కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యుసేబియస్‌ “చర్చి చరిత్రకు పితామహుడా”?

యుసేబియస్‌ “చర్చి చరిత్రకు పితామహుడా”?

యుసేబియస్‌ “చర్చి చరిత్రకు పితామహుడా”?

రోమా చక్రవర్తియైన కాన్‌స్టంటైన్‌ సా.శ. 325లో బిషప్పులందరినీ నైసియాలో సమావేశపరిచాడు. ఆయన ఉద్దేశం: దేవునికి ఆయన కుమారునితో ఉన్న సంబంధం అనే వివాదాంశాన్ని పరిష్కరించడం. అక్కడ హాజరైనవారిలో కైసరయకు చెందిన యుసేబియస్‌ కూడా ఉన్నాడు, ఆయన తన కాలంలో మహా పండితుడిగా పరిగణింపబడేవాడు. యుసేబియస్‌ లేఖనాలను ఎంతో శ్రద్ధగా అధ్యయనం చేశాడు, ఆయన దేవుడొక్కడే అనే క్రైస్తవ సిద్ధాంత సమర్థకుడు.

నైసియాలోని సమాలోచన సభ వద్ద, “కాన్‌స్టంటైన్‌ తానుగా అధ్యక్షత వహించి చర్చలను నడిపించుటయందు చురుకుగా పాల్గొనెను. అలాగే, ‘తండ్రి క్రీస్తు ఒకే పదార్థమైన వారని’ సభ అందించిన మత సిద్ధాంతము నందు క్రీస్తుకు దేవునితో గల సంబంధమును వ్యక్తపరచు నిర్ణయాత్మక సూత్రమును ఈయనే ప్రతిపాదించెను . . . చక్రవర్తికి మిక్కిలి భయపడిన బిషప్పులు కేవలము ఇద్దరు మినహాయింపుతో ఆ మత సిద్ధాంతము మీద సంతకములు చేసిరి, అనేకులు తమ అభీష్టమునకు వ్యతిరేకముగానే అలా చేసిరి” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. ఆ మినహాయింపబడినవారిలో యుసేబియస్‌ కూడా ఉన్నాడా? ఆయన వహించిన స్థానం నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు? మనం యుసేబియస్‌ గత చరిత్రను అంటే ఆయనకున్న అర్హతలను, ఆయన సాధించిన సాఫల్యాలను పరిశీలిద్దాం.

గమనార్హమైన ఆయన రచనలు

యుసేబియస్‌ పాలస్తీనాలో దాదాపు సా.శ. 260లో జన్మించివుండవచ్చు. తొలి వయసులోనే ఆయన కైసరయలోని చర్చి అధ్యక్షుడైన పాంఫిలస్‌తో సహవసించాడు. యుసేబియస్‌ పాంఫిలస్‌ ఆధ్యాత్మిక పాఠశాలలో చేరి పట్టుదలగల విద్యార్థి అయ్యాడు. పాంఫిలస్‌కున్న అద్భుతమైన గ్రంథాలయాన్ని ఆయన బాగా ఉపయోగించుకున్నాడు. యుసేబియస్‌ అధ్యయనాలకు, ప్రాముఖ్యంగా బైబిలు అధ్యయనానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. ఆయన పాంఫిలస్‌కు విశ్వాసపాత్రుడైన స్నేహితుడయ్యాడు, ఆ తర్వాత ఆయన తన గురించి తాను “పాంఫిలస్‌ పుత్రుడైన యుసేబియస్‌” అని చెప్పుకున్నాడు.

యుసేబియస్‌ తన అభిలాషల గురించి ఇలా చెప్పాడు: “పరిశుద్ధ అపొస్తలుల వారసత్వాల గురించి అలాగే మన రక్షకుని కాలంనాటి నుండి నేటి వరకు గతించిన సమయాల గురించి ఒక వృత్తాంతం వ్రాయాలన్నదీ, చర్చి చరిత్రలో అనేక, ప్రాముఖ్యమైన సంఘటనలు ఎలా సంభవించాయో చెప్పాలన్నదీ, అత్యంత ప్రాముఖ్యమైన పారిష్‌లలో చర్చిని పరిపాలించి దానికి అధ్యక్షత వహించినవారి గురించి, ప్రతి తరంలోనూ దైవ వాక్యాన్ని మౌఖికంగానే గానీ వ్రాతపూర్వకంగానే గానీ ప్రకటించినవారి గురించి ప్రస్తావించాలన్నదీ నా సంకల్పం.”

