కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘కనిపెట్టుకొని’ ఉండే స్వభావం మీకుందా?

‘కనిపెట్టుకొని’ ఉండే స్వభావం మీకుందా?

‘కనిపెట్టుకొని’ ఉండే స్వభావం మీకుందా?

“దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు [“ఎల్లప్పుడు మనస్సులో ఉంచుకొని,” NW], మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.”​—2 పేతురు 3:​11, 12.

భోజనానికి వస్తున్న అతిథుల కోసం ఎదురుచూస్తున్న ఒక కుటుంబాన్ని మీ మనస్సులో ఊహించుకోండి. అతిథులు రావలసిన సమయం త్వరగా దగ్గరపడుతోంది. భార్య భోజనం సిద్ధం చేయడంలో తుది మెరుగులు దిద్దుతోంది. ఆమె భర్త, పిల్లలు అంతా సక్రమంగా ఉండేలా చూడడంలో తోడ్పడుతున్నారు. అందరూ ఉత్సుకతతో ఉన్నారు. కుటుంబమంతా అతిథుల రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ రుచికరమైన భోజనాన్ని, చక్కని సహవాసానందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.

2 క్రైస్తవులముగా మనం మరింత ప్రాముఖ్యమైనదాని కోసం ఎదురుచూస్తున్నాము. దేనికోసం? మనమందరం ‘దేవుని దినం’ కోసం ఎదురుచూస్తున్నాము! అది వచ్చే వరకు మనం, “యెహోవాకొరకు నేను ఎదురుచూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును” అని చెప్పిన మీకా ప్రవక్త వలె ఉండాలి. (మీకా 7:7) అంటే దాని భావం మనం ఏ పనీ లేకుండా ఉండడమనా? కాదు. చేయవలసిన పని ఎంతో ఉంది.

3 కనిపెట్టుకొని ఉండేటప్పుడు సరైన స్వభావం కలిగి ఉండడానికి అపొస్తలుడైన పేతురు మనకు సహాయం చేస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు [“ఎల్లప్పుడు మనస్సులో ఉంచుకొని,” NW], మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.” (2 పేతురు 3:​11, 12) పేతురు తన మాటల్లో, మనమెలాంటి వారమై ఉండాలని ప్రశ్నించడం లేదని గమనించండి. ఆయన తాను వ్రాసిన రెండు దైవప్రేరేపిత పత్రికల్లో క్రైస్తవులు ఎలాంటి వారై ఉండాలో వర్ణించాడు. “పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను” కొనసాగమని కూడా ఆయన వారికి ఉపదేశించాడు. యేసుక్రీస్తు “యుగసమాప్తికి” సూచననిచ్చి దాదాపు 30 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ క్రైస్తవులు అప్రమత్తంగా ఉండడం మానుకోకూడదు. (మత్తయి 24:⁠3) వారు యెహోవా దినపు రాకడ కోసం ‘కనిపెట్టుకొనివుంటూ దానిని ఎల్లప్పుడు మనస్సులో ఉంచుకోవాలి.’

4 ఇక్కడ “ఎల్లప్పుడు మనస్సులో ఉంచుకొని” అని అనువదించబడిన గ్రీకు పదానికి “త్వరపెట్టుచు” అని భావం. నిజమే మనం యెహోవా దినాన్ని అక్షరార్థంగా “త్వరపెట్ట” లేము. ఆ విషయానికొస్తే, యేసుక్రీస్తు తన తండ్రి శత్రువులకు తీర్పు తీర్చడానికి వచ్చే ‘దినముగానీ, గడియగానీ’ మనకు తెలియదు. (మత్తయి 24:36; 25:​13) ఒక సమాచార గ్రంథం, “త్వరపెట్టుచు” అనే పదం యొక్క మూల క్రియాపదానికి ఇక్కడ భావం “‘వేగవంతం చేయడం,’ అంటే దానికి ‘ఆసక్తి కలిగివుండడం, చురుగ్గా ఉండడం, దేని గురించైనా శ్రద్ధ కలిగివుండడం’ వంటివాటితో సన్నిహిత సంబంధం ఉంది” అని వివరిస్తోంది. కాబట్టి యెహోవా దినపు రాకడను “ఆశతో అపేక్షించుచు” ఉండమని పేతురు తన తోటి విశ్వాసులను ఉద్బోధిస్తున్నాడు. దాన్ని తదేకంగా మనస్సులో ఉంచుకోవడం ద్వారా వారలా చేయవచ్చు. (2 పేతురు 3:​11, 12, అధస్సూచి) “యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము” ఇప్పుడు ఎంతో సమీపంలో ఉంది కాబట్టి, మనం కూడా అదేవిధమైన మనోవైఖరి కలిగివుండాలి.​—⁠యోవేలు 2:​31.

