యౌవనస్థుల హృదయాన్ని స్పృశించే ఒక వీడియో
యౌవనస్థుల హృదయాన్ని స్పృశించే ఒక వీడియో
యౌవనస్థుల్లో చాలామంది, యువత ఇలా అడుగుతోంది—నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను? (ఆంగ్లం) అనే వీడియోను చూసినప్పుడు తమ ప్రవర్తనను గంభీరంగా పరిశీలించుకోవడానికి ప్రోత్సహించబడ్డారు. * ఆ వీడియోలో మంచి లేఖనాధారిత ఉపదేశం, క్రైస్తవ యౌవనస్థుల వ్యక్తిగత వ్యాఖ్యానాలు, బైబిలులోని దీనా వృత్తాంతం ఆధారంగా రూపొందించబడిన ప్రేరణాత్మకమైన సమకాలీన నాటకం ఉన్నాయి. (ఆదికాండము, 34వ అధ్యాయం) వీడియో గురించిన ఈ వ్యాఖ్యానాలు మెక్సికో నుండి వచ్చాయి.
మార్త ఇలా చెబుతోంది: “ఈ వీడియో నా హృదయాన్ని లోతుగా స్పృశించింది. అది సరిగ్గా నాకోసమే తయారు చేసినట్లు అనిపించింది. నేను ఒక యెహోవాసాక్షినని నా టీచర్లు, తోటి విద్యార్థులు తెలుసుకుంటే చాలని నేననుకున్నాను. వారికి సాక్ష్యమివ్వడం ద్వారా దాన్ని నిరూపించుకోవడంలో నేను విఫలమయ్యాను. యెహోవా అందజేసే సమాచారాన్నంతటిని బట్టి, ప్రాముఖ్యంగా అది ఈ వీడియోలా మనల్ని లోతుగా స్పృశించినప్పుడు, నాకెంతో కృతజ్ఞతాభావం కలుగుతుంది.”
హ్వాన్ కార్లోస్ ఇలా అంటున్నాడు: “ఈ వీడియో మీరు నిజంగా ఆలోచించేలా చేస్తుంది. యౌవనస్థుడిగా నేను కొన్ని పొరపాట్లు చేశాను, నాటకంలోని కొన్ని పాత్రలతో నన్ను నేను పోల్చుకోగలిగాను. కొన్ని సంవత్సరాల క్రితం, నేను ద్వంద జీవితం గడిపాను కానీ అలాంటి జీవితం చెడు పర్యవసానాలను తీసుకురాగలదని నేను గ్రహించాను. వీడియో చూసిన తర్వాత, నేను యెహోవాకు నమ్మకంగా ఉండాలని నిశ్చయించుకున్నాను.”
సూలెమ్ ఇలా అంటోంది: “నేనా వీడియో చూసినప్పుడు ఎంతో చలించిపోయాను. గతంలో నేను బైబిలు చదవడం మానేశాను, యెహోవాకు అంతగా ప్రార్థించేదాన్ని కాదు. వీడియోలోని యౌవనస్థులు చేసిన వ్యాఖ్యానాలు విన్నప్పుడు, నేను మళ్ళీ బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టి యెహోవాకు ప్రార్థించడానికి ప్రేరేపించబడ్డాను.”
నేడు యౌవనస్థులు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు, వారు ఎంపిక చేసుకునే స్నేహితులు వారి జీవిత విధానాన్ని ఎంతో ప్రభావితం చేయవచ్చు. (కీర్తన 26:4; సామెతలు 13:20) ఈ విషయంలో, యువత ఇలా అడుగుతోంది—నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను? అనే వీడియో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అనేకులకు సహాయం చేస్తోంది.
[అధస్సూచి]
^ పేరా 2 యెహోవాసాక్షులు రూపొందించినది.