యుసేబియస్‌ తాను వ్రాసిన క్రైస్తవ చర్చి చరిత్ర (ఆంగ్లం) అనే గ్రంథాన్ని బట్టి గుర్తుచేసుకోబడతాడు, ఆ గ్రంథం ఎంతో గౌరవప్రదమైనదిగా పరిగణింపబడుతుంది. దాదాపు సా.శ. 324లో ప్రచురించబడిన ఆయన పది సంపుటలు ప్రాచీన కాలాల్లో వ్రాయబడిన అత్యంత ప్రాముఖ్యమైన చర్చి చరిత్రగా పరిగణింపబడుతున్నాయి. దీన్ని సాధించినందుకు యుసేబియస్‌ చర్చి చరిత్ర పితామహునిగా పేరుపొందాడు.

యుసేబియస్‌ చర్చి చరిత్ర అనే గ్రంథాన్నే కాక క్రానికల్‌ అనే గ్రంథాన్ని కూడా రెండు సంపుటలుగా వ్రాశాడు. మొదటి సంపుటి ప్రపంచ చరిత్ర యొక్క సంగ్రహం. నాలుగవ శతాబ్దంలో, అది ప్రపంచ కాలానుక్రమ పట్టికను చూడడానికి ప్రామాణిక గ్రంథంగా తయారయ్యింది. రెండవ సంపుటి చారిత్రక సంఘటనల తేదీలను ఉదహరించింది. యుసేబియస్‌ సమాంతర కాలమ్‌లను ఉపయోగిస్తూ వివిధ దేశాల్లో పరిపాలన చేసిన రాజుల అనుక్రమాన్ని చూపించాడు.

యుసేబియస్‌ పాలస్తీనా హతసాక్షులు (ఆంగ్లం) మరియు కాన్‌స్టంటైన్‌ జీవితం (ఆంగ్లం) అనే రెండు చారిత్రక గ్రంథాలను కూడా వ్రాశాడు. ఈ మొదటి గ్రంథం సా.శ. 303-10 సంవత్సరాల్లోని విషయాలను తెలియజేస్తూ ఆ కాలంలోని హతసాక్షుల గురించి చర్చిస్తుంది. యుసేబియస్‌ ఈ సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి అయ్యుండవచ్చు. తర్వాతి గ్రంథం, సా.శ. 337లో కాన్‌స్టంటైన్‌ చక్రవర్తి మరణం తర్వాత నాలుగు పుస్తకాలుగా ప్రచురించబడింది, దానిలో విలువైన చారిత్రక వివరణలున్నాయి. అది స్పష్టమైన చరిత్రలా వ్రాయబడే బదులు చాలామేరకు ఆ చక్రవర్తిని ప్రస్తుతిస్తూ వ్రాయబడింది.

యుసేబియస్‌ వ్రాసిన సమర్థనాత్మక గ్రంథాల్లో సమకాలీన రోమా గవర్నర్‌ అయిన హిరాక్లస్‌కు ఇస్తున్న సమాధానం కూడా ఉంది. హిరాక్లస్‌ క్రైస్తవులకు వ్యతిరేకంగా వ్రాసినప్పుడు, యుసేబియస్‌ వారిని సమర్థిస్తూ ప్రతిస్పందించాడు. అంతేగాక, లేఖనాలు దైవ రచితమైనవని సమర్థిస్తూ ఆయన 35 పుస్తకాలు వ్రాశాడు, ఇవి ఈ విధమైన పుస్తకాల్లో అత్యంత ప్రాముఖ్యమైనవిగా, ఎంతో విస్తృతమైనవిగా పరిగణింపబడుతున్నాయి. వీటిలోని మొదటి 15 పుస్తకాలు, హెబ్రీయుల పరిశుద్ధ లేఖనాలను క్రైస్తవులు అంగీకరించడాన్ని సమర్థించడానికి ప్రయత్నిస్తాయి. మిగతా 20 పుస్తకాలు, క్రైస్తవులు యూదా సంబంధిత ధర్మసూత్రాలను అధిగమించి క్రొత్త సూత్రాలను ఆచారాలను స్వీకరించడం సరైనదేననడానికి నిదర్శనాలను ఇస్తాయి. ఈ పుస్తకాలన్నీ కలిసి యుసేబియస్‌కు అర్థమైన క్రైస్తవత్వాన్ని సంగ్రహంగా సమర్థిస్తాయి.

