కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన ప్రేమను ఎలా వృద్ధిచేసుకోవచ్చు?

నిజమైన ప్రేమను ఎలా వృద్ధిచేసుకోవచ్చు?

నిజమైన ప్రేమను ఎలా వృద్ధిచేసుకోవచ్చు?

“ప్రేమే దివ్యౌషధం; ప్రేమే జీవితం.”​—⁠జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం, (ఆంగ్లం) జోసెఫ్‌ జాన్‌సన్‌ రచించినది, 1871.

మానవులు ప్రేమించడమెలా నేర్చుకుంటారు? మనస్తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారానా? వ్యక్తిత్వ వికాస నిర్దేశక పుస్తకాలు చదవడం ద్వారానా? ప్రణయగాథలున్న చలనచిత్రాలు చూడడం ద్వారానా? ఎంతమాత్రం కాదు. మానవులు మొట్టమొదట తమ తల్లిదండ్రుల మాదిరినిబట్టి వారిచ్చే తర్ఫీదునుబట్టి ప్రేమించడం నేర్చుకుంటారు. తమ తల్లిదండ్రులు వాత్సల్యభరితమైన వాతావరణంలో తమకు పోషణను, కాపుదలను ఇచ్చి, తమతో సంభాషించి, తమ పట్ల ప్రగాఢమైన వ్యక్తిగత శ్రద్ధ చూపించినప్పుడు పిల్లలు ప్రేమ యొక్క భావాన్ని తెలుసుకుంటారు. తప్పొప్పుల విషయంలో సరైన సూత్రాలను పాటించడాన్ని తమ తల్లిదండ్రులు తమకు బోధించినప్పుడు కూడా వారు ప్రేమించడం నేర్చుకుంటారు.

నిజమైన ప్రేమ కేవలం అభిమానం లేదా పైపై భావావేశంకంటే ఎక్కువే. ప్రేమ చూపించబడుతున్న సమయంలో ఆ ప్రేమను పొందుతున్నవారు దాని విలువను పూర్తిగా గ్రహించకపోయినప్పటికీ అది ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేకూరే విధంగా ప్రవర్తిస్తుంది, సాధారణంగా పిల్లల విషయంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది, ప్రేమపూర్వకంగా క్రమశిక్షణలో పెట్టినప్పుడు వారు దాని విలువను వెంటనే గ్రహించలేరు. నిస్వార్థ ప్రేమను చూపించడంలో పరిపూర్ణమైన మాదిరి సృష్టికర్తనే. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: ‘నా కుమారుడా, యెహోవా చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము యెహోవా తాను ప్రేమించువానిని శిక్షించును.’​—⁠హెబ్రీయులు 12:​5, 6.

తల్లిదండ్రులారా, మీ కుటుంబం పట్ల ప్రేమ చూపించడంలో మీరు యెహోవాను ఎలా అనుకరించవచ్చు? భార్యాభర్తలుగా మీరు మీ మధ్యనున్న అనుబంధంలో మీరుంచే మాదిరి ఎంత ప్రాముఖ్యమైనది?

మాదిరి ద్వారా ప్రేమించడం నేర్పించండి

మీరు భర్త అయితే మీ భార్యను ఉన్నతంగా ఎంచుతూ ఆమెతో మర్యాదగా, గౌరవపూర్వకంగా వ్యవహరిస్తారా? మీరు భార్య అయితే, మీరు మీ భర్తను ప్రేమిస్తూ ఆయనకు మద్దతునిస్తున్నారా? భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుని, గౌరవించుకోవాలని బైబిలు చెబుతోంది. (ఎఫెసీయులు 5:​28; తీతు 2:⁠3-5) వారలా చేసినప్పుడు, వారి పిల్లలు ప్రత్యక్షంగా క్రైస్తవ ప్రేమను కార్యరూపంలో చూస్తారు. అదెంతటి శక్తివంతమైన, విలువైన పాఠంగా ఉండగలదో గదా!