“పరిశుద్ధమైన ప్రవర్తనతో” కనిపెట్టుకొని ఉండండి

5 యెహోవా దినాన్ని తప్పించుకుని జీవించాలని మనం ‘ఆశతో అపేక్షిస్తుంటే’ మనం ఆ విషయాన్ని మన “పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను” వెల్లడిచేస్తాము. “పరిశుద్ధమైన ప్రవర్తన” అనే పదబంధం మనకు పేతురిచ్చిన ఈ ఆజ్ఞను జ్ఞప్తికి తెస్తుంది: “నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.”​—⁠1 పేతురు 1:​14-16.

6 పరిశుద్ధంగా ఉండడానికి మనం శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక పరిశుభ్రతను కాపాడుకోవాలి. యెహోవా నామాన్ని ధరించిన వ్యక్తులముగా మనం, మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవడం ద్వారా ‘దేవుని దినం’ కోసం సిద్ధం చేసుకుంటున్నామా? ఈ లోక నైతిక ప్రమాణాలు అంతకంతకూ స్థిరంగా దిగజారిపోతున్నాయి కాబట్టి నేడు మన స్వచ్ఛతను కాపాడుకోవడం అంత సులభం కాదు. (1 కొరింథీయులు 7:31; 2 తిమోతి 3:​13) మన నైతిక ప్రమాణాలకు, లోక నైతిక ప్రమాణాలకు మధ్య దూరం అధికమవుతున్నట్లు కనుగొంటున్నామా? లేకపోతే, మనం చింతించవలసిందే. మన వ్యక్తిగత ప్రమాణాలు ఈలోక ప్రమాణాల కంటే ఉన్నతమైనవే అయినా అవి క్షీణించిపోతున్నాయా? అలాగైతే, దేవునికి సంతోషం కలిగించేలా పరిస్థితిని సరిచేసేందుకు మనం సానుకూల చర్య తీసుకోవాలి.

7 ఇంటర్నెట్‌లో అశ్లీలత ప్రవేశించడం అలాగే దానిని ఏకాంతంగా వీక్షించేందుకు వీలుంది కాబట్టి అలాంటి అనైతిక విషయాలు ఒకప్పుడు అందుబాటులో లేని కొందరికి ఇప్పుడవి “అసంఖ్యాక లైంగిక అవకాశాలు” ఇస్తున్నాయని ఒక వైద్యుడు అంటున్నాడు. అలాంటి అపరిశుభ్ర ఇంటర్నెట్‌ సైట్‌ల కోసం మనం వెదుకుతున్నామంటే, “అపవిత్రమైన దేనిని ముట్టకుడి” అనే బైబిలు ఆజ్ఞను మనం తప్పక అలక్ష్యం చేస్తున్నట్లే. (యెషయా 52:​11) మనం నిజంగా ‘దేవుని దినపు రాకడను ఎల్లప్పుడు మనస్సులో ఉంచుకొంటున్నట్లేనా’? లేక, ఒకవేళ మనం మన మనస్సును అసభ్య విషయాలతో కలుషితం చేసుకున్నా మనల్ని మనం శుభ్రపరచుకోవడానికి మనకింకా సమయముందిలే అని భావిస్తూ ఆ దినాన్ని మనం మనస్సులో వాయిదా వేస్తున్నామా? ఈ సంబంధంగా మనకేదైనా సమస్య ఎదురైతే, “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము” అని యెహోవాకు విజ్ఞప్తి చేసుకోవడం ఎంత అత్యవసరమో కదా!​—⁠కీర్తన 119:​37.

