కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“దేవుడు ప్రేమాస్వరూపి”

“దేవుడు ప్రేమాస్వరూపి”

“దేవుడు ప్రేమాస్వరూపి”

“దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.”​1 యోహాను 4:⁠8.

యెహోవా గుణాలన్నీ అసమానం, పరిపూర్ణం, ప్రీతికరం. యెహోవా లక్షణాలన్నింటిలో ప్రేమ అతి ప్రియమైనది. ఆయన ప్రేమంత బలంగా మరేదీ మనల్ని యెహోవాయొద్దకు ఆకర్షించదు. సంతోషదాయకంగా ప్రేమ ఆయన ప్రధాన లక్షణం కూడా. అది మనకెలా తెలుసు?

2 యెహోవా ఇతర ప్రధాన గుణాలను గూర్చి ఎన్నడూ చెప్పని ఒక విశేషాన్ని బైబిలు ప్రేమకు సంబంధించి చెబుతోంది. దేవుడు శక్తని, దేవుడు న్యాయమని లేదా దేవుడు జ్ఞానమని లేఖనాలు చెప్పడంలేదు. ఆయనకు ఆ లక్షణాలు ఉన్నాయి, ఆ మూడింటికి ఆయనే మూలాధారం. అయితే 1 యోహాను 4:8 ప్రేమనుగూర్చి మరింత ప్రగాఢమైనది చెబుతోంది: “దేవుడు ప్రేమాస్వరూపి.” (ఇటాలిక్కులు మావి.) అవును, యెహోవా ప్రేమమయం. అదాయన సహజ స్వభావం. దాని గురించి మామూలుగా మనమిలా చెప్పవచ్చు: యెహోవా శక్తి ఆయన చర్య తీసుకోవడాన్ని సాధ్యపరుస్తుంది. ఆయన న్యాయము, జ్ఞానము ఆయన చర్య తీసుకునే విధానాన్ని నిర్దేశిస్తాయి. కానీ యెహోవా ప్రేమ, చర్య తీసుకునేలా ఆయనను ప్రేరేపిస్తుంది. అలాగే ఇతర గుణాల్ని ఉపయోగించే విధానంలో ఆయన ప్రేమ ఎల్లప్పుడూ ప్రతిబింబిస్తుంది.

3 యెహోవా మూర్తీభవించిన ప్రేమ అని తరచూ చెప్పబడింది. కాబట్టి ప్రేమను గూర్చి మనం నేర్చుకోవాలంటే, మనం తప్పక యెహోవాను గూర్చి నేర్చుకోవాలి. యెహోవా అపూర్వ ప్రేమకున్న కొన్ని ముఖరూపాల్ని మనం పరిశీలిద్దాం.

అత్యంత గొప్ప ప్రేమకార్యం

4 యెహోవా ప్రేమని అనేక విధాలుగా చూపాడు, అయితే అన్నిటికంటే ఉత్తమమైనది ఒకటుంది. ఏమిటది? మనకోసం బాధపడి చనిపోవడానికి యెహోవా తన కుమారుణ్ణి పంపించడం. దీనిని మనం ప్రేమ చూపడంలో యావత్‌ చరిత్రలో అత్యంత గొప్పచర్య అని నిశ్చయంగా చెప్పవచ్చు. మనమలా ఎందుకు చెప్పవచ్చు?