కుటుంబానికి సంబంధించి వినోదం, నైతికత, లక్ష్యాలు, ప్రాధాన్యతలు వంటి విషయాల్లో తల్లిదండ్రులు ఉన్నత ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉన్నప్పుడు కూడా వారు గృహంలో ప్రేమను వృద్ధి చేస్తారు. బైబిలు నిజంగా ‘దైవావేశమువలన కలిగినది, ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, నీతియందు శిక్షచేయుటకు ప్రయోజనకరమై యున్నది’ అనేదానికి సజీవ నిదర్శనంగా ఉంటూ అలాంటి కుటుంబ ప్రమాణాలను ఏర్పరచడంలో అది గొప్ప సహాయకంగా ఉన్నట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తెలుసుకున్నారు. (2 తిమోతి 3:​16) నిజానికి, కేవలం కొండమీది ప్రసంగంలో కనిపించే నైతిక సూత్రాలు, జీవిత నిర్దేశకాలు సాటిలేనివిగా పరిగణింపబడుతున్నాయి.​—⁠మత్తయి, 5 నుండి 7 అధ్యాయాలు.

కుటుంబమంతా దేవుని నడిపింపు కోసం చూస్తూ ఆయన ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉంటే ప్రతి సభ్యుడు తాను సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాడు, పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రేమించేవారిగా, గౌరవించేవారిగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకు భిన్నంగా ద్వంద, అనౌచితమైన, అస్థిరమైన ప్రమాణాలున్న ఇంట్లో పిల్లలు విసుగ్గా, కోపంగా, తిరుగుబాటుగా తయారుకావచ్చు.​—⁠రోమీయులు 2:21; కొలొస్సయులు 3:​21.

తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల మాటేమిటి? వారు తమ పిల్లలకు ప్రేమించడం నేర్పించలేని స్థితిలో ఉన్నారా? అలా కానవసరంలేదు. మంచి తల్లి, తండ్రి ఒక జట్టుగా ఉండే కుటుంబానికి మరో ప్రత్యామ్నాయం ఏదీ లేకపోయినప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య ప్రగాఢమైన అనుబంధం ఉంటే అది, తల్లి లేదా తండ్రి లేని కొరతను కొంతమేరకు తీర్చగలదని అనుభవం చూపిస్తోంది. మీరు ఒంటరి తల్లి లేక తండ్రి అయితే మీ గృహంలో బైబిలు సూత్రాలు అన్వయించుకోవడానికి కృషి చేయండి. అవును, ఒక సామెత మనకిలా చెబుతోంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను,” తల్లిదండ్రులుగా ఉండడమనే మార్గాన్ని సహితం “సరాళము చేయును.”​—⁠సామెతలు 3:5, 6; యాకోబు 1:⁠5.

శ్రేష్ఠులైన చాలామంది యౌవనస్థులు తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల్లో పెరిగారు, వారిప్పుడు ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల వేలాది క్రైస్తవ సంఘాల్లో నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నారు. ఒంటరి తల్లి లేదా తండ్రి సహితం తమ పిల్లలకు ప్రేమించడాన్ని నేర్పించడంలో విజయం సాధించవచ్చనడానికి ఇది నిదర్శనంగా ఉంది.

అందరూ ప్రేమను ఎలా వృద్ధి చేసుకోవచ్చు?

‘అంత్యదినములు అనురాగ రాహిత్యంతో’ గుర్తించబడతాయని అంటే కుటుంబ సభ్యులు సాధారణంగా ఒకరి యెడల ఒకరు కలిగివుండే సహజమైన అభిమానం కొరవడుతుందని బైబిలు ముందే తెలియజేసింది. (2 తిమోతి 3:​1, 3) అయితే అనురాగం కొరవడిన వాతావరణంలో పెరిగినవారు కూడా ప్రేమించడం నేర్చుకోవచ్చు. ఎలా? హృదయపూర్వకంగా తనవైపుకు తిరిగేవారిపట్ల ప్రేమానురాగాలు చూపించే, ప్రేమకు మూలమైన యెహోవా నుండి నేర్చుకోవడం ద్వారా. (1 యోహాను 4:​7, 8) “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును” అని ఒక కీర్తనకర్త అన్నాడు.​—⁠కీర్తన 27:​10.