8 పెద్దలు పిన్నలు అధికశాతం మంది యెహోవాసాక్షులు దేవుని ఉన్నత నైతిక ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉంటూ, ఈ లోక అనైతిక ఉరులను తప్పించుకుంటున్నారు. మన కాలాల అత్యవసరతను, “ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును” అని పేతురు ఇచ్చిన హెచ్చరికను ఎరిగినవారై “పరిశుద్ధ ప్రవర్తన” కలిగివుండడంలో కొనసాగుతున్నారు. (2 పేతురు 3:​10) వారు ‘దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఎల్లప్పుడు మనస్సులో ఉంచుకొంటున్నారని’ వారి చర్యలు నిరూపిస్తాయి. *

“భక్తితో” కనిపెట్టుకొని ఉండండి

9 మనం ఎల్లప్పుడు యెహోవా దినాన్ని మనస్సులో ఉంచుకోవాలంటే “భక్తితో” కూడిన క్రియలు కూడా ఆవశ్యకం. “భక్తి”లో దేవుని దృష్టికి ఇష్టమైనది చేయడానికి మనల్ని పురికొల్పే పూజ్యభావం కూడా చేరివుంది. యెహోవాను యథార్థంగా హత్తుకొని ఉండడం అలాంటి భక్తిగల క్రియలు చేయడానికి ప్రేరణనిస్తుంది. “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెన[న్నది]” ఆయన చిత్తం. (1 తిమోతి 2:⁠4) ఆయన “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు[న్నాడు].” (2 పేతురు 3:⁠9) కాబట్టి, యెహోవా గురించి తెలుసుకుని ఆయనను అనుకరించడాన్ని నేర్చుకునేందుకు ప్రజలకు సహాయం చేయాలనే మన కృషిని తీవ్రతరం చేయడానికి మన భక్తి మనల్ని పురికొల్పవద్దా?​—⁠ఎఫెసీయులు 5:⁠1.

10 మనం దేవుని రాజ్యమును మొదట వెదికినట్లయితే మన జీవితం దైవభక్తికి సంబంధించిన కార్యాలతో నిండివుంటుంది. (మత్తయి 6:​33) దీనిలో, వస్తుసంపదల గురించి సమతుల్య దృక్కోణం కలిగివుండడం కూడా ఒక భాగమే. యేసు ఇలా హెచ్చరించాడు: “మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కా[దు].” (లూకా 12:​15) మనం ధనాపేక్షతో గ్రుడ్డివారమై పోతామని ఊహించడం కష్టమే అయినప్పటికీ, “ఐహికవిచారమును ధనమోసమును” దేవుని “వాక్యమును అణచివేయ” గలవని గమనించడం మంచిది. (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 13:​22) జీవనోపాధి సంపాదించుకోవడం అంత సులభంగా ఉండకపోవచ్చు. లోకంలోని కొన్ని ప్రాంతాల్లో చాలామంది, కాస్త మంచి జీవితం గడపడానికి బహుశా తమ కుటుంబాన్ని సంవత్సరాలపాటు విడిచివుండాల్సి వచ్చినా, తాము మరింత సంపన్న దేశానికి వలస వెళ్ళకతప్పదని తర్కిస్తారు. దేవుని ప్రజల్లో కొంతమంది కూడా ఇలాగే తర్కించారు. వేరే దేశానికి వెళ్ళడం ద్వారా వారు తమ కుటుంబానికి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తుండవచ్చు. అయితే, ఇంటివద్ద తమ ప్రియమైన వారి ఆధ్యాత్మిక స్థితికి ఏమవుతుండవచ్చు? ఇంట్లో సరైన శిరసత్వం నిర్వహించబడకపోతే, యెహోవా దినాన్ని తప్పించుకుని జీవించడానికి అవసరమైన ఆధ్యాత్మికత వారికి ఉంటుందా?

