పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
హెబ్రీయులు 2:14, NWలో సాతాను “మరణం కలుగజేసే మార్గంగలవాడు” అని ఎందుకు పిలువబడ్డాడు?
క్లుప్తంగా చెప్పాలంటే, సాతాను వ్యక్తిగతంగా లేదా తన ప్రతినిధుల ద్వారా మానవులకు భౌతికమరణం కలిగించగలడని పౌలు భావం. దానికి పొందికగానే, యేసు సాతానును “ఆదినుండి వాడు నరహంతకు[డు]” అని పిలిచాడు.—యోహాను 8:44.
సాతానుకు “మరణముయొక్క బలము” లేదా “మరణంపై అధికారము” ఉందని కొన్ని భాషాంతరాలు అనువదించిన రీతినిబట్టి హెబ్రీయులు 2:14ను అపార్థం చేసుకొనే అవకాశంవుంది. (పరిశుద్ధ గ్రంథము; ఈజీ-టు-రీడ్ వర్షన్; క్యాతలిక్ అనువాదము; పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) అలాంటి అనువాదాలు సాతానుకు తానెంచుకున్న ఏ వ్యక్తినైనా చంపగల అపరిమితమైన సామర్థ్యమున్నట్లు కనిపించేలా చేయగలవు. అయితే, ఖచ్చితంగా విషయమది కాదు. అలాంటి సామర్థ్యమేవుంటే, అతడు బహుశా ఎంతోకాలం పూర్వమే ఈ భూమ్మీద యెహోవా ఆరాధకులు ఉండకుండా తుడిచిపెట్టి ఉండేవాడు.—ఆదికాండము 3:15.
“మరణంపై అధికారము” అని కొన్ని భాషాంతరాల్లో, “మరణం కలుగజేసే మార్గం” అని నూతన లోక అనువాదములో అనువదింపబడిన గ్రీకుపదబంధం “క్రాటస్‌టూ థానాటూ.” టౌథానాటవ్ అనే పదానికి “మరణం” అనీ, క్రాటస్‌కు ప్రాథమికంగా “శక్తి, బలం, సామర్థ్యం” అని అర్థాలున్నాయి. థియోలాజికల్ డిక్షనరీ ఆఫ్ ద న్యూ టెస్ట్‌మెంట్, ప్రకారం అది “శక్తిని లేదా బలాన్ని ప్రయోగించడాన్ని సూచించే బదులు దాని ఉనికిని, ప్రాధాన్యతను” సూచిస్తున్నది. కాబట్టి, హెబ్రీయులు 2:14లో, సాతానుకు మరణంమీద తిరుగులేని అధికారముందని పౌలు బోధించడంలేదు. బదులుగా, మరణం కలిగించేందుకు సాతానుకున్న శక్తిని లేదా సామర్థ్యాన్ని ఆయన సూచిస్తున్నాడు.
సాతాను “మరణం కలుగజేసే మా[ర్గాన్ని]” ఎలా ఉపయోగిస్తాడు? యోబు పుస్తకంలో, బహుశ అలాంటి ఒక అరుదైన సంఘటనను గూర్చి మనం చదువుతాము. యోబు పిల్లలకు ‘మరణం కలుగజేయడానికి’ సాతాను సుడిగాలిని ఉపయోగించాడని ఆ వృత్తాంతం చెబుతున్నది. అయితే, కేవలం దేవుని అనుమతితోనే సాతానలా చేయగల్గాడని, అదీ ముఖ్యమైన ఒక వివాదాంశం తీర్మానించడానికే అలా అనుమతి ఇవ్వబడిందని గమనించండి. (యోబు 1:12, 18, 19) నిజానికి, సాతాను తానుగా యోబును చంపలేడు. అలా చంపడానికి అనుమతి ఇవ్వబడలేదు. (యోబు 2:6) సాతాను ఆయా సందర్భాల్లో విశ్వాసులైన మానవులకు మరణం కలుగజేసినా, అతడు తన ఇష్టమొచ్చినట్టు మన ప్రాణాలు హరించగలడని మనం భయపడాల్సిన అవసరం లేదని ఇది చూపిస్తోంది.