యుసేబియస్‌ దాదాపు 80 సంవత్సరాలు (ఇంచుమించు సా.శ. 260 నుండి ఇంచుమించు 340 వరకు) జీవించాడు, ప్రాచీన కాలాలకు చెందిన అత్యంత ఫలవంతమైన రచయితల్లో ఒకడయ్యాడు. ఆయన రచనల్లో మొదటి మూడు శతాబ్దాల నుండి కాన్‌స్టంటైన్‌ చక్రవర్తి కాలం వరకు జరిగిన సంఘటనల గురించి ఉంటుంది. ఆయన తన జీవితంలోని మలి దశలో, ఆయన ఒక రచయితగానే గాక కైసరయలో బిషప్పుగా కూడా పనిచేశాడు. యుసేబియస్‌ చరిత్రకారుడిగా ఎంతో ప్రసిద్ధి చెందినప్పటికీ ఆయన క్రైస్తవమత సిద్ధాంత సమర్థకుడిగా, భౌగోళిక పటములను రూపొందించినవాడిగా, ప్రచారకుడిగా, ఆధ్యాత్మిక విమర్శకుడిగా, మతసంబంధ రచయితగా కూడా పేరు పొందాడు.

ఆయన రెండు ఉద్దేశాల సంకల్పం

యుసేబియస్‌ అంత అసాధారణమైన భారీ పథకాలను ఎందుకు చేపట్టాడు? ఒక క్రొత్త యుగంలోకి మారుతున్న కాలంలో తాను జీవిస్తున్నానని ఆయనకున్న నమ్మకంలో ఆ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. గతించిన తరాల్లో గొప్ప సంఘటనలు జరిగాయనీ, రాబోయే తరాలవారికోసం లిఖిత వృత్తాంతం ఉండడం అవసరమనీ ఆయన భావించాడు.

క్రైస్తవమత సిద్ధాంత సమర్థకుడిగా యుసేబియస్‌కు అదనపు సంకల్పం కూడా ఉంది. క్రైస్తవత్వం దైవిక మూలం నుండి వచ్చిందని ఆయన విశ్వసించాడు. కానీ కొంతమంది ఈ తలంపుకు విరుద్ధంగా పోరాడారు. యుసేబియస్‌ ఇలా వ్రాశాడు: “క్రొత్త విషయాలను ప్రవేశపెట్టాలనే కోరికతో పెద్ద పెద్ద పొరపాట్లు చేసిన వారి పేర్లను, ఎంతమంది అలా చేశారనేదీ ఎంత తరచుగా అలా చేశారనేదీ తెలియజేయాలన్నది కూడా నా సంకల్పం. వారు తాము జ్ఞానాన్ని కనుగొనేవారమని చెప్పుకుంటూ, అదీ అబద్ధంగా అలా చెప్పుకుంటూ క్రూరమైన తోడేళ్ళలా క్రీస్తు మందను నాశనం చేశారు.”

యుసేబియస్‌ తనను తాను క్రైస్తవునిగా పరిగణించుకున్నాడా? అలాగే పరిగణించుకున్నాడని స్పష్టమవుతోంది, ఎందుకంటే క్రీస్తును ఆయన “మన రక్షకుడు” అన్నాడు. ఆయనిలా అన్నాడు: “మన రక్షకుడిపై కుట్ర పన్నినందుకు పర్యవసానంగా వెంటనే యూదా జనాంగమంతటిపైకి వచ్చిన దురవస్థలను వివరించాలన్నదీ, అన్యులు దైవిక వాక్యంపై దాడి చేసిన విధానాల గురించి, సమయాల గురించి వ్రాయాలన్నదీ, రక్తం చిందించవలసి వచ్చినప్పటికీ హింసించబడినప్పటికీ దాని కోసం వివిధ సమయాల్లో పోరాడినవారి గుణలక్షణాలను, మన కాలాల్లో చేయబడిన బహిరంగ ఒప్పుకోలును, వారందరికీ మన రక్షకుడు దయాకనికరాలతో ఇచ్చిన సహాయమును వర్ణించాలన్నదీ . . . నా సంకల్పం.”

ఆయన విస్తృత పరిశోధన

యుసేబియస్‌ వ్యక్తిగతంగా చదివిన, ఉదహరించిన పుస్తకాలు అనేకం. సామాన్య శకంలోని మొదటి మూడు శతాబ్దాలకు చెందిన అనేకమంది ప్రముఖ వ్యక్తులు యుసేబియస్‌ రచనల ద్వారానే వెల్లడి చేయబడ్డారు. ప్రాముఖ్యమైన కార్యకలాపాలపై వెలుగును ప్రసరించే ఉపయోగకరమైన వృత్తాంతాలు ఆయన రచనల్లో మాత్రమే కనిపిస్తాయి. అవి ఇప్పుడిక అందుబాటులో లేని జ్ఞానమూలాల నుండి వచ్చాయి.