యెహోవా మనపట్ల తనకున్న ప్రేమను ఎన్నోరకాలుగా వ్యక్తం చేస్తాడు. బైబిలు ద్వారా ఆయనిచ్చే పితృ నడిపింపు, పరిశుద్ధాత్మ సహాయం, క్రైస్తవ సహోదరసహోదరీల ప్రేమపూర్వకమైన మద్దతు వాటిలో భాగమే. (కీర్తన 119:97-105; లూకా 11:13; హెబ్రీయులు 10:​24, 25) దేవునిపట్ల, పొరుగువారిపట్ల ప్రేమను వృద్ధి చేసుకోవడంలో ఈ మూడు అంశాలు మీకెలా సహాయం చేయగలవో పరిశీలించండి.

ప్రేరేపిత పితృ నడిపింపు

ఎవరితోనైనా వాత్సల్యభరితమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలంటే మనమా వ్యక్తిని బాగా తెలుసుకోవాలి. యెహోవా తన గురించి తాను బైబిలు పుటల్లో తెలియజేసుకోవడం ద్వారా తనకు సన్నిహితమవ్వమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అయితే బైబిలు చదవడం మాత్రమే సరిపోదు. మనం దాని బోధలను అన్వయించుకుని, తత్ఫలితంగా వచ్చే ప్రయోజనాలను పొందాలి. (కీర్తన 19:​7-10) “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును” అని యెషయా 48:⁠17 చెబుతోంది. అవును, ప్రేమ మూర్తీభవించిన యెహోవా అనవసరమైన నియమనిష్ఠలతో మన స్వేచ్ఛను అరికట్టాలని కాదు గానీ మన ప్రయోజనార్థమే ఉపదేశిస్తాడు.

బైబిలును గురించిన ఖచ్చితమైన జ్ఞానము కూడా మన తోటి మానవుల పట్ల ప్రేమను పెంపొందింపజేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. దానికి కారణమేమిటంటే బైబిలు సత్యం మానవుల గురించి దేవునికున్న దృక్కోణాన్ని మనకు బోధిస్తుంది, ఒకరితో ఒకరం వ్యవహరించడంలో మనం అనుసరించవలసిన సూత్రాల్ని చూపిస్తుంది. అలాంటి సమాచారంతో, పొరుగువారి పట్ల ప్రేమను వృద్ధిచేసుకోవడానికి మనకు గట్టి ఆధారం లభిస్తుంది. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “మీ ప్రేమ తెలివితోను సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెనని . . . ప్రార్థించుచున్నాను.” (ఇటాలిక్కులు మావి.)​—⁠ఫిలిప్పీయులు 1:⁠9.

ప్రేమ “అనుభవజ్ఞానముతో” సరైన విధంగా ఎలా నిర్దేశించబడగలదో సోదాహరణంగా తెలుసుకోవడానికి అపొస్తలుల కార్యములు 10:34, 35 వచనాల్లో పేర్కొనబడిన ఈ ప్రాథమిక సత్యాన్ని పరిశీలించండి: “దేవుడు పక్షపాతి కా[డు], ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” దేవుడు మానవులను వారి జాతీయతనుబట్టి లేదా జాతినిబట్టి కాదుగానీ వారి నీతికార్యాలనుబట్టి, వారి దైవభక్తినిబట్టి విలువకట్టేటట్లయితే, మనం మన తోటివారిని అదే విధమైన నిష్పక్షపాతంతో దృష్టించవద్దా?​—⁠అపొస్తలుల కార్యములు 17:26, 27; 1 యోహాను 4:​7-11, 20, 21.

