కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సామాన్యులు బైబిలును అనువదించడం

సామాన్యులు బైబిలును అనువదించడం

సామాన్యులు బైబిలును అనువదించడం

ఆంగ్లేయుడైన హెన్రీ నాట్‌ అనే తాపీమేస్త్రీ, వేల్స్‌కుచెందిన జాన్‌ డేవీస్‌ అనే చిల్లర వ్యాపార వృత్తి విద్యార్థి 1835లో ఓ బృహత్తర కార్యక్రమ ముగింపుకొచ్చారు. 30 కంటే ఎక్కువ సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత, చివరికి వారు తాహీతియన్‌లోకి మొత్తం బైబిల్ని అనువదించడం పూర్తిచేశారు. సామాన్యులైన ఈ ఇద్దరు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు, వారి నిస్వార్థ శ్రమకే ఫలితాలొచ్చాయి?

“మహా జాగృతి”

బ్రిటన్‌లో 18వ శతాబ్దపు చివరి అర్థభాగంలో, మహా జాగృతి లేదా జాగృతి అనే ఒక ప్రొటస్టెంటు ఉద్యమ సభ్యులు గ్రామ కూడళ్ళలో, గనులు, కర్మాగారాలవద్ద మత ప్రచారం చేశారు. శ్రామిక వర్గాల్ని చేరుకోవడం వారి లక్ష్యం. ఈ జాగృతి ప్రచారకులు బైబిలు పంపిణీని ఉత్సాహంగా ప్రోత్సహించారు.

లండన్‌ మిషనరీ సొసైటీ (ఎల్‌ఎమ్‌ఎస్‌) 1795లో స్థాపించబడింది, దాని వ్యవస్థాపనకు దోహదపడిన బాప్టిస్టు సభ్యుడు విలియం కేరీ ఆ ఉద్యమానికి నాయకుడు. స్థానిక భాషలు నేర్చుకొని, దక్షిణ పసిఫిక్‌ ప్రాంతాల్లో మిషనరీలుగా సేవచేయడానికి ఇష్టపడ్డవారికి ఎల్‌ఎమ్‌ఎస్‌ శిక్షణనిచ్చింది. స్థానిక ప్రజలకు వారి భాషలోనే సువార్త ప్రకటించడం ఈ మిషనరీల లక్ష్యం.

ఆ మధ్యే కనుగొనబడిన టాహిటి ద్వీపం, ఎల్‌ఎమ్‌ఎస్‌కు మొదటి మిషనరీ క్షేత్రమయ్యింది. జాగృతి సభ్యులకు ఈ ద్వీపాలు అన్యమత ‘అంధకార ప్రాంతాలై’యుండి కోతకు సిద్ధంగా ఉన్నాయి.

సామాన్యులే సమస్య పరిష్కరించారు

ఆ కోతపని నిమిత్తం, సంసిద్ధంగాలేని దాదాపు 30 మంది మిషనరీల్ని త్వరితగతిన ఎంపికచేసి ఎల్‌ఎమ్‌ఎస్‌ కొన్న డఫ్‌ అనే ఓడలో వారినెక్కించారు. ఒక నివేదిక ప్రకారం వారిలో, “[నియమిత శిక్షణలేని] నలుగురు నియుక్త పాదిరీలు, ఆరుగురు వడ్రంగులు, ఇద్దరు చెప్పులు కుట్టేవారు, ఇద్దరు తాపీమేస్త్రీలు, ఇద్దరు నేతగాండ్రు, ఇద్దరు దర్జీలు, ఒక దుకాణదారుడు, గుర్రపుజీను పనివాడు, సేవకుడు, తోటమాలి, వైద్యుడు, కంసాలి, పీపాలు చేసేవ్యక్తి, దూదేకే వ్యక్తి, టోపీలు కుట్టేవాడు, బట్టలు తయారుచేసే వ్యక్తి, బీరువాలుచేసే వ్యక్తి, వారిలో ఐదుగురి భార్యలు, ముగ్గురు పిల్లలు” ఉన్నారు.