మానవ ప్రతినిధుల ద్వారా కూడా సాతాను మరణం కలుగజేశాడు. ఆ విధంగా తమ విశ్వాసాన్నిబట్టి అనేకమంది క్రైస్తవులు మరణించారు, కొందరు కోపోద్రేకులైన అల్లరిమూకలచే హత్యచేయబడ్డారు లేదా ప్రభుత్వాధికారుల, అవినీతిపరులైన న్యాయమూర్తుల ఆజ్ఞలమూలంగా అన్యాయంగా మరణశిక్షలు అనుభవించారు.—ప్రకటన 2:13.
అంతేకాకుండా, సాతాను కొన్నిసార్లు మానవ బలహీనతల్ని ఆసరా చేసుకొని మరణం కలుగజేశాడు. పూర్వం ఇశ్రాయేలీయుల కాలంలో, వారు “యెహోవామీద తిరుగుబాటు” చేసేలా మోయాబీయులు వారిని వలలో వేసుకోవాలని బిలాము ప్రవక్త ఆలోచన చెప్పాడు. (సంఖ్యాకాండము 31:16) దాని ఫలితంగా, 23,000 కంటే ఎక్కువమంది ఇశ్రాయేలీయులు మరణించారు. (సంఖ్యాకాండము 25:9; 1 కొరింథీయులు 10:8) అదేవిధంగా నేడు కొందరు సాతాను “తంత్రముల[లో]” చిక్కుకొని లైంగిక దుర్నీతిలో, భక్తిహీన అభ్యాసాల్లో పడిపోతున్నారు. (ఎఫెసీయులు 6:11) నిజమే, అలాంటివారు మామూలుగా వెనువెంటనే తమ జీవితాలు కోల్పోరు. అయితే వారు నిత్యజీవం పోగొట్టుకొనే ప్రమాదంలో పడతారు, ఆ విధంగా సాతాను వారికి మరణం కలుగజేస్తాడు.
హాని చేసేందుకు సాతానుకున్న శక్తిని మనం గుర్తించినా, మనం అత్యధికంగా అతనికి భయపడాల్సిన అవసరం లేదు. సాతానుకు మరణం కలుగజేసే మార్గముందని పౌలు అన్నప్పుడు, “అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును” క్రీస్తు మరణించాడని కూడా ఆయన చెప్పాడు. (హెబ్రీయులు 2:14, 15) అవును, యేసు విమోచన క్రయధనం చెల్లించి, తద్వారా నమ్మిన మానవజాతిని పాపమరణాల దాస్యంనుండి విడిపించాడు.—2 తిమోతి 1:10.
సాతానుకు మరణం కలుగజేసే మార్గముందనే ఆలోచన గంభీరమైనదే అయినా సాతాను, అతని ప్రతినిధులు కలుగజేసే ఎలాంటి హానినైనా యెహోవా వమ్ము చేయగలడనే దృఢనమ్మకం మనకుంది. పునరుత్థానుడైన యేసు “అపవాది యొక్క క్రియలను లయపరచు[నని]” యెహోవా మనకు హామీ ఇస్తున్నాడు. (1 యోహాను 3:8) యెహోవా బలమందు యేసు మృతులను పునరుత్థానంచేసి, మరణం లేకుండా నశింపజేస్తాడు. (యోహాను 5:28, 29) సాతానును అగాధంలో బంధించడం ద్వారా, అతని పరిధులేమిటో యేసు నాటకీయంగా వెల్లడిచేస్తాడు. చివరకు సాతాను శాశ్వతంగా నాశనం చేయబడతాడు.—ప్రకటన 20:1-10.