11 ఫిలిప్పీన్స్‌ నుండి వలస వచ్చిన ఒక ఉద్యోగి జపానులో యెహోవాసాక్షుల నుండి బైబిలు సత్యం తెలుసుకున్నాడు. శిరసత్వపు లేఖనాధార బాధ్యతలను తెలుసుకున్న తర్వాత ఆయన తన కుటుంబం కూడా యెహోవా ఆరాధకులయ్యేందుకు వారికి సహాయం చేయవలసిన అవసరం ఉందని గ్రహించాడు. (1 కొరింథీయులు 11:⁠3) ఫిలిప్పీన్స్‌లో ఉన్న ఆయన భార్య ఆయన క్రొత్తగా తెలుసుకున్న విశ్వాసాన్ని బలంగా వ్యతిరేకించి, ఆయన తిరిగి వచ్చి తన కుటుంబానికి బైబిలు ఆధారిత నమ్మకాలను బోధించే బదులు అక్కడే ఉండి డబ్బు పంపుతూ ఉండాలని కోరుకుంది. అయితే కాలాల అత్యవసరతను బట్టి, తన ప్రియమైన వారిపట్ల తనకున్న శ్రద్ధను బట్టి ఆయన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆయన సహనానికి, కుటుంబ సభ్యులతో ఆయన ప్రేమపూర్వకంగా వ్యవహరించిన విధానానికి ప్రతిఫలం లభించింది. కొంతకాలానికి ఆయన కుటుంబం సత్యారాధనలో ఐక్యమైంది, ఆయన భార్య పూర్తికాల సేవలో ప్రవేశించింది.

12 మన పరిస్థితిని, కాలిపోతున్న భవనంలోని వ్యక్తుల పరిస్థితితో పోల్చవచ్చు. మంటల్లో చిక్కుకుని కూలిపోబోతున్న భవనంలో నుండి వస్తువులను వెలికి తీయడానికి పిచ్చిగా దాని చుట్టూ పరుగెత్తడం జ్ఞానయుక్తంగా ఉంటుందా? దానికి బదులు, మన సొంత ప్రాణాలను, మన కుటుంబ సభ్యుల ప్రాణాలను, ఆ భవనంలోని ఇతరుల ప్రాణాలను కాపాడడం మరెంతో ప్రాముఖ్యం కాదా? ఈ దుష్ట విధానం పతనానికి పరుగెత్తుతోంది, ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. దీన్ని గ్రహించి మనం ఆధ్యాత్మిక ఆసక్తులకు తప్పక మొదటి స్థానమిచ్చి, ప్రాణాల్ని రక్షించే రాజ్య ప్రకటనా పనిలో ఆసక్తిగా పాల్గొనాలి.​—⁠1 తిమోతి 4:​16.

మనం “నిందారహితులుగా” ఉండాలి

13 కనిపెట్టుకొని ఉండే స్వభావాన్ని కాపాడుకొనే ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ పేతురు ఇలా అంటున్నాడు: “ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన [దేవుని] దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి.” (2 పేతురు 3:​14) పేతురు పరిశుద్ధ ప్రవర్తన, భక్తి కలిగివుండమని చెప్పడమే గాక, చివరికి మనం యేసు అమూల్య రక్తంతో కడుగబడిన వారిగా యెహోవాకు కనిపించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. (ప్రకటన 7:​9, 14) దీని కోసం ఒక వ్యక్తి యేసు బలియందు విశ్వాసం ఉంచి, సమర్పించుకుని యెహోవా సేవకుడిగా బాప్తిస్మం తీసుకోవాలి.

14 మనం “నిందారహితులుగా” కనుగొనబడడానికి మనకు సాధ్యమైనదంతా చేయమని పేతురు ఉద్బోధిస్తున్నాడు. మనం మన క్రైస్తవ ప్రవర్తన, వ్యక్తిత్వం అనే వస్త్రాలను ఈ లోకంచే మలినం కాకుండా నిందారహితంగా ఉంచుకుంటున్నామా? మనం మన వస్త్రాలపై ఏదైనా మచ్చను చూస్తే దాన్ని వెంటనే తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇక ఆ మచ్చ ఒకవేళ మనకిష్టమైన వస్త్రాలపై పడిందంటే దాన్ని శుభ్రపర్చడానికి మరీ శ్రద్ధగా ప్రయత్నిస్తాము. సూచనార్థకంగా చెప్పాలంటే, మన వ్యక్తిత్వంలో లేదా ప్రవర్తనలో ఏదైనా లోపం ఉన్నందుకు మన క్రైస్తవ వస్త్రాలనేవాటిపై మచ్చపడితే మనమదే విధంగా భావిస్తామా?