5 బైబిలు యేసును “సర్వసృష్టికి ఆదిసంభూతు[డు]” అని పిలుస్తోంది. (కొలొస్సయులు 1:​15) కొంచెమాలోచించండి, యెహోవా కుమారుడు భౌతిక విశ్వానికి ముందే ఉనికిలో ఉన్నాడు. కాబట్టి, తండ్రి కుమారుడు ఎంతకాలం కలిసి ఉన్నారు? మన విశ్వం 1300 కోట్ల సంవత్సరాల నుండి ఉందని కొంతమంది విజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. ఈ అంచనా సరైనప్పటికీ, యెహోవా జ్యేష్ఠకుమారుని జీవితకాలాన్ని సూచించడానికి అది సరిపోదు. ఆ యుగాల కాలమంతటిలో ఆయనేం చేశాడు? తండ్రియొద్ద ఆ కుమారుడు సంతోషంతో “ప్రధానశిల్పి”గా పనిచేశాడు. (సామెతలు 8:30; యోహాను 1:⁠3) మిగిలినవన్నీ ఉనికిలోకి తెచ్చేందుకు యెహోవా ఆయన కుమారుడు కలిసి పనిచేశారు. ఎంత ఉత్కంఠభరితమైన, సంతోషకరమైన కాలాలు వారనుభవించారో గదా! కాబట్టి, అంత విస్తారమైన కాలనిడివిలో ఏర్పడిన బలీయమైన ఆ బంధాన్ని మనలో నిజానికి ఎవరు అర్థంచేసుకోగలరు? నిశ్చయంగా, యెహోవా దేవుడు, ఆయన కుమారుడు అపూర్వ ప్రేమానుబంధంలో ఐక్యమై ఉన్నారు.

6 అయినప్పటికీ, మానవ శిశువుగా జన్మించడానికి యెహోవా తన కుమారుణ్ణి భూమికి పంపాడు. అలాచేయడమంటే కొన్ని దశాబ్దాలపాటు యెహోవా తన ప్రియకుమారుని సన్నిహిత సహవాసం విడిచి ఉండడమని భావం. యేసు పరిపూర్ణ మనిషిగా ఎదగడాన్ని ఆయన పరలోకంనుండి అత్యంతాసక్తితో పరికించాడు. రమారమి 30 సంవత్సరాల వయస్సులో యేసు బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ సందర్భంలో తండ్రి స్వయంగా పరలోకంనుండి, “ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని” అన్నాడు. (మత్తయి 3:​17) ప్రవచింపబడిన మరియు ఆయననుండి కోరిన సమస్తాన్ని యేసు నమ్మకంగా నెరవేర్చడం చూసిన తండ్రి ఎంత ముగ్ధుడైయుంటాడో గదా!​—⁠యోహాను 5:​36; 17:⁠4.

7 అయితే, సా.శ. 33 నీసాను 14న యేసు అప్పగింపబడిన తర్వాత అల్లరిమూక ఆయనను చెరపట్టినప్పుడు, యేసును ఎగతాళిచేసి, ఉమ్మివేసి, పిడికిళ్ళతో గుద్దినప్పుడు, చర్మం పీలికలయ్యేలా ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు, మ్రానుకువేసి చేతుల్లో పాదాల్లో మేకులు దిగ్గొట్టి, ప్రజలు దూషిస్తుండగా ఆయనను వ్రేలాడదీసినప్పుడు యెహోవా ఎలా భావించాడు? తన ప్రియకుమారుడు విపరీత యాతనతో బిగ్గరగా కేకవేసినప్పుడు ఆ తండ్రెలా భావించాడు. సృష్ట్యారంభంనుండి ఉన్న యేసు మొదటిసారిగా తన తుదిశ్వాస విడిచినప్పుడు, తన ప్రియకుమారుడిక ఉనికిలో లేకుండా పోయినప్పుడు యెహోవా ఎలా భావించాడు?​—⁠మత్తయి 26:14-16, 46, 47, 56, 59, 67; 27:26, 38-44, 46; యోహాను 19:⁠1.

8 యెహోవాకు అనుభూతులున్నాయి కాబట్టి, కుమారుని మరణాన్నిబట్టి ఆయన అనుభవించిన వేదనను మనం మాటల్లో వ్యక్తపరచలేము. కానీ అలా జరిగేలా అనుమతించడంలోని ఆయన ఉద్దేశాన్ని మాత్రం మాటల్లో వ్యక్తం చేయవచ్చు. ఆ తండ్రి తనకంత బాధ కలిగేలా ఎందుకు అనుమతించాడు? యోహాను 3:16లో యెహోవా మనకొక అద్భుతమైన విషయం వెల్లడి చేస్తున్నాడు. బైబిల్లోని ఈ వచనం ఎంత ప్రాముఖ్యమంటే అది సూక్ష్మరూపంలో ఉన్న సువార్త అని పిలువబడింది. అదిలా చెబుతోంది: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” కాబట్టి దేవుని ఉద్దేశానికున్న విలువ ప్రేమ. అంతకంటే గొప్ప ప్రేమ ఎన్నడూ చూపబడలేదు.

