కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వాటికి ఏమయ్యింది?

వాటికి ఏమయ్యింది?

వాటికి ఏమయ్యింది?

నొపు, నో అనేవి ఐగుప్తు యొక్క ఒకప్పటి ప్రఖ్యాతి గాంచిన రాజధానులైన మెంఫిస్‌, థీబ్స్‌ నగరాలకు బైబిలు పేర్లు. నొపు (మెంఫిస్‌) నైలునదికి పశ్చిమవైపున కైరోకు దక్షిణాన దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అయితే చివరికి మెంఫిస్‌ ఐగుప్తు రాజధానిగా తన స్థానాన్ని కోల్పోయింది. సా.శ.పూ. 15వ శతాబ్ద ఆరంభానికల్లా ఐగుప్తుకు క్రొత్త రాజధాని ఉంది, అదే నో (థీబ్స్‌), అది మెంఫిస్‌కు దక్షిణాన దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. థీబ్స్‌లోని అనేక ఆలయ శిథిలాల్లో కార్‌నాక్‌ కూడా ఉంది, అది స్తంభాలతో ఇంతవరకు నిర్మించబడిన వాటిలోకెల్లా పెద్ద కట్టడంగా పరిగణించబడుతోంది. థీబ్స్‌, దాని కార్‌నాక్‌ ఆలయం ఐగుప్తీయుల ప్రముఖ దేవత అయిన అమోను ఆరాధనకు ప్రతిష్ఠించబడ్డాయి.

మెంఫిస్‌ థీబ్స్‌ల గురించి బైబిలు ప్రవచనం ఏమి తెలియజేసింది? ఐగుప్తు ఫరోకు, దాని దేవతలకు, ప్రత్యేకంగా ప్రముఖ దేవత అయిన “నోలోనుండు అమోను దేవత”కు వ్యతిరేకంగా తీర్పు తీర్చబడింది. (యిర్మీయా 46:​25, 26) అక్కడికి చేరుకునే ఆరాధకుల జనసమూహం “నిర్మూలము” చేయబడుతుంది. (యెహెజ్కేలు 30:​14, 15) సరిగ్గా అలాగే జరిగింది. అమోను ఆరాధనకు సంబంధించి మిగిలివున్నదల్లా ఆలయ శిథిలాలే. ఆధునిక పట్టణమైన లక్సర్‌ ప్రాచీన థీబ్స్‌ ఉన్న ప్రాంతంలోని కొంత భాగంలో నెలకొనివుంది, దాని శిథిలాల్లో ఇతర చిన్న గ్రామాలు ఉన్నాయి.

ఇక మెంఫిస్‌ విషయానికొస్తే, దానిలో సమాధులు తప్ప ఇక ఏమీ మిగిలిలేవు. బైబిలు పండితుడైన లోయిస్‌ గోల్డింగ్‌ ఇలా చెబుతున్నాడు: “ఐగుప్తుపై విజయం సాధించిన అరబ్బులు, నది ఆవలి వైపున తమ రాజధానిని (కైరో) నిర్మించుకోవడానికి మెంఫిస్‌లోని విస్తృతమైన శిథిలాలను శతాబ్దాలపాటు రాళ్ళగనిలా ఉపయోగించుకున్నారు. నైలునదీ అరబ్బు నిర్మాణకులూ తమ పనిని ఎంత బాగా నిర్వహించడం జరిగిందంటే, ప్రాచీన నగర ప్రాంతంలో మైళ్ళ కొద్దీ దూరం వరకూ నల్లమట్టి నేల మీద ఒక్క రాయి కూడా పైకి కనిపించదు.” నిజంగా, బైబిలులో ప్రవచించబడినట్లుగానే మెంఫిస్‌ ‘నిర్జనమై పాడైపోయింది.’​—⁠యిర్మీయా 46:​19.

బైబిలు ప్రవచనాల ఖచ్చితత్వాన్ని చూపే ఉదాహరణల్లో ఇవి కేవలం రెండు మాత్రమే. థీబ్స్‌ మెంఫిస్‌ల నాశనం, ఇంకా నెరవేరనైయున్న బైబిలు ప్రవచనాల్లో మనం నమ్మకం కలిగివుండడానికి మనకు గట్టి కారణాన్నిస్తుంది.​—⁠కీర్తన 37:10, 11, 29; లూకా 23:43; ప్రకటన 21:​3-5.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

Photograph taken by courtesy of the British Museum