ఆదిమ బైబిలు భాషల్ని తెలుసుకోవడానికి ఈ మిషనరీల దగ్గర సాధనాలుగా ఒక గ్రీకు-ఇంగ్లీషు నిఘంటువు, హీబ్రూ నిఘంటువున్న బైబిలు మాత్రమే ఉన్నాయి. సముద్రంపై గడిపిన ఏడు నెలల కాలంలో ఆ మిషనరీలు, పూర్వ సందర్శకులు ముఖ్యంగా బౌంటీ ఓడలో తిరుగుబాటుదారులు ఉపయోగించిన తాహీతియన్‌ పదాల్ని కొన్నింటిని కంఠస్థం చేశారు. చివరకు, 1797 మార్చి 7న, డఫ్‌ టాహిటికి చేరుకోగానే మిషనరీలందరు అక్కడ దిగారు. అయితే, ఒక సంవత్సరం తర్వాత, చాలామంది నిరుత్సాహపడి వెనక్కి వెళ్ళిపోగా, ఏడుగురు మిషనరీలు మాత్రమే అక్కడ ఉండిపోయారు.

ఆ ఏడుగురిలో, పూర్వం తాపీపనిచేసిన హెన్రీ నాట్‌కు కేవలం 23 ఏండ్లే. ఆయన వ్రాసిన తొలి ఉత్తరాల్నిబట్టిచూస్తే, ఆయనకు కేవలం ప్రాథమిక విద్య మాత్రమే ఉందని అర్థమౌతుంది. అయినా, తాహీతియన్‌ నేర్చుకోవడంలో ఆయనకు మొదట్నుంచి మంచి వరమున్నట్లే నిరూపించుకున్నాడు. ఆయన యథార్థపరుడని, సౌమ్యుడని, ఉల్లాసపరుడని వర్ణింపబడ్డాడు.

1801లో కొత్తగా వచ్చిన తొమ్మిదిమంది మిషనరీలకు తాహీతియన్‌ నేర్పించడానికి నాట్‌ ఎంపికచేయబడ్డాడు. వారిలో వేల్స్‌కుచెందిన 28 సంవత్సరాల జాన్‌ డేవీస్‌ ఒకరు. ఈయన సర్దుకుపోయే, ఉదార స్వభావంగల, కష్టపడి పనిచేసే సమర్థ విద్యార్థిగా నిరూపించుకున్నాడు. ఎంతోకాలం గడవకముందే, ఈ ఇద్దరు తాహీతియన్‌లోకి బైబిల్ని అనువదించడానికి తీర్మానించుకున్నారు.

అదొక సాహస కృత్యమే

అయితే, తాహీతియన్‌లోకి అనువదించడం ఒక సాహసకృత్యమే అయ్యింది, ఎందుకంటే అప్పటికింకా తాహీతియన్‌కు లిపిలేదు. మిషనరీలు కేవలం వినడం ద్వారానే దానిని నేర్చుకోవాలి. వారికి నిఘంటువుగాని, వ్యాకరణ పుస్తకంగానీ లేవు. ఊపిరి విడుస్తూ మాట్లాడే తాహీతియన్‌ మాటలు పలికేటప్పుడు హల్లులు అంతగా లేకుండా అచ్చులే ఎక్కువగా ఉండడం, (కొన్నిసార్లు ఐదు అచ్చులు వరుసగా రావడం) పైగా శ్వాసకోసం మధ్యలో ఆగుతూ మాట్లాడ్డంవల్ల ఆ భాష నేర్చుకోవడం మిషనరీలకు కష్టసాధ్యమయ్యింది. “చాలా పదాల్లో అచ్చులు తప్ప ఇంకేవీ ఉండవు, దానికితోడు ప్రతి అచ్చుకు ఒక శబ్దం ఉంటుంది” అని వారు వాపోయారు. “అవసరమైనంత ఖచ్చితంగా పదాల శబ్దాన్ని పట్టుకోలేకపోయాము” అని వారంగీకరించారు. అసలు ఉనికిలోనే లేని శబ్దాలు వింటున్నట్టుగా కూడా వారు తలంచారు.