తన ప్రేమనుగూర్చి యెహోవా మనకెలా హామీ ఇస్తున్నాడు

9 అయితే, ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది: దేవుడు వ్యక్తిగతంగా మనల్ని ప్రేమిస్తాడా? యోహాను 3:⁠16 చెబుతున్నట్లుగా, దేవుడు యావత్‌ మానవజాతిని ప్రేమిస్తున్నాడని కొందరు అంగీకరించవచ్చు. కానీ వారు ‘దేవుడు నన్ను ఒక వ్యక్తిగా ఎన్నడూ ప్రేమించలేడు’ అన్నట్లు భావిస్తారు. నిజానికి, యెహోవా మనల్ని ప్రేమించడనీ, విలువైనవారిగా ఎంచడనీ మనం నమ్మేలా చేయాలని సాతాను తీవ్రవాంఛతో ఉన్నాడు. అయితే, ప్రేమకు తగని, విలువలేని వారమని మనమెంత అనుకున్నా, తన నమ్మకమైన ప్రతి సేవకుడు తన దృష్టిలో విలువైన వ్యక్తేనని యెహోవా మనకు హామీ ఇస్తున్నాడు.

10 ఉదాహరణకు, మత్తయి 10:29-31 వచనాల్లో వ్రాయబడిన యేసు మాటల్ని పరిశీలించండి. తన శిష్యుల విలువను ఉపమానరీతిగా తెలియజేస్తూ యేసు ఇలా అన్నాడు: “రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనుపడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.” మొదటి శతాబ్దంలోని యేసు శ్రోతలకు ఆ మాటలు ఏ భావాన్నిచ్చాయో ఆలోచించండి.

11 యేసు కాలంలో, ఆహారంగా అమ్మబడే పక్షుల్లో పిచ్చుక కారుచౌక. కొద్ది విలువేవున్న ఒక కాసుకు రెండు పిచ్చుకలు లభించేవి. అయితే లూకా 12:​6, 7 ప్రకారం, ఒక వ్యక్తి రెండు కాసులిస్తేచాలు అతనికి నాలుగు కాదు ఐదు పిచ్చుకలు లభించేవని యేసు ఆ తర్వాత పేర్కొన్నాడు. అదనంగా ఇవ్వబడిన ఆ పిచ్చుకకు అసలు విలువే లేదన్నట్టు ఇవ్వబడేది. బహుశా ఆ పిచ్చుకలు మానవుల దృష్టిలో ఏ విలువా లేనివి కావచ్చు, కానీ సృష్టికర్త వాటినెలా దృష్టించాడు? ‘వాటిలో ఒకటైనను [అదనంగా ఇవ్వబడేది కూడా] దేవునియెదుట మరువబడదని’ యేసు చెప్పాడు. మనమిప్పుడు యేసు చెబుతున్నదేమిటో అర్థం చేసుకోవచ్చు. యెహోవా ఒక పిచ్చుకకే అంత విలువిస్తున్నాడంటే, మనిషికి ఇంకెంత ఎక్కువ విలువ ఉంటుందో గదా! యేసు చెప్పినట్లుగా, యెహోవాకు మన గురించి సమస్తం తెలుసు. నిజానికి, మన తలమీది వెండ్రుకలు సహితం లెక్కించబడ్డాయి!