15 ఇశ్రాయేలీయులు “తమ బట్టల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చులమీద నీలిసూత్రము తగిలింపవలెను.” ఎందుకు? ఎందుకంటే వారు యెహోవా ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకుని, వాటికి విధేయులై, తమ దేవునికి “ప్రతిష్ఠితులై” ఉండాలి. (సంఖ్యాకాండము 15:​38-40) యెహోవా ప్రస్తుతదిన సేవకులముగా మనం దైవిక కట్టడలను, సూత్రాలను అనుసరిస్తాము కాబట్టి మనం ఈ లోకం నుండి భిన్నంగా ఉంటాము. ఉదాహరణకు, మనం నైతిక పరిశుభ్రతను కాపాడుకుంటాము, రక్త పవిత్రతను గౌరవిస్తాము, అన్ని రకాల విగ్రహారాధనకు దూరముగా ఉంటాము. (అపొస్తలుల కార్యములు 15:​28, 29) మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని మనం చేసుకున్న దృఢనిశ్చయతను బట్టి అనేకులు మనల్ని గౌరవిస్తారు.​—⁠యాకోబు 1:​27.

మనం “నిష్కళంకులుగా” ఉండాలి

16 మనం “నిష్కళంకులుగా” ఉండాలని కూడా పేతురు చెబుతున్నాడు. అదెలా సాధ్యం? ఒక మచ్చను తుడిచివేయవచ్చు లేదా కడిగివేయవచ్చు గానీ కళంకాన్ని అలా తొలగించలేము. కళంకం, లోపల ఏదో చెడు లేదా లోపం ఉందని సూచిస్తుంది. ఫిలిప్పీలోని తోటి క్రైస్తవులను అపొస్తలుడైన పౌలు ఇలా ఉద్బోధించాడు: “మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు . . . లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు.” (ఫిలిప్పీయులు 2:​14, 15) మనమా ఉపదేశాన్ని అనుసరిస్తే సణుగులు, సంశయాలు మానుకుని స్వచ్ఛమైన ఉద్దేశంతో దేవుని సేవ చేస్తాము. మనం “ఈ రాజ్య సువార్త” ప్రకటిస్తుండగా యెహోవాపట్ల, మన పొరుగువారి పట్ల ప్రేమతో పురికొల్పబడతాము. (మత్తయి 22:35-40; 24:​14) అంతేగాక, దేవుని గురించి ఆయన వాక్యమైన బైబిలు గురించి తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేసేందుకు మనం మన సమయాన్ని స్వచ్ఛందంగా ఎందుకు వెచ్చిస్తామో సాధారణ ప్రజలు గ్రహించలేకపోయినప్పటికీ మనం సువార్త ప్రకటించడంలో కొనసాగుతాము.

17 “నిష్కళంకులుగా” ఉండాలని కోరుకుంటున్నాము కాబట్టి, మనం మన ఉద్దేశాలను, ప్రయాసలను పరిశీలించుకోవడం మంచిది. ధనం, అధికారం సంపాదించుకోవడానికి కృషి చేయడం వంటి స్వార్థపూరిత కారణాలను బట్టి పనులు చేయడమనే ఈ లోక విధానాన్ని మానుకున్నాము. మనం క్రైస్తవ సంఘంలో ఆధిక్యతల కోసం ముందుకు వస్తుంటే, మన ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉండాలి, ఎల్లప్పుడూ యెహోవాపట్ల మరియు ఇతరులపట్ల ప్రేమచే పురికొల్పబడినవై ఉండాలి. ఆనందంతోనూ యెహోవాకు తమ తోటి విశ్వాసులకు సేవ చేయాలనే వినయపూర్వకమైన కోరికతోనూ ‘అధ్యక్ష్యపదవిని ఆశిస్తున్న’ ఆధ్యాత్మిక పురుషులను చూడడం ఎంతో నూతనోత్తేజాన్నిస్తుంది. (1 తిమోతి 3:1; 2 కొరింథీయులు 1:​24) వాస్తవానికి, పెద్దలుగా సేవచేయడానికి అర్హులైనవారు ‘ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను, దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాస్తారు. తమకు అప్పగింపబడినవారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉంటారు.’​—⁠1 పేతురు 5:​1-4.

