్యాయాధిపతి, రక్షకుడు అయ్యాడు. (ద్వితీయోపదేశకాండము 10:​17, 18) భద్రతలేని స్త్రీలను, పిల్లలను ఎవరైనా హింసిస్తే, వారి మొర వింటానని ఆయన ఇశ్రాయేలీయులను హెచ్చరించాడు. నిర్గమకాండము 22:​22-24లో వ్రాయబడినట్లుగా, ‘నా కోపాగ్ని రవులుకొనునని’ ఆయన తెలియజేశాడు. దేవుని ప్రధాన లక్షణాల్లో కోపం ఒకటి కాకపోయినా, బుద్ధిపూర్వకంగా అన్యాయం జరుగుతుంటే, మరిముఖ్యంగా దుర్భల స్థితిలో ఉన్నవారు బాధింపబడుతుంటే నీతియుక్తంగా ఆగ్రహించేందుకు ఆయన కదలింపబడతాడు.​—⁠కీర్తన 103:⁠6.

14 మూడవది, ద్వితీయోపదేశకాండము 10:⁠17లో, యెహోవా “నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు” అని బైబిలు మనకు హామీ ఇస్తోంది. అధికారం లేదా పలుకుబడి ఉన్న అనేకులవలే యెహోవా వస్తుసంపద లేదా పైరూపాన్ని బట్టి ప్రభావితం చెందడు. ఆయనకు పక్షపాతం లేదు, దురభిమానం చూపించడు. నిత్యజీవ నిరీక్షణతో తన సత్యారాధకులయ్యే అవకాశం శ్రేష్ఠులైన కొందరికి మాత్రమే పరిమితం చేయబడలేదన్న విషయం ఆయన నిష్పక్షపాత వైఖరికి నిజంగా ఒక అసాధారణ నిదర్శనం. బదులుగా, అపొస్తలుల కార్యములు 10:⁠35 ఇలా చెబుతోంది: “ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” వారి సామాజిక స్థితి, శరీరఛాయ, లేదా వారు నివసించే దేశమేదైనా అందరికీ ఈ ఉత్తరాపేక్ష తెరవబడి ఉంది. అది సర్వశ్రేష్ఠమగు సరియైన న్యాయం కాదా? నిజంగా, యెహోవా న్యాయాన్ని గూర్చిన సరైన అవగాహన మనల్ని ఆయనవద్దకు ఆకర్షిస్తుంది!

‘ఆహా, దేవుని జ్ఞాన బాహుళ్యము ఎంతో గంభీరం!’

15రోమీయులు 11:33లో వ్రాయబడినట్టు, అపొస్తలుడైన పౌలు భావావేశంతో ఇలా అన్నాడు: “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము.” అవును, యెహోవా విస్తార జ్ఞానంయొక్క వివిధాంశాల్ని మననం చేస్తుండగా, మనం నిశ్చయంగా భక్తిపూర్వక భయంతో నింపబడతాము. అయితే, ఈ లక్షణాన్ని మనమెలా నిర్వచించవచ్చు? జ్ఞానం అంటే, తెలివి వివేచన అవగాహనలను ఒకచోటచేర్చి ప్రయోగించడమని భావం. తన విస్తార జ్ఞానంతో, అవగాహనా బాహుళ్యంతో యెహోవా అన్ని సమయాల్లో సర్వశ్రేష్ఠ నిర్ణయాలు తీసుకొంటూ, వాటిని బుద్ధిగ్రాహ్యమగు ఉత్తమ కార్యాచరణతో నెరవేరుస్తాడు.

16 యెహోవాకున్న విస్తార జ్ఞానానికి కొన్ని ప్రత్యేక రుజువులేమిటి? కీర్తన 104:⁠24 ఇలా చెబుతోంది: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.” నిజమే, యెహోవా కలుగజేసిన వాటినిగూర్చి మనమెంత నేర్చుకుంటే, అంతెక్కువగా ఆయన జ్ఞానాన్నిబట్టి మనమాయనపట్ల భయభక్తులు కలిగివుంటాం. అంతెందుకు, యెహోవా సృష్టికార్యాల్ని అధ్యయనంచేసి శాస్త్రవేత్తలెంతో నేర్చుకున్నారు! ప్రకృతిలో కన్పించే రూపకల్పనల్ని నకలుచేసేలా ప్రయత్నించడానికి ఇంజనీరింగ్‌ రంగంలో బయోమిమెటిక్స్‌ అనే విభాగంకూడా ఉంది.