గోటిచుట్టపై రోకటిపోటన్నట్టు, తాహీతియన్‌లో అప్పుడప్పుడు కొన్ని పదాలు మంచివి కాదని నిషేధింపబడేవి దానితో వాటి స్థానాల్లో కొత్తవి చేర్చవలసి వచ్చేది. పర్యాయపదాలు మరో తలనొప్పిగా ఉండేవి. “ప్రార్థన” అనే పదానికి తాహీతియన్‌లో 70కి పైగా నిర్దిష్ట పదాలున్నాయి. ఆంగ్లానికి పూర్తి భిన్నంగా ఉండే తాహీతియన్‌ వాక్య కూర్పు మరో సవాలు. ఇన్ని కష్టాలున్నా మిషనరీలు కొద్దికొద్దిగా పదాల్ని కూర్చారు. అలా 50 సంవత్సరాల తర్వాత డేవీస్‌ 10,000 పదాలతో చివరకు ఒక నిఘంటువు ప్రచురించాడు.

అదనంగా తాహీతియన్‌లో లిపి వ్రాసే సవాలు ఎదురయ్యింది. అప్పటికే బాగా వాడుకలోవున్న ఆంగ్ల అక్షరగుణితం ఉపయోగించి లిపి వ్రాయడానికి మిషనరీలు ప్రయత్నించారు. అయితే, లాటీను అక్షరమాలను ఉపయోగించే ఆంగ్లభాషకు తాహీతియన్‌ శబ్దాలకు పొంతన కుదర్లేదు. దాంతో శబ్దాలకు అక్షరక్రమాలకు సంబంధించి మిషనరీలు అంతులేని చర్చలు చేశారు. మిషనరీలు దక్షిణ సముద్ర ప్రాంతీయ భాష నోటిపలుకును లిపిలోకి మార్చిన మొదటివారు కాబట్టి తరచు వారు కొత్త అక్షరక్రమాల్ని రూపొందించారు. తాము చేస్తున్న ఈ పని ఆ తర్వాత దక్షిణ పసిఫిక్‌లో అనేక భాషలకు ఒక నమూనాగా తయారౌతుందని వారెంత మాత్రం గ్రహించలేదు.

సాధనాలు కొన్ని, వనరులు పుష్కలం

కేవలం కొన్ని రెఫరెన్సు పుస్తకాలే అనువాదకులకు అందుబాటులో ఉండేవి. ఎల్‌ఎమ్‌ఎస్‌ వారిని కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ను మరియు టెక్స్‌టస్‌ రెసెప్టస్‌ని ప్రాథమిక మూల గ్రంథాలుగా ఉపయోగించాలని నిర్దేశించింది. అదనంగా హీబ్రూ, గ్రీక్‌ నిఘంటువుల్ని అలాగే ఆ రెండు భాషల్లో బైబిళ్ళను పంపించాల్సిందిగా నాట్‌ ఎల్‌ఎమ్‌ఎస్‌ను అడిగాడు. ఆయనకు ఆ పుస్తకాలు అందాయో లేదో తెలియదు. అయితే, డేవీస్‌కు మాత్రం వేల్స్‌ స్నేహితులనుండి కొన్ని పండిత గ్రంథాలు అందాయి. ఆయన దగ్గర కనీసం ఒక గ్రీక్‌ నిఘంటువు, ఒక హీబ్రూ బైబిలు, గ్రీక్‌లో కొత్త నిబంధన మరియు సెప్టాజింట్‌ ఉన్నట్టు వ్రాతచరిత్రలు చూపుతున్నాయి.