12 యేసు ఇక్కడ గోరంతను కొండంతలు చేస్తున్నాడని కొందరనుకోవచ్చు. అయితే, పునరుత్థాన నిరీక్షణ గురించి ఒక్కసారి ఆలోచించండి. మనల్ని పునఃసృష్టించాలంటే మనల్ని యెహోవా ఎంత సన్నిహితంగా ఎరిగి ఉండాలి! ఆయన మనల్నెంత విలువైనవారిగా పరిగణిస్తున్నాడంటే, సంశ్లిష్టమైన మన జెనెటిక్‌ కోడ్‌, మన అనేక సంవత్సరాల జ్ఞాపకాలు, అనుభవాలతో సహా ప్రతి వివరణను గుర్తుంచుకుంటాడు. దీంతో పోలిస్తే మన వెండ్రుకల్ని లెక్కించడం చాలా స్వల్పం, ఎందుకంటే మనిషి తలపై సగటున దాదాపు 1,00,000 వెండ్రుకలుంటాయి. ఆయావ్యక్తులుగా మన గురించి యెహోవా శ్రద్ధ తీసుకుంటాడని యేసుమాటలు ఎంత రమ్యంగా మనకు హామీ ఇస్తున్నాయో గదా!

13 యెహోవా ప్రేమకు హామీనిచ్చే మరో విషయాన్ని బైబిలు మనకు వెల్లడిచేస్తోంది. ఆయన మనలో మంచి కోసం చూస్తాడు, మనలోని మంచిని విలువైనదిగా ఎంచుతాడు. ఉదాహరణకు, మంచి రాజైన యెహోషాపాతు విషయమే తీసుకోండి. రాజు ఒక తెలివితక్కువ పనిచేసినప్పుడు, యెహోవా ప్రవక్త ఆయనకిలా చెప్పాడు: “యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును.” అదెంత గంభీరమైన విషయం! కాని యెహోవా సందేశం అంతటితో ఆగిపోలేదు. అదింకా ఇలా కొనసాగింది: “అయితే . . . నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.” (2 దినవృత్తాంతములు 19:​1-3) యెహోవా నీతియుక్తమైన ఆగ్రహం ఆయన యెహోషాపాతులో “మంచి క్రియలు” చూసేలా చేసింది. మనం అపరిపూర్ణులమైనా దేవుడు మనలో మంచిని చూస్తాడని తెలుసుకోవడం మన నమ్మకాన్ని ఇనుమడింపజేయడం లేదా?

“క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు

14 మనం పాపం చేసినప్పుడు, మనలోకలిగే నిరాశ, సిగ్గు, అపరాధ భావం ఇక మనమెన్నటికీ యెహోవాను సేవించేందుకు పనికిరామని తలంచేటట్లు చేస్తాయి. అయితే యెహోవా “క్షమించుటకు సిద్ధమైన మనస్సు” కలిగివున్నాడని గుర్తుంచుకోండి. (కీర్తన 86:⁠5) మన పాపముల విషయమై పశ్చాత్తాపపడి, వాటిని తిరిగి చేయకుండేలా మనం తీవ్రంగా కృషిచేస్తే, యెహోవా క్షమాపణనుండి మనం ప్రయోజనం పొందవచ్చు. యెహోవా ప్రేమయొక్క ఈ అద్భుతమైన ముఖరూపాన్ని బైబిలెలా వర్ణిస్తుందో పరిశీలించండి.

15 యెహోవా క్షమాపణను వర్ణించేందుకు కీర్తనకర్తయైన దావీదు సుస్పష్ట పదాల్ని ఉపయోగించాడు: “పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు.” (ఇటాలిక్కులు మావి.) (కీర్తన 103:⁠12) పడమర తూర్పుకు ఎంత దూరంలోవుంది? ఒక విధంగా, పడమరకు తూర్పు ఊహకందని దూరంలోవుంది; ఆ రెండు ఎప్పుడూ కలుసుకోవు. ఈ మాటకు అర్థం “సాధ్యమైనంత దూరం; మన ఊహకు అందనంత దూరం” అని ఒక విద్వాంసుడు వ్రాశాడు. యెహోవా మనల్ని క్షమించినప్పుడు, ఆయన మన పాపాల్ని మన ఊహకు అందనంత దూరంలో ఉంచుతాడని ప్రేరేపిత దావీదు మాటలు మనకు చెబుతున్నాయి.