మనం “శాంతముగల” వారమై ఉండాలి

18 చివరగా, మనం “శాంతముగల” వారమై ఉండాలని పేతురు మనకు చెబుతున్నాడు. దీనికి అనుగుణంగా జీవించాలంటే మనం యెహోవాతోను పొరుగువారితోను సమాధానం కలిగివుండాలి. ‘ఒకరియెడల ఒకరు మిక్కటమైన ప్రేమగలవారై ఉండడం,’ తోటి క్రైస్తవులతో సమాధానాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను పేతురు నొక్కిచెబుతున్నాడు. (1 పేతురు 2:17; 3:10, 11; 4:8; 2 పేతురు 1:​5-7) మన సమాధానాన్ని కాపాడుకోవడానికి, మనం ఒకరి ఎడల ఒకరం ప్రేమకలిగి ఉండాలి. (యోహాను 13:34, 35; ఎఫెసీయులు 4:​1, 2) అంతర్జాతీయ సమావేశాలు జరిగినప్పుడు మన ప్రేమ, సమాధానం ప్రాముఖ్యంగా స్పష్టమవుతాయి. కోస్టరికాలో 1999లో జరిగిన ఒక సమావేశంలో, విమానాశ్రయం వద్ద ఉన్న ఒక అమ్మకం దారుడు, స్థానిక సాక్షులు ఇతర దేశాల నుండి వస్తున్న ప్రతినిధులను ఆహ్వానిస్తూ తను అమ్మకం చేసుకోకుండా తనకు అడ్డు నిలబడుతున్నారని చికాకుపడ్డాడు. అయితే రెండవ రోజున, ప్రతినిధులు స్థానిక సాక్షులకు వ్యక్తిగతంగా తెలియక పోయినా వారు అందుకుంటున్న ఉత్సాహపూరితమైన ఆహ్వానంలో ప్రదర్శితమవుతున్న ప్రేమ సమాధానములను అతడు గమనించాడు. చివరి రోజున ఆ అమ్మకం దారుడు తాను కూడా ఆహ్వానించడంలో వారితో కలిసి, బైబిలు అధ్యయనం కావాలని కోరాడు.

19 మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలతో సమాధానం కలిగివుండడానికి మనం యథార్థంగా చేసే కృషి, యెహోవా దినం కోసం, ఆయన వాగ్దానం చేసిన నూతనలోకం కోసం మనమెంతగా నిండుహృదయంతో ఎదురుచూస్తున్నాం అనేదానిపై తప్పక ప్రభావాన్ని చూపిస్తుంది. (కీర్తన 37:11; 2 పేతురు 3:​13) తోటి విశ్వాసితో సమాధానం కలిగివుండడం మనకు కష్టమవుతోందనుకోండి, పరదైసులో ఆయనతో సమాధానంగా కలిసి ఉండడాన్ని మనం ఊహించుకోగలమా? ఒక సహోదరునికి మనపై విరోధమేదైనా ఉంటే, మనం వెంటనే ‘ఆయనతో సమాధానపడాలి.’ (మత్తయి 5:​23, 24) మనం యెహోవాతో సమాధానం కలిగివుండాలంటే అలా చేయడం ఆవశ్యకం.​—⁠కీర్తన 35:27; 1 యోహాను 4:​20.

20 మనం వ్యక్తిగతంగా ‘దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఎల్లప్పుడు మనస్సులో ఉంచుకుంటున్నామా’? మనం ఈ అనైతిక లోకంలో పరిశుద్ధంగా మిగిలి ఉండడం, దుష్టత్వపు అంతాన్ని చూడాలని మనం ఆశతో అపేక్షిస్తున్నామని చూపిస్తుంది. అంతేగాక, యెహోవా దినపు రాకడ కోసం, రాజ్య పరిపాలన క్రింద జీవితం కోసం మనం ఆశతో అపేక్షిస్తున్నామన్నది దైవభక్తితో కూడిన మన క్రియల ద్వారా స్పష్టమవుతుంది. సమాధానకరమైన నూతనలోకంలో జీవించాలన్న మన నిరీక్షణ, ఇప్పుడు మన తోటి ఆరాధకులతో సమాధానం కలిగివుండడానికి మనం చేసే కృషిలో ప్రతిబింబిస్తుంది. అలాంటి మార్గాల ద్వారా మనం, మనకు ‘కనిపెట్టుకొని’ ఉండే స్వభావం ఉందని, ‘దేవుని దినపు రాకడను ఎల్లప్పుడు మనస్సులో ఉంచుకుంటున్నామని’ చూపిస్తాము.