ఈ మధ్యకాలంలో, మిషనరీల ప్రకటనా పని నిష్ఫలంగానే ఉండిపోయింది. మిషనరీలు టాహిటిలో 12 సంవత్సరాలున్నా స్థానికుల్లో ఒక్కరు కూడా బాప్తిస్మం తీసుకోలేదు. చివరకు, నిరంతర పౌరపోరాటాలు అక్కడే ఉండాలని తీర్మానించుకున్న నాట్‌తప్ప మిగతా మిషనరీలందరూ ఆస్ట్రేలియాకు పారిపోయేలా చేశాయి. సొసైటీ ద్వీపసముదాయంలోని విండ్‌వార్డ్‌ ద్వీపాల్లో కొంతకాలం ఆయనొక్కడే మిషనరీగా ఉన్నాడు. అయితే రాజైన పోమారే II సమీపంలోని మూరియా ద్వీపానికి పారిపోవడంతో ఆయన ఆ రాజును అనుసరించాల్సివచ్చింది.

కానీ, నాట్‌ అలా వెళ్ళిపోవడం అనువాదపు పనిని ఆపుజేయలేదు. డేవీస్‌ ఆస్ట్రేలియాలో రెండు సంవత్సరాలు గడిపిన తర్వాత తిరిగి నాట్‌ను కలుసుకున్నాడు. ఈలోగా నాట్‌ గ్రీక్‌, హీబ్రూ భాషల అధ్యయనం చేపట్టి వాటిమీద మంచి పట్టు సాధించాడు. దాంతో ఆయన హీబ్రూ లేఖనాల్లో కొన్ని భాగాల్ని తాహీతియన్‌లోకి అనువదించడం ఆరంభించాడు. స్థానికులు సులభంగా అర్థంచేసుకోగల అంశాలున్న బైబిలు భాగాల్ని ఆయన మొదట ఎంచుకున్నాడు.

డేవీస్‌తో సన్నిహితంగా పనిచేస్తూ నాట్‌ లూకా సువార్తను అనువదించడం ఆరంభించి దానిని 1814 సెప్టెంబరులో పూర్తిచేశాడు. తాహీతియన్‌లో సహజంగా ఉండేలా నాట్‌ అనువదిస్తే, డేవీస్‌ అది ఆదిమ మూల గ్రంథం ప్రకారముందో లేదో చూసేవాడు. 1817లో రాజైన పోమారే II తాను స్వయంగా లూకా సువార్త మొదటి పేజీని ముద్రించవచ్చా అని అడిగాడు. మిషనరీలు మూరియాకు తెచ్చిన చేతి ముద్రణా యంత్రంమీద ఆయన దానిని ముద్రించాడు. బైబిల్ని తాహీతియన్‌లోకి అనువదించే వివరాల గాథ నమ్మకస్థుడైన టాహిటివాసి ట్వాహిని పేరు ప్రస్తావించకుండా పూర్తికాదు. ఈయన ఆ సంవత్సరాలన్నింటిలో మిషనరీలతోవుండి, సున్నితమైన భాషా వివరాలు అర్థంచేసుకోవడానికి వారికి సహాయం చేస్తూవచ్చాడు.

అనువాదం పూర్తయ్యింది

ఆరు సంవత్సరాల తీవ్రకృషి తర్వాత, 1819లో సువార్తలు, అపొస్తలుల కార్యములు, కీర్తనల గ్రంథం అనువదించడం పూర్తయ్యింది. కొత్తగా వచ్చిన మిషనరీలు తమతో తెచ్చిన ముద్రణా యంత్రం మూలంగా ఈ బైబిలు పుస్తకాలు ముద్రించి పంచిపెట్టడం సాధ్యమయ్యింది.

కొంతకాలంపాటు అనువదించడం, తప్పులు సరిదిద్దడం, సవరించడం చురుగ్గా జరిగాయి. టాహిటిలో 28 సంవత్సరాలు జీవించిన తర్వాత 1825లో నాట్‌ జబ్బుపడగా, ఆయన తిరిగి ఇంగ్లాండ్‌ వెళ్ళిపోవడానికి ఎల్‌ఎమ్‌ఎస్‌ ఆయనను అనుమతించింది. సంతోషదాయకంగా, అప్పటికి గ్రీకు లేఖనాల అనువాదం దాదాపు పూర్తికావచ్చింది. తిరుగు ప్రయాణంలో అలాగే ఇంగ్లాండ్‌లోవున్న కాలంలో ఆయన బైబిలు అనువాదం కొనసాగించాడు. నాట్‌ 1827లో తిరిగి టాహిటికి వచ్చాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత, 1835 డిసెంబరులో ఆయన తన కలం ప్రక్కన బెట్టాడు. 30 సంవత్సరాలకు పైగా చేసిన తీవ్రకృషి అనంతరం, బైబిలంతా అనువదించడం పూర్తయ్యింది.