16 లేతరంగు వస్త్రంమీది మరకను తొలగించడానికి మీరెప్పుడైనా ప్రయత్నించారా? మీరెంత ప్రయత్నించినా ఆ మరకింకా కనబడుతూనే ఉంటుంది. క్షమించే తన సామర్థ్యాన్ని యెహోవా ఎలా వర్ణిస్తున్నాడో గమనించండి: “మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను [“సింధూరపు రంగువైననూ,” NW] అవి హిమమువలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లనివగును.” (ఇటాలిక్కులు మావి.) (యెషయా 1:​18) “సింధూరపు” అనేమాట స్ఫుటమైన ఎరుపును, “కెంపు” వన్నె అనేమాట అద్దకాల్లో ఉపయోగించే ముదురు రంగును సూచిస్తాయి. * పాపపు మరకల్ని మన స్వీయ ప్రయత్నాలతో ఎన్నటికి తొలగించలేము. అయితే, సింధూరపు రంగులాంటి, కెంపువన్నెలాంటి పాపాల్ని సహితం యెహోవా తొలగించి, వాటిని మంచులాగా, రంగు అద్దని గొఱ్ఱెబొచ్చులాగా తెల్లవిగా చేయగలడు. కాబట్టి యెహోవా మన పాపాల్ని క్షమించినప్పుడు, ఆ పాపపు మరకలింకా ఉన్నాయని శేషజీవితంలో మనం భావించక్కర్లేదు.

17 మరణకరమైన వ్యాధినుండి తప్పింపబడిన తర్వాత హిజ్కియా కృతజ్ఞత కలిగి భావగర్భితంగా కూర్చిన పాటలో, ఆయన యెహోవాతో ఇలా అన్నాడు: “నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార వేసితివి.” (ఇటాలిక్కులు మావి.) (యెషయా 38:​17) పశ్చాత్తాపంచూపే తప్పిదస్థుని పాపాలను వెనుకకు విసిరి, వాటినిక వెనక్కి తిరిగిచూడని, గమనించని వ్యక్తిగా యెహోవా ఇక్కడ వర్ణింపబడ్డాడు. ఒక రెఫరెన్సు గ్రంథం ప్రకారం, దానిలోని భావాన్నిలా వ్యక్తంచేయవచ్చు: “వాటిని [నా పాపాల్ని] నీవు జరుగలేదన్నట్టే చేశావు.” అది ఓదార్పుకరంగా లేదా?

18 పునరుద్ధరణ వాగ్దానంలో, పశ్చాత్తాపం చూపిన తన ప్రజల్ని యెహోవా క్షమిస్తాడనే తన నమ్మకాన్ని ప్రవక్తయగు మీకా ఇలా వ్యక్తంచేశాడు: “తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, . . . వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? . . . వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.” (ఇటాలిక్కులు మావి.) (మీకా 7:​18, 19) బైబిలు కాలాల్లో జీవించిన ప్రజలకు ఆ మాటలు ఏ భావాన్నిచ్చుంటాయో ఊహించండి. “సముద్రపు అగాధములలో” పడవేసింది మరలా వెనక్కితీసే అవకాశముంటుందా? కాబట్టి, యెహోవా ఒకసారి క్షమిస్తే, ఆయన మన పాపాల్ని శాశ్వతంగా తొలగిస్తాడని మీకా మాటలు సూచిస్తున్నాయి.

“మన దేవుని మహా వాత్సల్యము”

19 యెహోవా ప్రేమకున్న మరో ముఖరూపం వాత్సల్యం. వాత్సల్యమంటే ఏమిటి? బైబిల్లో వాత్సల్యానికి కనికరానికి దగ్గర సంబంధముంది. అనేక హీబ్రూ, గ్రీక్‌ పదాలు వాత్సల్యమనే భావాన్నిస్తాయి. ఉదాహరణకు, హీబ్రూ క్రియాపదం రాచమ్‌ తరచూ “కరుణ చూపు” లేదా “జాలిపడు” అని అనువదింపబడ్డాయి. యెహోవా తనకు అన్వయించుకొనే ఈ హీబ్రూ పదం, “గర్భాశయం” అనే మాటకు సంబంధించినది. ఇది “తల్లి వాత్సల్యం” అని వర్ణింపబడగలదు.