ప్రేమ​—⁠దేవుని ఆత్మఫలము

పండ్లతోటపై సరైన సమయంలో కురిసే వాన మంచి దిగుబడికి ఎలా దోహదపడుతుందో అలానే, దేవుని ఆత్మను స్వీకరించడానికి సుముఖంగా ఉండేవారిలో అది ‘ఆత్మ ఫలము’ అని బైబిలు వర్ణిస్తున్న లక్షణాలను వృద్ధి చేయగలదు. (గలతీయులు 5:​22) ఈ ఫలములో ప్రధానమైనది ప్రేమ. (1 కొరింథీయులు 13:​13) కానీ మనం దేవుని ఆత్మను ఎలా పొందవచ్చు? ఆవశ్యకమైన ఒక మార్గం ప్రార్థన. మనం దేవుని ఆత్మ కోసం ప్రార్థిస్తే ఆయన దాన్ని మనకిస్తాడు. (లూకా 11:​9-13) మీరు పరిశుద్ధాత్మ కోసం ‘అడుగుతూనే’ ఉంటారా? మీరలా చేస్తే, ప్రేమతో సహా దాని అమూల్యమైన ఫలము మీ జీవితంలో ఎల్లవేళలా ప్రదర్శితమవ్వాలి.

అయితే దేవుని ఆత్మకు వ్యతిరేకంగా పనిచేసే మరో విధమైన ఆత్మ ఉంది. బైబిలు దాన్ని “లౌకికాత్మ” అని పిలుస్తోంది. (1 కొరింథీయులు 2:12; ఎఫెసీయులు 2:⁠2) అది ఒక చెడు ప్రభావం, దానికి మూలం మరెవరో కాదు అపవాదియైన సాతాను, అతడు దేవుని నుండి దూరమైపోయిన మానవజాతితో కూడిన ‘ఈ లోకానికి అధికారి.’ (యోహాను 12:​31) దుమ్మును, చెత్తాచెదారాన్ని ఎగురగొట్టే గాలిలా, “లౌకికాత్మ” ప్రేమను నశింపజేసే హానికరమైన కోరికలను రేకెత్తిస్తుంది, శారీరక బలహీనతలను అధికం చేస్తుంది.​—⁠గలతీయులు 5:​19-21.

ప్రజలు వస్తుపరమైన, స్వార్థపూరితమైన ఆలోచనా విధానానికి, దౌర్జన్యపూరితమైన దృక్పథాలకు, ప్రేమను గురించి ఈ లోకంలో సర్వసాధారణమైయున్న వక్రీకరించబడిన తరచూ పెడదారిపట్టిన దృక్కోణానికి తమను తాము గురిచేసుకున్నప్పుడు ఆ దుష్ట లౌకికాత్మను తమలోకి స్వీకరిస్తారు. నిజమైన ప్రేమను పెంపొందించుకోవాలని మీరు కోరుకుంటే, మీరు లౌకికాత్మను దృఢంగా నిరోధించాలి. (యాకోబు 4:⁠7) అయితే మీ సొంత శక్తిని నమ్ముకోకండి; సహాయం కోసం యెహోవాను అర్థించండి. ఆయన ఆత్మ, అంటే విశ్వమంతటిలోకి అత్యంత బలమైన శక్తి మిమ్మల్ని బలపర్చి మీకు విజయాన్ని చేకూర్చగలదు.​—⁠కీర్తన 121:⁠2.

క్రైస్తవ సహవాసం నుండి ప్రేమను నేర్చుకోండి

పిల్లలు ఇంట్లో ప్రేమను చవిచూడడం ద్వారా ప్రేమించడం నేర్చుకుంటారు, అలాగే పిల్లలమైనా పెద్దలమైనా మనమందరం ఇతర క్రైస్తవులతో సహవసించడం ద్వారా ప్రేమను వృద్ధి చేసుకోవచ్చు. (యోహాను 13:​34, 35) వాస్తవానికి, ‘ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకోగల’ వాతావరణాన్ని సృష్టించడం క్రైస్తవ సంఘం యొక్క కీలకమైన విధుల్లో ఒకటి.​—⁠హెబ్రీయులు 10:⁠24, 25.

మన చుట్టూ ఉన్న ప్రేమలేని లోకంలో “విసికి చెదరియున్న” వారు ప్రత్యేకంగా అలాంటి ప్రేమను విలువైనదిగా పరిగణిస్తారు. (మత్తయి 9:​36) ప్రేమరహితమైన బాల్యంలోని చెడు ప్రభావాలనెన్నింటినో అధిగమించడానికి, పెద్దవారైన తర్వాత ఏర్పరచుకున్న ప్రేమానుబంధాలు సహాయపడతాయని అనుభవం చూపించింది. కాబట్టి, సమర్పిత క్రైస్తవులందరూ తమ మధ్యకు వచ్చే క్రొత్తవారికి నిజంగా హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని పలకడం ఎంత ప్రాముఖ్యమో కదా!