పూర్తి తాహీతియన్‌ బైబిల్ని లండన్‌లో ముద్రించేందుకుగాను నాట్‌ తిరిగి 1836లో ఇంగ్లాండ్‌ వెళ్ళాడు. ఉప్పొంగిన సంతోషంతో నాట్‌ 1838 జూన్‌ 8న తాహీతియన్‌లో ముద్రింపబడిన మొదటి బైబిల్ని విక్టోరియా రాణికి బహూకరించాడు. ముందు తాపీమేస్త్రిగా పనిచేసే తను 40 సంవత్సరాల క్రిందట డఫ్‌ ఎక్కి ఈ గొప్ప జీవన లక్ష్యం సాధించేందుకు తాహీతియన్‌ సంస్కృతిలో తలమునకలైన ఆయనకవి నిశ్చయంగా మరచిపోలేని మధుర క్షణాలే.

రెండు నెలల తర్వాత, నాట్‌ 27 చెక్కపెట్టెల్లో తాహీతియన్‌లో ముద్రింపబడిన పూర్తి బైబిలు యొక్క మొదటి 3,000 ప్రతుల్ని తీసుకొని దక్షిణ పసిఫిక్‌కు బయలుదేరాడు. సిడ్నిలో ఆగినప్పుడు ఆయన మళ్ళీ జబ్బు పడ్డాడు, అయితే ఆయన విలువైన ఆ చెక్కపెట్టెల్ని విడిచి వెళ్ళడానికి నిరాకరించాడు. కోలుకున్న తర్వాత, 1840లో ఆయన టాహిటికి వచ్చినప్పుడు తాహీతియన్‌లో బైబిలు ప్రతులు అందుకోవడానికి జనం విరగబడ్డారు. 1844 మేలో 70 సంవత్సరాల నాట్‌ మరణించాడు.

బహువిస్తారమైన ప్రభావం

అయితే నాట్‌ చేసిన కృషి అలాగే నిలబడింది. పొలినేషియా భాషలమీద ఆయన అనువాదం బహువిస్తారమైన ప్రభావం చూపింది. తాహీతియన్‌ భాషను వ్రాతరూపంలో పెట్టడం ద్వారా, మిషనరీలు ఆ భాషను కాపాడారు. ఒక గ్రంథకర్త ఇలా అన్నాడు: “నాట్‌ తాహీతియన్‌ వ్యాకరణానికి ఉన్నత ప్రమాణం కల్గించాడు. తాహీతియన్‌ను దాని స్వచ్ఛతలో నేర్చుకోవడానికి అన్ని సందర్భాల్లో బైబిలు దగ్గరకే వెళ్ళాలి.” ఈ అనువాదకుల నిర్విరామ కృషి వేలపదాలు అంతరించిపోకుండా కాపాడింది. ఒక శతాబ్దం తర్వాత, ఒక గ్రంథకర్త ఇలా అన్నాడు: “నాట్‌ అనువదించిన అసాధారణ తాహీతియన్‌ బైబిలు తాహీతియన్‌ భాషకే తలమానికం, దీనిని అందరూ ఒప్పుకుంటారు.”