[అధస్సూచీలు]

^ పేరా 11 ఉదాహరణల కోసం కావలికోట జనవరి 1, 2000, 16వ పేజీ, యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం 1997 (ఆంగ్లం), 51వ పేజీ చూడండి.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• ‘దేవుని దినపు రాకడను ఎల్లప్పుడు మనస్సులో ఉంచుకోవడం’ అంటే దాని భావమేమిటి?

• మన ప్రవర్తన సంబంధంగా ‘కనిపెట్టుకొని’ ఉండే స్వభావం ఎలా ప్రదర్శితమవుతుంది?

• “భక్తి”కి సంబంధించిన కార్యాలు ఎందుకు ఆవశ్యకం?

• యెహోవా దృష్టికి ‘శాంతముగలవారమై, నిష్కళంకులుగాను నిందారహితులుగాను’ ఉండాలంటే మనమేమి చేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. యెహోవా దినం కోసం ‘కనిపెట్టుకొని’ ఉండే స్వభావం కలిగివుండడాన్ని గురించి మనమెలా సోదాహరణంగా చెప్పవచ్చు?

3. రెండవ పేతురు 3:11, 12 వచనాల ప్రకారం, క్రైస్తవులు ఎలాంటి స్వభావాన్ని కలిగివుండాలి?

4. ‘దేవుని దినపు రాకడను ఎల్లప్పుడు మనస్సులో ఉంచుకోవడంలో’ ఏమి ఇమిడి ఉంది?

5. ‘దేవుని దినాన్ని’ చూడడానికి మనం ‘ఆశతో అపేక్షిస్తున్నాము’ అని మనమెలా చూపించవచ్చు?

6. పరిశుద్ధంగా ఉండడానికి మనమేమి చేయాలి?

7, 8. (ఎ) “పరిశుద్ధ ప్రవర్తన” కలిగివుండడం యొక్క ప్రాముఖ్యతను మనమెలా అలక్ష్యం చేసే అవకాశం ఉంది? (బి) సరిదిద్దుకోవలసిన ఏ చర్యలు అవసరం కావచ్చు?

9. ఏమి చేయడానికి భక్తి మనల్ని పురికొల్పుతుంది?

10. “ధనమోసము” విషయమై మనమెందుకు జాగ్రత్త వహించాలి?

11. ధనసంపదల కంటే దైవభక్తికి సంబంధించిన కార్యాలు మరింత ప్రాముఖ్యమైనవని వలస వెళ్ళిన ఒక ఉద్యోగి ఎలా చూపించాడు?

12. జీవితంలో మనం ఆధ్యాత్మిక ఆసక్తులకు ఎందుకు మొదటి స్థానమివ్వాలి?

13. యెహోవా దినం వచ్చినప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉండాలని కోరుకోవాలి?

14. “నిందారహితులుగా” ఉండడమంటే ఏమిటి?

15. (ఎ) ఇశ్రాయేలీయులు తమ బట్టల అంచులకు కుచ్చులు ఎందుకు చేసుకోవాలి? (బి) ప్రస్తుత దిన యెహోవా సేవకులు ఎందుకు భిన్నంగా ఉంటారు?

16. మనల్ని మనం “నిష్కళంకులుగా” ఉంచుకోవడంలో ఏమి ఇమిడి ఉంది?

17. క్రైస్తవ సంఘంలో మనం ఆధిక్యతల కోసం ముందుకు వస్తున్నప్పుడు మన ఉద్దేశం ఏమై ఉండాలి?

18. యెహోవాసాక్షులు ఏ లక్షణాలకు పేరుపొందారు?

19. తోటి విశ్వాసులతో సమాధానం కలిగివుండడానికి కృషి చేయడం ఎందుకు ఆవశ్యకం?

20. ‘కనిపెట్టుకొని’ ఉండే స్వభావం ఏ యే విధాలుగా ప్రదర్శితమవ్వాలి?

[11వ పేజీలోని చిత్రం]

పరిశుద్ధ ప్రవర్తన ‘కనిపెట్టుకొని’ ఉండే స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది

[12వ పేజీలోని చిత్రం]

రాజ్య ప్రకటనా పని జీవాన్ని రక్షిస్తుంది

[14వ పేజీలోని చిత్రం]

మనం యెహోవా దినం కోసం ఎదురుచూస్తుండగా, ఇతరులతో సమాధానం కలిగి ఉండడానికి కృషి చేద్దాము