17 ఉదాహరణకు, ఒక సాలెగూడు చూసినప్పుడు మీరెంతో ఆశ్చర్యపోయుంటారు. అదొక అద్భుత రూపకల్పన. బలహీనంగాకనబడే సాలెగూడు దారాలు కొన్ని స్టీల్‌కన్నా, బులెట్‌ప్రూఫ్‌ కోటు పోగులకన్నా దృఢంగా ఉంటాయి. దీని అసలు భావమేమిటి? చేపలుపట్టే పడవలో ఉపయోగించే వల పరిమాణంలోకి సాగదీయబడిన సాలెగూడును ఊహించుకోండి. ఆ సాలెగూడు ఆకాశంలో దూసుకెళుతున్న విమానాన్ని గాల్లోనే ఆపివేసేంత బలంగా ఉంటుంది! అవును, అలాంటివన్నీ యెహోవా తన “జ్ఞానముచేత” సృష్టించాడు.

18 యెహోవా జ్ఞానానికి అతిగొప్ప నిదర్శనం ఆయన వాక్యమైన బైబిల్లో కనబడుతుంది. దాని పుటల్లోని జ్ఞానయుక్త ఉపదేశం, మనకు నిజమైన సర్వశ్రేష్ఠమైన జీవనమార్గాన్ని చూపిస్తుంది. (యెషయా 48:17) బైబిలు రచనా విధానంలో కూడా యెహోవా సాటిలేని జ్ఞానం మనకు కనిపిస్తుంది. అదెలా? యెహోవా తన జ్ఞానాన్నిబట్టి తన వాక్య రచనకు మానవుల్నే ఎంచుకున్నాడు. ఒకవేళ ప్రేరేపిత వాక్య రచనకు ఆయన దేవదూతల్ని వాడుకునివుంటే, బైబిలు ఇప్పుడున్నంత ఆకర్షణీయంగా ఉండేదా? నిజమే, దేవదూతలు తమకున్న ఉన్నత దృష్టికోణం నుండి యెహోవాను వర్ణించి, ఆయనపట్ల తమ భక్తిని వ్యక్తపరిచి ఉండేవారు. మనకంటే ఎంతో ఉన్నతమైన జ్ఞానం, అనుభవం, బలంగల పరిపూర్ణ ఆత్మప్రాణుల దృక్కోణాన్ని అదేస్థాయిలో మనం నిజంగా అర్థం చేసుకోగలిగేవాళ్ళమా?​—⁠హెబ్రీయులు 2:​6, 7.

19 బైబిలు రచనకు మానవ లేఖికుల్ని ఉపయోగించడం బైబిల్లో అత్యద్భుత వాత్సల్యం, ఆకర్షణ ఉండేలా చేసింది. దాని రచయితలు మనలాంటి భావాలున్న మానవులే. అపరిపూర్ణులు గనుక మనలాగే వారుకూడా కష్టాలు, ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో, తమ స్వంత భావాల్ని, సంఘర్షణల్ని ఉత్తమ పురుషములో వ్రాశారు. (2 కొరింథీయులు 12:​7-10) కాబట్టి ఏ దేవదూతా వ్యక్తపర్చలేని పదాలతో వారు బైబిలు వ్రాశారు. ఉదాహరణకు, 51వ కీర్తనలోవున్న దావీదు మాటలే తీసుకోండి. పైవిలాసం ప్రకారం, గంభీరమైన పాపంచేసిన తర్వాత దావీదు ఈ కీర్తన కూర్చాడు. తీవ్ర దుఃఖం వ్యక్తపరుస్తూ దేవుని క్షమాపణ యాచిస్తూ తన హృదయం కుమ్మరించాడు. 2, 3 వచనాలిలా చెబుతున్నాయి: “నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.” 5వ వచనం గమనించండి: “నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.” 17వ వచనం ఇంకా ఇలా చెబుతోంది: “విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు; దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” రచయిత మనోవేదన మీకు తెలియడంలేదా? అట్టి మనోభావాల్ని ఒక అపరిపూర్ణ మానవుడు కాకపోతే మరింకెవరు వ్యక్తం చేయగలరు?

20 అలాంటి అపరిపూర్ణ మానవుల్ని ఉపయోగించి యెహోవా మనకు కావల్సిన దానినే అంటే “దైవావేశమువలన” కలిగినా మానవ పరిభాషలోవున్న గ్రంథం అనుగ్రహించాడు. (2 తిమోతి 3:​16, 17) అవును, ఆ రచయితలు పరిశుద్ధాత్మచే నడిపించబడ్డారు. వారలా తమ స్వంత జ్ఞానం కాదుగానీ యెహోవా జ్ఞానాన్నే వ్రాశారు. ఆ జ్ఞానం సంపూర్ణంగా నమ్మదగినది. మన జ్ఞానంకంటే అదెంతో ఉన్నతమైంది, అందుకే దేవుడు ప్రేమపూర్వకంగా మనకిలా ఉద్బోధిస్తున్నాడు: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామెతలు 3:​5, 6) ఆ జ్ఞానయుక్తమైన సలహాను లక్ష్యపెట్టడం ద్వారా, మనం సంపూర్ణ జ్ఞానియైన మన దేవునికి సన్నిహితులమౌతాం.