“ప్రేమ శాశ్వతకాలముండును”

“ప్రేమ శాశ్వతకాలముండును” అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 13:⁠8) అదెలా? అపొస్తలుడైన పౌలు మనకిలా చెబుతున్నాడు: “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.” (1 కొరింథీయులు 13:​4, 5) ఈ ప్రేమ ఏదో ఊహాజనిత తలంపో పైపై భావావేశమో కాదని స్పష్టమవుతోంది. దానికి భిన్నంగా, ఆ ప్రేమను చూపించేవారికి జీవిత నిరాశల గురించి వేదనల గురించి తెలుసు, వారు వాటిని అంగీకరిస్తారు, అయినా ఇవి తోటి మానవుల పట్ల తమకున్న ప్రేమను నాశనం చేయడానికి అనుమతించరు. అలాంటి ప్రేమ నిజంగా “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ.”​—⁠కొలొస్సయులు 3:​12-14.

కొరియాకు చెందిన 17 సంవత్సరాల క్రైస్తవ యౌవనస్థురాలి విషయమే పరిశీలించండి. ఆమె యెహోవా దేవుని సేవ చేయడం ప్రారంభించినప్పుడు, ఆమె కుటుంబం దానికి ఆమోదించకపోవడంతో ఆమె ఇల్లు వదిలివెళ్ళవలసి వచ్చింది. అయితే, కోపం తెచ్చుకునే బదులు ఆమె ఆ విషయం గురించి ప్రార్థించి దేవుని వాక్యము, ఆయన ఆత్మ తన ఆలోచనా విధానాన్ని మలచడానికి అనుమతించింది. ఆ తర్వాత, ఆమె తన కుటుంబం పట్ల తనకున్న నిజమైన ప్రేమానురాగాల్ని వ్యక్తం చేస్తూ తరచూ వారికి ఉత్తరాలు వ్రాసింది. దానికి ప్రతిస్పందనగా, ఆమె అన్నలిద్దరూ బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించారు, వారిప్పుడు సమర్పిత క్రైస్తవులు. ఆమె తల్లి, తమ్ముడు కూడా బైబిలు సత్యాన్ని అంగీకరించారు. చివరగా, ఎంతగానో వ్యతిరేకించిన ఆమె తండ్రి కూడా మనస్సు మార్చుకున్నాడు. సాక్షియైన ఆ యౌవనస్థురాలు ఇలా వ్రాస్తోంది: “మేమందరం తోటి క్రైస్తవులను వివాహం చేసుకున్నాము, ఐక్య ఆరాధకులుగా ఇప్పుడు మా కుటుంబంలో మొత్తం 23 మంది ఉన్నారు.” ప్రేమకు ఎంతటి విజయం!

నిజమైన ప్రేమను వృద్ధి చేసుకుని, ఇతరులు కూడా అలాగే చేయడానికి సహాయం చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఆ అమూల్యమైన లక్షణానికి మూలమైన యెహోవా వైపు తిరగండి. అవును, ఆయన వాక్యాన్ని లక్ష్యపెట్టండి, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించండి, క్రైస్తవ సహోదరసహోదరీలతో క్రమంగా సహవసించండి. (యెషయా 11:9; మత్తయి 5:⁠5) త్వరలోనే దుష్టులందరూ నిర్మూలించబడి నిజమైన క్రైస్తవ ప్రేమను అవలంబించేవారు మాత్రమే మిగిలి ఉంటారని తెలుసుకోవడం ఎంతటి ప్రోత్సాహాన్నిస్తుందో కదా! నిజంగా, సంతోషానికీ జీవానికీ కీలకం ప్రేమనే.​—⁠కీర్తన 37:10, 11; 1 యోహాను 3:​14.

[6వ పేజీలోని చిత్రం]

నిజమైన ప్రేమను వృద్ధి చేసుకోవడానికి ప్రార్థన, దేవుని వాక్య అధ్యయనం మనకు సహాయం చేస్తాయి