ఈ ప్రాముఖ్యమైన పని కేవలం తాహీతియన్లకు ప్రయోజనమివ్వడమే కాకుండా దక్షిణ పసిఫిక్‌ భాషల ఇతర అనువాదాలకు కూడా పునాదివేసింది. ఉదాహరణకు, కుక్‌ మరియు సమోవా ద్వీపాల్లోని అనువాదకులు దానినొక ప్రమాణంగా తీసుకున్నారు. “వాస్తవానికి నేను జాగ్రత్తగా పరిశీలించిన నాట్‌గారి అనువాదాన్నే అనుసరించాను” అని ఒక అనువాదకుడు ప్రకటించాడు. మరో అనువాదకుడు ‘దావీదు కీర్తనల్లో ఒకదానిని సమోవా భాషలోకి అనువదించేటప్పుడు, తనయొద్ద హీబ్రూ కీర్తన గ్రంథాన్ని, ఇంగ్లీషు, తాహీతియన్‌ భాషాంతరాల్ని ఉంచుకున్నాడని’ నివేదించబడింది.

ఇంగ్లాండ్‌లోని జాగృతి సభ్యుల మాదిరిననుసరిస్తూ టాహిటిలోని మిషనరీలు ఉత్సాహభరితంగా సాక్షరతను ప్రోత్సహించారు. వాస్తవానికి, ఒక శతాబ్దానికిపైగా తహీతీ ప్రజానీకానికి అందుబాటులో ఉన్న పుస్తకం బైబిలు మాత్రమే. ఆ విధంగా అది తాహీతియన్‌ సంస్కృతిలో ఒక ముఖ్య భాగమైంది.

నాట్‌ భాషాంతరంలో హీబ్రూ గ్రీక్‌ లేఖనాల్లో దైవిక నామం అనేకమార్లు ప్రస్తావించబడటం ఉత్తమ విషయం. దాని ఫలితంగా, టాహిటిలో, దాని ద్వీపాల్లో యెహోవా నామం బాగా తెలుసు. అది కొన్ని ప్రొటస్టెంటు చర్చీలమీద కూడా కనబడుతుంది. అయితే, దేవుని నామమిప్పుడు ప్రధానంగా యెహోవాసాక్షులకు, వారి ఆసక్తికర ప్రకటనా పనికి ముడిపెట్టబడివుంది. వారు తమ ప్రకటనా పనిలో ఎక్కువగా నాట్‌, ఆయన సహాయకులు అనువదించిన తాహీతియన్‌ బైబిల్నే ఉపయోగిస్తారు. నేడు మానవజాతిలో అత్యధికులకు దేవుని వాక్యం వెంటనే లభించేంతగా అందుబాటులోకి వచ్చినందుకు మనమెంత కృతజ్ఞులమైయుండాలో హెన్రీ నాట్‌వంటి అనువాదకుల పట్టువిడువని ప్రయత్నాలు మనకు గుర్తుచేస్తాయి.

[26వ పేజీలోని చిత్రాలు]

తాహీతియన్‌లో 1815నాటి మొదటి బైబిలు అనువాదాలు. యెహోవా నామం కనబడుతుంది

హెన్రీ నాట్‌ (1774-1844), తాహీతియన్‌ బైబిలు ముఖ్య అనువాదకుడు

[26వ పేజీలోని చిత్రం]

తాహీతియన్‌ బైబిల్‌: Copyright the British Library (3070.a.32); హెన్రీ నాట్‌ మరియు ఉత్తరం: Collection du Musée de Tahiti et de ses Îles, Punaauia, Tahiti; catechism: With permission of the London Missionary Society Papers, Alexander Turnbull Library, Wellington, New Zealand

[28వ పేజీలోని చిత్రం]

దేవుని నామం కనిపించే 1801నాటి తాహీతియన్‌ మరియు వేల్స్‌ ముద్రిత ప్రశ్నోత్తరాల ద్విభాషా గ్రంథం

[చిత్రసౌజన్యం]

With permission of the London Missionary Society Papers, Alexander Turnbull Library, Wellington, New Zealand

[29వ పేజీలోని చిత్రం]

ఫ్రెంచ్‌ పొలినేషియా, హాహైని ద్వీపంలో, ముందరి భాగంలో యెహోవా పేరుతో ప్రొటస్టెంట్‌ చర్చ్‌

[చిత్రసౌజన్యం]

Avec la permission du Pasteur Teoroi Firipa