20 యెహోవా వాత్సల్యాన్ని గూర్చి మనకు బోధించడానికి తల్లి తన బిడ్డయెడల చూపే భావావేశాల్ని బైబిలు ఉపయోగిస్తుంది. “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ [రాచమ్‌] తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను” అని యెషయా 49:​15 చెబుతోంది. పాలు తాగే బిడ్డకు పాలిచ్చి సంరక్షించడం తల్లి మర్చిపోతుందని ఊహించలేము. నిజానికి శిశువు నిస్సహాయంగా ఉంటుంది, కాబట్టి రాత్రింబగళ్ళు తల్లి ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే, విచారకరంగా తల్లుల నిర్లక్ష్యాన్ని గూర్చి, ప్రత్యేకంగా ఈ “అపాయకరమైన కాలముల[లో]” వినడం కొత్త కాదు. (2 తిమోతి 3:​1, 3) అయినా “గాని నేను నిన్ను మరువను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. మనమూహించగల అత్యంత సహజ వాత్సల్య భావావేశం అంటే సాధారణంగా బిడ్డయెడల తల్లిచూపే కరుణకంటే తన సేవకులపై యెహోవాచూపే వాత్సల్యపూరిత కరుణ ఎన్నోరెట్లు బలంగా ఉంటుంది.

21 ప్రేమగల తండ్రిగా యెహోవా వాత్సల్యమెలా చూపిస్తాడు? ప్రాచీనకాల ఇశ్రాయేలుతో ఆయన వ్యవహరించిన విధానంలో ఈ లక్షణం స్పష్టంగా కనబడుతుంది. సా.శ.పూ. 16వ శతాబ్దాంతానికల్లా, లక్షలాదిమంది ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, వారక్కడ తీవ్రంగా అణగద్రొక్కబడ్డారు. (నిర్గమకాండము 1:​11, 14) వారా విపద్దశలో యెహోవాకు మొరపెట్టుకున్నారు. వాత్సల్యంగల దేవుడు వారికెలా ప్రత్యుత్తరమిచ్చాడు?

22 యెహోవా హృదయం ద్రవించిపోయింది. ఆయనిలా అన్నాడు: “ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, . . . వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.” (నిర్గమకాండము 3:⁠7) వారియెడల ఎలాంటి భావావేశాల్లేకుండా యెహోవా తన ప్రజల బాధ చూడలేడు లేదా వారి మొర వినలేడు. యెహోవా సహానుభూతిగల దేవుడు. ఇతరుల బాధను తన బాధగా పరిగణించే సామర్థ్యమగు సహానుభూతికి వాత్సల్యానికి దగ్గరి సంబంధముంది. అయితే, యెహోవా తన ప్రజలయెడల కేవలం భావావేశం మాత్రమే చూపలేదు; వారి పక్షంగా చర్య తీసుకోవడానికి పురికొల్పబడ్డాడు. యెషయా 63:9 ఇలా చెబుతోంది: “ప్రేమచేతను తాలిమిచేతను [“వాత్సల్యంచేతను,” NW] వారిని విమోచించెను.” తన “బాహుబలముతో” ఆయన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తునుండి రక్షించాడు. (ద్వితీయోపదేశకాండము 4:​34) ఆ తర్వాత ఆయన వారికి అద్భుతరీతిలో ఆహారమిచ్చి, ఫలభరితమైన వారి స్వదేశానికి వారిని రప్పించాడు.