యుసేబియస్‌ ఎంతో కష్టపడి, ఎంతో సమగ్రంగా సమాచారాన్ని సేకరించేవాడు. నమ్మదగిన నివేదికలకు నమ్మలేని నివేదికలకు మధ్యనున్న తేడాను గుర్తించడానికి ఆయన ఎంతో జాగ్రత్తగా కృషి చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన రచనలు లోపరహితం కాదు. కొన్నిసార్లు తప్పు వివరణలిచ్చాడు, మనుష్యులను వారి క్రియలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో సహితం విఫలమయ్యాడు. కొన్నిసార్లు ఆయన ఖచ్చితమైన కాలక్రమ పట్టికలను ఇవ్వలేకపోయాడు. యుసేబియస్‌ తాను అందజేస్తున్న సమాచారాన్ని నైపుణ్యంగా అందజేయడంలో కూడా విఫలమయ్యాడు. అయితే సుస్పష్టమైన ఎన్ని లోపాలున్నప్పటికీ ఆయన వ్రాసిన అనేక గ్రంథాలు అమూల్యమైన సంపదగా పరిగణింపబడుతున్నాయి.

సత్య ప్రేమికుడా?

తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధమేమిటనే అపరిష్కృత వివాదాంశం గురించి యుసేబియస్‌ శ్రద్ధ కలిగివుండేవాడు. యుసేబియస్‌ విశ్వసించినట్లు, తండ్రి కుమారునికంటే ముందు నుండే ఉనికిలో ఉన్నాడా? లేక తండ్రి కుమారుడు ఒకే సమయం నుండి ఉనికిలో ఉన్నారా? “వారు ఒకే సమయం నుండి ఉనికిలో ఉంటే, తండ్రి ఎలా తండ్రవుతాడు, కుమారుడెలా కుమారుడవుతాడు” అని ఆయన ప్రశ్నించాడు. ‘తండ్రి యేసుకంటె గొప్పవాడు’ అని చెప్తున్న యోహాను 14:28ని, యేసు ‘పంపబడినవాడిగా’ పేర్కొనబడిన యోహాను 17:3ను ఉదహరిస్తూ ఆయన తన నమ్మకాలను లేఖనాధారాలతో కూడా సమర్థించాడు. యుసేబియస్‌ కొలొస్సయులు 1:⁠15 మరియు యోహాను 1:1 వచనాలు పరోక్షంగా సూచిస్తూ లోగోస్‌ లేదా వాక్యము “అదృశ్యదేవుని స్వరూపి” అని, అంటే దేవుని కుమారుడని కూడా వాదించాడు.

అయితే ఆశ్చర్యకరంగా, యుసేబియస్‌ నైసియా సమాలోచన సభ ముగింపులో వ్యతిరేక తలంపులకు మద్దతునిచ్చాడు. దేవుడు, క్రీస్తు ఒకే సమయంలో ఉనికిలో ఉన్నవారు కాదనే తన లేఖనాధారిత అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆయన చక్రవర్తితో ఏకీభవించాడు.

నేర్చుకోవలసిన పాఠం

నైసియా సమాలోచన సభలో యుసేబియస్‌ ఎందుకు ఒత్తిడికి లొంగిపోయి, లేఖనవిరుద్ధమైన సిద్ధాంతానికి మద్దతునిచ్చాడు? ఆయన మనస్సులో రాజకీయ ఉద్దేశాలున్నాయా? ఆయన సమాలోచన సభకు ఎందుకు హాజరయ్యాడు? బిషప్పులందరూ పిలువబడినప్పటికీ కేవలం కొద్దిమంది మాత్రమే అంటే 300 మందే హాజరయ్యారు. సమాజంలో తన స్థానాన్ని కాపాడుకోవడం గురించి యుసేబియస్‌ వ్యాకులపడ్డాడా? కాన్‌స్టంటైన్‌ చక్రవర్తి ఆయననెందుకు ఉన్నతంగా పరిగణించాడు? సమాలోచన సభలో యుసేబియస్‌ చక్రవర్తి కుడి ప్రక్కన కూర్చున్నాడు.

తన అనుచరులు “లోకసంబంధులు” కాకుండా ఉండాలని యేసు కోరినదాన్ని యుసేబియస్‌ అలక్ష్యం చేశాడని స్పష్టమవుతోంది. (యోహాను 17:16; 18:​36) “వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా?” అని శిష్యుడైన యాకోబు ప్రశ్నించాడు. (యాకోబు 4:⁠4) “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి” అని పౌలు ఇచ్చిన ఆజ్ఞ ఎంత సముచితమైనదో కదా! (2 కొరింథీయులు 6:​14) మనం ‘తండ్రిని ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తూ’ లోకసంబంధులం కాకుండా ఉందాము.​—⁠యోహాను 4:​24.

[31వ పేజీలోని చిత్రం]

నైసియా సమాలోచన సభను చూపిస్తున్న వర్ణచిత్రం

[చిత్రసౌజన్యం]

Scala/Art Resource, NY

[29వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy of Special Collections Library, University of Michigan