21 యెహోవా లక్షణాలన్నిటిలోకి అత్యంత ఆకర్షణీయమైందీ, రమ్యమైందీ ప్రేమ. యెహోవా ప్రేమనెలా చూపించాడో తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడుతుంది.

మీరు గుర్తుతెచ్చుకోగలరా?

మనం యెహోవాతో సన్నిహితత్వం పెంచుకోవడాన్ని సాధ్యపరచే ఏ చర్యలు ఆయన తీసుకున్నాడు?

యెహోవా సృష్టించే శక్తికి, రక్షించే శక్తికి కొన్ని ఉదాహరణలేవి?

ఏయే విధాలుగా యెహోవా న్యాయం జరిగిస్తాడు?

యెహోవా సృష్టికార్యాలందు, అలాగే బైబిల్లో ఆయన జ్ఞానమెలా కనబడుతుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) పితరుడైన అబ్రాహామును యెహోవా ఏమని పిలిచాడు, ఇది ఏ విషయంలో మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు? (బి) దేవునికి సన్నిహితులం కావచ్చునని బైబిలెలా మనకు హామీ ఇస్తోంది?

3. మనం యెహోవా స్నేహం ఆనందించడాన్ని సాధ్యం చేసే ఏ రెండు చర్యల్ని ఆయన తీసుకున్నాడు?

4. యెహోవా లక్షణాల్ని మరియెక్కువగా తెలుసుకొనే కొలది ఆయననుగూర్చి మనమెలా భావిస్తాం?

5. యెహోవా మాత్రమే “సర్వాధికారీ” అని పిలువబడడం ఎందుకు సబబు, తన భీకరశక్తిని ఆయన ఏయే విధాలుగా ఉపయోగిస్తాడు?

6, 7. సూర్యునికెంత శక్తి ఉంది, అది ఏ ప్రాముఖ్యమైన సత్యాన్ని రూఢిపరుస్తోంది?

8, 9. (ఎ) తన ఆరాధకుల్ని కాపాడి, వారిని జాగ్రత్తగా చూసుకొనే యెహోవా సంసిద్ధతను ఏ వాత్సల్యపూరిత దృష్టాంతం మనకు వర్ణిస్తున్నది? (బి) బైబిలు కాలాల గొఱ్ఱెలకాపరి తన గొఱ్ఱెలకు ఎలాంటి కాపుదలనిచ్చేవాడు, మన గొప్ప గొఱ్ఱెలకాపరిని గూర్చి మనకిదేమి బోధిస్తున్నది?

10. యెహోవా నేడు మనకెలాంటి కాపుదలనిస్తున్నాడు, అలాంటి కాపుదల ప్రత్యేకంగా ఎందుకు ప్రాముఖ్యమైనది?

11, 12. (ఎ) యెహోవా న్యాయమెందుకు మనల్ని ఆయనవైపు ఆకర్షిస్తుంది? (బి) యెహోవా న్యాయం విషయంలో దావీదు చివరకే నిర్ణయానికి వచ్చాడు, ఈ ప్రేరేపిత మాటలు మనల్నెలా ఓదార్చగలవు?

13. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో నిర్భాగ్యులపట్ల ఆయనకున్న శ్రద్ధ ఎలా స్పష్టమౌతోంది?

14. యెహోవా నిష్పక్షపాత వైఖరికి ఏది నిజంగా ఒక అసాధారణ నిదర్శనం?

15. జ్ఞానమంటే ఏమిటి, యెహోవా దానినెలా ప్రదర్శిస్తాడు?

16, 17. యెహోవా సృష్టికార్యాలు ఆయన విస్తార జ్ఞానాన్నెలా రుజువు చేస్తున్నాయి? ఒక ఉదాహరణ చెప్పండి.

18. తన వాక్యమైన బైబిలు రచనకు మానవుల్నే ఎంచుకోవడంలో యెహోవా జ్ఞానమెలా కనబడుతోంది?

19. మానవ లేఖికుల్ని ఉపయోగించడం బైబిల్లో అత్యద్భుత వాత్సల్యం, ఆకర్షణ ఉండేలా చేసిందని ఏ ఉదాహరణ చూపిస్తోంది?

20, 21. (ఎ) మానవ రచయితలే వ్రాసినా, బైబిల్లో యెహోవా జ్ఞానమే ఉందని ఎందుకు చెప్పవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?

[10వ పేజీలోని చిత్రం]

గొఱ్ఱెపిల్లను తన రొమ్మున ఆనించుకొనే గొఱ్ఱెలకాపరివలె, యెహోవా తన గొఱ్ఱెల్ని వాత్సల్యంతో చూసుకుంటాడు

[13వ పేజీలోని చిత్రం]

బైబిలు రచనా విధానంలో యెహోవా జ్ఞానం కనబడుతుంది