23 ఒక గుంపుగా మాత్రమే యెహోవా తన ప్రజలకు వాత్సల్యం చూపడు. మన ప్రేమగల దేవునికి ఆయావ్యక్తులుగా మనమీద ప్రగాఢమైన శ్రద్ధవుంది. మనమనుభవించే ఏ బాధలైనా ఆయనకు బాగా తెలుసు. కీర్తనకర్త ఇలా చెప్పాడు: “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” (కీర్తన 34:​15, 18) ఆయావ్యక్తులుగా యెహోవా మనకెలా సహాయం చేస్తాడు? ఆయన మన బాధకుగల కారణాన్ని తీసివేయడు. అయితే సహాయార్థం తనకు మొరపెట్టే వారి కోసం ఆయన విస్తారమైన ఏర్పాట్లు చేశాడు. ఆయన వాక్యమిచ్చే ఆచరణాత్మక సలహా మనకెంతో సహాయం చేయగలదు. సంఘంలో, ఇతరులకు సహాయం చేసేలా తన కనికరాన్ని ప్రతిఫలించడానికి కృషిచేసే ఆధ్యాత్మిక అర్హతలున్న పైవిచారణకర్తలను ఆయన దయచేశాడు. (యాకోబు 5:​14, 15) ‘ప్రార్థన ఆలకించువానిగా’ యెహోవా “తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు[ను].” (కీర్తన 65:2; లూకా 11:​13) అలాంటి ఏర్పాట్లన్నీ “మన దేవుని మహా వాత్సల్యము” యొక్క వ్యక్తీకరణలే.​—⁠లూకా 1:79.

24 మన పరలోక తండ్రి ప్రేమను తలపోయడం పులకరింపజేయడం లేదా? ముందటి ఆర్టికల్‌లో, మనకు ప్రయోజనమిచ్చే ప్రేమపూర్వక మార్గాల్లో యెహోవా తన శక్తిని, న్యాయాన్ని, జ్ఞానాన్ని చూపడం మనకు గుర్తుచేయబడింది. ఈ ఆర్టికల్‌లో, మానవజాతియెడల అలాగే ఆయావ్యక్తులుగా మనయెడల అసాధారణరీతిలో యెహోవా సూటిగా తన ప్రేమను వ్యక్తపర్చడం చూశాము. ఇప్పుడు, మనలో ప్రతియొక్కరం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది, ‘యెహోవా ప్రేమకు నేనెలా ప్రతిస్పందిస్తాను?’ మీ పూర్ణ హృదయంతో, మనస్సుతో, ఆత్మతో, బలంతో ఆయనను ప్రేమించడం ద్వారా మీరు ప్రతిస్పందించుదురు గాక. (మార్కు 12:​29, 30) యెహోవాకు మరింత దగ్గరవ్వాలనే మీ హృదయకోరికను మీ దైనందిన జీవన విధానం ప్రతిబింబించును గాక. ప్రేమాస్వరూపియగు యెహోవా దేవుడు, యుగయుగములు సదా మీకు సన్నిహితమౌతూ ఉండును గాక!​—⁠యాకోబు 4:⁠8.

[అధస్సూచీలు]

^ పేరా 21 సింధూరం, “వదలని లేదా వెలిసిపోని రంగు. మంచు, వర్షం, ఉతకడం, ఎక్కువకాలం వాడడంలాంటివేవీ దానిని తొలగించలేవని” ఒక విద్వాంసుడు చెబుతున్నాడు.

మీరు జ్ఞాపకం తెచ్చుకుంటారా?

ప్రేమ యెహోవా ప్రధాన లక్షణమని మనకెలా తెలుసు?

మనకోసం బాధపడి చనిపోవడానికి యెహోవా తన కుమారుణ్ణి పంపించడం యావత్‌ చరిత్రలో ప్రేమకు అత్యంత గొప్పచర్యని ఎందుకు చెప్పవచ్చు?

ఆయావ్యక్తులుగా యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని ఆయనెలా హామీయిస్తున్నాడు?

యెహోవా క్షమాగుణాన్ని బైబిలు ఏ విశిష్ట రీతుల్లో వర్ణిస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1-3. (ఎ) యెహోవా ప్రేమ గుణాన్నిగూర్చి బైబిలు ఏ మాట చెబుతోంది, ఆ మాట ఏ విధంగా అసాధారణం? (బి) “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలెందుకు చెబుతోంది?

4, 5. (ఎ) యావత్‌ చరిత్రలో ప్రేమకు ఏది అత్యంత గొప్పచర్య? (బి) యెహోవా దేవుడు, ఆయన కుమారుడు అపూర్వ ప్రేమానుబంధంలో ఐక్యమై ఉన్నారని మనమెందుకు చెప్పగలం?

6. యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, యెహోవా తన కుమారుని గూర్చి తన భావాల్నెలా వ్యక్తంచేశాడు?

7, 8. (ఎ) యేసు సా.శ. 33 నీసాను 14న ఏమేమి సహించాల్సి వచ్చింది, ఆయన పరలోకపు తండ్రిమీద అవెలా ప్రభావం చూపాయి? (బి) తన కుమారుడు బాధపడి చనిపోవడానికి యెహోవా ఎందుకు అనుమతించాడు?

9. మనల్ని గూర్చిన యెహోవా దృష్టి విషయంలో మనమేమి నమ్మాలని సాతాను కోరుతున్నాడు, అయితే యెహోవా మనకేమి హామీ ఇస్తున్నాడు?

10, 11. యెహోవా దృష్టిలో మనకు విలువుందని యేసు చెప్పిన పిచ్చుకల ఉపమానం ఎలా చూపిస్తోంది?

12. మన తలమీది వెండ్రుకలు సహితం లెక్కించబడ్డాయని మాట్లాడినప్పుడు యేసు వాస్తవమే చెబుతున్నాడని మనమెందుకు నిశ్చయత కలిగి ఉండగలము?

13. మనం అపరిపూర్ణులమైనా దేవుడు మనలో మంచిని చూస్తాడని రాజైన యెహోషాపాతు విషయం మనకెలా చూపిస్తోంది?

14. మనం పాపం చేసినప్పుడు, మనకెలాంటి బాధాకరమైన భావాలు కలుగుతాయి, అయితే యెహోవా క్షమాపణనుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

15. యెహోవా మన పాపాల్ని ఎంత దూరంలో ఉంచుతాడు?

16. యెహోవా మన పాపాల్ని క్షమించినప్పుడు, ఇక ఆ తర్వాత ఆయన మనల్ని పరిశుభ్రులుగానే దృష్టిస్తాడని మనమెందుకు నమ్మకంగా ఉండవచ్చు?

17. ఏ భావంలో మన పాపాలను యెహోవా తన వీపు వెనుకతట్టు పారవేస్తాడు?

18. యెహోవా ఒకసారి క్షమిస్తే, ఆయన మన పాపాల్ని శాశ్వతంగా తొలగిస్తాడని మీకా ప్రవక్త మాటలెలా సూచిస్తున్నాయి?

19, 20. (ఎ) “కరుణ చూపు” లేదా “జాలిపడు” అని అనువదింపబడిన హీబ్రూ క్రియాపదానికున్న భావమేమిటి? (బి) యెహోవా వాత్సల్యాన్ని గూర్చి మనకు బోధించడానికి తల్లి తన బిడ్డయెడల చూపే భావావేశాల్ని బైబిలు ఎలా ఉపయోగిస్తుంది?

21, 22. ఇశ్రాయేలీయులు ప్రాచీన ఐగుప్తులో ఏమి అనుభవించారు, యెహోవా వారి మొరలకెలా ప్రత్యుత్తరమిచ్చాడు?

23. (ఎ) ఆయావ్యక్తులుగా మనమీద యెహోవాకు ప్రగాఢమైన శ్రద్ధవుందని కీర్తనకర్త మాటలెలా మనకు హామీ ఇస్తున్నాయి? (బి) ఏయే విధాలుగా యెహోవా మనకు సహాయం చేస్తాడు?

24. యెహోవా ప్రేమకు మీరెలా ప్రతిస్పందిస్తారు?

[15వ పేజీలోని చిత్రం]

“దేవుడు . . . తన అద్వితీయకుమారుని . . . అనుగ్రహించెను”

[16, 17వ పేజీలోని చిత్రం]

“మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు”

[చిత్రసౌజన్యం]

© J. Heidecker/VIREO

[18వ పేజీలోని చిత్రం]

తల్లి తన బిడ్డయెడల చూపే భావావేశాలు యెహోవా వాత్సల్యాన్ని గూర్చి మనకు బోధించగలవు